భూమాయ కేసులో.. కీలక సూత్రధారుల అరెస్టు | Fake Passbooks Gang Arrest in Amalapuram | Sakshi
Sakshi News home page

దొరికారు..

Published Fri, Dec 6 2019 12:21 PM | Last Updated on Fri, Dec 6 2019 12:21 PM

Fake Passbooks Gang Arrest in Amalapuram - Sakshi

భూ మాయ కేసులో ప్రధాన నిందితులు, సూత్రధారులైన మోటూరి చిన తాతయ్యనాయుడు, లక్ష్మీనరసమ్మ దంపతులు, వారి కుమారుడు బలరామమూర్తిలను అరెస్ట్‌ చేసిన సీఐ సురేష్‌బాబు, ఎస్సై శ్రీనివాసరావు

తూర్పుగోదావరి, అమలాపురం టౌన్‌: అమలాపురం భూమాయ కేసులో ప్రధాన నిందితులు, సూత్రధారులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. అమలాపురం తహసీల్దార్‌ కార్యాలయం వేదికగా సాగిన ఈ భూమాయలో ప్రధాన నిందితులైన  ఉప్పలగుప్తానికి చెందిన మోటూరి చిన తాతయ్యనాయుడు, లక్ష్మీనరసమ్మ, వారి కుమారుడు మోటూరి బలరామమూర్తిలను అమలాపురం డీఎస్పీ షేక్‌ మాసూమ్‌ బాషా ఆధ్వర్యంలో పట్టణ సీఐ జి.సురేష్‌బాబు గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు స్థానిక ఎర్రవంతెన వద్ద అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. వాస్తవంగా లేని 53 ఎకరాల భూములకు నకిలీ రికార్డులు సృష్టించి వాటిని అమలాపురం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో తనఖా పెట్టి రూ.1.50 కోట్లు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ మోసానికి పాల్పడిన, సహకరించిన స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ బేబీ జ్ఞానాంబతో పాటు మరో సూత్రధారి కామనగరువు వీఆర్వో బడుగు ప్రశాంత్‌కుమార్, అమలాపురం తహసీల్దార్‌ కార్యాలయ వెబ్‌ ల్యాండ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ వంశీకృష్ణ, కాట్రేనికోన మండలం కందికుప్ప, చిర్రయానాం వీఆర్వోలు ఏసురత్నం, విష్ణుమూర్తిలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితులు భార్యాభర్తలు, వారి కుమారుడిని పోలీసులు అరెస్ట్‌ చేయగా అదే రోజు ఈ కేసులో మరో నిందితుడైన బ్యాంక్‌ రుణానికి గ్యారంటీర్‌గా ఉన్న ఉప్పలగుప్తానికి చెందిన మోటూరి చిన తాతయ్యనాయుడు పొలంలో పనిచేసే పాలేరు కాశి పల్లంరాజు కూడా కోర్టులో పోలీసులకు లొంగిపోయాడు. ఇక కేసులో అరెస్ట్‌ చేయాల్సిన ఒకే ఒక నిందితుడు విశ్రాంత తహసీల్దార్‌ నాగాబత్తుల రమేష్‌ పరారీలోనే ఉన్నాడు. అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ సురేష్‌బాబు, ఎస్సై వి.శ్రీనివాసరావు నిందితుల వివరాలను వెల్లడించారు.

మోసం బయటపడిందిలా..
బ్యాంక్‌ను బురిడీ కొట్టించి తీసుకున్న భారీ రుణానికి కొన్ని వాయిదాలు చెల్లించి మోటూరి కుటుంబీకులు మిన్నకున్నారు. అనుమానం వచ్చిన బ్యాంక్‌ అధికారులు తమ వార్షిక తనిఖీల్లో భాగంగా తనఖా పెట్టిన ఈ 53 ఎకరాల భూములను వెబ్‌ల్యాండ్‌ చూసుకోవడంతో పాటు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. వెబ్‌ ల్యాండ్‌లో, క్షేత్రస్థాయిలో ఆ భూములు లేకపోవడంతో బ్యాంక్‌ను మోసం చేసినట్టు గత సెప్టెంబర్‌లో గుర్తించి రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అప్పటి నుంచి ఈ భూమాయ వెలుగు చూసింది.

బ్యాంక్, రిజిస్ట్రార్‌ అధికారులపైవచ్చిన అభియోగాలపైనా విచారణ
ఈ భూమాయలో అటు అమలాపురం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లేని భూములకు ఈసీ, మార్టగేజ్‌ చేసిన ఆ కార్యాలయ అధికారులపైన, క్షేత్ర స్థాయి పరిశీలన చేయకుండా, లీగల్‌ ఒపీనియన్‌ సరిగా తీసుకోకుండా రుణం ఇచ్చేసిన బ్యాంక్‌ అధికారులపైన వస్తున్న అభియోగాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని సీఐ సురేష్‌బాబు వెల్లడించారు. వారి పాత్ర కూడా ఉన్నట్టు తెలిస్తే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

నకిలీ రికార్డుల సృష్టి ఇలా..
మోటూరి చినతాతయ్యనాయుడు కుటుంబీకులు 2017 ఆగస్టులో తొలుత కాట్రేనికోన మండలం కందికుప్ప, చిర్రయానం గ్రామాల్లో లేని 53 ఎకరాలకు అప్పటికే అదే మండలంలో వీఆర్వోగా పనిచేస్తున్న ప్రశాంత్‌కుమార్‌ పథకంతో ఆ రెండు గ్రామాల వీఆర్వోల సహకారంతో నకిలీ రికార్డులు సృష్టించారు. అందుకు అప్పటి కాట్రేనికోన తహసీల్దార్‌ నాగాబత్తుల రమేష్‌ కూడా సహకారం అందించారు. ఈ నకిలీ రికార్డులను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు సమర్పించి రూ.1.50 కోట్ల రుణం కోసం ప్రయత్నించారు. అయితే భూములు కాట్రేనికోన మండలానికి చెందినవి కావడంతో బ్యాంక్‌ అధికారులు ఈ దస్తావేజులను మార్ట్‌గేజ్‌ కోసం ముమ్మిడివరం రిజిస్ట్రార్‌ కార్యాలయానికి పంపారు. అక్కడి రిజిస్ట్రార్‌ వాటిని పరిశీలించగా నకిలీ రికార్డులుగా గుర్తించి ఈ సమాచారాన్ని కాట్రేనికోన తహసీల్దార్‌ కార్యాలయానికి తెలిపారు. దీంతో అక్కడ వీరి అక్రమాలు పారకపోవడంతో వారి స్కెచ్‌ను అమలాపురం తహసీల్దార్‌ కార్యాయానికి మార్చారు. అప్పటికే అమలాపురం రూరల్‌ మండలం వీఆర్వోగా వచ్చిన ప్రశాంత్‌కుమార్‌ మరో స్కెచ్‌ వేశారు. అందుకు అప్పటి అమలాపురం తహసీల్దార్‌ బేబీ జ్ఞానాంబతో పాటు అదే కార్యాలయంలోని కంప్యూటర్‌ ఆపరేటర్‌ వంశీకృష్ణ అందుకు సహకరించారు. అంతే మరోసారి ఇదే మండలంలో లేని 53 ఎకరాలకు తప్పడు రికార్డులు తయారుచేయడం, వాటిని అదే బ్యాంక్‌లో తనఖా పెట్టడం చకాచకా జరిగిపోయాయి. ఈసారి ముమ్మిడివరం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దొరికిపోయినట్టు దొరికిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అమలాపురం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లేని భూములకు మార్టగేజ్‌ అయ్యే వరకు వెబ్‌ల్యాండ్‌లో నకిలీ సర్వే నంబర్లు అలానే ఉంచి బ్యాంక్‌ రుణం మంజూరు చేసిన తర్వాత వెబ్‌ ల్యాండ్‌ నుంచి ఈ నంబర్లను రీవోక్‌ చేసేశారు. ఇదంతా 2018 జూన్‌లో జరగడం...బ్యాంక్‌ రుణం ఇచ్చేయడం జరిగిపోయింది.

ఎవరికి ఎంతెంత లంచం?
ఈ భూమాయలో సహకరించిన రెవెన్యూ అధికారులకు మోటూరి తాతయ్యనాయుడు కుటుంబీకులు బ్యాంక్‌ నుంచి అప్పనంగా తీసుకున్న రూ.1.50 కోట్ల రుణం నుంచి రూ.22 లక్షలు లంచాలుగా పంచేశారు. తొలుత కాట్రేనికోన తహసీల్దార్‌ కార్యాయంలో పుట్టించిన నకిలీ రికార్డుల కోసం అప్పటి తహసీల్దార్‌ రమేష్‌కు రూ.ఐదు లక్షలు, స్కెచ్‌ వేసిన వీఆర్వో ప్రశాంత్‌కుమార్‌కు రూ.ఐదు లక్షలు, కందికుప్ప, చిర్రయానాం వీఆర్వోలు ఏసురత్నం, విష్ణుమూర్తిలకు చెరో రూ.రెండు లక్షలు ఇచ్చారు. తర్వాత అమలాపురం తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగిన నకిలీలకు తహసీల్దార్‌ బేబీ జ్ఞానాంబకు రూ.ఐదు లక్షలు, వీఆర్వో ప్రశాంత్‌కుమార్‌కు రూ.రెండు లక్షలు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ వంశీకృష్ణకు రూ.లక్ష లంచాలు అందించారు. ఈ లంచాల వివరాలను సీఐ సురేష్‌బాబు గణాంకాలతో వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement