
శనివారం ప్రజాభవన్‌లో బీసీ నేతలతో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ అనిల్‌కుమార్
సమగ్ర సర్వేపై కేసీఆర్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు సీఎం సవాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నూటికినూరు శాతం పక్కాగా నిర్వహించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వే చేపట్టిందని, ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక శాఖకు అప్పగించి పకడ్బందీగా నిర్వహించినట్లు వివరించారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సాహసం చేయలేదని, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
వ్యవస్థను కుప్పకూల్చే కుట్రలో భాగంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం ప్రజాభవన్‌లో బీసీ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. సర్వే చేపట్టిన విధానం, ఫలితాలు, బీసీల జనాభాకు సంబంధించిన అంశాలను ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌తోపాటు పలువురు బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సమగ్ర సర్వే, బీసీ జనాభా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
కేసీఆర్ ఎన్నికల కోసం వాడుకున్నారు
‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి సర్వే చేపట్టాం. అన్ని రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన చేయాల్సిందే. కేసీఆర్ చేసిన సకలజనుల సర్వే తప్పుల తడకగా ఉన్నందునే ఆ లెక్కలను బయటపెట్టలేదుం. వాటిని ఆయన ఎన్నికల కోసం వాడుకున్నారు.. ప్రజల కోసం వాడలేదు. ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వే ప్రక్రియ చేపట్టింది.
ఇంటింటికి ఎన్యుమరేటర్లు వెళ్లి సమాచారం సేకరించారు. ఆ సమాచారాన్ని తప్పులు దొర్లకుండా ఎన్యుమరేటర్ సమక్షంలో కంప్యూటరీకరించారు. తప్పులు జరిగాయని మాట్లాడుతున్న వారు ఎక్కడ తప్పు జరిగిందో నిరూపించాలి. అర్థంలేని ఆరోపణలు పట్టించుకోవాల్సిన పనిలేదు. కేసీఆర్ చేసిన సర్వే ప్రకారం బీసీలు 51 శాతం ఉంటే.. సమగ్ర ఇంటింటి సర్వే ప్రకారం బీసీ జనాభా 56.33 శాతం ఉంది. బీసీల లెక్క తగ్గిందా? పెరిగిందా? అనే విషయాన్ని బీసీలు గమనించాలి’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.
ఒకట్రెండు ఆధిపత్యవర్గాల కోసం...
జనగణనలో కులగణన చేపట్టాలనే డిమాండ్ ఎప్పట్నుంచో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘స్వతంత్ర భారత దేశంలో ఇప్పటివరకు కులగణన చేపట్టలేదు. ఒక్కసారి బీసీల లెక్క తెలిస్తే వాటా అడుగుతారనే ఆందోళనతో కొందరు కుట్ర చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీలోని ఒకట్రెండు ఆధిపత్యకులాల కుట్రల వల్లే ఈ ప్రక్రియ జరగడంలేదు. ఎంతోకాలంగా ఉన్న డిమాండ్‌ను మనం విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం.
దేశంలో కులగణన చేపట్టడం ఇష్టంలేకనే బీజేపీ కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీకి నేను విసిరే సవాల్ ఒక్కటే. జనగణనలో కులగణన చేర్చాలి. అప్పుడే ఎవరి లెక్క ఏంటో తేలుతుంది. జనగణనలో కులగణన చేర్చాలని ఈ సమావేశం వేదికగా తీర్మానం చేస్తున్నాంం. సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి మార్చి 10లోగా తీర్మానాలు చేయండి.
బీసీలు ఐకమత్యాన్ని చాటాలి. అప్పుడే రాజకీయంగా, విద్య, ఉద్యోగాల పరంగా ప్రయోజనం ఉంటుంది. బలహీన వర్గాలకు కులగణన నివేదికనే బైబిల్, భగవద్గీత, ఖురాన్. భవిష్యత్‌లో దేశంలో బీసీ రిజర్వేషన్ల గురించి చర్చించాలంటే తెలంగాణ గురించి, రేవంత్ రెడ్డి గురించి చర్చించుకునే పరిస్థితి ఉంటుంది. మోదీ రాజకీయంగా వ్యతిరేకత ఎదుర్కొనాల్సి వస్తుందనే ఈ ప్రక్రియను తప్పుబడుతున్నారు.
కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఉద్యోగాలు పోతాయనే భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సర్వే ప్రక్రియ పూర్తి చేయడంతో నా బాధ్యత పూర్తయింది. దీన్ని పట్టాలెక్కించి గమ్యం చేర్చే వరకు ముందుకు తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదే. తప్పుడు మాటలు మాట్లాడటం కాదు.. ఏ బ్లాక్‌లో, ఏ ఇంట్లో తప్పు జరిగిందో నిరూపించాలని కేసీఆర్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి సవాల్ విసురుతున్నా’ అని రేవంత్ పేర్కొన్నారు.
2011 జనగణనలో ఎస్సీ, ఎస్టీ వివరాలే వెల్లడించారు: భట్టి
చివరగా జరిగిన 2011 జనగణనలో కేవలం ఎస్సీ, ఎస్టీల వివరాలు మాత్రమే బయటపెట్టారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వివరించారు. దేశంలో తెలంగాణ ప్రభుత్వం మినహా ఇప్పటివరకు బీసీ జనగణనను శాస్త్రీయంగా తేల్చలేదు. కేసీఆర్ చేసిన సకలజనుల సర్వే అధికారికం కాదని, దానిని కేబినెట్లో పెట్టలేదని, శాసనసభలో చర్చ జరపలేదని, అందుకే అది చెల్లుబాటు కాదన్నారు.
దేశంలో మొదటిసారి బీసీ జనాభాను అధికారికంగా లెక్క తేల్చి ముద్ర వేశామని, దీనిని ఆయా వర్గాల ప్రయోజనం కోసం ఎలా ముందుకు తీసుకెళ్లాలో బీసీ ప్రజా ప్రతినిధులు, సంఘాలు ఆలోచన చేయాలన్నారు. బీసీ సర్వే అధికారికంగా జరగడంతో బీఆర్‌ఎస్‌కు నష్టం కలుగుతుందని, అందుకే సర్వే బాగాలేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో బీసీ సర్వే విజయవంతమైతే దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుందని, అందుకే బీజేపీ నేతలు నేతలు దు్రష్పచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ కులగణనతో తెలంగాణలో సరికొత్త అధ్యాయం మొదలైందన్నారు. కులగణన సర్వేతో తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా మారిందని చెప్పారు. బీసీలకు సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment