Global Wealth Report
-
Global Wealth Report 2023: భారత్ తప్ప పలు అగ్రదేశాల్లో సంపద కరిగిపోతోంది
అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ దేశాల్లో సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో సంపద పెరుగుతోంది. భారత్‌లో తప్ప ► అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. అధిక ధరలు, డాలర్‌తో పోల్చి చూస్తే వివిధ దేశాల కరెన్సీలు పడిపోవడం, భౌగోళిక రాజకీయాలు, వాతావరణ మార్పులు వంటివెన్నో దేశాల ఆర్థిక వ్యవస్థని కుంగదీస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సంపద క్షీణించడం ప్రారంభమైంది. 2008 ఆర్థిక మాంద్యం తర్వాత మళ్లీ 2022లో ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచ దేశాలు ఎదుర్కొన్నట్టుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యూబీఎస్) రూపొందించిన గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2023లో వెల్లడైంది. ప్రపంచ దేశాల్లో అమెరికా అత్యధికంగా సంపదని కోల్పోతే ఆ తర్వాత స్థానంలో జపాన్ ఉంది. 2021లో ప్రపంచ దేశాల సంపద 466.2 ట్రిలియన్ డాలర్లు ఉండగా 2022 నాటికి 2.4% తగ్గి 454.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక సంపద తగ్గిపోవడంలో అమెరికా ముందుంది. ఏడాదిలో 5.9 ట్రిలియన్ డాలర్ల సంపదను అగ్రరాజ్యం కోల్పోయింది. ఆ తర్వాత స్థానంలో జపాన్ నిలిచింది. 2021తో పోల్చి చూస్తే ఆ దేశం 2.5 ట్రిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది. ప్రాంతాల వారీగా ఇలా.. ► అత్యంత సంపన్న దేశాలున్న ఉత్తర అమెరికా, యూరప్‌లు భారీగా నష్టపోయాయి. 2022లో ఈ దేశాల్లో 10.9 ట్రిలి యన్ డాలర్ల నష్టం జరిగింది. ► ఆసియా ఫసిఫిక్ దేశాల్లో 2.1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది. ► లాటిన్ అమెరికాలో 2.4 ట్రిలియన్ డాలర్ల సంపద పెరిగింది. ► 2022లో భారీగా సంపద హరించుకుపోయిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత జపాన్, చైనా, కెనడా, ఆ్రస్టేలియా ఉన్నాయి. ► సంపద భారీగా పెరిగిన దేశాల్లో భారత్, బ్రెజిల్, మెక్సికో, రష్యా నిలిచాయి. ► తలసరి ఆదాయంలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంటే, అమెరికా, ఆస్ట్రేలియా, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లో పెరుగుతున్న సంపద ► ప్రపంచ దేశాల్లో సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో మాత్రం సంపద పెరుగుతోంది. 2021తో పోల్చి చూస్తే మన దేశ సంపద 675 బిలియన్ డాలర్లు అంటే 4.6% పెరిగింది. 2022 నాటికి 15.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. చైనా వంటి దేశాల్లో కూడా సంపద హరించుకుపోతూ ఉంటే భారత్‌లో మాత్రం పెరగడం విశేషం. దేశంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అపర కుబేరులుగా మారారు. 2000 నుంచి 2022 వరకు ఏడాదికి 15% మిలియనీర్లు పెరుగుతూ వస్తున్నారు. ఉక్రెయిన్‌తో ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్నప్పటికీ రష్యా సంపద కూడా పెరగడం గమనార్హం. స్థిరంగా సంపద పెరుగుదల.. ► భారత్‌లో సంపద పెరుగుదల 20 ఏళ్లుగా స్థిరంగా కొనసాగుతోంది. మధ్య తరగతికి చెందిన వ్యక్తుల సంపద ఏడాదికి 5.9% చొప్పున పెరుగుతోంది. ఒకప్పుడు చైనాలో మధ్యతరగతి సంపద అధికంగా పెరుగుతూ ఉండేది. ఇప్పుడు భారత్ చైనా స్థానాన్ని ఆక్రమించింది. మిలియనీర్లు మన దేశంలో ఏకంగా 15% పెరుగుతూ వస్తున్నారు. మొత్తమ్మీద మిలియనీర్లు అమెరికాలోనే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా కోట్లకు పడగలెత్తిన వారు 5.9 కోట్ల మంది ఉంటే వారిలో 2.3 కోట్ల మంది అంటే 40% అమెరికాలోనే ఉన్నారు. 2027 నాటికి భారత్, చైనా, బ్రెజిల్, యూకే, దక్షిణ కొరియాలో కూడా కోటీశ్వరుల సంఖ్య పెరుగుతుందని గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ అంచనా. 2022–27 మధ్య చైనాలో కోటీశ్వరులు 26%,భారత్‌లో 11% పెరుగుతారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
గ్లోబల్ వెల్త్ రిపోర్ట్–2022: ‘సంపాదన’లో సగం వారిదే
లేచింది మొదలు పడుకొనే వరకు ప్రపంచంలో ప్రతి మనిషీ జపించే కామన్ జపం ‘డబ్బు’. గుండె కూడా లబ్ ‘డబ్బు’.. లబ్ ‘డబ్బు’ అని కొట్టుకుంటుందని కొందరు చమత్కరిస్తుంటారు. ఏ పని చేసినా దాని వెనుక ఉండేది ‘సంపాదన’. ‘ఎంత సంపాదించావన్నది కాదు.. ఎలా బతికావన్నది ముఖ్యం’ అన్న సూత్రం రివర్సయింది. సంపాదనే ముఖ్యమైంది. ఇందులో అమెరికా, చైనా పౌరులు ఆరితేరారు. వ్యక్తిగత సంపాదనలో వారిదే సగం. మిగతా ప్రపంచానిది సగం. క్రెడిట్ సూయిస్ నివేదిక గణాంకాలతో ప్రత్యేక కథనం.. (ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): ఒక దేశం ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి జీడీపీ (జాతీయ స్థూల ఉత్పత్తి) గణాంకాలు చూస్తాం. ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడంలో మరో కొలమానం వ్యక్తిగత సంపద విలువ. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత సంపదను లెక్కగట్టి ఏ దేశ పౌరులు ఎక్కువ సంపాదిస్తున్నారో, ఎవరు విలువైన ఆస్తులు కూడగడుతున్నారో తెలుసుకోవచ్చు. ‘క్రెడిట్ సూయిస్’ సంస్థ ఏటా గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ విడుదల చేస్తుంది. ఇటీవల ‘గ్లోబల్ వెల్త్ రిపోర్ట్–2022’ విడుదల చేసింది. ఇందులో 2021 సంవత్సరం గణాంకాలను పేర్కొంది. 2021 ఆఖరునాటికి ప్రపంచంలోని మొత్తం వ్యక్తిగత సంపద 463.6 లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. అందులో సగం అమెరికా, చైనా పౌరుల సొంతమని, మిగతా సగం అన్ని దేశాల పౌరుల వ్యక్తిగత సంపదగా నివేదిక పేర్కొంది. మొత్తం వ్యక్తిగత సంపదలో అమెరికా పౌరులకు 31.5 శాతం వాటా కాగా, తర్వాత స్థానంలో ఉన్న చైనా పౌరుల వాటా 18.4 శాతం. 3.1 శాతం వాటాతో మనదేశం ఏడో స్థానంలో నిలిచింది. టాప్–10లో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, ఇండియా, కెనడా, ఇటలీ, ఆస్ట్రేలియా ఉన్నాయి. సంపద పంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే క్రెడిట్ సూయిస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే.. ప్రపంచంలోని 40 శాతం సంపద ఒక శాతం వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమైంది. 10 శాతం ధనికుల వద్ద 82 శాతం సంపద పోగుబడి ఉంది. ఎవరి దగ్గర సంపద ఉందని చెప్పడంకంటే.. ఎవరి దగ్గర లేదో చెప్పడం కూడా ముఖ్యమని నివేదిక రూపకర్త ‘ఆంతోనీ షోరాక్’ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని 50 శాతం వ్యక్తులకు 1 శాతం సందప మాత్రమే ఉందనే విషయాన్ని నొక్కి చెప్పారు. సంపద అందరికీ సమానంగా ఉండటం ఊహకు అందని విషయం. కానీ నిరుపేదలకు వేగంగా సందప పంపిణీ జరిగితేనే అసలు సంపదకు అర్థం చేకూరుతుంది. అభివృద్ధి దిశగా సమాజం వేగంగా అడుగులు వేస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రజా ప్రభుత్వాలకు నిజమైన అర్థం ఏదో రూపంలో సంపదను నిరుపేద వర్గాలకు అందించడమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నివేదికలో ముఖ్యాంశాలు.. ► భారీ ఆర్థిక శక్తుల వద్దే వ్యక్తిగత సంపద కూడా కూడుతోంది. అమెరికా, చైనా కలిసి ప్రపంచంలోని వ్యక్తిగత సంపదలో సగం ఉండగా, ఆయా దేశాల జీడీపీ ప్రపంచ దేశాల జీడీపీతో పోలిస్తే కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాల జీడీపీలో అమెరికా వాటా 24 శాతం కాగా, వ్యక్తిగత సంపదలో 31.5 శాతం ఉండటం గమనార్హం. చైనా అలా లేదు. ప్రపంచ జీడీపీలో చైనా వాటా 19 శాతం, వ్యక్తిగత సంపదలో ఆ దేశం వాటా 18.4 శాతం. అంటే.. అమెరికాలో జీడీపీకంటే వ్యక్తిగత సంపాదన వాటా ఎక్కువ ఉంటే.., చైనాలో ఇది తక్కువ. ► ప్రపంచంలోని వ్యక్తిగత సంపదలో 75 శాతం కేవలం 10 దేశాల్లోనే ఉంది. ► దశాబ్దం క్రితం ప్రపంచ వ్యక్తిగత సంపదలో చైనా వాటా 9 శాతం ఉండగా, ఇప్పుడు రెట్టింపు అయింది. ► 10 లక్షల డాలర్లు, అంతకంటే ఎక్కువ సంపద ఉన్న వ్యక్తుల (మిలయనీర్ల) సంఖ్య 2021లో 7.9 లక్షలు. 2026 నాటికి ఈ సంఖ్య రెట్టింపై 16.23 లక్షలకు చేరుతుందని అంచనా. ► ప్రపంచ వ్యక్తిగత సంపద వాటాలో మన దేశం వాటా అంతగా పెరగలేదు. అయితే దేశంలో వ్యక్తిగత సంపదలో వృద్ధి నమోదవుతోంది. 2020తో పోలిస్తే 2021లో 12 శాతం వృద్ధి నమోదు చేసి 14.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. మన దేశంలో ఒక్కో వ్యక్తికి ఉన్న సరాసరి సంపద విలువ 2000 సంవత్సరం నుంచి ఏటా 8.8 శాతం పెరుగుతోంది. 2021 ఆఖరుకు అది 15,535 డాలర్లకు చేరింది. అది ప్రపంచ సరాసరి వ్యక్తిగత సంపద (87,489 డాలర్లు)తో పోలిస్తే బాగా తక్కువ. ► ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 6.2 కోట్ల మంది మిలియనీర్లు ఉండగా, 2026 నాటికి వీరి సంఖ్య 8.75 కోట్లకు చేరుతుందని అంచనా. ► ప్రపంచంలోని డాలర్ మిలియనీర్లు మన దేశంలో ఒక శాతం ఉండగా, అమెరికాలో 39 శాతం మంది ఉన్నారు. చైనాలో 10 శాతం మంది, జపాన్, యూకే, ఫ్రాన్స్‌లో 5 శాతం చొప్పున, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియాలో 4 శాతం చొప్పున, ఇటలీ, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్‌లో 2 శాతం చొప్పున ఉన్నారు. తైవాన్, హాంకాంగ్, స్వీడన్లో ఒక శాతం చొప్పున ఉన్నారు. మిగతా 10 శాతం మంది ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో ఉన్నారు. -
మీరు మధ్య తరగతా?
దేశీ మిడిల్‌క్లాస్ సంఖ్యను అమాంతం తగ్గించిన క్రెడిట్ స్వీస్ * 26 కోట్ల నుంచి ఏకంగా 2.36 కోట్లకు తగ్గించిన తాజా నివేదిక * ఇప్పటిదాకా అందరూ ఆధారం చేసుకున్నది ఆదాయాన్నే * తొలిసారి సంపద ఆధారంగా లెక్కింపు ఆదాయమైతే హెచ్చుతగ్గులుండొచ్చని వివరణ సాక్షి, బిజినెస్ విభాగం: భారతదేశంలో మధ్య తరగతి సంఖ్య పాతిక కోట్లపైనే ఉన్నట్లు ఇటీవల పలు నివేదికలు వెల్లడించాయి. దేశంలో మధ్య తరగతి అనే దానికి సరైన నిర్వచనం లేకుండా... ఉద్యోగం ఉన్న, లేదా నెలకు 10-15 వేల సంపాదన దాటిన ప్రతి ఒక్కరినీ ఈ కేటగిరీలోకే చేర్చటం వల్ల తేలిన సంఖ్య ఇది. దీన్నే ఆధారంగా చేసుకుని ప్రపంచంలోనే అత్యధిక మధ్య తరగతి ప్రజలున్న దేశంగా కూడా ఇండియాను పేర్కొనటం జరుగుతోంది. కాకపోతే ‘గ్లోబల్ వెల్త్ రిపోర్ట్’ పేరిట అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ క్రెడిట్ స్వీస్ ఇచ్చిన తాజా నివేదిక... ఈ సంఖ్యను అమాంతం తగ్గించేసింది. దీని ప్రకారం 2015లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్దవారిలో 66.4 కోట్ల మంది మధ్య తరగతివారు కాగా... వారిలో భారతీయుల సంఖ్య 2.36 కోట్ల మంది. ఇవీ పాత లెక్కలు... దేశంలో మధ్య తరగతిపై ఇప్పటిదాకా ఎవరి లెక్కలు వారు వేశారు. 2005లో ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్’ డేటాను ఆధారం చేసుకుని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మెకిన్సే... దేశంలో మధ్య తరగతిని లెక్కించింది. ఏడాదికి రూ.2 లక్షలు-10 లక్షల మధ్య ఆదాయమున్న వారందరినీ ఈ కేటగిరీలోకి తేవటంతో అప్పట్లోనే 5 కోట్ల మంది మధ్యతరగతిగా ఉన్నట్లు వెల్లడయింది. ఆ తరవాత ప్రపంచ బ్యాంకు మరో లెక్క వేసింది. దీని ప్రకారం 2005లోనే భారతీయ మధ్యతరగతి సంఖ్య 26.4 కోట్లు. 70 దేశాల పేదరిక సగటును 2 డాలర్లుగా లెక్కించి... అమెరికా పేదరిక సగటు 13 డాలర్లుగా లెక్కించి... ఈ రెండింటి మధ్యనున్న వారిని మధ్య తరగతిగా ప్రపంచబ్యాంకు తేల్చింది. అప్పట్లో డాలరు విలువ దాదాపు 44 రూపాయలు. అంటే నెలకు దాదాపు రూ.2,700 సంపాదించే వారందరినీ మధ్య తరగతిలో చేర్చారన్న మాట. ఇక 2007లో దేశీ టెలివిజన్ ఛానెల్ సీఎన్ఎన్-ఐబీఎన్ మరో లెక్క వేసింది. ఇది వినియోగం ఆధారంగా వేసిన లెక్క. అంటే కారు లేదా స్కూటర్, కలర్ టీవీ లేదా టెలిఫోన్ వంటివి ఉన్నవారందరినీ మధ్య తరగతిలోకి చేర్చింది. దేశ జనాభాలో 20 శాతం కన్నా ఎక్కువ మందే మధ్య తరగతి వారు ఉన్నారని, వీరి సంఖ్య దాదాపు 20 కోట్లు ఉండవచ్చని ఈ ఛానెల్ అప్పట్లో వెల్లడించింది. ఆదాయం కాదు... సంపద ఉండాలి! తాజాగా క్రెడిట్ స్వీస్ మాత్రం మధ్య తరగతిని లెక్కించడానికి ఆదాయం కాకుండా సంపద ఉండాలని స్పష్టంచేసింది. ‘‘ఆదాయం ఆధారంగా వేస్తున్న లెక్కల్లో భద్రత, స్వేచ్ఛ ఉండవు. ఉదాహరణకు అప్పటిదాకా మధ్య తరగతిగా లెక్కించిన వ్యక్తికి కొన్నాళ్లు ఉద్యోగం పోతే తన మధ్యతరగతి హోదా పోతుంది కదా!!. అందుకని సంపద ఆధారంగా లెక్కిస్తే మధ్య తరగతి హోదాకు తాత్కాలిక ఇబ్బందులనేవి ఉండవు’’ అని నివేదిక వివరించింది. అందుకని దేశంలో ఏడాదికి రూ.7,37,748 ఆదాయాన్ని ఆర్జించగలిగే సంపద ఉన్నవారినే తాజాగా మధ్య తరగతిలోకి తీసుకుంది. అయితే ఇలా లెక్కించినా గడిచిన పదిహేనేళ్లలో మధ్యతరగతి వేగంగా పెరుగుతున్న దేశాల్లో చైనా తరువాత రెండో స్థానం భారత్‌దే కావటం గమనార్హం. అయితే దేశంలోని పెద్దల్లో 90 శాతానికి పైగా ఇంకా నెలకు 60 వేలకన్నా తక్కువ ఆర్జించగలిగే సంపదనే కలిగి ఉన్నారని, వీరంతా మధ్య తరగతికి దిగువన ఉన్నట్లే భావించాలని నివేదిక వివరించింది. ఇక మధ్య తరగతికి పైనుండే ఎగువ తరగతి వారి సంఖ్య మాత్రం ఇండియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో కలిపి మొత్తంగా 2 శాతమే. ఇక 10.8 కోట్ల మందితో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మధ్య తరగతి ప్రజలున్న దేశంగా చైనా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. శాతాల వారీగా చూసినా 16.4 శాతంతో నెంబర్ వన్‌గానే చైనా కొనసాగుతోంది. ఇదీ.. లెక్క భారతదేశంలో 2.36 కోట్ల మధ్య తరగతి ప్రజలున్నారు. ఇది ప్రపంచవ్యాప్త మధ్య తరగతిలో 3 శాతం. ఏడాదికి రూ.7.37 లక్షల ఆదాయాన్నిచ్చే సంపద ఉన్న వారినే ఈ కేటగిరీలోకి తీసుకున్నారు. అంటే నెలకు కనీసం రూ.61,480. దేశంలోని ఈ 2.36 కోట్ల మంది చేతిలో దాదాపు 780 బిలియన్ డాలర్ల సంపద ఉంది. ఇది దేశ సంపదలో నాలుగో వంతు.