job security
-
ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు నినదించారు. తమ పోస్టులను డీఎస్సీ నుంచి మినహాయించి కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లు(సీఆర్టీ)గా మార్చాలని డిమాండ్ చేస్తూ గురుకుల టీచర్లు చేపట్టిన సమ్మె శనివారం 22వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం లెనిన్ సెంటర్లో మోకాళ్లపై మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్ సోర్సింగ్ టీచర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనాయక్, మల్లిఖార్జున నాయక్ మాట్లాడుతూ 15ఏళ్లకు పైగా చాలీచాలని వేతనాలతో సేవలందిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి, అధికారులు సైతం తమ సమస్యలను పట్టించుకోవడంలేదని చెప్పారు. తమ డిమాండ్లపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి పరిష్కరించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థ ఉందన్నారు. ఆ వ్యవస్థను రద్దు చేసి తమను సీఆర్టీలుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని లక్ష్మీనాయక్, మల్లిఖార్జున నాయక్ స్పష్టంచేశారు.విద్యార్థులు, తల్లిదండ్రుల నిరసన తూర్పు గోదావరి జిల్లా కూనవరంలో మెగా టీచర్స్–పేరెంట్స్ మీటింగ్‌లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైతం నిరసన వ్యక్తంచేశారు. గిరిజన పిల్లల చదువులపై ప్రభావం చూపుతున్న ఔట్ సోర్సింగ్ టీచర్ల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని కోరుతూ కొందరు తల్లిదండ్రులు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేశారు.ఔట్ సోర్సింగ్ టీచర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో తమ పిల్లల చదువులకు ఇబ్బందికరంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. తమ బిడ్డలకు ఉపాధ్యాయులు కావాలని డిమాండ్ చేశారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
సాక్షి, అమరావతి/పాడేరు: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ జిల్లా కేంద్రాల్లో వలంటీర్లు సోమవారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. పెండింగ్ బకాయిలతో సహా వలంటీర్ల గౌరవ వేతనాలు అక్టోబరు 25లోగా చెల్లించకుంటే నిరసన దీక్షలు చేపడతామని.. రాబోయే కేబినెట్ సమావేశంలోగా తమకు న్యాయం చేయకుంటే ‘చలో సీఎం క్యాంపు కార్యాలయం’ చేపట్టనున్నట్లు వలంటీర్ల సంఘాలు హెచ్చరించాయి. ఇక వీరి ఆందోళనలకు సీపీఐ అనుబంధ ఏఐవైఎఫ్ ప్రతినిధులు తమ సంఘీభావం ప్రకటించారు. ఇదిలా ఉంటే.. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 11 మండలాలకు సంబంధించిన దాదాపు రెండువేల మంది వలంటీర్లు పాడేరులో సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీ ప్రదర్శన నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో పలువురు వలంటీర్లు చంటి పిల్లలతో పాల్గొన్నారు. అనంతరం గంటసేపు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ వలంటీర్లతో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం వలంటీర్లు ఆయనకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అలాగే, కర్నూలు కలెక్టరేట్ ఎదుట కూడా వలంటీర్లు భారీఎత్తున ఆందోళన నిర్వహించి, ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ఏడాది జూన్‌లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వీరికి గౌరవ వేతనాలు చెల్లించలేదు. -
పెద్ద కంపెనీలకు వెళ్లిపోదాం..
చెన్నై: అంకుర సంస్థల్లో పని చేసే వారిలో చాలా మంది పెద్ద కంపెనీలకు మారితే బాగుంటుందని భావిస్తున్నారు. ఉద్యోగ భద్రత, మెరుగైన జీతం, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు వారికి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. మానవ వనరుల సేవల సంస్థ సీఐఈఎల్ హెచ్ఆర్ సరీ్వసెస్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న స్టార్టప్స్ ఉద్యోగుల్లో 67 శాతం మంది ఈ మేరకు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సర్వే నివేదిక ప్రకారం స్టార్టప్ రంగంలో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) అత్యధికంగా ఉంటోంది. ఉద్యోగి పనిచేసే సగటు వ్యవధి 2–3 ఏళ్లు మాత్రమే ఉంటోంది. స్టార్టప్ రంగంలో పనిచేసే వారిలో అత్యధిక శాతం మంది ఉద్యోగ భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే ఇప్పటికే నిలదొక్కుకున్న కంపెనీల వైపు చూస్తున్నారు. ఇక 30 శాతం మంది మెరుగైన జీతభత్యాలు ఇందుకు కారణంగా తెలిపారు. 25 శాతం మంది స్టార్టప్‌లలో ఉద్యోగం–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం ఉండటం లేదని అందుకే పేరొందిన సంస్థల్లోకి మారాలని భావిస్తున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా సుమారు 70 స్టార్టప్‌లకు చెందిన 1,30,896 మంది ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించారు. హైరింగ్ ప్రణాళికల్లో అంకురాలు..‘కొత్త ఆవిష్కరణలు, ఉపాధికి ఊతమివ్వడంలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 65 శాతం కంపెనీలు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరిపే యోచనలో ఉన్నాయి. దీంతో స్టార్టప్ వ్యవస్థ భవిష్యత్తు ఆశావహంగా కనిపిస్తోంది‘ అని సీఐఈఎల్ హెచ్ఆర్ సరీ్వసెస్ ఎండీ ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. అయితే, ఉద్యోగులు వెళ్లిపోకుండా తగు చర్యలు తీసుకోవడంపై అంకుర సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగుల కెరియర్ పురోగతికి అవకాశాలుకల్పించడం, వర్క్–లైఫ్ బ్యాలెన్స్ ఉండేలా చూడటం మొదలైనవి చేయాలని పేర్కొన్నారు. తద్వారా ఉద్యోగులకు స్టార్టప్‌లపై నమ్మకం పెరుగుతుందని, అట్రిషన్ తగ్గగలదని మిశ్రా వివరించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, మెరుగైన మానవ వనరుల విధానాలు ఉన్న అంకురాలు.. అట్రిషన్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు, రిమోట్ పని విధానాలు, భారీ స్టాక్ ఆప్షన్స్ స్కీములు మొదలైనవి అందిస్తున్నాయి. రిపోర్టు ప్రకారం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి అత్యధిక డిమాండ్ ఉంటోంది. ఆ తర్వాత సేల్స్, ప్రీ–సేల్స్, రిటైల్ వంటి ఉద్యోగాలు ఉంటున్నాయి. -
ఐటీ కంపెనీలకు కార్మిక శాఖ మంత్రి కీలక సూచనలు
ఉద్యోగ భద్రత, ఉద్యోగులతో వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ఐటీ కంపెనీలకు కర్ణాటక రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ కీలక సూచనలు చేశారు. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తాజా ఇంటర్వ్యూలో ఆయన ఐటీ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. ఐటీ పరిశ్రమకు ప్రధాన కేంద్రమైన బెంగళూరు సహా కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 18 లక్షల మంది ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని ఐటీ సంస్థలకు ఇప్పటివరకూ ఉన్న మినహాయింపులు తొలగించి వాటిని తమ పరిధిలోకి తీసుకురావాలని ఆ రాష్ట్ర కార్మిక శాఖ ఆలోచిస్తోంది. ఈ ఆలోచన ఇప్పుడు ఏ స్థితిలో ఉందని ప్రశ్నించినప్పుడు దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఐటీ-బీటీ, పరిశ్రమలతో సహా సంబంధిత మంత్రులతో మాట్లాడుతామని సంతోష్ లాడ్ బదులిచ్చారు. ఆ వైఖరి మానుకోవాలి ఐటీ సంస్థలు కూడా తమ ఉద్యోగులతో వ్యవహరించే విధానాన్ని పరిశీలించుకోవాలని సూచించారు. తమ కంపెనీలు రాత్రిపూట ఈ-మెయిల్ ఐడీలను బ్లాక్ చేయడం, తోటి ఉద్యోగులతో కమ్యూనికేట్ చేయకుండా ఆపడం వంటివి చేస్తున్నాయని చాలా మంది ఉద్యోగులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కానీ వారికి సహాయం చేసే యంత్రాంగం ప్రస్తుతం తమ వద్ద లేదన్నారు. అలాగే ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: Wipro Rule: విప్రోలో మానేస్తే ఇంట్లో కూర్చోవాల్సిందే! చుక్కలు చూపిస్తున్న కఠిన నిబంధన కంపెనీలపై అజమాయిషి చూపించడం తమ ఉద్దేశం కాదని, కార్మిక చట్టాలు ముఖ్యమని యాజమాన్యాలు అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఐటీ కంపెనీ అయినంత మాత్రాన రాత్రికి రాత్రే ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. ఈ వైఖరి మారాలని సూచించారు. పని వేళల గురించి.. ఐటీ కంపెనీలు గ్రాట్యుటీ, కనీస వేతనాలతో సహా అన్ని ఇతర నిబంధనలకు కట్టుబడి ఉంటున్నాయని, తమ ఆందోళన అంతా ఉద్యోగులను తొలగిస్తున్న విధానాలపై మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక పనివేళల గురించి మాట్లాడుతూ ఉద్యోగులకు కొన్నిసార్లు ఎక్కువ పని ఉంటుంది.. కొన్నిసార్లు తక్కువ పని ఉంటుంది. దీనిపై పెద్దగా అభ్యంతరం లేదని, ఉద్యోగుల సామాజిక భద్రతపైనే తాము దృష్టి పెట్టినట్లు మంత్రి సంతోష్ లాడ్ వివరించారు. -
నిలదొక్కుకోవాలంటే నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు ఆవిర్భవిస్తున్న కొత్త టెక్నాలజీల ఫలితంగా ఉద్యోగ భద్రత పట్ల మెజారిటీ నిపుణుల్లో (82 శాతం మంది) ఆందోళన వ్యక్తమవుతోంది. వేగంగా మార్పు చెందుతున్న పని వాతావరణాన్ని అధిగమించేందుకు నైపుణ్యాల పెంపు సాయపడుతుందని వారు భావిస్తున్నారు. విద్యార్థులు, నిపుణులు, విద్యావేత్తలు ఇలా రెండు లక్షల మంది అభిప్రాయాలను హీరో వేద్ (హీరో గ్రూప్ కంపెనీ) పరిగణనలోకి తీసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. పని ప్రదేశాల్లో వస్తున్న నూతన మార్పులను, సవాళ్లను అధిగమించడానికి నైపుణ్యాల పెంపు పరిష్కారమని 78 శాతం మంది చెప్పారు. నేటి ఉద్యోగ మార్కెట్లో నిలిచి రాణించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు అధ్యయనం, నైపుణ్యాల పెంపుపై అవగాహన పెరుగుతుందడానికి ఇది నిదర్శనమని హీరో వేద్ సీఈవో అక్షయ్ ముంజాల్ తెలిపారు. ‘‘సుస్థిరత, సామర్థ్యం, మానసిక ఆరోగ్యంపై నిపుణులు, కంపెనీలు ఒకే విధమైన దీర్ఘకాల దృష్టితో ఉన్నాయి. దీంతో ఈ రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది’’అని చెప్పారు. కృత్రిమ మేథ (ఏఐ) విజ్ఞానం కలిగి ఉండడం, తమ కెరీర్లో మెరుగైన అవకాశాలు అందుకోవడానికి కీలకమని 39 శాతం మంది అంగీకరించారు. తమ సంస్థలు ఏఐపై సరైన శిక్షణ అందించడం లేదని 43 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఏఐ విభాగంలో కావాల్సిన నైపుణ్యాలకు, అందిస్తున్న శిక్షణకు మధ్య అంతరాన్ని ఇది తెలియజేస్తున్నట్టు నివేదిక గుర్తు చేసింది. 18–55 ఏళ్ల మధ్య వయసున్న నిపుణుల్లో 43.5 శాతం మంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అదనపు నైపుణ్యాలు, ముఖ్యంగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని 83 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. -
జాబ్ కోసం సైకిల్ తొక్కుతున్న ఇంజినీర్లు!
ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజ్ మరే ఉద్యగానికి ఉండదు. చిన్న ఉద్యోగమైనా చాలు లైఫ్ సెటిల్ అవుతుందని యువత భావిస్తుంటారు. అయితే కేరళ రాష్ట్రంలో ఉన్నత విద్యార్హత ఉన్న అభ్యర్థులు చాలా కిందిస్థాయి ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారు. కేరళలో ప్రభుత్వ కార్యాలయాలలో ప్యూన్ ఉద్యోగానికి అవసరమైన అర్హత 7వ తరగతి ఉత్తీర్ణత. దీంతోపాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. (టీసీఎస్‌లో మరో కొత్త సమస్య! ఆఫీస్‌కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..) ప్యూన్ ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండకూడదని నిబంధన ఉన్ననప్పటికీ చాలా మంది బీటెక్ గ్రాడ్యుయేట్లు, ఇతర డిగ్రీ ఉత్తీర్ణులు ఏటా దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సైకిల్ పరీక్ష కోసం వరుసలో ఉంటున్నారు. గత రెండు రోజులుగా ఆ రాష్ట్రంలోని వివిధ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో డిగ్రీలు ఉన్న యువకులు సైకిల్‌తో వచ్చి తమ వంతు కోసం వేచి ఉంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ భద్రతే కారణం ప్రైవేటు ఉద్యోగాలంటే ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడతాయో తెలియదు. అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే భద్రత ఉంటుందని యువత భావిస్తున్నారు. దీంతో కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దశాబ్దాలుగా అధిక డిమాండ్ ఉంది. అంతేకాకుండా పెళ్లిళ్ల విషయంలోనూ ప్రభుత్వ ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత ఉండటం మరో కారణం. ప్యూన్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి ప్రారంభ జీతం దాదాపు రూ. 23వేలు ఉంటుంది. దరఖాస్తుల్లో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను అక్టోబర్ 26, 27 తేదీల్లో సైక్లింగ్ పరీక్షకు పిలిచారు. గతంలో ఆఫీసు అసిస్టెంట్లు విధుల్లో భాగంగా సైకిళ్లపైనే వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడా అవసరం లేకపోయినప్పటికీ, ప్యూన్ పోస్టుల కోసం ఇప్పటికీ సైక్లింగ్ పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ పోస్టులకు అభ్యుర్థులు దరఖాస్తు సమయంలోనే తమకు ఎటాంటి డిగ్రీ లేదని డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ అధికారి ఒకరు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. డిగ్రీ లేని వ్యక్తులు కేరళ రాష్ట్రంలో అరుదుగా కనిపిస్తారని చెప్పారు. సైక్లింగ్ పరీక్ష పూర్తయిన తర్వాత, ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. దేశంలోనే అత్యధికంగా ఉద్యోగార్థులు ఉండే రాష్ట్రాల్లో కేరళ ఒకటి. -
ఎన్ని ఉద్యోగాలు ఊడినా.. ఈ ఐటీ జాబ్‌లు మాత్రం సేఫ్!
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో లేఆఫ్‌ల కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ముఖ్యంగా టెక్ రంగానికి 2022 సంవత్సరం చాలా కఠినమైనదిగా నిలిచింది. సామూహిక తొలగింపులు లక్షలాది మందిని నిరుద్యోగులుగా మార్చాయి. ఈ రంగంలో పరిస్థితి ఇప్పటికీ మెరుగుపడలేదు. పలు నివేదికల ప్రకారం, 2023లో ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయారు. ఆర్థిక మందగమనంతో పాటు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విజృంభణ టెక్ పరిశ్రమలో పనిచేస్తున్న వారి కష్టాలను మరింతగా పెంచింది. దీంతో ఫ్రెషర్లు తమ కెరీర్ ఎంపికలపై పునరాలోచనలో పడి ఇతర రంగాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో లక్షల జీతాల కంటే కూడా ఉద్యోగ భద్రతనే ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. మరోవైపు కంపెనీలు సైతం మారుతున్న టెక్నాలజీ డిమాండ్‌కు అనుగుణంగానే నియామకాలు చేపడుతున్నాయి. డిమాండ్, భద్రత ఉన్న ఐటీ జాబ్‌లు ఇవే.. బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ ప్రకారం.. ఐటీ మేనేజర్లు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్‌లు, వెబ్ డెవలపర్లు, డేటా అడ్మినిస్ట్రేటర్ వంటి జాబ్‌లు 2023లో సాంకేతిక రంగంలో అత్యధిక ఉద్యోగ భద్రతను అందించగలవు. వీటికి డిమాండ్ కూడా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. లేఆఫ్ లేని ఉద్యోగాలు బిజినెస్ పబ్లికేషన్ మింట్ నివేదిక ప్రకారం.. లీగల్, స్ట్రాటజీ సంబంధిత ఉద్యోగులు ఇప్పటివరకు లేఆఫ్‌ల వల్ల ప్రభావితం కాలేదు. అందువల్ల ఐటీలో కెరీర్‌ని ప్లాన్ చేసుకునేవారు వీటిని కూడా నమ్మకమైన ఎంపికలుగా పరిగణించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. లేఆఫ్‌ల ప్రమాదం ఉన్నవి పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లేఆఫ్‌ల ప్రమాదం ఎక్కువగా ఉన్న జాబ్‌లు కొన్ని ఉన్నాయి. కస్టమర్ స్పెషలిస్ట్‌లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు, బేసిక్ కోడర్లు, డేటా సైంటిస్టులు, రిక్రూటర్లకు డిమాండ్ వేగంగా పడిపోతున్నట్లు ఇటీవలి కొన్ని నివేదికలు, మార్కెట్ ట్రెండ్లు, సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. -
Telangana: వీఆర్ఏ వ్యవస్థ రద్దు
మానవీయ కోణంలో నిర్ణయం కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.. ఈ క్రమంలోనే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నాం.వీఆర్ఏలను రెవెన్యూ శాఖలోనే క్రమబద్ధీకరించి.. తర్వాత వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తాం. అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలు, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వారిపట్ల మా ప్రభుత్వం మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటుంది. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలవబడుతూ భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరిస్తామన్నారు. తర్వాత మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సుల మేరకు వీఆర్ఏలను అర్హతల ఆధారంగా పురపాలక, మిషన్ భగీరథ, నీటిపారుదల తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారమే జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. వీఆర్ఏల క్రమబద్ధీకరణ అంశంపై ఆదివారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కార్యాలయం ప్రకటించింది. వీఆర్ఏ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది సమీక్ష సందర్భంగా.. సామాజిక పరిణామ క్రమంలో మార్పులకు అనుగుణంగా, ప్రజల అవసరాలను అనుసరించి పాలకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని.. ఈ క్రమంలోనే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘‘వ్యవసాయం అభివృద్ధి చెంది సాగునీటి విధానం అమల్లోకి వచ్చినకాలంలో గ్రామాల్లో నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం, గ్రామ రెవెన్యూ, ఇతర విభాగాల అవసరాల కోసం ఏర్పాటైన గ్రామ సహాయకుల వ్యవస్థ తర్వాత వీఆర్ఏలుగా రూపాంతరం చెందింది. తరతరాలుగా సామాజిక సేవ చేస్తున్న వీఆర్ఏల త్యాగపూరిత సేవ గొప్పది. నేటి మారిన పరిస్థితుల్లో వీఆర్ఏ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది. ఈ నేపథ్యంలో వారిని రెవెన్యూ శాఖలో క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటున్నాం..’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలు, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న వారిపట్ల తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పలుమార్లు ఎవరూ అడగకుండానే ఉద్యోగ వర్గాలకు జీతాలు పెంచి వారి సంక్షేమానికి పాటుపడ్డామని వివరించారు. విద్యార్హతల ఆధారంగా పోస్టులు రాష్ట్రంలో 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారని.. వారిలో నిరక్షరాస్యులతోపాటు ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారూ ఉన్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఈ క్రమంలో వారి విద్యార్హతను బట్టి ప్రభుత్వం ఉద్యోగ కేటగిరీలను నిర్ధారిస్తుందని.. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో భర్తీ చేస్తామని తెలిపారు. ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారిని అందుకు అనుగుణమైన పోస్టుల్లో నియమిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను వెంటనే ఖరారు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు. కారుణ్య నియామకాలు కూడా.. 61 ఏళ్ల వయసుపైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనితోపాటు 61 ఏళ్లలోపు వయసు ఉండి 2014 జూన్ 2న తర్వాత ఏదైనా కారణంతో మరణించిన వీఆర్ఏల వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. చనిపోయిన వీఆర్ఏల వారసులు, వారి విద్యార్హతల వివరాలను త్వరగా సేకరించాలని అధికారులకు, వీఆర్ఏల జేఏసీ నేతలకు సూచించారు. వారిని అర్హతలు, ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సామాజిక వివక్ష నుంచి విముక్తినిచ్చారు: వీఆర్ఏ జేఏసీ మస్కూరు వంటి పేర్లతో తరతరాలుగా ఎదుర్కొన్న సామాజిక వివక్ష నుంచి విముక్తి కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించడం ద్వారా సీఎం కేసీఆర్ వీఆర్ఏల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని వీఆర్ఏ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తమకు పేస్కేల్ వర్తింపజేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
వృద్ధికి ద్రవ్యోల్బణం దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వృద్ధి రేటుపై ద్రవ్యోల్బణం ప్రభావం పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు గణనీయంగా తగ్గనుందని ‘ముందస్తు ప్రాథమిక అంచనాలు (ప్రొవిజనల్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్/పీఏఈ)’ స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ధరల వద్ద 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ 19.4శాతం వృద్ధి రేటును నమోదుచేయగా.. 2022–23లో 15.6 శాతానికి తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. జాతీయ స్థాయిలో చూసినా.. 2021–22లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 19.5శాతం వృద్ధిరేటు నమోదు చేయగా.. 2022–23లో 15.4 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. రాష్ట్ర శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన తెలంగాణ సామాజిక–ఆర్థిక సర్వే–2023 నివేదికలో ఈ గణాంకాలను వెల్లడించింది. స్థిర ధరల వద్ద 7.4 % దేశ, రాష్ట్ర వృద్ధిరేటు తగ్గుదలకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం, సప్లై మందగమనం, డిమాండ్ తగ్గడంతో వృద్ధికి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రధానంగా తయారీ రంగంపై ఈ ప్రభావం అధికంగా ఉందని తెలిపింది. ఇక గత ఏడాది (2021–22) సాధించిన 19.4శాతం భారీ వృద్ధిరేటుపై అంతకు మించిన వృద్ధిరేటును ఈ ఏడాది ఆశించడం సాధ్యం కాదని వివరించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014–15 నుంచి 2019–20 వరకు జాతీయ సగటును మించి వృద్ధిరేటును తెలంగాణ నమోదు చేసిందని.. కోవిడ్ తర్వాత కాలంలో జాతీయ సగటుతో సమానంగా వృద్ధి రేటు కొనసాగుతోందని పేర్కొంది. ఇక స్థిర (2011–12 నాటి) ధరల వద్ద 2022–23లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 7.4 శాతం, దేశ జీడీపీ వృద్ధి రేటు 7శాతం ఉంటుందని అంచనా వేసింది. తగ్గిన నిరుద్యోగం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్) ప్రకారం రాష్ట్ర లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (ఎల్ఎఫ్పీఆర్) 65.4 శాతంగా ఉంది. ఏదో ఒక పనిచేస్తూ లేదా ఏదైనా పనికోసం ఎదురు చూస్తున్న 15–59 ఏళ్ల జనాభా శాతాన్ని ఎల్ఎఫ్పీఆర్గా పరిగణిస్తారు. ఈ సర్వే ప్రకారం.. 2019–20తో పోల్చితే 2020–21లో రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 7.5 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) డేటా ప్రకారం.. 2022 ఏప్రిల్‌తో పోల్చితే 2022 డిసెంబర్లో రాష్ట్ర నిరుద్యోగ రేటు 9.9 శాతం నుంచి 4.1 శాతానికి దిగొచ్చింది. ముఖ్యంగా పట్టణాల్లోనే నిరుద్యోగం అధికంగా ఉంది. 2019–20తో పోల్చితే 2020–21లో గ్రామీణ నిరుద్యోగం 5.7శాతం నుంచి 3.6శాతానికి, పట్టణ నిరుద్యోగం 10.7శాతం నుంచి 8శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో పురుషుల్లో నిరుద్యోగం 8.4శాతం నుంచి 5.5 శాతానికి, మహిళల్లో నిరుద్యోగం 6.1 శాతం నుంచి 4.5శాతానికి తగ్గాయి. పెరిగిన ఉద్యోగ భద్రత సామాజిక–ఆర్థిక సర్వే ప్రకారం.. రాష్ట్రంలో ఉద్యోగులకు సదుపాయాలు, భద్రత క్రమంగా పెరుగుతున్నాయి. 2019–20తో పోల్చితే 2020–21లో పెయిడ్ లీవ్‌కు అర్హతగల ఉద్యోగులు 45.2శాతం నుంచి 50.9శాతానికి.. పెన్షన్లు, ఆరోగ్య సేవలు వంటి సదుపాయాలు కలిగిన ఉద్యోగులు 40.8శాతం నుంచి 46.9శాతానికి పెరిగారు. రాతపూర్వక జాబ్ కాంట్రాక్టు కలిగిన ఉద్యోగులు 39.9శాతం నుంచి 36.2శాతానికి తగ్గారు. ఈఓడీబీ, టీ–ఐడియా, టీ–ప్రైడ్ వంటి కార్యక్రమాలతో పాటు ఐటీ, ఇతర సేవా రంగాలను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలతో ఉద్యోగుల పరిస్థితులు మెరుగయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర, జాతీయ వృద్ధిరేటు తీరు జీఎస్డీపీ వృద్ధిలో మూడో స్థానం ►స్థిర ధరల వద్ద 2022–23లో రాష్ట్ర జీఎస్డీపీ విలువ రూ.13.27 లక్షల కోట్లు, దేశ జీడీపీ విలువ రూ.273.08 లక్షల కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.11.48 లక్షల కోట్లు, దేశ జీడీపీ రూ.236.65 లక్షల కోట్లుగా నమోదైందని తెలిపింది. ►జీఎస్డీపీ వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో (19.4 శాతంతో) నిలిచిందని.. ఒడిశా (20.5శాతం), మధ్యప్రదేశ్ (19.7 శాతం) తొలి రెండు స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. ►2021–22లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.9 శాతమని.. 2022–23లో కూడా ఇదే స్థాయిలో భాగస్వామ్యం ఉండనుందని ప్రభుత్వం అంచనా వేసింది. -
ఆ 167 మందికీ ఉద్యోగ భద్రత
సాక్షి, అమరావతి: ఉర్దూ అకాడమీలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న 167 మంది తాత్కాలిక ఉద్యోగులకు వేతన భరోసాతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తమను ఆదుకోవడం ద్వారా పెద్ద మనసు చాటుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలోని ఉర్దూ అకాడమీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద గురువారం సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి.. థాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. దాపు 1990 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఉర్దూ అకాడమీలో నేరుగా నియామకాలు జరిగాయి. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు తమకు నచ్చిన వారికి తాత్కాలిక సిబ్బంది పేరుతో నియామకాలు చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం–2014 షెడ్యూల్ 10 ప్రకారం తెలంగాణ, ఏపీ ఉర్దూ అకాడమీ సిబ్బంది కేటాయింపు 2015 నవంబర్ 2న పూర్తయింది. దీని ప్రకారం ఏపీకి 182 మంది కన్సాలిడేటెడ్ పే ఉద్యోగులను కేటాయించగా.. ప్రస్తుతం 167 మంది ఏపీలో పనిచేస్తున్నారు. వారికి వేతనాల చెల్లింపునకు అవసరమైన ప్రభుత్వ అనుమతిలేదు. వారిలోనూ దాదాపు 80 మందికి ఎటువంటి అధికారిక నియామక పత్రాలు, రికార్డులు, అనుమతులు లేకపోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది మార్చిలో సమావేశమైన ఏపీ ఉర్దూ అకాడమీ బోర్డు.. ఉద్యోగులుగా గుర్తింపునకు నోచుకోని 167 కన్సాలిడేటెడ్ పే ఉద్యోగుల జాబితాను ప్రభుత్వానికి నివేదించింది. ఈ అంశాన్ని పరిశీలించిన ప్రభుత్వం ఏపీ ఉర్దూ అకాడమీలో 69 మంది ఫ్యాకల్టీ, 45 మంది లైబ్రేరియన్స్, 53 మంది సబార్డినేట్లను కన్సాలిడేటెడ్ పే ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు, నిబంధనల ప్రకారం వారికీ వేతనాలు చెల్లించేలా ఈ ఏడాది జూన్ 28న ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్, సభ్యులు, మైనారిటీ శాఖ కార్యదర్శి ఇంతియాజ్ తదితరులకు ఉద్యోగులు కృతజ్ఞతలు చెబుతూ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జగన్ పెద్దమనసు వల్లే.. అభివృద్ధి, సంక్షేమమే కాదు.. ఉద్యోగులకు మేలు చేయడంలోనూ పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించారు. వాస్తవానికి ఉర్దూ అకాడమీలో నిబంధనలకు విరుద్ధంగా గత పాలకులు తమకు నచ్చిన వారికి, నచ్చినట్టు.. కనీసం నియామక పత్రాలు కూడా లేకుండా కన్సాలిడేటెడ్ పే అంటూ కొలువులు ఇచ్చేశారు. ఇప్పుడు వారిని తొలగిస్తే వారి కుటుంబాలు వీధిన పడతాయి. సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసుతో ఉద్యోగ భద్రత, వేతన భరోసా ఇవ్వడం గొప్ప విషయం. – హిరియల్ నదీమ్ అహ్మద్, ఉర్దూ అకాడమీ చైర్మన్ -
ఇకపై ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత..!
సాక్షి, హైదారాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేసింది. ఇందులో భాగంగా వారి ఉద్యోగ భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కె.చంద్రశేఖర్ రావు గురువారం సంతకం చేశారు. విధి నిర్వహణలో ఆర్టీసీ ఉద్యోగులు అనేక సందర్భాల్లో అనవసర వేధింపులకు గురవుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సర్కర్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఉద్యోగులు గతంలో చాలా సందర్భాల్లో సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఎం కేసీఆర్ స్పందించి.. ఆర్టీసీ ఉద్యోగులు వేధింపులకు గురి కాకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలుస్తోంది. -
అభద్రతా భావంలో మెజారిటీ ఉద్యోగులు...
న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు తమ ఉద్యోగ భద్రత విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. వచ్చే 12 నెలల్లో తాము ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయని 54 శాతం మంది భావిస్తున్నారు. భారత్ విషయంలో ఇది 57 శాతంగా ఉంది. ఉద్యోగాలను కోల్పోతామని ఆందోళన పడుతున్న వారిలో దాదాపు 70 శాతం మంది... కొత్త ఉపాధి అవకాశాలను పొందడంలో తమ యాజమాన్యాలు సహకరిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుండడం మరో విశేషం. ఆన్లైన్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ‘జాబ్స్ రిసెట్ సమ్మిట్’లో విడుదలైన ఒక గ్లోబల్ సర్వే ఈ అంశాలను తెలియజేసింది. దేశాల వారీగా సర్వే అంశాలను పరిశీలిస్తే... దాదాపు 27 దేశాల్లో 12,000కుపైగా ఉద్యోగులపై ఈ సర్వే జరిగింది. రష్యాలో సగటున ప్రతి నలుగురు ఉద్యోగుల్లో ముగ్గురు ఉద్యోగ అభద్రతా భావంలో ఉన్నారు. జర్మనీ విషయంలో ఈ సంఖ్య ఒకటిగా ఉంది. భారత్‌లో 57 శాతం మంది తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన ఉంటే, వీరిలో 25 శాతం మంది ఆందోళన తీవ్రంగా ఉంది. 31 శాతం మందిలో ఒక మోస్తరుగా ఉంది. ఉపాధి అవకాశాలపై ఆందోళనకు సంబంధించి 75 శాతంతో రష్యాలో టాప్‌లో ఉంది. తరువాతి స్థానంలో స్పెయిన్ (73 శాతం), మలేషియా (71 శాతం) ఉన్నాయి. అత్యంత తక్కువగా ఉన్న కింద స్థాయి నుంచి చూస్తే, జర్మనీ (26 శాతం), స్వీడన్ (30 శాతం), నెథర్లాండ్స్, అమెరికా (36 శాతం) ఉన్నాయి. తమ ప్రస్తుత యాజమాన్యం ద్వారా భవిష్యత్ ఉద్యోగం పొందడానికి తగిన, అవసరమైన నైపుణ్యతను పెంచుకోగలుగుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా 67 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ విషయంలో మొదటి స్థానంలో మొదటి స్థానంలో స్పెయిన్ (86 శాతం) ఉంది. తరువాతి స్థానాల్లో పెరూ (84%), మెక్సికో (83%), భారత్ (80%) ఉన్నాయి. జపాన్ ఈ విషయంలో 45 శాతంగా ఉంటే, స్వీడన్ 46 శాతంగా ఉంది. రష్యా విషయంలో ఇది 48 శాతం. ఆశావాదమే అధికం : గత రెండేళ్లతో పోల్చితే ప్రస్తుతం ఉపాధి కల్పన గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం ప్రధాన సంక్షోభం ఇదే. ఈ నేపథ్యంలో ఉద్యోగ భద్రతపై ఆందోళన ఉంది. అయితే అంతకన్నా ఎక్కువగా ఆశావాదమే కనిపిస్తుండడం ఇక్కడ ప్రధానాంశం -సాదియా జహాదీ, డబ్ల్యూఈఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ -
చిరుద్యోగికి గడ్డుకాలం!
అంబర్‌పేట్‌కు చెందిన రాఘవేందర్ బషీర్‌బాగ్‌లోని ఓ జ్యువెలరీ దుకాణంలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. సోమవారం (జూలై 27న) రాత్రి షాప్ యజమాని తనను పిలిచి ఈ నెల 31 నుంచి పనిలోకి రావొద్దని, బిజినెస్ బాలేనందున పనిలో నుంచి తీసేస్తున్నట్లు చెప్పాడు. కోవిడ్–19 పరిస్థితి చక్కబడ్డాక తిరిగి విధుల్లో చేరొచ్చని సూచించాడు. ఈ వార్త విన్న రాఘవేందర్‌కు గుండెలో రాయి పడినంత పనైంది. 3 రోజుల తర్వాత తన పరిస్థితి ఏమిటనే ఆందోళనలో పడ్డాడు. ఘట్కేసర్కు చెందిన విజయ్ ఉప్పల్‌లోని ఓ షాపింగ్ మాల్లో ఆరేళ్లుగా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం వేతనాలిచ్చిన షాప్ యజమాని ఇకపై పనిలోకి రావొద్దని తనతో పాటు మరో ఆరుగురికి చెప్పాడు. దీంతో విజయ్, అతని సహోద్యోగులు తెల్లముఖం వేశారు. ఉన్నట్టుండి ఉద్యోగంలో నుంచి తీసేస్తే ఎలాగంటూ లబోదిబోమంటున్నారు. మొత్తం 18 మంది పనిచేస్తున్న ఆ షాపింగ్ మాల్లో ఒకేసారి ఆరుగురిని పనిలో నుంచి తీసేశారు. సాక్షి, హైదరాబాద్: దుకాణాలు, వ్యాపార సంస్థల్లో పనిచేసే చిరుద్యోగి సంకటంలో పడ్డాడు. లాక్డౌన్, అనంతర పరిణామాలతో వారి ఉద్యోగ భద్రత సంక్షోభంలో చిక్కుకుంది. కరోనాతో వివిధ రకాల వ్యాపారాలు డీలా పడటంతో ఈ పరిస్థితి నెలకొంది. నిర్వహణ భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఆయా యాజమాన్యాలు ఉద్యోగుల సర్దుబాటు చేస్తూ వారి సంఖ్యను తగ్గిస్తున్నాయి. వ్యాపారం పుం జుకున్నాక తిరిగి రావాలని సూచిస్తూ వారిని ఇంటికి పంపించేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జూలై 1 నుంచి 15వ తేదీ నాటికే ఏకంగా 38 వేల మంది ఇదే తరహాలో ఉద్యోగం కోల్పోయినట్లు అబిడ్స్‌లోని మార్కెటింగ్ రీసెర్చ్ బ్యూరో పరిశీలనలో తేలింది. గ్రేటర్ పరిధిలోనే కాకుండా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ నగరాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు చర్యలు జరుగుతున్నట్లు పేర్కొంది. దీంతో నిరుద్యోగిత మ రింత పెరిగే అవకాశమున్నట్లు ఆ సంస్థ అభిప్రాయపడింది. హఠాత్తుగా తొలగిస్తే... కోవిడ్–19 వ్యాప్తితో పలు వ్యాపారాలు తగ్గుముఖం పట్టాయి. ఈ సమయంలో వ్యాపారులు తమ ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నారు. తక్షణ చర్యలతో వారికి కొంత లాభం కలిగినప్పటికీ మళ్లీ వ్యాపారం పుంజుకుంటే ఉద్యోగుల సంఖ్య పెంచాల్సిందే. కానీ ఇప్పటికే ఆయా వ్యాపారులను నమ్ముకుని పనిచేస్తున్న వారిని హఠాత్తుగా పనిలో నుంచి తొలగించడంతో ఆయా ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. మరోవైపు ఈ సంక్షోభ పరిస్థితుల్లో కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే సాహసం ఏ వ్యాపారి చేయకపోవడంతో ఉద్యోగాలు కోల్పోయిన వారి జీవనం మరింత దుర్భరంగా మారుతుందని వ్యాపార విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగాల నుంచి తొలగించడం కంటే వేతనాల్లో సర్దుబాటు చేసే అంశంపై దృష్టి పెట్టాలని, పరిస్థితి చక్కబడ్డాక తిరిగి పాత పద్ధతిలో కొనసాగించాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఇదే తరహాలో తొలగింపులు జరిగితే ఆగస్టు నెలాఖరు నాటికి పరిస్థితి మరింత దారుణమవుతుందని, చిరుద్యోగులు మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉన్నట్లు బిజినెస్ అనలసిస్ట్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
తలకిందులైన సాఫ్ట్వేర్ లైఫ్‌స్టైల్..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ పూర్తవగానే ఎంఎన్సీ కంపెనీలు కొలువిచ్చాయి. కెరీర్ మొదలు పెట్టగానే ఐదంకెల జీతం.. ఐదు రోజుల పని.. వీకెండ్ పార్టీలు, మాల్స్‌లో షాపింగ్‌లు.. బ్రాండెడ్ వస్తువులు.. ఖరీదైన సెల్ఫోన్లు.. ఇదీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాలు. సాఫ్ట్వేర్ ఉద్యోగి లైఫ్ అంటే ఇంత సుఖంగా ఉంటుందా అన్న రేంజ్లో సాఫ్ట్వేర్ కంపెనీలు మనవాళ్లని పెంచి పోషించాయి. సాఫ్ట్వేర్ ఇదో డిగ్రీ పేరో.. కోర్సు పేరో.. కాదు.. ఇండియాలో ఇదో లైఫ్‌స్టైల్. కొత్తగా రెక్కలొచ్చిన పక్షి ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో అంతకన్నా స్వేచ్ఛగా యువతను ఎగిరేలా చేసినా ఓ లైఫ్ట్రెండ్. ఇండియాలో సాఫ్ట్వేర్ బూమ్ మొదలయ్యాక సీన్ అంతా మారిపోయింది. సాప్ట్వేరు.. జీవితం వేరు.. దేశంలో ఏ రంగంలో ఇవ్వలేనన్ని జీతాలు ఒక్క సాఫ్ట్వేర్ రంగం మాత్రం ఇవ్వగలిగింది. ఒక్క జీతాల్నే కాదు. ఒక ఉద్యోగి ఊహించని సదుపాయాల్ని కల్పించింది. ఉద్యోగులకు ప్రాజెక్టులు లేకపోయినా సరే వారికి ప్రాజెక్టులు వచ్చే వరకు పూర్తి జీతం ఇచ్చి బెంచ్ మీద ఉంచింది. బాస్ ఒక్కమాట అన్నా సరే రిజైన్ లెటర్ ఇచ్చి మర్నాడే వేరే కంపెనీలో జాయిన్ అయిపోయేవారు. దీంతో తమ జీవితాలకు అసలు ఢోకా లేదనుకున్నారు. వీళ్లను చూసి కొత్తతరం అంతా ఇంజనీరింగ్ బాట పట్టారు. క్యాంపస్‌లో బీటెక్‌లు పూర్తిచేయకముందే కంపెనీలు ఎత్తుకెళ్లిపోయేవి. కంపె నీలు ఇచ్చే పార్టీలు, ఇన్సెంటివ్లతో ఒక్కసారిగా లగ్జరీ ఆవరించేసింది. కానీ కాలం, కర్మం కలసి రాకపోవడంతో తత్వం బోధపడి, సాఫ్ట్వేర్ ఉద్యోగుల దూకుడు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ.. దేశంలో ఎక్కడా లేనంతమంది ఇంజనీరింగ్ పట్టభద్రులు ఏటేటా తెలుగు రాష్ట్రాల్లో పుట్టుకొస్తారు. వీరికితోడు ఇన్స్టెంట్ ఉద్యోగం కోసం కోర్సులు నేర్చుకుని మరీ రెడీ అయ్యేవారు. సాఫ్ట్వేర్ బూమ్ కారణంగా ఒకప్పుడు గ్రూప్స్ కోచింగ్‌కు కేంద్రమైన అమీర్‌పేట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కోచింగ్‌కు అడ్డాగా మారడమే దీని క్రేజ్‌కు అద్దంపడుతోంది. అమెరికాలో గానీ.. ఇక్కడ గానీ.. సాఫ్ట్వేర్ ఓ పదేళ్లు నడిచింది. జనం డబ్బులు నీళ్లలా ఖర్చు చేశారు. కొద్దిమంది తెలివైన వాళ్లు డబ్బులు దాచుకున్నారు. కానీ ఇంతలోనే వారికి తత్వం బోధపడింది. సాప్ట్‌వేర్‌ను ఓ సునామీ ముంచెత్తింది. అమెరికాలో లేమండ్స్ బ్రదర్స్ దెబ్బకి అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థే చిన్నాభిన్నమైపోయింది. దీంతో అక్కడి బ్యాంకులు, సాఫ్ట్వేర్ సంస్థలు భారత్‌కి తమ ఔట్స్సోర్స్ సేవల్ని పూర్తిగా నిలిపివేశాయి. అంతే.. ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలకు ఆర్డర్లు ఆగిపోయాయి. ఆ దెబ్బకి కంపెనీలన్నీ కాస్ట్ కట్టింగ్ మెథడ్‌ని ఫాలో అయ్యాయి. అప్పటివరకు విదేశీ కంపెనీల నుంచి లక్షల్లో తీసుకుని తమ ఉద్యోగులకి వేలల్లో ఇచ్చే కంపెనీలు ఒక్కసారిగా తమకు బిజినెస్ రాకపోయే సరికి ఉద్యోగుల్ని ఒక్కొరిని తొలగించడం మొదలుపెట్టాయి. అప్పటివరకు లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన సాఫ్ట్వేర్ బాబులకు కొత్తగా పింక్‌స్లిప్‌లు అలవాటయ్యాయి. అప్పటివరకు కంపెనీకి రాకపోయినా పట్టించుకోని హెచ్ఆర్ మేనేజ్మెంట్ 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా తీసేయడం మొదలు పెట్టేశాయి. దీంతో ఒక్కసారిగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో గుబులు మొదలైం ది. పింక్స్లిప్లతోపాటు, అప్పటివరకు లేని ఆర్థిక అభద్రత కొత్తగా పరిచయమైంది. 2007 లో వచ్చిన మాంద్యం ఐటీపై తీవ్ర ప్రభావం చూపింది. ఒక్కసారి లైఫ్ మారిపోయే సరికి జీవితం విలువేంటో తెలిపొచ్చింది. భరించలేని ఒత్తిడి.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందని తెలిపేందుకు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉండే హంగులు, ఎంప్లాయీస్ ఆర్భాటాలు, ఐదు రోజుల పని ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. కానీ ఆఫీస్‌లో వాళ్లు ఎదుర్కొనే ఒత్తిళ్లు ఎవరికీ తెలియవు. తెల్లారితే చాలు ఒత్తిడికి ఎంత నలిగిపోతారో అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుంది. 5రోజుల్లో ఎన్ని టార్గె ట్లు ఉంటాయో వారికే తెలుసు. కళ్ల ముందు కనిపించే టార్గెట్లు, ముంచుకొచ్చే డెడ్లైన్లు, భయపెట్టే పింక్‌స్లిప్‌లు ఇలా ఒత్తిళ్ల వలయం లో సమస్యల అరణ్యంలో పనిచేస్తున్నామని పలువురు ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. సేవింగ్స్‌పై దృష్టి పెట్టడం అవసరం: శివ, ఇన్ఫోసిస్ ఉద్యోగి సాఫ్ట్వేర్ ఉద్యోగులు జీతాన్ని ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది. ప్లేఆఫ్స్ వల్ల ఉద్యోగాలకు భద్రత కష్టతరమైంది. ఈ మధ్య కాలంలో దుబారా తక్కువగా ఉండే ఎంజాయ్మెంట్స్కి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అధిక ప్రాధాన్యతఇస్తున్నారు. ఒకప్పటి వైభవం లేదు.. ఒకప్పుడు ఉన్న సాఫ్ట్వేర్ వైభవం ఇప్పుడు లేదనే చెప్పాలి. కొత్త ఉద్యోగాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఒక్కో కాలేజీ నుంచి వందల నుంచి తీసుకునే కంపెనీలు పది మందికి మించి తీసుకోవడం లేదు. కొత్త ఉద్యోగం అటుంచితే ఉన్న ఉద్యోగాలు పీకేయడం మొదలైంది. 2015 మార్చిలో ఒక దిగ్గజ సంస్థ 35 వేల మందిని ఒకేసారి తొలగించింది. ఎప్పుడు పింక్‌స్లిప్ వస్తుందో తెలియక నిత్యం భయంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ లైఫ్ వేరు, ఏరోజు ఎలా ఉంటుందో తెలియదు. ఉద్యోగం పోయినా బ్యాంకు బాలెన్స్ లేకపోవడం, ఈఎంఐలు కూడా భారీగా మిగిలిపోయాయి. మాంద్యం దెబ్బకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ కార్లను కూడా తిరిగి అమ్మేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు నష్టానికే తాము కొన్న ఫ్లాట్లను లోన్లు ఇచ్చిన బ్యాంకులకే అప్పగించాల్సి వచ్చింది. దీంతో అప్పటివరకు చేసిన తప్పుల్ని ఒక్కసారి బేరీజు వేసుకన్నారు. క్రెడిట్ కార్డుల్ని బలవంతంగా వదిలించుకోవడం, వీకెండ్ పార్టీలకు వెళ్లడం మానేసి వచ్చిన జీతాన్ని పొదుపుగా వాడుకుంటున్నారు. ఈ వీకెండ్లో ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచించేవాళ్లు ఇప్పుడు ఈ వీకెండ్‌లోగా ఉన్న ప్రాజెక్టు ఎలా పూర్తి చేయాలా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఇడ్లీ బండి దగ్గరే టిఫిన్లు గతంలో కిటకిటలాడిన హోటళ్లు ఇప్పుడు ఖాళీ అయిపోయాయి. అక్కడికి వెళ్లాల్సిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డుపక్కన ఇడ్లీ బండ్ల దగ్గరకు క్యూ కడుతున్నారు. నెలంతా చేసే ఖర్చులు తగ్గించారు. చిట్లు కట్టుకుంటూ పొదుపు మంత్రాలు జపిస్తున్నారు. చిన్న చిన్న దూరాలకు కూడా కార్లు వాడిన వారు నడకకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆఫీసులో ఇష్టానుసారం వర్క్ చేయకుండా జాగ్రత్తగా ఆచితూచి వర్క్ చేస్తున్నారు. ప్రమోషన్ కోసం, కెరీర్లో ఎదగడం కోసం పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద దృష్టి పెడుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కోర్సులు నేర్చుకుంటున్నారు. ఇలా ఒకప్పటి ఉద్యోగులకు ఇప్పటి సాఫ్ట్వేర్ జీవితాలకు ఎంతో తేడా కనిపిస్తుంది. – సందీప్, తెలంగాణ ఐటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ -
గృహాల అమ్మకాల్లో 6 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశీయంగా హైదరాబాద్ సహా పలు ప్రధాన నగరాల్లో గతేడాది ఇళ్ల అమ్మకాలు సగటున 6 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు డెవలపర్లు ధరలను తగ్గించడం, పరోక్షంగా డిస్కౌంట్లు ఇస్తుండటం ఇందుకు కారణం. ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఎనిమిది నగరాల్లో నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌తో పాటు ఆరు నగరాల్లో (ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్) నివాస గృహాల అమ్మకాలు పెరగ్గా... కోల్‌కతా, పుణెల్లో మాత్రం తగ్గాయి. నియంత్రణ సంస్థల విధానాల్లో మార్పులు, ధరల తగ్గుదల, పరోక్ష డిస్కౌంట్లు మొదలైన అంశాలు ఇళ్ల కొనుగోళ్ల వృద్ధికి దోహదపడ్డాయని నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. 2017లో 2,28,072 యూనిట్లు విక్రయాలు నమోదు కాగా గతేడాది 2,42,328 యూనిట్లు అమ్ముడైనట్లు వివరించింది. మిగతా ప్రాపర్టీ కన్సల్టెంట్స్తో పోలిస్తే నైట్ ఫ్రాంక్ నివేదికలో విక్రయాల వృద్ధి తక్కువగా నమోదు కావడం గమనార్హం. జేఎల్ఎల్ ఇండియా గణాంకాల ప్రకారం గృహాల అమ్మకాలు ఏడు నగరాల్లో 47 శాతం పెరగ్గా, అనరాక్ డేటా ప్రకారం 16 శాతం, ప్రాప్‌టైగర్ గణాంకాల ప్రకారం తొమ్మిది నగరాల్లో 25 శాతం వృద్ధి నమోదయ్యింది. బెంగళూరులో అత్యధికం.. ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగ భద్రత కారణంగా బెంగళూరులో అత్యధికంగా 27 శాతం వృద్ధి నమోదైంది. రెసిడెన్షియల్ విభాగంలో హైదరాబాద్ 15,591 యూనిట్ల అమ్మకాలతో 9 శాతం వృద్ధి నమోదు చేసింది. కోల్‌కతాలో పది శాతం, పుణెలో 1 శాతం అమ్మకాలు క్షీణించాయి. మొత్తం మీద 2018 ఆఖరు నాటికి అమ్ముడు కావాల్సిన ఇళ్ల సంఖ్య 2017తో పోలిస్తే 11 శాతం తగ్గి 4,68,372 యూనిట్లకు చేరింది. అఫోర్డబుల్ విభాగం ఊతంతో దాదాపు ఏడేళ్ల తర్వాత 2018లో రెసిడెన్షియల్ మార్కెట్ మళ్లీ కోలుకుందని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ పేర్కొన్నారు. తక్కువ జీఎస్టీ రేటు, అఫోర్డబుల్ హౌసింగ్‌కు ఇన్ఫ్రా హోదా కల్పించడం వంటి ప్రోత్సాహకాలు ఇందుకు తోడ్పడ్డాయని వివరించారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో సంక్షోభం కారణంగా ద్వితీయార్ధంలో నిధుల కొరత ఏర్పడిందని, దీంతో ముంబై, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో అమ్మకాలు మందగించాయని ఆయన తెలిపారు. ఎన్నికల దాకా ఆచితూచి: ఈ ఏడాది ప్రథమార్ధంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేదాకా మార్కెట్ వర్గాలు ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని బైజల్ చెప్పారు. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లపై జీఎస్టీ తగ్గించవచ్చన్న అంచనాలు కొనుగోలుదార్ల సెంటిమెంటుకు ఊతమివ్వొచ్చని తెలిపారు. వడ్డీ రేట్లు స్థిరంగా ఉండి, ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న పక్షంలో 2019 ద్వితీయార్ధంలో అమ్మకాలు గణనీయంగా పెరగొచ్చని బైజల్ తెలిపారు. -
ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా మని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతామని ప్రకటించడంపై తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీజేఎంయూ) ఉత్తమ్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి లోని ఆర్టీసీ కల్యాణమండపంలో అభినందనసభ నిర్వహించింది. ఉత్తమ్ మాట్లాడుతూ జాతకాలు, మూఢనమ్మకాలతో ప్రజాధనం వృథా చేయడం కేసీ ఆర్కు అలవాటైందని విమర్శించారు. కాన్వాయ్‌లో రంగుల సాకుతో కార్లు మారుస్తూ, వ్యక్తిగత ప్రయాణాల కోసం చార్టెడ్ విమానాల్లో తిరుగుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమంతో గద్దెనెక్కిన కేసీఆర్, ఇప్పుడు ఆర్టీసీని మూసేస్తానంటూ అహంకారాన్ని చాటుకుంటున్నారన్నారు. ఇంధనధరలకు, ఆర్టీసీ నష్టాలకు సంబంధమేంటని ప్రశ్నించారు. రూ.వందల కోట్లతో కేసీఆర్ కట్టుకున్న ఇంటి(ప్రగతిభవన్)ని జనరల్ హాస్పిటల్‌గా మారుస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబసభ్యులకూ పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కొత్త బస్సులు, ఉద్యోగ భర్తీ, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి సమస్యలను తీరుస్తామన్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని, టీఆర్ఎస్ పీడ విరగడ కావా లంటే ఈ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలన్నారు. కేసీఆర్‌కు ఏమీ పట్టడం లేదు: ఆర్.కృష్ణయ్య కార్మికుల పోరాటాల ఫలితంగా సీఎం అయిన కేసీఆర్.. వారి సమస్యలను గాలికొదిలేశారని బీసీ సంక్షేమ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య విమర్శించారు. పుట్టెడు కష్టాలతో ఆర్టీసీ కార్మికులు బతుకులీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ అభద్రత, చాలీచాలని వేతనం, పనిఒత్తిడితో సతమతమవుతున్న కార్మికులను సీఎం పట్టించుకోకపోవడం దారుణమని కృష్ణయ్య అన్నారు. మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయగా మార్చి రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తన ఇంట్లో ఐదుగురికి పదవిలిచ్చి ఎవరేమనుకుంటే నాకేంటి.. అనేవిధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘కేసీఆర్ పాపం పండే ముందస్తుకు వెళ్లారు. ఇప్పుడు అతని పాలనను అంతమొందించకపోతే, భావితరాలూ ఇబ్బందులు పడతాయి’అని అన్నారు. టీజేఎంయూ రాష్ట్ర అధ్య క్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి హన్మంత్ ముదిరాజ్ మాట్లాడుతూ కార్మికుల సమ్మెతో సీఎం పీఠమెక్కిన కేసీఆర్ ఇప్పుడు ఆర్టీసీని మూసేస్తానని, ముక్కలు చేస్తానని బెదిరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తమ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చిన కాంగ్రెస్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉత్తమ్‌ను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్, మిత్రపక్షాల పొత్తు.. టీఆర్ఎస్కు విపత్తు : ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సీపీఐ, తెలంగాణ జనసమితి కుదుర్చుకుంటున్న పొత్తులతో అధికార పార్టీ నేతలు కలవరపడుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపించారు. ఎవరెన్ని కుప్పిగంతులు వేసినా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి విజయం తథ్యమని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకు ఈ గెలుపును కానుకగా ఇస్తామని చెప్పారు. 4 రోజుల మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మాజీ ఎంపీ వీహెచ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగిస్తున్న ఇందిర విజయరథాన్ని ఉత్తమ్ ప్రారంభించారు. గన్‌పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం విజయరథంపై నుంచి ఉత్తమ్ మాట్లాడుతూ కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా వీహెచ్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ వైఫల్యాలను, కాంగ్రెస్ ఎన్నికల హామీలను ఇంటింటికీ తీసుకెళ్లేలా కృషి చేయాలని కోరారు. వీహెచ్ మాట్లాడుతూ ఇందిర, రాజీవ్‌ల నాయకత్వంలో పనిచేసిన అనుభవంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. అందుకే సీఎం సొంత నియోజకవర్గం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. -
కత్తి పక్కన పెట్టారు
సాక్షి, శ్రీశైలం టెంపుల్ : శ్రీశైలం దేవస్థాంనంలో క్షురకులు శుక్రవారం విధులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలతో పాతాళగంగ దారిలో ఉన్న కేశఖండనశాల ఎదుట ధర్నా చేపట్టారు. కళ్యాణ కట్ట సంఘం అధ్యక్షుడు సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్ర దేవాలయాల కేశఖండనశాల జేఏసీ పిలుపు మేరకు ధర్నా చేశామన్నారు. ఈనెల 1న విజయవాడకు చెందిన ఓలేటి రాఘవులు కేశఖండన చేసిన అనంతరం ఓ భక్తుడి నుంచి రూ.10 తీసుకున్నందుకు ధర్మకర్తల మండలి సభ్యుడు పెంచలయ్య దుర్భాషలాడుతూ దాడి చేయడానికి నిరసనగా విధులు బహిష్కరించామన్నారు. అలాగే తమకు నెలకు రూ.15వేలు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరగా పరిష్కరిస్తామని చెప్పిన విజయవాడ ధర్మకర్త మండలి అధ్యక్షుడు గౌరంగ బాబు, ఎంఎల్సీ బుద్దా వెంకన్న నెరవేర్చకపోవడం దారుణమన్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ఈనెల 14వ తేదీ వరకు గడువు ఇచ్చినా పాలకుల్లో చలనం లేకపోవడంతో కత్తి పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు. శ్రీశైల దేవస్థానాన్ని నమ్ముకొని ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని వాపోయారు. క్షేత్రంలో పనిచేసే క్షురకులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే క్షురకుల సంక్షేమ నిధి నుంచి సహాయం చేస్తామని అధికారులు చెప్పినా అమలు కావడం లేదని వాపోయారు. కళ్యాణకట్టలో పనిచేసే చెన్నయ్యకు కొన్ని రోజుల క్రితం కాలు విరిగిపోయినా నేటి వరకు సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉద్యోగం పోయినా.. భద్రత ఉండాలి!
పాత టెక్నాలజీల్ని కొత్తవి ఆక్రమిస్తున్నాయి. మనుషులు చేసే పనులకు ఆటోమేషన్ పోటీ పడుతోంది. ప్రైవేటు ఉద్యోగుల ముందు ఈ తరహా సవాళ్లెన్నో ఉన్నాయి. ఉన్నట్టుండి ఓ కంపెనీ ‘రాజీనామా చేయండి’ అని అడిగితే... వెంటనే మరో కంపెనీ వెల్కమ్ చెప్పే పరిస్థితులను అన్ని వేళలా ఊహించలేం. టెలికం, ఈ–కామర్స్, ఐటీలో ఉద్యోగాలు కోల్పోవడం సాధారణంగా మారింది. ఇక మెరుగైన అవకాశాల కోసం, తమ నైపుణ్యాలను మెరుగుపెట్టుకునేందుకు ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టేవారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా ఉద్యోగం కోల్పోయినా లేదా వదిలిపెట్టినా ఆర్థికంగా సమస్యలు ఎదురు కాకుండా... ఉద్యోగంలో ఉన్నప్పుడే తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నది నిపుణుల సలహా. కిట్టీ ఏర్పాటు చేసుకోవాలి... ఉద్యోగం పోతే రోజువారీ అవసరాలు ఆగకూడదు. రుణాలు తీసుకుని ఉంటే వాటికి చేసే చెల్లింపులూ ఆగకూడదు. వివాహమై, పిల్లలున్నవారికి కుటుంబ ఖర్చులు ఎక్కువే ఉంటాయి. అందుకే కనీసం ఓ ఆరు నెలల కుటుంబ, ఇతర అవసరాలకు సరిపడా నిధుల్ని ఉద్యోగంలో ఉన్నపుడే పక్కన పెట్టుకోవాలి. ఈ వ్యయాల గురించి లెక్కించేటపుడు రుణాలపై ఈఎంఐలు, టెలిఫోన్, విద్యుత్ బిల్లులు, ఇంటద్దె, పాలు, కిరాణా, వైద్యం, మందుల ఖర్చు, పిల్లల స్కూలు ఫీజులు, రవాణా వ్యయాలు, బీమా పాలసీ ప్రీమియంను పరిగణనలోకి తీసుకోవాలి. కొంచెం కూడా రిస్క్ ఇష్టం లేని వారు మ్యూచువల్ ఫండ్స్‌లో నెలవారీ చేసే సిప్ పెట్టుబడులు లేదా రికరింగ్ డిపాజిట్లను కూడా కలుపుకుంటే మంచిది. ఎంత మొత్తం కావాలో స్పష్టత వచ్చాక ఆ మేరకు నిధిని సమకూర్చుకోవాలి. ముఖ్యంగా ఈ నిధి సమకూరేంత వరకు ప్రతి నెలా ఇతర అవసరాలను త్యాగం చేయడానికి వెనకాడకూడదు. అత్యవసర నిధి సమకూరాక వీలును బట్టి సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో లేదా లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే అవసరమైన సమయంలో వెంటనే తీసుకునేందుకు వీలుంటుంది. కాకపోతే ఈ రెండింట్లో లిక్విడ్ ఫండ్స్‌లో రాబడి ఎక్కువ. బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో నిల్వలపై 4 శాతమే వడ్డీ కాగా, దీంతో పోల్చుకుంటే లిక్విడ్ ఫండ్స్‌లో రాబడి రెండు శాతం ఎక్కువే ఉంటుంది. ఇలా అత్యవసర నిధి సమకూరాక ఉద్యోగం కోల్పోయినా, లేదా మీ అంతట మీరు మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగాన్ని వదిలినా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. నెలవారీ అవసరాలకు ఇబ్బంది ఏర్పడదు. అన్ని చెల్లింపులూ యథావిధిగా అత్యవసర నిధి నుంచి చేసేయవచ్చు. ఒకవేళ మీరు పనిచేస్తున్న రంగంలో ఉద్యోగ భద్రత తక్కువగా ఉండి, అదే సమయంలో కొత్త ఉద్యోగాలకు అవకాశం తక్కువగా ఉంటే గనుక కనీసం తొమ్మిది నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని సమకూర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భార్యా భర్తలు ఇద్దరూ ఆర్జనా పరులైతే పరస్పరం కలసి అత్యవసర నిధిని సమకూర్చుకోవచ్చు. బీమా రక్షణ తప్పనిసరి...: ఉద్యోగం కోల్పోయి మరో ఉద్యోగ వేటలో ఉన్న సమయంలో మీకంటూ ఆరోగ్య బీమా రక్షణ తప్పకుండా కొనసాగడం అవసరం. బీమా పాలసీలో మీతోపాటు జీవిత భాగస్వామి, పిల్లలకు కూడా కవరేజీ తప్పకుండా ఉండాలి. ఆ పనిని ఉద్యోగంలో ఉన్నప్పుడే చేయాలి. ఒకవేళ అవివాహితులు అయితే తల్లిదండ్రులను పాలసీ కవరేజీలో భాగం చేసుకోవాలి. ఇలా కాకుండా సీనియర్ సిటిజన్ ఇన్సూరెన్స్ పేరుతో పెద్దలకు ప్రత్యేక పాలసీలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నప్పుడే ఆ పాలసీని తీసుకోవడం మంచి ఆలోచనే. సాధారణంగా కంపెనీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులకూ కవరేజీ ఉంటుంది. ఒకవేళ ఆ సంస్థ నుంచి తప్పుకుంటే, బీమా రక్షణ కొనసాగుతుందా? అన్నది స్పష్టం చేసుకోవాలి. కవరేజీ కొనసాగదంటే విడిగా పాలసీ తీసుకోవడం అన్ని విధాలుగా మంచిది. ఖర్చులకు కళ్లెం వేయాలి..: ఉద్యోగం చేస్తున్న సమయంలోనూ ఖర్చులను నియంత్రించుకోవడం చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో ఒకటి. మరీ ముఖ్యంగా ఉద్యోగం కోల్పోయే ముప్పు ఉన్నవారికి ఇది మరీ అవసరం. క్రెడిట్ కార్డు ఉండి దానిపై రుణం తీసుకుని ఉంటే, వీలైనంత వేగంగా చెల్లింపులు చేసేయాలి. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. ఎందుకంటే అధిక వడ్డీ భారం పడే ఈ తరహా రుణాలు ఉద్యోగం కోల్పోతే సమస్యగా పరిణమిస్తాయి. మరీ ముఖ్యంగా తక్కువగా వినియోగించడం ద్వారా నగదు లభ్యత ఉండేలా చూసుకోవడం మంచిది. ఎందుకంటే క్రెడిట్ కార్డు ఉండి దానిపై క్రెడిట్ లిమిట్ వినియోగించుకోకుండా ఉండుంటే, ఒకవేళ ఉద్యోగం లేని సమయంలో వినియోగానికి అక్కరకు వస్తుంది. అయితే, ఉద్యోగం లేని సమయంలో క్రెడిట్ కార్డు ఉంది కదా అని పూర్తిగా లిమిట్ వాడేయడం కూడా ఆమోదనీయం కాదు. మరో ఉద్యోగం రావడం కాస్త ఆలస్యమైతే, లేదా తక్కువ వేతనానికి చేరాల్సి వస్తే చెల్లింపులు కష్టమవుతాయి. కనుక ఆచితూచి వినియోగించాలి. ఇక ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న సమయంలో ఏవి త్యాగం చేసినా దీర్ఘకాలిక అవసరాలకు ఉద్దేశించిన పెట్టుబడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. తాత్కాలిక అవసరాల కోసం దీర్ఘకాలిక లక్ష్యాలు దెబ్బతినకుండా చూసుకోవడం అవసరం. రెండు మూడు నెలలే కదా, ఆపితే ఏం కాదులేనన్న ధోరణి వల్ల నష్టమే. ఉద్యోగం లేని పరిస్థితులను అధిగమించేందుకు ఉద్యోగంలో ఉన్నప్పుడే ఈ మేరకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
వీఆర్ఏల వినతి వినరా..?
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2012లో ఉద్యోగాలు పొందిన దాదాపు 3 వేల మంది వీఆర్ఏలు ఉద్యోగ భద్రత లేక నిరాశతో కొట్టుమిట్టాడుతున్నారు. డైరెక్ట్ రిక్రూటీ వీఆర్ఏలను ఇతర శాఖల్లో విలీనం చేసే అంశాన్ని 6 నెలల్లో పరిష్కరించాలని గతేడాది ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ ఆదేశించినా రెవెన్యూ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో హామీ నెరవేరడం లేదు. ఉద్యోగాలు వచ్చాయన్న మాటేగానీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా తెలంగాణలో 4,100 మంది వీఆర్ఏలుగా ఉద్యోగాలు పొందారు. వీరిలో 2,500 మంది 2012లో.. 1,600 మంది 2014లో నియమితులయ్యారు. ఉద్యోగాలు వచ్చాయన్నమాటే గానీ ఇప్పటివరకు క్రమబద్ధీకరణ జరగలేదు. ప్రస్తుతం గౌరవ వేతనం కింద నెలకు రూ.10,500 పొందుతున్న వీరికి 010 పద్దు ద్వారా కాకుండా 280–286 పద్దు కింద వరద బాధితుల ఖాతాలో జీతాలు ఇస్తున్నారు. డీఏ, ప్రసూతి సెలవులూ లేకపోవడంతో తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. అయితే పెండింగ్‌లో ఉన్న ‘రెగ్యులరైజ్’ ఫైలుకు గతేడాది ఫిబ్రవరి 24న సీఎం కేసీఆర్ మోక్షం కలిగించారు. ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో వీఆర్ఏలను టీఎస్పీఎస్సీ ద్వారా ఇతర శాఖల్లో విలీనం చేయాలని ఆదేశాలిచ్చారు. ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న డ్రైవర్, అటెండర్ పోస్టుల్లో వీరిని నియమించాలని, ఖాళీల వివరాల ప్రకారం 6 నెలల్లో నియామక ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. వివరాలున్నా పంపడం లేదు చాలీచాలని వేతనాలతో ఉద్యోగాలు చేయలేక ఐదారేళ్లలో 1,000 మంది వరకు ఉద్యోగాలు వదిలి వెళ్లిపోయారని, కొందరు ఎలాంటి ప్రయోజనాలు పొందలేక మరణించారని వీఆర్ఏలు చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు డైరెక్ట్ రిక్రూటీ వీఆర్ఏల వివరాలు టీఎస్పీఎస్సీకి ఇచ్చి రోస్టర్ పద్ధతిలో ఇతర శాఖల్లో విలీనం చేయాల్సిన సీసీఎల్ఏ అధికారులు ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలే చేయలేదని ఆరోపిస్తున్నారు. ఇటీవలే రాష్ట్రంలోని వీఆర్ఏల వివరాలు సేకరించిన సీసీఎల్ఏ.. ఆ వివరాలు టీఎస్పీఎస్సీకి పంపడం లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. సీఎం ఆదేశాలను త్వరగా అమలు చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాయి. ఈ సమావేశాల్లోనే తేల్చాలి ‘డైరెక్ట్ రిక్రూటీలను ఇతర శాఖల్లో విలీనం చేసే అంశాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను గతేడాది ఫిబ్రవరిలో సీఎం ఆదేశించారు. కానీ ఇప్పటికీ తేల్చలేదు. రాష్ట్రంలో వీఆర్ఏల సమాచారం కావాలం టూ కాలయాపన చేస్తున్నారు. మా పరిస్థితి ఘోరంగా ఉంది. ఉద్యోగాలు వదిలి వెళ్తున్న వారు పెరుగుతున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మా విషయం తేల్చాలి’ – వి.ఈశ్వర్, డైరెక్ట్ రిక్రూటీ వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
2వేల మంది కాంట్రాక్ట్ లెక్చరర్లపై వేటు!
-
2వేల మంది కాంట్రాక్ట్ లెక్చరర్లపై వేటు!
ఏకీకృత సర్వీసు పేరిట ఇంటికి పంపాలని సర్కారు నిర్ణయం సాక్షి, అమరావతి: జాబు కావాలంటే బాబు రావాలన్నారు. ఇది 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు మాట. ఆ మాట చెప్పి ఎన్నికల్లో నెగ్గిన చంద్రబాబు సీఎం పీఠంపై కూర్చుని మూడేళ్లు గడిచిపోయాయి. కొత్తగా ఉద్యోగాల కల్పన మాట అటుంచి ఉన్న ఉద్యోగాలకు సైతం ఆయన ఎసరు పెడుతున్నారు. తాజాగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లపై వేటు వేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రస్తుతం 4000 మంది వరకు కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 1900 మందికి పైగానే ఇంటికి పంపాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొద్దిరోజుల్లోనే ఈ మేరకు ఉత్తర్వులు వెలువడే అవకాశముందని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకీకృత సర్వీసు నిబంధనల పేరిట ప్రభుత్వం వీరిపై వేటు వేయాలని చూస్తోంది. తమను రెగ్యులర్ చేయాలని గత ఏడాదిలో వీరు సమ్మె చేయగా ప్రభుత్వం వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, దశల వారీగా రెగ్యులర్ పోస్టుల్లో నియమిస్తామని హామీ ఇచ్చింది. తీరా ఇప్పుడు అసలుకే ఎసరు తెస్తూ హూస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇలా ఇళ్లకు పంపుతారా? ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలపై కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడం, దానిపై కేంద్రం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏకీకృత సర్వీసు నిబంధనలను రూపొందిస్తోంది. ఈ నెల 16లోపు వీటి ముసాయిదాకు తుది రూపు ఇచ్చి అనంతరం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇదే ఇప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్లకు శాపంగా మారుతోంది. దాదాపు 18 ఏళ్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చి, ఇప్పుడు తమ జీవితాలను అంధకారంలోకి నెడుతున్నారని వారు ఆక్రోశిస్తున్నారు. 21న గుంటూరులో నిరసన తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఏకంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని చూడడం దారుణమని ప్రభుత్వ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు గాంధీ, ఇతర నాయకులు ధ్వజమెత్తుతున్నారు. దీనిపై ఈ నెల 21న చలో గుంటూరు కార్యక్రమానికి పిలుపు నిస్తున్నామన్నారు. -
పుణెలో తెలుగు టెకీ ఆత్మహత్య
- ఐటీ ఉద్యోగానికి భద్రత లేదని సూసైడ్ నోట్ - ఆపై ఆరో అంతస్తు పైనుంచి దూకి బలవన్మరణం - మృతుడు దుర్గాప్రసాద్‌ది కృష్ణా జిల్లా.. మూడ్రోజుల కిందటే జాబ్‌లో చేరిక పుణె: ‘‘ఐటీలో ఉద్యోగానికి భద్రత లేదు.. భవిష్యత్తు గురించి భయపడ్డా.. నా కుటుం బం గురించి ఆందోళన చెందుతున్నా. వారిని బాగా చూసుకోండి.. క్షమించండి. లవ్యూ ఆల్. గుడ్‌బై..’’అని సూసైడ్ నోట్లో రాసి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీసుకున్నాడు. పుణెలో జాబ్‌లో చేరిన మూడోరోజులకే హోటల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనను కృష్ణా జిల్లాకు చెంది న గోపీకృష్ణ దుర్గాప్రసాద్(25)గా గుర్తిం చారు. గతంలో హైదరాబాద్, ఢిల్లీలోని సాఫ్ట్ వేర్ సంస్థల్లో పనిచేసిన ఆయన.. ఈ నెల 9న పుణెలోని ఓ ఐటీ కంపెనీలో విధుల్లో చేరాడు. విమాన్‌నగర్ ప్రాంతంలోని ఓ హోటల్లో ఆయనకు ఆ కంపెనీ వసతి ఏర్పాటు చేసింది. అయితే ఐటీ ఉద్యోగానికి భద్రత లేదని ఆవేదన చెందిన దుర్గాప్రసాద్ బుధవారం రాత్రి చేతి మణికట్టుపై బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అది విఫలమ వడంతో గురువారం తెల్లవారుజామున 1.40 గంటల సమయంలో హోటల్ భవనంలోని ఆరో అంతస్తు నుంచి దూకాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే హోటల్ మేనేజర్‌కు సమాచారమిచ్చారు. అతడు పోలీసులకు సమాచారమిచ్చి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దుర్గాప్రసాద్ చాలా మంచివాడని, ఎలాంటి చెడు అలవాట్లు లేవని పుణెలో పనిచేస్తున్న ఆయన బంధువులు పేర్కొన్నారు. (చదవండి: సాఫ్ట్వేర్ కొలువులపై మెత్తని కత్తి) -
ఐటీ లైఫ్.. కల చెదిరిందా?
- సాఫ్ట్వేర్ కొలువులపై మెత్తని కత్తి - ఉద్యోగ భద్రత లేక అల్లాడుతున్న ఐటీ ఉద్యోగులు - ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన.. ఇల్లు, వాహనాల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్న ఉద్యోగులు - నగరంలో గృహ నిర్మాణ కార్యకలాపాలు తగ్గుముఖం - అమ్మకాలు తగ్గుతున్నాయంటున్న బిల్డర్లు - కార్ల అమ్మకాల్లోనూ మందగమనం - అమెరికాలోనూ అదే పరిస్థితి.. ఒక్క కొలువుకు పది మంది పోటీ - కనుమరుగవుతున్న కన్సల్టెన్సీలు ⇒4,000 నగరంలో గత మూడు నెలల్లో వేటు పడిన ఉద్యోగుల సంఖ్య ⇒65% అమెరికాలో తగ్గిన క్యాంపస్ రిక్రూట్మెంట్లు సాక్షి, హైదరాబాద్: ⇒ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్నికల్ కన్స ల్టెంట్‌గా పని చేస్తున్న విక్రమ్‌రెడ్డి హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేయడానికి బిల్డర్‌తో అగ్రిమెంట్ చేసుకున్నాడు. బ్యాంక్ రుణానికి దరఖాస్తు చేయడం, బ్యాంక్ ఆ మొత్తాన్ని మంజూరు చేయడం చకచకా జరిగి పోయింది. ఇంకేముంది.. సొంతింటి కల నెర వేరుతుందని ఆశపడ్డాడు. అంతలోనే ఆయన పని చేస్తున్న ఆఫీసులో ఒకేరోజు 25 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించడంతో అభద్రతాభా వానికి లోనయ్యాడు. బిల్డర్ వద్దకు వెళ్లి తాను చెల్లించిన అడ్వాన్స్‌లో 10 శాతం వదులుకుని మిగిలిన మొత్తాన్ని వెనక్కి తీసుకున్నాడు. ⇒ ఇంజనీరింగ్ కాగానే ప్రముఖ ఐటీ కంపె నీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరి ఐదేళ్లుగా పని చేస్తున్న అరవింద్‌కు తల్లిదండ్రులు పెళ్లి సంబం« దం చూశారు. ముహూర్తం కూడా నిర్ణయిం చారు. పెళ్లికి సరిగ్గా మూడు వారాల ముందు ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ కంపెనీ నుంచి అరవింద్‌కు ఆదేశం అందింది. దీంతో దిక్కుతోచని ఆయన కుదుర్చుకున్న పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ప్రముఖ ఐటీ కంపెనీలు ఎడాపెడా ఉద్యో గాలు తొలగిస్తుండటంతో వాటిలో పని చేస్తు న్న వేలాది మంది అభద్రతాభావంతో బిక్కు బిక్కుమంటున్నారు. గడచిన మూడు నెలల్లోనే హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు 4 వేల మం ది ఉద్యోగులను తొలగించాయి. 23 చిన్నాచి తక సాఫ్ట్వేర్ సంస్థలు మూతపడ్డాయి. కళ్ల ముందే సహచరులు ఉద్యోగాలను కోల్పోతుం డటంతో మిగతావారు భవిష్యత్‌పై బెంగ పెట్టుకుంటున్నారు. ఎప్పుడేమవుతుందో తెలి యక కొందరు.. ఇల్లు కొనుగోలుకు ఇచ్చిన అడ్వాన్స్‌ను వెనక్కి తీసుకుంటున్నారు. సైబరా బాద్ ఏరియాలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ బహుళ అంతస్తుల సముదాయంలో ఫ్లాట్ బుక్ చేసుకున్న ఐటీ ఉద్యోగుల్లో మూడొంతుల మంది ఇలా డబ్బులు వెనక్కి తీసుకున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో సొమ్ము వెనక్కి తీసుకుంటున్నామన్న వారి ఆవేదనను అర్థం చేసుకున్న సదరు సంస్థ అడ్వాన్స్ బుకింగ్ నగదులో 10% కోత పెట్టకుండానే వెనక్కి ఇచ్చేసింది. మరికొన్ని సంస్థలు మాత్రం కొత్త బుకింగ్ వస్తేనే డబ్బులు వాపస్ చేస్తామని మొండికేస్తున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలపై ఆధారపడ్డ స్టార్టప్ కంపెనీలు కూడా ప్రాజెక్టు ల్లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ‘‘రూ.48 వేల నెలసరి వాయిదాతో ఇల్లు కొనుగోలు చేయవచ్చు. కానీ ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియనప్పుడు అంత రిస్క్ తీసుకోవడం అవసరమా? అందుకే నేను ఇల్లు కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకున్నా..’’అని మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్న శ్రీనివాస్ వాపో యాడు. తన లాంటి వారు వందలాది మంది ఇప్పుడు ఉద్యోగ భద్రత లేక అయోమయంలో పడ్డారని, కొందరైతే పెళ్లిళ్లు కూడా రద్దు చేసుకున్నారని చెప్పాడు. మాదాపూర్‌లో కార్ల డీలర్లు.. గడచిన ఏడాది విక్రయించిన కార్లలో ఈసారి సగం కూడా అమ్మడం లేదు. ‘అమ్మకాల సంగతెలా ఉన్నా... కనీసం ఎంక్వైరీలు కూడా రావడం లేదు. కారు బుక్‌చేసి డెలివరీ అయ్యే సమయానికి రద్దు చేసుకుంటున్నార’ని ప్రముఖ కార్ల డీలర్ ఎగ్జిక్యూటివ్ సోమసుందర్ పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టులు లేకపోవడం వల్లే.. గడచిన ఏడాది నుంచి కొత్తగా ప్రాజెక్టులు లేకపోవడం వల్లే సీనియర్ ఉద్యోగులను వదులుకోవాల్సి వస్తోందని బెంగళూరు ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఐటీ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఓ వెబ్సైట్లో పేర్కొన్నారు. ‘‘2012–2014 సంవత్సరాలతో పోలిస్తే 2014–2016లో దాదాపు అన్ని కంపెనీలకు 26 నుంచి 40 శాతం మేర కొత్త ఆర్డర్లు తగ్గిపోయాయి. ఆ మేరకు మేం ఖర్చులు తగ్గించుకుంటేనే మా ఆదాయాన్ని స్థిరంగా కాపాడుకోగలుగుతాం. అప్పుడే మా ఇన్వెస్టర్లకు మాపై విశ్వాసం సడలకుండా ఉంటుంది. అందుకు.. అవసరం లేని ఉద్యోగులను వదులుకోవడం తప్ప మరో మార్గం లేదు’’అని ఆయన వివరించారు. వృత్తి నైపుణ్యం లేనివారిని వదిలించుకుంటే సమస్య ఏమిటి? దానికి అంతగా గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఉందా అంటూ ముంబై ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ సీనియర్ అధికారి ఒకరు అదే వెబ్సైట్లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అదే నిజమైతే నైపుణ్యం లేని వీరికి ఐదారేళ్లలో వారి వేతనాలను 300 నుంచి 400 శాతం ఎందుకు పెంచాల్సి వచ్చిందని ఐటీ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వారికి కేవలం వారి కంపెనీల బాగు తప్ప సామాజిక బాధ్యత లేదని మండిపడుతున్నారు. సీనియర్లను వదిలించుకుంటూ.. ఓవైపు సీనియర్ ఉద్యోగులను వదిలించుకుంటున్న కంపెనీలు మరోవైపు ఈ ఏడాది జోరుగా క్యాంపస్ నియామకాలకు సిద్ధమవుతున్నాయి. వివిధ కాలేజీల నుంచి అందిన సమాచారం ప్రకారం.. గడచిన ఏడాది కంటే ఈ ఏడాది కంపెనీలు 10 శాతం ఎక్కువగా ఉద్యోగులను నియమించుకోబోతున్నాయి. ‘‘మా కాలేజీకి వచ్చే దాదాపు అన్ని కంపెనీలు ఈ ఏడాది 10 శాతం ఎక్కువకు ఇండెంట్ ఇచ్చాయి. వాటిలో దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలతో పాటు బహుళజాతి కంపెనీలు కూడా ఉన్నాయి’’అని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ ప్లేస్మెంట్ అధికారి ఒకరు చెప్పారు. గతేడాది క్యాంపస్ రిక్రూట్మెంట్కు రాని సంస్థలు కూడా ఈసారి నియామకాలకు ముందుకొస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రారంభ స్థాయి ఉద్యోగులకు తక్కువ వేతనం ఇచ్చి ఎక్కువ పని చేయించుకునేందుకు ఐటీ సంస్థలు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే నాస్కామ్ వీటిని తిప్పి కొడుతోంది. కొత్తగా ప్రాజెక్టులు లేనప్పుడు కొత్త ఉద్యోగులతో 75 శాతం పనులు చేసుకోగలుగుతామని చెబుతోంది. అమెరికాలోనూ ఇదే పరిస్థితి అమెరికాలోనూ పరిస్థితులు ఇందుకు భిన్నంగా లేవు. ఐటీ ఉద్యోగాల కోసమే ఎంఎస్ చేసేందుకు అక్కడికి లక్షల సంఖ్యలో వెళ్లిన విద్యార్థులకు ఉద్యోగం దొరకడం గగనమైంది. గడచిన నాలుగేళ్లలో అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన వారు 2.75 లక్షల మంది ఉన్నారంటేనే ఉద్యోగాల కోసం పోటీ ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ ఏడాది 1.25 లక్షల మంది ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం వేట మొదలుపెట్టారు. రెండేళ్ల క్రితం కన్సల్టెన్సీ సంస్థల ద్వారా తేలిగ్గా ఉద్యోగం సాధించిన వారికి ఇప్పుడు అది అంత ఈజీగా లేదు. కన్సల్టెన్సీ సంస్థలు దొంగ సర్వీసు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యూఎస్ లేబర్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. దీంతో ఈ ఏడాది 13 శాతం కన్సల్టెన్సీలు మూతపడ్డాయి. దానికి తోడు ఐటీ వృత్తి నిపుణులు ఏటా లక్షల సంఖ్యలో యూనివర్సిటీల నుంచి బయటకు వస్తుండటం కూడా ఉద్యోగాలు దొరకకపోవడానికి ప్రధాన కారణమని న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ప్రత్యేక కథనంలో విశ్లేషించింది. ‘ఇప్పుడు అమెరికాలో ఒక వృత్తి నిపుణుడు అవసరం ఉంటే పది మంది పోటీ పడే పరిస్థితి ఉంది. ఇది మున్ముందు మరింత పెరిగే అవకాశాన్ని ఇక్కడి విశ్వవిద్యాలయాలు పెంచి పోషిస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ప్రాచుర్యం కల్పించి విదేశీ విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసే పనిలో బిజీగా ఉన్నాయి’’అని విరుచుకుపడింది. దానికి తోడు కనీస వార్షిక వేతనం 80 వేల డాలర్లు చేయడంతో ఐటీ సంస్థలు నియామకాలను తగ్గించుకుంటున్నాయి. గతేడాది అమెరికాలో విశ్వవిద్యాలయాల నుంచి జరిపిన రిక్రూట్మెంట్లతో పోల్చి చూస్తే ఈ ఏడాది 65 శాతం నియామకాలు తగ్గాయి. (చదవండి: పుణెలో తెలుగు టెకీ ఆత్మహత్య) -
వెట్టి బతుకులు
l కనీస వేతనాలు కరువైన గ్రామపంచాయతీ సిబ్బంది l ఉద్యోగ భద్రత లేక భారంగా విధులు l తక్కువ ఆదాయం ఉన్న పంచాయతీ కార్మికులను ఆదుకోని జీఓ 63 l రూ.లక్ష లోపే ఆదాయంతో వేతనాలు రూపంలో యాభై శాతం తీసుకోలేని వైనం l జిల్లాలో 269 జీపీలు, 1100 మంది సిబ్బంది గీసుకొండ(పరకాల): పల్లెలు పరిశుభ్రంగా ఉండాలని, వంద శాంతి ఇంటి పన్నులు వసూలు కావాలని, స్థానిక పరిపాలన సజావుగా సాగాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. వీటన్నింటినీ సాకారం చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ ఉద్యోగుల జీవితాలు మాత్రం బాగుపడడం లేదు. చాలీచాలని వేతనాలతో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారు వెట్టి బతుకులు బతుకుతున్నారు. గ్రామాల్లో పనిచేసే కారోబార్లు, పంపు ఆపరేటర్లు, సఫాయి కార్మికులు, స్వీపర్లు, ఎలక్రీషియన్లు, పంప్ ఆపరేటర్లు ఇలా పేరు ఏదైనా అందరూ గ్రామపంచాయతీ సిబ్బంది కిందకే వస్తారు. గడిచిన 20ఏళ్లుగా పని చేస్తున్న వీరికి ఇప్పటి వరకు ఉద్యోగ భద్రత లేకపోగా.. కనీస వేతనం అందకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. పనికి రాని జీఓ గ్రామపంచాయతీ సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించా ల నే డిమాండ్‌తో కొద్దిరోజుల క్రితం నెల పాటు సమ్మెకు ది గారు. దీంతో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏడాది తర్వాత జీఓ 63ను జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం పంచాయతీలకు వచ్చే ఆదాయం నుంచి యాభై శాతం మేర కార్మికులు వేతనంగా తీసుకోవచ్చు. కానీ వరంగల్ రూరల్ జిల్లాలో 269 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో 1100 మంది వర కు వరకు ఉంటారు. వీరికి రూ.500 నుం చి రూ.3వేల వరకు వేతనం ఇస్తున్నారు. అయితే, ఇవి కూడా ప్రతీనెలా అందడం లేదు. జిల్లాలో కొన్ని పంచాయతీల్లో ఏడాది ఆదాయం రూ.40 వేల నుంచి రూ.లక్ష మేరకు ఉంటుంది. అయితే, ఈ ఆదాయం నుంచి సిబ్బందికి 50 శాతం వేతనాలు రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం జీఓ జారీ చేసినా.. ఇవ్వలేని పరిస్థి తి. ఏమంటే 50 శాతం వేతనాలు రూపంలో చెల్లిస్తే మిగతా నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదు. ఎక్కువ ఆదాయం ఉన్న పంచాయతీల్లో ఈ జీఓ ఉపయుక్తమే అయినా.. వరంగల్ రూరల్ జిల్లాలోని పంచాయతీల సిబ్బందికి మాత్రం మేలు జరగడం లేదు. పని చేసేది, అందుబాటులో ఉండేది వారే... గ్రామంలో ఏ పని చేయాలన్నా పంచాయతీ సిబ్బంది అందుబాటులో ఉండాల్సిందే. అధికారులు, ప్రజాప్రతినిధులకు సహకారం అందిస్తూ గ్రామ పాలనలో కీలకంగా వ్యవహరిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంత కీలకంగా ఉన్న వారి వేతనాలు, సమస్యల పరిష్కారంపై ఎవరికీ పెద్దగా పట్టింపు ఉండటం లేదు. ఇవీ సిబ్బంది డిమాండ్లు వరంగల్ రూరల్ జిల్లాలోని పంచాయతీ సిబ్బంది తమ సర్వీసులను క్రమబద్ధీకరించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభు త్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శుల నియామకంలో 30 శాతం పంచాయతీ సిబ్బందికి అవకాశం కల్పించాలని, పంచాయతీల ఆదాయం నుంచి కాకుండా నేరుగా ప్రభుత్వమే వేతనాలను చెల్లించాలని కోరుతున్నారు. ఇంకా 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పంచాయతీ సిబ్బందికి 30 శాతం కేటాయించాలని కోరుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. -
'ఉద్యోగాల భద్రతే మాకు టాప్-ప్రియారిటీ'
బెంగళూరు : నిన్నమొన్నటిదాకా ఆన్ లైన్ షాపింగ్ లో మారుమోగిన స్మాప్ డీల్ పరిస్థితి ప్రస్తుతం అతలాకుతలంగా మారింది. ఆ నష్టాలను అధిగమించడానికి ప్రత్యర్థైన ఫ్లిప్ కార్ట్ కు స్నాప్ డీల్ ను అమ్మేస్తున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఇప్పటివరకు దానిపై స్నాప్ డీల్ ఎలాంటి కామెంట్ చేయనప్పటికీ, ఉద్యోగులు మాత్రం తమ ఉద్యోగాలపై ఆందోళన చెందుతున్నారు. అయితే ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని కంపెనీ వ్యవస్థాపకులు కునాల్ బహల్, రోహిత్ బన్సాల్ భరోసా ఇస్తున్నారు. కంపెనీ ఇన్వెస్టర్లు వివిధ రకాల ఆప్షన్లపై చర్చలు సాగిస్తున్నప్పటికీ.. తాము మాత్రం జాబ్ సెక్రురిటీకే టాప్-ప్రియారిటీ ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలకు భరోసా ఇస్తూ ఈ మేరకు ఓ ఈ-మెయిల్ ను ఆదివారం బహల్, స్నాప్ డీల్ ఉద్యోగులకు పంపారు. ''మేము చేయగలిగిందంతా చేస్తాం.. అంతకంటే ఎక్కువ చేయడానికైనా మేము సిద్ధమే. ఇన్వెస్టర్లతో కలిసి పనిచేసేటప్పుడు, ఎంప్లాయిమెంట్‌లో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటాం'' అని ఈ-మెయిల్ లో తెలిపారు. గత రెండు నెలలుగా కంపెనీ భవితవ్యంపై ఉద్యోగుల్లో నెలకొన్న అనిశ్చితిపై వ్యవస్థాపకులు భరోసా కల్పిస్తూ స్పందించడం ఇది మూడోసారి. వచ్చే రెండు వారాల్లో ఇంక్రిమెంట్లు ప్రకటించబోతున్నట్టు కూడా వ్యవస్థాపకులు పేర్కొన్నారు. శరవేగంగా దూసుకెళ్తున్న ఈ-కామర్స్ మార్కెట్లో స్నాప్ డీల్ తట్టుకోలేక, నెంబర్ -2 స్థానాన్ని కోల్పోయింది. మరోవైపు ఊహాగానాలను నిజం చేస్తూ ఫ్లిప్ కార్ట్ కు స్నాప్ డీల్ అమ్మే విషయాన్ని కంపెనీ ఈ నెలలోనే ప్రకటించబోతుందట. -
శతాబ్ది వేళ..నిధుల గోల
⇒ఓయూను వెంటాడుతున్న నిధుల సమస్య ⇒కొన్నేళ్లుగా నిలిచిపోయిన నియామకాలు.. ⇒కాంట్రాక్టు ఉద్యోగులతో నెట్టుకొస్తున్న అధికారులు... ⇒వందేళ్ల పండుగలోగా సమస్యలు ⇒పరిష్కరించాలని కోరుతున్న ఉద్యోగులు.. తార్నాక: వందేళ్లు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నిధుల కొరత కారణంగా సమస్యలు ఎదుర్కొంటోంది. జాతీయస్థాయిలో ర్యాంకుల జాబితాలో చోటు సంపాదించుకుంటున్నప్పటికీ వర్సిటీని నిధుల సమస్య పట్టిపీడిస్తోంది. ఎన్నో ఏళ్లుగా నియామకాలు నిలిచిపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. వర్సిటీకి ప్రభుత్వం ఇచ్చే బ్లాక్‌గ్రాంట్ సరిపోక, వర్సిటీ అంతర్గతంగా నిధులను సమకూర్చుకోలేక సతమతమవుతోంది. మరో వైపు ఎన్నో ఏళ్లుగా చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్న వందలాదిమంది ఉద్యోగులు ఉద్యోగ భద్రత కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వర్సిటీ వందేళ్ల పండుగ సమయంలోనైనా తమ ఆశలు నెరవేరుతాయో లేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేతనాలకే సరిపోని ప్రభుత్వ బ్లాక్గ్రాంట్లు... ప్రభుత్వం యూనివర్సిటికీ ఏటా బ్లాక్గ్రాంటుగా ఇచ్చే నిధులు అధ్యాపకులు, ఉద్యోగుల వేతనాలకే సరిపోని పరిస్థితి నెలకొంది. చాలీ చాలని బడ్జెట్‌తో వర్సిటీ అంతర్గత ని«ధులతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. యేటా ఉద్యోగులు,అధ్యాపకుల వేతనాలు 20శాతం పెరుగుతుండగా, ప్రభుత్వం అందుకు అనుగుణంగా బ్లాక్గ్రాంటును మంజూరు చేయడంలేదు. దీంతో పరీక్షల విభాగం, దూర విద్యా కేంద్రం, సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సుల ద్వారా వచ్చే నిధులతో గట్టెక్కిస్తున్నారు.ఈ ఆర్థిక సంవత్సరంలో వర్సిటీ ఉద్యోగులు, అధ్యాపకుల వేతనాలకు రూ.458కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం కేవలం రూ.269కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో ఈ లోటును భర్తీ చేసేందుకు వర్సిటీ నానా తంటాలు పడాల్సి వచ్చింది. తగ్గుతున్న అంతర్గత నిధులు.. ఏటా ఓయూకు అంతర్గతంగా వచ్చే ఆదాయ వనరులు తగ్గుతున్నాయని పలువురు సీనియర్ అధ్యాపకులు పేర్కొంటున్నారు. ఏటా పరీక్షల విభాగం నుంచి వచ్చే ఆదాయంతో పాటు దూర విద్యా కేంద్రం , సెల్ప్‌ఫైనాన్స్ కోర్సులతో ఆదాయం లభించేది. అయితే దూరవిద్యా కేంద్రంలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుండగా, వర్సిటీ కొత్తగా ఎలాంటి కోర్సులు, ముఖ్యంగా సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులు ప్రవేశ పెట్టకపోవడం కూడా ఆదాయం తగ్గుదలకు కారణాలుగా అధ్యాపకులు పేర్కొంటున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులతోనే.. ఓయూలో ఐదేళ్ల క్రితం అధ్యాపక నియామకాలు జరిగినా, 25 ఏళ్లుగా బోధనేత సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. దీంతో వర్సిటీ కాంట్రాక్టు ఉద్యోగులపై ఆధారపడి నడుస్తోంది. వర్సిటీలో సుమారు 1800 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తుండగా, దాదాపు 700 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. అయితే వీరికి కనీస వేతన చట్టం అమలు జరగడం లేదు. వేతనాలు, వైద్య , పీఎఫ్ సదుపాయాలు కూడా కల్పించడం లేదు. దీనికితోడు పర్మినెంట్ ఉద్యోగులకు సైతం హెల్త్‌కార్డులు లేని దుస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్యకు తగినన్ని హాస్టళ్లు లేకపోగా, ఉన్న వాటిలో సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని పురాతన భవనాలే కావడంతో ఎప్పుడు కూలుతాయోఅనే భయంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. వందేళ్ల పండుగకైనా..వెలుగు వచ్చేనా? శతాబ్ది ఉత్సవాల కానుకగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా చాలీ చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న తమను పర్మినెంట్‌చేయాలని, పీఎఫ్ సదుపాయం కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని వారు కోరుతున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులను పర్మినెంట్ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఒక కమిటిని నియమించింది. అయితే ఈ కమిటీ నివేదిక ఇచ్చినా తమను పర్మినెంట్ చేస్తారా లేదా అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలు ఆర్థిక అంశాలతో ముడివడి ఉన్నందున, వర్సిటీకి నిధుల కేటాయింపుతోనే వీటికి పరిష్కారం లభిస్తుందని పలువురు సీనియర్ అధ్యాపకులు పేర్కొంటున్నారు. అయితే శతాబ్ది ఉత్సవాల్లోగా తమ సమస్యలు తీరుతాయనే నమ్మకం కనిపించడం లేదని ఉద్యోగులు, కాంట్రాక్టు అధ్యాపకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని వర్సిటీకి అధిక నిధులు తేవడంతో పాటు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. -
వేదన.. అరణ్య రోదన
► కాంట్రాక్టు ఉద్యోగులపై కనికరం చూపని సర్కారు ► అటవీశాఖలో 30 ఏళ్లుగా ఊడిగం ► ఆరంభం నుంచి రూ.7500 జీతంతో బతుకీడుస్తున్న ఏఎఫ్‌బీఓలు ► ఉద్యోగ భద్రత, జీతాల పెంపు కోసం వేడుకోలు ఎండనక వాననక, అటవీ ప్రాంతంలో క్రూర మృగాల నడుమ పని చేస్తున్నాం. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. అయినా మూడు దశాబ్దాలుగా అరకొర జీతాలతోనే బతుకు వెళ్లదీస్తున్నాం. అటవీ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్నఅసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల ఆవేదన ఇది. సర్కారు తమను కనికరించి, ఉద్యోగ భద్రతతో పాటు, జీతాలు పెంచి ఆదుకోవాలని ఉద్యోగులు వేడుకొంటున్నారు. అర్ధవీడు : అటవీశాఖలో 1987లో 280 మంది విలేజ్ ఫారెస్ట్ వర్కర్లుగా చేరారు. ప్రభుత్వం 2004లో వీరికి కాంట్రాక్ట్ పద్ధతిపై ఏఎఫ్‌బీఓలుగా పదోన్నతి కల్పించి జీతం 7500 ఇస్తోంది. 30 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి కూడా జీతాలు మాత్రం పెంచలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎన్జిఓ అధ్యక్షులు అశోక్‌బాబు ముఖ్యమంత్రితో చర్చలు జరగపగా ఆయన తమను రెగ్యులర్ చేసేందుకు అంగికరించారని, ఇంకోసారి ఆర్థికమంత్రితో చర్చించి రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంత వరకు ఎటువంటి చర్యలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మొన్న చేరిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ రూ.15వేలుపైగా జీతం చెల్లిస్తున్న ప్రభుత్వం తమకు మాత్రం రూ.7500 ఇవ్వడం ఏం న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఈ జీతాలతో తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో రెగ్యులర్ చేశారు: తమతో పాటు విలేజ్ ఫారెస్ట్ వర్కర్లుగా చేరిన పంజాబ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో ఉద్యోగ భద్రతతో పాటు జీతాలు పెంచారని, వారికి అలవెన్సులు అందజేస్తున్నారని ఇక్కడ మా బతుకులు అలాగే ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులర్ చేయడంతో పాటు జీతాలు పెంచి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కుటుంబ పోషణ భారమైంది: నేను 1987 నుంచి వీఎఫ్‌ఓగా విధుల్లో చేరాను. 2004లో ఏఎఫ్‌బీఓగా కాంట్రాక్టర్ పద్ధతిలో తీసుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు రూ.7500 జీతంతోనే కుటుంబాలు పోషించుకుంటున్నాం. నిన్న, మొన్న చేరిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు 15వేలకు పైగా జీతాలు చెల్లిస్తున్నారు. అందరు ఉద్యోగుల్లాగే మేం కూడా పని చేస్తున్నాం. వివక్ష మాని ఉద్యోగాకు రెగ్యులర్ చేయాలి. జిల్లాలో 280 మంది ఇలాంటి పరిస్థితులే అనుభవిస్తున్నారు. --- కిఫాయతుల్ల, ఏఎఫ్‌బీఓ -
ప్రైవేటు ఉద్యోగుల భద్రతకు త్వరలో చట్టం
- యజమాని మారినా ఉద్యోగ భద్రత - విశ్వకర్మ జయంతి సభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగంలో మాదిరిగానే ప్రైవేటు రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా త్వరలో చట్టం తీసుకొస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కంపెనీ యాజమాన్యం మారినా ఉద్యోగులను తొలగించకుండా కొనసాగించేలా నూతన చట్టం రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ అకస్మాత్తుగా కంపెనీ మూసేయాల్సి వస్తే కార్మికుడు పొందుతున్న వేతనానికి మూడురెట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా పలు రంగాల్లోని కార్మికులను ఆదివారం ఇక్కడ ఆర్టీసీ కళాభవన్‌లో ఘనంగా సన్మానించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రతి ఏటా భారతదేశ మొట్టమొదటి ఇంజనీరు విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. విశ్వకర్మ తయారు చేసిన పనిముట్ల వల్లే దేశంలో లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కలుగుతోందని అన్నారు. విశ్వకర్మ చేసిన సేవలను ప్రపంచానికి తెలియజేయాలనే ఆయన జన్మదినాన్ని జాతీయ కార్మికదినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యరహిత కార్మికుల దినసరి వేతనాన్ని రూ.160 నుంచి రూ.350కి పెంచామని, నైపుణ్యం కలిగిన కార్మికులకు నెలకు రూ.22 వేలు చెల్లించేలా చట్టం తీసుకొచ్చామని వివరించారు. ముద్ర బ్యాంకు ద్వారా ఇప్పటి వరకు రూ.1.80 లక్షల కోట్ల రుణాలు అందజేసినట్లు పేర్కొన్నారు. 43 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం, 2022 నాటికి దేశంలోని కార్మికులందరికీ గృహవసతి కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని పదివేల మంది బీడీ కార్మికులకు ఇళ్లు కట్టించడానికి కార్మికశాఖ సిద్ధంగా ఉందని అన్నారు. కార్మికుల హక్కులకు సంబంధించిన 44 చట్టాలను నాలుగు కోడ్లుగా, వేతనబోర్డు, ఇండస్ట్రియల్ రిలేషన్స్(ఐ.ఆర్), సామాజిక భద్రత, హెల్త్ అండ్ వర్కింగ్ అంశాల విభాగాల ఆధారంగా విభజిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ హీరాలాల్ సమారియా, ఎంబీసీ జాతీయ నాయకులు కేసీ కాలప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సంఘం ప్రతినిధులు శుక్రవారం జాయింట్ కలెక్టర్-2 పి.రజనీ కాంతారావుని కలసి వినతిపత్రం అందజేశారు. గత ఏడేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో వంటపని వారు, అటెండర్లు, వాచ్మెన్ తదితర కేడర్లలో వంద మందికిపైగా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నామని వివరించారు. ఇటీవల కాలంలో బీసీ, ఎస్సీ వసతి గృహాలను ఎత్తివేస్తున్నారని, ఉద్యోగ భద్రత లేకండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల్లోని ఖాళీ స్థానాల్లో నియమించాలని కొరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఎంఏ నాయుడు, ఎస్‌వై నాయడు పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రత కల్పించండి
కర్నూలు(న్యూసిటీ): కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.రామాంజనేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సీఐటీయూ ఆశా వర్కర్స్ యూనియన్ మహిళలు, ఏఎన్ఎంలు భారీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో మూడు లక్షల మంది కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. ఏఎన్ఎంలకు 10వ పే రివిజన్ స్కూలు అమలు చేయాలని వివరించారు. ఏఎన్ఎంలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. సెకండ్ ఏఎన్ఎంలను తొలగింపును విరమించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జాబు వస్తుందని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి.రమీజాబీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.15 వేలు నిర్ణయించి అమలు చేయాలని కోరారు. ఆశావర్కర్లకు 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని తెలిపారు. అర్హులైన ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చి, రెండో ఏఎన్ఎంలుగా తీసుకోవాలని కోరారు. ఆశా వర్కర్లు కలెక్టరేట్ గేట్లు తీసుకుని లోపలికి వెళ్లటానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డగించారు. దీంతో ఆశా వర్కర్లకు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. డీఎంహెచ్ఓ హామీ: ఆశా వర్కర్లకు నాలుగు నెలల పెండింగ్ వేతనాలను వారం రోజుల్లోపు చెల్లిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శారద హామీ ఇచ్చారు. ఈ ధర్నాలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.మహాలక్ష్మి, జిల్లా గౌర వాధ్యక్షుడు టి.చంద్రుడు, జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఏఎన్ఎం జిల్లా కార్యదర్శి రవినాజ్యోతి, జిల్లాలోని అనేకమంది ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. -
నిత్య సమరం
హామీల అమలు కోరుతూ అంగన్వాడీల సమరశంఖం పోస్టుల భర్తీ కోసండీఎస్సీ అభ్యర్థుల పోరుబాట కనీస వేతనం కోసంవీఆర్ఏల నిరవధిక దీక్షలు ఉద్యోగులుగా గుర్తించాలని గళమెత్తిన గోపాలమిత్రలు ఉద్యమాలకు వేదికగా మారిన విజయవాడ నగరం కాలే కడుపులు కాపాడమంటున్నాయి.. ఉద్యోగ భద్రత కోసం ఆక్రోశిస్తున్నాయి.. ఉపాధి కోసం ఎదురుచూస్తున్నాయి.. హామీలు అమలుచేసి ఆదుకోమంటున్నాయి.. తమ సమస్యలు పరిష్కరిస్తామని, ఉజ్వల భవిత కల్పిస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోరుతూ ప్రభుత్వంపై పోరాటాలకు గళమెత్తుతున్నాయి. అంగన్వాడీలు, వీఆర్ఏలు, డీఎస్సీ 2014 అభ్యర్థులు, ఔట్సోర్సింగ్ కార్మికులు, గోపాలమిత్రలు, ఆశా వర్కర్లు.. ఇలా ఒక్కొక్కరు రోడ్డెక్కుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. నూతన రాజధాని విజయవాడ నగరం నిత్యం బడుగుజీవుల బతుకుపోరుతో హోరెత్తుతోంది. సమరశీల ఉద్యమాలకు వేదికగా మారుతోంది. దీనిపై ప్రత్యేక కథనం. లెనిన్ సెంటర్... ప్రస్తుతం హాట్‌టాపిక్. చర్చంతా ఇక్కడే. నూతన రాజధాని విజయవాడ నగరం మధ్యలో ఓ ప్రధాన కూడలిగా ఉంది. ఈ ప్రాంతం ప్రస్తుతం సమరశీల ఉద్యమాలకు వేదికైంది. ప్రజల సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఇక్కడి నుంచే తమ వాణిని రాష్ట్ర, దేశ ప్రజలకు వినిపిస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలతో నిరసన తెలుపుతున్నారు. ప్రజాసంఘాలు, నిరుద్యోగ యువత, ఉద్యోగ భద్రత కరువైన వివిధ విభాగాల ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఇక్కడే నిత్యం సమరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. విజయవాడ : నగరంలో నిరుద్యోగులు, భద్రత కరువైన ఉద్యోగులు నిత్యం సమరం చేస్తున్నారు. ప్రభుత్వం చాలీచాలని వేతనం ఇవ్వడం, హా మీలు నిలబెట్టుకోవడంలో విఫలం కావడంతో ఉద్యోగులు వీధుల్లోకి వచ్చారు. వీరందరి ఆందోళనకు లెనిన్ సెంటర్ వేదికైంది. పోలీసులకు చేతినిండా పని పెరిగింది. అంగన్వాడీల ఆందోళన ఒక కుటుంబం బతకాలంటే కనీసం రూ.10 వేలు కావాలి. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న అంగన్వాడీ కార్యర్తలు, ఆయాల పరిస్థితి దీనంగా ఉంది. పేరుకు ప్రభుత్వ ఉద్యోగులు. చేసేది వెట్టిచాకిరీ. కొత్తగా అధికారంలోకి వచ్చి న ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్యకర్తకు రూ.7,100, ఆయా కు రూ.4,800ల వేతనాన్ని సెప్టెంబరు ఒకటి నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కానీ అమలు జరగలేదు. వామపక్ష పార్టీల నేతల అండతో వీరు ఈనెల 10 నుంచి రిలే దీక్షలను లెనిన్ సెంటర్లో చేశారు. 18న సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించగా పోలీ సుల అణచివేత వైఖరి కారణంగా పలువురు గాయపడ్డారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించారు. పోలీసుల రాక్షసత్వాన్ని తప్పుపట్టారు. దీంతో వచ్చే సంవత్సరం హామీని నెరవేరుస్తామని ప్రభుత్వం ప్రకటించినా అంగన్వాడీల్లో వేడి కొనసాగుతూనే ఉంది. డీఎస్సీ అభ్యర్థుల.. ఉపాధ్యాయ నియామకాలకు 2014 సంవత్సరంలో డీఎస్సీ పరీక్ష నిర్వహించారు. మెరిట్ జాబితా ప్రకటించలేదు. రాష్ట్రంలో పోస్టులు ఖాళీగా ఉన్నా యి. రెండేళ్లయినా ఉద్యోగాల మాట ఎత్తకపోవడంతో వీరు ఆందోళన బాట చేపట్టారు. ఈనెల 21న సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి విఫలయత్నం చేశారు. 1998లో నిర్వహించిన డీఎస్సీకి ఇంతవరకు దిక్కులేదు. తప్పకుండా వీరికి ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ గాలిమాటగా మారింది. దీంతో వీరు కూడా ఆందోళన చేపట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగులను తీసుకున్నది. కొన్ని శాఖలు పది వేలు నెలకు ఇస్తుండగా కొన్ని శాఖలు ఆరు వేలు, ఐదు వేలే ఇస్తున్నాయి. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో ఇవ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. వీరి ఆందోళనకు కూడా లెనిన్ సెంటర్ వేదికైంది. మంగళవారం నుంచి రిలే దీక్షలు చేపట్టారు. ఆశాల దీక్షలు.. నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలోని ఆశా వర్కర్లు కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. కార్పొరేషన్ వారు రూ.4,500 జీతం ఇస్తుంటే వైద్యారోగ్య శాఖ వారు రూ.10 వేలు ఇస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని తీసేసి పది వేలు ఇవ్వాలని ఆశా వర్కర్లు కోరుతూ ఆందోళన చేస్తున్నారు. వీఆర్ఏల ఆందోళన రెవెన్యూ శాఖలో కీలక వ్యవస్థగా ఉన్న గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల ఆందోళన 51 రోజులుగా సాగుతోంది. వీరు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. డీఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) ద్వారా ఎంపికైన వారు. వీరికి కూడా కనీస వేతనం లేదు. తమకు కనీస వేతనంతోపాటు ప్రమోషన్లలో 70 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కోటా 30 శాతంగా ఉంది. వీరికి ప్రస్తుతం ఇచ్చే జీతం ఆరువేలు. ఈ జీతాన్ని వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లెనిన్ సెంటర్లో ఆందోళన చేస్తున్నారు. ఐదుగురు వీఆర్ఏలు రిలే దీక్షలు చేశారు. వీరిని ఈనెల 19న అరెస్ట్ చేశారు. దీంతో ఆగ్రహించిన వీఆర్ఏలు గుణదలోని ఒక సెల్‌టవర్ ఎక్కి అక్కడి నుంచి దూకి చనిపోతామని హెచ్చరించారు. గోపాల మిత్రలు పశువైద్య శాఖ వారు కాంట్రాక్ట్ పద్ధతిపై గోపాల మిత్రలను గ్రామాల్లో ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పశువులకు వ్యాధులు వస్తే ఇంటి వద్దకే వెళ్లి పశువైద్యం చేస్తారు. వీరికి కూడా కనీస వేతనం అమలు జరగటం లేదు. నెలకు రూ.3,500లు జీతం ప్రభుత్వం ఇస్తున్నది. వీరు 15 సంవత్సరాలుగా చేస్తున్నారు. వీరిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ శనివారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
ఏపీ గోపాలమిత్రల సంఘం డిమాండ్ విజయవాడలో భారీ ర్యాలీ విజయవాడ (గాంధీనగర్) : కనీస వేతనం రూ.13 వేలు ఇవ్వాలని గోపాలమిత్రల సంఘం (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్షుడు బీ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ గోపాలమిత్రల సంఘం ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో ధర్నా నిర్వహించారు. తొలుత రైల్వేస్టేషన్ నుంచి లెనిన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు గోపాలమిత్రలను నియమించినా ఉద్యోగ భద్రత కల్పించలేదన్నారు. వీరికి ప్రభుత్వం నామమాత్రపు వేతనం చెల్లిస్తోందని తెలిపారు. టార్గెట్లతో జీతంలో కోతలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు డెయిరీలతో గోపాలమిత్రల జీవనోపాధి దెబ్బతింటుందని తెలిపారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనుభవజ్ఞులైన గోపాలమిత్రలను వెటర్నరీ అసిస్టెంట్లుగా నియమించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘ గౌరవాధ్యక్షుడు నాగేశ్వరరావు, గోపాలమిత్రల సంఘ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, కౌలు రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి జమలయ్య, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి క్రాంతి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, గోపాలమిత్రలు పాల్గొన్నారు. -
సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించాలి
అఖిలపక్ష నేతల డిమాండ్ హైదరాబాద్: మూతపడ్డ సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించాలని, 10 నెలల వేతన బకాయిలు ఇప్పిం చాలని, కార్మికులకు శాశ్వత ఉద్యోగభద్రత కల్పిం చాలని పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై వాయిదా తీర్మానమిచ్చి సభను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. సిర్పూరు పేపర్ మిల్లును ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిర్పూరు పేపర్ మిల్లు సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరాపా ర్కు వద్ద కుటంబసభ్యులతో కలసి కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 4 వేల మంది కార్మికులకు ప్రత్యక్షంగా, 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ మిల్లు తెలంగాణ ఏర్పడిన కొద్దిమాసాలకే మూతపడడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. సిర్పూరు పేపర్ మిల్లు యూనియన్ నాయకుడైన కార్మిక, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెంటనే సీఎంతో మాట్లాడి మిల్లును తెరిపించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటే కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభించడమేనా అని ప్రశ్నించారు. మిల్లును తెరిపించడానికి కేంద్ర సహాయం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సీపీఎం నేత వెంకటేష్, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు శ్రావణ్‌కుమార్, శ్రీనివాస్ యాదవ్, సీపీఐ నేత గుండా మల్లేశ్, టీడీపీ నేత రమేష్ రాథోడ్, మాజీమంత్రి బోడ జనార్దన్, ఐఎఫ్టీయూ నాయకులు ఎస్ఎల్ పద్మ, సిర్పూరు పేపరు మిల్లు సంరక్షణ సమితి కన్వీనర్ శ్రీనివాసు పాల్గొన్నారు. -
విధులు నిర్లక్ష్యం చేస్తే ఇంటికే..
అంగన్వాడీలపై చర్యలు వేతనంతో పాటు బాధ్యతలను పెంచిన ప్రభుత్వం జోగిపేట : చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు పునాదులు వేసి, వారు ఆరోగ్యంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యం వహించినా విధులు సక్రమంగా నిర్వహించకపోయినా గతంలో మాదిరిగా ఊరుకునే పరిస్థితిలేదు. సిబ్బంది ప్రవర్తన, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేయడానికి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక విధానాలను అమలు చేయనుంది. కేంద్రాల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు చేపట్టనుంది. సిబ్బంది పనితీరుపైనే కేంద్రాల నిర్వహణ ఆధారపడి ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం పలు నిబంధనలను అమలు చేస్తొంది. జీఓ ఎంఎస్ నంబరు 14 ప్రకారం నిబంధనల్లో ఏ ఒక్కటి పాటించకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్గదర్శకాలు ఇవే.. ఆహర నిల్వల్లో వ్యత్యాసం, మళ్లింపు, దుర్వినియోగం, నిల్వ పత్రాలు సక్రమంగా లేకపోతే సిబ్బందిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తారు. ఆహారం శుభ్రంగా ఉండకపోయినా తప్పుదోవ పట్టించినా ఇంటికే.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కేంద్రాలను నిర్వహించాలి. అనుమతి లేకుండా కేంద్రాలు తెరవకున్నా ఇతర ప్రాంతాలకు వెళ్లినా, సమయపాలన పాటించకపోయినా రెండు సార్లు మెమోలు జారీ చేస్తారు. అయినా తీరు మారకుంటే విధుల నుంచి తొలగిస్తారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల చిన్నారుల హజరు 90 శాతం ఉండకపోతే మూడు మెమోలు జారీ చేస్తారు. అయినా నిబంధనల మేరకు హాజరు శాతం ఉండేలా జాగ్రత్తలు తీసుకోకపోతే విధుల నుంచి తొలగిస్తారు. రిజిష్టర్లు సక్రమంగా వినియోగించకపోయినా, తప్పుడు సమాచారం పొందుపరిచినా మూడు మెమోలు జారీ చేస్తారు. తీరు మారకుంటే చర్యలు తీసుకుంటారు. -అంగన్వాడీ కార్యకర్తలు ముందస్తు అనుమతి లేకుండా 15 రోజుల పాటు సెలవులు తీసుకుంటే వేతనంలో అయిదు శాతం కోత విధిస్తారు. సెక్టారు, ప్రాజెక్టు సమావేశాలకు గైర్హాజరైతే అయిదు శాతం కోత విధిస్తారు. నెలలో 15 రోజులు గృహ సందర్శన చేయకపోతే వేతనంలో 10 శాతం కోత విధిస్తారు. బరువు, పోషక విలువలు తక్కువ ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే వేతనంలో 10 శాతం కోత. ఆహర భద్రత పరిశుభ్రత పాటించకపోతే ఒక మెమో జారీ చేస్తారు. తీరు మారనట్లయితే విధులు నుంచి తొలగిస్తారు. ఆయాలకు.... కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం వహిస్తే రెండు మెమోలు జారీ చేస్తారు. అయినా వినకుంటే వేతనంలో అయిదు శాతం కోత విధిస్తారు. ఆహారపదార్థాలను పరిశుభ్రమైన చోట ఉంచకపోతే వేతనంలో అయిదు శాతం కోత. సమయపాలన ప్రకారం కేంద్రాలను తెరవాలి. అనుమతి లేకుండా 15 రోజులు సెలవు పెడితే విధుల నుంచి తొలగిస్తారు. నిబంధనలను సవరించాలి జీఓ 14లోని నిబంధనలను సవరించాలి. ప్రతిదానికి మెమోలు జారీ చేయడం వల్ల మానసికంగా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. అంగన్వాడీ ఉద్యోగులపై అంక్షలు ఎత్తివేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రాయితీలు కల్పించాలి. - ఇందిర, జోగిపేట ప్రాజెక్టు కార్యకర్తలు, ఆయాల యూనియన్ అధ్యక్షురాలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు విధులను నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంగన్వాడీ సిబ్బంది నడచుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. మండలాల్లో సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించాలి. నిబంధనల ప్రకారం కార్యకర్తలు, ఆయాల వల్ల తప్పులు జరిగితే మెమోలు జారీ చేస్తాం. మెమోలు జారీ చేసినా వారిలో మార్పులేనట్లయితే శాఖపరమైన చర్యలుంటాయి. - ఎల్లయ్య, జోగిపేట ఐసీడీఎస్ సీడీపీఓ -
భద్రత ఉద్యోగ లక్షణం!
సర్కారులో చిన్న కొలువుకూ సై అంటున్న యువత ఉద్యోగ భద్రతకే పట్టభద్రుల పెద్దపీట ప్రైవేటు రంగంలో ఉన్నత ఉద్యోగానికే మొగ్గు ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ల అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్: పీజీలు, పీహెచ్‌డీలు చేసినా చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం వైపే ఎక్కువగా మొగ్గుచూపుతోంది నేటి యువత. సర్కారు కొలువైతే ఉద్యోగ భద్రత ఉంటుందని భావిస్తుండటమే దీనికి కారణం. అందుకే ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాన్ని కాదని ప్రభుత్వ ఉద్యోగాలకే వారు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అది వీలుకాకపోతే ఉన్నత స్థాయి ఉద్యోగమైతేనే ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్మెంట్కు ఎంపికైన తీరు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిపై వర్సిటీ సీనియర్ ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు. వారి రిపోర్టును పరిశీలిస్తే ఉద్యోగ భద్రతనిచ్చే చిన్న ప్రభుత్వ ఉద్యోగానికే యువత ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తేలింది. ఆర్థిక సంక్షోభం దెబ్బకు... 2009 లో సంభవించిన అమెరికా ఆర్థిక సంక్షోభం ప్రైవేటు ఉద్యోగాల పట్ల విద్యార్థుల్లో భయాన్ని సృష్టించినట్లు వీరి అధ్యయనంలో తేలింది. అప్పటి నుంచి ప్రైవేటు ఉద్యోగాలంటే గాలిలో దీపం అని యువత భావిస్తోంది. 2001-08 మధ్య కాలంలో యువత ఎక్కువగా ఐటీ వైపు దృష్టి సారించేది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలను వదిలి మరి సాంకేతిక కోర్సులు నేర్చుకుని ఐటీ రంగంలో అడుగుపెట్టారు. అయితే ఆర్థిక సంక్షోభం దెబ్బతో పరిస్థితి మారింది. 2009 తర్వాత ఉద్యోగాల ఎంపికలో యువత తీరు మారింది. ప్రైవేటు ఉద్యోగం కంటే ప్రభుత్వంలో చిన్న కొలువున్నా సరే చేరి పోవాలనే నిర్ణయానికి వచ్చారు. చిన్న ఉద్యోగాలకూ భారీగా పోటీ.. గ్రూప్-1, గ్రూప్-2 లాంటివే కాకుండా వీఆర్ఓ, వీఆర్ఏ వంటి చిన్న సర్కారు ఉద్యోగాలకు సైతం యువత భారీగా పోటీపడుతోంది. సర్కారు కొలువులకు చదువుకునేవారు అవసరమైన వాతావరణం ఉంటుందనే భావనతో ఎక్కువగా వర్సిటీలో చే రేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో గత ఐదేళ్లలో వర్సిటీలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. కంపెనీల వర్సిటీ బాట.. మరోవైపు గత ఐదేళ్ల నుంచి అనేక కంపెనీలు ఓయూలో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నాయి. గతేడాది వరకు దాదాపు 40 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. కంపెనీల సంఖ్యతో పాటు ఉద్యోగాల కోసం నమోదు చేసుకునే అభ్యర్థుల సంఖ్య, కొలువులు సాధించిన వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. అయితే అత్యధిక శాతం మంది ఐటీ ఉద్యోగాల వైపే వెళుతున్నారు. ప్రైవేటులో చిన్న ఉద్యోగాలైతే ఆఫర్లు కాదనుకొని క్యాంపస్‌లోనే ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. ప్రైవేటు జాబ్ వచ్చినా చేరరు.. కొన్నాళ్లుగా ఓయూలో ఇంజనీరింగ్ తర్వాత ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసిన వారే ఎక్కువగా కార్పొరేట్ ఉద్యోగాల్లో చేరారు. అలా చేరని వారు ప్రైవేటు ఉద్యోగాలను కాదని నెట్, జేఆర్ఎఫ్, గ్రూప్స్ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యారు. ఇక ఆర్ట్స్ కోర్సులు చేసిన వారు ప్రైవేటులో చిన్న ఉద్యోగాలకు ఆఫర్లు వస్తున్నా ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. -
‘ఉపాధి హామీ’ ఇక పంచాయతీలకు!
{V>-Ò$-×ాభివృద్ధి నుంచి తప్పించాలని సర్కారు యోచన ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఉన్నతాధికారుల కసరత్తు 16 వేల మంది ఉద్యోగులకు తప్పని ఉద్వాసన హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) పర్యవేక్షణ బాధ్యతలను ఇకపై పంచాయతీరాజ్ విభాగానికి అప్పగించాలని సర్కారు భావిస్తోంది. కొన్నేళ్లుగా ఉపాధి హామీ పనులను గ్రామీణాభివృద్ధి విభాగం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కూలీలకు ఏడాది పొడవునా కనీసం వందరోజుల పని కల్పించడం ద్వారా గ్రామాల్లో శాశ్వత వనరులు కల్పించడం ఉపాధి హామీ పథకం ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని సక్రమంగా వినియోగించుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో నిలుస్తోంది. తాజాగా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న సుమారు 16 వేల మంది తాత్కాలిక ఉద్యోగులు సమ్మెబాట పట్టిన నేపథ్యంలో పథకం అమలు బాధ్యతలను పంచాయతీరాజ్‌కు బదలాయించాలని ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. దశాబ్దకాలంగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.15 వేలకు పెంచాలంటూ సమ్మె చేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతేకాక, సమ్మె విరమించకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. తాజాగా ఈ పథకాన్ని పంచాయతీరాజ్ విభాగానికి అప్పగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. పంచాయతీలకు అప్పగిస్తే.. ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతలను అప్పగించడం ద్వారా పంచాయతీలకు మరిన్ని అధికారాలు ఇచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామాల్లో అభివృద్ధి పనులను ఎంపిక చేసే బాధ్యతను సర్పంచులకు, వార్డు సభ్యులకు అప్పగిస్తేనే పథకం సక్రమంగా అమలవుతుందని కూడా అధికారులు యోచిస్తున్నారు. ఈ పథకం ద్వారా చేపట్టిన పనులను పర్యవేక్షించేందుకు గ్రామానికి ఒక రోజ్‌గార్ సేవక్‌ను నియమిస్తే సరిపోతుందని ఆలోచిస్తున్నారు. దీని ద్వారా నిర్వహణ వ్యయం కూడా భారీగా తగ్గుతుందని అధికారులు లెక ్కలు వేస్తున్నారు. ప్రస్తుతం అధికారుల స్థాయిలో జరుగుతున్న ఈ కసరత్తు ఈ నెలాఖరులోగా కొలిక్కి వచ్చే అవకాశమున్నట్లు పంచాయతీరాజ్ శాఖలోని కీలక అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఇదే జరిగితే నెలరోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఉద్యోగులకు ఉద్వాసన తప్పదంటున్నారు. -
పదునెక్కిన పోరుబాట
వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కోసం మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రతరమవుతోంది. వీరితోపాటు ఉపాధి కార్మిలకుల సమ్మె కూడా జిల్లావ్యాప్తంగా కొనసాగుతోంది. తమ సమ్మె 26వ రోజు ఉపాధి హామీ కార్మికులు పలుచోట్ల వంటావార్పు చేపట్టారు. -
కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగ భద్రత
ఆదిలాబాద్ రూరల్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్నా ఏ ఒక్కరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని ఆదిలాబాద్ మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాథోడ్ రమేష్ విమర్శించారు. కేవలం వారి కుటుంబానికే ఉద్యోగ భద్రతను కల్పించుకున్నారని దుయ్యబట్టారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ సెంట్రల్ గార్డెన్లో పశ్చిమ జిల్లా మినీ మహానాడు సభ నిర్వహించారు. ముందుగా పార్టీలో కొనసాగి మృతిచెందిన కార్యకర్తలకు రెండు నిమిషాల మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ చౌక్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారని అన్నారు. తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చిన కేసీఆర్ ఆయననే సీఎం అయ్యారని దుయ్యబట్టారు. భూమి లేని దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమిని ఇస్తానని కేవలం నియోజకవర్గానికి ఐదుగురికి అది కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారని విమర్శించారు. యూనివర్సిటీ భూముల్లో ఇల్లు నిర్మిస్తానని ప్రకటించడం సరికాదన్నారు. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ పథకాలు కేవలం దోచుకోవడానికేనని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఎదుట 150 రోజులుగా వికలాంగులు ధర్నా కొనసాగిస్తున్నా.. లోకల్ మంత్రి జోగు రామన్న పరామర్శించలేదని పేర్కొన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జిల్లాలో పర్యటించి ఐదు కుటుంబాలకే ఆర్థిక సాయం అందించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆదిలాబాద్‌ను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్దనే నిర్మించాలని, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్‌కు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. సమావేశంలో జిల్లా ఎన్నికల పరిశీలకుడు, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, పశ్చిమ, తూర్పు జిల్లాల అధ్యక్షులు లోలం శ్యాంసుందర్, బోడ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సోయం బాపూరావ్, సుమన్ రాథోడ్, రాష్ట్ర నాయకుడు యూనుస్ అక్బానీ, నారాయణ్‌రెడ్డి, బాబర్, అబ్దుల్ కలాం, రీతేష్ రాథోడ్, రాజేశ్వర్, ఎడిపెల్లి లింగన్న, నైతం వినోద్, మహిళా కార్యకర్తలు లక్ష్మి, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు. -
చెవులు పిండి ఉద్యోగ భద్రత సాధిస్తాం...
టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయూకర్‌రావు వరంగల్ : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించకుంటే అధికార పార్టీ చెవులు పిండి సాధిస్తామని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరారుు. ఈ సందర్భం గా ఎర్రబెల్లి దయూకర్‌రావు దీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీల ను విస్మరించడంలో సీఎం కేసీఆర్ ఘనుడు అని ఆరోపించారు. మేనిఫెస్టోలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి న కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మా టమార్చడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్.. పూటకో మాట చెబుతున్నాడే తప్పా... హామీల ను అమలు చేయడంపై దృష్టి పెడ్టడంలేదని ధ్వజమెత్తారు. రేషన్ కార్డులపై తీసుకొచ్చి న కొత్త జీవోలో ఇళ్లు, కారు, ట్రాక్టర్ ఉన్న వారికి ఆహార భద్రత కార్డులు ఇవ్వదన్న నిబంధనలు పేర్కొన్నారని, అరుుతే వాటిపై తాను అసెంబ్లీ లో నిలదీయడంతో జీవో రద్దయ్యిందన్నారు. అవుట్ సోర్సింగ్‌తో జీతాలు లేకుండా పూర్తిగా పర్మనెంట్ చేసేంత వరకు ఉద్యమాలు చేయూలని సూచించారు. టీడీపీ అర్బన్ పార్టీ అధ్యక్షు డు అనిశెట్టి మురళీమనోహర్ మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ పేరిట చేపట్టిన మిషన్ కాకతీయ.. కమీషన్ కాకతీ యగా మారిందని ఆరోపించారు. టీఆర్ ఎస్ నేతలు చేస్తున్న హామీ లు ప్రకటనలుగా మిగిలి పోతున్నాయన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల నాయకుడు నవీన్ మాట్లాడుతూ తమకు వేతనాలు సంస్థ ద్వారానే నేరుగా ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ ప్రచార కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమా ర్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు సాంబయ్యనాయక్, సంతోష్‌నాయక్, కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం, వెంకట్, కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
జీతాలు పెంచాలని ఆశా కార్యకర్తల ధర్నా
చిక్కబళ్లాపురం: నెలసరి వేతనాలను పెంచాలం టూ ఆశా, అక్షర దాసోహ కార్యకర్తలు గురువా రం ధర్నా నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాల యం ఎదుట చేపట్టిన ఈ కార్యక్రమానికి సీఐ టీయూ నాయకత్వం వహించింది. ఈ సందర్భంగా అక్షర దాసోహ తాలూకా సంచాలకురా లు మంజుల మాట్లాడుతూ... అక్షర దాసోహ కార్యకర్తలకు నెలకు గౌరవ వేతనంగా రూ. 1800, ఆశా కార్యకర్తలకు రూ. 1700 చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ వేతనంతో జీవనం గడపడం దుర్భరంగా మారిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస వేతనంగా రూ.పది వేలను చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్‌కు వి నతిపత్రం అందజేశారు. అంతకు నగరంలో కా ర్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వెంకటలక్షుమమ్మ, నరసమ్మ, శోభా, భారతి, రాధమ్మ, సీపీఎం సంచాలకుడు ముని కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి: 104 వాహనం సిబ్బంది
రంగంపేట (తూర్పుగోదావరి): ఎన్నో ఏళ్లుగా అంకిత భావంతో పనిచేస్తున్నా ఉద్యోగ భద్రతగాని, వేతనాలు పెంపుగాని లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తున్న 104 వాహనం సిబ్బంది. 2008 ఫిబ్రవరి 10వతేదీన నాటి ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఈ పథకం ప్రారంభమయింది. జిల్లా వ్యాప్తంగా 64 మండలాలలోను 26 వాహనాలున్నాయి. దీనిలో లాబ్ టెక్నీషియన్, పార్మసిస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్ పోస్టులలో 165 మంది సిబ్బంది పని చేస్తున్నారు. నెలకు లాబ్టెక్నీషియన్కు రూ.10,900, డ్రైవర్‌కు రూ.8,000, ఫార్మసిస్టుకు రూ.10,900, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.9,500, వాచ్‌మెన్‌కు రూ.6,700 రూపాయలు ప్రస్తుత వేతనాలు అందిస్తున్నారు. వీరికి ప్రతి నెలా 7నుంచి 10వతేదీలోగా వేతనాలు అందాలి. అయితే ఒకనెల వేతనం మాత్రం బకాయిగా వుంటుంది. లాబ్‌టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కనీసం 23వేల రూపాయలు, డ్రైవర్లకు 9వేల రూపాయలు వేతనం పెంచాలని ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. గిరిజన ప్రాంతాలకు కొత్త వాహనాలు మంజూరు చేయాలని, మైదాన ప్రాంతంలో వున్న 11 వాహనాల సేవలు విస్తృతం చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సిబ్బంది మనవి చేస్తున్నారు. -
ఐటీ సంక్షోభంపై పోరాడాలి: బొజ్జాతారకం
హైదరాబాద్ సిటీ : ప్రస్తుతం ఐటీ రంగం తీవ్ర సంక్షోభానికి గురవుతుందని, ఆ రంగంలో పనిచేసే ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని రిపబ్లికన్ పార్టి ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి బొజ్జా తారకం అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ఐటీ రంగంలో దిగ్గజాలైన ఎన్నో సంస్థల్లో ఏ కారణం చూపకుండా ఇష్టం వచ్చినట్లు ఉద్యోగులను తొలగిస్తున్నారని ఇది కార్మిక వ్యతిరేక విధానమని, ఇది వారి జీవించే హక్కును హరించడమే నని తారకం అన్నారు. భారతదేశంలో ఏ రంగానికీ ఇవ్వని ట్యాక్స్ మినహాయింపు ఐటీ రంగానికి ఇస్తున్నారని, ట్యాక్స్ కట్టే సాధారణ పౌరుని డబ్బులను తీసుకు వెళ్లి ఐటీ రంగాలకు ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నారని దీనిని వ్యతిరేకించాలని కోరారు. ఏఐటీయూసీ రాష్ట్ర అద్యక్షుడు టి. నర్సింహ్మ, సీఐటీయూ జాతీయ కార్యదర్శి సుధా భాస్కర్, ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి సూర్యం, ఫరం ఫర్ ఐటీ ఎంప్లాయిస్ కో - ఆర్డినెటర్ నాజర్ తదితరులు పాల్గొన్నారు. -
జాబు ఇస్తామని ఉన్న వారినే తొలగిస్తారా?
అనంతపురం అగ్రికల్చర్ : ‘బాబు వస్తే జాబు’ అంటూ ఎన్నికల ముందు నిరుద్యోగ వర్గాల్లో లేనిపోని ఆశలు కల్పించిన చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే ఉన్నవారినే తొలగించాలని కుట్ర చేస్తున్నారని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ధ్వజమెత్తారు. ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో సోమవారం స్థానిక ఉద్యానశాఖ కార్యాలయం ఎదుట ఉద్యాన సిబ్బంది, ఏపీఎంఐపీలో పనిచేస్తున్న సిబ్బంది ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అంటూ ఎన్నికల ముందు గ్రామ గ్రామాన గోడరాతలతో పాటు ఉపన్యాసాలతో నిరుద్యోగ వర్గాలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందిల్లో ఆశలు రేకెత్తించారని వారు మండిపడ్డారు. అధికారం చేపట్టగానే అన్నీ మరచిపోవడం దారుణమన్నారు. కొత్తవి అటుంచితే ఉన్నవాటినే తొలగిం చడానికి ప్రయత్నించడం సమంజసం కాదన్నారు. 11 సంవత్సరాలుగా తక్కువ వేతనాలతోనే పనిచేస్తున్నామని, ఏదో ఒక రోజు శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తారనే ఆశతో నెట్టుకొస్తున్నామన్నారు. ఉన్నఫలంగా ఇప్పుడు తొలగించే ప్రయత్నాలు చేస్తే తమ కుటుంబాల గతి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించేదాకా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. -
అయినా సరే... టెండర్లకే మొగ్గు
చిత్తూరు(ఎడ్యుకేషన్): ఉద్యోగ భద్రత కోసం పక్షం రోజులుగా దీక్షలు చేస్తున్న పంచాయతీ కార్మికుల కడుపు కొట్టడానికి రంగం సిద్ధమైం ది. ఇప్పటికే దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల్ని తొలగించిన ప్రభుత్వం ఇప్పుడు పల్లెల్లో పారిశుధ్య పనులు చేస్తున్న వారిని ఇంటికి సాగనంపనుంది. సోమవారం చిత్తూరులోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో నూతన కార్మికుల కోసం టెండర్లను దాఖలు చేయనుండడమే తరువాయి. జిల్లాలోని 42 మండలాల్లో 1192 మంది కాంట్రాక్టు పద్ధతిన పారిశుధ్య పనులు చేస్తున్నా రు. ఇప్పటి వరకు వీళ్లంతా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో పనులను రెన్యూవల్ చేసుకుని ఏళ్ల తరబడిగా పనిచేస్తున్నారు. అయితే కలెక్టర్ సిద్దార్థజైన్ కల్పించుకుంటూ ఈ పద్ధతి సరికాదని, కార్మికులంతా కాంట్రాక్టర్ కింద పనిచేయాలని కొత్తగా టెండర్లు పిలవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. కలెక్టర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 15 నుంచి జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగాలకు వెళ్లకుండా సమ్మె బాట పట్టారు. అయితే ఇంతలోపు అధికారులు కొత్త టెండర్ల కోసం ఏర్పాట్లు చకచకా చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు వేయడానికి చివరి గడువుగా అధికారులు నిర్ణయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తవుతుండటంతో తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోతుండటంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్టర్ చేతికి తమను అప్పగిస్తే అతనికి నచ్చకపోతే ఉద్యోగాల్లోంచి తీసేస్తాడని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు పనిచేస్తున్న వాళ్లను సైతం తొలగించడం ఎంత వరకు సమంజసమని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకే టెండర్ల ప్రక్రియను నిరసిస్తూ కార్మిక సంఘ నాయకులు కోర్టును ఆశ్రయించారు. అయితే టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చేయడంతో టెండర్ల ప్రక్రియ జరిగినా తుదిగా తమ అనుమతి లేనిదే కాంట్రాక్టర్‌కు వర్క్ ఆర్డర్ ఇవ్వకూడదని న్యాయస్థానం షరతు పెట్టింది. సంక్రాతి సెలవుల తరువాత న్యాయస్థానం ఇచ్చే తదుపరి ఉత్తర్వుల వరకు టెండర్లను ఓపెన్ చేయకుండా అలాగే ఉంచుతాం. -ప్రభాకరరావు, జిల్లా పంచాయతీ అధికారి -
నేనున్నా..
అశ్వారావుపేట నియోజకవర్గం కుక్కునూరు మండలం తొండిపాక పంచాయతీ బంజరగూడెం భవిత అంధకారంగా మారింది. పోలవరం ముంపులో లేనప్పటికీ ఈ గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. అంతే ఇక్కడి పరిహారం, పునరావాసం అంతా అయోమయంగా మారింది..స్కాలర్షిప్, ఉన్నత విద్య అందని ద్రాక్షే అయ్యాయి. కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగ భద్రత గాలిలో దీపంలా దర్శనమిస్తోంది.. ఆరుగాలం కష్టం, అప్పుచేసి సాగు చేసిన పంట అంతా ఊడ్చిపెట్టుకుపోగా.. రుణమాఫీ వర్తించకపోతుందా..? అనే నమ్మకం వమ్మైయింది. అప్పుచేసి కట్టుకున్న ఇంటికి బిల్లురాలేదు..కొత్త ఇల్లు కట్టిస్తామని ఉన్న ఇల్లు పీకించిన అధికారులు పత్తా లేకుండా పోయారు. రేషన్‌కార్డుతో పాటు బియ్యమూ పోయాయి. వైకల్యం ఉన్నా పింఛన్ రావట్లేదు..తాటాకుల గుడిసెలో ఉంటున్నా ఇల్లు మంజూరుకావట్లేదు.. అటువంటి ఈ గ్రామాన్ని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆదివారం సాయంత్రం సందర్శించారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా గ్రామస్తులను పలుకరించారు. ‘మీ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం’ అని భరోసా ఇచ్చారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన మీ కోసం.. నాతోటి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలైనా ఇస్తా. మీకు సేవ చేస్తానని, అభివృద్ధిపథంలో తీసుకెళ్తానని నమ్మి ఓట్లేశారు. ముంపు సాకుతో మిమ్మల్ని ఆంధ్రలో కలిపారు. ఆంధ్ర అసెంబ్లీలో అవకాశం కల్పిస్తే తప్పక మీకు న్యాయం చేస్తా. - తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు: ఓ సర్పంచ్ అక్కా..ఎట్టాగుంది మనూరు? సమస్యలేమైనా ఉన్నాయా? పర్సిక సీతమ్మ (సర్పంచ్): ఊళ్లో నీళ్లు లేవు. మంచినీరు, విద్యుత్ సమస్యలున్నాయి. అభివృద్ధి చేద్దామన్నా నిధులు రావట్లేదు. మీరు తెలంగాణ ఎమ్మెల్యే అయిపోయారు..మమ్మల్ని ఆంధ్రలో కలిపిండ్రు. ఇప్పుడేంది పరిస్థితి. తాటి: పెద్దాయనా బాగున్నారా? ఏమి సమస్యలున్నాయి..? నరుకుళ్ల కొర్రయ్య: రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ రజాకార్ల నాటి పరిస్థితి వచ్చింది. ఏ సమస్య ఎవరికి చెప్పుకోవాలో..ఎవర్ని అడగాలో తెలవట్లేదు. ఎవరూ పట్టించుకోవట్లేదు. తాటి: పెద్దమ్మ ఇదేనా నీ ఇల్లు.. దీంట్లో ఎట్లుంటున్నవ్? హసీనా బేగం: నాకున్న ఆస్తి ఈ ఇల్లేనయ్యా. ఇల్లు కాలిపోయిన తర్వాత నాలుగు కర్రలు అడ్డంపెట్టుకొని బతుకుతున్నా. నా గురించి పట్టించుకునేటోళ్లు లేరయ్యా. ఆంధ్ర అధికారులు ఒక్కళ్లు కూడా రాలేదు..మా గతేమవుతుందో నాయనా.. తాటి: అక్కా చెప్పు నీ సమస్య ఏమిటి..? ఎలాగున్నారు..? కీసర బుల్లెమ్మ: అయ్యా ఇల్లు క ట్టుకున్నాక బిల్లు ఇస్తమన్నరు. దొరికిన చోటల్లా అప్పుజేసి మధ్యవర్తులకిచ్చి ఇల్లు కట్టుకున్న. తీరా బిల్లు ఇయ్యట్లేదు. మా ఇళ్ల బిల్లులు తెలంగాణ అధికారులిస్తరో..ఆంధ్ర అధికారులిస్తరో తెలవట్లే. అప్పులిచ్చినోళ్లు ఒకటే అడుగుతున్నరు. తాటి: బాబూ నీకు పింఛన్ ఇస్తున్నారా? ఎండీ సాదిక్‌అలీ: నాకు పింఛన్ ఎవరిచ్చారు సారు. అన్ని సర్టిఫికెట్లూ ఉన్నాయి. పింఛన్ మాత్రం రావట్లేదు. తాటి: రైతులుగా మీ సమస్యలేంటో చెప్పండి? యడవల్లి సతీష్ : సార్, నా వ్యవసాయ ఖాతా సారపాక బ్యాంకులో ఉంది. నా పొలం కుక్కునూరు మండలంలో ఉంది. నాపొలం, ఇల్లూ అన్నీ ఆంధ్రప్రదేశ్‌లో కలిపేశారు. బ్యాంకు ఖాతా తెలంగాణలో ఉంది. బ్యాంకుకు వెళ్లి రుణమాఫీ వచ్చిందా అని అడిగితే.. వచ్చిందీ, రానిదీ చెప్పకుండా ‘మీ తహశీల్దార్‌కు జాబితా పంపించాం చూసుకోండంటున్నారు.’ ఇక్కడికొస్తే తెలంగాణ బ్యాంకులతో మాకు సంబంధం లేదంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు సారు. తాటి: ఏం తాతా నీ సమస్యేమిటి.. ఆరోగ్యం బాగుంటుందా..? సడియం వెంకయ్య: పింఛన్ రావట్లేదు. చాలాసార్లు దరఖాస్తు చేశాను. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అన్ని చాలా సార్లు ఇచ్చాను. అయినా పింఛన్ ఇయ్యట్లే. తాటి: ఏమ్మా.. పిల్లను తీసుకొచ్చావు.. ఏంటి సమస్య? వేదమ్మ: అయ్యా ఈ బిడ్డ నామనుమరాలు. పేరు భద్రమ్మ.. మాటలురావు. తన పనులు తను చేసుకోలేదు. అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి. ఈ పిల్లకు పింఛన్ రావట్లేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇయ్యట్లేదు. మీరే ఇప్పించాలయ్యా. తాటి: ఏం తల్లీ నీ సమస్యేంటి? వంకా సూరమ్మ: నాకు బియ్యం కార్డు ఇచ్చి 9 నెలలయింది. కానీ ఒక్క నెలయినా బియ్యం ఇయ్యలేదు. ఆధార్ కార్డు ఇవ్వమంటే ఇచ్చాను. అయినా బియ్యం రాట్లేదు. తాటి: ఓ అవ్వా.. నువ్వు కూడా ఇంతమందిలో నిల్చున్నావ్..నీకేమి సమస్య? నాగమ్మ : నాకు రెండు కళ్లు కానరావయ్యా.. నాభర్త చనిపోయి 11 ఏళ్లయింది. నాకు పింఛన్ ఇచ్చినోళ్లు లేరు. ఏమేమో కాయితాలు కావలంటున్నరు. నాకు పింఛన్ ఇస్తరో..ఇవ్వరో..ఎట్ల బతికేదయ్యా. తాటి: సుశీల..నీ సమస్యేమిటో చెప్పమ్మ? వంకా సుశీల: మరుగుదొడ్లు లేని ఇళ్లు సర్వే చేసుకున్నోళ్లు మళ్లీ ఇంటింటికీ వచ్చిండ్రు. మరుగుదొడ్డి కట్టుకున్నాక బిల్లు ఇస్తమన్నరు. తీరా అప్పులు చేసుకుని కట్టుకున్నాక అధికారులు మొహం చాటేసిండ్రు. అప్పులిచ్చినోళ్లు కట్టమంటుండ్రు. తాటి: బాబు చదువుకున్నవాడిలా ఉన్నావ్? నీ ప్రాబ్లమేంటి? వెలకం బాలకృష్ణ: సారూ నేను డిగ్రీ చేశా. ముల్కలపల్లి మండలంలో ఫారెస్టు బేస్‌క్యాంపు లో పనిచేస్తున్నా. మా ఊరు ఆంధ్రలో పోయిం ది. నేను ఉద్యోగం చేసే ప్రాంతం తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తే నేను అర్హున్నా.. కాదా? తెలియడం లేదు. తాటి: తమ్ముడూ నువ్వు చెప్పు సమస్యేంటి? మెద్దినేని శ్రీనివాసులు: సార్ నేను భద్రాచలంలో చదువుతున్నాను. మా ఊరు ఆంధ్రలో ఉంది.. కాలేజీ తెలంగాణలో ఉంది. మా కాలేజీలో చదువుకునే ముంపు మండలాల విద్యార్థులందరికీ ఒకటే సమస్య. తెలంగాణలో చదివే ముంపు మండలాల విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ వస్తుందా? రాదా?. తాటి: ఏమ్మా వార్డు మెంబర్..నీకేంటి ప్రాబ్లమ్? మడకం చిట్టెమ్మ: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. కానీ ఏ ప్రభుత్వం చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన మాటలు మాకు వర్తిస్తయో... లేదో తెలవట్లేదు. తాటి: నీ సమస్యేమిటమ్మా? వంకా లక్ష్మి: మరుగుదొడ్లు కట్టకపోతే రేషన్‌బియ్యం ఆపుతమన్నరు. భయంతో కట్టినం. ఇప్పుడు బిల్లులురాలేదు. అప్పులపాలైనం. -
‘ఆందోళన’లో సెర్ప్ ఉద్యోగులు
16న విజయవాడలో సదస్సు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సీఈవోకి వినతిపత్రం సాక్షి, హైదరాబాద్: డ్వాక్రా మహిళల్లో చైతన్యం నింపడానికి దోహదపడిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ సంస్థ నిర్వహణకు నిధులివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేయడంతో వారి ఉద్యోగ భద్రత ప్రశ్నార్ధకమైంది. దీంతో వారు ఆందోళన బాట పడుతున్నారు. ప్రభుత్వం నిధులిచ్చి తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలంటూ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 16న విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నారు. సంస్థలో ఉన్న 3,413 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ గుర్తింపు పొందిన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు శుక్రవారం సెర్ప్ సీఈవో హెచ్. అరుణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం తదితరులు సీఈవోని కలిశారు. తమకు ఉద్యోగ భధ్రత కల్పించే విషయంలో చొరవ చూపాలని సీఈవోకు విజ్ఞప్తి చేశారు. కాగా, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని అధ్యక్షత జరిగిన సెర్ప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కూడా నిర్వహణ నిధుల నిలిపివేతపై చర్చ జరిగింది. ఆర్థిక సంవత్సరం సగం ముగిసినా, సంస్థ నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడం, ప్రభుత్వ అభ్యంతరాలను సీఈవో, అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నిధుల విడుదలపై సీఎంతో మాట్లాడతానని మంత్రి హామీ ఇచ్చినట్టు సమాచారం. సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రిని సెర్ప్ ఉద్యోగులు గౌరి, బాలాజీ, రమ, సునీత, రాజా ప్రతాప్ తదితరులు కలిశారు. ప్రపంచ బ్యాంకు సాయంపై ప్రతిపాదనలు ఏపీ రూరల్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ ప్రాజెక్టు పేరుతో ప్రపంచ బ్యాంకు మూడో దశలో సెర్ప్‌కు చేసే ఆర్థిక సహాయానికి సంబంధించిన ప్రతిపాదనలకు సెర్ప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది. కాగా, తుపాను బాధితుల కోసం సెర్ప్ ఉద్యోగులు ఒక రోజు వేతనం విరాళంగా ఇచ్చారు. -
ఉద్యోగ భద్రత లేదని కండక్టర్ ఆత్మహత్య
మహ్మదాపురం(దుగ్గొండి) : కుటుంబ పోషణ భారం కావడంతోపాటు చేస్తున్న ఉద్యో గానికి భద్రత లేదని మనోవేదనకు గురైన ఓ కండక్టర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని మహ్మదాపురం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన చింత రమేష్(33)కు మూడేళ్ల క్రితం ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో కండక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. మొదట నర్సంపేట డిపోలో పనిచేశాడు. ఇటీవల జనగామ డిపోకు బదిలీ అయ్యాడు. ఉద్యోగం తప్ప మరేలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో వచ్చిన జీతం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. దీంతో తరచూ ఇంట్లో మనోవేదనకు గురవుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన భార్య హారికను ఆమె పుట్టినూరైన ద్వారకపేటలో దింపి వచ్చాడు. నాలుగు రోజులపాటు తాను జనగామలోనే ఉంటానని ఆమెకు చెప్పి తిరిగి మహ్మదాపురం చేరుకున్నాడు. రాత్రి తన ఇంట్లోనే క్లచ్‌వైర్‌తో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన ఇరుగుపొరుగు వారు అతడిని కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి చొక్కా జేబులో మాత్రం ‘నా చావుకు ఎవరూ కారణం కాదని’ అని రాసి ఉన్న చిన్నకాగితం లభించదని పోలీసులు తెలిపారు. మృతుడి భార్య హారిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముజాహిద్ తెలిపారు. మృతుడికి రెండేళ్ల కుమారుడు. ఏడు నెలల పాప ఉన్నారు. చిన్నారులిద్దరిని చూసిన గ్రామస్తులు కంటతడిపెట్టారు. మృతుడి భార్య, బంధువులు చేసిన రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. -
ఆనిమేటర్లపై పోలీసు జులుం
రాప్తాడు : ఉద్యోగ భద్రత కల్పించాలంటూ 44వ జాతీయ రహదారిపై రాప్తాడు వద్ద ఆనిమేటర్లు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రాస్తారోకో కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. వారిని అరెస్టు చేసి, అనంతరం పూచీకత్తుపై విడిచిపెట్టారు. సీఐటీయూ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో బుధవారం రాప్తాడులో జాతీయ రహదారిపై జిల్లాలోని 63 మండలాల యానిమేటర్లు రాస్తారోకో నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు అనంతపురం-బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆనిమేటర్లకుఎమ్మెల్సీ గేయానంద్, ఎన్జీఓ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి మద్దతు పలికారు. ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో మహిళల ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్న ఆనిమేటర్లపై ప్రభుత్వంనిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పేదరిక నిర్మూలనలో ఆనిమేటర్ల పాత్ర కీలకమైందన్నారు. గత 15 నెలలుగా వారితో వెట్టిచాకిరీ చేయిస్తూ.. కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సంబంధం లేని పనులు చేస్తున్న ఆనిమేటర్లను కట్టుబానిసలుగా చూడడం సరికాదన్నారు. వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు కనీస వేతనంగా రూ.5 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతన బకాయిల చెల్లింపుతో పాటు ఉద్యోగ భద్రత, బీమా కల్పించాలని కోరారు. అన్నీ మోసపూరిత హామీలే ఎన్నికల్లో గెలిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసపూరిత వాగ్దానాలు చేశారని వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. హమీలను నెరవేర్చకుండా.. విజయవాడను రాజధానిగా చేసేందుకే నాలుగు నెలలు వెళ్లదీశారని విమర్శించారు. ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హమీలిచ్చి మోసగించారన్నారు. రుణమాఫీ చేస్తానని చెప్పి, ఇప్పుడు కంటితుడుపుగా దీపావళి కానుకంటూ 20 శాతం రుణాలు మాఫీ చేస్తానని చెప్పడం చంద్రబాబు నయవంచనకు నిదర్శనమన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని టీడీపీ నాయకులు తప్పుడు మాటలు చెప్పి, అధికారంలోకి రాగానే యానిమేటర్లను తొలగించడం దారుణమన్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో ఎసై విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సీఐటీయూ నాయకులు, ఆనిమేటర్లను అరెస్టు చేసి, పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఇంతియాజ్, గోపాల్, నాగరాజు, ఐకేపీ ఆనిమేటర్ల జిల్లా నాయకులు వెంకటేష్, నాగరాజు, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. -
వాటర్ వర్క్స్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
కూడేరు : పీఏబీఆర్ డ్యాంలో ఏర్పాటు చేసిన నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, వారి కుటుంబాలను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓబులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొన్ని నెలలుగా వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటుండటాన్ని నిరసిస్తూ కార్మికులు మంగళవారం కూడేరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చొన్న కార్మికులు నాగరాజు, రామాంజనేయులు, కొండారెడ్డి, శ్రీరాములు, రవి, రమేష్, గంగాధర్‌లకు మద్దతుగా ఓబులు పాల్గొని మాట్లాడారు. ప్రాజెక్ట్ పరిధిలో ఫేజ్-1, 2, 3లో వందలాది మంది వర్కర్లు పని చేస్తున్నారని, వీరికి నెలకు రూ.7 వేల చొప్పున ఇస్తున్న జీతాన్ని గత ఐదు నెలలుగా చెల్లించడం లేదని అన్నారు. అలాగే ఫేజ్-4 లోను వందల మంది పని చేస్తున్నారని, వీరికి నెలకు రూ. 3 వేలు మాత్రమే జీతం ఇస్తున్నారన్నారు. దానిని కూడా గత ఐదు నెలలుగా ఇవ్వడం లేదన్నారు. ఫలితంగా కార్మికుల కుటుంబాలు పూట గడవని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని ఓబులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం ఉద్యమాలు చేస్తే, అధికారులు రెణ్ణేళ్ల వేతనం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. కార్మిక చట్టం ప్రకారం కనీస వేతనాలు పెంచాలని, ఏప్రిల్ నుంచి పెంచిన వాటిని తక్షణం చెల్లించాలని, అలాగే కార్మికులపై రాజకీయ వే ధింపులు ఆపాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు మద్దతుగా వైఎస్సార్సీపీ వైస్‌ఎంపీపీ రాజశేఖర్, దేవేంద్ర, వెంకటరామిరెడ్డి, ఆంజనేయులు, దండోరా రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాను ప్రకాష్, సీపీఎం నాయకులు నాగేష్, రాధాకృష్ణ, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల పోరుబాట
కామారెడ్డి: మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా క్షేత్రస్థాయిలో ఎన్నో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు మరోమారు పో రుబాట పట్టారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీ కార ్యకర్తలకు తగిన న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలుపుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 2,708 అంగన్వాడీ కేంద్రాలుండగా వాటిలో దాదాపు ఐదు వేల మంది కార్యకర్తలు, ఆయా లు పని చేస్తున్నారు. ఎన్నో యేళ్లుగా నామమాత్రపు వేతనాలతో పనిచేస్తున్న అంగన్వాడీలు గత తెలంగాణ రాష్ట్రం ఫిబ్రవరి నెలలో సమ్మెకు దిగారు. ఎన్నో రకాల ఉద్యమాలు నిర్వహించారు. అప్పుడే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం తో అంగన్వాడీలు సమ్మెను విరమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఎన్నికల ప్రక్రి య పూర్తయి ప్రభుత్వం నెలరోజుల పాలన కూడా పూర్తవడంతో అంగన్వాడీలు తిరిగి ఆందోళనబాట పట్టారు. ఇటీవల ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఆందోళన చేసినవారు, సో మవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారు. ఈ నెల పదిన అం గన్వాడీలతో చర్చిస్తామని జిల్లా అధికారులు పేర్కొన్నప్పటికీ, చాలా సమస్యలు రాష్ట్రస్థాయిలో పరిష్కారం కావలసి ఉన్నాయని కార్యకర్తలు అంటున్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు రెండు మూడు గంటలు పనిచేసి రోజుకు రూ. వందకు తగ్గకుండా సంపాదిస్తుంటే, రోజంతా పనిచే సే తమకు కనీస వేతనాలు దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన డిమాండ్లు కార్యకర్తలకు కనీసం నెలకు రూ. 15,000, ఆయాలకు రూ. 10,000 వేతనం ఇవ్వాలి. ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ విరమణ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులలాగే అన్ని ప్రయోజనాలు అమలు చేయాలి. పింఛన్ ఇవ్వాలి. సెక్టార్, ప్రాజెక్టు పరిధిలో హాజ రయ్యే సమావేశాలు, ఇతర సమావేశాలకు హాజరైతే టీఏ, డీఏలు చెల్లించాలి. చాలా అంగన్వాడీ కేంద్రాలు అద్దె ఇళ్లల్లోనే నడుస్తున్నాయి. పెరుగుతున్న ధరలక నుగుణంగా అద్దెలు పెంచాలి. లేదా సొంత భవనాలు నిర్మించి ఇవ్వాలి. అమృతహస్తం బిల్లులు ఖాతాలలో జమ చేయాలి. -
మరో ఏడాది ‘కాంట్రాక్టే’
ఉద్యోగుల క్రమబద్ధీకరణకు బ్రేక్ కలెక్టరేట్ : జూన్ 30 వరకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సిం గ్ సేవలను వినియోగించి కొనసాగింపుపై నిర్ణ యం తీసుకుంటామని గత ఉమ్మడి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆ మేరకు జీవో నంబర్ 84 జారీచేసింది. గడువు సమీపించినా ప్రస్తుత సర్కార్ స్పష్టతనివ్వలేదు. రెండు రోజు లుగా అధికార పార్టీ మంత్రులు బహిరంగంగా గడువు పొడిగింపుపై పలు రకాలుగా ప్రకటిస్తుండడం.. తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని అధికారికంగా ఉత్తర్వులు వెలువరించకపోవడంతో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను సందిగ్ధంలో పడేసింది. దీంతో ఉద్యోగ భద్రత కోసం సోమవారం అన్ని జిల్లాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో యూనియన్ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, ఆర్థికశాఖ మంత్రి సమక్షంలో హైదరాబాద్‌లో చర్చలు సాగించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. జీవో వచ్చేంత వరకు చర్చల్లో తీసుకున్న నిర్ణయం మౌఖిక ఆదేశాలతో అమలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. క్రమబద్ధీకరణకు బ్రేక్ ఎన్నికలు ముందు, తర్వాత కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ప్రభుత్వ శాఖల్లో అన్ని క్యాడర్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలా? లేక మూడో, నాలుగో తరగతి ఉద్యోగులకే అవకాశం కల్పించాలా? దశలవారీగా క్రమబద్ధీకరించా లా? ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిం చాలా.. కొనసాగించాలా..? అనే అంశాలపై ఇంకా అధ్యయనం జరుగుతోంది. వీటన్నింటిపై సమగ్ర అధ్యయనం కోసమే మరో ఏడాది పాటు సేవలను పొడిగించినట్లు తెలుస్తోంది. జిల్లాలో 12,670 కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండగా, ఔట్సోర్సింగ్ సేవల ఏజెన్సీల ద్వారా నియమితులైన ఆరు వేలకు పైగా సిబ్బందిలో ఆందోళన నెలకొంది. హౌసింగ్, రెవెన్యూ, బీసీ, సాంఘిక సంక్షేమం, ఎస్సీ, బీసీ కార్పొరేషన్, విద్యాశాఖ, పుర, నగర పాలక సంస్థ, డీఆర్డీఏల్లో వందలాది మంది ఏజెన్సీల ద్వారా నియమితులై పదేళ్లుగా పనిచేస్తున్నారు. మరికొన్ని ప్రభుత్వ శాఖల్లో ఆయా శాఖలే నేరుగా పరీక్షలు నిర్వహించుకుని రోస్టర్ కం మెరిట్ పద్ధతిన అవసరమైన సిబ్బందిని నియమించుకున్నాయి. ఔట్సోర్సింగ్ సిబ్బంది ని పర్మినెంట్ చేయడానికి సాంకేతిక సమస్యలుంటాయని చెబుతుండడం వారిని ఆందోళన కలిగిస్తోంది. -
ఎన్నాళ్లీ వెట్టిచాకిరీ..!
గుడిహత్నూర్, న్యూస్‌లైన్ : మహిళల సర్వతోముఖాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్న ఇందిరాకాంత్రి పథం ఉద్యోగులకు ఏళ్లు గడిచినా వెట్టిచాకిరీ మాత్రం తప్పడం లేదు. కనీస వేతన చట్టం వీరికి అమలు చేయకపోవడంతో చాలీచాలని జీతంతో కుటుంబాల్ని పోషించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. పథకం రూపురేఖలు మారినా... 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక వెలుగు పథకం రూపురేఖలు మారిపోయాయి. వెలుగు పథకం కాస్త ఇందిరాక్రాంతి పథంగా మారిపోయింది. పథకంలో గతంలో పనిచేసిన ఎగువ స్థాయి సిబ్బంది అయిన డీపీఎం, ఏపీఎం, మండల సమన్వయ కర్తలకు హెచ్ఆర్ పాలసీ వర్తింపజేశారు. కానీ దిగువ స్థాయి సిబ్బంది అయిన కమ్యూనిటీ యాక్టివిస్ట్‌లు, అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, గుమాస్తాలు నేటికి హెచ్ఆర్ పాలసీకి నోచుకోలేదు. మండల సమాఖ్య ఆధీనంలో పనిచేస్తున్న వీరికి అరకొర జీతభత్యాలు ఇస్తూ పని చేయించుకుంటున్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నందున రేపోమాపో ఉద్యోగ భద్రత కల్పిస్తారేమో అని ఆశతో ఉద్యోగులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి విధులు నిర్వహిస్తున్నారు. పని భారం గ్రామ స్థాయిలో మహిళల వారం మీటింగుల సమాచారాన్ని సేకరించి ఒక్కో స్వయం సహాయక సంఘాల లెక్కల వివరాలు, సభ్యుల వివరాలు, ఆమ్ ఆద్మీ బీమా, అభయహస్తం తదితర పథకాల లబ్ధిదారుల వివరాలు కంప్యూటర్లో పొందు పరుస్తూ అధికారులు కోరిన విధంగా వారికి రిపోర్టులు ఇవ్వడంతో పాటు వివిధ శాఖల ప్రభుత్వ కార్యక్రమాల విధులు నిర్వహిస్తున్నారు. దీపం పథకం, స్త్రీనిధి, అమృతహస్తం, పావలా వడ్డీ, అభయహస్తం, ఆమ్ ఆద్మీ బీమా యోజన, ఇందిరమ్మ పచ్చతోరణం తదితర ప్రభుత్వ ముఖ్య పథకాలను పేదల దరికి చేర్చడానికి వీరు నిరంతర కృషి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా.. జిల్లాలో మొత్తం 647 మంది తాత్కాలిక ఉద్యోగులు మండల సమాఖ్యల పరిధిలో వారి సేవలందిస్తున్నారు. వీరిలో 567 మంది కమ్యూనిటీ యాక్టివిస్ట్‌లు వివిధ రకాల పని చేస్తుండగా వీరికి రూ.1200 నుంచి 2వేల వరకు జీతం అందిస్తున్నారు. కాగా మండల సమాఖ్య అకౌంటెంట్లు 18 మందికి రూ.3,500, 21 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.2,500 నుంచి రూ.4 వేల వరకు చెల్లిస్తున్నారు. అటెండర్లు 18 మందికి రూ.2,500 చెల్లిస్తున్నారు. 12 మంది బ్యాంకు మిత్ర, నలుగురు బీమా మిత్రలకు బ్యాంకు లింకేజీ, క్లెయిముల ఆధారంగా వేతనం చెల్లిస్తున్నారు. క్లస్టరు యాక్టివిస్టులుగా, జాబ్ రిసోర్స్‌పర్సన్‌గా, డిజెబిలిటీ వర్కర్లుగా, మాస్టర్ బుక్ కీపర్లుగా ఏడుగురు పనిచేస్తుండగా వీరికి కొంత ముట్టజెప్పి పనులు చేయించుకుంటున్నారు. వారికిచ్చే ఆ కొంత కూడా నెలకు అందకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఉద్యోగ భద్రత కల్పిస్తారా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
సీఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సీఆర్టీ)లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉపాధ్యాయులు కోరారు. స్థానిక ఎన్జీ కాలేజీ ఆవరణలో సోమవా రం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఆర్టీలు పాల్గొని సమస్యల పరిష్కారానికి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు మారుమూల మండలాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో గత ఆగస్టు నుంచి పనిచేస్తున్న సీఆర్టీలకు సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. స్కూల్ అసిస్టెంట్లకు *5500, ఎస్జీటీలకు *4500 వేతనాన్ని మూడు నాలుగు నెలలకో మారు ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ఆశ్రమ పాఠశాలల సీఆర్టీలు పాల్గొన్నారు -
యువ..హో
ఎన్నికల వేళ ఎన్నెన్నో సిత్రాలు కనిపిస్తుంటాయి. రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఫీట్లు చేస్తూ నానా తిప్పలు పడుతుంటారు. వృద్ధులనైతే మంచంతో సహా ఎత్తుకొని పోలింగ్ బూత్లవరకు తీసుకెళ్లి.. తమకిష్టం వచ్చినట్లు ఓట్లు వేయించుకుంటుంటారు. పేదలను కూడా రకరకాల ప్రలోభాలకు గురిచేస్తారు. మాటల మంత్రం వేస్తారు. మేజిక్కులతో జిమ్మిక్కులు వేస్తారు. అయితే ఈ దఫా నేతల పప్పులుడికేలా కనిపించడంలేదు. ఎందుకంటే ఓటర్ల జాబితాలో యువశక్తి ఉరకలేస్తోంది. 20 నుంచి 40 ఏళ్లలోపు ఉన్నవారే సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చాటనున్నారు. తుది జాబితా చూసిన నాయకులు వారి నుంచి ఎలా ఓట్లు రాబట్టాలో ఎత్తులు వేస్తున్నారు. కానీ వారంతా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరైతే తమ భవితకు భరోసా కల్పిస్తారో.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగిస్తారో.. ఉద్యోగభద్రత కల్పిస్తారో వారికే తమ మద్దతని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. జిల్లాలో 24,84,109 మంది ఓటర్లుండగా 20 నుంచి 40 సంవత్సరాల్లోపు ఉన్నవారు 12, 85,438 మందిగా నమోదయ్యారు. అంటే జిల్లాలోని మొత్తం ఓటర్లలో సగం మంది యువకులే గెలుపోటములు నిర్దేశించనున్నారన్నమాట. - న్యూస్‌లైన్, ఒంగోలు కలెక్టరేట్