67 శాతం స్టార్టప్స్ ఉద్యోగుల మనోగతం
ఉద్యోగ భద్రత, ఆర్థిక స్థిరత్వం కారణం
సీఐఈఎల్ హెచ్‌ఆర్ సర్వేలో వెల్లడి
చెన్నై: అంకుర సంస్థల్లో పని చేసే వారిలో చాలా మంది పెద్ద కంపెనీలకు మారితే బాగుంటుందని భావిస్తున్నారు. ఉద్యోగ భద్రత, మెరుగైన జీతం, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు వారికి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. మానవ వనరుల సేవల సంస్థ సీఐఈఎల్ హెచ్‌ఆర్ సరీ్వసెస్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న స్టార్టప్స్ ఉద్యోగుల్లో 67 శాతం మంది ఈ మేరకు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సర్వే నివేదిక ప్రకారం స్టార్టప్ రంగంలో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) అత్యధికంగా ఉంటోంది.
ఉద్యోగి పనిచేసే సగటు వ్యవధి 2–3 ఏళ్లు మాత్రమే ఉంటోంది. స్టార్టప్ రంగంలో పనిచేసే వారిలో అత్యధిక శాతం మంది ఉద్యోగ భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే ఇప్పటికే నిలదొక్కుకున్న కంపెనీల వైపు చూస్తున్నారు. ఇక 30 శాతం మంది మెరుగైన జీతభత్యాలు ఇందుకు కారణంగా తెలిపారు. 25 శాతం మంది స్టార్టప్‌లలో ఉద్యోగం–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం ఉండటం లేదని అందుకే పేరొందిన సంస్థల్లోకి మారాలని భావిస్తున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా సుమారు 70 స్టార్టప్‌లకు చెందిన 1,30,896 మంది ఉద్యోగులపై ఈ సర్వే నిర్వహించారు.
హైరింగ్ ప్రణాళికల్లో అంకురాలు..
‘కొత్త ఆవిష్కరణలు, ఉపాధికి ఊతమివ్వడంలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 65 శాతం కంపెనీలు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరిపే యోచనలో ఉన్నాయి. దీంతో స్టార్టప్ వ్యవస్థ భవిష్యత్తు ఆశావహంగా కనిపిస్తోంది‘ అని సీఐఈఎల్ హెచ్‌ఆర్ సరీ్వసెస్ ఎండీ ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. అయితే, ఉద్యోగులు వెళ్లిపోకుండా తగు చర్యలు తీసుకోవడంపై అంకుర సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఉద్యోగుల కెరియర్ పురోగతికి అవకాశాలుకల్పించడం, వర్క్–లైఫ్ బ్యాలెన్స్ ఉండేలా చూడటం మొదలైనవి చేయాలని పేర్కొన్నారు. తద్వారా ఉద్యోగులకు స్టార్టప్‌లపై నమ్మకం పెరుగుతుందని, అట్రిషన్ తగ్గగలదని మిశ్రా వివరించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, మెరుగైన మానవ వనరుల విధానాలు ఉన్న అంకురాలు.. అట్రిషన్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు, రిమోట్ పని విధానాలు, భారీ స్టాక్ ఆప్షన్స్ స్కీములు మొదలైనవి అందిస్తున్నాయి. రిపోర్టు ప్రకారం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కి అత్యధిక డిమాండ్ ఉంటోంది. ఆ తర్వాత సేల్స్, ప్రీ–సేల్స్, రిటైల్ వంటి ఉద్యోగాలు ఉంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment