సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తలపెట్టిన ‘రైతు బంధు’పథకానికి అప్పులే ఆధారం కానున్నాయి. రైతులకు సాయం పంపిణీ కోసం భారీగా నిధులు అవసరం కావటంతో.. ఇప్పటికిప్పుడు రూ.4 వేల కోట్లు అప్పు కావాలని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకును ఆశ్రయించింది. ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందన్న విమర్శల మధ్య తిరిగి రుణ సమీకరణకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే..
రైతు బంధు పథకానికి ఏటా రూ.12 వేల కోట్లు అవసరమని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించింది. ఈనెల 19 లేదా 20 నుంచే తొలి విడత సాయాన్ని అందిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. తొలివిడతగా రూ.4 వేల చొప్పున అందించేందుకు సుమారు రూ.6,000 కోట్లు అవసరమని అంచనా. అయితే ఆర్థిక సంవత్సరం తొలి నెల కావడంతో ఖజానాలో నిధులు లేవు. తాజా బడ్జెట్ అంచనాల ప్రకారం.. రాష్ట్రానికి ప్రతి నెలా సగటున రూ.6 వేల కోట్ల పన్నుల ఆదాయం వస్తుంది. కానీ ఆర్థిక సంవత్సరం తొలినెల కావడంతో ఆదాయం తక్కువగా ఉంటుంది. ఆశించిన ఆదాయం వచ్చినా.. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, ఇతర చెల్లింపులకే ప్రతినెలా రూ.4 వేల కోట్లకుపైగా అవసరం. ఇతర బిల్లులన్నీ పెండింగ్‌లో పెట్టినా ‘రైతు బంధు’పథకానికి రూ.2 వేల కోట్లకు మించి వెచ్చించే పరిస్థితి లేదని సమాచారం. దీంతో రుణ సేకరణకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ముందుగానే అప్పులు..
ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది రూ.28 వేల కోట్ల మేరకు అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఉంది. ఇందులో మూడింట రెండొంతుల అప్పును ఎప్పుడైనా.. రిజర్వు బ్యాంకు ద్వారా సెక్యూరిటీలను వేలం వేసి సమీకరించేందుకు వీలుంటుంది. మిగతా ఒక వంతు మాత్రం ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో మాత్రమే తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకోవటం అరుదు. కానీ ‘రైతు బంధు’కు నిధుల కోసం ఏప్రిల్‌లోనే రుణ సమీకరణకు అనుమతించాలని బడ్జెట్‌కు ముందే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖను కోరడం గమనార్హం. ఈ నెల 10న రూ.2 వేల కోట్లు, 17న మరో రూ.2 వేల కోట్లను సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించేందుకు ప్రభుత్వం ఆర్‌బీఐకి ఇండెంట్ పెట్టింది. ఈ నిధులతో రైతులకు ఆర్థిక సాయానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని నిశ్చయించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment