సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించాలి
అఖిలపక్ష నేతల డిమాండ్
హైదరాబాద్: మూతపడ్డ సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించాలని, 10 నెలల వేతన బకాయిలు ఇప్పిం చాలని, కార్మికులకు శాశ్వత ఉద్యోగభద్రత కల్పిం చాలని పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై వాయిదా తీర్మానమిచ్చి సభను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. సిర్పూరు పేపర్ మిల్లును ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిర్పూరు పేపర్ మిల్లు సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరాపా ర్కు వద్ద కుటంబసభ్యులతో కలసి కార్మికులు ధర్నా చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 4 వేల మంది కార్మికులకు ప్రత్యక్షంగా, 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఈ మిల్లు తెలంగాణ ఏర్పడిన కొద్దిమాసాలకే మూతపడడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. సిర్పూరు పేపర్ మిల్లు యూనియన్ నాయకుడైన కార్మిక, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెంటనే సీఎంతో మాట్లాడి మిల్లును తెరిపించాలని కోరారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటే కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభించడమేనా అని ప్రశ్నించారు. మిల్లును తెరిపించడానికి కేంద్ర సహాయం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సీపీఎం నేత వెంకటేష్, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు శ్రావణ్‌కుమార్, శ్రీనివాస్ యాదవ్, సీపీఐ నేత గుండా మల్లేశ్, టీడీపీ నేత రమేష్ రాథోడ్, మాజీమంత్రి బోడ జనార్దన్, ఐఎఫ్‌టీయూ నాయకులు ఎస్‌ఎల్ పద్మ, సిర్పూరు పేపరు మిల్లు సంరక్షణ సమితి కన్వీనర్ శ్రీనివాసు పాల్గొన్నారు.