ప్రజల సంక్షేమం కోసం, పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ప్రతీ రూపాయిలో.. చివరకు వాళ్ల దగ్గరకు చేరేది కేవలం 15 పైసలే!. అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల కిందట.. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పిన మాట ఇది. ఈ మాట ఇవాళ్టికీ ఎన్నికల టైంలలో కొందరు నేతల నోటి వెంట వినాల్సి వస్తోంది. అంటే.. అప్పటి నుంచి ఇప్పటిదాకా పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదా?.
సమాజాన్ని పట్టి పీడించే సమస్యలంటూ అవినీతి, లంచగొండితనం మీద సినిమాలు తీసే దర్శకులు కూడా.. క్లైమాక్స్‌లో వాటికి ఓ సరైన ముగింపు చూపలేకపోతున్నారు. అందుకు కారణం.. జనం అవసరాలు అంతలా ఉండడం. వాటిని ఆసరాగా చేసుకుని కొంతమంది అత్యాశకు పోతున్నారు. వేలు, లక్షల్లో వేతనాలు వస్తున్నా.. చాలదన్నట్లుగా పక్కచూపులు చూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. అయితే.. ఇలాంటి వాటికి తావులేకుండా.. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ(డీబీటీ)లాంటి ఆలోచనలు చాలావరకు ఊరట ఇస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే..
👉దేశంలోని మెజార్టీ కంపెనీలు ప్రభుత్వ అధికారులకు ఏదో ఒక దశలో లంచాలు ఇచ్చామని ఒప్పుకున్నాయి. ఇందుకు సంబంధించిన విస్తుపోయే వివరాలు.. ఓ సర్వే ద్వారా వెల్లడయ్యాయి.
👉సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ సర్వే ప్రకారం.. గత ఏడాది కాలంలో ఒక్కసారైనా లంచం ఇచ్చామని మనదేశంలో సుమారు 66 శాతం కంపెనీలు తెలిపాయి. బలవంతంగా లంచం ఇవ్వాల్సి వచ్చిందని 54 శాతం బిజినెస్‌లు, పనులు వేగంగా పూర్తి చేసేందుకు లంచం ఇవ్వడానికి వాలంటరీగా ముందుకొచ్చామని 46 శాతం బిజినెస్‌లు ఒప్పుకున్నాయి.
👉తూనికలు-కొలతలు, ఔషధాలు, ఆరోగ్యం.. ఈ విభాగాలు అత్యంత అవినీతిమయంగా మారాయి. ఈ విభాగాలకు సంబంధించిన ప్రతీ నాలుగింటిలో ముగ్గురు తప్పనిసరిగా లంచాలు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఇక..
👉మొత్తం 159 జిల్లాల్లోని కంపెనీల అభిప్రాయాలను సేకరించి ఈ వివరాలను బయటపెట్టింది. ఈ సర్వే కోసం 18 వేల రెస్పాన్స్‌లను సేకరించింది. ఇంకా ఈ సర్వే రిపోర్ట్‌లో.. ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లతో డీల్ చేస్తున్నప్పుడు పర్మిట్స్ పొందడానికి, సప్లయర్ క్వాలిఫికేషన్, ఫైల్స్, ఆర్డర్స్, పేమెంట్స్ పొందడానికి లంచం ఇచ్చుకోవల్సి వచ్చిందని బిజినెస్‌లు తెలిపాయి.
‘ప్రభుత్వ అనుమతులను వేగంగా పొందాలంటే లంచం ఇవ్వడం తప్పదని చాలా బిజినెస్‌లు పేర్కొన్నాయి. ప్రాసెస్‌లో ఇదొక పార్ట్‌గా మారిందని చెప్పాయి. అథారిటీ లైసెన్స్ డూప్లికేట్ కాపీ కోసం కూడా లంచం ఇచ్చుకోవాల్సి వచ్చిందని, ప్రాపర్టీ సంబంధిత అంశాల్లో లంచం తప్పదని బిజినెస్‌లు పేర్కొన్నాయి. గత ఏడాది కాలంలో వివిధ రూపాల్లో లంచం ఇచ్చుకున్నామని 66 శాతం బిజినెస్‌లు ఒప్పుకున్నాయి. అయితే..
159 జిల్లాల్లో వివిధ రంగాలకు చెందిన 9 వేల వ్యాపారాలను ఈ సర్వేలో భాగం చేసింది లోకల్‌సర్కిల్స్. మెట్రో(టైర్1) జిల్లాల నుంచి 42 శాతం, టైర్ 2 జిల్లాల నుంచి 33 శాతం, టైర్-3, టైర్-4 జిల్లాల నుంచి(రూరల్) 25 శాతం పాల్గొన్నారు.
ఇందుగలడందులేడని
సందేహము వలదు
ఎందెందు వెదకి చూచిన
అందందు అమ్యామ్యా మూలము గలదు!.. అవినీతిలో భారత్ స్థానం ప్రపంచంలో ఎంతో తెలుసా?
లంచం ఇచ్చినవాళ్లలో 47 శాతం.. తాము ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు అమ్యామా ముట్టజెప్పామని చెప్పారు. 62 శాతం మంది జీఎస్టీ అధికారులకు లంచాలిచ్చి పనులు చేయించుకున్నామని తెలిపారు. ప్రతీ ఇద్దరిలో ఒక వ్యాపారవేత్త.. కాలుష్యనివారణ, మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్ రంగాల్లో అధికారులకు అమ్యామ్యా ఇచ్చామన్నారు. అయితే ఇదే సర్వేలో ఇంకో ఆసక్తికరమై విషయం గమనిస్తే..
లంచం ఇవ్వకుండానే పనులు పూర్తి చేసుకోగలిగామని 16 శాతం బిజినెస్‌లు చెప్పాయి. అలాగే లంచం ఇవ్వాల్సిన అవసరం రాలేదని 19 శాతం బిజినెస్‌లు పేర్కొన్నాయి.
అవినీతి నిరోధక చట్టం(2018-సవరణ) ప్రకారం.. లంచం తీసుకోవడం మాత్రమే కాదు.. ఇవ్వడమూ నేరమే. అయినా ఇలాంటి సర్వేలు అప్పుడప్పుడు మన దేశంలో లంచగొండితనం ఎంత లోతుల్లో వేళ్లు పాతుకుపోయిందో అనే విషయాన్ని మనకు చెబుతుంటాయి. అవినీతి అవగాహన సూచిక 2023 ప్రకారం.. 180 దేశాల్లో భారత్ 93వ స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment