బాల్కొండ(నిజామాబాద్): భార్యపై కోపంతో కన్న కూతురిని కడతేర్చాడో తండ్రి. అల్లారు ముద్దుగా పెంచిన చేతులతోనే క్షణికావేశంతో మంటల్లోకి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాల్కొండ పోలీస్ స్టేషన్‌లో ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్‌రావు శనివారం కేసు వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ కాలనీకి చెందిన కడమంచి కాశీరాం, పోసాని దంపతులు. వీరికి సితారి సమ్మక్క (10), సితారి సారక్క(9) అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
కాశీరాం కుటుంబంతో కలిసి బతుకుదెరువు కోసం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ధని గ్రామానికి కొంతకాలం క్రితం వలస వెళ్లారు. చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించే వారు మే 11న మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామానికి వచ్చారు. అదే రోజు భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో పోసాని కనిపించకుండా పోయింది. దాంతో తీవ్ర ఆగ్రహంతో కాశీరాం తన ఇద్దరు పిల్లలను చంపాలని నిర్ణయించుకున్నాడు. కట్టెలకు నిప్పు పెట్టి, ఆ మంటల్లో పిల్లల దుస్తులను, చిన్న కూతురు సారక్కను తోసేసాడు.
పెద్ద కూతురు పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. చిన్నారి అరవడంతో స్థానికులు గమనించి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 10న సారక్క మృతి చెందింది. శనివారం ఉదయం పోచంపాడ్ కూడలి వద్ద నిందితుడు కాశీరాం పోలీసులకు దొరకడంతో రిమాండుకు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment