అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ దేశాల్లో సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో సంపద పెరుగుతోంది.
భారత్‌లో తప్ప
► అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. అధిక ధరలు, డాలర్‌తో పోల్చి చూస్తే వివిధ దేశాల కరెన్సీలు పడిపోవడం, భౌగోళిక రాజకీయాలు, వాతావరణ మార్పులు వంటివెన్నో దేశాల ఆర్థిక వ్యవస్థని కుంగదీస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సంపద క్షీణించడం ప్రారంభమైంది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత మళ్లీ 2022లో ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచ దేశాలు ఎదుర్కొన్నట్టుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యూబీఎస్) రూపొందించిన గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2023లో వెల్లడైంది.
ప్రపంచ దేశాల్లో అమెరికా అత్యధికంగా సంపదని కోల్పోతే ఆ తర్వాత స్థానంలో జపాన్ ఉంది. 2021లో ప్రపంచ దేశాల సంపద 466.2 ట్రిలియన్ డాలర్లు ఉండగా 2022 నాటికి 2.4% తగ్గి 454.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక సంపద తగ్గిపోవడంలో అమెరికా ముందుంది. ఏడాదిలో 5.9 ట్రిలియన్ డాలర్ల సంపదను అగ్రరాజ్యం కోల్పోయింది. ఆ తర్వాత స్థానంలో జపాన్ నిలిచింది. 2021తో పోల్చి చూస్తే ఆ దేశం 2.5 ట్రిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది.
ప్రాంతాల వారీగా ఇలా..
► అత్యంత సంపన్న దేశాలున్న ఉత్తర అమెరికా, యూరప్‌లు భారీగా నష్టపోయాయి. 2022లో ఈ దేశాల్లో 10.9 ట్రిలి యన్ డాలర్ల నష్టం జరిగింది.
► ఆసియా ఫసిఫిక్ దేశాల్లో 2.1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది.
► లాటిన్ అమెరికాలో 2.4 ట్రిలియన్ డాలర్ల సంపద పెరిగింది.
► 2022లో భారీగా సంపద హరించుకుపోయిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత జపాన్, చైనా, కెనడా, ఆ్రస్టేలియా ఉన్నాయి.
► సంపద భారీగా పెరిగిన దేశాల్లో భారత్, బ్రెజిల్, మెక్సికో, రష్యా నిలిచాయి.
► తలసరి ఆదాయంలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంటే, అమెరికా, ఆస్ట్రేలియా, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
భారత్‌లో పెరుగుతున్న సంపద
► ప్రపంచ దేశాల్లో సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో మాత్రం సంపద పెరుగుతోంది. 2021తో పోల్చి చూస్తే మన దేశ సంపద 675 బిలియన్ డాలర్లు అంటే 4.6% పెరిగింది. 2022 నాటికి 15.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. చైనా వంటి దేశాల్లో కూడా సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో మాత్రం పెరగడం విశేషం. దేశంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అపర కుబేరులుగా మారారు. 2000 నుంచి 2022 వరకు ఏడాదికి 15% మిలియనీర్లు పెరుగుతూ వస్తున్నారు. ఉక్రెయిన్‌తో ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్నప్పటికీ రష్యా సంపద కూడా పెరగడం గమనార్హం.
స్థిరంగా సంపద పెరుగుదల..
► భారత్‌లో సంపద పెరుగుదల 20 ఏళ్లుగా స్థిరంగా కొనసాగుతోంది. మధ్య తరగతికి చెందిన వ్యక్తుల సంపద ఏడాదికి 5.9% చొప్పున పెరుగుతోంది. ఒకప్పుడు చైనాలో మధ్యతరగతి సంపద అధికంగా పెరుగుతూ ఉండేది. ఇప్పుడు భారత్ చైనా స్థానాన్ని ఆక్రమించింది. మిలియనీర్లు మన దేశంలో ఏకంగా 15% పెరుగుతూ వస్తున్నారు. మొత్తమ్మీద మిలియనీర్లు అమెరికాలోనే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా కోట్లకు పడగలెత్తిన వారు 5.9 కోట్ల మంది ఉంటే వారిలో 2.3 కోట్ల మంది అంటే 40% అమెరికాలోనే ఉన్నారు. 2027 నాటికి భారత్, చైనా, బ్రెజిల్, యూకే, దక్షిణ కొరియాలో కూడా కోటీశ్వరుల సంఖ్య పెరుగుతుందని గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ అంచనా. 2022–27 మధ్య చైనాలో కోటీశ్వరులు 26%,భారత్‌లో 11% పెరుగుతారు.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment