ఏసీబీకి చిక్కిన ఆర్టీసీ పీవో
మూడు రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనుండగా ఘటన
ద్వారకానగర్ (విశాఖ దక్షిణం) : ఆర్టీసీ రీజినల్ కార్యాలయంలో పర్సనల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సుంకర మురళీమోహన్‌రావు రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే... ఆర్టీసీలో సూపర్‌వైజర్‌గా ఉద్యోగంలో చేరిన మురళీమోహన్‌రావు దశలవారీగా డిపో మేనేజర్‌గా పదోన్నతి పొందారు. కొన్నాళ్లపాటు మద్దిలపాలెం డిపో మేనేజర్‌గా పనిచేశారు. ఆ తర్వాత మూడేళ్ల క్రితం ద్వారకా బస్‌స్టేషన్‌లో ఉన్న ఆర్‌ఎం కార్యాలయానికి పర్సనల్ ఆఫీసరు (పీవో)గా బదిలీపై వచ్చారు.
ఏడాది క్రితం నుంచి ఆర్టీసీ అధికారులు ప్రైవేటు బస్సుల నియంత్రణలో భాగంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు అప్పలరెడ్డి అనే వ్యక్తి నుంచి రెండు అద్దె కారులు తీసుకున్నారు. ఒక్కో కారు నెలకు 2 వేల కిలోమీటర్లు తిరగడానికి, రూ.28 వేల అద్దె చెల్లించే ఒప్పందంపై నడుపుతున్నారు. పరిధికి లోబడి కార్లు తిరగలేదంటూ కొద్దిరోజుల క్రితం ఆడిట్ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో మార్చి, ఏప్రిల్, మే నెలల అద్దె రూ.2.19 లక్షల చెల్లింపు నిలిపివేశారు. దీనిపై కొద్దిరోజుల నుంచి అధికారులకు, అద్దెకారుల యజమాని అప్పలరెడ్డికి మధ్య వివాదం నడుస్తోంది.
పెండింగు బిల్లుల చెల్లింపుల కోసం చాన్నాళ్లుగా తిరుగుతున్న కార్ల యజమాని అప్పలరెడ్డిని పీవో మురళీమోహన్‌రావు రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో అందుకు అంగీకరించిన అప్పలరెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించడం... మంగళవారం ఆ సొమ్ము తీసుకుంటూ మురళీమోహన్‌రావు ఏసీబీకి చిక్కడం వరుసగా జరిగిపోయాయి. ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సీఐలు గణేష్, రమేష్, మూర్తితో పాటు సిబ్బంది దాడులు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 30న పీవో మురళీమోహన్‌రావు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇంతలో రూ.5 వేలు లంచం తీసుకుంటూ పీవో అనూహ్యంగా అవినీతి నిరోధకశాఖ అధికారులకు దొరికిపోవడంతో కార్యాలయంలో కలకలం రేగింది.
ఏసీబీ దాడులతో కలకలం
ఏసీబీ అధికారుల దాడులతో ఆర్టీసీ రీజినల్ కార్యాలయం ఉద్యోగుల్లో కలకలం రేగింది. ఆర్టీసీ కార్యాలయంలో ఇంత వరకు ఎవరూ ఏసీబీ అధికారులకు పట్టుబడలేదు. విశాఖ రీజినల్ కార్యాలయంలో ఇదే మొదటి కేసు కావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. డీవీఎం స్థాయి అధికారులు రీజినల్ కార్యాలయం వైపునకు వెళ్లలేదు. 2015లో విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్టీసీ డిపోలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ స్వీపర్ బిల్లు అమోదం కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ఆఖరి దశలో అరదండాలు
సాక్షి, విశాఖపట్నం : దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. వివిధ పదవులను చేపట్టారు. అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగారు. మరో మూడు రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయనను ఘనంగా సన్మానించి సాగనంపడానికి సాటి ఉద్యోగులు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలోనే చిన్నపాటి కక్కుర్తితో ఏసీబీ వలకు చిక్కారు.
విశాఖ ఆర్టీసీ రీజినల్ కార్యాలయంలో పర్సనల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మురళీమోహన్‌రావు రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి జైలు కెళ్లాడు. దీంతో ఒక్కసారిగా కార్యాలయంలో కలకలం రేగింది. తనను ఏసీబీ అధికారులు చుట్టుముట్టడంతో పీవో మురళీమోహన్‌రావు షాక్‌కు గురయ్యారు. పదవీ విరమణ తర్వాత కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా విశ్రాంత జీవితం గడపాలని భావిస్తున్న తరుణంలో ఒక తప్పటడుగు వేసి జైలుపాలయ్యారు.
బిల్లు కోసం ఇబ్బందులకు గురయ్యాను
నాకు లారీలు ఉండేవి. ఆ వ్యాపారం దెబ్బతినడంతో లారీలు అమ్మేశాను. రెండు కారులను రీజినల్ కార్యాలయంలో అద్దెకు పెట్టాను. అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను. రూ.5వేలు లంచం ఇస్తేనే బిల్లు ఆమోదిస్తానని మురళీమోహన్‌రావు చెప్పడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. – సీహెచ్ అప్పలరెడ్డి, బాధితుడు, విశాఖపట్నం