న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2013 ఏప్రిల్ నుంచి 2014 మార్చి వరకూ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 4.9 శాతంగా ప్రభుత్వం అంచనా వేసింది. జీడీపీ వృద్ధి ముందస్తు అంచనాలను కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాలు గత ఆర్థిక సంవత్సరం (2012-13)కన్నా కొంత మెరుగ్గా ఉన్నాయి. గత ఏడాది ఈ రేటు 4.5 శాతం మాత్రమే. వ్యవసాయం, అనుబంధ రంగాలు 2013-2014 ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు పెరగడానికి ప్రధానంగా చేయూతనిస్తాయని గణాంకాలు పేర్కొన్నాయి.
తలసరి ఆదాయం రూ. 39,961: 2004-05 ధరల ఆధారంగా వాస్తవ ప్రాతిపదికన తలసరి ఆదాయం 2013-14లో రూ.39,961 ఉండవచ్చని అంచనా. 2012-13లో ఈ మొత్తం రూ. 38,856. అంటే 2.8 శాతం పెరిగింది. ఈ రేటు 2012-13లో 2.1 శాతం. ఇక ద్రవ్యోల్బణం, తత్సంబంధ అంశాలను పరిగణలోకి తీసుకోకుంటే (ప్రస్తుత ధరల ప్రాతిపదికన) ఈ రెండేళ్లలో తలసరి ఆదాయం 10.4 శాతం వృద్ధితో రూ.67,839 నుంచి రూ. 74,920కి చేరవచ్చు.
దీని ప్రకారం భారత్ మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిమాణం 1.7 ట్రిలియన్ డాలర్లు. రూపాయల్లో అక్షరాలా రూ.105.39 లక్షల కోట్లు. మొత్తం జాతీయ ఆదాయాన్ని దేశ ప్రజలతో భాగిస్తే- వచ్చేదే తలసరి ఆదాయం. ప్రస్తుత ధరల ప్రాతిపదికన చూస్తే- మొత్తం జీడీపీ 12.26 శాతం వృద్ధితోరూ.99.88 లక్షల కోట్ల నుంచి రూ. 105.39 లక్షల కోట్లకు చేరవచ్చు. దేశ మొత్తం జనాభా 2013 మార్చిలో 121.7 కోట్లు ఉండగా, 2014 మార్చి నాటికి రూ. 123 కోట్లకు పెరుగుతుందని అంచనా.
పెట్టుబడుల పరిస్థితి
పెట్టుబడులకు సూచిక అయిన స్థూల స్థిర పెట్టుబడుల కూర్పు (జీఎఫ్‌సీఎఫ్) ప్రస్తుత ధరల ప్రాతిపదికన రూ.30.7 లక్షల కోట్ల నుంచి రూ. 32.2 లక్షల కోట్లకు పెరగవచ్చు. అయితే ద్రవ్యోల్బణం తత్సంబంధ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ- 2004-05 ధరల ప్రకారం ఈ విలువ రూ. 20 లక్షల కోట్ల నుంచి రూ. 20.1 లక్షల కోట్లకు మాత్రమే పెరుగుతుందని అంచనా.
అసలు ఈ అంచనాలు ఎందుకు?
సహజంగా ఫిబ్రవరిలో ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతుంది. ఈ బడ్జెట్‌కు ముందే వివిధ రంగాల పనితీరు, వృద్ధి సంబంధిత అంచనాలపై ప్రభుత్వానికి ఒక అవగాహన అవసరం. ఈ అవగాహన ప్రధాన లక్ష్యంగానే సీఎస్‌ఓ జీడీపీ ముందస్తు అంచనాలను ఆవిష్కరిస్తుంది. ప్రభుత్వంలోని ఆర్థిక నిర్ణేతలు ఈ ‘అంచనా’ గణాంకాలకు కట్టుబడాల్సిన పనిలేదు.
మరిన్ని చర్యలు అవసరం: పరిశ్రమలు
తాజా గణాంకాల పట్ల పారిశ్రామిక వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. మౌలిక రంగంపై ప్రత్యేక దృష్టి అవసరమని పేర్కొన్నాయి. బలహీన వినియోగం, పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయాల నేపథ్యంలో డిమాండ్ పుంజుకున్నట్లు సంకేతాలు కనిపించడం లేదని పేర్కొన్నాయి. ముఖ్యంగా తయారీ, మైనింగ్ రంగాల పురోగతి కీలకమని వ్యాఖ్యానించాయి.
సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ, నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఊపును ఇవ్వడానికి ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సమీప భవిష్యత్తులో వృద్ధి పునరుత్తేజమవుతుందన్న ఆశలు ఆవిరవుతున్నట్లు అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 5.5 శాతానికి మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ శరద్ జైపూరియా వ్యక్తం చేశారు.
ముఖ్య రంగాలు ఇలా...
వ్యవసాయం, అనుబంధ రంగాలు: మొత్తం జీడీపీలో దాదాపు 14 శాతం వరకూ వాటా ఉన్న ఈ రంగం వృద్ధి రేటు 4.6 శాతంగా ఉండవచ్చు. ఈ రేటు 2012-13లో 1.4 శాతం మాత్రమే.
తయారీ: జీడీపీలో దాదాపు 15 శాతం ఉన్న ఈ రంగంలో అసలు వృద్ధి లేదు. గత ఏడాదితో పోల్చితే -0.2 క్షీణించవచ్చు. 2012-13లో ఈ రంగం 1.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.
సేవల రంగం (ఫైనాన్స్, బీమా, రియల్టీ, బిజినెస్ సేవలుసహా): జీడీపీలో దాదాపు 55% వాటా కలిగిన ఈ విభాగం వృద్ధి 11.2%గా నమోదుకావచ్చు. 2012-13లో ఈ రంగం వృద్ధి రేటు 10.9%.
మైనింగ్ అండ్ క్వారీ: క్షీణతలోనే కొనసాగుతుంది. అయితే క్షీణత -2.2 శాతం నుంచి -1.9 శాతానికి తగ్గొచ్చు.
నిర్మాణం: ఈ రంగంలో కూడా వృద్ధి 1.1 శాతం నుంచి 1.7 శాతానికి మెరుగుపడనుంది.
విద్యుత్, గ్యాస్, నీటి పారుదల రంగం: వృద్ధి రేటు 2.3 శాతం నుంచి 6 శాతానికి పెరిగే అవకాశం వాణిజ్యం, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు: వృద్ధి రేటు 5.1 శాతం నుంచి 3.5 శాతానికి పడిపోయే అవకాశం. కమ్యూనిటీ సామాజిక, వ్యక్తిగత సేవలు: ఈ రంగంలో వృద్ధి రేటు 5.3 శాతం నుంచి 7.4 శాతానికి ఎగియనుంది.
గట్టెక్కినట్టే..!
Published Sat, Feb 8 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement
Advertisement