శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలో 1989 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వీటిద్వారా 7.60 లక్షల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం నిత్యావసర సరకులను సరఫరా చేస్తోంది. ఇవి కాకుండా కొత్తగా మరిన్ని డిపోల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 500 రేషన్ కార్డుల కంటే అధికంగా ఉన్న డిపోలను రెండింటిగా మార్చి ఆ గ్రామంలో కొత్త డిపో ఏర్పాటకు సిద్ధమవుతోంది. అయితే దీని వెనుక పూర్తిగా అధికార పార్టీ రాజకీయ స్వార్థం దాగి ఉందని తెలుస్తోంది. అసలు తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టేందుకే అదనంగా డిపోలు పెంచుతున్నట్లు విమర్శలు మొదలయ్యాయి.
ఆదినుంచీ అంతే...
వాస్తవానికి కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలకులు తమ తొలి బాణాన్ని చౌకధరల డిపోల డీలర్లపైనే సంధించారు. కొంతమందిపై అయితే ఎలాంటి ఆరోపణలూ లేకున్నా 6ఎ కేసులు నమోదు చేయడం, విజిలెన్స్ దాడులు వంటివి చేశారు. ఇలా జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన ్ల పరిధిలో సుమారు 250మంది డీలర్లపై వివిధ రకాల కేసులను బనాయించి వారిని తొలగించేందుకు ప్రభుత్వం యత్నించింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు కూడా ఆరాటపడింది. అయితే కొంతమంది డీలర్లు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో పాలకుల పన్నాగాలు పారలేదు. దీంతో కేసులు ఉన్న డీలర్లు కూడా డిపోలు నిర్వహిస్తున్నారు. న్యాయస్థానం దెబ్బకు ఖంగుతిన్న పాలకులు ఆ డిపోలను విడదీసి పచ్చ చొక్కాలకు కూడా డీలర్ హోదాను కల్పించేందుకు కొత్త పన్నాగాన్ని తెరమీదకు తెస్తున్నారు.
దీంట్లో భాగంగా 500 కార్డులు దాటిన డిపోలను రెండుగా చీల్చి కొత్త డిపోను పచ్చచొక్కా కార్యకర్తలకు కట్టబెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్న 500కార్డులు దాటిన డిపోల పేర్ల వివరాలు పాలకులు సేకరించారు. దీని ప్రకారం జిల్లాలో 446 రేషన్ డిపోలలో 500 రేషన్‌కార్డులు దాటినవి ఉన్నాయి. వీటి స్థానాల్లో కొత్త డిపోలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో నిత్యావసర సరకుల డిపోలు మొత్తం 1989 ఉన్నాయి. వీటిలో 500 కంటే తక్కువ రేషన్‌కార్డులు గల డిపోలు 1541 ఉన్నాయి. 500 నుంచి 750 రేషన్‌కార్డులు ఉన్న డిపోలు 396 ఉన్నాయి. 750 నుంచి 1000రేషన్ కార్డులు గల డిపోలు 45 ఉన్నాయి. 1000 నుంచి 1500 వరకూ గల కార్డులు ఉన్న డిపోలు 5 ఉన్నాయి. 1500 పైబడి కార్డులు గల డిపోలు రెండు ఉన్నాయి. వీటి ప్రకారం 446 డిపోలు ఏర్పాటు చేసేందుకు పాలకులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
‘తమ్ముళ్ల’ ఉపాధికి డిపోలు సిద్ధం!
Published Sun, Jan 25 2015 2:31 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement