National Council of Applied Economic Research
-
విదేశాల్లో 34 లక్షల కోట్ల నల్లధనం
న్యూఢిల్లీ: భారతీయులు తమ నల్లధనాన్ని భారీ మొత్తంలో విదేశాల్లో దాచినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. విదేశాల్లో భారతీయుల నల్లధనం రూ.15 లక్షల కోట్ల నుంచి రూ.33.9 లక్షల కోట్ల వరకు ఉంటుందని స్పష్టమైంది. ఇదంతా కేవలం 1980–2010 సంవత్సరాల మధ్య దాచిన మొత్తమే అని తేలింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ (ఎన్‌ఐఎఫ్‌ఎమ్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ ఫైనాన్స్ (ఎన్ఐపీఎఫ్పీ) సంస్థలు వేర్వేరుగా ఈ అధ్యయనాలు నిర్వహించాయి. వీటన్నింటినీ కలిపి ‘దేశ, విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం వివరాలు’పేరిట నివేదికలో పొందుపరిచాయి. దీనికి సంబంధించిన స్టాండింగ్ కమిటీ నివేదికను సోమవారం లోక్‌సభ ముందుంచాయి. దేశ విదేశాల్లో కచ్చితంగా ఇంత మొత్తంలో నల్లధనం ఉంటుందని చెప్పడం కష్టమని.. కానీ సుమారుగా అంచనా వేయగలమని పేర్కొన్నాయి. భారతీయులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని రియల్ ఎస్టేట్, మైనింగ్, ఫార్మాస్యూటికల్స్, పాన్‌మసాలా, గుట్కా, పొగాకు, విద్య, సినిమాలు వంటి రంగాల్లో పెట్టుబడిగా పెడుతున్నారని అధ్యయనంలో గుర్తించాయి. 1980–2010 సంవత్సరాల మధ్య విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనం రూ.26.6 లక్షల కోట్ల నుంచి రూ.33.9 లక్షల కోట్ల వరకూ ఉంటుందని ఎన్సీఏఈఆర్ తన అధ్యయనంలో వెల్లడించింది. 1990–2008 సంవత్సరాల మధ్య రూ.9,41,837 కోట్ల నల్లధనాన్ని భారతీయులు విదేశాల్లో దాచారని ఎన్‌ఐఎఫ్‌ఎమ్ తెలిపింది. కాగా, దేశ విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనంపై నివేదిక తయారుచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2011లో ఈ మూడు సంస్థలను కోరింది. అయితే నల్లధనానికి సంబంధించి ఈ మూడు సంస్థల నివేదికలు ఒకేలా ఉంటాయని భావించలేమని ముఖ్య ఆర్థిక సలహాదారు అభిప్రాయపడ్డారని పార్లమెంటరీ ప్యానల్ తన నివేదికలో వెల్లడించింది. దీనిని ప్రాథమిక నివేదికగానే భావించాల్సి ఉందని.. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని అభిప్రాయపడింది. -
మీరు మధ్య తరగతా?
దేశీ మిడిల్‌క్లాస్ సంఖ్యను అమాంతం తగ్గించిన క్రెడిట్ స్వీస్ * 26 కోట్ల నుంచి ఏకంగా 2.36 కోట్లకు తగ్గించిన తాజా నివేదిక * ఇప్పటిదాకా అందరూ ఆధారం చేసుకున్నది ఆదాయాన్నే * తొలిసారి సంపద ఆధారంగా లెక్కింపు ఆదాయమైతే హెచ్చుతగ్గులుండొచ్చని వివరణ సాక్షి, బిజినెస్ విభాగం: భారతదేశంలో మధ్య తరగతి సంఖ్య పాతిక కోట్లపైనే ఉన్నట్లు ఇటీవల పలు నివేదికలు వెల్లడించాయి. దేశంలో మధ్య తరగతి అనే దానికి సరైన నిర్వచనం లేకుండా... ఉద్యోగం ఉన్న, లేదా నెలకు 10-15 వేల సంపాదన దాటిన ప్రతి ఒక్కరినీ ఈ కేటగిరీలోకే చేర్చటం వల్ల తేలిన సంఖ్య ఇది. దీన్నే ఆధారంగా చేసుకుని ప్రపంచంలోనే అత్యధిక మధ్య తరగతి ప్రజలున్న దేశంగా కూడా ఇండియాను పేర్కొనటం జరుగుతోంది. కాకపోతే ‘గ్లోబల్ వెల్త్ రిపోర్ట్’ పేరిట అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ క్రెడిట్ స్వీస్ ఇచ్చిన తాజా నివేదిక... ఈ సంఖ్యను అమాంతం తగ్గించేసింది. దీని ప్రకారం 2015లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్దవారిలో 66.4 కోట్ల మంది మధ్య తరగతివారు కాగా... వారిలో భారతీయుల సంఖ్య 2.36 కోట్ల మంది. ఇవీ పాత లెక్కలు... దేశంలో మధ్య తరగతిపై ఇప్పటిదాకా ఎవరి లెక్కలు వారు వేశారు. 2005లో ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్’ డేటాను ఆధారం చేసుకుని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మెకిన్సే... దేశంలో మధ్య తరగతిని లెక్కించింది. ఏడాదికి రూ.2 లక్షలు-10 లక్షల మధ్య ఆదాయమున్న వారందరినీ ఈ కేటగిరీలోకి తేవటంతో అప్పట్లోనే 5 కోట్ల మంది మధ్యతరగతిగా ఉన్నట్లు వెల్లడయింది. ఆ తరవాత ప్రపంచ బ్యాంకు మరో లెక్క వేసింది. దీని ప్రకారం 2005లోనే భారతీయ మధ్యతరగతి సంఖ్య 26.4 కోట్లు. 70 దేశాల పేదరిక సగటును 2 డాలర్లుగా లెక్కించి... అమెరికా పేదరిక సగటు 13 డాలర్లుగా లెక్కించి... ఈ రెండింటి మధ్యనున్న వారిని మధ్య తరగతిగా ప్రపంచబ్యాంకు తేల్చింది. అప్పట్లో డాలరు విలువ దాదాపు 44 రూపాయలు. అంటే నెలకు దాదాపు రూ.2,700 సంపాదించే వారందరినీ మధ్య తరగతిలో చేర్చారన్న మాట. ఇక 2007లో దేశీ టెలివిజన్ ఛానెల్ సీఎన్ఎన్-ఐబీఎన్ మరో లెక్క వేసింది. ఇది వినియోగం ఆధారంగా వేసిన లెక్క. అంటే కారు లేదా స్కూటర్, కలర్ టీవీ లేదా టెలిఫోన్ వంటివి ఉన్నవారందరినీ మధ్య తరగతిలోకి చేర్చింది. దేశ జనాభాలో 20 శాతం కన్నా ఎక్కువ మందే మధ్య తరగతి వారు ఉన్నారని, వీరి సంఖ్య దాదాపు 20 కోట్లు ఉండవచ్చని ఈ ఛానెల్ అప్పట్లో వెల్లడించింది. ఆదాయం కాదు... సంపద ఉండాలి! తాజాగా క్రెడిట్ స్వీస్ మాత్రం మధ్య తరగతిని లెక్కించడానికి ఆదాయం కాకుండా సంపద ఉండాలని స్పష్టంచేసింది. ‘‘ఆదాయం ఆధారంగా వేస్తున్న లెక్కల్లో భద్రత, స్వేచ్ఛ ఉండవు. ఉదాహరణకు అప్పటిదాకా మధ్య తరగతిగా లెక్కించిన వ్యక్తికి కొన్నాళ్లు ఉద్యోగం పోతే తన మధ్యతరగతి హోదా పోతుంది కదా!!. అందుకని సంపద ఆధారంగా లెక్కిస్తే మధ్య తరగతి హోదాకు తాత్కాలిక ఇబ్బందులనేవి ఉండవు’’ అని నివేదిక వివరించింది. అందుకని దేశంలో ఏడాదికి రూ.7,37,748 ఆదాయాన్ని ఆర్జించగలిగే సంపద ఉన్నవారినే తాజాగా మధ్య తరగతిలోకి తీసుకుంది. అయితే ఇలా లెక్కించినా గడిచిన పదిహేనేళ్లలో మధ్యతరగతి వేగంగా పెరుగుతున్న దేశాల్లో చైనా తరువాత రెండో స్థానం భారత్‌దే కావటం గమనార్హం. అయితే దేశంలోని పెద్దల్లో 90 శాతానికి పైగా ఇంకా నెలకు 60 వేలకన్నా తక్కువ ఆర్జించగలిగే సంపదనే కలిగి ఉన్నారని, వీరంతా మధ్య తరగతికి దిగువన ఉన్నట్లే భావించాలని నివేదిక వివరించింది. ఇక మధ్య తరగతికి పైనుండే ఎగువ తరగతి వారి సంఖ్య మాత్రం ఇండియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో కలిపి మొత్తంగా 2 శాతమే. ఇక 10.8 కోట్ల మందితో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మధ్య తరగతి ప్రజలున్న దేశంగా చైనా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. శాతాల వారీగా చూసినా 16.4 శాతంతో నెంబర్ వన్‌గానే చైనా కొనసాగుతోంది. ఇదీ.. లెక్క భారతదేశంలో 2.36 కోట్ల మధ్య తరగతి ప్రజలున్నారు. ఇది ప్రపంచవ్యాప్త మధ్య తరగతిలో 3 శాతం. ఏడాదికి రూ.7.37 లక్షల ఆదాయాన్నిచ్చే సంపద ఉన్న వారినే ఈ కేటగిరీలోకి తీసుకున్నారు. అంటే నెలకు కనీసం రూ.61,480. దేశంలోని ఈ 2.36 కోట్ల మంది చేతిలో దాదాపు 780 బిలియన్ డాలర్ల సంపద ఉంది. ఇది దేశ సంపదలో నాలుగో వంతు. -
వృద్ధి అంచనాలకు కోత: ఎన్సీఏఈఆర్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) వృద్ధి రేటు అంచనాలను అప్లైడ్ ఎకనమిక్ రిసెర్చ్ నేషనల్ కౌన్సిల్(ఎన్సీఏఈఆర్) తగ్గిం చింది. వృద్ధి రేటును ఇంతక్రితం 5.7 శాతం అంచనావేయగా, తాజాగా 5 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణం తగ్గడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం సానుకూల అంశాలైనప్పటికీ- దేశంలో తక్కువ వర్షపాతం, పంట దిగుబడులు తగ్గే అవకాశం, ఇతర అంతర్జాతీయ అనిశ్చితి అంశాలు వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ ప్రముఖ ఆర్థిక పరిశోధనా సంస్థ అభిప్రాయపడింది. విదేశాల్లో ఆర్థిక రికవరీ ధోరణి పటిష్టంగా లేదని, దేశీయంగా బ్యాంకుల్లో రుణ రేట్లు పెరగడం లేదని పేర్కొంది. భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5 శాతం వృద్ధిని, 2015-16లో 5.6 శాతం వృద్ధిని సాధించవచ్చని మూడీస్ ఇటీవలి నివేదిక పేర్కొంది. 2014-15లో భారత్ జీడీపీ వృద్ధి రేటును ప్రపంచబ్యాంక్ సైతం 5.6 శాతంగా అంచనావేసింది. -
గట్టెక్కినట్టే..!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2013 ఏప్రిల్ నుంచి 2014 మార్చి వరకూ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 4.9 శాతంగా ప్రభుత్వం అంచనా వేసింది. జీడీపీ వృద్ధి ముందస్తు అంచనాలను కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాలు గత ఆర్థిక సంవత్సరం (2012-13)కన్నా కొంత మెరుగ్గా ఉన్నాయి. గత ఏడాది ఈ రేటు 4.5 శాతం మాత్రమే. వ్యవసాయం, అనుబంధ రంగాలు 2013-2014 ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు పెరగడానికి ప్రధానంగా చేయూతనిస్తాయని గణాంకాలు పేర్కొన్నాయి. తలసరి ఆదాయం రూ. 39,961: 2004-05 ధరల ఆధారంగా వాస్తవ ప్రాతిపదికన తలసరి ఆదాయం 2013-14లో రూ.39,961 ఉండవచ్చని అంచనా. 2012-13లో ఈ మొత్తం రూ. 38,856. అంటే 2.8 శాతం పెరిగింది. ఈ రేటు 2012-13లో 2.1 శాతం. ఇక ద్రవ్యోల్బణం, తత్సంబంధ అంశాలను పరిగణలోకి తీసుకోకుంటే (ప్రస్తుత ధరల ప్రాతిపదికన) ఈ రెండేళ్లలో తలసరి ఆదాయం 10.4 శాతం వృద్ధితో రూ.67,839 నుంచి రూ. 74,920కి చేరవచ్చు. దీని ప్రకారం భారత్ మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిమాణం 1.7 ట్రిలియన్ డాలర్లు. రూపాయల్లో అక్షరాలా రూ.105.39 లక్షల కోట్లు. మొత్తం జాతీయ ఆదాయాన్ని దేశ ప్రజలతో భాగిస్తే- వచ్చేదే తలసరి ఆదాయం. ప్రస్తుత ధరల ప్రాతిపదికన చూస్తే- మొత్తం జీడీపీ 12.26 శాతం వృద్ధితోరూ.99.88 లక్షల కోట్ల నుంచి రూ. 105.39 లక్షల కోట్లకు చేరవచ్చు. దేశ మొత్తం జనాభా 2013 మార్చిలో 121.7 కోట్లు ఉండగా, 2014 మార్చి నాటికి రూ. 123 కోట్లకు పెరుగుతుందని అంచనా. పెట్టుబడుల పరిస్థితి పెట్టుబడులకు సూచిక అయిన స్థూల స్థిర పెట్టుబడుల కూర్పు (జీఎఫ్‌సీఎఫ్) ప్రస్తుత ధరల ప్రాతిపదికన రూ.30.7 లక్షల కోట్ల నుంచి రూ. 32.2 లక్షల కోట్లకు పెరగవచ్చు. అయితే ద్రవ్యోల్బణం తత్సంబంధ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ- 2004-05 ధరల ప్రకారం ఈ విలువ రూ. 20 లక్షల కోట్ల నుంచి రూ. 20.1 లక్షల కోట్లకు మాత్రమే పెరుగుతుందని అంచనా. అసలు ఈ అంచనాలు ఎందుకు? సహజంగా ఫిబ్రవరిలో ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతుంది. ఈ బడ్జెట్‌కు ముందే వివిధ రంగాల పనితీరు, వృద్ధి సంబంధిత అంచనాలపై ప్రభుత్వానికి ఒక అవగాహన అవసరం. ఈ అవగాహన ప్రధాన లక్ష్యంగానే సీఎస్ఓ జీడీపీ ముందస్తు అంచనాలను ఆవిష్కరిస్తుంది. ప్రభుత్వంలోని ఆర్థిక నిర్ణేతలు ఈ ‘అంచనా’ గణాంకాలకు కట్టుబడాల్సిన పనిలేదు. మరిన్ని చర్యలు అవసరం: పరిశ్రమలు తాజా గణాంకాల పట్ల పారిశ్రామిక వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. మౌలిక రంగంపై ప్రత్యేక దృష్టి అవసరమని పేర్కొన్నాయి. బలహీన వినియోగం, పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయాల నేపథ్యంలో డిమాండ్ పుంజుకున్నట్లు సంకేతాలు కనిపించడం లేదని పేర్కొన్నాయి. ముఖ్యంగా తయారీ, మైనింగ్ రంగాల పురోగతి కీలకమని వ్యాఖ్యానించాయి. సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ, నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఊపును ఇవ్వడానికి ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సమీప భవిష్యత్తులో వృద్ధి పునరుత్తేజమవుతుందన్న ఆశలు ఆవిరవుతున్నట్లు అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 5.5 శాతానికి మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ శరద్ జైపూరియా వ్యక్తం చేశారు. ముఖ్య రంగాలు ఇలా... వ్యవసాయం, అనుబంధ రంగాలు: మొత్తం జీడీపీలో దాదాపు 14 శాతం వరకూ వాటా ఉన్న ఈ రంగం వృద్ధి రేటు 4.6 శాతంగా ఉండవచ్చు. ఈ రేటు 2012-13లో 1.4 శాతం మాత్రమే. తయారీ: జీడీపీలో దాదాపు 15 శాతం ఉన్న ఈ రంగంలో అసలు వృద్ధి లేదు. గత ఏడాదితో పోల్చితే -0.2 క్షీణించవచ్చు. 2012-13లో ఈ రంగం 1.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. సేవల రంగం (ఫైనాన్స్, బీమా, రియల్టీ, బిజినెస్ సేవలుసహా): జీడీపీలో దాదాపు 55% వాటా కలిగిన ఈ విభాగం వృద్ధి 11.2%గా నమోదుకావచ్చు. 2012-13లో ఈ రంగం వృద్ధి రేటు 10.9%. మైనింగ్ అండ్ క్వారీ: క్షీణతలోనే కొనసాగుతుంది. అయితే క్షీణత -2.2 శాతం నుంచి -1.9 శాతానికి తగ్గొచ్చు. నిర్మాణం: ఈ రంగంలో కూడా వృద్ధి 1.1 శాతం నుంచి 1.7 శాతానికి మెరుగుపడనుంది. విద్యుత్, గ్యాస్, నీటి పారుదల రంగం: వృద్ధి రేటు 2.3 శాతం నుంచి 6 శాతానికి పెరిగే అవకాశం వాణిజ్యం, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు: వృద్ధి రేటు 5.1 శాతం నుంచి 3.5 శాతానికి పడిపోయే అవకాశం. కమ్యూనిటీ సామాజిక, వ్యక్తిగత సేవలు: ఈ రంగంలో వృద్ధి రేటు 5.3 శాతం నుంచి 7.4 శాతానికి ఎగియనుంది.