తహశీల్దార్లే ఆధార్‌ం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అక్టోబర్ రేషన్ సరఫరాపై అటు లబ్ధిదారులు.. ఇటు అధికారులు గందరగోళానికి గురవుతున్నారు. రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానాన్ని ఈ నెల నుంచి కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడమే దీనికి కారణం.జిల్లాలో సుమారు 95 శాతం ఆధార్ సీడింగ్ పూర్తయిందని అధికారులు చెబుతున్నా రేషన్ కార్డులతో అనుసంధానం విషయంలో మాత్రం స్పష్టత కొరవడింది. దీంతో ఈ నెలా రేషన్ ఎలా సరఫరా చేయాలా అని జిల్లా పౌరసరఫరాల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలో బోగస్ కార్డుల ఏరివేత ప్రక్రియ జరుగుతోంది. ఆధార్ కార్డుల్లో పేర్లు లేనివారికి రేషన్ ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో అధికారులు కొన్నాళ్లుగా ఆధార్ అనుసంధాన ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వాస్తవానికి గత నెలలోనే ఆధార్ అనుసంధానం చేసుకోని లబ్ధిదారులకు మొదట రేషన్ కట్ చేసినా.. గత నెల 18న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటు కావడంతో ఆఘమేఘాల మీద పూర్తి స్థాయిలో రేషన్ సరఫరా చేశారు.
సీఎం పర్యటనలో నిరసనలు ఎదురవకుండా ఉండేందుకు ఆ నెలకు మాత్రమే సడలింపునిచ్చారని అప్పట్లో అధికారవర్గాలే పేర్కొన్నాయి. తాజాగా అక్టోబర్ కోటాకు సంబంధించి బియ్యం విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. కారణం అడిగితే ఈనెల 2 నుంచి 20వ తేదీ వరకు అన్ని చోట్లా జన్మభూమి కార్యక్రమం ఉండడమేనంటున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం వరకు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడం.. ఆ తర్వాత సాయంత్రం జిల్లా క లెక్టర్ నేతృత్వంలో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరవడంతోనే సరిపోతోందని అధికారులు వాపోతున్నారు. ఇప్పటికే వివిధ సమీక్షల పేరిట అధికారులు, నేతలు ముప్పతిప్పలు పెడుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో దసరా సెలవులను కూడా పూర్తిస్థాయిలో మంజూరు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో కార్డుల ఏరివేత ఉంటుందా? ఆధార్‌తో లింకు పెట్టి గతంలో రద్దయిన సుమారు 50 వేల రేషన్ కార్డుల పరిస్థితి ఏమిటి? పూర్తిస్థాయిలో రేషన్ సరఫరా అవుతుందా అన్న ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.
ధ్రువీకరణే కీలకం
కాగా రేషన్ కార్డుల ప్రక్షాళన ప్రక్రియలో తహశీల్దార్లే కీలకం కానున్నారు. సర్వే నివేదికల మేరకు తిరస్కరణకు గురైన కార్డుల కార్డుల జాబితాను డౌన్ లోడ్ చే యడం, దాన్ని పరిశీలించి, ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే బాధ్యతను తహశీల్దార్లకే అప్పగించారని జిల్లా అధికారులు చెబుతున్నారు. ‘డైనమిక్’ లిస్ట్ (రేషన్ సరఫరాలో కచ్చితత్వ పంపిణీ జాబితా)లో సరుకుల విడుదల కూడా తహశీల్దార్లు ఇచ్చే పత్రాల మేరకే జరుగుతుందని చెబుతున్నారు. ఈ నెల రేషన్‌కు సంబంధించి ఇప్పటికే కార్డు కు అరకిలో చొప్పున పంచదార పంపిణీ చేయించామని, కిరోసిన్ కోటా ఇంకా విడుదల కాలేదని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి సీహెచ్ ఆనందకుమార్ తెలిపారు. మరోవైపు..డీలర్లు డీడీలు కట్టిన మేరకే సరుకులు సరఫరా జరుగుతాయని, గతంలో రద్దు అయిన కార్డులకు ఈసారి కోటా ఇస్తారా లేదా అన్నది జాయింట్ కలెక్టర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈనెల కోటా సరఫరాపై అన్ని వైపుల నుంచి అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 49980 అంత్యోదయ, 678824 తెల్లరేషన్ కార్డులు, 1248 అన్నపూర్ణ, 150 చేనేత కార్డులున్నాయి. అన్నపూర్ణ, చేనేత కార్డులపై ఇచ్చే కోటా పూర్తిగా ఉచితం. తెల్లరేషన్ కార్డుల్లో ఇప్పటికే బోగస్ పేరిట చాలావరకు రద్దు చేస్తున్నారు. ఈనెల కోటా కింద ఇప్పటివరకు 9943 మెట్రిక్ టన్నుల బియ్యం విడుదలయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఇవి ప్రస్తుతం అమల్లో ఉన్న కార్డులకు సరిపోతాయంటున్నారు. అలాంటప్పుడు ఈ నెల కూడా ఆధార్‌తో సంబంధం లేకుండా రేషన్ సరఫరా అవుతుందా..ఈనెల 20వ తేదీతో ముగిసిపోతున్న జన్మభూమి కార్యక్రమం తరువాత స్పష్టత వస్తుందా అన్నది చూడాల్సిందే. మొత్తానికి గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలు, ప్రచార కార్యక్రమాల కోసం తిరుగుతున్న అధికారులకు రేషన్ కార్డుల ప్రక్రియపైనా ప్రజలు నిలదీస్తున్నారు. అందుకే ఈ నెల కోటా కూడా ఆధార్‌తో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో ఇచ్చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.