ఏసీబీకి చిక్కిన మాధవరం వీఆర్‌ఓ
ఏసీబీకి చిక్కిన మాధవరం వీఆర్‌ఓ
Published Tue, Mar 21 2017 12:03 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
డోన్ టౌన్: రైతు పట్టదారు పాసుపుస్తకాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ఓ వీఆర్‌ఓ.. రైతు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. డోన్ మండలం ధర్మవరం గ్రామానికి చెందిన తలారి బోయ పుల్లయ్య ప్యాపిలి మండలం మాధవరం వీఆర్‌ఓగా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ 21 ఎకరాల వ్యవసాయ భూమిని నలుగురి పేర్లపై విడిభాగాలుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు వీఆర్‌ఓను ఆశ్రయించాడు. నాలుగు నెలలుగా తిరుగుతున్నా పట్టించుకోలేదు.
చివరకు ఆన్‌లైన్ నమోదుకు రూ. 12వేల లంచం డిమాండ్ చేసి రూ. 10వేలకు రైతుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పటికే వీఆర్‌ఓ వైఖరితో విసిగి పోయిన రైతు లక్ష్మీనారాయణ కర్నూలు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు వల పన్నారు. సోమవారం డోన్ పట్టణంలో వీఆర్‌ఓ తన స్వగృహంలో రైతు నుంచి రూ. 10వేలు తీసుకొంటుండగా అప్పటికే సమీపంలో మాటు వేసిన ఏసీబీ డీఎస్పీ విజయరామరాజు, సీఐలు కృష్ణారెడ్డి, సీతారామరావు తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. వీఆర్‌ఓ నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి వీఆర్‌ఓ తలారి పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు.
Advertisement