రండి బాబూ.. రండి!
- పలువురు తహశీల్దార్ల చేతివాటం
- బదిలీల నేపథ్యంలో అక్రమార్జన
- ఎడాపెడా భూమి మార్పిడి
- ఫైళ్లపై చకచకా ఆఖరి సంతకం
జిల్లాలో 42 మంది తహశీల్దార్లకు బదిలీ ఉత్తర్వులు రానున్నాయి. వారిలో చాలామంది గిట్టుబాటవుతాయనుకున్న పాత అర్జీలకు బూజు దులిపే పనిలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా పాస్‌పుస్తకాలు వారికి కాసుల పంట పండిస్తున్నాయి. మార్పులు, చేర్పులకు సంతకాలు చేయాలంటే వారు అడిగినంత సమర్పించుకోక తప్పని దయనీయ పరిస్థితి రైతులది. అసైన్డ్ భూములను సైతం పాస్‌పుస్తకాల్లో చేర్చేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం.
ఈ తరహా అక్రమాల్లో లక్షలాది రూపాయల సొమ్ము చేతులు మారుతోంది. దీనికితోడు భూమి మార్పిడి (ల్యాండ్ కన్వర్షన్) విషయంలోనూ వారు తమకు అనుకూలంగా మలుచుకుని లక్షలు గడించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కొల్లేరు, అసైన్డ్ భూములు, సీఆర్‌జెడ్ భూముల్లో అనధికార చెరువులు తవ్వుకునేందుకు, కొన్నిచోట్ల చెరువులకు అనుమతులిస్తూ భారీగా సొమ్ము దండుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు ఇసుక క్వారీల వ్యవహారాల్లోని లోపాలను చూసీచూడనట్టు వదిలేయడానికి రేట్లు విధించారు. గతంలో పక్కన పెట్టిన ఫైళ్లను మళ్లీ బయటకు తీసి కొత్తగా ఒప్పందాలు చేసుకుని పాత తేదీలతో సంతకాలు చేసే పనిలో కొందరు తహశీల్దార్లు తలమునకలయ్యారు. ఒక్కమాటల్లో చెప్పాలంటే అక్రమాలను సక్రమాలుగా చేయడానికి.. ప్రతి పనికీ విలువను నిర్ణయించేశారు.
రేపటిలోగా బదిలీలు..
ఇప్పటికే ఇతర జిల్లాల నుంచి 24 మంది తహశీల్దార్లు జిల్లాకు బదిలీ అయ్యారు. వారు ఇక్కడికి వచ్చాక జిల్లా నుంచి 42 మంది తహశీల్దార్లు బదిలీ కాక తప్పదు. ఇందుకు సంబంధించి భూ పరిపాలన ప్రధాన అధికారి (సీసీఎల్‌ఏ) నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. సోమవారం నాటికి జిల్లాలోని తహశీల్దార్ల బదిలీకి మార్గం సుగమం అవుతుందని అంటున్నారు. బదిలీ సమయం దగ్గర పడడంతో పలువురు తమదైన రీతిలో కౌంటర్లు తెరిచినా.. డివిజనల్ స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం కొసమెరుపు.
తహశీల్దార్ల మామూళ్ల దందా ఇలా..
పాస్‌బుక్‌కు రూ.2 వేలు నుంచి రూ. 5 వేలు.
ల్యాండ్ కన్వర్షన్ ఎకరాకు రూ.10 వేలు.
అక్రమంగా చేపల చెరువు తవ్వుకునేందుకు ఎకరాకు రూ.6 వేలు నుంచి రూ. 10 వేలు.
కాస్త అవినీతిపాళ్లు ఎక్కువైన తహశీల్దార్లయితే చెరువు తవ్వుకునే ఆసాముల నుంచి ఒక్కో ట్రాక్టర్‌కు రోజుకు రూ.300 చొప్పున వసూలు చేస్తూ అక్రమార్జనకు పరాకాష్టగా నిలుస్తున్నారు.
అసైన్డ్, సీఆర్‌జెడ్, మడఅడవుల్లో చెరువుల తవ్వకానికి ఎకరాకు రూ.50 వేలు నుంచి రూ. లక్ష.
ఇసుక క్వారీల్లో అక్రమ తరలింపు కోసం రూ.50 నుంచి రూ. లక్ష.