Job Retirement
-
కథ చెబుతారాఊ... కొడతాను
ఈ ప్రధానోపాధ్యాయుడు ఉద్యోగ విరమణ పొందారు. అయినా ఇప్పటికీ బడికి వెళుతుంటారు. అక్కడ పిల్లలకు కథలు చెబుతూ, వారి చేత చెప్పిస్తూ.. చిన్నారుల మేధాశక్తికి పదును పెడుతుంటారు. బాలల కోసం రచనలు చేస్తూ... బాలలే లోకం అని విశ్వసిస్తున్న ఈ (అ)విశ్రాంత ప్రధానోపాధ్యాయుడి పేరే వి.రాజేశ్వర శర్మ. ఆయనది పిల్లల లోకమే. పిల్లలే ఆయన కథా వస్తువు. ఆయన రచనలన్నీ పిల్లలకు సంబందించినవే. చివరకు ఆయన పీహెచ్డీ చేసింది కూడా పిల్లలకు సంబంధించిన అంశాలపైనే. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణానికి చెందిన డాక్టర్ వి.రాజేశ్వరశర్మ (వీఆర్‌శర్మ) గెజిటెడ్ ప్రధానోపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన రెండు దశాబ్దాలుగా పిల్లలకు సంబంధించిన రచనలతో ఎన్నో పుస్తకాలను తీసుకువచ్చారు. ‘పిల్లల లోకం’ అన్న పేరుతో ఆయన పిల్లలతో కథలు, కవితలు రాయిస్తూ, బొమ్మలు గీయిస్తూ వాటì తో పుస్తకాలు వేయించారు. పిల్లలతో మాట్లాడితే వారిలోని మేధాశక్తి బయటకు వస్తుందని విశ్వసించే శర్మ పిల్లల లోకం పేరుతో గడచిన రెండు దశాబ్దాలుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు రచనలూ చేస్తున్నారు. 1998లో మొదలైన ఆయన ప్రయత్నం ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. ఉద్యోగ విరమణ తరువాత మరింత సమయం కేటాయిస్తూ ముందుకు సాగుతున్నారు. డాక్టర్ వీఆర్‌శర్మ ‘పిల్లల లోకం’ పేరుతో రాసిన కవితలు, కథలను పుస్తక రూపంలో తీసుకువచ్చారు. అలాగే ‘ఆనందం’ అనే పిల్లల పాటలు, ‘కానుక’ అనే పేరుతో ఆధునిక బాలల అద్భుత సాహస కాల్పనిక నవల, బడిపిల్లలు రాసిన కథలను కూర్చి ‘బంగారు నెలవంకలు’ అన్న పుస్తకాన్ని, ‘కవులు పిల్లలు’ అన్న సంకలనాన్ని తీసుకొచ్చారు. సామాజిక అంశాలపై ఆయన రాసిన ఎన్నో పుస్తకాలు ముద్రితమయ్యాయి. ఆయన రాసిన దాదాపు అన్ని పుస్తకాల కవర్‌పై పిల్లల చిత్రాలే కనిపిస్తాయి. కాగా పూర్వ కాలంలో తాత, బామ్మలు పిల్లలకు పురాణాలు, ఇతిహాసాలు, నీతికథలు చెప్పేవారు. వాటి ప్రభావం పిల్లలపై ఎంతో ఉండేది. కుటుంబాలు విడిపోతున్న కారణంగా పిల్లలకు నీతి కథలుగాని, ఇతర కథలు కాని చెప్పేవారు లేకుండాపోయారు. బడి పిల్లలతో కథలు చెప్పిస్తూ.. రికార్డు చేయిస్తూ.. పిల్లలు చాలామంది కథలు చెప్పే మేధస్సు ఉన్నా వాటిని వెలికితీసే ప్రయత్నం జరగడం లేదు.అయితే డాక్టర్ వీఆర్‌శర్మ పిల్లలలోకం పేరుతో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి పిల్లలతో కథలు చెప్పిస్తున్నారు. పిల్లలు చెప్పిన క£ý లను రికార్డు చేయడం ద్వారా వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. గర్గుల్, సిద్దిపేట తదితర ఉన్నత పాఠశాలల్లో ఆయన పిల్లలతో కథలు చెప్పించారు. దాదాపు ముపై ్పమంది పిల్లలు చెప్పిన కథలు విని ఆయన ఆశ్చర్యపోయారు. పిల్లల్ని ప్రోత్సహిస్తే వాళ్లలో సృజనాత్మక ఆలోచనలు మరింతగా పెరుగుతాయని, నీతి కథను కొత్తగా చెప్పగలుగుతారని శర్మ అంటున్నారు. అలాగే సిద్దిపేటలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఐడీఏ బొల్లారం ఉన్నత పాఠశాలలో కూడా పిల్లల లోకం కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలకు నగదు ప్రోత్సాహకాలు డాక్టర్ వీఆర్‌శర్మ పాఠశాలల్లో విద్యార్థులతో కథలు చెప్పించే సందర్భంలో మంచి కథలు చెప్పిన వారిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థికి రూ.3 వందల నగదు, రెండో స్థానం సంపాదించిన విద్యార్థికి రూ.రెండు వందలు, మూడో స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ. 100 నగదు ప్రోత్సాహకం అందిస్తున్నారు. అంతేగాక బాలసాహిత్య పుస్తకాలు, సర్టిఫికెట్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసి పిల్లలతో కథలు చెప్పించడం ద్వారా మిగిలిన పిల్లలు వాటిని వింటూంటే తాము కూడా నేర్చుకోవాలన్న ఆసక్తి ఏర్పడుతుంది. అందుకే పిల్లలను కథ చెబుతారా ఊ కొడతాను అని అడుగుతుంటారు. ఇప్పటివరకు వందలాది మంది విద్యార్థులు కథలు చెప్పారని, ఆ కథలన్నింటినీ యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేస్తున్నానని, ఇలా చేయడం వల్ల అవి విశ్వవ్యాపితం అవుతాయన్నారు. – సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
టిఫిన్ బాక్స్
అతడు ఉద్యోగి. ఆమె గృహిణి. ఆ ఉద్యోగికి ఇవాళ్లే రిటైర్మెంట్! రేపట్నుంచి అతడి జీవితం ఎలా ఉండబోతోంది?! ఆ సంగతి వదిలెయ్యండి. ఆ గృహిణికి ఎలా ఉండబోతోంది? ఈ క్షణంలో ఆమె ఏం ఆలోచిస్తోంది? అస్సలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఇంకా ఈమధ్యనే కొత్తగా మావారు ఉద్యోగంలో జాయినయినట్టుగా ఉంది! అప్పుడే ముప్ఫై ఐదేళ్ల సర్వీసు అయిపోతోందా? ‘ఆగదు ఏ నిమిషం నీకోసము, ఆగితే సాగదు ఈలోకము’ పాట గుర్తుకొచ్చింది. ఆ.. ఇంకా ముప్ఫై ఏళ్ల సర్వీసు ఉందీ, ఇరవై ఏళ్ల సర్వీసు ఉందనుకుంటుండగానే పదవీ విరమణ కాలం వచ్చేసింది. ఇంకో ఏడాది రిటైర్మెంటుకి టైముందనుకున్నప్పటి నుంచీ ఆ గోడకున్న కేలెండరు కి కూడా తొందరొచ్చేసింది. ఎడాఫెడా బొమ్మలు మార్చేసింది.గోరువెచ్చని నిమ్మరసంతో మొదలవుతూ వచ్చింది ఇన్నేళ్ల మా రోజూ వారీ కార్యక్రమం. ఆయన వాకింగు చేసొచ్చి, వెంటనే న్యూస్పేపర్లో తలదూర్చి, ఆ కబురూ ఈ కబురూ చూడడం, ఎడిటోరియల్ చదవడం, స్నానానికి వెడుతూ ‘టిఫిన్ రెడీ చెయ్యవోయి, రెండు నిమిషాల్లో వచ్చేస్తా‘! అంటూ, ఉరకలు పరుగులతో బ్రేక్‌ఫాస్ట్ చెయ్యడం ఇక మీదట ఉండదేమో! ‘ఫ్లాస్కోలో ఇచ్చిన మజ్జిగ తాగడం మరచిపోకండి. పదకొండింటికి కీరాదోస ముక్కలూ, నాలుగు గంటలకి యాపిల్ పండు తినండి. మీటింగులు, పార్టీల పేరు చెప్పి టీలూ కాఫీలూ తాగకండి. జీడిపప్పులూ, సమోసాలూ ససేమిరా ముట్టుకోకండి’ అని ఏళ్ల తరబడి నే చెప్పే పాఠాలకింక స్వస్తి చెప్పే ఘడియలు దగ్గరకొస్తున్నాయి! అయ్యగారి ప్రతి పుట్టినరోజుకి ఓ పాంటు చొక్కా తో పాటూ ఓ లేటెస్ట్ మోడల్ టిఫిను బాక్సూ, ఓ థర్మాస్ తప్పనిసరిగా కొంటూవచ్చాను. ఇంక ఆ అవసరం ఉండదేమో!మూడుగిన్నెల కారియర్లో పైగిన్నెలో మూడు రోటీలు, మధ్య గిన్నెలో కూర, ఆఖరు గిన్నెలో ఆకుకూర పప్పు పెడతూవచ్చాను. అడపాదడపా పూరీలు, బిరియానీ, చైనీస్ కూడా వెరైటీగా పెడ్తూ వున్నాను. ఈ మధ్యనే తృణ ధాన్యాలతో కొత్త కొత్త రెసిపీలు నేర్చుకుని నా వంటకాలను ఆయనపై ప్రయోగిస్తున్నాను. ఎండా కాలంలో ధర్మాసులో చిక్కటి మజ్జిగలో నిమ్మకాయ పిండి, అల్లం తురిమి, రవ్వంత రాళ్ల ఉప్పు వేసి, ఏ పుదీనా ఆకో, కొత్తిమీరో వేసి గిలక్కొట్టి ఇస్తే ఆయనకి హ్యాపీ. అదే చలి కాలంలో వేడివేడి వెజిటెబుల్ సూపో, లెంటిల్ సూపో ధర్మాసులో నింపితే నేను ఆయన పక్కనున్నట్టుగా నులివెచ్చని ఫీలింగుట! ఇంటికొచ్చి మురిసి పోతారు. ఆయన టిఫిన్ కారియర్ ని ఎంతో ప్రేమతో, ఓపిగ్గా సర్దుతుంటే చెప్పలేనంత తృప్తిగా ఉంటుంది. ఏ మాత్రం పనిలా అనిపించదు. ఆ టిఫిన్ కారియర్ని రకరకాల అందమైన జూట్ బ్యాగ్గుల్లో ముస్తాబు చేయడం ఓ జ్ఞప్తిగా మిగిలిపోతుంది. ఆ బ్యాగులన్నీ కిచెన్ షెల్ఫ్‌లో వేళ్లాడాల్సిందేనా? రేపటి రోజున టిఫిన్ బాక్స్‌లో ఏం ఫుడ్ అరేంజ్ చెయ్యాలో అన్న ఆలోచనకు కామా నుండి ఫుల్ స్టాపేనేమో! వచ్చే ఏడాది ఈయన పుట్టిన రోజుకేం గిఫ్టు ఇవ్వాలో? ఇద్దరం కలసి లంచ్ ఇంట్లోనే చేస్తాం కాబట్టి టిఫిన్ బాక్సూ, థర్మాసు గిఫ్టు రూల్డౌట్!టింగు టింగు మని కాలింగ్ బెల్ మోగడంతో నా ఆలోచనలకి బ్రేకు పడింది.‘ హే గుడ్ న్యూస్ సత్యా’ అంటూ కేను కుర్చీలో రిలాక్స్డ్గా కూర్చుని బూట్లు విప్పుకుంటూ ‘నా సిన్సియర్ హార్డ్‌వర్క్‌కి, ఇంటర్నేషనల్ ఎకనామిక్ పాలసీలలో నాకున్న అవగాహనకి, నాకు ఆ విషయంలో ఉన్న ఎక్స్పర్టీస్కి ప్రభుత్వం వారు మెచ్చి, రానున్న తరాలవారికి, దేశానికి నా అనుభవం ఉపయోగపడాలని నాకు మరో మూడేళ్ల కోసం సర్వీస్‌లో ఎక్స్టెండ్ చేశారోయి. నెక్స్ట్ బర్త్ డేకి టిఫిన్ బాక్సూ, థర్మాసూ కొనొచ్చు డియర్. ఈగర్లీ వెయిటింగ్ ఫార్ మోర్ డెలీషియస్ లంచెస్‘ అన్నారు, నా మనసు చదివినట్టుగా! ఆయన ఇంటికి తెచ్చిన టిఫిన్ బాక్స్‌ని లోపలికి తీసుకెళ్లి మెత్తగా ఓ ముద్దు పెట్టుకున్నా. ఇంకో మూడేళ్లు టిఫిన్ బాక్స్ తో ప్రేమానుబంధం కంటిన్యూ అవుతుందన్నమాట! ఆయన కోసం నేను తయారు చేసుంచిన పళ్లరసంతో, శుభ సమాచారానికి కంగ్రాట్స్ చెప్పేందుకు ఆయన దగ్గరకి వెళ్లా. సత్యశ్రీ నండూరి -
సీపీఎస్ రద్దు చేయకుంటే పోరుబాటే
ఉద్యోగ విరమణ తర్వాత జీవితానికి ఆర్థిక భద్రత, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినా, ఆ కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు, ప్రత్యేక ప్రయోజనాలు, సామాజిక భద్రతగా పింఛన్లు వస్తాయనుకున్నారు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఉద్యోగుల భవిష్యత్‌కు భరోసా లేకుండా పోయింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులను ఆందోళనలు, పోరాటాల బాట పట్టేలా చేసింది. కాకినాడ సిటీ: జిల్లా సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లాలోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కాకినాడ మెక్లారిన్ హైస్కూల్ నుంచి భారీ ఊరేగింపుగా ఆనందభారతి గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలోని సీపీఎస్ ఉద్యోగులు వేలాదిగా తరలి వచ్చి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని దుయ్యబట్టారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానం కొనసాగించాలని నినదించారు. కమిటీలు వేసి ఉద్యోగులను బుజ్జగించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. పింఛన్ రద్దు చేసే అధికారం పార్లమెంట్‌కు ఎక్కడిదంటూ ప్రశ్నించారు. శానససభలో పింఛన్ తీసేస్తున్నట్లు తీర్మానం చేసి కొత్త పింఛన్ విధానం అమలు చేస్తున్నట్లు చట్టాలు చేశారా అంటూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నిలదీశారు. రానున్న శాసనసభ సమావేశాల్లో ప్రత్యేక తీర్మానం ద్వారా సీపీఎస్ విధానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించకపోతే అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. సీపీఎస్ ఉద్యోగులు నిర్వహించిన సమరభేరి బహిరంగ సభకు ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.రవికుమార్ అధ్యక్షత వహించగా రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు ఐ.వెంకటేశ్వరరావు, బూరిగ ఆశీర్వాదం, గొడుగు ప్రతాప్, డి.వెంకటరావు, ప్రదీప్‌కుమార్, ఎస్కేవీ భాషా, హృదయరాజు, మాజీ ఎమ్మెల్సీ నల్లమిల్లి శేషారెడ్డి, అంబాజీపేట ఎంపీడీఓ తూతిక విశ్వనాథ్ తదితరులు పాల్గొని మాట్లాడారు. సీపీఎస్ ప్రకటన ఇలా... సీపీఎస్ విధానంపై 2003, డిసెంబర్ 22న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 2004, జనవరి ఒకటి నుంచి సీపీఎస్‌ను అమలులోకి తెచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004, సెప్టెంబర్ ఒకటి నుంచి సర్వీసులో చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పొందుతున్న సంస్థల్లో ఉద్యోగులు, అటానమస్ కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులందరికీ 2004, నవంబర్ 22 నుంచి అమలు చేస్తోంది. దీనిని పెన్షన్ నిధి నియంత్రణ, అభివృద్ధి, ప్రాధికార సంస్థ (పీఎఫ్ఆర్డీఏ), నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థల సమన్వయంతో దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. సీపీఎస్ అంశం రాష్ట్ర పరిధిలోనిదే... సీపీఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమమే మొదలు పెట్టామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమైనందున దీనిని రద్దు చేయలేమని కొన్ని రాష్ట్రాలు పేర్కొంటున్నాయని, ఇది సరికాదన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లును కొన్ని రాష్ట్రాలు ఆమోదించిన తర్వాతే కేంద్రం అమల్లోకి తెచ్చిందన్నారు. ప్రస్తుతం త్రిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కూడా పాత పింఛన్ విధానమే అమల్లో ఉందన్నారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలను కోరినప్పుడు ఇది కేవలం రాష్ట్రాల పరిధిలోని అంశం మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసినట్లు పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. సీపీఎస్ విధానం రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా శాఖల ఉద్యోగులు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామన్నారు. కేజ్రీవాల్ మాస్క్‌లతో... ఆందోళనకారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫోటోలు, ఫ్లెక్స్‌లు, మాస్క్‌లు ధరించి పాల్గొనడం విశేషం. ఉద్యోగులకు ఆమ్ ఆద్మీ పార్టీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నరాల శివ, మహిళా విభాగం కన్వీనర్ టి.రూపారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సీపీఎస్ రద్దుకు జగన్ సుముఖం : మార్గాని భరత్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారని రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజవర్గ కో ఆర్డినేటర్ మార్గాని భరత్ పేర్కొన్నారు. కాకినాడలో ఏపీ సీపీఎస్ జిల్లా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో íసీపీఎస్ రద్దుపై నిర్వహించిన ర్యాలీ, సమరభేరి బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా పర్యటన సమయంలో తాము అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేయడంతో పాటు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని, సకాలంలో కరువు భత్యం చెల్లిస్తామని జగన్ ప్రకటించారని భరత్ గుర్తు చేశారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జగన్‌ను కలసి సీపీఎస్ విధానంపై చర్చించారని, స్పష్టమైన హామీని కూడా జగన్ ఉద్యోగులకు ఇచ్చారన్నారు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని, సీపీఎస్ విధానం రద్దు అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్సార్ సీపీకి ఓటు వేసి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని మార్గాని భరత్ కోరారు. కేంద్రం జోక్యం అవసరం లేదు ఇతర రాష్ట్రాలలో పాత పింఛన్ విధానం అమలు చేస్తున్నారు. మన ప్రభుత్వం మాత్రం కేంద్ర పరిధిలోనిదంటూ దాటవేస్తోంది. సీపీఎస్‌ను రద్దు చేసేందుకు కేంద్రం జోక్యం అవసరం లేదు. – భానుశ్రీ, కాకినాడ -
ఒక్కమాట.. వెలుగు రేఖ
‘ఉద్యోగ విరమణ తర్వాత పెన్షనర్లు ఆత్మగౌరవంతోపాటు ఆర్థిక సమస్యలు లేకుండా జీవించడానికి పెన్షన్ స్కీమ్‌ను ప్రభుత్వం అందుబాటులోని వనరులతో ఏర్పాటు చేయాలి’. సుప్రీంకోర్టు 1982లో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇచ్చిన తీర్పు ఇది. అయితే ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గిన ప్రభుత్వాలు పాత పింఛన్ విధానాన్ని రద్దు చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని 2013లో (సీపీఎస్) అమలులోకి తెచ్చింది. 2014 సెప్టెంబర్ నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి ఈ స్కీమ్ పరిధిలోకి వస్తారు. ఈ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ లక్షలాది మంది ఆందోళనలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించ లేదు. ఈ క్రమంలో తాను అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేసి రాష్ట్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలకు పాత పింఛన్ విధానం అమలులోకి తెస్తానని హామీ ఇచ్చారు. సీపీఎస్ స్కీమ్ రద్దవుతే జిల్లాలో దాదాపు 12 వేల మంది లబ్ధిపొందుతారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా హామీ ప్రకటించడంతో పలు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప ఎడ్యుకేషన్/బద్వేల : ఆర్థిక భరోసా ఉన్నట్టే సీపీఎస్ స్కీమ్ రద్దు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంద ని చెప్పడం అవాస్తవం. సీపీఎస్ రద్దవుతే లక్షల మంది ఉద్యోగులకు ఆర్థిక భరోసా కలుగుతుంది. జగన్ నిర్ణయాన్ని ఎంతో మంది స్వాగతిస్తున్నారు. మడితాటి నరసింహా రెడ్డి, హెచ్ఎం, రాయచోటి ఉపాధ్యాయులు అండగా ఉంటారు సీపీఎస్ రద్దుపై హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉపాధ్యాయులు అండగా ఉంటారు. కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నా అధికారంలో ఉన్న వారిలో ఒక్కరూ కూడా స్పందించలేదు. ఇప్పటికే ఎంతో మంది నష్టపోయారు. సీపీఎస్ రద్దుకు సహకరిస్తే వారికి రుణపడి ఉంటాం. భాస్కర్, ఉపాధ్యాయుడు, రాయచోటి చారిత్రాత్మకంగా నిలుస్తోంది సీపీఎస్ రద్దుపై జగన్ ఇచ్చిన హామీ అమలు అయితే చరిత్రలో నిలిచిపోతోంది. ఉద్యోగుల కష్టాలు చూసే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. - రాజగోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయుడు, బి.కోడూరు మండలం ఆశలకు ఊపిరి పోశారు పాత పింఛను విధానాన్ని ప్రవేశపెడతామని వైఎస్ జగన్ చెప్పిన ఒక్క మాటతో లక్షలాది ఉద్యోగుల ఆశలకు ఊపిరి పోశారు. ఎన్నో ఏళ్లుగా సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానం ప్రవేశపెట్టాలని నాయకులను, ప్రజాప్రతినిధులను అడుగుతున్నా పట్టించుకోలేదు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్ హామీ ఇవ్వడం అభినందనీయం. - సుజానేంద్ర, జూనియర్ అసిస్టెంట్, కలసపాడు పదవ రత్నంగా ప్రకటించాలి ఇప్పటికే వైఎస్ జగన్ నవరత్నాల పేరుతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కోసం సీపీఎస్‌ను రద్దు చేస్తానని చెప్పిన హామీని పదవ రత్నంగా పేర్కొనవచ్చు. సీపీఎస్ రద్దు చేస్తే రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపడమే. – లెక్కల జమాల్‌రెడ్డి, పీఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భరోసా కల్పించారు సీపీఎస్ స్కీమ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో వైఎస్ జగన్ భరోసా కల్పించేలా సానుకూల నిర్ణయంపై హామీ ఇవ్వడం హర్షనీయం. ఈ విషయంపై మిగతా పార్టీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. – మల్లు. రఘనాథరెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు జగన్‌పై నమ్మకం ఉంది అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను జగన్ రద్దు చేస్తారనే నమ్మకం ఉంది. అన్ని వర్గాల మేలు కోరే నాయకుడు కష్టాలు తెలుసుకుని స్పందిస్తారు. ఆ మేరకే జగన్ కూడా సంకల్పయాత్రలో హామీ ఇచ్చారు. – జనార్దన్‌రెడ్డి, ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు చొరవ చూపలేదు అధికారంలో ఉండటంతో పాటు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీపీఎస్ రద్దుకు చొరవ చూపలేదు. ఇటీవల తిరుపతిలో జరిగిన సమావేశంలో విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే కేంద్రం పరిధిలో ఉందని చెప్పి తప్పించుకున్నారు. జగన్ ప్రకటనను ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. – పీవీ రమణరెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
ఏసీబీకి చిక్కిన ఆర్టీసీ పీవో
మూడు రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనుండగా ఘటన ద్వారకానగర్ (విశాఖ దక్షిణం) : ఆర్టీసీ రీజినల్ కార్యాలయంలో పర్సనల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సుంకర మురళీమోహన్రావు రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే... ఆర్టీసీలో సూపర్వైజర్గా ఉద్యోగంలో చేరిన మురళీమోహన్రావు దశలవారీగా డిపో మేనేజర్‌గా పదోన్నతి పొందారు. కొన్నాళ్లపాటు మద్దిలపాలెం డిపో మేనేజర్‌గా పనిచేశారు. ఆ తర్వాత మూడేళ్ల క్రితం ద్వారకా బస్‌స్టేషన్‌లో ఉన్న ఆర్ఎం కార్యాలయానికి పర్సనల్ ఆఫీసరు (పీవో)గా బదిలీపై వచ్చారు. ఏడాది క్రితం నుంచి ఆర్టీసీ అధికారులు ప్రైవేటు బస్సుల నియంత్రణలో భాగంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు అప్పలరెడ్డి అనే వ్యక్తి నుంచి రెండు అద్దె కారులు తీసుకున్నారు. ఒక్కో కారు నెలకు 2 వేల కిలోమీటర్లు తిరగడానికి, రూ.28 వేల అద్దె చెల్లించే ఒప్పందంపై నడుపుతున్నారు. పరిధికి లోబడి కార్లు తిరగలేదంటూ కొద్దిరోజుల క్రితం ఆడిట్ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో మార్చి, ఏప్రిల్, మే నెలల అద్దె రూ.2.19 లక్షల చెల్లింపు నిలిపివేశారు. దీనిపై కొద్దిరోజుల నుంచి అధికారులకు, అద్దెకారుల యజమాని అప్పలరెడ్డికి మధ్య వివాదం నడుస్తోంది. పెండింగు బిల్లుల చెల్లింపుల కోసం చాన్నాళ్లుగా తిరుగుతున్న కార్ల యజమాని అప్పలరెడ్డిని పీవో మురళీమోహన్రావు రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో అందుకు అంగీకరించిన అప్పలరెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించడం... మంగళవారం ఆ సొమ్ము తీసుకుంటూ మురళీమోహన్రావు ఏసీబీకి చిక్కడం వరుసగా జరిగిపోయాయి. ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సీఐలు గణేష్, రమేష్, మూర్తితో పాటు సిబ్బంది దాడులు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 30న పీవో మురళీమోహన్రావు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇంతలో రూ.5 వేలు లంచం తీసుకుంటూ పీవో అనూహ్యంగా అవినీతి నిరోధకశాఖ అధికారులకు దొరికిపోవడంతో కార్యాలయంలో కలకలం రేగింది. ఏసీబీ దాడులతో కలకలం ఏసీబీ అధికారుల దాడులతో ఆర్టీసీ రీజినల్ కార్యాలయం ఉద్యోగుల్లో కలకలం రేగింది. ఆర్టీసీ కార్యాలయంలో ఇంత వరకు ఎవరూ ఏసీబీ అధికారులకు పట్టుబడలేదు. విశాఖ రీజినల్ కార్యాలయంలో ఇదే మొదటి కేసు కావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. డీవీఎం స్థాయి అధికారులు రీజినల్ కార్యాలయం వైపునకు వెళ్లలేదు. 2015లో విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్టీసీ డిపోలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ స్వీపర్ బిల్లు అమోదం కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఆఖరి దశలో అరదండాలు సాక్షి, విశాఖపట్నం : దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. వివిధ పదవులను చేపట్టారు. అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగారు. మరో మూడు రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయనను ఘనంగా సన్మానించి సాగనంపడానికి సాటి ఉద్యోగులు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలోనే చిన్నపాటి కక్కుర్తితో ఏసీబీ వలకు చిక్కారు. విశాఖ ఆర్టీసీ రీజినల్ కార్యాలయంలో పర్సనల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మురళీమోహన్రావు రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి జైలు కెళ్లాడు. దీంతో ఒక్కసారిగా కార్యాలయంలో కలకలం రేగింది. తనను ఏసీబీ అధికారులు చుట్టుముట్టడంతో పీవో మురళీమోహన్రావు షాక్‌కు గురయ్యారు. పదవీ విరమణ తర్వాత కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా విశ్రాంత జీవితం గడపాలని భావిస్తున్న తరుణంలో ఒక తప్పటడుగు వేసి జైలుపాలయ్యారు. బిల్లు కోసం ఇబ్బందులకు గురయ్యాను నాకు లారీలు ఉండేవి. ఆ వ్యాపారం దెబ్బతినడంతో లారీలు అమ్మేశాను. రెండు కారులను రీజినల్ కార్యాలయంలో అద్దెకు పెట్టాను. అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను. రూ.5వేలు లంచం ఇస్తేనే బిల్లు ఆమోదిస్తానని మురళీమోహన్రావు చెప్పడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. – సీహెచ్ అప్పలరెడ్డి, బాధితుడు, విశాఖపట్నం -
నా క్లాక్ మారలేదు...వాక్ మారలేదు..!
అవిశ్రాంతం అరవై తర్వాత ‘బాల నటుడిగా సినిమా తెర మీద నటించిన దానికంటే ఎక్కువగా జీవితంలో నటించాను’ - ఇంత నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పగలిగిన వ్యక్తి మోహన్‌కందా. 1968 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఎఎస్ అధికారికి ఇప్పుడు 69 ఏళ్లు. సమైక్యాంధ్రప్రదేశ్‌కి చీఫ్ సెక్రటరీ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ‘ఉద్యోగ విరమణ’ తర్వాత జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వైనం, దినచర్య వివరాలు ఆయన మాటల్లోనే... ఉద్యోగంలో ఉన్నప్పుడు- విరమణ తర్వాత, దేశంలో ఉన్నప్పుడు - విదేశాల్లో ఉన్నప్పుడు, శీతాకాలం- ఎండాకాలం అనే తేడాలేవీ నా వ్యక్తిగత దైనందిన జీవితంలో కనిపించవు. ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవడం, వ్యాయామం, స్నానం, పూజ, బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే సమయాల వరకు ఎటువంటి మార్పు లేదు. అప్పట్లోలా ఆలస్యం అవుతుందేమోననే ఆందోళన లేకపోయినప్పటికీ సమయం మునుపటికంటే మించడం లేదు. నా క్లాక్ అలా సెట్ అయిపోయినట్లుంది. ఈ రోజంతా ఖాళీ అనే పరిస్థితి ఇంతవరకు నేను రానివ్వలేదు. ఇప్పుడు కూడా నాకిష్టమైన పనులతో రోజంతా తీరికలేకుండా గడుపుతున్నాను. ఉద్యోగంలో ఉన్నప్పటిలాగానే దేహాన్ని, మెదడుని ఖాళీగా ఉంచడం లేదు. ప్రయాణానికి రెలైక్కేటప్పుడే గమ్యం చేరాక రైలు దిగాలని మనకు తెలుసు. ఉద్యోగ విరమణ కూడా అలాంటిదే. రైలు దిగిన తర్వాత మనం నిర్దేశించుకున్న పనులు చక్కబెట్టుకున్నట్లే ఉద్యోగ విరమణ తరువాత చేయాలనుకున్న పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పటి పని నా నిర్ణయమే... ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏం చేయాలో నా ప్రమేయం లేకుండానే నిర్ణయమై ఉంటాయి. వాటిని అమలు చేయడం, ఆచరణలో నేర్పరితనంతో నాకంటూ ఒక తరహా పనితీరును వ్యక్తం చేయడమే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలనేది నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం నేను రోజుకు ఒక గంట బ్రిడ్జి గేమ్ మీద పుస్తకాలతో గడుపుతాను. నాకిష్టమైన కాస్మాలజీ అధ్యయనంలో మునిగిపోతాను. అలాగే నాకు ఇష్టమైనవి, ఉద్యోగంలో ఉన్నప్పుడు చదవడానికి సమయం చాలక పక్కన పెట్టిన ఐన్స్టీ పరిశోధన ... ‘గాడ్స్ ఓన్ ఈక్వేషన్’ నంబర్ థియరీలో అద్భుతమైన సమీకరణం మీద రాసిన... ఫెర్మాస్ లాస్ట్ థీరమ్’ వంటి పాతిక పుస్తకాలు చదివాను. అలాగే నాకు తెలుసుకోవాలని ఉన్న ప్రతి అంశాన్నీ విస్తృతంగా తెలుసుకుంటూ, ఆ విజ్ఞానాన్ని ఇతరులకు పంచుతున్నాను. గతంలో నేను ‘ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్’ అంశం మీద సివిల్స్ విద్యార్థులకు పాఠాలు చెప్పేవాణ్ణి. ప్రతి క్లాసుకీ తగినంత విషయసేకరణకు చాలా శ్రమించి క్రోడీకరించాను. ఆ తర్వాత దానిని ఓ పుస్తకంగా తెస్తే చాలా మందికి అందుబాటులోకి వస్తుందని పుస్తకం రాశాను. సహకార వ్యవస్థ మీద ఓ పుస్తకం రాశాను. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద రాస్తున్నాను. ప్రస్తుతం ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కార్యాలయానికి, వ్యవసాయరంగంలోనూ, పాలనలోనూ, విపత్తుల నిర్వహణలోనూ, అవసరమైన కార్యాచరణ మీద కొత్త ఆలోచనలను పంపిస్తున్నాను. నా జీవితంలోని కీలకమైన సంఘటనలను, ఉద్యోగ జీవితాన్ని ‘మోహన మకరందం’ పేరుతో రాశాను. రిటైరయిన తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో ఐదేళ్లపాటు సభ్యుడిగా చేశాను. ప్రతిదీ సాధ్యమే! మనిషి జీవితంలో ఫలానా పని అసాధ్యం అని ఏదీ ఉండదు. తప్పనిసరి అంటే చేసి తీరుతారెవరైనా. చేయకపోయినా ఫరవాలేదనుకుంటే చేయరు. నా మట్టుకు ఇంత వరకు అసాధ్యం అని వదిలేసిన పని ఒక్కటీ లేదు. ఎవరికైనా సరే ‘ఏమి’ చేయాలనే విషయంలో స్పష్టత వస్తే ‘ఎలా’ చేయాలనే ప్రణాళిక దానంతట అదే వస్తుంది. ఏం చేయాలన్నది తెలియకే చాలా మంది అయోమయంలో ఉంటారు. ముఖ్యంగా పదవీవిరమణ తర్వాత జీవితాన్ని ఎలా గడపాలంటూ ఆందోళన పడుతుంటారు. పైగా ప్రసారమాధ్యమాల్లో కూడా ‘విశ్రాంత’ అనే పదం వాడుతుంటారు. ఆ పదంతోనే చాలా మంది ఇక చేయాల్సిందేమీ లేదనే భావనలోకి వచ్చేస్తున్నారు. ఇది విశ్రాంత జీవనం కాదు, ఉద్యోగ విరమణ తర్వాత జీవితం. ఉద్యోగానికి ముందు ఆనందంగా జీవించలేదా? ఉద్యోగ విరమణ తర్వాత కూడా అంతే! తేడా అంతా ఉద్యోగానికి ముందు జీవితం నేర్చుకోవడానికి వినియోగిస్తాం, ఉద్యోగ విరమణ తర్వాత నేర్చుకున్న అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని మేళవించి చక్కటి వ్యాపకాలను నిర్దేశించుకుంటాం. నేనదే చేస్తున్నాను. ప్రణాళిక ఉండాలి! పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇలా ప్రతి దానికీ ఓ ప్రణాళిక పెట్టుకుంటాం. అలాగే ఉద్యోగ విరమణ తర్వాత జీవితానికీ ఓ ప్రణాళిక ఉండాల్సిందే. జీవితంలో మన ముందు ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో దేనిని ఎంచుకోవాలనే పరిణతి ఈ వయసుకి వచ్చి తీరాలి. ఇన్నేళ్ల అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని, శక్తిని కలిపి మనం ఏం చేయగలమో దానిని ఎంచుకునే అవకాశం ఎప్పుడూ మన ముందు ఉంటుంది. దానినే పట్టుకుని ముందుకు పోవాలి తప్ప... దారీ తెన్నూ లేకుండా పోకూడదు. ఒక్కో సి.ఎం. ఒక్కో తీరు... నా సర్వీస్‌లో ఎందరో సీఎంల దగ్గర పనిచేశాను. నా పని తీరుతో వారికి ఇబ్బంది కలగనివ్వలేదు. నా చుట్టుపక్కల అందరినీ సౌకర్యంగా ఉండేటట్లు చూడడంలో సఫలమయ్యాను. అలాగే ఇంట్లో కూడా. నా భార్య ఉషకు, కానీ పిల్లలకు కానీ నా మీద పెద్ద కంప్లయింట్లు ఉండవు. నేను నిద్రపోయేటప్పుడు నా కోసం వచ్చిన ఫోన్‌కాల్స్‌కు జవాబు చెప్పాల్సి రావడాన్ని మాత్రం మా ఆవిడ దెప్పుతూ ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి నుంచి తెల్లవారు జామున కాల్స్ వచ్చేవి, ఒక ముఖ్యమంత్రి నుంచి అర్ధరాత్రి వరకు కాల్స్ వస్తూ ఉండేవి. నన్ను నిద్రలేపకుండా వాటిని బదులు చెప్పడం కోసం తన నిద్ర పాడయ్యేదని ఉష ఇప్పటికీ గుర్తు చేస్తుంటుంది. ఉద్యోగ జీవితంలో నన్ను ఆదేశించే పై అధికారులు, అమాత్యులను నొప్పించకుండా నేను నొచ్చుకోకుండా మెలిగాను. వృత్తిపరమైన ఆదేశాలను ఎంత నిబద్ధతతో అమలు చేశానో, వ్యక్తిగత ఆదేశాలను అంతే సున్నితంగా తోసివేస్తూ వెన్ను వంచకుండా నా వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నాను. ‘నేను’ అంటే మోహన్ కందా అని మర్చిపోకుండా జీవించాను, జీవిస్తున్నాను. -
కలెక్టర్ల డ్రైవర్.. అజీజ్
- పలుసార్లు ఉత్తమ డైవర్‌గా మన్ననలు - నేడు ఉద్యోగ విరమణ ప్రగతినగర్: అజీజ్.. జిల్లాలో పనిచేసిన కలెక్టర్లందరికీ ఈ పేరు సుపరిచితం. ఎవరాయన.. ఏంటీ ఆయన ప్రత్యేకత.. అంటారా..? ఆయన కలెక్టర్ కారు డ్రైవర్. ఓస్ అంతేనా..! అని అనుకోకండి. ఒకటి కాదు.. రెండు కాదు.. ముప్పైఏళ్లుగా ఎలాంటి చిన్నపొరపాటు కూడా లేకుండా వాహనాన్ని నడిపిన ఘనత ఆయనది. అలాగే 20మంది కలెక్టర్లకు డ్రైవర్‌గా ఉన్న రికార్డు కూడా ఆయనదే. ప్రాణపాయం నుంచి ఓ కలెక్టర్ ప్రాణాలూ కాపాడారు. ఉత్తమ డ్రైవర్‌గా ప్రశంసా పత్రాలూ అందుకున్న ఆయన ఆదివారం ఉద్యోగ విరమణ పొందుతున్నారు. అలా ఉద్యోగంలోకి జిల్లాకేంద్రంలోని అజ్మీకాలనీకి చెందిన అజీజ్ మియాకు భార్య షహనాజబేగం, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఇంటర్ వరకు చదువుకున్న తర్వాత ఉపాధి కోసం చాలాకాలం ప్రయత్నాలు చేశారు. కానీ తనకు తగ్గట్లు ఏ ఉద్యోగమూ దొరకలేదు. ఒకరోజు జిల్లా ఉపాధి కల్పనాధికారి వాహనం చెడిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న అజీజ్ ఆ వాహనాన్ని చెక్ చేసి, మరమ్మతు చేశారు. అప్పటి నుంచి అజీజ్ అధికారుల దృష్టిలో పడ్డారు. అప్పటి జిల్లా కలెక్టర్ అజేయంద్రపాల్ ఏకంగా ఆయనకు తన డ్రైవ ర్గా పోస్టింగ్ ఇచ్చారు. అలా 1987లో కలెక్టర్ కారు డ్రైవర్‌గా ప్రస్థానం ప్రారంభించిన అజీజ్మియా నేటి వరకు కొనసాగారు. అనంతరం జిల్లా కలెక్టర్లుగా ఉన్న వెంకటేశ్వర్రావు, బినయ్‌కుమార్, చక్రపాణి, తుకారాం, మన్మోహన్సింగ్, బి.ఎం.గోనెల, అభయ్‌త్రిపాఠి, శశాంక్‌గోయల్, అశోక్‌కుమార్, డి.వి.రాయుడు, వెంకటరమణారెడ్డి, ప్రవీణ్ కుమార్, రామాంజనేయులు, సునీత, వరప్రసాద్, క్రిస్టినా జెడ్ చోంగ్తుల డ్రైవర్‌గా ఉన్నారు. అనంతరం ఆరునెలలపాటు ఇన్చార్జి కలెక్టర్‌గా జేసి హర్షవర్దన్, అనంతరం కలెక్టర్ ఏఎస్.ప్రద్యుమ్న, ప్రస్తుత కలెక్టర్ రొనాల్డ్‌రాస్ డ్రైవర్‌గా పనిచేశారు. అజీజ్మియా జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. గోనెల ప్రాణాలు కాపాడి 1996లో కలెక్టర్‌గా ఉన్న ఆర్.ఎం.గోనెల ఒకసారి విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్‌కు బయలు దేరారు. కలెక్టర్ వాహనం ఇందల్వాయి-రాంచంద్రపల్లి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మావోయిస్టులు దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైనా కారు డ్రైవర్ అజీజ్ వాహనాన్ని వేగంగా వెనక్కు తిప్పారు. మావోయిస్టులకు చిక్కకుండా కలెక్టర్‌ను సురక్షితంగా నిజామాబాద్‌కు తీసుకువచ్చారు. అలా అజీజ్ మియా పలువురు కలెక్టర్ల చేతుల మీదుగా ఉత్తమ డ్రైవర్‌గా ప్రశంసలు అందుకున్నారు. -
పదోన్నతుల ఊసేదీ ?
ఖమ్మం, న్యూస్‌లైన్: ఉపాధ్యాయుల పదోన్నతులపై జిల్లాలో నీలి నీడలు వీడడం లేదు. ఏజెన్సీ ప్రాంత గిరిజన ఉపాధ్యాయులు, మైదాన ప్రాంత ఉపాధ్యాయుల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఎవరికి వారు పట్టు వీడకుండా కోర్టులను ఆశ్రయించడంతో ఈ సమస్య నానాటికీ జఠిలంగా మారింది. గిరిజన, గిరిజనేతరులకు సంబంధించిన విషయం కావడంతో దీనిపై నిర్ణయం తీసుకునేందుకు అధికారులు, నాయకులు వెనకడుగు వేస్తున్నారు. మధ్యేమార్గంగా చర్చలు జరిపే నాథుడే కరువయ్యాడు. దీంతో ఉద్యోగ విరమణ నాటికైనా పదోన్నతి పొందుతామని భావించిన పలువురు ఉపాధ్యాయుల ఆశలు అడియాసలే అవుతున్నాయి. జిల్లాలో మొత్తం 46 మండలాల్లో 29 ఏజెన్సీలో, 17 మండలాలు మైదాన ప్రాంతాల్లో ఉండగా, 11,895 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇందులో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు 77 మంది పీజీహెచ్ఎంలు, 1229 మంది ఎస్ఏలు, 1309 మంది ఎస్జీటీ కేటగిరీలకు చెందినవారున్నారు. ఆ ప్రాంతాలకే చెందిన గిరిజనులు 64 మంది పీజీ హెచ్ఎంలు, 1,192 మంది ఎస్ఏలు, 3,461 ఎస్జీటీలు ఉన్నారు. వీరితోపాటు మైదానప్రాంతంలో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, పీజీ హెచ్ఎంలు మొత్తం 4,563 మంది ఉన్నారు. 2000 సంవత్సరానికి ముందు జరిగిన డీఎస్సీ నియామకాల్లో జిల్లా యూనిట్‌గా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేవారు. ఆ తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఖాళీలను ఆ ప్రాంతంలోని గిరిజనులతోనే భర్తీ చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేయడంతో ప్రభుత్వం జీవో నంబర్ 3ను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతి డీఎస్సీలో ఏజెన్సీ ప్రాంత ఖాళీలను అక్కడి గిరిజనులతో, మైదాన ప్రాంత ఖాళీలను జిల్లా యూనిట్‌గా భర్తీ చేస్తున్నారు. అయితే ఉపాధ్యాయ పదోన్నతుల్లో మాత్రం 2012 జనవరి వరకు జిల్లా యూనిట్‌గానే చేపట్టేవారు. కాగా, ఏజెన్సీ ప్రాంత పదోన్నతులు అక్కడ పనిచేస్తున్న గిరిజన ఉపాధ్యాయులకే ఇవ్వాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేయడంతో 2012 ఫిబ్రవరిలో ఏజెన్సీ ప్రాంతంలో అక్కడి గిరిజనులకు, మైదాన ప్రాంతంలో ఇతర ఉపాధ్యాయులకు పదోన్నతుల కల్పించారు. ఆ తర్వాత అదే ఏడాది జూలైలోనూ వేర్వేరుగా పదోన్నతులు చేపట్టగా గిరిజన ఉపాధ్యాయుల మధ్య సర్వీస్ విషయంలో తలెత్తిన వివాదంతో పలు విభాగాల ప్రమోషన్లు నిలిచిపోయాయి. అనంతరం డీఈవోలు మారడంతో తిరిగి 2013 ఆగస్టులో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించగానే జిల్లా యూనిట్‌గా చేపట్టాలని జనరల్ టీచర్స్ ఫోరం అధ్వర్యంలో ఏపీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో జిల్లాను యూనిట్‌గా తీసుకొని పదోన్నతులు జరపాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ విషయం తెలుసుకున్న గిరిజన సంఘాల నాయకులు జీవో నంబర్ 3 ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఉన్న పదోన్నతులు ఏజెన్సీ గిరిజనులకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పదోన్నతుల ప్రక్రియను నిలిపి వేశారు. ఇలా..ఉద్యోగ విరమణ నాటికైనా పదోన్నతి వస్తుందని ఆశపడిన పలువురు ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. మధ్యే మార్గమే శరణ్యం... ఇటు ఏజెన్సీ ప్రాంత గిరిజనులు, అటు మైదాన ప్రాంత ఉపాధ్యాయులకు మధ్యేమార్గంగా నిర్ణయం తీసుకుంటే తప్ప పదోన్నతుల ప్రక్రియ కొలిక్కివచ్చే అవకాశం లేదు. పదోన్నతులు చేపట్టాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేయడంతో జిల్లాలోని ప్రత్యేక పరిస్థితిని డీఈవో ఉన్నతాధికారులకు వివరించారు. జిల్లాలోని ఉపాధ్యాయుల వివరాలను అందజేశారు. అయితే జిల్లాతోపాటు గిరిజన జనాబా అధికంగా ఉన్న అదిలాబాద్‌లోనూ ఇదే పరిస్థితి ఉందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. దీనికి పరిష్కారం చూపకపోతే పలువురు ఉపాధ్యాయులు పదోన్నతితోపాటు, లక్షల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. విద్య, న్యాయ, గిరిజన, సాధారణ పరిపాలన శాఖల అధికారులు, నాయకులతో ముడిపడిన వ్యవహారం కావడంతో దీనిని సున్నితంగా పరిష్కరించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఎవరికీ అన్యాయం జరుగకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఖాళీలను 70 శాతం ఏజెన్సీ వారికి, 30 శాతం మైదాన ప్రాంతం వారికి కేటాయిస్తే బాగుంటుందని పలు ఉపాధ్యాయ సంఘాలు సూచించనట్లు సమాచారం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వివాదంలోకి వెళ్లేందుకు రాజకీయ పార్టీలు సాహసం చేయకపోవడంతో ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని పలువురు అంటున్నారు.