CM KCR Orders To Abolish VRA System Entirely In Telangana - Sakshi
Sakshi News home page

CM KCR Cancels VRA System: వీఆర్‌ఏ వ్యవస్థ రద్దు

Published Mon, Jul 24 2023 3:23 AM | Last Updated on Mon, Jul 24 2023 9:07 AM

CM KCR Mandate To Abolition of VRA system In Telangana - Sakshi

మానవీయ కోణంలో నిర్ణయం 
కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.. ఈ క్రమంలోనే వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నాం.వీఆర్‌ఏలను రెవెన్యూ శాఖలోనే క్రమబద్ధీకరించి.. తర్వాత వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తాం. అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలు, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వారిపట్ల మా ప్రభుత్వం మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటుంది. 
– సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: నీరటి, మస్కూరు, లష్కర్‌ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలవబడుతూ భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్‌ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరిస్తామన్నారు.

తర్వాత మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సుల మేరకు వీఆర్‌ఏలను అర్హతల ఆధారంగా పురపాలక, మిషన్‌ భగీరథ, నీటిపారుదల తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారమే జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ అంశంపై ఆదివారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కార్యాలయం ప్రకటించింది. 

వీఆర్‌ఏ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది 
సమీక్ష సందర్భంగా.. సామాజిక పరిణామ క్రమంలో మార్పులకు అనుగుణంగా, ప్రజల అవసరాలను అనుసరించి పాలకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని.. ఈ క్రమంలోనే వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు.

‘‘వ్యవసాయం అభివృద్ధి చెంది సాగునీటి విధానం అమల్లోకి వచ్చినకాలంలో గ్రామాల్లో నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం, గ్రామ రెవెన్యూ, ఇతర విభాగాల అవసరాల కోసం ఏర్పాటైన గ్రామ సహాయకుల వ్యవస్థ తర్వాత వీఆర్‌ఏలుగా రూపాంతరం చెందింది. తరతరాలుగా సామాజిక సేవ చేస్తున్న వీఆర్‌ఏల త్యాగపూరిత సేవ గొప్పది. నేటి మారిన పరిస్థితుల్లో వీఆర్‌ఏ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది.

ఈ నేపథ్యంలో వారిని రెవెన్యూ శాఖలో క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటున్నాం..’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలు, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వారిపట్ల తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పలుమార్లు ఎవరూ అడగకుండానే ఉద్యోగ వర్గాలకు జీతాలు పెంచి వారి సంక్షేమానికి పాటుపడ్డామని వివరించారు. 

విద్యార్హతల ఆధారంగా పోస్టులు 
రాష్ట్రంలో 20,555 మంది వీఆర్‌ఏలు పనిచేస్తున్నారని.. వారిలో నిరక్షరాస్యులతోపాటు ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారూ ఉన్నారని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. ఈ క్రమంలో వారి విద్యార్హతను బట్టి ప్రభుత్వం ఉద్యోగ కేటగిరీలను నిర్ధారిస్తుందని.. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో భర్తీ చేస్తామని తెలిపారు. ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారిని అందుకు అనుగుణమైన పోస్టుల్లో నియమిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను వెంటనే ఖరారు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ను ఆదేశించారు. 

కారుణ్య నియామకాలు కూడా.. 
61 ఏళ్ల వయసుపైబడిన వీఆర్‌ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దీనితోపాటు 61 ఏళ్లలోపు వయసు ఉండి 2014 జూన్‌ 2న తర్వాత ఏదైనా కారణంతో మరణించిన వీఆర్‌ఏల వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. చనిపోయిన వీఆర్‌ఏల వారసులు, వారి విద్యార్హతల వివరాలను త్వరగా సేకరించాలని అధికారులకు, వీఆర్‌ఏల జేఏసీ నేతలకు సూచించారు. వారిని అర్హతలు, ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 
 
సామాజిక వివక్ష నుంచి విముక్తినిచ్చారు: వీఆర్‌ఏ జేఏసీ 
మస్కూరు వంటి పేర్లతో తరతరాలుగా ఎదుర్కొన్న సామాజిక వివక్ష నుంచి విముక్తి కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించడం ద్వారా సీఎం కేసీఆర్‌ వీఆర్‌ఏల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని వీఆర్‌ఏ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తమకు పేస్కేల్‌ వర్తింపజేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement