కలెక్టర్‌ల డ్రైవర్.. అజీజ్
- పలుసార్లు ఉత్తమ డైవర్‌గా మన్ననలు
- నేడు ఉద్యోగ విరమణ
ప్రగతినగర్: అజీజ్.. జిల్లాలో పనిచేసిన కలెక్టర్లందరికీ ఈ పేరు సుపరిచితం. ఎవరాయన.. ఏంటీ ఆయన ప్రత్యేకత.. అంటారా..? ఆయన కలెక్టర్ కారు డ్రైవర్. ఓస్ అంతేనా..! అని అనుకోకండి. ఒకటి కాదు.. రెండు కాదు.. ముప్పైఏళ్లుగా ఎలాంటి చిన్నపొరపాటు కూడా లేకుండా వాహనాన్ని నడిపిన ఘనత ఆయనది. అలాగే 20మంది కలెక్టర్లకు డ్రైవర్‌గా ఉన్న రికార్డు కూడా ఆయనదే. ప్రాణపాయం నుంచి ఓ కలెక్టర్ ప్రాణాలూ కాపాడారు. ఉత్తమ డ్రైవర్‌గా ప్రశంసా పత్రాలూ అందుకున్న ఆయన ఆదివారం ఉద్యోగ విరమణ పొందుతున్నారు.
అలా ఉద్యోగంలోకి
జిల్లాకేంద్రంలోని అజ్మీకాలనీకి చెందిన అజీజ్ మియాకు భార్య షహనాజబేగం, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఇంటర్ వరకు చదువుకున్న తర్వాత ఉపాధి కోసం చాలాకాలం ప్రయత్నాలు చేశారు. కానీ తనకు తగ్గట్లు ఏ ఉద్యోగమూ దొరకలేదు. ఒకరోజు జిల్లా ఉపాధి కల్పనాధికారి వాహనం చెడిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న అజీజ్ ఆ వాహనాన్ని చెక్ చేసి, మరమ్మతు చేశారు. అప్పటి నుంచి అజీజ్ అధికారుల దృష్టిలో పడ్డారు. అప్పటి జిల్లా కలెక్టర్ అజేయంద్రపాల్ ఏకంగా ఆయనకు తన డ్రైవ ర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. అలా 1987లో కలెక్టర్ కారు డ్రైవర్‌గా ప్రస్థానం ప్రారంభించిన అజీజ్‌మియా నేటి వరకు కొనసాగారు.
అనంతరం జిల్లా కలెక్టర్‌లుగా ఉన్న వెంకటేశ్వర్‌రావు, బినయ్‌కుమార్, చక్రపాణి, తుకారాం, మన్‌మోహన్‌సింగ్, బి.ఎం.గోనెల, అభయ్‌త్రిపాఠి, శశాంక్‌గోయల్, అశోక్‌కుమార్, డి.వి.రాయుడు, వెంకటరమణారెడ్డి, ప్రవీణ్ కుమార్, రామాంజనేయులు, సునీత, వరప్రసాద్, క్రిస్టినా జెడ్ చోంగ్తుల డ్రైవర్‌గా ఉన్నారు. అనంతరం ఆరునెలలపాటు ఇన్‌చార్జి కలెక్టర్‌గా జేసి హర్షవర్దన్, అనంతరం కలెక్టర్ ఏఎస్.ప్రద్యుమ్న, ప్రస్తుత కలెక్టర్ రొనాల్డ్‌రాస్ డ్రైవర్‌గా పనిచేశారు. అజీజ్‌మియా జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు.
గోనెల ప్రాణాలు కాపాడి
1996లో కలెక్టర్‌గా ఉన్న ఆర్.ఎం.గోనెల ఒకసారి విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్‌కు బయలు దేరారు. కలెక్టర్ వాహనం ఇందల్వాయి-రాంచంద్రపల్లి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మావోయిస్టులు దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైనా కారు డ్రైవర్ అజీజ్ వాహనాన్ని వేగంగా వెనక్కు తిప్పారు. మావోయిస్టులకు చిక్కకుండా కలెక్టర్‌ను సురక్షితంగా నిజామాబాద్‌కు తీసుకువచ్చారు. అలా అజీజ్ మియా పలువురు కలెక్టర్ల చేతుల మీదుగా ఉత్తమ డ్రైవర్‌గా ప్రశంసలు అందుకున్నారు.