మీరు మధ్య తరగతా? | Credit Suisse Probed by U.S., Switzerland in FIFA Case | Sakshi
Sakshi News home page

మీరు మధ్య తరగతా?

Published Sat, Oct 31 2015 12:20 AM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

మీరు మధ్య తరగతా?

మీరు మధ్య తరగతా?

దేశీ మిడిల్‌క్లాస్ సంఖ్యను అమాంతం తగ్గించిన క్రెడిట్ స్వీస్
* 26 కోట్ల నుంచి ఏకంగా 2.36 కోట్లకు తగ్గించిన తాజా నివేదిక
* ఇప్పటిదాకా అందరూ ఆధారం చేసుకున్నది ఆదాయాన్నే
* తొలిసారి సంపద ఆధారంగా లెక్కింపు  ఆదాయమైతే హెచ్చుతగ్గులుండొచ్చని వివరణ
 
సాక్షి, బిజినెస్ విభాగం: భారతదేశంలో మధ్య తరగతి సంఖ్య పాతిక కోట్లపైనే ఉన్నట్లు ఇటీవల పలు నివేదికలు వెల్లడించాయి. దేశంలో మధ్య తరగతి అనే దానికి సరైన నిర్వచనం లేకుండా... ఉద్యోగం ఉన్న, లేదా నెలకు 10-15 వేల సంపాదన దాటిన ప్రతి ఒక్కరినీ ఈ కేటగిరీలోకే చేర్చటం వల్ల తేలిన సంఖ్య ఇది.

దీన్నే ఆధారంగా చేసుకుని ప్రపంచంలోనే అత్యధిక మధ్య తరగతి ప్రజలున్న దేశంగా కూడా ఇండియాను పేర్కొనటం జరుగుతోంది. కాకపోతే ‘గ్లోబల్ వెల్త్ రిపోర్ట్’ పేరిట అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ క్రెడిట్ స్వీస్ ఇచ్చిన తాజా నివేదిక... ఈ సంఖ్యను అమాంతం తగ్గించేసింది. దీని ప్రకారం 2015లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్దవారిలో 66.4 కోట్ల మంది మధ్య తరగతివారు కాగా... వారిలో భారతీయుల సంఖ్య 2.36 కోట్ల మంది.
 
ఇవీ పాత లెక్కలు...
దేశంలో మధ్య తరగతిపై ఇప్పటిదాకా ఎవరి లెక్కలు వారు వేశారు. 2005లో ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్’ డేటాను ఆధారం చేసుకుని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మెకిన్సే... దేశంలో మధ్య తరగతిని లెక్కించింది. ఏడాదికి రూ.2 లక్షలు-10 లక్షల మధ్య ఆదాయమున్న వారందరినీ ఈ కేటగిరీలోకి తేవటంతో అప్పట్లోనే 5 కోట్ల మంది మధ్యతరగతిగా ఉన్నట్లు వెల్లడయింది. ఆ తరవాత ప్రపంచ బ్యాంకు మరో లెక్క వేసింది.  

దీని ప్రకారం 2005లోనే భారతీయ మధ్యతరగతి సంఖ్య 26.4 కోట్లు. 70 దేశాల పేదరిక సగటును 2 డాలర్లుగా లెక్కించి... అమెరికా పేదరిక సగటు 13 డాలర్లుగా లెక్కించి... ఈ రెండింటి మధ్యనున్న వారిని మధ్య తరగతిగా ప్రపంచబ్యాంకు తేల్చింది. అప్పట్లో డాలరు విలువ దాదాపు 44 రూపాయలు. అంటే నెలకు దాదాపు రూ.2,700 సంపాదించే వారందరినీ మధ్య తరగతిలో చేర్చారన్న మాట.
 

ఇక 2007లో దేశీ టెలివిజన్ ఛానెల్ సీఎన్‌ఎన్-ఐబీఎన్ మరో లెక్క వేసింది. ఇది వినియోగం ఆధారంగా వేసిన లెక్క. అంటే కారు లేదా స్కూటర్, కలర్ టీవీ లేదా టెలిఫోన్ వంటివి ఉన్నవారందరినీ మధ్య తరగతిలోకి చేర్చింది. దేశ జనాభాలో 20 శాతం కన్నా ఎక్కువ మందే మధ్య తరగతి వారు ఉన్నారని, వీరి సంఖ్య దాదాపు 20 కోట్లు ఉండవచ్చని ఈ ఛానెల్ అప్పట్లో వెల్లడించింది.
 
ఆదాయం కాదు... సంపద ఉండాలి!
తాజాగా క్రెడిట్ స్వీస్ మాత్రం మధ్య తరగతిని లెక్కించడానికి ఆదాయం కాకుండా సంపద ఉండాలని స్పష్టంచేసింది. ‘‘ఆదాయం ఆధారంగా వేస్తున్న లెక్కల్లో భద్రత, స్వేచ్ఛ ఉండవు. ఉదాహరణకు అప్పటిదాకా మధ్య తరగతిగా లెక్కించిన వ్యక్తికి కొన్నాళ్లు ఉద్యోగం పోతే తన మధ్యతరగతి హోదా పోతుంది కదా!!. అందుకని సంపద ఆధారంగా లెక్కిస్తే మధ్య తరగతి హోదాకు తాత్కాలిక ఇబ్బందులనేవి ఉండవు’’ అని నివేదిక వివరించింది.

అందుకని దేశంలో ఏడాదికి రూ.7,37,748 ఆదాయాన్ని ఆర్జించగలిగే సంపద ఉన్నవారినే తాజాగా మధ్య తరగతిలోకి తీసుకుంది. అయితే ఇలా లెక్కించినా గడిచిన పదిహేనేళ్లలో మధ్యతరగతి వేగంగా పెరుగుతున్న దేశాల్లో చైనా తరువాత రెండో స్థానం భారత్‌దే కావటం గమనార్హం. అయితే దేశంలోని పెద్దల్లో 90 శాతానికి పైగా ఇంకా నెలకు 60 వేలకన్నా తక్కువ ఆర్జించగలిగే సంపదనే కలిగి ఉన్నారని, వీరంతా మధ్య తరగతికి దిగువన ఉన్నట్లే భావించాలని నివేదిక వివరించింది.
 
ఇక మధ్య తరగతికి పైనుండే ఎగువ తరగతి వారి సంఖ్య మాత్రం ఇండియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో కలిపి మొత్తంగా 2 శాతమే. ఇక 10.8 కోట్ల మందితో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మధ్య తరగతి ప్రజలున్న దేశంగా చైనా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. శాతాల వారీగా చూసినా 16.4 శాతంతో నెంబర్ వన్‌గానే చైనా కొనసాగుతోంది.
 
ఇదీ.. లెక్క
భారతదేశంలో 2.36 కోట్ల మధ్య తరగతి ప్రజలున్నారు. ఇది ప్రపంచవ్యాప్త మధ్య తరగతిలో 3 శాతం.
 
ఏడాదికి రూ.7.37 లక్షల ఆదాయాన్నిచ్చే సంపద ఉన్న వారినే ఈ కేటగిరీలోకి తీసుకున్నారు. అంటే నెలకు కనీసం రూ.61,480.
 
దేశంలోని ఈ 2.36 కోట్ల మంది చేతిలో దాదాపు 780 బిలియన్ డాలర్ల సంపద ఉంది. ఇది దేశ సంపదలో నాలుగో వంతు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement