సాక్షి, హైదరాబాద్ : రైతుబంధు చెక్కు రైతుఖాతాలో జమ కావాలంటే పాస్ పుస్తకం ఉండాల్సిందే. రైతుల గుర్తింపుపత్రంగా పాస్‌బుక్ చూపించాల్సి ఉంది. ఈ మేరకు ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.కె.జోషి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. పాస్‌పుస్తకాల ప్రింటింగ్‌కు కావాల్సిన సమాచారంతో వెంటనే వ్యవసాయ శాఖకు నివేదిక పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 72 లక్షల రైతు ఖాతాలుండగా ఇప్పటివరకు 67 లక్షల ఖాతాలను మాత్రమే తహసీల్దార్లు పూర్తి చేశారు. అందులోనూ 57 లక్షల ఖాతాల పాస్‌పుస్తకాల ముద్రణకు మాత్రమే సిఫారసు చేశారు.
చెక్కుల పంపిణీకి గడువు సమీపిస్తున్నందున గ్రామాలవారీగా ఎంత భూమి ఉంది.. అందులో ఎన్ని ఖాతాలున్నాయనే వివరాలను పంపాలని, అన్ని ఖాతాలను తహసీల్దార్లు డిజిటల్ సంతకాల ద్వారా అధీకృతం చేయాలని ఎన్‌ఐసీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఇంకా పూర్తి కానట్టు తెలుస్తోంది. భూరికార్డుల ప్రక్షాళన గణాంకాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు కూడా తేడా ఉం దని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆ తేడాలను పరిశీలించి సరిచేయాలని, డ్రాఫ్ట్ పాస్ పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేసి సదరు రైతుకివ్వాలని, అన్ని వివరాలు సరిగా ఉన్న తర్వాతే ఫైనల్ పాస్‌పుస్తకానికి సిఫారసు చేయాలని, ఇలాంటి భూముల వివరాలను కలెక్టర్లు, జేసీ లిఖితపూర్వకంగా నిర్ధారించి ఈ నెల 24వ తేదీలోపు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆ కమిటీకి అవసరం లేదు : అసైన్డ్ భూములను కబ్జాలో ఉన్న వారికి రీఅసైన్ చేసే విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రీ అసైన్‌మెంట్ కోసం గతంలో ఉన్న నియోజకవర్గ స్థాయి అసైన్‌మెంట్ కమిటీకి సంబంధంలేకుండానే జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవచ్చని భూపరిపాలన డైరెక్టర్ వి.కరుణ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు భూమిలేని వారు, పరిమితంగా భూములున్న పేదలు అసైన్డ్ భూములు లేదా ఇండ్లస్థలాలను కొనుగోలు చేసి కబ్జాలో ఉన్నట్టయితే వారికే ఆ భూములు, స్థలాలను నేరుగా కలెక్టర్లే రీ అసైన్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment