సాక్షి, కోనసీమ జిల్లా: జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో మామూళ్ల కలకలం రేపుతోంది. ప్రతి పనికి కార్యాలయంలో మామూళ్లు వసూలు చేస్తున్నారంటూ వాట్సాప్‌లో మెడికల్ ఆఫీసర్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఉన్నతాధికారులు స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై డీఎంహెచ్‌వో దుర్గారావు దొర ఆరా తీశారు. శ్రీధర్ అనే క్లర్క్ మామూళ్లు వసూలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది.
మెడికల్ ఆఫీసర్లను డీఎంహెచ్‌వో తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఆర్‌లో ఎంట్రీలు నమోదు చేసేందుకు, ప్రసూతి సెలవులకు, నాలుగు నుంచి పదివేల రూపాయలు చొప్పున వసూలు చేసినట్టు సమాచారం. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్‌వో తెలిపారు.
కాగా, రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖకు అవినీతి రోగం పట్టుకుంది. లంచాలు మరిగిన కొందరు అధికారులు సొంత శాఖ ఉద్యోగులనే డబ్బు కోసం వేధింపులకు గురిచేస్తున్న వ్యవహారం ఆ శాఖలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఉన్నతాధికారుల అనుమతుల్లేకుండా జిల్లాల్లో అనధికార డిప్యుటేషన్‌ల్లోనూ డీఎంహెచ్‌వోలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అనంతపురం జిల్లాలో 20 మందికిపైగా ఉద్యోగులు డీఎంహెచ్‌వో కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులందాయి. పనిచేయాల్సిన చోట కాకుండా జిల్లా కేంద్రంలో కొనసాగడానికి వీరు పెద్ద ఎత్తున ఓ ఉన్నతాధికారికి లంచాలు ముట్టజెప్పినట్టు విమర్శలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
గుంటూరు డీఎంహెచ్‌వో ఆఫీస్‌లోనూ అధికారుల అనుమతుల్లేకుండానే కొందరు శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. అర్బన్ పీహెచ్‌సీల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు,చిరుద్యోగులను క్లర్కులుగా కొనసాగిస్తూ వారి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment