రెవెన్యూ శాఖకు సంబంధించి ఆన్‌లైన్ సేవలు అస్తవ్యస్తంగా ఉంటూ ప్రజలను అవస్థల పాల్జేస్తున్నాయి. ప్రజలతో నిత్య సంబంధాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్:రెవెన్యూ శాఖకు సంబంధించి ఆన్‌లైన్ సేవలు అస్తవ్యస్తంగా ఉంటూ ప్రజలను అవస్థల పాల్జేస్తున్నాయి. ప్రజలతో నిత్య సంబంధాలు ఉండే ఈ శాఖ ద్వారా కుల, ఆదాయ, జనన, నివాస ధ్రువీకరణ పత్రాలతోపాటు రైతులకు సంబంధించిన అడంగళ్లు, భూముల మార్పులు చేర్పులు, రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం, ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు.. వంటి కీలక సేవలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సేవలు పొందాలంటే ముందుగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తుదారులకు ధ్రువపత్రాల జారీకి సంబంధిత తహశీల్దార్ కార్యాలయం ఆన్‌లైన్‌లోనే క్లియరెన్స్ ఇవ్వాలి. ఈ ప్రక్రియ సక్రమంగా సాగకపోవడం వల్ల దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు.
ముఖ్యంగా రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సులు, చిరునామాల మార్పు కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వారి కార్డులతోపాటు కీ రిజిస్టర్‌లో ఆ మేరకు మార్పులు చేసేందుకు సంబంధిత తహశీల్దార్ తరఫున ఆ కార్యాలయంలోని డేటా ఎంట్రీ అపరేటర్ అనుమతి ఇవ్వాలి. ఈ విధానం అమలు కావడం లేదు. కాగా ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ చాలామందికి వర్తించలేదు. అటువంటి వారందరూ మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అడంగల్, ఇతర ఆధారాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయానికి వెళితే సిబ్బంది లేరని, వెబ్‌సైట్ ఓపెన్ కావడం లేదని, సర్వర్ స్లోగా ఉందని రకరకాల కారణాలతో రోజుల తరబడి తిప్పుతున్నారు. ఫలితంగా వందలాది దరఖాస్తులు కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి.
ఈ పరిస్థితికి తహశీల్దార్లు, ఆ పని చూసే డేటా ఎంట్రీ అపరేటర్ల నిర్లక్ష్యమే కారణమైనప్పటికీ, ఇటీవల భారీగా జరిగిన బదిలీలను కారణంగా చూపుతూ తప్పించుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం జిల్లా రెవెన్యూ శాఖలో విఆర్వో నుంచి తహశీల్దారు వరకు సుమారు 360 మందిని బదిలీ చేశారు. ప్రతి తహశీల్దార్ కార్యాలయంలోనూ సగటున పది మంది వరకు బదిలీ అయ్యారు. వారి స్థానాల్లో కొత్తగా వచ్చిన సిబ్బంది ఈ పనుల పై ఇంకా దృష్టి సారించడం లేదు, దీనికి తోడు అవుట్ సోరింగ్ పద్ధతిలో జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయాల్లో పని చేస్తున్న 53 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా బదిలీ చేశారు. వారు కొత్త స్థానాల్లో చేరినా ఇంకా విధులపై దృష్టి సారించడం లేదు, మార్పులు చేర్పుటు జరుగుతాయన్న ఆశతో నామమాత్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ ప్రజలకు ఇబ్బందికరంగా పరిణమించాయి.