సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) చందాదారులకు అధిక పెన్షన్ ఆప్షన్ గడువు ఈనెల 3వ తేదీతో ముగుస్తోంది. కానీ ఇప్పటికీ వెబ్‌సైట్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలు తీరలేదు. అధిక పెన్షన్ అర్హత అవకాశాలు, అధిక పెన్షన్ లెక్కింపు సూత్రం తేలలేదు. కొత్త పాస్‌బుక్ డౌన్‌లోడ్‌కు ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ అంశాలను ఈపీఎఫ్‌ఓ అధికారులకు విన్నవించినా స్పందన లేదు. చాలా మంది చందాదారులు అధిక పెన్షన్‌కు దరఖాస్తు సైతం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్‌ఓ అధిక పెన్షన్‌కు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. తొలుత ఆప్షన్ ఇచ్చేందుకు మార్చి 3 వరకు గడువు పెట్టగా.. తర్వాత చందాదారుల విజ్ఞప్తులు, సాంకేతిక కారణాల నేపథ్యంలో గడువును మే3 వరకు పొడిగించింది.
పాస్‌బుక్.. ఎర్రర్..
పీఎఫ్ ఖాతాదారుల కోసం ఈపీఎఫ్‌ఓ సరికొత్త పాస్‌బుక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగి సర్వీసులో చేరిన తేదీ, నాటి బేసిక్, డీఏ ఆధారంగా పీఎఫ్ చెల్లింపులు, సర్విసు, మార్పులు, చేర్పులకు సంబంధించిన పలు అంశాలను జోడిస్తూ ఈ పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేసింది. దాదాపు నెలన్నర నుంచి కొత్త పాస్‌బుక్‌లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. చందాదారులు యూఏఎన్ నంబర్ ద్వారా లాగిన్ అయి.. కొత్త పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
కానీ చాలామంది చందాదారులకు లాగిన్ అయ్యాక పాస్‌బుక్ డౌన్‌లోడ్ అప్షన్ ఎంచుకుంటే వెబ్‌పేజీ ఎర్రర్ వస్తోంది. చాలాసార్లు ప్రయత్నించినా డౌన్‌లోడ్ కావడం లేదు. అధిక పెన్షన్‌లో కీలకమైంది ఈపీఎస్ (ఎంప్లాయి పెన్షన్ స్కీం) చెల్లింపునకు సంబంధించిన సమాచారమే. ఉద్యోగి పొందుతున్న పూర్తిస్థాయి వేతనానికి అనుగుణంగా ఈపీఎస్ చెల్లించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.
ఒకవేళ చెల్లింపుల్లో తేడాలుంటే అందుకు సంబంధిత కంపెనీ బాధ్యత వహించి చెల్లింపులు సర్దుబాటు చేయాలి. కొత్త పాస్‌బుక్‌లు డౌన్‌లోడ్ కాకపోవడంతో.. చాలామంది అధికపెన్షన్ దరఖాస్తు చేయలేకపోతున్నారు.
ఎన్నో సమస్యలు
మరోవైపు పేరా 26(6) ఆప్షన్ ఫారం (ఉద్యోగంలో చేరినప్పుడు అధిక పెన్షన్ ఆప్షన్ ఎంపిక పత్రం)ను ఇప్పుడు అధిక పెన్షన్ దరఖాస్తుకు తప్పకుండా జోడించాలని నిబంధన పెట్టారు. ఉద్యోగంలో చేరి చాలా ఏళ్లు గడిచిన వారికి ఈ ఫారం అందుబాటులో లేక దరఖాస్తు చేసుకోలేదు.
వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేస్తున్న సమయంలోనూ సాంకేతిక సమస్యలతో మొరాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ఈపీఎఫ్‌ఓ అధికారులకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. దరఖాస్తులకు మరింత సమయం ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. ఈపీఎఫ్‌ఓ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment