
సాక్షి,హన్మకొండజిల్లా: హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి సంక్రాంతి జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన తెలిపారు. జాతర సందర్భంగా కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు సరిగా చేయకుండా నిర్లక్ష్యం వహించారని పలువురు భక్తులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని వీరభద్రస్వామి ఆలయ కమిటీ మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అలిగిన మంత్రి పోలీసు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
ఆలయ గెస్ట్‌హౌజ్ వద్ద నేలపై కూర్చొని అధికారుల తీరుపై నిరసన తెలిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలోనూ మోకాళ్లపై నిలబడి తన అసహనాన్ని వెల్లడించారు. కాగా,హైదరాబాద్ ఇంఛార్జ్‌గా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గతేడాది హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాల సందర్భంగా బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయంలో అధికారులపై అలిగి గుడిలోనే బైఠాయించారు.
తనకు, జీహెచ్‌ఎంసీ మేయర్‌కు ప్రోటోకాల్ పాటించలేదని అధికారులపై తన నిరసనను తెలిపారు. అనంతరం అధికారులు బుజ్జగించిన తర్వాత పొన్నం అలకవీడడం గమనార్హం. సొంత హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ జాతరలోనూ తాజాగా పొన్నం అధికారులపై బహిరంగంగానే తన అసహనాన్ని తెలపడం చర్చనీయాంశమైంది.