
ఆదివారం హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ దంపతులతో కలసి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్
అధికారుల వ్యవహార శైలిపై నేను సంతోషంగా లేను: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘గతంలో ప్రజాప్రతినిధులు ఏవైనా అంశాలను ప్రస్తావిస్తే 70, 80 శాతం మంది అధికారులు అందులోని లోటుపాట్లు, చట్ట విరుద్ధతను వివరించేవారు. వాటితో ఏ విధంగా సమస్య వస్తుందో చెప్పారు. ఇలా చేస్తే ప్రజలకు, రాష్ట్రానికి, మీకూ ఇబ్బందేనని వివరించి నాయకులకు జ్ఞానోదయం కల్పించేవారు. ఈ రోజుల్లో అలా చేయడం తగ్గిపోయింది. మేం ఒక తప్పు చేయాలంటే.. ఒకటేంది సార్ మూడు చేద్దాం బాగుంటుంది. బలంగా ఉంటుంది. మళ్లీ మళ్లీ ఎందుకు.. రేపు కొత్తగా మూడు తప్పులు చేయవచ్చంటున్న అధికారులను చూస్తున్నాం.
ఇది సమాజానికి మంచిదికాదు’’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణలో ఉన్నప్పుడే ఐఏఎస్, ఐపీఎస్‌లు సివిల్ పంచాయితీలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ ఐఏఎస్ అధికారుల ఇనిస్టిట్యూట్‌లో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన ‘లైఫ్ ఆఫ్ కర్మయోగి’ పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రస్తుత సివిల్ సర్వెంట్ల ధోరణి బాగోలేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
‘‘ప్రజాప్రతినిధులు తమ వద్దకు వచ్చిన వాళ్లను సంతోషపెట్టాలనో, తనకు సంతోషం కలగాలనో కొన్ని ఆదేశాలిస్తుంటారు. వాటిని విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులదే. సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులకు కేటాయించే బాధ్యతలకు వారి చదువులు, నేపథ్యంతో సంబంధం ఉండదు. ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్నవారికి వైద్యారోగ్య శాఖ, ఏమీ చదువుకోని వారికి విద్యాశాఖ, బాగా చదువుకున్న వారికి కార్మిక శాఖ ఇవ్వొచ్చు. అందుకే మాకు అవగాహన కల్పించడానికి, నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పాటు అందించడానికి సచివాలయ బిజినెస్ రూల్స్ ప్రకారం అధికారులను ఇస్తారు. ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా నోట్ ఫైల్ తయారు చేయడమే కాకుండా మాకు వివరించాలి. కానీ ఇవ్వాళ, రేపు అదేమీ ఉండటం లేదు.
శిక్షణలోనే సివిల్ పంచాయతీలు..
ఎంతో మంది అధికారులు ఎన్నో త్యాగాలు చేసి దేశానికి సేవచేశారు కాబట్టే మన దేశం ఇంతగా బలపడింది. ఆర్థికంగా నిలదొక్కుకుంది. నేడు వస్తున్న కొత్త తరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయ నాయకులనే కాదు, సమాజంలో ఉన్న చెడులన్నింటినీ కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు. కొత్తగా ఎంపికైన ఐఏఎస్, ఐపీఎస్‌లు శిక్షణలో ఉన్నప్పుడే పోలీసు స్టేషన్లకు వెళ్లి డ్రెస్ వేసుకుని కూర్చుని, సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నిస్తుండటం దురదృష్టకరం. కొందరిలోనైనా మార్పు రావాలనే ఈ విషయాలను ఈ వేదిక మీద పంచుకుంటున్నాను.
ఏసీ అనే జబ్బు ఏమో..
ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలను వారి సర్వీస్ బుక్స్‌లో రికార్డు చేయాలని సీఎస్‌ను పదేపదే కోరుతున్నాను. అసలిప్పుడు అధికారులు ఏసీ రూమ్‌ల నుంచి బయటికి వెళ్లడానికే వెనకాడుతున్నారు. నాకు తెలియదు.. అది ఏసీ అనే జబ్బు ఏమో. ఐఏఎస్, ఐపీఎస్ ఒక జిల్లాకు నేతృత్వం వహించినప్పుడు ప్రజల దగ్గరికి వెళితే వచ్చే అనుభవమే గొప్పది. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు పంపించే ఫైళ్లు చూడటమే ఉంటుంది. సచివాలయానికి వస్తే ప్రజలతో మాట్లాడే అవకాశం కోల్పోతారు.
అధికారుల తీరుతో సంతోషంగా లేను
నేను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జెడ్పీటీసీగా ఉన్నప్పుడు విశాలంగా ఉన్న ఆ జిల్లా ఒక మూల నుంచి మరో మూలకు అంబాసిడర్ కారులో చేరాలంటే ఏడెనిమిది గంటలు పట్టేది. ఆ రోజుల్లో ఐఏఎస్‌లు, ఐపీఎస్ అధికారులు అచ్చంపేట అడవుల్లోకి వెళ్లి ఆదివాసీల సమస్యలు తెలుసుకుని, మళ్లీ తిరిగి వచ్చేందుకు రోజులు పట్టేది. అప్పట్లో నేతల కంటే అధికారులే ప్రజలతో మమేకమయ్యేవారు. కలెక్టర్ వద్దకు వెళ్తే తమ సమస్య పరిష్కారం అవుతుందన్న గొప్ప నమ్మకం ప్రజల్లో ఉండేది.

కలెక్టర్ తమ గూడేనికి వచ్చి సమస్యలు విన్నారని గొప్పగా చెప్పుకునేవారు. శిక్షణ ఐపీఎస్‌లకు కానిస్టేబుల్ డ్యూటీలు వేసి నైట్ పెట్రోలింగ్ వంటి క్షేత్రస్థాయి విధుల్లో ఉండే సాధకబాధకాలపై అవగాహన కల్పించేవారు. ఇప్పుడు వ్యవస్థ ఎక్కడికి పోతోందో నాకు తెలియదుగానీ.. జరుగుతున్న పరిణామాలు, అధికారుల వ్యవహార శైలితో నేను సంతోషంగా లేను. నేను అందరి గురించి మాట్లాడటం లేదు. సీఎంగా నాకున్న పరిమిత అనుభవాన్ని పంచుకుంటున్నాను.
నిబద్ధత గల అధికారులకు గుర్తింపు ఉంటుంది
అధికారుల ఆలోచనలో, విధానంలో మార్పు రావాలి. నిబద్ధత గల అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. వచ్చీ రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు. రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా చేయాలనుకున్నప్పుడు నిబద్ధత గల అధికారి ఎక్కడ ఉన్నాడో వెతికి మరీ పోస్టింగ్ ఇస్తాం. మా పనితీరు బాగుండాలంటే అధికారుల పనితీరు బాగుండాలి. మేం విధాన నిర్ణయాలు చేయగలం. అమలు చేయాల్సింది అధికారులే.
సీనియర్, రిటైర్డ్ ఐఏఎస్‌లతో సమావేశాలు నిర్వహించి వారి అనుభవాలను ఇప్పటి అధికారులకు తెలియజేయానికి ఏర్పాట్లు చేయాలి. ప్రజలకు ఉపయోగపడే, పేదోడికి సహాయపడాలనే ఆలోచన చేయాలి. అంతేతప్ప ఏ విధంగా అడ్డు వేయాలి, ఏవిధంగా ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా నెగిటివ్ కామెంట్స్ రాయాలనే ఆలోచన తగ్గించుకుని సానుకూల దృక్పథం చూపితే చాలా కాలం గుర్తుండిపోతారు.
ఈ పుస్తకం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణనాయుడు తన జీవిత కాల అనుభవాలన్నీ నిక్షిప్తం చేసి తీసుకొచ్చిన ఈ పుస్తకం దేశానికి సేవలు అందించబోయే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులకు బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటిది. ఆరు దశాబ్దాల తన అనుభవాలను ఒక పుస్తకంలో నిక్షిప్తం చేయడం క్లిష్టమైన పని. ఇందులో గోపాలకృష్ణ విజయవంతం అయ్యారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ నుంచి ప్రస్తుత ప్రధాని మోదీ వరకు అందరితో తనకున్న అనుభవాలను ఆయన పుస్తకరించారు. కొత్తగా సర్వీస్‌లో చేరే అధికారులు ఇలాంటి అనుభవాలను చదవడం ద్వారా ఎంతో నేర్చుకోవచ్చు.
వారి బాటలో నడవాలి..
మాజీ ఐఏఎస్ శంకరన్ అణగారిన వర్గాల పట్ల నిబద్ధతతో పనిచేసి గొప్ప పేరు సాధించారు. మరో మాజీ ఐఏఎస్ టీఎన్ శేషన్ దేశంలో ఎన్నికల సంఘం ఒకటి ఉందని అందరికీ తెలియజేసిన గొప్ప అధికారి. ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలే నేడు దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోవడానికి బాటలు వేసింది. వారి అనుభవాల నుంచి నేటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నేర్చుకోవాలి..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment