online services
-
అమ్మకాల్లో ఆన్‌లైన్‌దే హవా..
కోల్‌కతా: కొద్దిరోజులపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను నిలువరించిన కోవిడ్–19 శకం ముగిసినప్పటికీ ఆన్లైన్ సర్విసులకు డిమాండ్ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి కారణంగా జనజీవనం నిలిచిపోవడంతో ఊపందుకున్న ఆన్లైన్ ట్రెండ్ తదుపరి దశలో మరింత ఊపందుకుంది. ప్రజలు తమ అవసరాల కోసం ఆఫ్‌లైన్ స్టోర్లకంటే ఆన్లైన్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు. ఇందుకు స్మార్ట్ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. దీంతో ఆన్లైన్ అమ్మకాలు ఆఫ్‌లైన్ స్టోర్లను మించి నమోదవుతున్నట్లు మార్కెట్ రీసెర్చ్ సంస్థల తాజా నివేదిక పేర్కొంది. నీల్సన్ఐక్యూ, జీఎఫ్కే ఇండియా సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక వివరాలు చూద్దాం.. డోర్ డెలివరీ ఎఫెక్ట్ కరోనా తదుపరి లాక్డౌన్లు ఎత్తివేయడంతోపాటు.. అన్ని రకాల ఆంక్షలనూ ప్రభుత్వం తొలగించింది. అయినప్పటికీ వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు ఇటీవల జనంలోకి చొచ్చుకుపోయిన సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నారు. దీంతో ఫిజికల్‌గా స్టోర్ల సందర్శనకంటే ఈకామర్స్వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారి కాలంలో జోరందుకున్న డోర్ డెలివరీ వ్యవస్థ రానురాను బహుముఖాలుగా విస్తరించింది. ఫలితంగా నిత్యావసరాలు మొదలు విచక్షణ ప్రకారం కొనుగోళ్లు చేపట్టే వస్తువుల విషయంలోనూ ఆన్‌లైన్‌కే ఓటు వేస్తున్నారు. భారీ వృద్ధి బాటలో లాక్డౌన్ రోజుల్లో కూరగాయలు, ఫాస్ట్‌ఫుడ్ తదితర నిత్యావసరాల కోసం కాంటాక్ట్‌లెస్ డోర్ డెలివరీలకు అలవాటుపడిన ప్రజలు తదుపరి కాలంలో టీవీ సెట్ల దగ్గర్నుంచి ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు తదితర వినిమయ వస్తువులను సైతం ఈ కామర్స్ సైట్ల ద్వారా కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్ లాక్డౌన్ రోజులకుమించి కనిపిస్తోంది. ప్రధానంగా మెట్రో నగర ప్రాంతాలలో ఈకామర్స్ ద్వారా కొనుగోళ్లు భారీగా ఎగశాయి. ఇంటినుంచే కొనుగోలు చేయగలగడం, డోర్‌డెలివరీ సౌకర్యం, విభిన్న ప్రొడక్టుల అందుబాటు తదితర సానుకూలతలు కీలకపాత్రను పోషిస్తున్నాయి. ఫ్రాస్ట్ఫ్రీ ఫ్రిజ్‌లు, 55 అంగుళాలకుమించిన టీవీలు వంటి ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు 2023లో రెట్టింపయ్యాయి. కాగా, గతేడాదిలో ఎఫ్ఎంసీజీ విభాగ అమ్మకాలు అంతక్రితం ఏడాది(2022)తో పోలిస్తే ఊపందుకున్నాయి. -
ఏదైనా సాయంత్రం 5 తర్వాతే..
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు లెక్కలు దాచి చుక్కలు చూపిస్తోంది. చందాదారుల ఖాతావివరాలను తెలుసుకునేందుకు ఉన్న ఈ–పాస్‌బుక్ ఆప్షన్ సేవలను ఈపీఎఫ్‌వో నిలిపివేసింది. ఈ–పాస్‌బుక్ సర్వీసు కోసం లాగిన్ అయ్యేందుకు వెబ్సైట్లో పేజీని తెరవగానే ‘ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత పాస్‌బుక్ సర్వీసులు పునరుద్ధరిస్తాం’అని ప్రత్యక్షమవుతోంది. కొన్నిరోజులుగా ఇదే సూచన ప్రత్యక్షమవుతోందని ఖాతా దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఉద్యోగికి భవిష్యనిధి అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం. ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీ నెలవారీ చందా జమచేస్తున్న వివరాలు మొదలు భవిష్యనిధిలో ఉన్న మొత్తం, ఈ నిధిపై వస్తున్న వడ్డీకి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం హక్కుగా భావిస్తారు. నగదు నిల్వలు, వడ్డీ డబ్బులతో భవిష్యత్ కార్యకలాపాలకు సైతం ప్రణాళిక రచించుకుంటారు. రెండేళ్లుగా వడ్డీ ఏమైంది? వడ్డీ జమ అయ్యిందా?.. అనేది అత్యధిక ఈపీఎఫ్ చందాదారుల్లో తలెత్తుతున్న ప్రశ్న. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన నెల, రెండు నెలల్లో ఈపీఎఫ్‌వో చందాదారుల ఖాతాలో వడ్డీ నిధిని జమ చేస్తుంది. ఈ మేరకు ఖాతా రికార్డుల్లో లెక్కలు పేర్కొంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల్లో కంటే ఎక్కువ మొత్తంలో వడ్డీ ఈపీఎఫ్‌వో ద్వారా వస్తుండటంతో చందాదారులు పీఎఫ్ నగదును ఉపసంహరించుకోవడానికి ఇష్టపడరు. ఇంతటి కీలకమైన ఈపీఎఫ్ ఖాతాలోని వడ్డీ డబ్బులకు సంబంధించిన సమాచారంగత రెండేళ్లుగా అందుబాటులో లేదంటూ చందాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ నిధిపై స్పష్టత లేదని చందాదారులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2022–23 సంవత్సరంలో వడ్డీ శాతంపైనా ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. -
‘స్మార్ట్’ తెలంగాణ..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి వ్యవసాయంలో ఆధునికత పెరిగిపోయింది. సంప్రదాయ పద్ధతుల్లో సాగు దాదాపుగా కనుమరుగైపోతోంది. విత్తనాలు నాటాలన్నా యంత్రాలే..కోత కోయాలన్నా యంత్రాలే. ఇక మధ్యలో పంటలను ఆశించే తెగుళ్లను నిర్మూలించేందుకూ ఆధునిక స్ప్రే పరికరాలు వచ్చేశాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి..కానీ ఏ పనికి ఏ పరికరం వాడాలి?, ఏ తెగులు సోకితే ఏ మందు వాడాలి?, పంటల ఎదుగుదల సరిగ్గా లేకుంటే ఏం చేయాలి?..ఇలాంటి సమస్యలన్నిటికీ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, పరిష్కారం దొరికినట్టేనని అంటున్నాడు కొత్తగూడెం జిల్లా రెడ్డిపాలెం రామానుజరెడ్డి. తనకున్న యాభై ఎకరాల్లో వరి, పత్తి పంటలను సాగు చేస్తూ చీడపీడలకు ‘స్మార్ట్ ఫోన్ వైద్యం’చేస్తున్నాడు. తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న ప్లాంటిక్స్, అగ్రిసెంటర్, కిసాన్ తదితర యాప్‌ల సహాయంతో మొక్కలు ఎదగకపోయినా లేదా తెగులు కనిపించినా ఫొటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే గంటల వ్యవధిలోనే తగు సలహాలు వచ్చేస్తున్నాయి. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం స్మార్ట్ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిపోయిందో ఇది స్పష్టం చేస్తోంది. ఇక ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా జేబులోంచి ఫోన్ తీసి గూగుల్‌లో శోధించడం సర్వసాధారణంగా మారిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ–పేమెంట్లు కూడా పెరిగిపోవడం స్మార్ట్ ఫోన్లు ఎంత కీలకపాత్ర పోషిస్తున్నాయో స్పష్టం చేస్తోంది. జోరుగా ఆన్లైన్ సర్వీసులు 2022లో తెలంగాణలో టెలిడెన్సిటీతో పాటు డిజిటల్ లైఫ్ గణనీయంగా పెరిగిపోయింది. దేశ సగటుకు మించిన స్మార్ట్ సిటిజెన్ (స్మార్ట్ ఫోన్లు వినియోగించేవారు), డేటా వినియోగంతో పాటు ఆన్లైన్ సర్వీసులు, పేమెంట్లు జోరుగా సాగుతున్నాయి. టెలిడెన్సిటీ (ఎంత మందికి ఎన్ని సిమ్‌లు)ని తీసుకుంటే 2022 ట్రాయ్ తాజా నివేదిక మేరకు తెలంగాణలో 100 మంది 110 సెల్‌ఫోన్ సిమ్కార్డులున్నాయి. ఇలా ప్రస్తుతం రాష్ట్రంలో 4.22 కోట్ల సిమ్ కార్డులుండగా వీటిలో 1.80 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో కేరళ 100 మందికి 123 సిమ్‌లతో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ సెకండ్ ప్లేస్‌కు చేరింది. రాష్ట్రాల వారీగా ప్రతి 100 మందికి వాడుతున్న సిమ్ల వివరాలు ఈ పేమెంట్లలో టాప్ ఫైవ్‌లో హైదరాబాద్ కోవిడ్‌తో వేగం పుంజుకున్న ఈ పేమెంట్ల జోరు 2022లో కూడా కొనసాగింది. ఒకరి నుండి ఒకరికి, సంస్థల నుండి బ్యాంకులకు మనీ ట్రాన్స్ఫర్ మినహాయిస్తే.. వ్యక్తిగత లావాదేవీలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ – 2022) తాజా నివేదిక వెల్లడించింది. దేశంలో ఈ కామర్స్ లావాదేవీల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ, ముంబై అనంతరం హైదరాబాద్ నాలుగవ స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో జీహెచ్ఎంసీ మొదటి స్థానంలో ఉండగా, ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలు వరసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లావాదేవీల కోసం అత్యధికంగా ఫోన్‌పే (47.8%), గూగుల్‌పే (33.6%), పేటీఎం (13.2%) లను ప్రజలు వినియోగిస్తున్నారు. నగదు వాడేదే లేదు..! ప్రపంచంలో 63 దేశాలు చుట్టివచ్చా. ఇండియాలో అన్ని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లా. విదేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి కరెన్సీ తీసుకుంటా. ఇండియాలో మాత్రం నగదు రూపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదు. ఇక హైదరాబాద్‌లో అయితే అన్నీ ఆన్లైన్లోనే. – నీలిమారెడ్డి, మైక్రోసాఫ్ట్ స్మార్ట్ సిటిజెన్ సంఖ్య పెరుగుతోంది ప్రభుత్వ, ప్రైవేటు సేవలు చాలావరకు ఆన్‌లైన్‌లోకి రావటం వల్లే టెలిడెన్సిటీ పెరిగింది. దీంతో పాటు ఆన్లైన్ లావాదేవీలు పెరిగి తెలంగాణలో స్మార్ట్ సిటిజెన్ సంఖ్య దేశ సగటు కంటే పెరుగుతూ వస్తోంది. అలాగే దేశంలో అత్యధిక డేటా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. దీని ఫలితాలు అన్ని రంగాల్లోనూ రావటం మొదలయ్యాయి. – జయేశ్ రంజన్, ముఖ్య కార్యదర్శి, ఐటీ -
పెద్ద ఆలయాల్లో ఆన్లైన్ సేవలు
సాక్షి, అమరావతి: రూ.25 లక్షలకు పైబడి వార్షికాదాయం కలిగిన 175 పెద్ద ఆలయాల్లో జనవరి నెలాఖరుకు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవదాయ శాఖలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై బుధవారం విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే 16 ప్రధాన ఆలయాల్లో పూర్తి స్థాయి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్, అదనపు కమిషనర్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క నిమిషమే కదా అనుకుంటే..? ఆ లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
సాక్షి సెంట్రల్ డెస్క్: ఒక్క నిమిషం.. ఇందులో ఏముంది. సింపుల్‌గా గడిచిపోతుంది. ఒక పాట వినాలన్నా, చూడాలన్నా నాలుగైదు నిమిషాలు పడుతుంది అంటారా? కానీ ఒక్క నిమిషంలో డిజిటల్ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా.. ఆ లెక్కలు చూస్తే కళ్లు బైర్లుకమ్మడం ఖాయం. ఆన్లైన్ సేవల సంస్థ డొమో దీనిపై పరిశీలన జరిపి నివేదిక రూపొందించింది. మరి ఒక్క నిమిషంలో ఏమేం జరుగుతోందో చూద్దామా.. డేటా లెక్క.. నోరు తిరగనంత! ♦స్టాటిస్టా సంస్థ లెక్కల ప్రకారం.. ప్రపంచంలోని అన్ని దేశాలు కలిపి ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న జనాభా సంఖ్య 500 కోట్లు దాటింది. ♦మొత్తం భూమ్మీద ఉన్న జనాభాలో ఇది 62 శాతం ♦ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నవారిలో ఏకంగా 93 శాతం సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ♦2022లో ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా సృష్టించిన, కాపీ చేసిన, వినియోగించిన డేటా లెక్కఎంతో తెలుసా.. ♦97 జెట్టాబైట్లు.. అంటే లక్ష కోట్ల జీబీ (గిగాబైట్లు) డేటా అన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే 10,00,00,00, 00,000 జీబీలు. -
ఏపీఐఐసీ ఆన్లైన్ సేవలకు ఆదరణ
సాక్షి, అమరావతి: పారిశ్రామిక ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండానే ఒక్క క్లిక్‌తో ఆన్లైన్ ద్వారానే అన్ని సేవలు అందించేలా ఏపీఐఐసీ వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా 14 సేవలను అందిస్తుండగా.. త్వరలోనే అన్ని సేవలను అందించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రహ్మణ్యం ‘సాక్షి’తో చెప్పారు. ఆన్లైన్ సేవలను ప్రవేశపెట్టిన నాలుగు నెలల్లోనే మంచి స్పందన వస్తోందని, ఇప్పటి వరకు అనుమతుల కోసం 389 దరఖాస్తులు రాగా, నిర్ణీత గడువులోగా 144 అనుమతులు మంజూరు చేసినట్టు తెలిపారు. కొన్ని అనుమతులకు మరింత సమాచారం అవసరం కావడంతో తిరిగి పంపగా, మిగిలిన దరఖాస్తులు పరిశీలన దశలో ఉన్నట్టు చెప్పారు. సేవల విస్తరణ ప్రస్తుతం వెబ్ ద్వారా సేవలను అందిస్తున్నామని, ఏపీఐఐసీ సేవల కోసం ఒక మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్టు ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలన్నీ ఆన్లైన్ ద్వారా అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకనుగుణంగా సేవలను విస్తరిస్తున్నట్టు తెలిపారు. పరిశ్రమ పేర్లు మార్చుకోవడం, కేటాయింపుల్లో మార్పు, కేటాయింపుల బదిలీ, పునఃకేటాయింపులు, కేటాయింపులను వెనక్కి తీసుకోవడం, లైన్ఆఫ్ యాక్టివిటీ మార్పు, పరిశ్రమకు చెందిన నియోజకవర్గ మార్పు, అడిషనల్ లైన్ యాక్టివిటీ, ప్లాట్ పరిమితుల అనుమతులు, ప్లాట్ డివిజన్, విభజనల మార్పులు, ఐదెకరాల్లోపు సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్, ఐదెకరాలపైన సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్‌ల విజ్ఞప్తులు, కేటాయించిన ప్లాట్‌కు సంబంధించిన ఎన్వోసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), ప్రాజెక్టుకు అమలుకు నిర్దేశించిన గడువు పెంపు, ముందస్తు చెల్లింపులకు అవసరమైన గడువు పెంపు.. తదితర సేవలను ఆన్లైన్లో అందిస్తున్నామని, త్వరలోనే మిగిలిన సేవలనూ ఆన్లైన్ పరిధిలోకి తీసుకురానున్నట్టు ఏపీఐఐసీ ఎండీ వివరించారు. -
ఒక క్లిక్‌తో ఏపీఐఐసీ సేవలు..14 సేవలు అందుబాటులోకి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పే పారిశ్రామికవేత్తలకు ఇకపై ఫైళ్లు పట్టుకొని వారాలు, నెలలు పరిశ్రమల శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్లోనే వారికి అవసరమైన సేవలను సులభంగా పొందవచ్చు. ఇందుకోసం సింగిల్ విండో విధానంలో పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట అందించేలా ఏపీఐఐసీ ఆన్లైన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఏపీఐఐసీని పరిశ్రమల శాఖతో అనుసంధానం చేయడం ద్వారా భూమి కోసం దరఖాస్తు దగ్గర నుంచి కంపెనీ వాటాల విక్రయం వరకు అన్ని సేవలను ఒకే క్లిక్‌తో పొందే అవకాశం కల్పించింది. ‘పౌర సేవలు’ పేరుతో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన నూతన పోర్టల్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్ సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గడువులోగా పని చేసే సాంకేతిక వ్యవస్థని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇందుకు కృషి చేసిన ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని అధికారుల బృందానికి అభినందనలు తెలిపారు. www.apindustries.gov.in కు ఏపీఐఐసీ సేవలు అనుసంధానమవడమే కాకుండా పారిశ్రామికవేత్తలకు తక్షణమే ఈ సేవలన్నింటినీ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్లు, ఏపీఐఐసీకి జోనల్ మేనేజర్లు కలిసి పనిచేసి మరిన్ని మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. 14 సేవలకూ ఒకటే అప్లికేషన్ సింగిల్ విండో వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఏపీఐఐసీకి చెందిన అన్ని సేవలను పొందవచ్చని ఆ సంస్థ వీసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. తొలిదశలో 14 సేవలను అందుబాటులో ఉంచామన్నారు. వీటిలో ఏ సేవ పొందాలన్నా ఆన్లైన్లో ఒకే అప్లికేషన్ ఫామ్ నింపితే సరిపోతుందన్నారు. పరిశ్రమ పేరు మార్చుకోవడం, కేటాయింపుల బదిలీ, ఇతర మార్పులు, లైన్ ఆఫ్ యాక్టివిటీ మార్పు, పరిశ్రమకు చెందిన నియోజకవర్గ మార్పు, అడిషనల్ లైన్ యాక్టివిటీ, ప్లాట్ పరిమితుల అనుమతులు, ప్లాట్ డివిజన్, విభజనల మార్పులు, 5 ఎకరాలలోపు సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ , 5 ఎకరాలపైన సేల్ డీడ్ ఎగ్జిక్యూషన్ విజ్ఞప్తులు, కేటాయించిన ప్లాటుకు ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), ప్రాజెక్టు అమలుకు గడువు పెంపు, ముందస్తు చెల్లింపుల గడువు పెంపు వంటి 14 సేవలు ఆన్లైన్ ద్వారా పొందవచ్చని చెప్పారు. వీటిని 15 రోజుల నుంచి 45 రోజుల్లో పూర్తిచేయాలన్న లక్ష్యాన్ని కూడా నిర్దేశించారు. ప్రస్తుతం చిన్న పనులకే ఎక్కువ సమయం వృథా అవుతోందని, దాని నియంత్రణ కోసం ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కలిసి పని చేస్తున్నట్లు సుబ్రమణ్యం తెలిపారు. (చదవండి: సందడిగా కలెక్టరేట్లు.. వేలాది మందితో భారీ ర్యాలీలు..ఊరూరా పండుగ వాతావరణం) -
మరో 180 ఆలయాల్లో ఆన్లైన్ సేవలు
పెనుగంచిప్రోలు: ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో సేవలు, పూజలు చేసుకునే అవకాశం భక్తులకు కల్పించామని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ పి.వాణీమోహన్ పేర్కొన్నారు. శనివారం ఆమె కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలోని శ్రీ లక్ష్మీతిరుపతమ్మ వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా ప్రముఖ ఆలయాలన్నింటిలో ఆన్లైన్ సేవలు కొనసాగుతున్నాయని, మరో 180 దేవాలయాల్లో కొత్తగా ఆన్లైన్ సేవలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రముఖ ఆలయాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించటంతో పాటు రిజిస్టర్లు, బంగారం, వెండి నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించటంపై దృష్టి పెడుతున్నామన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఆలయ ఈవో మూర్తి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలతో ప్రిన్సిపల్ సెక్రటరీని సత్కరించారు. -
ఆన్లైన్ పూజలు.. ఇంటికే ప్రసాదం
సాక్షి, హైదరాబాద్: వినాయక నవరాత్రులను పురస్కరించుకుని దేవాదాయ, తపాలాశాఖలు సంయుక్తంగా ఆన్లైన్ సేవలు, స్పీడ్‌పోస్టు ద్వారా ఇంటికే ప్రసాద పంపిణీకి శ్రీకారం చుడుతున్నాయి. ప్రయోగాత్మకంగా మొదట సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్‌తో దీన్ని ప్రారంభిస్తున్నారు. కోవిడ్ ఆందోళన నేపథ్యంలో కొందరు భక్తులు దేవాలయాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. కానీ, ఏటా వినాయక ఉత్సవాల వేళ ఆలయంలో పూజలు చేయించుకునే సంప్రదాయాన్ని ఆచరించలేకపోతు న్నామన్న భావన వారిలో ఉంది. ఇలాంటి వారి కోసం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తపాలాశాఖ ఈ–షాప్ వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకుంటే నవరాత్రి ప్రత్యేక పూజాదికాలను నిర్ధారిత రోజుల్లో వారి పేరుతో నిర్వహి స్తారు. కుంకుమ, అక్షింతలు, పొడి ప్రసాదాలను స్పీడ్ పోస్టు ద్వారా భక్తుల ఇళ్లకు పంపుతారు. సెప్టెంబరు 12న లక్ష భిల్వార్చన (రుసుము రూ.320), 14న సత్య గణపతి వ్రతాలు (రూ.620), 17న సిద్ధిబుద్ధి సమేత గణపతి కళ్యాణం (620), 10 నుంచి 19 వరకు సహస్ర మోదక గణపతి హోమాలు (620), 10 నుంచి 20 వరకు సర్పదోష నివారణ అభిషేకాలు (రూ.400) ఉంటాయని, ఆయా సేవలకు కనీసం రెండు రోజుల ముందు పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. -
కారు రుణం మరింత సులువు
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ వేదికను దేశవ్యాప్తంగా పరిచయం చేసింది. ఈ ఆన్లైన్ ప్లాట్‌ఫాం ద్వారా దరఖాస్తు చేసుకుని వినియోగదార్లు సులభంగా కారు రుణం పొందవచ్చు. మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ సేవలను 2020 డిసెంబరులో కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రవేశపెట్టింది. ఇప్పుడీ వేదికను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లకు ఫైనాన్స్ సౌకర్యం కల్పించేందుకు కంపెనీ 14 బ్యాంకులతో చేతులు కలిపింది. వీటిలో నచ్చిన బ్యాంకును కస్టమర్లు ఎంచుకోవచ్చు. ‘షోరూంలకు వచ్చే ముందే కార్లు, ఫైనాన్స్ వివరాల కోసం వినియోగదార్లు ఆన్లైన్లో వెతుకుతున్నారు. మారుతున్న కస్టమర్ల తీరును దృష్టిలో పెట్టుకుని మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ ప్లాట్‌ఫాంను తీసుకొచ్చింది. ఈ సేవలు ఆరంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 25 లక్షల పైచిలుకు విజిటర్లు నమోదయ్యారు’ అని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
ఇష్టదైవానికి ఆన్లైన్లోనే పూజలు
సాక్షి, అమరావతి: కోవిడ్ వేళ గుడి వరకు వెళ్లకుండానే తమ ఇష్ట దైవాల పూజల్లో ఆన్లైన్ ద్వారా హాజరవుతున్నారు భక్తులు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఆన్లైన్లో పూజాదికాలు నిర్వహించుకునే అవకాశాన్ని దేవదాయ శాఖ అందుబాటులోకి తీసుకురాగా.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడచిన శుక్రవారం రోజున రాష్ట్రంలోని 23 ఆలయాల్లో 512 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు దేవదాయ శాఖ వెల్లడించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రముఖ క్షేత్రమైన మావుళ్లమ్మ ఆలయంలో శుక్రవారం అత్యధికంగా 159 మంది భక్తులు ఆన్లైన్ పూజల్లో పాల్గొనగా.. శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున ఆలయంలో ఒక్కరోజే 145 మంది భక్తులు ఆన్లైన్ ద్వారా పూజలు నిర్వహించారు. ఈ నెల 8–11 తేదీల మధ్య 14 ఆలయాల్లో 624 మంది ఆన్లైన్ విధానాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం 23 క్షేత్రాల్లో.. రాష్ట్రంలో పెద్ద దేవాలయాలైన శ్రీశైలం, అన్నవరం, విజయవాడ కనకదుర్గ, ద్వారకా తిరుమల, కాణిపాకం, మావుళ్లమ్మ మొదలగు 23 ఆలయాల్లో పరోక్ష పద్ధతిలో నిర్వహించుకునేలా ఈ–పూజలను దేవదాయ శాఖ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. భక్తుల రద్దీ అధికంగా ఉండే 6 (ఏ) కేటగిరీలో ఉండే 175 ఆలయాల్లోనూ ఈ నెలాఖరు నాటికి ఆన్లైన్ పూజలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేపట్టింది. మరో 1,300 పైగా 6 (బీ) కేటగిరీ ఆలయాల్లోనూ జూలై చివరి నాటికి ఈ విధానాన్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించారు. భక్తులు వీక్షించేలా ప్రత్యేక లింకు వివిధ ఆలయాల్లో ఈ–పూజలను బుక్ చేసుకున్న భక్తులకు గోత్రనామాలతో కోరుకున్న పూజను ఆలయంలో నిర్వహించేలా దేవదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుడు పూజను బుక్ చేసుకున్న వెంటనే అతడి మొబైల్ నంబర్‌కు ప్రత్యేకంగా ఓ ఆన్లైన్ లింకును ఆలయ అధికారులు పంపుతారు. నిర్దేశిత సమయంలో అధికారులిచ్చిన కోడ్‌తో భక్తుడు ఆన్లైన్లో లింకు ఓపెన్ చేయగానే.. సంబంధిత భక్తుల పూజను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. పూజల తరువాత ప్రసాదాన్ని పోస్ట్ ద్వారా పంపిస్తారు. రాష్ట్రంలోని 170 ప్రముఖ ఆలయాల్లో ఈ–హుండీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 207 రకాల పూజలు వివిధ ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు నిత్యం నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలను మాత్రమే దేవదాయ శాఖ ఆన్లైన్లో పరిధిలోకి తెచ్చింది. త్వరలో 207 రకాల పూజలను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబోతోంది. ► శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో అభిషేకం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, చంఢీ హోమం, నిత్య కల్యాణ పూజలను పరోక్ష సేవల కేటగిరిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు ఆన్లైన్ రూ.1,116 చెల్లించి ఏ పూజానైనా తమ గోత్రనామాలతో జరిపించుకోవచ్చు. ► అన్నవరం ఆలయంలో మఖ నక్షత్రం రోజున అభిõÙకంతోపాటు అన్ని రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆన్లైన్ ద్వారా జరిపించుకోవచ్చు. ► ద్వారకా తిరుమలలో శ్రీవారి నిత్య కల్యాణం (టికెట్ ధర రూ.1,600), బెజవాడ కనకదుర్గ ఆలయంలో చండీహోమం, ఖడ్గమాలార్చన, శ్రీకాళహస్తిలో రాహు–కేతు పూజలను ఆన్లైన్ విధానంలో నిర్వహించుకోవచ్చు. -
ఈఎస్ఐ సేవలు @ ఆన్లైన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆస్పత్రుల్లో భారీ సంస్కరణల దిశగా ముందుకు వెళుతోంది. గత ప్రభుత్వ హయాంలో కార్మీకులకు వైద్యం కాదు కదా.. వచి్చన నిధులన్నీ కాంట్రాక్టర్లు, మంత్రులు, నేతల చేతుల్లోకి వెళ్లి, కార్మీకరాజ్య బీమా ఆస్పత్రులు నిర్వీర్యం అయిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్ఐ కార్మికులకు ఆన్లైన్లో డాక్టరు అపాయింట్మెంట్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తోంది. జబ్బు చేస్తే ఈఎస్ఐ డిస్పెన్సరీకి వెళ్లినా డాక్టరు లేకపోవడం వంటి కారణాలతో వెనక్కు రావాల్సి వచ్చేది. దీంతో కార్మీకులకు వైద్యం సరిగా అందేది కాదు. ఇకపై అలాకాకుండా జబ్బు చేసిన రోజు వైద్యానికి వెళ్లగానే చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 13 లక్షల మందికిపైగా కార్మీకులున్నారు. వీరి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 40 లక్షల మందిపైనే ఉన్నారు. వీళ్లకోసం కార్మీక రాజ్యబీమా సంస్థ ‘ఏఏఏప్లస్’ అనే యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఏ డిస్పెన్సరీకి వెళ్లాలో దరఖాస్తు చేసుకోవచ్చు. డాక్టరు దగ్గరకు వెళ్లే గంట ముందు యాప్‌లో వివరాలు పంపిస్తే చాలు.. పేషెంటు వెళ్లేసరికి విధిగా అక్కడ వైద్యులు ఉంటారు. పేషెంటు వేచి ఉండకుండా వెంటనే పరీక్షించి అవసరమైన మందులు ఉచితంగా ఇస్తారు. ఇప్పటికే గుణదలలోని ఆస్పత్రిని మోడల్ డిస్పెన్సరీగా తీర్చిదిద్దారు. మొత్తం 78 డిస్పెన్సరీలకు ఆన్లైన్ సేవలు విస్తరిస్తున్నారు. దీనివల్ల డాక్టర్లు గైర్హాజరవడానికి వీలుండదు. ఏరోజుకారోజు ఆన్లైన్ వివరాలుఅందుతాయి. 13 ఏళ్ల తర్వాత నర్సుల నియామకాలు గడిచిన 13 ఏళ్లుగా ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఒక్క నియామకమూ జరగలేదు. 13 ఏళ్ల తర్వాత ఒకేసారి 101 మంది నర్సుల నియామకం జరుగుతోంది. ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించి పరిశీలించారు. కొద్ది రోజుల్లో నర్సులు విధుల్లో చేరనున్నారు. దీనివల్ల నర్సింగ్ కేర్ సేవలు మెరుగు పడనున్నాయి. ఇకపై అన్నీ ఆన్లైన్ సేవలే తాజాగా కార్మికులకు ఆన్లైన్ అపాయింట్మెంట్ సేవలు అందుబాటులోకి తెస్తున్నాం. మందుల కొనుగోళ్లు, ఇన్వెంట్రీ, ఇండెంట్ అన్నీ ఆన్లైన్ పరిధిలోకి తీసుకురాబోతున్నాం. గతంలో పెండింగ్‌లో ఉన్న పేషెంట్ల బిల్లులన్నీ ఆన్లైన్ చేశాం. ప్రైవేటు ఆస్పత్రుల వివరాలను కూడా ఆన్లైన్ చేయబోతున్నాం. దీనివల్ల పారదర్శకంగా పనులు జరుగుతాయి. ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండకుండా సేవలు అందేలా చేస్తున్నాం. రెండు నెలల్లో అన్ని ఆస్పత్రులను ఆన్లైన్ అపాయింట్మెంట్ పరిధిలోకి తెస్తాం. – డాక్టర్ కుమార్ లక్కింశెట్టి, డైరెక్టర్,కార్మీకరాజ్య బీమా సంస్థ -
కార్మికులకు మెరుగైన వైద్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పారు. కార్మికులకు ఇబ్బంది లేకుండా రాష్ట్రంలోని అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గుణదల మోడల్ డిస్పెన్సరీలో ఆన్లైన్ విధానాన్ని సోమవారం కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మితో కలిసి మంత్రి జయరాం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కార్మికుల సొమ్మును కూడా దోచుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల సొమ్మును వారి వైద్యం, సంక్షేమం కోసమే ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసుకోవడం ద్వారా కార్మికులు వారి సమయాన్ని ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే.. రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందనే నమ్మకంతో సీఎం వైఎస్ జగన్.. ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలు కూడా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందే అవకాశాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువస్తే.. ఆయన తనయుడు సీఎం జగన్ ఇప్పుడు ప్రతి ఒక్క జబ్బును ఆరోగ్య శ్రీలో చేర్చి పేదలకు మెరుగైన వైద్యమందిస్తున్నారని చెప్పారు. ప్రజల సంక్షేమంతో పాటు విద్య, ఆరోగ్యానికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి మాట్లాడుతూ.. ఆన్లైన్ సేవల విధానాన్ని 78 డిస్పెన్సరీలు, 4 ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అమలు చేస్తామన్నారు. ఈఎస్ఐ డైరెక్టర్ ఎల్‌ఎస్‌బీఆర్ కుమార్, కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, ప్రాంతీయ సంచాలకులు కాశీనాథన్ పాల్గొన్నారు. -
ఆలయ వ్యవస్థ ఇక స్వచ్ఛం, పారదర్శకం
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని అన్ని రకాల దేవాలయాల మేనేజ్మెంట్ వ్యవస్థ ఇకపై అత్యంత స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఈ నూతన మేనేజ్మెంట్ వ్యవస్థను ప్రారంభించారు. ఇందులో దేవాలయాల సమాచారం, ఆన్లైన్ సర్వీసులు, యాత్రికులకు అవసరమైన సేవలు, దేవాలయాల ప్రొఫైల్స్, ఆస్తుల నిర్వహణ, క్యాలెండర్, సేవలు, పర్వదినాల నిర్వహణ, ఆదాయం, ఖర్చుల వివరాలు, డాష్ బోర్డు, సిబ్బంది వివరాలు ఉంటాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగ పడుతుందన్నారు. దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. ► కొత్త విధానం వల్ల భక్తులు ఇ–హుండీ ద్వారా కానుకలు సమర్పించవచ్చు. క్యూ ఆర్ కోడ్ ద్వారా కూడా ఇ– హుండీకి కానుకలు సమర్పించే అవకాశం ఉంటుంది. ► ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా తొలిసారిగా అన్నవరం దేవాలయంలో ఈ వ్యవస్థ ప్రారంభమైంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి అన్నవరం టెంపుల్‌కు రూ.10,116 ఇ–హుండీ ద్వారా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించింది. ► ఈ నెలాఖరుకు మరో 10 ప్రధాన దేవాలయాల్లో ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్, ఎండోమెంట్ కమిషనర్ అర్జున రావు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ రాజ్ కిరణ్ రాయ్ జి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ ఏజీఎం అండ్ కోఆర్డినేటర్ ఇ.రాజుబాబు, రీజనల్ హెడ్ వి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లోనే ఆర్టీఓ సేవలు
సాక్షి, నిజామాబాద్: డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవాలన్నా.. లెర్నింగ్ లైసెన్స్ గడువు ముగిస్తే కొత్తది తీసుకోవాలన్నా.. డ్రైవింగ్ లైసెన్స్ అడ్రస్‌లో మార్పులు, చేర్పులు చేయాలన్నా.. ఇప్పటి వరకు తప్పనిసరిగా ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఇలాంటి కొన్ని రకాల సేవలన్నీ ఇకపై ఆన్లైన్లోనే అందించాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ సేవల కోసం కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండానే రవాణాశాఖ వెబ్సైట్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేసింది. అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం లేకుండా జారీ చేసే అన్ని సేవలను ఆన్లైన్లో అందించాలని భావిస్తోంది. ఈ మేరకు ఈ ఆన్లైన్ సేవలు వెంటనే ప్రారంభించాలని ఆ శాఖ కమిషనరేట్ నుంచి ఆదేశాలు అందాయి. ఆర్టీఓ సేవలను మరింత సరళతరం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఈ సేవలు పొందేవారికి ఊరట లభించింది. రోజుకు సుమారు 500 మందికి.. జిల్లాలో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పట్టణాల్లో ఆర్టీఓ కార్యాలయాలు ఉన్నాయి. ఇలాంటి సేవల కోసం ఆయా కార్యాలయాలకు రోజుకు సుమారు 400 నుంచి 500 మంది వస్తుంటారు. దీంతో ఆర్టీఓ కార్యాలయాలు కిక్కిరిపోతుంటాయి. కొందరు నేరుగా కాకుండా, ఏజెంట్ల ద్వారా పనులు చేయించుకుంటారు. ఇకపై వీరంతా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. దీనికి తోడు ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం కూడా ఉండదు. ఆన్లైన్లోనే దరఖాస్తులు.. పౌరులు ఆయా సేవల కోసం ఇంటి వద్ద నుంచే పనులు చక్కబెట్టుకోవచ్చు. ఇందుకోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు నిర్ణీత స్లాట్లను అందుబాటులో ఉంచుతారు. సంబంధిత డాక్యుమెంట్లను రవాణాశాఖ వెబ్సైట్లో (www.transport.telangana.gov.in) అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్లతో కూడిన దరఖాస్తులు నేరుగా ఆశాఖ రాష్ట్ర కార్యాలయంలోని సర్వర్‌కు అనుసంధానం అవుతుంది. ఆయా సేవల కోసం ఆన్లైన్లోనే ఫీజు మొత్తాన్ని చెల్లిస్తే నిర్ణీత రోజుల్లో ఈ సేవలు అందుతాయి. ఆన్లైన్ సేవలను సద్వినియోగం చేసుకోండి రవాణాశాఖకు సంబంధించి కొన్ని రకాల సేవలను ఆన్లైన్లోనే అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సేవలను వినియోగించుకోవాలి. అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం లేకుండా పొందే సేవలను పౌరులు ఇంటి నుంచే పొందవచ్చు. కార్యాలయాలనికి రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో పొందవచ్చు. – డా.కె.వెంకటరమణ, ట్రాన్స్పొర్టు డిప్యుటీ కమిషనర్. -
ఆర్టీఏ: ఆన్లైన్లో మరో ఆరు సేవలు
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖలో కొత్తగా మరో ఆరు సేవలను ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ, లైసెన్స్‌లో చిరునామా మార్పు, ప్రమాదకర వస్తువులు తరలించే వాహన లైసెన్స్ (హజార్డస్ లైసెన్స్) పొందటం, గడువు ముగిసిన లెర్నర్స్ లైసెన్స్ స్థానంలో కొత్తది తీసుకోవటం, వాహన కేటగిరీ మారినప్పుడు కొత్త లెర్నర్స్ లైసెన్స్ పొందటం, డ్రైవింగ్ లైసెన్స్ గడువు తీరిపోతే మళ్లీ లెర్నర్స్ లైసెన్స్ జారీ తదితర ఆరు సేవలను ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే కూర్చుని ఈ సేవలను పొందవచ్చని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. (కరోనా పిల్లల వార్డుల్లోకి తల్లిదండ్రులకు అనుమతి) జూన్ 24న, డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్, పాత లైసెన్స్ కార్డు స్థానంలో స్మార్ట్‌కార్డు పొందటం, లైసెన్స్ హిస్టరీ షీట్ పొందే సేవలను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏజెంట్ల ప్రమేయం లేకుండా, గంటల తరబడి కార్యాలయాల్లో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వివిధ సేవలను ఆన్లైన్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనికి మంచి స్పందన వస్తోందని, సేవలను మరింత సులభతరం చేసేందుకు రవాణా శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. గతంలో ఐదు సేవలు ఆన్లైన్ ద్వారా అందు బాటులో ఉండేవని, ఇప్పుడు వాటికి అదనంగా మరో ఆరు సేవలను చేర్చామని రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా వాహనదారులు జాప్యం లేకుండా సేవలు పొందే వీలు కలుగుతుందని తెలిపారు. (ప్రత్యేక రైళ్లకు అన్‌లాక్) -
ఆర్టీసీ.. ఆన్లైన్ దూకుడు
సాక్షి, కర్నూలు: ఆర్టీసీ (రోడ్డు రవాణా సంస్థ) ఆన్లైన్ సేవలతో ప్రయాణికులకు మరింత దగ్గరవుతోంది. ఇప్పటికే బస్సు సీట్ల రిజర్వేషన్లు అధిక శాతం ఆన్లైన్ చేయగా.. తాజాగా మరో అడుగు ముందుకు వేస్తోంది. నగదు, కాగిత రహిత టికెట్ల జారీకి కసరత్తు చేస్తోంది. ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందలేని ప్రయాణికులకు ఇక డబ్బు తీసుకోకుండా, టికెట్లు ఇవ్వకుండా మెసేజ్ ద్వారా ప్రయాణానికి శ్రీకారం చుట్టనుంది. వెళ్లాల్సిన ప్రాంతానికి చెల్లించాల్సిన డబ్బును యాప్స్ ద్వారా ఆర్టీసీ ఖాతాలోకి బదిలీ చేసిన వెంటనే ప్రయాణికుడి సెల్‌కు మెసేజ్ రావడం.. ఆ తర్వాత ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వనున్నారు. దీని కోసం ప్రత్యేక ఖాతాలను తెరిచి ప్రయాణికులకు నూతన సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన అధికారులు మరో రెండు మూడు రోజుల్లో దీనిని అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నో కరెన్సీ.. నో పేపర్ టికెట్... అటు ప్రయాణికులు, ఇటు కండక్టర్లు సౌలభ్యంగా ఉండేలా ఆర్టీసీ నో కరెన్సీ, నో పేపర్ టికెట్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో దృష్టి సారించి ంది. ప్రయాణికుడి చేతిలో సెల్ ఉండి.. అందులో బ్యాంకింగ్ సేవల యాప్స్ ఉండి.. అందులో డబ్బు ఉంటే చాలు ఈ టికెట్ పొందవచ్చు. ఏర్పాట్లు ఇలా... మొబైల్ మెసేజ్ టికెట్ల జారీ కోసం అర్టీసీ అధికారులతో పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా డిపో మేనేజర్లు పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరిచారు. 12 డిపో మేనేజర్లకు వారి సౌలభ్యం కోసం ఖాతాలు తెరిచారు. ఈ ఖాతా నంబర్లకు పేటీఎం యాప్ సహకారంతో ప్రత్యేకంగా బార్కోడ్ ఏర్పాటు చేసి అనుసంధానం చేశారు. బార్ కోడ్‌ను కండక్టర్ మొబైల్లో ఇన్స్టాల్ చేస్తున్నారు. వాటి ద్వారా ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. మొబైల్ టికెట్ జారీలో సమస్య తెలుసుకుంటున్న ఆర్ఎం చిల్లర సమస్యకు చెక్.. బస్సు టికెట్ల జారీ సమయంలో చిల్లర సమస్యను ఆర్టీసీ దీర్ఘకాలికంగా ఎదుర్కొంటోంది. ఈ విషయంలో ప్రయాణికులు, కండక్టర్లు మధ్య తరచూ వాగ్వాదం జరుగుతుంటోంది. ఈ – టికెట్ విధానం దూర ప్రాంత సర్వీసులతోపాటు గ్రామీణ ప్రాంత రూట్లలోనూ అమల్లోకి వస్తే చిల్లర సమస్య పరిష్కారమైనట్లే. మొబైల్ యాప్ ద్వారా టికెట్ చార్జీలు వసూలు మనం వెళ్లే ప్రాంతం బస్సులు నిలిచే ప్లాంట్ ఫాం వద్దకు చేరుకొని అక్కడే ఉన్న కండక్టర్‌కు ఫలానా ఊరికి టికెట్ ఇవ్వమని చెబితే ప్రయాణికుడి సెల్ ఫోన్లోని మొబైల్ యాప్స్ ద్వారా కండర్టర్ సెల్లో ఉన్న బార్ కోడ్‌పై స్కాన్ చేస్తారు. అక్కడ ప్రయాణికుడు వెళ్లాల్సిన ఊరిపేరు ఎంటర్ చేయగానే ప్రయాణికుడి బ్యాంకింగ్ యాప్‌లో ఉన్న నగదు కట్ అవడం, ప్రయాణికుడి సెల్‌కు మెసేజ్ వెళ్లడం వెంటనే జరిగిపోతాయి. ఎక్కాల్సిన బస్సు డ్రైవర్‌కు మొసేజ్ చూపిస్తే చాలు.. సీటులో కూర్చొని ప్రయాణించే వీలు కల్పించారు. చదవండి: తిరుపతికి మరో మణిహారం త్వరలో ఈ టికెటింగ్ విధానం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెసేజ్ టికెటింగ్ విధానం అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలోని 12 డిపో మేనేజర్ల పేరున ప్రత్యేక ఖాతాలు తెరిచాం. పేటీఎం సహకారంతో బార్ కోడ్లు క్రియేట్ చేయించి వాటిని కండక్టర్ సెల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేయించాం. దీని ద్వారా ప్రయాణికులు పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, భీమ్ యూపీఐ వంటి బ్యాకింగ్ యాప్స్‌తో చార్జీ సొమ్ము బదిలీ చేసి ఈ టికెట్ పొంది, వాటి ఆధారంగా ప్రయాణం చేయవచ్చు. – టి. వెంకటరామం, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, కర్నూలు -
నోలైన్.. అన్నీ ఆన్లైన్
సాక్షి, హైదరాబాద్ : రవాణా శాఖ అందజేసే పౌర సేవలు మరింత సులభతరం కానున్నాయి. వాహన వినియోగదారులు ఆర్టీఏ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా ఇంటి నుంచే కొన్ని రకాల పౌర సేవలను పొందొచ్చు. ఇందుకు ఆర్టీఏ ప్రణాళికలను రూపొందించింది. మరో వారం, పది రోజుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. వాహనదారులు తమకు కావాల్సిన పౌరసేవల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్లతో పాటు వినియోగదారుల సెల్ఫీ, డిజిటల్ సంతకాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో వెంటనే వినియోగదారుల మొబైల్ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందుతుంది. వినియోగదారుల దరఖాస్తులను, డాక్యుమెంట్లను పరిశీలించిన వారం రోజుల వ్యవధిలో స్మార్ట్ కార్డులను స్పీడ్ పోస్టు ద్వారా ఇళ్లకు పంపిస్తారు. దరఖాస్తు చేసుకొనే సమయంలోనే ఫీజులు కూడా ఆన్లైన్లో చెల్లించాలి. లెర్నింగ్ లైసెన్సులు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల క్రయ విక్రయాలు వంటి వినియోగదారులు స్వయంగా రావాల్సిన పౌరసేవలు మినహాయించి సుమారు 17 రకాల సేవలను ఆన్లైన్ ద్వారా నేరుగా వినియోగదారులకు అందజేసేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ట్రయల్స్ సైతం పూర్తయ్యాయి. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానున్నాయి. ధ్రువీకరణ కోసమే సెల్ఫీ.. సాధారణంగా ప్రస్తుతం వివిధ రకాల పౌరసేవల కోసం వినియోగదారులు మొదట ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. ఆన్లైన్లో, ఈ–సేవా కేంద్రాల ద్వారా నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఫీజులు చెల్లించాలి. స్లాట్‌లో నమోదైన తేదీ, సమయం ప్రకారం ఆర్టీఏకు వెళ్లి పత్రాలను అధికారులకు అందజేయాలి. అక్కడే ఫొటో దిగి, డిజిటల్ సంతకం చేయాలి. దీంతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత వారం, 10 రోజులకు వినియోగదారుల ఇళ్లకే స్పీడ్ పోస్టు ద్వారా ధ్రువపత్రాలు అందజేస్తారు. వినియోగదారుల నిర్ధారణ కోసం ఫొటోలు, డిజిటల్ సంతకాలే కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ సేవల్లో వినియోగదారుల సెల్ఫీ, డిజిటల్ సంతకాన్ని తప్పనిసరి చేశారు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయాన్ని నియంత్రించేందుకు కూడా ఇది దోహదం చేస్తుంది. మరోవైపు నకిలీ డాక్యుమెంట్లను అరికట్టేందుకు కూడా కీలకం కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారికి ఎస్సెమ్మెస్ ద్వారా అందజేసే సమాచారంలో వినియోగదారులు కోరుకున్న సేవలను ధ్రువీకరిస్తూ ఒక నంబర్ కేటాయిస్తారు. ఒకవేళ ఆర్టీఏ ఆన్లైన్ సేవల్లో జాప్యం చోటు చేసుకున్నా, సాంకేతిక సమస్యలు తలెత్తినా ఈ నంబర్ ఆధారంగా వివరాలు పొందొచ్చు. ఏయే సేవలకు ఆన్లైన్.. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, 6 నెలల గడువు ముగిసిన లెర్నింగ్ లైసెన్సు కాలపరిమితి పొడిగింపు, లెర్నింగ్ లైసెన్స్‌లో ఒకటి కంటే ఎక్కువ వాహనాలకు అనుమతి కోరడం, వాహన రిజిస్ట్రేషన్ డూప్లికేట్ పత్రాలు, గడువు ముగిసిన వాటి రెన్యువల్స్, వివిధ రకాల డాక్యుమెంట్ల చిరునామాలో మార్పు, అంతర్రాష్ట్ర సేవలపైన తీసుకోవాల్సిసిన నిరభ్యంతర పత్రాలు (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), రవాణా వాహనాల పర్మిట్లు, త్రైమాసిక పన్ను చెల్లింపులు వంటి 17 రకాల సేవలను ఆన్లైన్ పరిధిలోకి తేనున్నారు. వాహనాల ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు వంటి వాటికి మాత్రం వినియోగదారులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. -
లాక్డౌన్ వేళ.. ఆన్లైన్ అర్చన
సాక్షి, హైదరాబాద్: దైవికమైన శుభసందర్భాలు, పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలు.. ఇలాంటి సందర్భాల్లో దేవాలయాలకు వెళ్లాలని భక్తులు భావిస్తారు. ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉన్నందున ఇది కుదరటం లేదు. దీంతో చాలామంది మానసిక ఆవేదనకు గురవుతున్నారు. దీన్ని గుర్తించిన దేవాదాయశాఖ.. భక్తులకు ఆలయ ప్రవేశం లేకున్నా, వారిపేరుతో పూజలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకుంటే, నిర్ధారిత జాబితాలోని కోరుకున్న దేవాలయంలో పూజలు నిర్వహించే ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ ఐటీ శాఖ రూపొందించిన యాప్ ద్వారా ఈ వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్లేస్టోర్‌లో యాప్‌ను రూపొందించింది. తొలుత ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి దేవాలయం, కర్మన్‌ఘాట్‌లోని ధ్యానాంజనేయస్వామి దేవాలయంలో బుధవారం నుంచీ ప్రారంభిస్తున్నారు. ఆపై రాష్ట్రంలోని ఇతర ముఖ్య ఆలయాల్లో ప్రారంభిస్తారు. ప్లేస్టోర్ ద్వారా ఈ వెసులుబాటు కల్పించేందుకు గూగుల్ మంగళవారం సమ్మతి తెలిపింది. భద్రాద్రి రామయ్య తలంబ్రాలు సిద్ధం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణాన్ని భక్తకోటి నేరుగా తిలకించలేకపోయింది. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూసి ఆనందపడింది. కానీ స్వామి తలంబ్రాల అక్షింతల కోసం వారు తపన పడుతున్నారు. ఇప్పుడు టీఎస్ యాప్ ఫోలియో ద్వారా కోరుకున్న వారికి వాటిని అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఐదు వేల తలంబ్రాల పొట్లాలను దేవాదాయశాఖ సిద్ధం చేసింది. యాప్ ద్వారా బుక్ చేసుకున్నవారికి తపాలా ద్వారా ఇంటికి అందిస్తారు. ఇందుకోసం తపాలాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని అందులో భద్రాచలం దేవాలయం తలంబ్రాల వివరాలు ఉన్న విండో ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసుకోవటం ద్వారా బుక్ చేసుకోవచ్చు. తలంబ్రాలకు గాను రూ.20, పోస్టల్ చార్జీ రూ.30, ఐటీ సర్వీస్ చార్జీ చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రత్యేకంగా ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చేందుకు తపాలాశాఖ సిబ్బంది, వాహనాలను సిద్ధం చేసింది. ఎలా బుక్ చేసుకోవాలి? గూగుల్ ప్లేస్టోర్ నుంచి టీఎస్ యాప్ ఫోలియోను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో దేవాలయాల వివరాలు ఉంటాయి. వాటిల్లో కావాల్సిన ఆలయంలో ఆర్జిత సేవను ఓపెన్ చేసి వివరాలు నమోదు చేయాలి. దాని ఆధారంగా ఆయా దేవాలయాల్లో భక్తుల పేర్లతో, వారు కోరుకున్న రోజున ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. ఆ వివరాలను తిరిగి వారి మొబైల్ ఫోన్‌కు సమాచారం రూపంలో అందిస్తారు. కుదిరితే పూజ అక్షింతలు, పసుపు కుంకుమ, డ్రైఫ్రూట్స్, మిశ్రీతో కూడిన ప్రసాదాన్ని కూడా అందించాలని తొలుత భావించారు. కానీ ప్రస్తుతం తపాలా, కొరియర్ సేవలు పరిమితంగానే ఉన్నందున ఇది సాధ్యం కాదని అనుకుంటున్నారు. -
‘ఉపకారా’నికి టీ–వ్యాలెట్!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతన పథకానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి అనే నిబంధనకు కాస్త బ్రేక్ పడింది. బ్యాంకు ఖాతా తెరవడం, దాని నిర్వహణ తదితర అంశాలు విద్యార్థులకు కాస్త ఇబ్బంది కలిగిస్తున్నాయనే ఆందోళన ఉండేది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన టీ–వ్యాలెట్ యాప్/ఆన్లైన్ సర్వీసు ద్వారా ఉపకారవేతనాలు పంపిణీ చేసేలా నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా గతేడాది అందుబాటులోకి తెచ్చింది. ఈ జిల్లాలోని విద్యార్థులు ఉపకారవేతనం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంకు ఖాతా నంబర్ బదులుగా టీ–వ్యాలెట్ బటన్ ను ఎంపిక చేసుకుంటారు. దరఖాస్తుదారు ఎంట్రీ చేసిన ఫోన్ నంబర్, విద్యార్థి పేరు ఆధారంగా టీ–వ్యాలెట్ రిజి స్ట్రేషన్ నంబర్ వస్తుంది. ఉపకారవేతనం విడుదలైన వెంటనే విద్యార్థి టీ–వ్యాలెట్ ఖాతాకు నిధులు జమవుతాయి. వీటిని సమీప మీ సేవా కేంద్రంలో విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. గతేడాది నిజామాబాద్ జిల్లాలో 32 వేల మంది విద్యార్థులు టీ–వ్యాలెట్ ఎంపిక చేసుకున్నారు. మరో నాలుగు జిల్లాల్లో.. నిజామాబాద్ జిల్లాలో టీ–వ్యాలెట్ ప్రాజెక్టు సత్ఫలితాలివ్వడంతో మరో నాలుగు జిల్లాల్లో కూడా ఇదే తరహాలో ఉపకారవేతనాలు ఇవ్వాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో టీ–వ్యాలెట్ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యాలెట్ ఆప్షన్ ఇస్తే మేలు.. ప్రస్తుతం ఉపకారవేతన దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. అయితే వివరాల్లో తప్పులు, మార్పులు ఉంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేసుకోవచ్చు. నిర్దేశించిన 4 జిల్లాలకు సంబంధించి వెబ్సైట్లో టీ–వ్యాలెట్ ఆప్షన్ యాక్టివేట్ చేస్తే విద్యార్థులంతా బ్యాంకు ఖాతాకు బదులుగా టీ–వ్యాలెట్ వివరాలు సమర్పించవచ్చు. కొత్తగా నాలుగు జిల్లాల్లో టీ–వ్యాలెట్ అమలుపై అతి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
‘క్యాష్‌లెస్’ సేవలు
సాక్షి, సిటీబ్యూరో: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సంస్కరణల్లో భాగంగా అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పూర్తి స్థాయి నగదు రహిత లావాదేవీ చేపట్టాలని నిర్ణయించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే స్థిరాస్తి రిజిస్ట్రేషన్లతో పాటు భూములకు సంబంధించిన ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ), సర్టిఫైడ్ కాపీ (సీసీ)ల జారీకి సైతం నగదు రహిత లావాదేవీలను ప్రారంభించిన రిజిస్ట్రేషన్ శాఖ తాజాగా రూ.1000 లోపు విలువైన సేవలు సైతం నగదు రహితంగా జరిపేందుకునిర్ణయం తీసుకుంది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖలో నగదు రహిత లావాదేవీల ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక టీ యాప్‌ను రూపొందించి అనుసంధానం చేశారు. మొబైల్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ ద్వారా రూ.2 వేల వరకు విలువైన లావాదేవీలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దీంతో ఇప్పటివరకు చిన్నపాటి లావాదేవీలను నగదు తీసుకుని పూర్తి చేసే విధానానికి కూడా బ్రేక్ పడనుంది. ఇక, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన ఏ పని అయినా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరగనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని చిక్కడపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా నగదు రహిత సేవలు అందిస్తున్నారు. 25 నుంచి పూర్తి స్థాయి అమలు రాష్ట్ర వ్యాప్తంగా గల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ నెల 25 నుంచి పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారం భం కానుంది. హిందు మ్యారేజ్, సొసైటీ రిజిస్ట్రేషన్, అప్డేట్, ఈసీ, సీసీ తదితర చిన్నచిన్న సేవలు సైతం నగదు రహిత విధానంలో అందనున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన టీయాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియలకు చెల్లింపులు జరుపవచ్చు. మొబైల్ యాప్ ద్వారా చెల్లింపులు జరిపిన నగదు రహిత సంబంధించిన సేవలను 30 రోజుల లోపు వినియోగించుకోవచ్చు. గడువు దాటితే నగదు రహిత చెల్లింపులు మురిగిపోయినట్లేని సంబంధిత శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఆన్లైన్.. ఆగమాగం
సాక్షి, చొప్పదండి : మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటికీ అప్‌గ్రేడ్ అయిన చొప్పదండిలో నూతన గృహ నిర్మాణదారులకు చిక్కులు తప్పడం లేదు. పురపాలన ప్రారంభమై ఆరునెలలు దాటినా ఇప్పటికీ ఒక్క నూతన నిర్మాణానికి కూడా అనుమతి రాకపోవడం పురపాలనలో నూతన గృహ నిర్మాణదారులకు తెచ్చిన కష్టాలను తెలియజేస్తోంది. ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం పురపాలనలో ఆన్లైన్ విధానం తీసుకువచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన చొప్పదండిలోనూ దీన్ని వర్తింపజేస్తున్నారు. దీంతో నూతన గృహ నిర్మాణ ఆశావహులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో దరఖాస్తులు గతంలో నూతన గృహ నిర్మాణదారులు పంచాయతీ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకొనేవారు. భూమిపూజ చేసుకొని ఇంటి నిర్మాణం ప్రారంభించాక కూడా పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో 2016 నుంచి ఆన్లైన్ ద్వారా నిర్మాణ అనుమతుల మంజూరు విధానం ప్రవేశపెట్టారు. నూతన నిర్మాణాలను చేపట్టేవారు లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అనుమతి వచ్చాకే నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు నిర్మాణాలను రూపొందించాలంటే ఇండ్లు కట్టడం పలువురికి గగనంగా మారింది. ఇబ్బందిగా నిబంధనలు మున్సిపల్ నూతన చట్టంలోని నిబంధనలు చిన్న స్థలాలు కలిగిన గృహ నిర్మాణదారులకు ఇబ్బందిగా పరిణమించాయి. జీవో 168 ప్రకారం మున్సిపాలిటీల్లో ఇండ్లు నిర్మాణం చేసే వారికి పలు నిబంధనలు రూపొందించారు. దీంతో గృహ నిర్మాణదారులు ఆన్లైన్లో లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా దరఖాస్తు చేసేందుకే రూ. పదివేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక అనుమతి వచ్చేందుకు ఫీజులు ఏ మేరకు బాదుతారో తెలియని పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు నిర్ధేశించిన ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణదారులకు వచ్చిన మొదటి ఇబ్బంది రోడ్ల వెడల్పుతోనే. గతంలో తొమ్మిది ఫీట్ల నుంచి మొదలుకొని పన్నెండు ఫీట్ల రోడ్లనే ఎక్కువగా గ్రామస్తులు ఉపయోగించేవారు. నిర్మాణ అనుమతుల సమయంలో రోడ్లు ముప్పై అడుగులు ఉంటేనే అనుమతి ఇస్తారు. పైగా మూడు అడుగులు సెట్ బ్యాక్ కోసం కూడా వదులాల్సి ఉంటుంది. దీంతో ఉన్న స్థలమంతా రోడ్లకే పోతే తాము ఎక్కడ నిర్మాణాలు చేయాలని చిన్న చిన్న ప్లాట్లు గల యజమానులు వాపోతున్నారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీ నుంచి ఒక్క అనుమతి కూడా ఇవ్వకపోగా, దరఖాస్తులు మాత్రం అయిదు వరకు వచ్చినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. దీంతో మున్సిపాలిటీ ఏర్పడిన ఆరునెలల్లో ఒక్క అనుమతి కూడా బయటకు వెళ్లక పోవడంతో ఇండ్ల నిర్మాణాలు చేసేదెట్లా అంటూ నిర్మాణ ఆ శావహకులు లబోదిబో మంటున్నారు. రెండేళ్లుగా కొనసాగుతోంది రెండేళ్లుగా మున్సిపాలిటీల్లో ఆన్లైన్ విధానం కొనసాగుతోంది. తమకు డిజిటల్ కీ రావడానికి ఆలస్యమైంది. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉండటం వల్ల నిబంధనలను ఖచ్చితంగా పాటించేందుకు దోహదపడుతోంది. మున్సిపల్ చట్టం ప్రకారం మేము వ్యవహరిస్తాం. – రాజేందర్ కుమార్, కమిషనర్ -
వడ్డీ తక్కువ.. మోసాలెక్కువ..!
సాక్షి,సిటీబ్యూరో: ’హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్న సురేష్ రూ.10 లక్షల రుణం పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. ఓ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ యవతి అతడికి ఫోన్‌చేసింది. రుణం మంజూరుకు ఆస్తి తనఖా పత్రాలతోపాటు రూ.50 వేలు నగదు చెల్లించాలని కోరింది. ఆ తరవాత ఆదాయ పన్ను పేరుతో మరో రూ.70 వేలు చెల్లించాలని కోరడంతో ఆమొత్తాన్ని చెల్లించారు. ఇలా పక్షం రోజుల్లో రూ.1.20 లక్షలు చెల్లించిన సురేష్‌కు అనుమానం వచ్చింది. రుణం ఎప్పడు మంజూరు చేస్తారని గట్టిగా నిలదీయడంతో చెక్కులు త్వరలో పంపుతామని చెప్పింది. ఆ తర్వాత రెండురోజులకు ఫోన్‌చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన సురేష్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు’. ఇది సురేష్ ఒక్కరి సమస్యే అని భావిస్తే పొరపాటే..ఇటీవలి కాలంలో గ్రేటర్ నగరంలో ఐటీ, బీపీఓ, కెపిఓ, ఫార్మా, బల్క్‌డ్రగ్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఫోన్నెంబర్లను ఆయా సంస్థల వెబ్సైట్ల నుంచి సేకరిస్తున్న సైబర్‌నేరగాళ్లు తక్కువ వడ్డీలకు రుణాల పేరుతో సిటీజన్లకు ఎరవేస్తున్నారు. గత ఆరునెలలుగా సుమారు 25 మంది వరకు బాధితులు రూ. కోటికి పైగా మోసపోయినట్లు సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. తక్కువ వడ్డీ ..మోసాలు ఇలా.. ♦ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బిజీగా ఉంటున్న సిటీజన్లకు సైబర్ నేరగాళ్లు.. రూ.100కు పావలావడ్డీ మాత్రమేనని, రుణ వాయిదాలు కూడా అధికమే నంటూ ఆన్లైన్లో అప్పుల వల విసురుతున్నారు. ♦ నెట్వర్క్ సైట్లు, ఛారిటీ ట్రస్టులు, బ్యాంకిం గేతర ఆర్థిక సంస్థల పేరు చెప్పి ఆకర్షణీయమైన రుణ జారీ విధానాలను తెలియజేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ♦ నగరంలోని ఐటీ, బీపీఓ, కెపిఓ, బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీల ఉద్యోగుల వివరాలు, ఫోన్‌నెంబర్లు సేకరించి వారికి టోకరా వేస్తున్నారు. ♦ గత ఆరునెలలుగా సుమారు రూ.కోటికి పైగా ఇలాంటి సంస్థలు స్వాహా చేసినట్లు తేలింది. ♦ ఈ ముఠాలు ఢిల్లీ, నోయిడా, చెన్నై, బెంగ ళూరు తదితర నగరాలే కేంద్రంగా ఇలాంటి సంస్థలు పనిచేస్తున్నాయి. అప్రమత్తతే కీలకం.. ఏదేని రుణజారీ సంస్థ ముందుగా సంబంధిత ధ్రువపత్రాల ప్రతులను మాత్రమే అడుగుతుందని..ప్రాసెసింగ్ ఫీజులు సైతం నామమాత్రంగానే ఉంటాయని బ్యాంకింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముందుగా సెక్యూరిటీ డిపాజిట్లు, ఇన్‌కంట్యాక్స్ ఇలా రకరకాల పేర్లతో డిపాజిట్లు సేకరించబోవని సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్‌చేసి రుణం ఎరవేస్తే మీ పూర్తి వివరాలను, అవసరాలు తెలపరాదని..బ్యాంకు ఖాతాల నెంబర్లను షేర్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. రుణం జారీకి సంబంధించి సంబంధిత బ్రాంచీల్లో నేరుగా మేనేజర్ లేదా ఇతర ఉన్నతాధికారులను సంప్రదించి స్పష్టత తీసుకోవాలని సూచిస్తున్నారు. రుణం తీసుకోబోయే ముందు రుణజారీ పత్రాలపై గుడ్డిగా సంతకాలు చేయకుండా సంబంధిత విధివిధానాలను, షరతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరవాతే రుణాలు పొందాలని సూచిస్తున్నారు. రుణం జారీ చేసేకంటే ముందుగా వేలాదిరూపాయల నగదు చెల్లించాలని కోరితే వెంటనే అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేస్తున్నారు. -
‘డిగ్రీ’ కాలేజీ మార్పునకు మరో చాన్స్!
సాక్షి, హైదరాబాద్ : డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) కమిటీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కాలేజీల్లో చేరిన, మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులు మరోసారి ఆప్షన్లకు అవకాశమివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు జిల్లాల్లోని డిగ్రీ కాలేజీల్లో ఏర్పాటు చేసిన 74 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో విజ్ఞాపనలు స్వీకరించనున్నట్లు సమాచారం. కొన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు తమ తల్లిదండ్రుల నుంచి వన్‌టైమ్ పాస్వర్డ్ తీసుకొని తమ కాలేజీల్లో సీట్లు వచ్చేలా ఆప్షన్లు ఇచ్చారని, ఫలితంగా ఇష్టం లేని కాలేజీల్లో సీట్లొచ్చాయని దాదా పు 2 వేల మంది విద్యార్థులు ఇటీవల హైదరాబాద్ లోని దోస్త్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో వారికి రెండో దశలో ఆప్షన్లకు అవకాశమిచ్చిన దోస్త్.. వారితోపాటు అన్ని జిల్లాల విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు అన్ని జిల్లాల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చింది. హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సమస్య పరిష్కారం కాకపోతే హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ సహకారంతో విజ్ఞప్తుల కాపీని స్కాన్ చేయించి హైదరాబాద్ కళాశాల విద్యా కమిషనర్ కార్యాలయంలోని సూపర్ హెల్ప్‌లైన్ కేంద్రానికి పంపితే సమస్య పరిష్కరించి మూడో దశలో ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపట్టనున్నారు. 84 వేల మందికీ అవకాశం మొదటి దశ ప్రవేశాలల్లో సీట్లు పొందిన 84 వేల మంది విద్యార్థులకు కూడా ఈ అవకాశం కల్పించాలని దోస్త్ నిర్ణయించినట్లు తెలిసింది. విద్యార్థులు ఇచ్చిన మొదటి ఆప్షన్ ప్రకారమే వారికి సీట్లు లభించినందున రెండో దశ కౌన్సెలింగ్‌లో వారికి అవకాశం ఇవ్వలేదు. కానీ విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మొదటి దశలో సీట్లు వచ్చిన వారు కూడా కాలేజీ మార్చుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఇందుకు దోస్త్ వెబ్సైట్లో పేర్కొన్న హెల్ప్‌లైన్ కేంద్రాల్లో విజ్ఞప్తి చేసేలా చర్యలు చేపట్టింది. -
‘ఈ’–జిల్లా!
సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ జిల్లాను ‘ఈ–జిల్లా’గా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. కాగిత రహిత, జాప్యంలేని సేవలు అందించడం ద్వారా ప్రజల మెప్పు పొందాలని భావిస్తోంది. ఇప్పటికే కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఎలక్ట్రానిక్, ఆన్లైన్ పద్ధతుల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలను కూడా పూర్తిస్థాయి ఈ–ఆఫీసులుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు కొనసాగుతోంది. ఈ మేరకు ప్రతి ఆఫీసు నుంచి ఈ–ఆఫీస్‌కు అవసరమైన ప్రతిపాదనలు కోరుతూ వర్తమానం పంపించారు. ఆఫీసుకు మంజూరైన పోస్టులు, పోస్టుల వారీగా ఎన్ని కంప్యూటర్లు అవసరం, ఎన్ని ఫైళ్లు స్కాన్ చేయాలి తదితర వివరాలతో ప్రతిపాదనలు తయారు చేసి సంబంధిత హెచ్ఓడీలకు పంపాల్సిందిగా సూచించారు. మొదట ఆయా విభాగాల్లోని ఫైళ్లను పూర్తిగా స్కాన్ చేసి..ఆన్‌లైన్‌లోకి అప్లోడ్ చేస్తారు. తద్వారా అన్ని కార్యకలాపాలు ఆన్లైన్లో నిర్వహించడానికి అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు రెవెన్యూ విభాగంలో ఇప్పటికే ఉత్తర ప్రత్యుత్తరాలు, సేవలు ఎలక్ట్రానిక్ మెథడ్‌లోనే జరుగుతున్నాయి. కలెక్టరేట్లో పూర్తిస్థాయిలో... జిల్లా కలెక్టరేట్ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ఈ–ఆఫీస్ పద్ధతిలోనే నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేసింది. జూన్ ఒకటి నుంచి ఈ–ఆఫీస్‌ను అమలు పర్చనున్నట్లు ఇటీవల కలెక్టర్ యోగితా రాణా వెల్లడించిన విషయం విదితమే. ఇప్పటికే కొన్ని పరిపాలన పరమైన అంశాలపై ఉత్తర ప్రత్యుత్తరాలు ఆన్లైన్ ద్వారానే కొనసాగుతున్నాయి. కాగా, కలెక్టరేట్లోని అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు ఈ–ఆఫీస్ నిర్వహణను పూర్తి స్థాయిలో ఆచరించాల్సిందేని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానాన్ని మానిటరింగ్ చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీవత్స కోటకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఫైళ్లన్నీ చకచకా స్కానింగ్ చేస్తున్నారు. వీటిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. పెండింగ్‌కు చెక్ పాలన పరమైన వ్యవహారాల్లో ఈ–ఆఫీస్ అమలుతో వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన ఫైళ్లకు మోక్షం లభించే అవకాశాలుంటాయని అధికారయంత్రాంగం భావిస్తోంది. అదేవిధంగా ప్రజా సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం, దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయవచ్చని యోచిస్తోంది. ముఖ్యంగా పారదర్శకతతో సమస్యల పరిష్కారంలో వేగం కూడా పెరుగుతుందని భావిస్తోంది. దీంతో ముందుగా కలెక్టరేట్లో పూర్తి స్థాయి అమలు శ్రీకారం చుడుతోంది. అ తర్వాత రెవెన్యూ యంత్రాంగంలో క్షేత్ర స్థాయి నుంచి ఈ– ఆఫీస్ అమలుకు ప్రయత్నం ప్రారంభిస్తారు.