
ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ కూటమి స్కెచ్
టీచరు ఓటర్లకు బెదిరింపులు, ప్రలోభాలు
ఇప్పటి పరిస్థితుల్లో యువత తమ మాట వినరని సర్కారు అనుమానం
గ్రూప్–2 పరీక్షతో ప్రభుత్వ కుట్ర బయటపడిందంటున్న అభ్యర్థులు
సర్కారు మెడకు ‘రోస్టర్’ ఉచ్చు దీంతో ఎన్నికల్లో తమ సత్తా
చూపిస్తామంటూ సోషల్ మీడియాతో విస్తృత క్యాంపెయిన్
సాక్షి, అమరావతి: మరో మూడ్రోజుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండడంతో టీడీపీ కూటమిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రెండ్రోజుల క్రితం జరిగిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష సందర్భంగా చెలరేగిన నిరుద్యోగుల ఆగ్రహజ్వాల రాష్ట్రవ్యాప్తంగా ఎగసిపడుతుండడమే ఇందుకు కారణం. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కేందుకు ఎన్‌డీఏ కూటమి నేతలు టీచర్లకు వల వేస్తున్నారు. ఉద్యోగులుగా ప్రభుత్వ పక్షాన ఉండాలని ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగైనా టీచర్ల ఓట్లతో గెలవాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో.. కృష్ణా–గుంటూరు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం టీచర్లనే టార్గెట్ చేశారు. ఒక్కో కుటుంబంలో కనీసం ముగ్గురు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటారన్న అంచనాతో ముందుకెళ్తున్నారు.
బాయ్‌కాట్ ఎలక్షన్.. బాయ్‌కాట్ కూటమి..
2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నాటి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించలేదని, గ్రూప్–2 రోస్టర్‌లో తీవ్ర అన్యాయం చేసిందని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. దీనివల్ల అభ్యర్థులు నష్టపోతారని, తమ ప్రభుత్వం ఏర్పడగానే ఈ తప్పును సరిచేసి న్యాయం చేస్తామన్నారు. ఇదే అంశంపై టీడీపీ తరఫున ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన వేపాడ చిరంజీవి తనకు ఓటువేసి గెలిపిస్తే ఈ సమస్యపై పోరాడతానంటూ యువతను ఆకట్టుకున్నారు. దీంతో ఉద్యోగార్థులంతా చిరంజీవిని గెలిపించారు.
అయితే.. గెలిచాక అదే వ్యక్తి గ్రూప్–2 రోస్టర్‌లో తప్పుల్లేవని చెప్పడంతో గ్రాడ్యుయేట్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. గత మూడు వారాలుగా ఆందోళన బాట పట్టారు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయరాదని నిరుద్యోగులు గట్టిగా నిర్ణయించుకుని ‘బాయ్‌కాట్ ఎలక్షన్.. బాయ్‌కాట్ కూటమి అభ్యర్థి’ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. దీంతో గ్రాడ్యుయేట్ల నుంచి ఓట్లుపడే ఛాన్స్‌లేదని భావించిన టీడీపీ కూటమి తాజాగా టీచర్లను టార్గెట్ చేసింది. ‘మా ప్రభుత్వం ఇంకా నాలుగేళ్లకు పైగా అధికారంలో ఉంటుంది. తర్వాత మీ ఇష్టం’ అంటూ వారిని భయపెడుతున్నట్లు సమాచారం. ఉపాధ్యాయ సంఘాలు ఈ బాధ్యత తీసుకుని టీచర్లతో ఓట్లు వేయించాలని చెబుతున్నట్లు తెలిసింది.
ప్రభుత్వంపై గ్రాడ్యుయేట్ల ఫైర్..
మరోవైపు.. టీడీపీ కూటమి ప్రభుత్వ వంచనపై గ్రాడ్యుయేట్స్‌లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష వాయిదాపై చివరివరకు తమను తప్పుదోవ పట్టించి తమ జీవితాలతో ఆడుకున్న సర్కారుకు ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వమని మండిపడుతున్నారు. నిజానికి.. రోస్టర్‌పై గతేడాది వేపాడ చిరంజీవితో కొన్నాళ్లు డ్రామా ఆడించి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ లాభపడింది.
ఆ తర్వాత ఈ అంశాన్ని పక్కన పెట్టేసింది. అలాగే, గ్రాడ్యుయేట్లను పక్కదారి పట్టించేందుకు రెండుసార్లు మెయిన్స్ పరీక్షను వాయిదా వేశారు. కానీ, రోస్టర్ అంశం వారికే చుట్టుకుంది. రోస్టర్‌లో తప్పులున్నాయని చెప్పారు కాబట్టి, ఇప్పుడా తప్పులను సరిచేసి మెయిన్స్ నిర్వహించాలని అభ్యర్థులు పట్టుబట్టారు. దీంతో మంత్రులు పరీక్షకు ఒకరోజు ముందు వాయిదాపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. కానీ, పరీక్ష వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటించడంతో ప్రభుత్వం తమను మోసంచేసేందుకు డ్రామా ఆడుతోందని అభ్యర్థులు నిర్ణయానికొచ్చారు.
టీడీపీ కూటమికి మా సత్తా చూపిస్తాం..
ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ నిర్ణయం తమను తీవ్రంగా కలచివేస్తోందని వారంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కూటమి నాయకుల మాటలు నమ్మి గతేడాది జూలైలో జరగాల్సిన పరీక్షను వాయిదా వేయించి, దాదాపు 8 నెలల కాలాన్ని వృధా చేశారని.. ఫలితంగా దాదాపు 72 వేల మంది గ్రాడ్యుయేట్లు వయసు దాటిపోయి ప్రభుత్వ ఉద్యోగావకాశం కోల్పోయారని వాపోతున్నారు. తమను నిలువునా ముంచిన టీడీపీ కూటమికి తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు.
పైగా.. ‘ప్రభుత్వం మొదటి నుంచి చాలా క్లియర్‌గా ఉంది. మనమే గమనించలేకపోయాం. మన టైం మొత్తం వృధా చేయించి పరీక్ష అంశాన్ని ఏపీపీఎస్సీ చైర్మన్‌పైకి నెట్టేశారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఇక్కడ వాడారు. అంతే..’ అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘ఒక ఎగ్జామ్‌ను కంట్రోల్ చేయలేకపోయారు. వీరు మన జీవితాలను బాగుచేస్తారా? స్వర్ణాంధ్రను సృష్టిస్తారా?’ అంటూ మరొకరు పోస్టు చేశారు. ‘మా ఆశలను, కలలని, మా భవిష్యత్తును చంపుతున్నారు. మేమూ మీ ఆశలను, కలలను, భవిష్యత్తును చంపగలం. ఆట మీరు మొదలుపెట్టారు. మేము ముగిస్తాం’.. అంటూ మరొకరు టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
Comments
Please login to add a commentAdd a comment