passbook
-
ఏసీబీ వలకు చిక్కిన మావల తహసీల్దార్
ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ జిల్లా మావల తహసీల్దార్ ఆరిఫా సుల్తానా, ఆర్ఐ హన్మంత్‌రావు ఆదివారం ఏసీబీ వలలో చిక్కుకున్నారు. మావల పట్టణ శివారులోని వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టా పాస్‌బుక్‌లో పేరు సవరణ కోసం రైతుల నుంచి రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన నిర్మల్కర్ సుధాకర్‌తోపాటు ఆయన కుటుంబీకులకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా మావల శివారు సర్వే నంబర్ 181లో 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఒక్కొక్కరి పేరిట మూడున్నర ఎకరాలు ఉన్నాయి. వీరు యతేంద్రనాథ్ యాదవ్‌ను రిప్రజెంటర్‌గా ఉంచారు. పట్టా పాస్‌బుక్‌లలో పేర్లకు సంబంధించి మార్పుల కోసం 2023, ఏప్రిల్ 13న మావల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్ ఆరీఫా సుల్తానాను కలిసి పనులు పూర్తి చేయాలని విన్నవించారు. ఈ క్రమంలో ఆర్ఐ హన్మంత్‌రావు వారిని రూ.20 లక్షలు డిమాండ్ చేశాడు. మొదట రూ.2 లక్షలు ఇవ్వాలని సూచించగా, యతేంద్రనాథ్ ఈ నెల 21న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డబ్బులు ముట్టజెబుతుండగా ఏసీబీ అధికారులు తహసీల్దార్, ఆర్ఐలను పట్టుకున్నారు. వీరిని కరీంనగర్ ఏసీబీ కోర్టుకు రిమాండ్ కోసం తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. -
60 ఏళ్లనాటి పాత బుక్ కోటీశ్వరున్ని చేసింది - ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
జీవితం ఎప్పుడు, ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. కుబేరుడు బిచ్చగాడు కావచ్చు, బిచ్చగాడు కుబేరుడు కావచ్చు. కొన్ని సందర్భాల్లో కటిక పేదరికంలో ఉన్నవాళ్లు కూడా ఒక్క రోజులోనే ధనవంతులుగా మారిగా సందర్భాలు గతంలో కోకొల్లలు. ఇలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. చిలీ ప్రాంతానికి చెందిన 'ఎక్సెక్వియెల్ హినోజోసా' (Exequiel Hinojosa) జీవితంలో ఇదే జరిగింది. ఇతడు ఇంటిని శుభ్రపరుస్తున్న సమయంలో ఒక పాత పుస్తకం కనిపించింది. మొదట ఇదేదో పనికిరాని బుక్ అనుకున్నాడు. ఆ తరువాత క్షణ్ణంగా పరిశీలించగా.. అతని అతని తండ్రికి చెందిన ఒక బ్యాంక్ పాస్‌బుక్ అని అర్థమైంది. బ్యాంక్ పాస్‌బుక్.. నిజానికి ఆ బ్యాంక్ పాస్‌బుక్ అతని తండ్రికి తప్పా ఇంకెవరికీ తెలియకపోవడం గమనార్హం. ఆ పాస్‌బుక్ 1960-70 కాలానికి చెందినట్లు గుర్తించాడు. అందులో అప్పట్లోనే సుమారు 1.40 లక్షల చిలియన్ పెసోస్ (Chilean pesos) డిపాజిట్ చేసినట్లు తెలిసింది. ఆ డబ్బు విలువ ఇప్పుడు కోట్ల రూపాయలకు సమానం. ఆ డబ్బుని ఎక్సెక్వియెల్ హినోజోసా విత్‌డ్రా చేసుకోవాలనుకున్నారు. అయితే అతని ఎంక్వైరీలో ఆ అకౌంట్ చాలా రోజులకు ముంచు క్లోజ్ అయినట్లు తెలిసింది. అంతలో అతని ఆశలు ఆవిరపోయాయి. మొత్తం మీద డబ్బు తిరిగి పొందటం కష్టమని చాలామంది వెల్లడించారు. కానీ అతని పట్టు వదలకుండా ప్రయత్నించాడు. ఇదీ చదవండి: ఫుడ్ ఆర్డర్ బిల్ చూసి ఖంగుతిన్న మహిళ - జొమాటో రిప్లై ఇలా.. స్టేట్ గ్యారెంటీడ్.. ఆ బ్యాంకు పాస్‌బుక్‌లో స్టేట్ గ్యారెంటీడ్ అని ఉండటం గమనించాడు. అంటే డబ్బుని బ్యాంకు ఇవ్వని పక్షంలో, కస్టమర్‌కి ఆ డబ్బు తిరిగి అందేలా ప్రభుత్వం సహాయం చేస్తుందని అర్థం. కానీ ప్రభుత్వం కూడా ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. చివరికి చేసేదిలేక కోర్టుని ఆశ్రయించాడు. ఇదీ చదవండి: ఇలా చేస్తే ఏడాదికి 60 లక్షల ఆదాయం! 10 ఏళ్ల వరకు గ్యారెంటీ! ఆ డబ్బు తన తండ్రి డిపాజిట్ చేసయినట్లు, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వాదించి.. చివరకు 1 బిలియన్ చిలీ పెసోస్ ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే ఇది 1.2 మిలియన్ డాలర్లకు సమానం (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 10 కోట్లు). దీంతో దెబ్బకు ఇతడు కోటీశ్వరుడయ్యాడు. -
అధిక పెన్షన్ ఆప్షన్‌కు ఆఖరు మే 3.. కానీ పాస్‌బుక్ ఎర్రర్! ఇలా అయితే ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు అధిక పెన్షన్ ఆప్షన్ గడువు ఈనెల 3వ తేదీతో ముగుస్తోంది. కానీ ఇప్పటికీ వెబ్సైట్లో నెలకొన్న సాంకేతిక సమస్యలు తీరలేదు. అధిక పెన్షన్ అర్హత అవకాశాలు, అధిక పెన్షన్ లెక్కింపు సూత్రం తేలలేదు. కొత్త పాస్‌బుక్ డౌన్‌లోడ్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ అంశాలను ఈపీఎఫ్ఓ అధికారులకు విన్నవించినా స్పందన లేదు. చాలా మంది చందాదారులు అధిక పెన్షన్‌కు దరఖాస్తు సైతం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్‌కు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. తొలుత ఆప్షన్ ఇచ్చేందుకు మార్చి 3 వరకు గడువు పెట్టగా.. తర్వాత చందాదారుల విజ్ఞప్తులు, సాంకేతిక కారణాల నేపథ్యంలో గడువును మే3 వరకు పొడిగించింది. పాస్‌బుక్.. ఎర్రర్.. పీఎఫ్ ఖాతాదారుల కోసం ఈపీఎఫ్ఓ సరికొత్త పాస్‌బుక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగి సర్వీసులో చేరిన తేదీ, నాటి బేసిక్, డీఏ ఆధారంగా పీఎఫ్ చెల్లింపులు, సర్విసు, మార్పులు, చేర్పులకు సంబంధించిన పలు అంశాలను జోడిస్తూ ఈ పాస్‌బుక్‌ను అప్డేట్ చేసింది. దాదాపు నెలన్నర నుంచి కొత్త పాస్‌బుక్‌లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. చందాదారులు యూఏఎన్ నంబర్ ద్వారా లాగిన్ అయి.. కొత్త పాస్‌బుక్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ చాలామంది చందాదారులకు లాగిన్ అయ్యాక పాస్‌బుక్ డౌన్లోడ్ అప్షన్ ఎంచుకుంటే వెబ్‌పేజీ ఎర్రర్ వస్తోంది. చాలాసార్లు ప్రయత్నించినా డౌన్లోడ్ కావడం లేదు. అధిక పెన్షన్‌లో కీలకమైంది ఈపీఎస్ (ఎంప్లాయి పెన్షన్ స్కీం) చెల్లింపునకు సంబంధించిన సమాచారమే. ఉద్యోగి పొందుతున్న పూర్తిస్థాయి వేతనానికి అనుగుణంగా ఈపీఎస్ చెల్లించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒకవేళ చెల్లింపుల్లో తేడాలుంటే అందుకు సంబంధిత కంపెనీ బాధ్యత వహించి చెల్లింపులు సర్దుబాటు చేయాలి. కొత్త పాస్‌బుక్‌లు డౌన్లోడ్ కాకపోవడంతో.. చాలామంది అధికపెన్షన్ దరఖాస్తు చేయలేకపోతున్నారు. ఎన్నో సమస్యలు మరోవైపు పేరా 26(6) ఆప్షన్ ఫారం (ఉద్యోగంలో చేరినప్పుడు అధిక పెన్షన్ ఆప్షన్ ఎంపిక పత్రం)ను ఇప్పుడు అధిక పెన్షన్ దరఖాస్తుకు తప్పకుండా జోడించాలని నిబంధన పెట్టారు. ఉద్యోగంలో చేరి చాలా ఏళ్లు గడిచిన వారికి ఈ ఫారం అందుబాటులో లేక దరఖాస్తు చేసుకోలేదు. వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తున్న సమయంలోనూ సాంకేతిక సమస్యలతో మొరాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ఈపీఎఫ్ఓ అధికారులకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. దరఖాస్తులకు మరింత సమయం ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. ఈపీఎఫ్ఓ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. -
పీఎఫ్ ఈ-పాస్‌బుక్ డౌన్లోడ్ కావడం లేదా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. అనేక మంది ఈపీఎఫ్ సభ్యులు ఈ-పాస్‌బుక్‌లను డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు. ఈ-పాస్‌బుక్ పేజీపై క్లిక్ చేసిన చాలా మంది ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు 404 ఎర్రర్ కనిపిస్తోంది. దీంతో ‘నాట్ ఫౌండ్’ అని ఒక సందేశం కూడా వస్తోంది. ఇదీ చదవండి: మాకు కన్నీళ్లు.. వాళ్లకు కోట్ల కొద్దీ బోనస్‌లా? జుకర్‌బర్గ్‌ను నిలదీసిన ఉద్యోగులు సర్వర్ సమస్య కారణంగా ఈపీఎఫ్‌వో పోర్టల్ ఈ-పాస్‌బుక్ సౌకర్యం వినియోగదారులకు అందుబాటులో లేనట్లు కనిపిస్తోంది. దీంతో విసుగెత్తిపోయిన కొంత మంది సభ్యులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్లో సమస్యను హైలైట్ చేస్తూ ఈపీఎఫ్‌వో హ్యాండిల్‌ను ట్యాగ్ చేశారు. దీనిపై ఈపీఎఫ్‌వో స్పందిస్తూ ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొంది. కాగా రెండు వారాలుగా ఈ-పాస్‌బుక్ సౌకర్యం పనిచేయడం లేదని ఖాతాదారులు చెబుతున్నారు. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోండి.. ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో ఈ-పాస్‌బుక్ సౌకర్యం ప్రస్తుతం అందుబాటులో లేని నేపథ్యంలో వినియోగదారులు UMANG యాప్, ఎస్సెమ్మెస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా తమ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి “EPFOHO UAN” అని SMS పంపడం ద్వారా లేదా 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ని తెలుసుకోవచ్చు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
ఏదైనా సాయంత్రం 5 తర్వాతే..
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) చందాదారులకు లెక్కలు దాచి చుక్కలు చూపిస్తోంది. చందాదారుల ఖాతావివరాలను తెలుసుకునేందుకు ఉన్న ఈ–పాస్‌బుక్ ఆప్షన్ సేవలను ఈపీఎఫ్‌వో నిలిపివేసింది. ఈ–పాస్‌బుక్ సర్వీసు కోసం లాగిన్ అయ్యేందుకు వెబ్సైట్లో పేజీని తెరవగానే ‘ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత పాస్‌బుక్ సర్వీసులు పునరుద్ధరిస్తాం’అని ప్రత్యక్షమవుతోంది. కొన్నిరోజులుగా ఇదే సూచన ప్రత్యక్షమవుతోందని ఖాతా దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఉద్యోగికి భవిష్యనిధి అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం. ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీ నెలవారీ చందా జమచేస్తున్న వివరాలు మొదలు భవిష్యనిధిలో ఉన్న మొత్తం, ఈ నిధిపై వస్తున్న వడ్డీకి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం హక్కుగా భావిస్తారు. నగదు నిల్వలు, వడ్డీ డబ్బులతో భవిష్యత్ కార్యకలాపాలకు సైతం ప్రణాళిక రచించుకుంటారు. రెండేళ్లుగా వడ్డీ ఏమైంది? వడ్డీ జమ అయ్యిందా?.. అనేది అత్యధిక ఈపీఎఫ్ చందాదారుల్లో తలెత్తుతున్న ప్రశ్న. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన నెల, రెండు నెలల్లో ఈపీఎఫ్‌వో చందాదారుల ఖాతాలో వడ్డీ నిధిని జమ చేస్తుంది. ఈ మేరకు ఖాతా రికార్డుల్లో లెక్కలు పేర్కొంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల్లో కంటే ఎక్కువ మొత్తంలో వడ్డీ ఈపీఎఫ్‌వో ద్వారా వస్తుండటంతో చందాదారులు పీఎఫ్ నగదును ఉపసంహరించుకోవడానికి ఇష్టపడరు. ఇంతటి కీలకమైన ఈపీఎఫ్ ఖాతాలోని వడ్డీ డబ్బులకు సంబంధించిన సమాచారంగత రెండేళ్లుగా అందుబాటులో లేదంటూ చందాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ నిధిపై స్పష్టత లేదని చందాదారులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2022–23 సంవత్సరంలో వడ్డీ శాతంపైనా ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. -
ఏటీఎం అనుకుని ఎంత పని చేశారు.. చూసుకోవాలి కదా !
మైసూరు: లక్షల్లో డబ్బులు ఉన్న ఏటీఎం యంత్రం అనుకుని దొంగలు పాస్‌బుక్‌ను ప్రింట్ చేసే యంత్రాన్ని ఎత్తుకెళ్లారు. ఈ తికమక సంఘటన మైసూరు నగరంలోని లష్కర్ మహల్లాలో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎం సెంటర్లో చోటు చేసుకుంది. దొంగలు చోరీ చేసే హడావుడిలో ఏటీఎం యంత్రం అనుకుని పాస్‌బుక్ ప్రింటింగ్ యంత్రాన్ని పెకలించుకుని తీసుకెళ్లారు. సిబ్బంది ఏటీఎంను రెండురోజుల పాటు మూసి ఉంచారు. గురువారం ఉదయం తెరిచి చూసిన సెక్యూరిటీ గార్డు ఆ యంత్రం లేకపోవడం చూసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. కాగా, మండ్య, మైసూరు ప్రాంతాల్లో తరచూ ఏటీఎంలను దొంగలు ఎత్తుకెళ్లడం గమనార్హం. చదవండి: Hyderabad: ఎవరికైనా చెబితే చంపేస్తా.! -
ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూమి హక్కులు, పట్టాదార్ పాస్‌బుక్ చట్టం.. రాజ్యాంగంలోని ఆర్టికల్–14కు విరుద్ధమంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ)లకు ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. భూమి హక్కు లు, పట్టాదార్ పాస్‌బుక్ చట్టం రాజ్యాంగవిరుద్ధమని ప్రకటించాలంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి సి.దామోదర రాజనర్సింహ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ చట్టం లో లోపాలు ఉన్నాయని, వ్యవసాయ భూముల విషయంలో సేల్, గిఫ్ట్, మార్టిగేజ్, ఎక్సే్ఛంజ్ మినహా డీడ్ రద్దు, భాగాన్ని వదులుకునే (రీలిక్విష్‌మెంట్ డీడ్) అవకాశం కల్పించలేద ని పిటిషనర్ తరఫున న్యా యవాది ఎల్.వాణి వాదన లు వినిపించారు. ఓఆర్సీ ద్వారా హక్కులు పొందితే రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేయడానికి వీల్లేదని తెలిపారు. కొత్త చట్టం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తి స్తుందని రెవెన్యూ శాఖ తరఫు న్యాయవాది భాస్కర్‌రెడ్డి నివేదించారు. పిటిషనర్ అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. -
పాస్‌పుస్తకం కోసం రైతు వినూత్న నిరసన
మణుగూరు టౌన్: భూమి పట్టా పాస్‌పుస్తకం కోసం ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మల్లారం రెవె న్యూ గనిబోయినగుంపు సమీపంలో తన కు 5.03 గుంటల భూమి ఉందని, పట్టా దారు పాసుపుస్తకం కోసం ఐదేళ్లుగా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇవ్వడంలేదని మిడి యం సింగయ్య అనే రైతు తెలిపాడు. చదవండి: ఎమ్మెల్యేల తీరుతో పార్టీకి తలనొప్పి.. అంతేకాకుండా తన అధీనంలో ఉన్న భూమిని ములుగు జిల్లా అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన పింగాళి చినరాజు పేరిట పట్టా చేశారని ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సింగయ్య బుధవారం తహసీ ల్దార్ కార్యాలయం మెట్లపై పడుకుని నిరసన తెలిపాడు. పాస్‌పుస్తకం ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చోగా.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని, ధరణిలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో సింగయ్య ఆందోళన విరమించాడు. చదవండి: టాప్‌టెన్‌లో ఏపీ విద్యార్థుల హవా -
దేవుడికే పంగనామాలు!
మంగళగిరి (గుంటూరు): ఓ అర్చకుడు రూ.4 కోట్ల విలువైన ఆలయ భూమికి తన పేరుతో పాస్‌పుస్తకం పుట్టించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి సర్వే నంబర్ 14లో 13.20 ఎకరాల భూమి ఉంది. అందులో 3.40 ఎకరాలను సాగు చేసుకునే హక్కును అర్చకుడికి దేవదాయ శాఖ కల్పించింది. అయితే ఆలయ అర్చకుడు నిడమానూరు కృష్ణమూర్తి 1998లో తన పేరున పాస్‌పుస్తకానికి దరఖాస్తు చేసుకున్నారు. 1.71 ఎకరాలకు అప్పటి రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకం మంజూరు చేశారు. ఆ భూమి విలువ సుమారు రూ.4 కోట్లు. దేవాలయం పేరిట ఉన్న భూమిని రెగ్యులర్ ఖాతాలో ఆన్లైన్ చేయాలని ఇటీవల ఆలయ ఈఓ దరఖాస్తు చేశారు. అర్చకుడు కృష్ణమూర్తి కూడా పాస్‌పుస్తకం ఇచ్చి తన భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను కోరాడు. తహసీల్దార్ జి.వి.రామ్‌ప్రసాద్ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా అర్చకుడికి అనుభవించే హక్కు మాత్రమే ఉందని తేలింది. అయితే అతని పేరుతో 1998లో పట్టాదారు పాసుపుస్తకం మంజూరైందని వెల్లడైంది. అర్చకుడి పేరుతో ఇచ్చిన పాసుపుస్తకాన్ని రద్దుచేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. కాజ గ్రామంలో 11 ఎకరాల పీర్ల మాన్యం, నూతక్కిలో 80 సెంట్ల దేవదాయ శాఖ భూమి ఆక్రమణకు గురైనట్టు గుర్తించి నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. మండలంలోని ఆక్రమణలకు గురైన భూములన్నింటినీ గుర్తించేందుకు రీసర్వే ఉపయోగపడుతుందని, రికార్డులను పరిశీలించి ఒక్క సెంటు భూమిని కూడా వదలకుండా స్వాదీనం చేసుకుంటామని తెలిపారు. చదవండి: ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి ప్రముఖ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య -
భూమాయ కేసులో.. కీలక సూత్రధారుల అరెస్టు
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: అమలాపురం భూమాయ కేసులో ప్రధాన నిందితులు, సూత్రధారులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అమలాపురం తహసీల్దార్ కార్యాలయం వేదికగా సాగిన ఈ భూమాయలో ప్రధాన నిందితులైన ఉప్పలగుప్తానికి చెందిన మోటూరి చిన తాతయ్యనాయుడు, లక్ష్మీనరసమ్మ, వారి కుమారుడు మోటూరి బలరామమూర్తిలను అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా ఆధ్వర్యంలో పట్టణ సీఐ జి.సురేష్‌బాబు గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు స్థానిక ఎర్రవంతెన వద్ద అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వాస్తవంగా లేని 53 ఎకరాల భూములకు నకిలీ రికార్డులు సృష్టించి వాటిని అమలాపురం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో తనఖా పెట్టి రూ.1.50 కోట్లు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ మోసానికి పాల్పడిన, సహకరించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బేబీ జ్ఞానాంబతో పాటు మరో సూత్రధారి కామనగరువు వీఆర్వో బడుగు ప్రశాంత్‌కుమార్, అమలాపురం తహసీల్దార్ కార్యాలయ వెబ్ ల్యాండ్ కంప్యూటర్ ఆపరేటర్ వంశీకృష్ణ, కాట్రేనికోన మండలం కందికుప్ప, చిర్రయానాం వీఆర్వోలు ఏసురత్నం, విష్ణుమూర్తిలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితులు భార్యాభర్తలు, వారి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయగా అదే రోజు ఈ కేసులో మరో నిందితుడైన బ్యాంక్ రుణానికి గ్యారంటీర్‌గా ఉన్న ఉప్పలగుప్తానికి చెందిన మోటూరి చిన తాతయ్యనాయుడు పొలంలో పనిచేసే పాలేరు కాశి పల్లంరాజు కూడా కోర్టులో పోలీసులకు లొంగిపోయాడు. ఇక కేసులో అరెస్ట్ చేయాల్సిన ఒకే ఒక నిందితుడు విశ్రాంత తహసీల్దార్ నాగాబత్తుల రమేష్ పరారీలోనే ఉన్నాడు. అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ సురేష్‌బాబు, ఎస్సై వి.శ్రీనివాసరావు నిందితుల వివరాలను వెల్లడించారు. మోసం బయటపడిందిలా.. బ్యాంక్‌ను బురిడీ కొట్టించి తీసుకున్న భారీ రుణానికి కొన్ని వాయిదాలు చెల్లించి మోటూరి కుటుంబీకులు మిన్నకున్నారు. అనుమానం వచ్చిన బ్యాంక్ అధికారులు తమ వార్షిక తనిఖీల్లో భాగంగా తనఖా పెట్టిన ఈ 53 ఎకరాల భూములను వెబ్‌ల్యాండ్ చూసుకోవడంతో పాటు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. వెబ్ ల్యాండ్‌లో, క్షేత్రస్థాయిలో ఆ భూములు లేకపోవడంతో బ్యాంక్‌ను మోసం చేసినట్టు గత సెప్టెంబర్‌లో గుర్తించి రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అప్పటి నుంచి ఈ భూమాయ వెలుగు చూసింది. బ్యాంక్, రిజిస్ట్రార్ అధికారులపైవచ్చిన అభియోగాలపైనా విచారణ ఈ భూమాయలో అటు అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో లేని భూములకు ఈసీ, మార్టగేజ్ చేసిన ఆ కార్యాలయ అధికారులపైన, క్షేత్ర స్థాయి పరిశీలన చేయకుండా, లీగల్ ఒపీనియన్ సరిగా తీసుకోకుండా రుణం ఇచ్చేసిన బ్యాంక్ అధికారులపైన వస్తున్న అభియోగాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని సీఐ సురేష్‌బాబు వెల్లడించారు. వారి పాత్ర కూడా ఉన్నట్టు తెలిస్తే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నకిలీ రికార్డుల సృష్టి ఇలా.. మోటూరి చినతాతయ్యనాయుడు కుటుంబీకులు 2017 ఆగస్టులో తొలుత కాట్రేనికోన మండలం కందికుప్ప, చిర్రయానం గ్రామాల్లో లేని 53 ఎకరాలకు అప్పటికే అదే మండలంలో వీఆర్వోగా పనిచేస్తున్న ప్రశాంత్‌కుమార్ పథకంతో ఆ రెండు గ్రామాల వీఆర్వోల సహకారంతో నకిలీ రికార్డులు సృష్టించారు. అందుకు అప్పటి కాట్రేనికోన తహసీల్దార్ నాగాబత్తుల రమేష్ కూడా సహకారం అందించారు. ఈ నకిలీ రికార్డులను హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు సమర్పించి రూ.1.50 కోట్ల రుణం కోసం ప్రయత్నించారు. అయితే భూములు కాట్రేనికోన మండలానికి చెందినవి కావడంతో బ్యాంక్ అధికారులు ఈ దస్తావేజులను మార్ట్గేజ్ కోసం ముమ్మిడివరం రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపారు. అక్కడి రిజిస్ట్రార్ వాటిని పరిశీలించగా నకిలీ రికార్డులుగా గుర్తించి ఈ సమాచారాన్ని కాట్రేనికోన తహసీల్దార్ కార్యాలయానికి తెలిపారు. దీంతో అక్కడ వీరి అక్రమాలు పారకపోవడంతో వారి స్కెచ్‌ను అమలాపురం తహసీల్దార్ కార్యాయానికి మార్చారు. అప్పటికే అమలాపురం రూరల్ మండలం వీఆర్వోగా వచ్చిన ప్రశాంత్‌కుమార్ మరో స్కెచ్ వేశారు. అందుకు అప్పటి అమలాపురం తహసీల్దార్ బేబీ జ్ఞానాంబతో పాటు అదే కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ వంశీకృష్ణ అందుకు సహకరించారు. అంతే మరోసారి ఇదే మండలంలో లేని 53 ఎకరాలకు తప్పడు రికార్డులు తయారుచేయడం, వాటిని అదే బ్యాంక్‌లో తనఖా పెట్టడం చకాచకా జరిగిపోయాయి. ఈసారి ముమ్మిడివరం రిజిస్ట్రార్ కార్యాలయంలో దొరికిపోయినట్టు దొరికిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో లేని భూములకు మార్టగేజ్ అయ్యే వరకు వెబ్‌ల్యాండ్‌లో నకిలీ సర్వే నంబర్లు అలానే ఉంచి బ్యాంక్ రుణం మంజూరు చేసిన తర్వాత వెబ్ ల్యాండ్ నుంచి ఈ నంబర్లను రీవోక్ చేసేశారు. ఇదంతా 2018 జూన్‌లో జరగడం...బ్యాంక్ రుణం ఇచ్చేయడం జరిగిపోయింది. ఎవరికి ఎంతెంత లంచం? ఈ భూమాయలో సహకరించిన రెవెన్యూ అధికారులకు మోటూరి తాతయ్యనాయుడు కుటుంబీకులు బ్యాంక్ నుంచి అప్పనంగా తీసుకున్న రూ.1.50 కోట్ల రుణం నుంచి రూ.22 లక్షలు లంచాలుగా పంచేశారు. తొలుత కాట్రేనికోన తహసీల్దార్ కార్యాయంలో పుట్టించిన నకిలీ రికార్డుల కోసం అప్పటి తహసీల్దార్ రమేష్‌కు రూ.ఐదు లక్షలు, స్కెచ్ వేసిన వీఆర్వో ప్రశాంత్‌కుమార్‌కు రూ.ఐదు లక్షలు, కందికుప్ప, చిర్రయానాం వీఆర్వోలు ఏసురత్నం, విష్ణుమూర్తిలకు చెరో రూ.రెండు లక్షలు ఇచ్చారు. తర్వాత అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన నకిలీలకు తహసీల్దార్ బేబీ జ్ఞానాంబకు రూ.ఐదు లక్షలు, వీఆర్వో ప్రశాంత్‌కుమార్‌కు రూ.రెండు లక్షలు, కంప్యూటర్ ఆపరేటర్ వంశీకృష్ణకు రూ.లక్ష లంచాలు అందించారు. ఈ లంచాల వివరాలను సీఐ సురేష్‌బాబు గణాంకాలతో వివరించారు. -
పాస్ పుస్తకం రాలేదని రైతు ఆత్మహత్య
మర్పల్లి: విరాసత్ పూర్తయి ప్రొసీడింగ్ కాపీ ఇచ్చినా డిజిటల్ పాస్ పుస్తకం రాకపోవడంతో తనకు బ్యాంక్ రుణం, రైతుబంధు సాయం దక్కడం లేదనే మనస్తాపంతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పెద్దాపూర్‌కు చెందిన కావలి మణెమ్మ పేరుపై ఎకరం 25 గుంటల భూమి ఉంది. గతేడాది ఆమె మృతి చెందడంతో తన ఇద్దరు కుమారులు మొగులయ్య, సామేల్ (50) చెరో 30 గుంటల భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ భూమి విరాసత్ ప్రొసీడింగ్ కాపీ వచ్చినా.. కొత్త పాస్‌బుక్ రాలేదు. దీంతో సామేల్ బ్యాంక్ రుణం, రైతుబంధు సాయం పొందలేకపోయాడు. దీనిపై ఐదు రోజుల కిందట సా మేల్ రెవెన్యూ కార్యాలయానికి పురుగుల మందు డబ్బాతో వచ్చి ఆందోళనకు దిగాడు. అధికారులు ఆయనను సముదాయించి ఇంటికి పంపారు. ఈ క్రమంలో కొత్త పాస్ పుస్తకం లేదు.. బ్యాంకు రుణం రాదు.. చేసిన అప్పులు తీరవు అంటూ మనోవేదనకు గురైన సామేల్ ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో పురుగు మందు తాగాడు. మెరుగైన వైద్యానికి సంగారెడ్డి తీసుకెళ్తుండగా మృతిచెందాడు. అతనికి రూ.1.2 లక్షల అప్పు ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. -
పట్టా.. పరేషాన్
సాక్షి, జనగామ: రైతులను పట్టాదారు పాస్‌బుక్కులు పరేషాన్ చేస్తున్నాయి. చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని రైతుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి అవినీతి అధికారులు ప్రయత్నిస్తుండడంతో ఇక్కట్లు తప్పడం లేదు. అర్హత ఉన్నప్పటికీ పట్టాలు మాత్రం అందించడం లేదు. పట్టాదారు పాస్ బుక్కులు రాక పోవడంతో నిత్యం కార్యాలయాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. పట్టాలు చేతికి రాకపోవడంతో ప్రభుత్వపరంగా రైతులకు అందాల్సిన సౌకర్యాలు రాక పోవడంతో అరిగోస పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 12మండల్లాల్లో 5,62,573 ఎకరాల భూ విస్తీర్ణం ఉంది. అందులో 3,42,635 ఎకరాల సాగు భూమి ఉంది. 193 రెవెన్యూ గ్రామాల్లో 1,50,847 సర్వే నంబర్లలో భూమి విస్తీర్ణం విస్తరించి ఉంది. బచ్చన్నపేట: పై ఫొటోలో కనిపిస్తున్న మహిళా రైతు బచ్చన్నపేట మండలం ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన కాకల్ల పద్మ. 2011 సంవత్సరంలో తన భర్త (బాలయ్య) చనిపోగా పద్మ మామ అయిన కాకల్ల సాయిలు పేరు మీద ఉన్న నాలుగు ఎకరాల భూమిని తన ముగ్గురు కుమారుల పేరున 2017 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించాడు. ఒక్కొక్కరికి 1.14 ఎకరాల చొప్పున పట్టేదార్ పాస్ పుస్తకాలు కూడా వచ్చాయి. కానీ ఇంత వరకు రైతుబంధు, ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు రావడం లేదు. ఇదేమిటని వ్యవసాయ అధికారులను అడిగితే రికార్డులు సరిగా చేయలేదని, అందుకే డబ్బులు రావడం లేదని అంటున్నారు. వ్యవసాయ కార్యాలయానికి వెళితే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లమని, అక్కడకు వెళితే ఇక్కడకు వెళ్లమని తిప్పించుకుంటున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఈ సమస్య ఒక్క పద్మదే కాదు జిల్లాలోని పలువురి రైతుల పరిస్థితి ఇలానే ఉంది. తప్పని తిప్పలు.. పట్టాదారు పాసుబుక్కుల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. 2017, సెప్టెంబర్ 17వ తేదీ జిల్లాలో భూ ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా 1,50,847 సర్వే నంబర్లను పరిశీలన చేశారు. ఇప్పటి వరకు 1,45,993 పట్టాదారు పాసు పుస్తకాలను అందించారు. 4,854 పట్టాదారు పాసు పుస్తకాలను పార్ట్–బీలో పెట్టారు. పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాల కోసం రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వసూళ్ల దందా.. పట్టాదారు పాసుబుక్కులను రైతులకు ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు బహిరంగంగానే డబ్బులను డిమాండ్ చేస్తున్నారు. పట్టాదారు పాసుబుక్కులను తీసుకోవడానికి సాదాబైమానా పత్రాలను అనుమతి ఇచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలోని వీఆర్ఓలు చేతివాటానికి తెరతీశారు. పట్టాదారు పాసుబుక్కుల కోసం మీ సేవలో మ్యూటేషన్ చేసిన రైతులకు కేవలం 45 రోజుల్లో పట్టాను అందించాల్సి ఉంది. కాని విచారణ పేరుతో రెవెన్యూ అధికారులు తమకు డబ్బులు కావాలని కాలయాపన చేస్తున్నారు. ఎకరానికి రూ.10 నుంచి రూ. 20వేల వరకు తీసుకుంటున్నారు. వ్యవసాయ భూములకు ధరలు పెరగడంతో అధికారులు సైతం ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు. ఎక్కువ ధర ఉన్న భూమలకు మరింత ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అధికారులు అడిగినంత ముట్టచెప్పినప్పటికీ పట్టాలు మాత్రం చేతికి అంతక ఇక్కట్లు పడుతున్నారు. పథకాలకు దూరం... పట్టాదారు పాసుబుక్కులు రాకపోవడంతో రైతులు ప్రభుత్వ పథకాలను అందుకోలేక పోతున్నారు. రైతుబంధు, రైతుబీమా, కిసాన్ యోజన వంటి పథకాలకు అర్హులు కాలేక పోతున్నారు. ప్రభుత్వ పథకాలకు నోచుకోక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు భూములు ఉన్నప్పటికీ పట్టాదారు పాసుబుక్కులు లేని కారణంగా ప్రభుత్వ పథకాలకు అర్హులు కాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. రెండేళ్లుగా తిరుగుతున్నా.. మా అమ్మ లచ్చవ్వ పేరు మీద ఉన్న బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామ శివారులో ఏడు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని నా కుమారుడి పేరుమీద పట్టా చేయాలని వీఆర్ఓను సంప్రదించాను. దీనికి ఆయన కొంత డబ్బులు అవసరమని తెలపడంతో అడిగిన డబ్బులు ఇచ్చా. నా పనిని గత రెండేళ్లుగా పెండింగ్‌లో పెట్టాడు. రైతుబంధు, కిసాన్ యోజన డబ్బులు ఇంత వరకు రాలేదు. రైతు బీమా బాండ్లు కూడా రాలేదు. ఏ అధికారికి చెప్పినా సమస్యను పట్టించుకోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.– గొడుగు సిద్ధిరాములు, రైతు తిప్పుకుంటున్నారు.. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండ గ్రామ శివారులో దాదాపు 40 ఏళ్ల క్రితం రెండు ఎకరాల భూమి కొనుగోలు చేశాం. అప్పటి నుంచి సదరు భూమిలో మేమే కాస్తులో ఉన్నాం. పట్టాదారు పాసుపుస్తకం కోసం తిరుగుతున్నా.. ఇంతవరకు అధికారులు స్పందించడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, బ్యాంకులో అందించే క్రాప్లోన్లు రావడం లేదు. రెవెన్యూ రికార్డులో తప్పుగా మరొకరి పేరు ఉండటంతో రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం లేదు. దీంతో ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. అధికారులు స్పందించి విచారణ చేపట్టి పట్టాదారు పుస్తకం అందించి ఆదుకోవాలి.– నీల ఇంద్రమ్మ, శివునిపల్లి వీఆర్వోలు మారిన పట్టా రాలేదు.. పట్టాదారు పాసుబుక్ కోసం తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. 1బీ పహణీలో వస్తున్నది. ఫొటో తప్పుగా వచ్చింది. తప్పుగా వచ్చిన ఫొటోను సరిగా చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటికీ ఇద్దరు వీఆర్వోలు మారిన కొత్త పట్టా పాస్‌బుక్ రాలేదు.– అనపర్తి చంద్రయ్య, వావిలాల రైతు -
నారాజ్ చేయొద్దు
రైతు: రాజు, ఏదులాపూర్, శివ్వంపేట మండలం 139/2 సర్వే నంబర్లో 26. 1/2 (ఇరువై ఆరున్నర గుంటల) భూమి కుమారి సులోచనపై రిజిస్ట్రేషన్ చేయించాము. కాని కొత్త పాస్‌బుక్‌లో 20.1/2(ఇరవైన్నర) గుంటల భూమి ఉన్నట్లు నమోదు చేశారు. మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే గ్రామశివారులోని ముత్తయ్య చెరువు కాలువను దాడ్వాయి అశోక్ అనే వ్యక్తి పూడ్చేశారు. ఈ విషయంపై ముత్యాలు అనే వ్యక్తి ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. జేసీ: పాత రికార్డుల ప్రకారం ఎంత ఉంటే అంతా సర్వే చేయిస్తాము. ముతయ్య చెరువు కాలువ పూడ్చివేత పై చర్యలు తీసుకుంటాను. సాక్షి మెదక్/మెదక్ రూరల్: సాధాబైనామాలో భూమి తగ్గింది రైతు: రెడ్డిగారి వీరమణి, యెనగండ్ల గ్రామం, కొల్చారం మండలం కొల్చారం మండలం యెనగండ్ల గ్రామశివారులో గల 62 సర్వే నంబర్లో 2.4 ఎకరాల పట్టా భూమి ఉండగా, సాధాబైనామా తర్వాత అందులో 12 గుంటల భూమి తగ్గించి మంగళి ఆగమయ్య పేరిట నమోదు చేశారు. సంబంధిత తహసీల్దార్‌కు దరఖాస్తు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. జేసీ: మీ సమస్య గురించి సంబంధిత తహసీల్దార్‌తో మాట్లాడి పరిష్కరిస్తాను. ప్రభుత్వం ఇచ్చిన భూమిని కబ్జా చేశారు రైతు: నర్సయ్య, నిజాంపేట మండలం, నస్కల్ గ్రామం గ్రామ శివారులో గల 229/అ సర్వే నంబర్లో నాలుగున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని నలుగురికి ఇచ్చారు. అందులో తమకు ఇచ్చిన 1.15 ఎకరాల భూమిని ఇతరులు కబ్జా చేశారు. అధికారులను పొజిషన్ చూపించాలని కోరితే పట్టించుకోవడం లేదు. జేసీ: సర్వేయర్‌ను పంపించి సమస్యను పరిష్కరిస్తాము. ఐదు గుంటలు తక్కువ నమోదు చేశారు రైతు: లక్ష్మీనర్సయ్య, నిజాంపేట మండలం, కె. వెంకటాపూర్ గ్రామం గ్రామ శివారులోని 315, 316, 317 సర్వే నంబర్లలో మొత్తం 2 ఎకరాల పట్టా భూమి ఉంది. కాని కొత్త పాస్‌బుక్‌లో 5 గుంటల భూమిని తగ్గించి నమోదు చేశారు. జేసీ: సంబంధిత మండల రెవెన్యూ అధికారులకు చెప్పి న్యాబద్ధమైనదైతే సరిచేస్తాము. పాస్‌బుక్కులు ఇవ్వలేదు రైతు: నర్సింలు, రామాయంపేట రామాయంపేట శివారులోని 1421 సర్వే నంబర్లో గల లవాణీ పట్టా భూమికి సంబంధించి 15 మందికి పట్టా సర్టిఫికెట్ ఇచ్చి పాస్‌బుక్కులను ఇవ్వలేదు. జేసీ: ఆ భూమిలో ఏం పంటలు సాగు చేస్తున్నారు. సర్వేయర్‌ను పంపించి వారం రోజుల్లోగా పాస్‌బుక్కులను ఇప్పిస్తాము. మా భూమిని కబ్జా చేశారు రైతు: నర్సింలు, రాంపూర్ గ్రామం, అల్లాదుర్గం మండలం గ్రామ శివారులోని 234 సర్వే నంబర్లో ఉన్న అసైన్డ్ భూమికి సంబంధించి 1977లో తాత పేరిట సర్టిఫికెట్ ఇచ్చారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లాము. ప్రస్తుతం తమ భూమిని పక్క పొలం వ్యక్తి కబ్జా చేశాడు. జేసీ: మూడేళ్లకు మించి ఆ భూమిలో పొజిషన్లో లేకుంటే ప్రభుత్వం రద్దు చేస్తుంది. భూమిని సాగు చేస్తున్న వాళ్లకే వర్తిస్తుంది. భూ సమస్యను పరిష్కరించండి రైతు: సూర్యం చౌహాన్, బిక్యాతండా, శివ్వంపేట మండలం పంచాయతీ పరిధిలో గల 315, 316 సర్వే నంబర్లో ఉన్న భూ సమస్యను పరిష్కరించి రైతులకు పాస్‌బుక్కులు అందించగలరు. జేసీ: భూమి ఉన్నదాని కంటే ఎక్కువ ఉండటం వల్ల ఫారెస్ట్ అధికారులు గెజిట్ పబ్లికేషన్ తీసుకొచ్చి హద్దులు వేశారు. సమస్య ఉన్నందున ఆ భూమిని పార్ట్ బీలో పెట్టడం జరిగింది. సర్వే చేయించి సమస్య పరిష్కరించి పాస్‌బుక్‌లను అందిస్తాము. లవాణీ పట్టా కొనుగోలు చేశాం రైతు: నర్సింగ్, చిన్నచింతకుంట గ్రామం, నర్సాపూర్ గ్రామ శివారులోని 918 సర్వే నంబర్లో లవాణీ పట్టాను కొనుగోలు చేశాము. పట్టా చేయడం లేదు. జేసీ: హెచ్ఎండీఏ పరిధిలో ఉంది కాబట్టి చట్ట ప్రకారం పట్టా కాదు. పాస్‌బుక్ ఇప్పించండి రైతు: సిద్ధయ్య, వడియారం గ్రామం, చేగుంట మండలం సర్వే నంబర్ 642లో గల 32 గుంటల ఇనాం భూమికి సంబంధించి పాస్‌బుక్ రాలేదు. జేసీ: ఓఆర్సీ ఇప్పించి 10 రోజుల్లో పాస్‌బుక్‌లను అందిస్తాము. ఒకే భూమిని ఇద్దరికి విక్రయించారు రైతు: వహీబ్ఖాన్, నర్సాపూర్ సర్వే నంబర్ 17/12లో గల లవాణీ పట్టా భూమిని 1989లో తీసుకున్నాము. కాని అదే భూమిని 2006లో ఇతరులకు విక్రయించారు. ఇలా ముగ్గురి పేర్లమీద ఉంది. జేసీ: ఆ భూమిని ఎవరూ కొనడానికి వీలులేదు. అందులో చేపట్టిన నిర్మాణాలను పడగొట్టి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటాము. భూమిని మ్యూటేషన్ చేస్తలేరు రైతు: శ్రీనివాస్, రాజ్‌పల్లి, మెదక్ మండలం సర్వే నంబర్ 427/అ 2లో గల 13 గుంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించాము. కాని మోటేషన్ చేయమంటే సంబంధిత వీఆర్వో పట్టించుకోవడం లేదు. జేసీ: రెండు రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తాము. అధికారులు పట్టించుకోవడం లేదు రైతు: విభూది రాచప్ప, దొంతి గ్రామం, శివ్వంపేట మండలంతల్లి ఎల్లమ్మ పేరిట ఉన్న 8గుంటల పట్టా భూమిని పౌతి చేయమంటే రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. జేసీ: రెండు రోజుల్లో సమస్య పరిష్కారమయ్యేలా చూస్తాను. నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారుల పై చర్యలు తీసుకుంటాను. నా భూమి వేరే వ్యక్తి పేరిట నమోదైంది రైతు: నారాయణ, శివాయిపల్లి, మెదక్ మండలం 43/ఇ2 సర్వేనంబర్‌లో గల 13 గుంటల బారాణ భూమిని నా పేరుతో ఉన్న మరో వ్యక్తి అయిన నారాయణ పేరిట నమోదయ్యింది. మా పేర్ల పక్కన తండ్రి పేరును గమనించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సమస్య పరిష్కరించాలని వీఆర్వో, ఎమ్మార్వోల చుట్టూ తిరిగినా పట్టించుకోవడవం లేదు. జేసీ: వారం రోజుల్లో సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాను. పాస్‌బుక్కులు ఇవ్వలేదు రైతు: బిక్షపతి, రాయిలాపూర్, కౌడిపల్లి మండలం 394, 387 సర్వే నంబర్లో ఉన్న రైతులకు ఎవరికి పాస్‌బుక్కులు రాలేవు. దీంతో రైతుబంధు, రైతుబీమా డబ్బులను కోల్పోవాల్సి వస్తుంది. జేసీ: వారం రోజుల్లో సర్వే చేయించి సమస్యను పరిష్కరిస్తాను. ఇద్దరికి చెందాల్సిన భూమిని ఒక్కరికే ఇచ్చారు రైతు: శంకరయ్య, ఎల్లుపల్లి, టేక్మాల్ మండలం 141 సర్వే నంబర్లో గల 21 గుంటల భూమి శంకరయ్య, సుధాకర్ల పేరు మీద ఉంది. కాగా సాధా బైనామాలో ఇద్దరికి చెందిన భూమిని సుధాకర్ ఒక్కిరి పేరిట రాసారు. జేసీ: ఆర్డీఓకు ఆర్ఓఆర్ అప్పీల్ చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. పాస్‌బుక్ రాలేదు రైతు: విజయ్‌కుమార్, కోనాపూర్ గ్రామం, రామాయంపేట433/202 సర్వే నంబర్లో గల ఎకరం లవాణీ పట్టా భూమికి సంబంధించి పాస్‌బుక్ రాలేదు. జేసీ: పార్ట్ బీలో ఉన్నందు వల్ల పాస్‌బుక్ రాకుండవచ్చు. సర్వేచేయిస్తాను. రిజిస్ట్రేషన్ చేసినా బుక్‌లో నమోదు చేస్తలేరు రైతు: కుమ్మరి మల్లేషం, శెట్టిపల్లి గ్రామం, వెల్ధుర్తి మండలం గ్రామ శివారులో 38 సర్వే నంబర్లో 14 గుంటల పట్టా భూమిని కొనుగోలు చేసి 2006 రిజిస్ట్రేషన్ చేయించాము. కాని బుక్‌లో నమోదు చేయడం లేదు. అలాగే 289, 38 సర్వే నంబర్లలో ఉన్న భూమిలో 15 గుంటల భూమి తక్కువ వస్తుంది. సంబంధిత ఎమ్మార్వో, వీఆర్వో పట్టించుకోవడం లేదు. జేసీ: మీసేవలో పెట్టిన దరఖాస్తు ఉందా. మీసేవలో రూ.145 చెల్లించి నమోదు చేసుకుంటేనే సమస్య పరిష్కారమవుతుంది. మీసేవ రశీదును వాట్సప్‌కు పెట్టండి. కొన్న భూమిని కోల్పోవాల్సి వస్తుంది రైతు: రఘుపతి, రాంపూర్ గ్రామం, అల్లాదుర్గం మండలంగ్రామ శివారులోని 260 సర్వే నంబర్లో గల 35 గుంటల పట్టా భూమిని మా తండ్రి లక్ష్మీనారాయణ పేరిట కొనుగోలు చేశాము. కాని 266 సర్వే నంబర్లో ఉందంటున్నారు. కాగా 260 సర్వే నంబర్లో గల భూమి జాతీయ రహదారి విస్తరణలో పోతుంది. సమస్యను పరిష్కరించండి. జేసీ: రికార్డు ప్రకారం సర్వే నంబర్లో ఉన్న భూమిపై హక్కు ఉంటుంది. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాము. లేకుంటే కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. బీఈడీ ఎంట్రెన్స్‌లో నిజాంపేట వాసికి 13వ ర్యాంక్ నిజాంపేట(మెదక్): నిజాంపేట గ్రామానికి చెందిన యువకుడు బీఈడీ ఎంట్రెన్స్ పరీక్షలో సాంఘీకశాస్త్ర్రంలో 13వ ర్యాంక్ సాధించాడు. ఈ మేరకు నిజాంపేట గ్రామానికి చెందిన వోగుల సురేష్ గత నెల 31న జరిగిన ఎంట్రెన్స్ పరీక్షలో రాష్ట్రవ్యాప్తంగా మంచి ప్రతిభ కనబరిచాడు. రాష్ట్ర వ్యాప్తంగా 13వ ర్యాంక్ సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు పెద్దశంకరంపేట(మెదక్): వర్షాలు సమృద్ధిగా కురియాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఉమ్మడి మెదక్ జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో పలు ఆలయాల్లో శుక్రవారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా అర్చక సంఘం ఉపాధ్యక్షుడు గుడిచంద్రశేఖర్శర్మ హనుమాన్ ఆలయంలో చందనోత్సవం నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కేవీపీఎస్ జిల్లా కమిటీ ఎన్నిక నర్సాపూర్: కుల వివక్ష వ్యతిరేఖ పోరాట సమితి జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నర్సాపూర్‌లో నిర్వహించిన కేవీపీఎస్ జిల్లా మహా సభల్లో జిల్లా కమిటీని ఎంపిక చేశారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా తుకారం, నాగరాజులు ఎన్నికయ్యారు. తమతో పాటు 19 మందితో కూడిన జిల్లా కమిటీని ఎంపిక చేశారని అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. జిల్లాలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించి ఎవరికీ అన్యాయం జరుగకుండా చూస్తామని వారు పేర్కొన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి మనోహరబాద్(తుప్రాన్): వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృచెందారు. ఎస్ఐ వరప్రసాద్ కథనం ప్రకారం.. కూచారం గ్రామానికి చెందిన బోయిని సత్యనారాయణ(35) తన ఇంటి ముందు ఉన్న ట్రాక్టర్‌ను పక్కకు పెట్టడానికి కింద నిలబడి స్టార్ట్ చేయగా గేర్‌లో ఉన్న ట్రాక్టర్ అకస్మాత్తుగా అతనిపైనుంచి వెళ్లింది. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చెట్టును ఢీకొని.. కొనాయిపల్లి (పీటీ)గ్రామానికి చెందిన శెట్టి బాబు (28) తన బైక్‌పై పనినిమిత్తం రంగాయిపల్లి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అంగన్వాడీ పోస్టుల భర్తీ అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులు భర్తీ చేసినట్లు సీడీపీఓ సోమశేఖరమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దశంకరంపేట అంగన్వాడీ టీచర్, గడిపెద్దాపూర్ తండా మినీ అంగన్వాడీ టీచర్, అల్లాదుర్గం మండలం గొల్లకుంట, రేగోడ్ మండలం కొండాపూర్, జంగంలోంక తండా, టేక్మాల్ మండలం పల్వంచ, పెద్దశంకరంపేట మండలం ఉతూలుర్ గ్రామల అంగన్వాడీ ఆయా పోస్టులు భర్తీ చేయడమైందని, పోస్టులు పొందినవారు అల్లాదుర్గం ఐసీడీఎస్ కార్యాలయంలో ఉత్తర్వులు తీసుకుని జాయినింగ్ కావాలని ఆమె తెలిపారు. పోస్టుల లిస్టు కార్యాలయంలో అందుబాటులో ఉందన్నారు. నాలుగు మండలాల్లో.. రామాయంపేట(మెదక్): స్థానిక ఐసీడీఎస్ పరిధిలోని రామాయంపేట, నార్సింగి, చేగుంట, వెల్దుర్తి మండలాలకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లను ఎంపిక కార్యక్రమం పూర్తయిందని స్థానిక ప్రాజెక్టు సీడీపీవో స్వరూప తెలిపారు. ఆమె శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కోనాపూర్, మక్కరాజ్‌పేట, శంఖాపూర్, బోనాల గ్రామాల్లోని ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల ఎంపిక కార్యక్రమం పూర్తయిందని తెలిపారు. మక్కరాజ్‌పేట, శంఖాపూర్, బోనాల, రామాయపల్లి సెంటర్లలో హెల్పర్లు, మినీ కేంద్రాలైన కోనాపూర్ పెద్ద తండా, చిన్నతండాలో టీచర్ల ఎంపిక కార్యక్రమం పూర్తయిందని ఆమె తెలిపారు. ఎంపికైనవారి వివరాలు కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఉంచడం జరిగిందని, లిస్టు చూసుకోవాలని ఆమె సూచించారు. కాయిదంపల్లిలో పింఛన్ల పంపిణీ అల్లాదుర్గం(మెదక్): గురువారం సాక్షి దినపత్రికలో పింఛన్ పాట్లు అనే శీర్షికతో వార్త ప్రచురితం అయింది. గ్రామాల్లో పింఛన్ ఇవ్వడం లేదని, పోస్టాఫీస్‌లో పింఛన్లు ఇవ్వడంతో గ్రామాల నుంచి వచ్చిన వృద్ధులు, వికలాంగులు పడుతున్న ఇబ్బందులను సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీంతో స్పందించిన పోస్టల్ సిబ్బంది శుక్రవారం కాయిదంపల్లి గ్రామానికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ప్రతి నెల గ్రామాల్లోనే పింఛన్లు పంపిణీ చేయిస్తామని ఎంపీడీఓ విద్యాసాగర్ చెప్పారు. -
కోరిక తీరిస్తేనే.. పాస్బుక్కు, చెక్కు
సాక్షి, గద్వాల: ‘నా కోరిక తీర్చు.. అప్పుడే రైతు బంధు చెక్కు, పాస్బుక్కు ఇస్తా’అంటూ తహసీల్దార్ తనను వేధిస్తున్నారని జోగు ళాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్‌పై అదే మండలం చిన్నిపాడు గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌కు హెచ్ఆర్సీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. స్థానికంగా ఫిర్యాదు చేస్తే అధికారులు తహసీల్దార్కే వత్తాసు పలుకుతారన్న ఉద్దేశంతో వారం క్రితం తాను హెచ్ఆర్సీని ఆశ్రయించినట్లు బాధితురాలు వెల్లడించింది. పాసుబుక్కు, రైతుబంధు చెక్కు ఇవ్వ కుండా రోజుల తరబడి కార్యాలయానికి తిప్పించుకుంటున్నారని ఆమె వాపోయింది. తనకు అన్యాయం చేయాలని కుట్ర చేశారని.. తన కోరిక తీరిస్తేనే చెక్కు ఇస్తానంటూ వేధిస్తున్నారని తెలిపింది. కాగా, దీనిపై మానవపాడు తహసీల్దార్ మునెప్ప విలేకరులతో మాట్లాడుతూ తాను ఎవరి విషయంలో కూడా అసభ్యంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. చిన్నిపాడులో సర్వే నంబర్ 57/ఏలో 1.06 ఎకరాల భూమి ఉమ్మడి ఆస్తిగా ఉన్నప్పటికీ గతంలో సంబంధిత రెవెన్యూ యంత్రాంగం ఒక్కరిపైనే పట్టా చేసిందన్నారు. చెక్కు పంపిణీ సమయంలో మిగతా వాటాదారుల ఫిర్యాదు మేరకు, వివాదంలో ఉన్నందున చెక్కు ఆపామన్నారు. ఈ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. -
ధరణి వెబ్సైట్ నిర్వహణపై ఆరోపణలు
-
పాస్‌బుక్కుంటేనే.. చెక్కు పాస్
సాక్షి, హైదరాబాద్ : రైతుబంధు చెక్కు రైతుఖాతాలో జమ కావాలంటే పాస్ పుస్తకం ఉండాల్సిందే. రైతుల గుర్తింపుపత్రంగా పాస్‌బుక్ చూపించాల్సి ఉంది. ఈ మేరకు ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.కె.జోషి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. పాస్‌పుస్తకాల ప్రింటింగ్‌కు కావాల్సిన సమాచారంతో వెంటనే వ్యవసాయ శాఖకు నివేదిక పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 72 లక్షల రైతు ఖాతాలుండగా ఇప్పటివరకు 67 లక్షల ఖాతాలను మాత్రమే తహసీల్దార్లు పూర్తి చేశారు. అందులోనూ 57 లక్షల ఖాతాల పాస్‌పుస్తకాల ముద్రణకు మాత్రమే సిఫారసు చేశారు. చెక్కుల పంపిణీకి గడువు సమీపిస్తున్నందున గ్రామాలవారీగా ఎంత భూమి ఉంది.. అందులో ఎన్ని ఖాతాలున్నాయనే వివరాలను పంపాలని, అన్ని ఖాతాలను తహసీల్దార్లు డిజిటల్ సంతకాల ద్వారా అధీకృతం చేయాలని ఎన్ఐసీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఇంకా పూర్తి కానట్టు తెలుస్తోంది. భూరికార్డుల ప్రక్షాళన గణాంకాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు కూడా తేడా ఉం దని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆ తేడాలను పరిశీలించి సరిచేయాలని, డ్రాఫ్ట్ పాస్ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసి సదరు రైతుకివ్వాలని, అన్ని వివరాలు సరిగా ఉన్న తర్వాతే ఫైనల్ పాస్‌పుస్తకానికి సిఫారసు చేయాలని, ఇలాంటి భూముల వివరాలను కలెక్టర్లు, జేసీ లిఖితపూర్వకంగా నిర్ధారించి ఈ నెల 24వ తేదీలోపు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ కమిటీకి అవసరం లేదు : అసైన్డ్ భూములను కబ్జాలో ఉన్న వారికి రీఅసైన్ చేసే విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రీ అసైన్మెంట్ కోసం గతంలో ఉన్న నియోజకవర్గ స్థాయి అసైన్మెంట్ కమిటీకి సంబంధంలేకుండానే జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవచ్చని భూపరిపాలన డైరెక్టర్ వి.కరుణ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు భూమిలేని వారు, పరిమితంగా భూములున్న పేదలు అసైన్డ్ భూములు లేదా ఇండ్లస్థలాలను కొనుగోలు చేసి కబ్జాలో ఉన్నట్టయితే వారికే ఆ భూములు, స్థలాలను నేరుగా కలెక్టర్లే రీ అసైన్ చేయనున్నారు. -
ఆధార్‌కు వెనకడుగు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూ రికార్డుల ప్రక్షాళనతో బినామీల బాగోతం వెలుగుచూస్తోంది. ఆధార్ నంబర్ అనుసంధానంతో ఇన్నాళ్లు రికార్డులకే పరిమితమైన భూముల వ్యవహారం బాహ్యప్రపంచానికి తెలుస్తోంది. రెవెన్యూ రికార్డుల నవీకరణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. ఆధార్ విశిష్ట సంఖ్యను కూడా పట్టాదార్ పాస్ పుస్తకానికి జోడిస్తోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో భూ సమగ్ర సమాచారం ఆన్లైన్లో నిక్షిప్తమవుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తున్న రెవెన్యూయంత్రాంగం తాజాగా ఆ సమాచారాన్ని క్రోడీకరిస్తోంది. కాగా, ఈ ప్రక్షాళన కేవలం రికార్డుల అప్డేట్ వరకే పరిమితమవుతుందని భావించిన బడాబాబులు.. ఆధార్ సీడింగ్ తప్పనిసరి చేయడంతో కలవరం చెందుతున్నారు. ఒకవేళ ఆధార్ సంఖ్యను ఇవ్వకపోతే సదరు భూమిని బినామీల జాబితాలో చేరుస్తామని ప్రకటించడంతో వారిలో ఆందోళన మొదలైంది. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 79.30 శాతం మాత్రమే ఆధార్ నంబర్‌ను అప్లోడ్ చేశారు. మిగతా 20.70 శాతం మంది ఇంకా ఆధార్ ఇవ్వకుండా దాటవేస్తున్నారు. ఆధార్ ఇవ్వని జాబితాలో అత్యధికం శివారు మండలాలే ఉన్నాయి. సరూర్‌నగర్ 1.45 శాతం, శేరిలింగంపల్లి 6.74 శాతం, రాజేంద్రనగర్ 20.95 శాతం, గండిపేట 46.23 శాతం మాత్రమే నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో భూముల విలువ నింగినంటింది. నల్లధనం కలిగిన సంపన్నవర్గాలు, సినీరంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్లు ఈ ప్రాంతంలో ఇబ్బడిముబ్బడిగా భూములను కొనుగోలు చేశారు. రియల్టీ కోణంలో ఆలోచించిన ఆయా వర్గాలు భూముల్లో పెట్టుబడులు పెట్టారు. ఆశించిన స్థాయిలో రేటు రాగానే అమ్ముకొని భారీగా గడిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడుతున్న పెద్దలు తమ వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసేందుకు వెనుకాడుతున్నారు. దీంతో చాలావరకు వీరి తరఫున కొందరు బ్రోకర్లే రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ వ్యవహారాలను చక్కబెడతారు. తాజాగా ఇప్పుడు 1బీ రికార్డు ఆధారంగా గుర్తించిన ప్రతి సర్వేనంబర్, భూ విస్తీర్ణానికి సంబంధించిన యజమాని సమాచారాన్ని తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఒకవేళ ఈ సమాచారం గనుక రాకపోతే సదరు ఆస్తిని బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తామని ప్రకటించింది. అయినప్పటికీ, ఇంకా చాలామంది తమ ఆధార్నంబరే కాకుండా ఫోన్‌నంబర్‌ను కూడా ఇచ్చే విషయంలో తటపటాయిస్తున్నారు. 2.56 లక్షల నంబర్లకుగాను ఇప్పటివరకు 1.05 లక్షల నం బర్లు మాత్రమే నమోదు కావడం గమనార్హం. -
భూమికి ఆధారం..!
నారాయణపేట: ప్రతిష్టాత్మకంగా భూప్రక్షాళన చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భూఖాతాలకు ఆధార్ నంబర్లు జోడిస్తోంది. తద్వారా తప్పుడు లెక్కలకు, అక్రమాలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు. ఆధార్ నంబర్ల నమోదుతో ఒకే భూమిని ఇద్దరి పేర్లపై రిజిష్ట్రేషన్ చేయడం.. తద్వారా అమ్మకాలు, కొనుగోళ్ల సమయంలో గొడవలు జరగడం వంటివి జరగకపోవచ్చు. ఆన్లైన్లో ఆధార్ నంబర్ నమోదు చేస్తే చాలు.. రైతుకు సంబంధించిన పూర్తి వివరాలను చూడొచ్చు. ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకోగా.. శుక్రవారంతో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులు భూఖాతాలకు ఆధార్ నంబర్లతో పాటు సెల్‌నంబర్ల నమోదుతో బిజీబిజీగా ఉన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రైతులకు ఈ–పాస్ పుస్తకాలను ప్రింట్ చేసి పంపిణీ చేయనున్నారు. గత ఏడాది సెప్టెంబర్ భూప్రక్షాళన కార్యక్రమాన్ని గత ఏడాది సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు చేపట్టారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు వ్యవసాయ, వ్యవసాయేతర, ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములతో పాటు దేవాదాయ, ఆటవీ శాఖలకు సంబంధించిన భూములను దస్త్రాల ఆధారంగా క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించారు. మొదటి దశలో వెల్లడైన లోటుపాట్లను సరిచేసి ప్రతీ గ్రామంలోని పంచాయితీ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై భూవివరాలను ప్రదర్శించారు. అలా సందేహాలు, అభ్యంతరాలు స్వీకరించి సరి చేయడంతో రెండో దశ ముగిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 11 నుంచి నుంచి కొత్త పాసుపుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆన్లైన్లో పట్టాదారుల ఖాతా నంబర్లకు సర్వే నంబర్ల ఆధారంగా ఆధార్, సెల్ నంబర్లు జత చేయాలని ఆదేశించడంతో ఉద్యోగులు రాత్రింబవళ్లు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, శుక్రవారంతో ప్రభుత్వం విధించిన గడువు ముగియనుంది. కాగా, కొత్త పాస్ పుస్తకాల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 76 శాతమే.. జిల్లాలోని 26 మండలాల్లో 3,70,857 మంది రైతుల పేరిట పట్టాదార్ పాసు పుస్తకాలు ఉన్నాయి. ఇందులో 2,87,874 మంది రైతులకు సంబంధించి ఇప్పటికే ఆధార్‌నంబర్లను ఆన్లైన్లో పొందుపర్చగా 76 శాతం పూర్తయినట్లయింది. ఈనెల 10న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఈ–పాస్‌పుస్తకాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రోజు నుంచి అన్ని గ్రామాల్లో ఈ–పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. మొబైల్లింక్తో సమాచారం ఆన్లైన్లో భూవివరాలతో పాటు ఆధార్‌కార్డు నంబర్, మొబైల్ నంబర్లను నమోదు చేస్తున్నారు. దీంతో అక్రమార్కులకు కల్లెం వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఎవరైనా రైతుల భూమిని సంబంధం లేని వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని భావిస్తే.. వెంటనే యాజమాని సెల్ నంబర్‌కు మెస్సేజ్ వెళ్తుంది. తద్వారా రైతు వెంటనే అప్రమత్తం కావొచ్చు. ఇకపై భూరిజిస్ట్రేషన్ల బాధ్యతలు కూడా తహసీల్దార్లకు అప్పగించనుండడంతో ఎలాంటి అవకతవకలు జరగవని చెబుతున్నారు. రైతు ఫొటోతో ఈ–పాస్ పుస్తకాలు ఆధార్‌కార్డులో ఉన్న ఫొటోతోనే రైతులకు ఈ–పాస్ పుస్తకాలు అందనున్నాయి. ఆధార్ నంబర్ జతచేస్తుండడంతో దానికదే ఫొటో పుస్తకం ముద్రితమవుతుంది. పాసుపుస్తకంపై రైతుకు సంబంధించి భూమి ఖాతా, సర్వేనంబర్, విస్తీర్ణం తదితర వివరాలతో పాటు ఆధార్, సెల్ నంబర్లు ముద్రించనుండడంతో సమస్త సమాచారం అందులో ఉన్నట్లవుతుంది. పూర్తిచేస్తాం భూప్రక్షాళనలో భాగంగా వెల్లడైన వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. ప్రతీ రైతు ఖాతాకు ఆధార్, సెల్ నంబర్లను జత చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నారాయణపేట మండలం విషయానికొస్తే 80 శాతం పూర్తయింది. జిల్లాలో కూడా చివరి దశకు చేరుకుంది. నిర్దేశించిన లక్ష్యంలోగా మొత్తం పూర్తి చేస్తాం. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే రైతులకు అన్ని వివరాలతో కూడిన ఈ–పాస్ పుస్తకాలు అందనున్నాయి. – పార్ధసారథి, తహసీల్దార్, నారాయణపేట -
పాస్బుక్కు ఆధార్
-
పాస్బుక్కు ఆధార్.. లేదంటే బినామీయే!
సాక్షి, హైదరాబాద్: పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ నంబర్‌ను కచ్చితంగా అనుసంధానం చేయాలని రైతులకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. లేదంటే పాస్ పుస్తకాల్లోని భూములను బినామీ ఆస్తులుగా గుర్తించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. భూ రికార్డులకు ఆధార్ కార్డు లింక్ చేయడానికి కొంతమంది ముందుకు రావడం లేదని, ఇప్పటికైనా వారందరూ ఆధార్ నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘భూ రికార్డులను పక్కాగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేస్తున్నాం. మేడ్చల్, రంగారెడ్డితో పాటు కొన్ని జిల్లాల్లో కొందరు తమ ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయించుకోలేదు. అలాంటి వారందరూ అధికారులకు ఆధార్ నంబర్ ఇవ్వాలి. లేకుంటే అవన్నీ బినామీలుగా గుర్తించే అవకాశం ఉంది’’అని స్పష్టం చేశారు. పాస్ పుస్తకాల పంపిణీపై ప్రగతి భవన్లో సీఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సీఎస్ ఎస్.కె.జోషి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, రాజేశ్వర్ తివారి, భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ప్రత్యేక అధికారి వాకాటి కరుణ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇతర పట్టాదారులతోపాటుగానే అసైన్డ్ భూములున్న వారికి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు. అసలు లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్న భూములను గుర్తించి, వాటి యాజమాన్యంపై స్పష్టతనివ్వాలని, వారి పేరిట పాస్ పుస్తకాలు తయారు చేయాలని ఆదేశించారు. వ్యవసాయేతర భూమిని నమోదు చేయాలి వ్యవసాయ భూమి ఉన్న రైతుకు అదే గ్రామంలో వ్యవసాయేతర భూమి ఉంటే, ఆ వివరాలు కూడా పాస్ పుస్తకంలో నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. అందుకు అదనపు కాలమ్ పెట్టాలని సూచించారు. ‘‘మార్చి 11న పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించిన మాట నిజమే. అయితే అసైన్డ్ భూముల యజమానులను గుర్తించడం, వివరాలను పరిశీలించడం, వ్యవసాయేతర భూముల వివరాలు కూడా నమోదు చేయడం లాంటి పనులన్నీ చేయడానికి కొంత సమయం పడుతుంది. పాస్ పుస్తకాల తయారీ పక్కాగా జరిగిన తర్వాతే పంపిణీ కార్యక్రమం చేపట్టాలి. సొంత భూమి ఉన్న రైతులతోపాటు ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూమిని సాగు చేసుకుంటున్న రైతుల వివరాలు కూడా సేకరించాలి. వారికి కూడా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. అందుకు కొంత అదనపు సమయం పడుతుంది. అయినా ఫర్వాలేదు. కలెక్టర్లతో మాట్లాడి కచ్చితమైన వివరాలు తెప్పించాలి. అసైన్డ్‌దారులకు కూడా భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత ఇవ్వాలి. తొందరపాటులో పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది. పాస్ పుస్తకాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతీ ఎంట్రీని క్షుణ్ణంగా పరిశీలించాలి’’అని సీఎం పేర్కొన్నారు. మార్చికల్లా అన్ని గ్రామాలకు మంచినీరు ఈ ఏడాది మార్చి 31 నాటికి అన్ని గ్రామాలకు మంచినీళ్లు అందాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామాలకు పైపులైన్లు వేసుకుంటూనే సమాంతరంగా అంతర్గత పైపులైన్ల నిర్మాణ పనులు కూడా చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో అంతర్గత పైపులైన్లు నిర్మించి, ఇంటింటికీ నల్లాలు బిగించి మంచినీళ్లు సరఫరా చేసే విషయంలో ఎమ్మెల్యేలు చొరవ చూపాలన్నారు. శుక్రవారం ప్రగతి భవన్లో మిషన్ భగీరథపై సీఎం సమీక్ష నిర్వహించారు. -
పాస్‌పుస్తకాల్లో తప్పులు రానీయొద్దు
నవీపేట(బోధన్): పట్టాపాస్‌పుస్తకాల త యారీలో ఎ లాంటి తప్పు లు దొర్లకుండా చూసుకోవాల ని జిల్లా జా యింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. స బ్ రిజిస్ట్రార్ కార్యాల య ఏర్పాటులో భాగంగా నవీపేట తహసీల్ కార్యాలయాన్ని మంగళవారం జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 11న నూతన పట్టాపాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. మార్చి 12న తహసీల్ కార్యాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో తహసీల్ కార్యాలయాలను పరిశీలిస్తున్నామన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా లేని చోట అదనపు భవనాల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నవీపేటలో నూతన భవనాన్ని నిర్మిస్తామన్నారు. జేసీ వెంట ఆర్డీవో వినోద్‌కుమార్, తహసీల్దార్ అనిల్కుమార్లున్నారు. ఎడపల్లిలో స్థల పరిశీలన.. ఎడపల్లి(బో«ధన్): మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయాన్ని జేసీ సందర్శించారు. తహసీల్ కార్యాలయం ఎదుట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. తహసీల్దార్ లతను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇన్చార్జి డీఆర్వో, ఆర్డీవో వినోద్‌కుమార్ ఉన్నారు. -
పాస్‌బుక్, టైటిల్ డీడ్ లేకుండానే..పంట రుణం
గత నెలలోనే ఆర్డినెన్స్ జారీ ⇒ అయినా పట్టించుకోని బ్యాంకులు ⇒ ఆర్డినెన్స్‌కు ప్రచారం లేకపోవడమే కారణం ⇒ ఇకపై టైటిల్‌డీడ్ కమ్ పాస్‌బుక్ ఒకటే రికార్డు ⇒ ఆన్లైన్లోనే ఆర్వోఆర్ రికార్డుల నిర్వహణ సాక్షి, హైదరాబాద్ పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్ లేకుండానే రైతులకు పంట రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. నెల రోజుల కిందే ఈ ఆర్డినెన్స్‌ను అమల్లోకి తెచ్చింది. ‘తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ (అమెండ్మెంట్)’పేరుతో గత నెల 17న జారీ చేసిన ఆర్డినెన్స్‌లో దీనితో సహా పలు కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. వాటి ప్రకారం రాష్ట్రంలో బ్యాంకులు రైతుల వద్ద పూచీకత్తు పత్రాలేవీ తీసుకోకుండానే రుణాలు మంజూరు చేయాలి. కానీ ఈ ఉత్తర్వులు ఇంకా క్షేత్రస్థాయిలో అమల్లోకి రాలేదు. పట్టాదారు పాస్ పుస్తకం లేదా టైటిల్ డీడ్, సంబంధిత వ్యవసాయ అధికారి ధ్రువీకరణ ఉంటే తప్ప రుణం ఇచ్చే ప్రసక్తే లేదంటూ బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను తగినంతగా ప్రచారం చేయకపోవడం, విధి విధానాల అమలుపై దృష్టి కేంద్రీకరించక పోవటంతో ఈ పరిస్థితి నెలకొంది. టీఎల్ఆర్ఎంఎస్లో భూముల వివరాలు ఆర్డినెన్స్ ప్రకారం రాష్ట్రంలో భూముల యా జమాన్య సంబంధిత రెవెన్యూ రికార్డులన్నీ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) ఎలక్ట్రానిక్ నమూనాలో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏ సర్వే నంబర్లో ఉన్న భూమి అయినా ఏ రైతుకు చెందినదో తెలుసుకునేందుకు వీలుగా ‘తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (టీఎల్‌ఆర్‌ఎంఎస్)’ను రూపొందించారు. టీఎల్ఆర్ఎంఎస్తో పాటు మీసేవ పోర్టల్‌లో ఈ వివరాలు అందుబాటులో ఉంటాయి. బోగస్ పాస్‌బుక్‌లు, టైటిల్డీడ్లకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పాత పద్ధతి వీడని బ్యాంకులు కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకర్లు టీఎల్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లోని లోన్ మాడ్యుల్ ద్వారా రైతుకు సంబంధించిన భూమి వివరాలు పరిశీలించి.. వారికి ఇవ్వగలిగిన స్థాయిలో పంట రుణాన్ని మంజూరు చేయాల్సి ఉంది. అంతేతప్ప రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లను తమ వద్ద పెట్టుకోవద్దు. కానీ ఈ ఆర్డినెన్స్ అమలుపై ప్రభుత్వం ఇంకా దృష్టి సారించకపోవడంతో.. బ్యాంకులు పాత పద్ధతిలోనే పాస్‌బుక్‌లు, టైటిల్ డీడ్లను తనఖాగా పెట్టుకుని రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈనెల 15వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో దాదాపు 8.15 లక్షల మంది రైతుల పంట రుణాలు రెన్యువల్ చేయగా... కేవలం 1,712 మందికి మాత్రమే లోన్ మాడ్యుల్ పద్ధతిలో రుణాలు మంజూరు చేసినట్లు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఇకపై ఒకటే ఎలక్ట్రానిక్ పాస్‌బుక్ ఇకపై పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్లు వేర్వేరుగా ఉండకుండా.. వాటి స్థానంలో టైటిల్ డీడ్–పాస్‌బుక్ పేరుతో ఒకటే రికార్డు ఉంటుంది. ఈ ఏడాది చివరిలోగా అత్యంత భద్రమైన ఎలక్ట్రానిక్ కార్డు రూపంలో దీనిని అందజేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు బోగస్ రిజిస్ట్రేషన్లు, డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు కళ్లెం చేసేందుకు టీఎల్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లో ఉన్న వివరాలతోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
పట్టా తాకట్టు!
► అన్నదాత అప్పుతిప్పలు ► రుణాలివ్వని బ్యాంకర్లు ► వడ్డీ వ్యాపారులే దిక్కు ► పట్టాపాస్‌బుక్ గిరి పెడితేనే రుణాలు ► పంటనూ తమకే విక్రయించాలని షరతులు బాన్సువాడ టౌన్(బాన్సువాడ) : రైతులకు కొత్త కష్టం వచ్చింది. సరైన వర్షాలు లేకపోవడంతో పంటలను గట్టెక్కించుకోవడానికి ఇబ్బంది పడ్డ అన్నదాత.. ప్రస్తుతం అప్పపుట్టక విలవిల్లాడుతున్నాడు. ఈ సారి తొలకరి జల్లులు ముందే పడడంతో మురిసిన రైతులు పంటలసాగు ప నులు మొదలుపెట్టారు. అయితే బ్యాం కుల్లో అప్పు పుట్టక, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. తమకు ఉన్న ఏకైక ఆధారం భూమి పట్టా పుస్తకాలను కుదవపెడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సర్వే సమయంలో రైతులు అధికారులతో ఈ విషయం తెలిపారు. జిల్లాలో చాలా మంది రైతులు తమ భూమి పట్టాపాసు పుస్తకాలను అప్పు కోసం వడ్డీ వ్యాపారుల వద్ద కుదవపెట్టినట్లు తెలిసింది. పంటను తమకే విక్రయించాలని వడ్డీ వ్యాపారులు ఒప్పందం రాయించుకుంటున్నారని సమాచారం. నగదు కొరతతో ఇబ్బందులు నోట్ల రద్దు తర్వాత మార్కెట్లో నగదు లభ్యత తగ్గింది. బ్యాంకుల్లోనూ డబ్బులు ఉండడం లేదు. బడాబాబులు పెద్దనోట్లను తమ లాకర్లలో దాచుకున్నారు. బ్యాంకుల్లో దాచుకోవడం కన్నా ఇంట్లో పెట్టుకోవడమే ఉత్తమమని చాలా మం ది భావిస్తున్నారు. దీంతో నగదు కొరత తీవ్రమైంది. రైతులు విక్రయించిన ధా న్యం డబ్బులు ఖాతాల్లో జమ అయినా.. నగదు కొరతతో వాటిని బ్యాంక ర్లు ఇవ్వలేకపోతున్నారు. మరోవైపు 2017–18 కి సంబంధించి వార్షిక పంట రుణ ప్రణాళిక ప్రకటించినప్పటికీ రుణాలను ఇవ్వలేకపోతున్నారు. లక్ష్యానికి దూరంగా.. గతేడాది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రూ. 3,931 కోట్ల రుణ లక్ష్యం ఉండగా.. రూ. 3,140 కోట్లు మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో వార్షిక పంట రుణ ప్రణాళిక రూ. 2,409 కోట్లు కాగా, కామారెడ్డి జిల్లాలో రూ. 1,674 కోట్ల రుణాలు అందజేయాలన్నది లక్ష్యం.. ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు 25 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు సగం లక్ష్యం కూడా చేరుకోలేదు. చాలా వరకు బ్యాంకులు రు ణాలను రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో నగదు నిల్వలు భారీగా పడిపోయా యి. చాలా బ్యాంకుల్లో నోక్యాష్ బోర్డు లే కనిపిస్తున్నాయి. రైతు రుణాలను త ప్పనిసరిగా చెల్లించాల్సి వస్తే సగం అ కౌంట్‌లో జమ చేస్తున్నారు. విచిత్రంగా సదరు బ్యాంకుకు చెందిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని, దాని ద్వారా చెల్లింపులు చేసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. బ్యాంకు అధి కారులు ఇస్తున్న ఉచిత సలహాలతో రైతులు విస్తుపోతున్నారు. పెద్దగా చదువుకోనివారు యాప్ ద్వారా ఎలా లావాదేవీలు నిర్వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారుల వద్దకు.. రుణాలివ్వడంలో బ్యాంకులు చేతులు ఎత్తేస్తుండడంతో రైతులు ప్రైవేటు వ్యా పారులను ఆశ్రయిస్తున్నారు. భూమి హక్కులకు సంబంధించి రెవెన్యూ వి భాగం రైతులకు రెండు పాస్‌పుస్తకాల ను అందజేస్తోంది. అందులో ఒకటి టై టిల్డీడ్ పుస్తకం కాగా మరొకటి పాస్ పుస్తకం. ఆర్డీవో సంతకం ఉండే టైటిల్ పుస్తకాలు ఇది వరకే బ్యాంకుల్లో ఉండడంతో.. అప్పుల కోసం రైతులు తమ వద్ద ఉన్న రెండో పాసుపుస్తకాన్ని ప్రైవే టు వ్యాపారుల వద్ద కుదవపెడుతున్నారు. జిల్లాలోని గా>ంధారి, బీర్కూర్, బిచ్కుంద, మద్నూర్ మండలాల్లో 40 శాతం రైతులు పాసు పుస్తకాలను తాకట్టు పెట్టినట్లు సమాచారం. వీరు ప్రతి ఏటా వ్యవసాయ పెట్టుబడులకు తమ పాసు పుస్తకాలను వడ్డీవ్యాపారుల వద్ద ఉంచి కావాల్సిన పెట్టుబడులు తెచ్చుకుంటారు. కొందరు వ్యాపారులైతే తమకే పంట ఉత్పత్తులను విక్రయించాలని ఒప్పందం చేసుకుంటున్నారని, దీనికి అంగీకరించకపోతే రుణాలు ఇవ్వడం లేదని తెలిసింది. రైతు సమగ్ర సర్వే కోసం గ్రామాలకు వెళ్లిన వ్యవసాయ అధికారులకు ఈ విషయాన్ని చెప్పుకున్నట్లు సమాచారం. అధికారులు స్పందించి, పంట రుణాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది. -
పత్తాలేని ‘ఈ–పట్టా’!
- రెండేళ్ల కిందటే డిజైన్లను ఆమోదించిన ప్రభుత్వం - అన్ని జిల్లాల్లోనూ నిలిచిన పాసు పుస్తకాల జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడి మూడేళ్లవుతున్నా పట్టాదారు పాసు పుస్తకాలు ఇంకా ఏపీ పేరు మీదే ఉన్నాయి. వాటిని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించి రెండేళ్లు అయినా అమలులో అడుగు ముందుకు పడడం లేదు. ఎలక్ట్రానిక్(ఈ)పట్టాదార్ పాసు పుస్తకాలు, ఈ– యాజమాన్యపు హక్కు(టైటిల్ డీడ్) పత్రాల కోసం కొత్త డిజైన్లను కూడా అప్పట్లో ఆమోదించింది. దాదాపు రెండున్నర దశాబ్దాల అనంతరం పట్టాదారు పాస్‌పుస్తకాల రూపాన్ని మారుస్తుండడం, కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం పేరిట పాసుబుక్‌లు, టైటిల్ డీడ్లు వస్తున్నాయని తెలిసి రైతులతోపాటు రెవెన్యూ వర్గాలు కూడా ఎంతో ఆశగా ఎదురు చూశాయి. సుమారు 25 లక్షల పాత పుస్తకాలు ఏపీ పేరు మీదనే ఉన్నాయి. రాష్ట్రమేర్పడిన తర్వాత కొత్త పాస్‌పుస్తకాల జారీని ప్రభుత్వం నిలిపివేయడంతో సుమారు 5 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలను పొందలేకపోతున్నారు. భూపరిపాలన ప్రధాన కమిషనర్ పోస్ట్‌ను ఎంతోకాలంగా ప్రభుత్వం భర్తీ చేయకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకే సీసీఎల్ ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగిస్తుండడంతో క్షేత్రస్థాయి పరిస్థితులపై పర్యవేక్షణ లోపించింది. జిల్లా కలెక్టర్లకు అందని ఆదేశాలు ప్రభుత్వం ఆమోదించిన కొత్త డిజైన్ల(రంగులు, స్లోగన్లు, ఎంబ్లమ్)లోనే ఎలక్ట్రానిక్ పాస్‌బుక్‌లు, టైటిల్ డీడ్లను జిల్లాల్లోనే ముద్రించాలని భూపరిపాలన విభాగం 2015 ఆగస్టులోనే నిర్ణయించింది. పట్టాదారు పాసుపుస్తకానికి, యాజమాన్యపు హక్కు పత్రానికి ప్రత్యేకమైన కోడ్, నంబరు, రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీవో) సంతకం తప్పనిసరిగా ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. పాస్‌బుక్, టైటిల్డీడ్ల మొదటి పేజీకి వాటర్ మార్క్డ్ మ్యాప్‌లిథో పేపరునే వినియోగించాలని, రైతు ఫొటోను అతికించి, ఆర్డీవో సంతకం చేశాక ఆపేజీని భద్రతరీత్యా లామినేషన్ చేయించాలని నిర్ణయించారు. కానీ, ఈ–పాస్బుక్ల జారీపై జిల్లా కలెక్టర్లకు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ప్రభుత్వం ఆమోదించిన ఈ–పట్టాదార్ పాస్‌బుక్ కవర్‌పేజీపై రైతు, రైతుకూలీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, చివరిపేజీపై బంగారు తెలంగాణకు బాటలు వేయండని స్లోగన్లు ఉన్నాయి. పాస్‌బుక్, టైటిల్ డీడ్ల మొదటి పేజీలో వ్యవసాయదారుని పేరు, చిరునామా, భూమి ఉన్న గ్రామం.. తదితర వివరాలుంటాయి. ఈ వివరాలను ధ్రువీకరిస్తూ వ్యవసాయదారుడు, తహసీల్దారు, ఆర్డీవోలు సంతకం చేయాల్సి ఉంటుంది. -
ఏసీబీకి చిక్కిన మాధవరం వీఆర్ఓ
డోన్ టౌన్: రైతు పట్టదారు పాసుపుస్తకాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ఓ వీఆర్ఓ.. రైతు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. డోన్ మండలం ధర్మవరం గ్రామానికి చెందిన తలారి బోయ పుల్లయ్య ప్యాపిలి మండలం మాధవరం వీఆర్ఓగా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ 21 ఎకరాల వ్యవసాయ భూమిని నలుగురి పేర్లపై విడిభాగాలుగా ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు వీఆర్ఓను ఆశ్రయించాడు. నాలుగు నెలలుగా తిరుగుతున్నా పట్టించుకోలేదు. చివరకు ఆన్లైన్ నమోదుకు రూ. 12వేల లంచం డిమాండ్ చేసి రూ. 10వేలకు రైతుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పటికే వీఆర్ఓ వైఖరితో విసిగి పోయిన రైతు లక్ష్మీనారాయణ కర్నూలు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు వల పన్నారు. సోమవారం డోన్ పట్టణంలో వీఆర్ఓ తన స్వగృహంలో రైతు నుంచి రూ. 10వేలు తీసుకొంటుండగా అప్పటికే సమీపంలో మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ విజయరామరాజు, సీఐలు కృష్ణారెడ్డి, సీతారామరావు తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. వీఆర్ఓ నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి వీఆర్ఓ తలారి పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు.