ఖమ్మం, న్యూస్‌లైన్: ఉపాధ్యాయుల పదోన్నతులపై జిల్లాలో నీలి నీడలు వీడడం లేదు. ఏజెన్సీ ప్రాంత గిరిజన ఉపాధ్యాయులు, మైదాన ప్రాంత ఉపాధ్యాయుల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఎవరికి వారు పట్టు వీడకుండా కోర్టులను ఆశ్రయించడంతో ఈ సమస్య నానాటికీ జఠిలంగా మారింది. గిరిజన, గిరిజనేతరులకు సంబంధించిన విషయం కావడంతో దీనిపై నిర్ణయం తీసుకునేందుకు అధికారులు, నాయకులు వెనకడుగు వేస్తున్నారు. మధ్యేమార్గంగా చర్చలు జరిపే నాథుడే కరువయ్యాడు. దీంతో ఉద్యోగ విరమణ నాటికైనా పదోన్నతి పొందుతామని భావించిన పలువురు ఉపాధ్యాయుల ఆశలు అడియాసలే అవుతున్నాయి.
జిల్లాలో మొత్తం 46 మండలాల్లో 29 ఏజెన్సీలో, 17 మండలాలు మైదాన ప్రాంతాల్లో ఉండగా, 11,895 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇందులో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు 77 మంది పీజీహెచ్‌ఎంలు, 1229 మంది ఎస్‌ఏలు, 1309 మంది ఎస్జీటీ కేటగిరీలకు చెందినవారున్నారు. ఆ ప్రాంతాలకే చెందిన గిరిజనులు 64 మంది పీజీ హెచ్‌ఎంలు, 1,192 మంది ఎస్‌ఏలు, 3,461 ఎస్జీటీలు ఉన్నారు.
వీరితోపాటు మైదానప్రాంతంలో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, పీజీ హెచ్‌ఎంలు మొత్తం 4,563 మంది ఉన్నారు. 2000 సంవత్సరానికి ముందు జరిగిన డీఎస్సీ నియామకాల్లో జిల్లా యూనిట్‌గా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేవారు. ఆ తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఖాళీలను ఆ ప్రాంతంలోని గిరిజనులతోనే భర్తీ చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేయడంతో ప్రభుత్వం జీవో నంబర్ 3ను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతి డీఎస్సీలో ఏజెన్సీ ప్రాంత ఖాళీలను అక్కడి గిరిజనులతో, మైదాన ప్రాంత ఖాళీలను జిల్లా యూనిట్‌గా భర్తీ చేస్తున్నారు. అయితే ఉపాధ్యాయ పదోన్నతుల్లో మాత్రం 2012 జనవరి వరకు జిల్లా యూనిట్‌గానే చేపట్టేవారు.
కాగా, ఏజెన్సీ ప్రాంత పదోన్నతులు అక్కడ పనిచేస్తున్న గిరిజన ఉపాధ్యాయులకే ఇవ్వాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేయడంతో 2012 ఫిబ్రవరిలో ఏజెన్సీ ప్రాంతంలో అక్కడి గిరిజనులకు, మైదాన ప్రాంతంలో ఇతర ఉపాధ్యాయులకు పదోన్నతుల కల్పించారు. ఆ తర్వాత అదే ఏడాది జూలైలోనూ వేర్వేరుగా పదోన్నతులు చేపట్టగా గిరిజన ఉపాధ్యాయుల మధ్య సర్వీస్ విషయంలో తలెత్తిన వివాదంతో పలు విభాగాల ప్రమోషన్లు నిలిచిపోయాయి. అనంతరం డీఈవోలు మారడంతో తిరిగి 2013 ఆగస్టులో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించగానే జిల్లా యూనిట్‌గా చేపట్టాలని జనరల్ టీచర్స్ ఫోరం అధ్వర్యంలో ఏపీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
దీంతో జిల్లాను యూనిట్‌గా తీసుకొని పదోన్నతులు జరపాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ విషయం తెలుసుకున్న గిరిజన సంఘాల నాయకులు జీవో నంబర్ 3 ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఉన్న పదోన్నతులు ఏజెన్సీ గిరిజనులకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పదోన్నతుల ప్రక్రియను నిలిపి వేశారు. ఇలా..ఉద్యోగ విరమణ నాటికైనా పదోన్నతి వస్తుందని ఆశపడిన పలువురు ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది.
మధ్యే మార్గమే శరణ్యం...
ఇటు ఏజెన్సీ ప్రాంత గిరిజనులు, అటు మైదాన ప్రాంత ఉపాధ్యాయులకు మధ్యేమార్గంగా నిర్ణయం తీసుకుంటే తప్ప పదోన్నతుల ప్రక్రియ కొలిక్కివచ్చే అవకాశం లేదు. పదోన్నతులు చేపట్టాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేయడంతో జిల్లాలోని ప్రత్యేక పరిస్థితిని డీఈవో ఉన్నతాధికారులకు వివరించారు. జిల్లాలోని ఉపాధ్యాయుల వివరాలను అందజేశారు. అయితే జిల్లాతోపాటు గిరిజన జనాబా అధికంగా ఉన్న అదిలాబాద్‌లోనూ ఇదే పరిస్థితి ఉందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.
దీనికి పరిష్కారం చూపకపోతే పలువురు ఉపాధ్యాయులు పదోన్నతితోపాటు, లక్షల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. విద్య, న్యాయ, గిరిజన, సాధారణ పరిపాలన శాఖల అధికారులు, నాయకులతో ముడిపడిన వ్యవహారం కావడంతో దీనిని సున్నితంగా పరిష్కరించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఎవరికీ అన్యాయం జరుగకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఖాళీలను 70 శాతం ఏజెన్సీ వారికి, 30 శాతం మైదాన ప్రాంతం వారికి కేటాయిస్తే బాగుంటుందని పలు ఉపాధ్యాయ సంఘాలు సూచించనట్లు సమాచారం.
అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వివాదంలోకి వెళ్లేందుకు రాజకీయ పార్టీలు సాహసం చేయకపోవడంతో ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని పలువురు అంటున్నారు.
పదోన్నతుల ఊసేదీ ?
Published Wed, Jan 29 2014 4:02 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement