tribal teachers
-
గిరిజన టీచర్లపై కత్తిగట్టిన సర్కారు
సాక్షి, అమరావతి: బతుకుపై భరోసా కోసం సమ్మెబాట పట్టిన గిరిజన గురుకుల విద్యాలయాల్లోని ఔట్ సోర్సింగ్ టీచర్లపై కూటమి సర్కారు కత్తిగట్టింది. వారి సమస్యను అర్థం చేసుకుని సకాలంలో పరిష్కరించాల్నిన ప్రభుత్వం... కక్ష సాధింపునకు పాల్పడుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. దీంతో గిరిజన టీచర్లు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. వారికి మద్దతుగా విద్యార్థులు సైతం ఆందోళనబాట పట్టారు. డీఎస్సీ నుంచి గురుకులాల్లోని ఔట్ సోర్సింగ్ పోస్టులను మినహాయించాలని, తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్స్ (సీఆరీ్ట)గా పరిగణించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మరికొన్ని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 15 రోజులుగా రాష్ట్రంలోని 199 గిరిజన సంక్షేమ గురుకులాలకు చెందిన 1,656 మంది ఔట్ సోర్సింగ్ గిరిజన టీచర్లు సమ్మె చేస్తున్నారు.వారితో చర్చలు జరిపి సానుకూల పరిష్కారమార్గం చూపించి సమ్మెను విరమింపజేయాల్నిన ప్రభుత్వం... ఇందుకు విరుద్ధంగా మరింత రెచ్చగొట్టే ధోరణిని అవలంబిస్తోంది. గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వర్తించాలని 371 గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన 550 మందికిపైగా టీచర్లకు శనివారం తాత్కాలిక(డిప్యూటేషన్) బాధ్యతలు అప్పగించింది. వారు వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే 15 రోజులుగా గిరిజన సంక్షేమ గురుకులాల్లో బోధన నిలిచిపోయింది. తాత్కాలిక సర్దుబాటు వల్ల సుమారు 51వేల మంది ఉన్న గిరిజన గురుకులాల్లో పెద్దగా బోధన జరిగే అవకాశం లేదు. అదేసమయంలో ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో అక్కడి విద్యార్థులకు బోధన సక్రమంగా జరిగే అవకాశం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల గిరిజన సంక్షేమ గురుకులాలతోపాటు ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.అమలుకు నోచుకోని హామీలు...సమ్మె చేస్తున్న గిరిజన గురుకుల విద్యాలయాల్లోని ఔట్ సోర్సింగ్ టీచర్లతో గతంలో ఒకసారి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చర్యలు జరిపి పలు హామీలు ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఓఎస్డీ వరప్రసాద్ వచ్చి కొన్ని హామీలు ఇచ్చారు. అవేమీ అమల్లోకి రాకపోవడంతో ఔట్ సోర్సింగ్ టీచర్ల సమ్మె కొనసాగుతోంది. పాడేరు ఐటీడీఏ వద్ద వర్షంలోను రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. పార్వతీపురం ఐటీడీఏ వద్ద గిరిజన ఔట్ సోర్సింగ్ టీచర్లు భిక్షాటన చేసి నిరసన తెలిపారు.విజయవాడ ధర్నా చౌక్‌లోను ధర్నాను కొనసాగించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జాతీయ, రాష్ట్ర ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఔట్ సోర్సింగ్ టీచర్లకు మద్దతుగా పార్వతీపురం మన్యం జిల్లాలోని పి.కోనవలస గ్రామంలో శనివారం విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘తమ బడిలో ఉండే ఔట్ సోర్సింగ్ టీచర్లే తమకు కావాలి...’ అని ప్రభుత్వాన్ని విద్యార్థులు డిమాండ్ చేశారు. -
షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్ల పరిమితిపై రివ్యూ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాల్లో వంద శాతం గిరిజనులకు రిజర్వేషన్లు వర్తింపజేయడం చెల్లదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పుపై ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రివ్యూ పిటిషన్లు దాఖ లయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ చేబ్రోలు లీలాప్రసాదరావు, ఇతరులు 2002లో దాఖలు చేసిన సివిల్ అప్పీలును జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించి ఈ ఏడాది ఏప్రిల్ 22న 152 పేజీల తీర్పు వెలువరించింది. రిజర్వేషన్లు 50% మించరాదని తీర్పులో పేర్కొంది. అయితే ఇప్పటివరకు చేసిన నియామకాలకు మాత్రం రక్షణ కల్పిస్తున్నట్టు తెలిపింది. 1986లో చట్ట వ్యతిరేకంగా చేసిన కసరత్తును సరిదిద్దుకోకుండా 2000 సంవత్సరంలో తిరిగి అవే తప్పులు చేశారని, ఒకవేళ ఈ నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో అవే తప్పులు పునరావృతం చేస్తే, రిజర్వేషన్లు 50 శాతానికి మించి కల్పిస్తే 1986 నుంచి ఇప్పటివరకు చేసిన నియామకాలకు రక్షణ ఉండదని హెచ్చరించింది. ఈ తీర్పును సమీక్షించాలని కోరు తూ తాజాగా రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ గిరిజన సంఘాల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది అల్లంకి రమేశ్ పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణ నుంచి ఆదివాసీ హక్కుల పోరాట సమితి–తుడుందెబ్బ ద్వారా బీజేపీ ఎంపీ సోయం బాపూరావు, ఆదివాసీ(గిరిజన) ఎంప్లాయీస్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్, సువర్ణపాక జగ్గారావు పిటిషన్లు దాఖలు చేసినవారిలో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ తరఫున కూడా అల్లంకి రమేశ్ పిటిషన్ దాఖలు చేశారు. -
ఆ జీవో రద్దుపై సుప్రీంలో రివ్యూ
సాక్షి, హైదరాబాద్: ఏజెన్సీ ప్రాంతాల్లోని టీచర్ల పోస్టులను 100 శాతం స్థానిక గిరిజనులకే రిజర్వు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను (జీవో నంబర్ 3/2000) సుప్రీంకోర్టు కొట్టేయడంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ విషయంలో న్యాయ, రాజ్యాంగపరమైన అంశాలను అధ్యయనం చేసి వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు స్థానిక గిరిజనులకు అన్యాయం కలిగించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తరఫున న్యాయ పోరాటం చేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో పేర్కొన్న షెడ్యూల్డ్ ప్రాంతాలకు చెందిన స్థానికులకు అదే ప్రాంతంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమించే విషయంలో 100 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది. దీనిపై కొందరు కోర్టుకెళ్లగా సుప్రీంకోర్టు ఇటీవల జీవోను కొట్టేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల స్థానిక ఎస్టీలకు నష్టం జరుగుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తెచ్చారు. 1950 జనవరి 26కు ముందు నుంచీ స్థానికంగా నివాసముంటున్న ఎస్టీలకు స్థానిక ఉద్యోగాల్లో వంద శాతం రిజర్వేషన్ ఇచ్చే పద్ధతి ఉందని, దీనివల్ల ఎస్టీలు కొద్దోగొప్పో ప్రయోజనం పొందారని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ప్రభుత్వ జీవోను కొట్టేయడం వల్ల ఎస్టీలు రిజర్వేషన్ సౌకర్యం కోల్పోతారని వారు వివరించారు. రాజ్యంగం కల్పించిన ప్రత్యేక హక్కులకు సుప్రీంకోర్టు తీర్పు భంగకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయ పోరాటం చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.. ఎస్టీల రిజర్వేషన్ కొనసాగించడం సముచితమని అభిప్రాయపడ్డారు. సుప్రీం తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రివ్యూ పిటిషన్ వేస్తామని స్పష్టం చేశారు. ఎస్టీల రిజర్వేషన్ సౌకర్యం యథావిధిగా కొనసాగేలా అవసరమైన వాదనలతో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీలకు రాజ్యాంగమే ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్లు కల్పించిందని, వాటిని కాపాడే విషయంలో ఎస్టీలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. -
పదోన్నతుల ఊసేదీ ?
ఖమ్మం, న్యూస్‌లైన్: ఉపాధ్యాయుల పదోన్నతులపై జిల్లాలో నీలి నీడలు వీడడం లేదు. ఏజెన్సీ ప్రాంత గిరిజన ఉపాధ్యాయులు, మైదాన ప్రాంత ఉపాధ్యాయుల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఎవరికి వారు పట్టు వీడకుండా కోర్టులను ఆశ్రయించడంతో ఈ సమస్య నానాటికీ జఠిలంగా మారింది. గిరిజన, గిరిజనేతరులకు సంబంధించిన విషయం కావడంతో దీనిపై నిర్ణయం తీసుకునేందుకు అధికారులు, నాయకులు వెనకడుగు వేస్తున్నారు. మధ్యేమార్గంగా చర్చలు జరిపే నాథుడే కరువయ్యాడు. దీంతో ఉద్యోగ విరమణ నాటికైనా పదోన్నతి పొందుతామని భావించిన పలువురు ఉపాధ్యాయుల ఆశలు అడియాసలే అవుతున్నాయి. జిల్లాలో మొత్తం 46 మండలాల్లో 29 ఏజెన్సీలో, 17 మండలాలు మైదాన ప్రాంతాల్లో ఉండగా, 11,895 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇందులో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు 77 మంది పీజీహెచ్ఎంలు, 1229 మంది ఎస్ఏలు, 1309 మంది ఎస్జీటీ కేటగిరీలకు చెందినవారున్నారు. ఆ ప్రాంతాలకే చెందిన గిరిజనులు 64 మంది పీజీ హెచ్ఎంలు, 1,192 మంది ఎస్ఏలు, 3,461 ఎస్జీటీలు ఉన్నారు. వీరితోపాటు మైదానప్రాంతంలో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, పీజీ హెచ్ఎంలు మొత్తం 4,563 మంది ఉన్నారు. 2000 సంవత్సరానికి ముందు జరిగిన డీఎస్సీ నియామకాల్లో జిల్లా యూనిట్‌గా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేవారు. ఆ తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఖాళీలను ఆ ప్రాంతంలోని గిరిజనులతోనే భర్తీ చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేయడంతో ప్రభుత్వం జీవో నంబర్ 3ను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతి డీఎస్సీలో ఏజెన్సీ ప్రాంత ఖాళీలను అక్కడి గిరిజనులతో, మైదాన ప్రాంత ఖాళీలను జిల్లా యూనిట్‌గా భర్తీ చేస్తున్నారు. అయితే ఉపాధ్యాయ పదోన్నతుల్లో మాత్రం 2012 జనవరి వరకు జిల్లా యూనిట్‌గానే చేపట్టేవారు. కాగా, ఏజెన్సీ ప్రాంత పదోన్నతులు అక్కడ పనిచేస్తున్న గిరిజన ఉపాధ్యాయులకే ఇవ్వాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేయడంతో 2012 ఫిబ్రవరిలో ఏజెన్సీ ప్రాంతంలో అక్కడి గిరిజనులకు, మైదాన ప్రాంతంలో ఇతర ఉపాధ్యాయులకు పదోన్నతుల కల్పించారు. ఆ తర్వాత అదే ఏడాది జూలైలోనూ వేర్వేరుగా పదోన్నతులు చేపట్టగా గిరిజన ఉపాధ్యాయుల మధ్య సర్వీస్ విషయంలో తలెత్తిన వివాదంతో పలు విభాగాల ప్రమోషన్లు నిలిచిపోయాయి. అనంతరం డీఈవోలు మారడంతో తిరిగి 2013 ఆగస్టులో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించగానే జిల్లా యూనిట్‌గా చేపట్టాలని జనరల్ టీచర్స్ ఫోరం అధ్వర్యంలో ఏపీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో జిల్లాను యూనిట్‌గా తీసుకొని పదోన్నతులు జరపాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ విషయం తెలుసుకున్న గిరిజన సంఘాల నాయకులు జీవో నంబర్ 3 ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఉన్న పదోన్నతులు ఏజెన్సీ గిరిజనులకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పదోన్నతుల ప్రక్రియను నిలిపి వేశారు. ఇలా..ఉద్యోగ విరమణ నాటికైనా పదోన్నతి వస్తుందని ఆశపడిన పలువురు ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. మధ్యే మార్గమే శరణ్యం... ఇటు ఏజెన్సీ ప్రాంత గిరిజనులు, అటు మైదాన ప్రాంత ఉపాధ్యాయులకు మధ్యేమార్గంగా నిర్ణయం తీసుకుంటే తప్ప పదోన్నతుల ప్రక్రియ కొలిక్కివచ్చే అవకాశం లేదు. పదోన్నతులు చేపట్టాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేయడంతో జిల్లాలోని ప్రత్యేక పరిస్థితిని డీఈవో ఉన్నతాధికారులకు వివరించారు. జిల్లాలోని ఉపాధ్యాయుల వివరాలను అందజేశారు. అయితే జిల్లాతోపాటు గిరిజన జనాబా అధికంగా ఉన్న అదిలాబాద్‌లోనూ ఇదే పరిస్థితి ఉందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. దీనికి పరిష్కారం చూపకపోతే పలువురు ఉపాధ్యాయులు పదోన్నతితోపాటు, లక్షల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. విద్య, న్యాయ, గిరిజన, సాధారణ పరిపాలన శాఖల అధికారులు, నాయకులతో ముడిపడిన వ్యవహారం కావడంతో దీనిని సున్నితంగా పరిష్కరించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఎవరికీ అన్యాయం జరుగకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఖాళీలను 70 శాతం ఏజెన్సీ వారికి, 30 శాతం మైదాన ప్రాంతం వారికి కేటాయిస్తే బాగుంటుందని పలు ఉపాధ్యాయ సంఘాలు సూచించనట్లు సమాచారం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వివాదంలోకి వెళ్లేందుకు రాజకీయ పార్టీలు సాహసం చేయకపోవడంతో ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని పలువురు అంటున్నారు.