సాక్షి, కోనసీమ జిల్లా: జగ్గన్నతోట ప్రభల తీర్థం(Jagganna Thota Prabhala Theertham)లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్ల బండ్లు(Bullock carts) జనంలోకి దూసుకెళ్లడంతో బాలుడు సహా ముగ్గురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కూటమి నేతల కుటుంబ సభ్యుల కోసం ఎడ్ల బండ్లు ఏర్పాటు చేశారు. జనం నడవటానికే ఖాళీ లేని చోట ఎడ్ల బండ్లను ఏర్పాటు చేయడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, కోనసీమలో సంక్రాంతి నుంచి మక్కనుమ తరువాత రోజు వరకూ అన్ని మండలాల్లో ప్రభల తీర్థాలు జరుగుతాయి. చిన్నా పెద్దా అన్నీ కలిపి సుమారు 84 వరకూ ప్రభల తీర్థాలు నిర్వహిస్తారని అంచనా. సంక్రాంతి రోజున జరిగే తొలి ప్రభల తీర్థం కొత్తపేటదే. కనుమ రోజున నిర్వహించే.. మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి ప్రత్యేకత ఉంది. కనుమ రోజున జరిగే తీర్థంలో 11 గ్రామాలకు చెందిన ప్రభలు ఈ తీర్థానికి తరలివస్తాయి.
మొసలపల్లి భోగేశ్వరస్వామి, గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వరస్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామిలు జగ్గన్నతోటలో సమావేశమై లోక కల్యాణార్థం చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఇదీ చదవండి: నెమలి ‘పుంజు’ తడాఖా.. పందెంలో ‘కోటి’ గెలిచిన కోడి
గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు ప్రభలు జగ్గన్నతోటను ఆనుకుని ఉండే ఎగువ కౌశికను దాటుకుని వచ్చే తీరు నయనానందకరంగా ఉంటుంది. తీర్థానికి చాలా మంది ఇప్పటికీ గూడు బండ్లపై రావడం సంప్రదాయమే. ఈ తీర్థానికి 50 వేల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు. వాకలగరువు సోమేశ్వరస్వామి, తొండవరం ఉమా తొండేశ్వరస్వామి, గున్నేపల్లి రామలింగేశ్వరస్వామి ప్రభలు 45 అడుగులు, 43 అడుగుల ఎత్తున నిర్మిస్తారు.
మామిడికుదురు శివారు కొర్లగుంటలో జరిగిన ఈ తీర్థానికి సైతం అరుదైన గుర్తింపు ఉంది. ఇక్కడ ప్రభలు పంట కాలువలు, పచ్చని పొలాల మధ్య నుంచి తరలి వస్తుంటాయి. తీర్థానికి మామిడికుదురు, నగరం, పాశర్లపూడి, ఈదరాడ, పెదపట్నం గ్రామాల నుంచి 17 ప్రభలు వస్తాయి. పెదపట్నం నుంచి 12 ప్రభలు కొర్లగుంట తీర్థానికి రావడం గమనార్హం. వీటితోపాటు అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, అయినవిల్లి, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో పలుచోట్ల ప్రభల తీర్థాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment