కంచకు చేరని కథ | Dispute over 400 acres of land in Kancha Gachibowli | Sakshi
Sakshi News home page

కంచకు చేరని కథ

Published Fri, Apr 11 2025 4:24 AM | Last Updated on Fri, Apr 11 2025 4:24 AM

Dispute over 400 acres of land in Kancha Gachibowli

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములపై వివాదం

ప్రకృతి నడుమ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో అలజడి రేగింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదం రేగింది. విద్యార్థులందరూ ఏకమై ఉద్యమం చేపట్టారు. విద్యార్థి సంఘాలు, విపక్షాలు వీరికి మద్దతు పలకడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర సాధికార కమిటీ హెచ్‌సీయూలో వివాదాస్పద భూముల పరిశీలనకు వచ్చిన నేపథ్యంలో 
అసలు గతంలో ఏం జరిగింది?  ఈ వివాదమెందుకు వచ్చింది?  
విద్యార్థుల నిరసనలకు కారణమేంటి?  
ప్రభుత్వం వాదనేంటి?  
వర్సిటీ వర్గాల కౌంటరేంటి?  
ఈ మొత్తం వ్యవహారంపై ‘సాక్షి ఇన్‌డెప్త్‌’ స్టోరీ మీకోసం..   

గతంలో ఏం జరిగింది
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన తొలి దశ ఉద్యమం, ఆ తర్వాత జై ఆంధ్ర ఉద్యమాల నేపథ్యంలో 1970వ దశకం ప్రారంభంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1974లో హెచ్‌సీయూను ఏర్పాటు చేశారు. తొలుత నాంపల్లి స్టేషన్‌ రోడ్డులోని సరోజినీ నాయుడు ఇల్లు ‘గోల్డెన్‌ థ్రెషోల్డ్‌’లో ఇది ప్రారంభమైంది. 

ప్రస్తుత రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కంచ గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్‌ 25లో ఉన్న 2,324 ఎకరాలను కేటాయించిన తర్వాత అక్కడ పెద్ద క్యాంపస్‌ ఏర్పడింది. అప్పట్లోనే ఆ భూమి చుట్టూ ప్రహరీ గోడను కూడా కట్టారు. అప్పట్నుంచీ ఆ భూములన్నీ వర్సిటీ ఆధ్వర్యంలోనే ఉన్నా.. అధికారికంగా యూనివర్సి­టీ పేరిట మాత్రం భూముల బదలాయింపు జరగలేదు. అంటే అధికారికంగా యూనివర్సిటీ పేరిట ఒక్క ఎకరా కూడా లేదన్నమాట. 

అయితే ఉమ్మడి ఏపీలో 2012 నవంబర్‌ 20వ తేదీనే అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఈ భూముల బదలాయింపునకు సంబంధించిన ప్రతిపాదనలు భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయానికి వెళ్లాయి. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ప్రతిపాదనలు పరిష్కారానికి నోచుకోకపోవడం గమనార్హం. 

నాడు చంద్రబాబు చేసిన నిర్వాకం ఏమిటి? 
హెచ్‌సీయూకు కేటాయించిన భూముల్లోని ఈ 400 ఎకరాలూ వివాదాస్పదం కావడానికి ఆద్యుడు 2004లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు. ఆపద్ధర్మ ముఖ్య­మంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి నైతికంగా వీల్లేకపోయినా.. క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమంటూ పెద్దగా ఊరూ పేరూ లేని ఐఎంజీ భారత అనే సంస్థకు మొత్తం 850 ఎకరాలను చంద్రబాబు కేటాయించారు.

అందులో 400 ఎకరాలు హెచ్‌సీయూ కింద ఉన్న కంచ గచ్చిబౌలి సర్వే నంబర్‌ 25 లోనివి కాగా, మరో 450 ఎకరాలను మామిడిపల్లిలో కేటాయించారు. అవగాహన ఒప్పందాలు, కేటాయింపు ఉత్తర్వులు, రిజిస్ట్రేషన్‌ కూడా ఆగమేఘాల మీద చేసేశారు. 2004 ఫిబ్రవరి 10వ తేదీన ఆ భూమి ఐఎంజీ పేరిట రిజిస్ట్రేషన్‌ అయ్యింది.

వాస్తవానికి ఆ సమయంలో మొత్తం 534.28 ఎకరాలను వర్సిటీ నుంచి తీసుకున్న బాబు.. 400 ఎకరాలు ఐఎంజీ భారత్‌కు, 134.28 ఎకరాలు ఏపీఎన్జీవోలకు కేటాయించారు. ఐఎంజీ భారత్‌ పేరుతో బిల్లీరావు అనే వ్యక్తికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఈ భూ పందేరాన్ని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసింది. 

వైఎస్సార్‌ ఏం చేశారు? 
వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2006లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తెచ్చి మరీ ఆ భూములను వెనక్కు తీసుకుంది. దీనిపై ఐఎంజీ సంస్థ హైకోర్టుకు వెళ్లింది. 24781/2006 నంబర్‌తో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల పాలనలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ, కేసీఆర్‌ హయాంలోని తెలంగాణ రాష్ట్రంలోనూ కలిపి 18 ఏళ్ల పాటు విచారణ నడిచింది. తిరిగి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందంటూ 2024 మార్చి 7న ఈ కేసులో హైకోర్టు తీర్పునిచ్చిoది. దీన్ని ఐఎంజీ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. 

స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) 9266/2024 దాఖలు చేసింది. ఈ కేసు కూడా రెండు నెలల్లోనే ముగిసింది. ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనంటూ 2024 మే 3వ తేదీన సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిoది. దీంతో ఆ 400 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానికి దఖలు పడ్డాయి. ఈ భూములను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ)కు బదలాయించేందుకు గత ఏడాది జూన్‌ 6వ తేదీన పరిశ్రమల శాఖ సిఫారసు చేసింది. 

ఇందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2024 జూలై 1న పంచనామా నిర్వహించి 400 ఎకరాలను టీజీఐఐసీకి అప్పగించారు. ఇప్పుడు ఆ భూములను పరిశ్రమలకు కేటాయించేందుకు వీలుగా చెట్లు, రాళ్లు చదును చేసే పనిలో టీజీఐఐసీ పడింది. ఇదే వివాదానికి దారితీసింది.   

ప్రభుత్వం ఏమంటోంది?
ఈ భూమి హెచ్‌సీయూది కాదని, మొత్తం 400 ఎకరాల్లో అంగుళం కూడా వర్సిటీ పరిధిలోనికి రాదనేది రాష్ట్ర ప్రభుత్వం వాదన. ‘సర్వే నంబర్‌ 25లో ఉన్న భూమి కంచ పోరంబోకు. చట్టప్రకారం అటవీ భూమి కూడా కాదు. ఈ 400 ఎకరాలను తీసుకున్నందుకు ప్రత్యామ్నాయంగా గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 36లో 191–36 ఎకరాలు, 37లో 205–20 ఎకరాలు కలిపి మొత్తం 397 ఎకరాలు వర్సిటీకి కేటాయించారు. ఈ 397 ఎకరాలను తీసుకోవడం ద్వారా ఆ 400 ఎకరాల భూమిపై వర్సిటీ హక్కులు వదులుకుంది. 

వర్సిటీ పరిధిలోని భూముల నుంచి ఈ 400 ఎకరాలను వేరు చేసేందుకు గాను 2017 జనవరి 2న రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. అయితే ఈ మెమోను సవాల్‌ చేస్తూ వర్సిటీ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ (816/2021)ను హైకోర్టు కొట్టివేసింది. తర్వాత ఈ భూములను డీమార్క్‌ చేసేందుకు 2024లోనే యూనివర్సిటీ వర్గాల అంగీకారంతోనే సర్వే కూడా నిర్వహించి సరిహద్దులను గుర్తించాం. 2010– 2020ల్లో గూగుల్‌ మ్యాప్‌ ద్వారా 400 ఎకరాలు పరిశీలిస్తే అంతా బంజరు భూమి. రాళ్లతో కూడి ఉంది. ఎలాంటి పచ్చదనం లేదు. 

2006–2024 వరకు నిర్లక్ష్యంగా ఆ భూములను వదిలేయడంతో చెట్లు, పొదలు మాత్రమే పెరిగాయి. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు చుట్టుపక్కల ఉన్న ఈ భూముల్లో ఐటీతో పాటు ఇతర రంగాల అభివృద్ధికి మంచి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి. రూ.50 వేల కోట్ల వరకు పెట్టుబడులతో పాటు 5 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. ఈ భూముల్లో అభివృద్ధి జరగడం ద్వారా హైదరాబాద్‌ లంగ్‌స్పేస్‌ దెబ్బతింటుందనేది వాస్తవం కాదు. 

ఈ భూమి చుట్టూ 5 కిలోమీటర్ల వ్యాసార్థంలో పెద్ద పెద్ద లంగ్‌స్పేస్‌లు అభివృద్ధి అయ్యాయి. 274 ఎకరాల విస్తీర్ణంలో కేవీబీఆర్‌ బొటానికల్‌ గార్డెన్‌ ఈ భూమికి 2 ఏరియల్‌ కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలాగే ఈ భూమిలోని రాతి అమరికలను ప్రభుత్వం ధ్వంసం చేయదు. అక్కడ ఉన్న చెరువును కూడా కాపాడుతుంది..’ అని ప్రభుత్వం చెబుతోంది.  

వర్సిటీ వర్గాలు ఏమంటున్నాయి?
యూనివర్సిటీ వర్గాలు మాత్రం భిన్నమైన వాదనలు విన్పిస్తున్నాయి. ఈ భూమి ఎవరిదన్న అంశం జోలికి వెళ్లకుండా.. ‘యూనివర్సిటీకి ఒకసారి కేటాయించిన భూములను రాష్ట్రపతి నియమించే ఆరుగురు సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఆమోదం మేరకు మాత్రమే ఎవరికైనా కేటాయించాల్సి ఉంటుంది. ఆ భూమిలో ప్రభుత్వం చెపుతున్నట్టు 2024లో ఎలాంటి సర్వే జరగలేదు. యూనివర్సిటీ భూముల నుంచి ఆ 400 ఎకరాలను వేరు చేయలేదు. ఈ భూమి భౌగోళిక స్థితిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే జరిగింది. 

400 ఎకరాలను వేరు చేసేందుకు వర్సిటీ అంగీకరించలేదు. అసలు ఆ భూములను వేరుచేస్తామనే సమాచారమే మాకు ప్రభుత్వం నుంచి అందలేదు. యూనివర్సిటీ ఏర్పాటై 50 ఏళ్లు గడుస్తున్న స్వర్ణోత్సవ సమయాన మాకు ఇచ్చిన భూములను పూర్తిస్థాయిలో అధికారికంగా బదలాయించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. ఈ ప్రాంత పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం..’ అని చెబుతోంది. అయి తే యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఆ భూములు సెంట్రల్‌ వర్సిటీవేనని ఘంటాపథంగా చెబుతున్నాయి. 

గతంలో భూములను ఎవరికి ఇచ్చారు?
ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి యూనివర్సిటీకి భూముల బదలాయింపు జరగకపోవడంతో రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా యూనివర్సిటీ పేరు కనిపించడం లేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఈ భూములపై యూనివర్సిటీకి శాశ్వత, స్పష్టతతో కూడిన హక్కులు లేకపోవడంతోనే రాష్ట్ర ప్రభుత్వాలు భూములను పందేరం చేశాయి. 

జవహర్‌ నవోదయ, ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఈబీ, రంగారెడ్డి హెడ్‌క్వార్టర్స్, మున్సిపల్, ఎమ్మార్వో ఆఫీసులు, టెలీకాం, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఏపీ, హాకీ స్టేడియం, మిలటరీ గేమ్స్, షూటింగ్‌ రేంజ్, ఐఎంజీ భారత్, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్, టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ... ఇలా ఇప్పటివరకు 1105.37 ఎకరాలను అనేక సంస్థలకు కట్టబెట్టాయి. ఇందులో ఎక్కువసార్లు  చంద్రబాబు ప్రభుత్వంలోనే ఇతర సంస్థలకు భూములు అప్పజెప్పారని రికార్డులు చెబుతున్నాయి. 

ఈ భూములు వర్సిటీ పేరిట లేకపోవడంతో సదరు సంస్థలకు భూముల బదలాయింపు ప్రభుత్వాలకు సులువుగా మారింది. యూనివర్సిటీ నుంచి అనుమతి తీసుకున్నట్టు సంతకాలు పెట్టించుకోవడం, పంచుల చేత దస్తూరి చేయించుకోవడంతోనే వర్సిటీకి కేటాయించిన భూములను ఇతర సంస్థలకు పందేరం చేసేశారు.  

పేరుకే కేటాయింపా? ఇప్పటివరకు హక్కు లేదా?  
సెంట్రల్‌ వర్సిటీకి 2,324 ఎకరాలు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు కానీ ఆ భూములను యూనివర్సిటీ పేరిట ప్రభుత్వాలు ఇప్పటికీ రిజిస్ట్రేషన్‌ చేయలేదు. కేవలం అప్పట్లో వచ్చిన ఉత్తర్వుల ఆధారంగా సర్వే చేసి చుట్టూ ప్రహరీగోడను నిర్మించారు. అయితే ఎన్ని ఎకరాల వ్యాసార్థంలో గోడ నిర్మించారో స్పష్టత లేకపోగా నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ గతంలో ఇచ్చిన ఓ నివేదికలో మాత్రం హెచ్‌సీయూ 1800 ఎకరాల్లో విస్తరించి ఉందని పేర్కొంది. తాజా వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భూముల అలినేషన్‌పై వివరణ ఇచ్చింది.

 ఇప్పటివరకు వర్సిటీకి భూముల బదలాయింపు జరగలేదని, వర్సిటీ భూములు అన్యాక్రాంతం కాకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశమని, వర్సిటీ యంత్రాంగం ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే ఆ భూములను వర్సిటీ పేరిట బదలాయిస్తామని ఇటీవల విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మరోవైపు భూముల బదలాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నట్టుగా ఈ వివాదం తలెత్తిన తర్వాతే యూనివర్సిటీ వర్గాలు కూడా బహిర్గతం చేశాయి.  

400 ఎకరాలతో ‘రుణా’నుబంధం 
ప్రస్తుతం టీజీఐఐసీ అదీనంలో ఉన్నట్టుగా చెబుతున్న సుమారు 400 ఎకరాలకు పైగా భూమిని వేలం వేయడం ద్వారా రూ.25 వేల కోట్ల మేర రాబడి సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. వాస్తవానికి ఈ 400 ఎకరాల భూమిని గ్యారంటీగా చూపి 9.6 శాతం వడ్డీపై ఐసీఐసీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రూ.10 వేల కోట్ల రుణం తీసుకుంది. 

అయితే రూ.20 వేల కోట్లకు పైగా విలువ కలిగిన ఈ భూములను సెక్యూరిటీగా పెట్టి కేవలం రూ.10 వేల కోట్ల రుణమే తీసుకోవడంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. వీటి వేలం ద్వారా రూ.25 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశముండటంతో అభివృద్ధి పనులు ప్రారంభించింది. అయితే తమకు సెక్యూరిటీగా పెట్టిన భూముల వేలం ఆలోచనపై ఐసీఐసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. 

కానీ రూ.10 వేల కోట్ల రుణానికి గాను ప్రభుత్వం ప్రతి నెలా రూ.100 కోట్ల కిస్తీ (ఈఎంఐ)చెల్లిస్తున్న నేపథ్యంలో వచ్చే రెండేళ్ల పాటు చెల్లించాల్సిన కిస్తీల మొత్తం సుమారు రూ.2,500 కోట్లు ముందస్తుగా చెల్లిస్తే బాండ్లు తిరిగి ఇస్తామని చెప్పింది. ఇందుకు అంగీకరించిన ప్రభుత్వం భూమిని చదును చేసే ప్రక్రియను చేపట్టింది.  

ఆ 397 ఎకరాలకూ పొజిషన్‌ ఇవ్వలేదా?  
ఐఎంజీ భారత్‌కు కేటాయించిన 400 ఎకరాల స్థానంలో 397 ఎకరాలు గోపన్‌పల్లి రెవెన్యూ పరిధిలో వర్సిటీకికేటాయించారు. కానీ ఆ భూముల పొజిషన్‌  ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వకపోవడం గమనార్హం. కాగా అసలుఆ ప్రత్యామ్నాయ భూములు ఎక్కడ ఉన్నాయో కూడా వర్సిటీ యంత్రాంగం గుర్తించలేని పరిస్థితుల్లో ఉండడం విశేషం. 

ఈ భూములు ఎందుకు ప్రత్యేకం? ఎందుకీ నిరసనలు?
విద్యార్థులకు తాము చదువుకునే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలన్నా, వాటికి చెందినభూములన్నా సాధారణంగా మక్కువ ఉంటుంది. తాము చదువుకునే సంస్థ భూముల జోలికి వెళితే విద్యార్థి లోకం అస్సలు సహించదు. ఇక ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడే విశ్వవిద్యాలయాల్లో ప్రకృతికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలోని ల్యాండ్‌స్కేప్‌ ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు హెచ్‌సీయూ విషయంలోనూ అదే జరిగింది. జీవ వైవిధ్యం తెరపైకి వచ్చింది. 

ప్రస్తుతం వర్సిటీ ఆధ్వర్యంలో ఉన్న భూమిలో 455 జాతుల వృక్ష, జంతుజాలాలున్నాయని అంటున్నారు. నెమళ్లు, జింకలు, పెద్ద పెద్ద చెరువులు, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాళ్ల అమరికలతో రమణీయంగా కనిపించే ఈ భూములు ఎక్కడ ప్రైవేటు వ్యక్తులు, సంస్థల పాలవుతాయోనన్న ఆందోళన విద్యార్థులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా కలగడంతోనే ఈ భూముల విషయంలో ఇంతటి అలజడి కనిపిస్తోంది. మరి ఈ కంచ గచి్చ»ౌలి భూముల కథ ఏ కంచకు చేరుతుందో వేచి చూడాల్సిందే.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement