
నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా పోలీసు స్కూల్ (వైఐపీఎస్) సిద్ధమైంది. దీన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయగా, ప్రస్తుతం ఏడు ఎకరాల్లో కార్యకలాపాలు ప్రారంభించనున్నారు.
ఈ స్కూల్‌లో మొత్తం 200 సీట్లు ఉంటాయి. వీటిలో 100 పోలీసు అధికారులు, ఉద్యోగుల పిల్లలకు, మరో 100 సాధారణ పౌరుల పిల్లలకు కేటాయించారు. ప్రస్తుతానికి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రవేశాలు జరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలో అందుబాటులోకి వచ్చిన వైఐపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులను ఎంపిక చేశారు.
ఒక్కో తరగతిలో 40 మంది చొప్పున ఐదు క్లాసుల్లో కలిపి మొత్తం 200 మంది విద్యార్థులు ఉంటారు. ఇప్పటి వరకు 83 మంది పోలీసు, నలుగురు సాధారణ పౌరుల పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చారు. భవిష్యత్తులో 5 వేల మందికి అడ్మిషన్లు ఇస్తారు. విద్యార్థుల కోసం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,750 పడకలతో హాస్టల్‌ను నిర్మిస్తారు.
ప్రతిభగల ప్రైవేట్ టీచర్ల ఎంపిక
ఈ స్కూల్‌లో పని చేయడానికి ప్రతిభ గల ప్రైవేట్ టీచర్లను ఎంపిక చేసుకున్నారు. విద్యాభ్యాసంతోపాటు విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి యంగ్ ఇండియా పోలీసు స్కూల్ (Young India Police School) కృషి చేస్తుంది. త్వరలో ఉత్తమ క్రీడా శిక్షకులను ఎంపిక చేయనున్నారు. ఏడుగురు సభ్యులతో కూడిన గవర్నింగ్ సొసైటీ ఆధ్వర్యంలో వైఐపీఎస్ నడుస్తుంది.
దీనికి రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రెసిడెంట్‌గా, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) వైస్ ప్రెసిడెంట్‌గా, గ్రేహౌండ్స్ విభాగం అదనపు డీజీ ఎం.స్టీఫెన్ రవీంద్ర సెక్రటరీగా ఉంటారు. మరో నలుగురు సభ్యులు ఉన్నారు. విద్యార్థుల కోసం మూడు డిజైన్లతో కూడిన యూనిఫామ్స్ ఖరారు చేశారు.
వైఐపీఎస్ నుంచి ప్రతి విద్యార్థి పరిపూర్ణ వ్యక్తిత్వంతో బయటకు వెళ్తాడు. అందుకే విద్య, క్రీడలతోపాటు అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పోలీసు విభాగంలో కిందిస్థాయి ఉద్యోగులు పని ఒత్తిడి కారణంగా తమ పిల్లల బాగోగుల కోసం సమయం ఇవ్వలేరు. పెద్దపెద్ద స్కూళ్లలో చేర్చాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని సీట్ల రిజర్వేషన్, ఫీజులు నిర్ధారించాం.
– సీవీ ఆనంద్, పోలీసు కమిషనర్, హైదరాబాద్