లేచింది మొదలు పడుకొనే వరకు ప్రపంచంలో ప్రతి మనిషీ జపించే కామన్ జపం ‘డబ్బు’. గుండె కూడా లబ్ ‘డబ్బు’.. లబ్ ‘డబ్బు’ అని కొట్టుకుంటుందని కొందరు చమత్కరిస్తుంటారు. ఏ పని చేసినా దాని వెనుక ఉండేది ‘సంపాదన’. ‘ఎంత సంపాదించావన్నది కాదు.. ఎలా బతికావన్నది ముఖ్యం’ అన్న సూత్రం రివర్సయింది. సంపాదనే ముఖ్యమైంది. ఇందులో అమెరికా, చైనా పౌరులు ఆరితేరారు. వ్యక్తిగత సంపాదనలో వారిదే సగం. మిగతా ప్రపంచానిది సగం. క్రెడిట్ సూయిస్ నివేదిక గణాంకాలతో ప్రత్యేక కథనం..
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): ఒక దేశం ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి జీడీపీ (జాతీయ స్థూల ఉత్పత్తి) గణాంకాలు చూస్తాం. ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడంలో మరో కొలమానం వ్యక్తిగత సంపద విలువ. ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత సంపదను లెక్కగట్టి ఏ దేశ పౌరులు ఎక్కువ సంపాదిస్తున్నారో, ఎవరు విలువైన ఆస్తులు కూడగడుతున్నారో తెలుసుకోవచ్చు. ‘క్రెడిట్ సూయిస్’ సంస్థ ఏటా గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ విడుదల చేస్తుంది. ఇటీవల ‘గ్లోబల్ వెల్త్ రిపోర్ట్–2022’ విడుదల చేసింది.
ఇందులో 2021 సంవత్సరం గణాంకాలను పేర్కొంది. 2021 ఆఖరునాటికి ప్రపంచంలోని మొత్తం వ్యక్తిగత సంపద 463.6 లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. అందులో సగం అమెరికా, చైనా పౌరుల సొంతమని, మిగతా సగం అన్ని దేశాల పౌరుల వ్యక్తిగత సంపదగా నివేదిక పేర్కొంది. మొత్తం వ్యక్తిగత సంపదలో అమెరికా పౌరులకు 31.5 శాతం వాటా కాగా, తర్వాత స్థానంలో ఉన్న చైనా పౌరుల వాటా 18.4 శాతం. 3.1 శాతం వాటాతో మనదేశం ఏడో స్థానంలో నిలిచింది. టాప్–10లో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, ఇండియా, కెనడా, ఇటలీ, ఆస్ట్రేలియా ఉన్నాయి.
సంపద పంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే
క్రెడిట్ సూయిస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే.. ప్రపంచంలోని 40 శాతం సంపద ఒక శాతం వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమైంది. 10 శాతం ధనికుల వద్ద 82 శాతం సంపద పోగుబడి ఉంది. ఎవరి దగ్గర సంపద ఉందని చెప్పడంకంటే.. ఎవరి దగ్గర లేదో చెప్పడం కూడా ముఖ్యమని నివేదిక రూపకర్త ‘ఆంతోనీ షోరాక్’ అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలోని 50 శాతం వ్యక్తులకు 1 శాతం సందప మాత్రమే ఉందనే విషయాన్ని నొక్కి చెప్పారు. సంపద అందరికీ సమానంగా ఉండటం ఊహకు అందని విషయం. కానీ నిరుపేదలకు వేగంగా సందప పంపిణీ జరిగితేనే అసలు సంపదకు అర్థం చేకూరుతుంది. అభివృద్ధి దిశగా సమాజం వేగంగా అడుగులు వేస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రజా ప్రభుత్వాలకు నిజమైన అర్థం ఏదో రూపంలో సంపదను నిరుపేద వర్గాలకు అందించడమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
నివేదికలో ముఖ్యాంశాలు..
► భారీ ఆర్థిక శక్తుల వద్దే వ్యక్తిగత సంపద కూడా కూడుతోంది. అమెరికా, చైనా కలిసి ప్రపంచంలోని వ్యక్తిగత సంపదలో సగం ఉండగా, ఆయా దేశాల జీడీపీ ప్రపంచ దేశాల జీడీపీతో పోలిస్తే కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాల జీడీపీలో అమెరికా వాటా 24 శాతం కాగా, వ్యక్తిగత సంపదలో 31.5 శాతం ఉండటం గమనార్హం. చైనా అలా లేదు. ప్రపంచ జీడీపీలో చైనా వాటా 19 శాతం, వ్యక్తిగత సంపదలో ఆ దేశం వాటా 18.4 శాతం. అంటే.. అమెరికాలో జీడీపీకంటే వ్యక్తిగత సంపాదన వాటా ఎక్కువ ఉంటే.., చైనాలో ఇది తక్కువ.
► ప్రపంచంలోని వ్యక్తిగత సంపదలో 75 శాతం కేవలం 10 దేశాల్లోనే ఉంది.
► దశాబ్దం క్రితం ప్రపంచ వ్యక్తిగత సంపదలో చైనా వాటా 9 శాతం ఉండగా, ఇప్పుడు రెట్టింపు అయింది.
► 10 లక్షల డాలర్లు, అంతకంటే ఎక్కువ సంపద ఉన్న వ్యక్తుల (మిలయనీర్ల) సంఖ్య 2021లో 7.9 లక్షలు. 2026 నాటికి ఈ సంఖ్య రెట్టింపై 16.23 లక్షలకు చేరుతుందని అంచనా.
► ప్రపంచ వ్యక్తిగత సంపద వాటాలో మన దేశం వాటా అంతగా పెరగలేదు. అయితే దేశంలో వ్యక్తిగత సంపదలో వృద్ధి నమోదవుతోంది. 2020తో పోలిస్తే 2021లో 12 శాతం వృద్ధి నమోదు చేసి 14.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. మన దేశంలో ఒక్కో వ్యక్తికి ఉన్న సరాసరి సంపద విలువ 2000 సంవత్సరం నుంచి ఏటా 8.8 శాతం పెరుగుతోంది. 2021 ఆఖరుకు అది 15,535 డాలర్లకు చేరింది. అది ప్రపంచ సరాసరి వ్యక్తిగత సంపద (87,489 డాలర్లు)తో పోలిస్తే బాగా తక్కువ.
► ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 6.2 కోట్ల మంది మిలియనీర్లు ఉండగా, 2026 నాటికి వీరి సంఖ్య 8.75 కోట్లకు చేరుతుందని అంచనా.
► ప్రపంచంలోని డాలర్ మిలియనీర్లు మన దేశంలో ఒక శాతం ఉండగా, అమెరికాలో 39 శాతం మంది ఉన్నారు. చైనాలో 10 శాతం మంది, జపాన్, యూకే, ఫ్రాన్స్‌లో 5 శాతం చొప్పున, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియాలో 4 శాతం చొప్పున, ఇటలీ, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్‌లో 2 శాతం చొప్పున ఉన్నారు. తైవాన్, హాంకాంగ్, స్వీడన్‌లో ఒక శాతం చొప్పున ఉన్నారు. మిగతా 10 శాతం మంది ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment