విజయవాడలో మోకాళ్లపై గిరిజన టీచర్ల మానవహారం
కూనవరంలో టీచర్స్–పేరెంట్స్ మీటింగ్‌లో తల్లిదండ్రుల నిరసన
తమ బిడ్డలకు ఉపాధ్యాయులు కావాలని డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు నినదించారు. తమ పోస్టులను డీఎస్సీ నుంచి మినహాయించి కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లు(సీఆర్టీ)గా మార్చాలని డిమాండ్ చేస్తూ గురుకుల టీచర్లు చేపట్టిన సమ్మె శనివారం 22వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా విజయవాడలో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం లెనిన్ సెంటర్‌లో మోకాళ్లపై మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్ సోర్సింగ్ టీచర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనాయక్, మల్లిఖార్జున నాయక్ మాట్లాడుతూ 15ఏళ్లకు పైగా చాలీచాలని వేతనాలతో సేవలందిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.
గిరిజన సంక్షేమశాఖ మంత్రి, అధికారులు సైతం తమ సమస్యలను పట్టించుకోవడంలేదని చెప్పారు. తమ డిమాండ్లపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి పరిష్కరించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థ ఉందన్నారు. ఆ వ్యవస్థను రద్దు చేసి తమను సీఆర్టీలుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని లక్ష్మీనాయక్, మల్లిఖార్జున నాయక్ స్పష్టంచేశారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల నిరసన
తూర్పు గోదావరి జిల్లా కూనవరంలో మెగా టీచర్స్–పేరెంట్స్ మీటింగ్‌లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైతం నిరసన వ్యక్తంచేశారు. గిరిజన పిల్లల చదువులపై ప్రభావం చూపుతున్న ఔట్ సోర్సింగ్ టీచర్ల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని కోరుతూ కొందరు తల్లిదండ్రులు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేశారు.
ఔట్ సోర్సింగ్ టీచర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో తమ పిల్లల చదువులకు ఇబ్బందికరంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. తమ బిడ్డలకు ఉపాధ్యాయులు కావాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment