సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు లెక్కలు దాచి చుక్కలు చూపిస్తోంది. చందాదారుల ఖాతావివరాలను తెలుసుకునేందుకు ఉన్న ఈ–పాస్‌బుక్ ఆప్షన్ సేవలను ఈపీఎఫ్‌వో నిలిపివేసింది. ఈ–పాస్‌బుక్ సర్వీసు కోసం లాగిన్ అయ్యేందుకు వెబ్‌సైట్‌లో పేజీని తెరవగానే ‘ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత పాస్‌బుక్ సర్వీసులు పునరుద్ధరిస్తాం’అని ప్రత్యక్షమవుతోంది.
కొన్నిరోజులుగా ఇదే సూచన ప్రత్యక్షమవుతోందని ఖాతా దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఉద్యోగికి భవిష్యనిధి అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం. ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీ నెలవారీ చందా జమచేస్తున్న వివరాలు మొదలు భవిష్యనిధిలో ఉన్న మొత్తం, ఈ నిధిపై వస్తున్న వడ్డీకి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం హక్కుగా భావిస్తారు. నగదు నిల్వలు, వడ్డీ డబ్బులతో భవిష్యత్ కార్యకలాపాలకు సైతం ప్రణాళిక రచించుకుంటారు.
రెండేళ్లుగా వడ్డీ ఏమైంది?
వడ్డీ జమ అయ్యిందా?.. అనేది అత్యధిక ఈపీఎఫ్ చందాదారుల్లో తలెత్తుతున్న ప్రశ్న. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన నెల, రెండు నెలల్లో ఈపీఎఫ్‌వో చందాదారుల ఖాతాలో వడ్డీ నిధిని జమ చేస్తుంది. ఈ మేరకు ఖాతా రికార్డుల్లో లెక్కలు పేర్కొంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల్లో కంటే ఎక్కువ మొత్తంలో వడ్డీ ఈపీఎఫ్‌వో ద్వారా వస్తుండటంతో చందాదారులు పీఎఫ్ నగదును ఉపసంహరించుకోవడానికి ఇష్టపడరు.
ఇంతటి కీలకమైన ఈపీఎఫ్ ఖాతాలోని వడ్డీ డబ్బులకు సంబంధించిన సమాచారంగత రెండేళ్లుగా అందుబాటులో లేదంటూ చందాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ నిధిపై స్పష్టత లేదని చందాదారులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2022–23 సంవత్సరంలో వడ్డీ శాతంపైనా ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment