సమ్మెకు సామరస్య పరిష్కారం చూపకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
గిరిజన టీచర్ల స్థానంలో ‘ఆశ్రమ’ ఉపాధ్యాయులకు తాత్కాలిక బాధ్యతలు
కొనసాగుతున్న గిరిజన టీచర్ల నిరసనలు
వారికి మద్దతుగా విద్యార్థుల ప్రదర్శన
జాతీయ, రాష్ట్ర ఎస్టీ కమిషన్‌లకు ఫిర్యాదు
సాక్షి, అమరావతి: బతుకుపై భరోసా కోసం సమ్మెబాట పట్టిన గిరిజన గురుకుల విద్యాలయాల్లోని ఔట్ సోర్సింగ్ టీచర్లపై కూటమి సర్కారు కత్తిగట్టింది. వారి సమస్యను అర్థం చేసుకుని సకాలంలో పరిష్కరించాల్నిన ప్రభుత్వం... కక్ష సాధింపునకు పాల్పడుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. దీంతో గిరిజన టీచర్లు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. వారికి మద్దతుగా విద్యార్థులు సైతం ఆందోళనబాట పట్టారు. డీఎస్సీ నుంచి గురుకులాల్లోని ఔట్ సోర్సింగ్ పోస్టులను మినహాయించాలని, తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్స్ (సీఆరీ్ట)గా పరిగణించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మరికొన్ని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 15 రోజులుగా రాష్ట్రంలోని 199 గిరిజన సంక్షేమ గురుకులాలకు చెందిన 1,656 మంది ఔట్ సోర్సింగ్ గిరిజన టీచర్లు సమ్మె చేస్తున్నారు.
వారితో చర్చలు జరిపి సానుకూల పరిష్కారమార్గం చూపించి సమ్మెను విరమింపజేయాల్నిన ప్రభుత్వం... ఇందుకు విరుద్ధంగా మరింత రెచ్చగొట్టే ధోరణిని అవలంబిస్తోంది. గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వర్తించాలని 371 గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన 550 మందికిపైగా టీచర్లకు శనివారం తాత్కాలిక(డిప్యూటేషన్) బాధ్యతలు అప్పగించింది. వారు వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే 15 రోజులుగా గిరిజన సంక్షేమ గురుకులాల్లో బోధన నిలిచిపోయింది. తాత్కాలిక సర్దుబాటు వల్ల సుమారు 51వేల మంది ఉన్న గిరిజన గురుకులాల్లో పెద్దగా బోధన జరిగే అవకాశం లేదు. అదేసమయంలో ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో అక్కడి విద్యార్థులకు బోధన సక్రమంగా జరిగే అవకాశం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల గిరిజన సంక్షేమ గురుకులాలతోపాటు ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.
అమలుకు నోచుకోని హామీలు...
సమ్మె చేస్తున్న గిరిజన గురుకుల విద్యాలయాల్లోని ఔట్ సోర్సింగ్ టీచర్లతో గతంలో ఒకసారి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చర్యలు జరిపి పలు హామీలు ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఓఎస్డీ వరప్రసాద్ వచ్చి కొన్ని హామీలు ఇచ్చారు. అవేమీ అమల్లోకి రాకపోవడంతో ఔట్ సోర్సింగ్ టీచర్ల సమ్మె కొనసాగుతోంది. పాడేరు ఐటీడీఏ వద్ద వర్షంలోను రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. పార్వతీపురం ఐటీడీఏ వద్ద గిరిజన ఔట్ సోర్సింగ్ టీచర్లు భిక్షాటన చేసి నిరసన తెలిపారు.
విజయవాడ ధర్నా చౌక్‌లోను ధర్నాను కొనసాగించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జాతీయ, రాష్ట్ర ఎస్టీ కమిషన్‌లకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఔట్ సోర్సింగ్ టీచర్లకు మద్దతుగా పార్వతీపురం మన్యం జిల్లాలోని పి.కోనవలస గ్రామంలో శనివారం విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘తమ బడిలో ఉండే ఔట్ సోర్సింగ్ టీచర్లే తమకు కావాలి...’ అని ప్రభుత్వాన్ని విద్యార్థులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment