Gross Domestic Product
-
ఎకానమీ స్పీడ్ 6.4 శాతమే..
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మార్చితో ముగిసే ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6.4 శాతానికి పడిపోయే అవకాశాలు ఉన్నాయని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ముందస్తు అంచనాలు సూచిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ రేటు నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయి అవుతుంది. ముఖ్యంగా తయారీ, సేవల రంగాల పనితీరు బలహీనంగా ఉండడం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. 2020–21లో కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8 శాతం క్షీణతను నమోదుచేసిన సంగతి తెలిసిందే.అటు తర్వాత 6.4 శాతం వృద్ధి రేటు నమోదయితే అది నాలుగేళ్ల కనిష్ట స్థాయి అవుతుంది. బేస్ ఎఫెక్ట్‌తో 2021–22లో ఎకానమీ వృద్ధి రేటు 9.7 శాతంగా నమోదయ్యింది. 2022–23లో 7 శాతం, 2023–24లో 8.2 శాతంగా ఈ రేట్లు ఉన్నాయి. 2024–25పై జాతీయ గణాంకాల కా ర్యాలయం తాజా అంచనాలు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) డిసెంబర్ 2024లో అంచనా వేసిన 6.6 శాతంతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వశాఖ తొలి అంచనా 7 శాతంకన్నా కూడా ఈ అంచానలు తక్కువగా ఉండడం గమనార్హం. ఆర్బీఐ పాలసీ అంచనాలు ఇవీ.. ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 6.6 శాతంగా అంచనావేసిన ఆర్బీఐ ఇటీవలి ద్రవ్య పరపతి విధాన సమీక్ష క్యూ3లో 6.8 శాతం, క్యూ4లో 7.2 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని, 2025–26 మొదటి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) వరుసగా 6.9 శాతం, 7.3 శాతం వృద్ధి నమోదవుతుందని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 6.7 శాతం వృద్ధి నమోదవగా, రెండవ క్వార్టర్లో 7 క్వార్టర్ల కనిష్ట స్థాయి లో 5.4 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే.కీలక రంగాలపై అంచనాలు..తయారీ రంగం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 5.3 శాతంగా అంచనా. గత ఆర్థిక సంవత్సరం ఈ విభాగం 9.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. సేవల రంగం: ఎకానమీలో మెజారిటీ వాటా కలిగిన ఈ రంగం వృద్ధి అంచనా 5.8 శాతం. 2023–24లో ఈ రేటు 6.4 శాతం. వ్యవసాయం: కొంత మెరుగైన ఫలితం వెలువడనుంది. 3.8 శాతం వృద్ధి నమోదవుతుందని గణాంకాలు అంచనా వేస్తున్నాయి. 2023–24లో 1.4 శాతంతో పోలిస్తే ఇది మెరుగైన స్థాయి కావడం గమనార్హం. ఎకానమీ లెక్కలు ఇలా... ⇒ 2024–25లో ఎకానమీ విలువ 3.8 ట్రిలియన్ డాలర్లు (డాలర్ మారకంలో రూపాయి విలువ రూ.85.71 ప్రాతిపదికన) ⇒ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుత ధరల ప్రకారం 2024–25లో జీడీపీ విలువ అంచనా రూ. 324.11 లక్షల కోట్లు, 2023–24లో ఈ విలువ రూ. 295.36 లక్షల కోట్లు. అంటే వృద్ధి 9.7 శాతం. ⇒ ప్రైవేట్ తుది వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 7.3 శాతం. గత సంవత్సరంలో ఈ రేటు 4 శాతం. ప్రభుత్వ తుది వినియోగ వ్యయం (జీఎఫ్‌సీఈ): 2024–25లో 4.1 శాతం వృద్ధి, 2023–24లో ఈ రేటు 2.5 శాతం. తలసరి ఆదాయం: ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకోకుండా 2024–25లో ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం 8.7 శాతం పెరిగి రూ. 2,00,162కు చేరుకునే అవకాశం ఉంది. 2023–24లో ఈ విలువ రూ. 1,84,205. ముందస్తు గణాంకాల ప్రాధాన్యత!ఫిబ్రవరి 1న లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్న కేంద్ర బడ్జెట్‌కు సన్నాహకంగా తాజా ముందస్తు అంచనాలు ఉపయోగపడతాయి. తగిన అంచనాలు... 2024–25 ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలు సమంజసంగానే ఉన్నాయి. అయితే కొన్ని రంగాలు అధిక వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఎకానమీపై కూడా అంతర్జాతీయ అనిశ్చితిలు, భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం పడే అవకాశం ఉంది. ఆయా అంశాలు పరిగనణలోకి తీసుకుంటూ 2025–25లో జీడీపీ వృద్ధి రేటును 6.5 శాతంగా మేము అంచనా వేస్తున్నాం. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్మూలధన వ్యయ తగ్గుదల ప్రభావం కరోనా మహమ్మారి తర్వాత ఎకానమీ పురోగతిలో ప్రభుత్వ మూలధన వ్యయాలు కీలకంగా మారాయి. వీటి తగ్గుదల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ఇక పట్టణ ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణం అలాగే రుణ వృద్ధి మందగమనం సవాళ్లను ఎదుర్కొంటోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల విశ్వాసం తగ్గింది. పట్టణ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపే రిటైల్ క్రెడిట్ వృద్ధి మందగించింది. – ధర్మకీర్తి జోషి, క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్వృద్ధి 6.2 శాతానికి పరిమితం: హెచ్ఎస్బీసీప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.2 శాతమేనని విదేశీ బ్రోకరేజ్ సంస్థ– హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది. అధికారిక అంచనాతో పోలిస్తే ఇది మరింత తక్కువగా ఉండడం గమనార్హం. అయితే ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.5 శాతానికి పెరుగుతుందని నివేదిక విశ్లేíÙంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై –సెప్టెంబర్) వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదుకావడం నిరాశాజనకంగా ఉన్నట్లు హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది. క్యూ2 తర్వాత పరిస్థితులు మెరుగు... ‘‘మేము విశ్లేíÙంచే 100 సూచికల ప్రకారం సెప్టెంబర్ తరువాత వృద్ధి సూచికలు మెరుగుపడ్డాయి. అయితే జూన్ త్రైమాసికంతో ఇంకా బలహీనంగానే ఉన్నాయి’’ అని నివేదిక పేర్కొంది. జూలై–సెపె్టంబర్ కాలంలో 55 శాతం సూచికలు సానుకూలంగా వృద్ధి చెందగా, డిసెంబర్ త్రైమాసికంలో ఇది 65 శాతానికి పెరిగిందని తెలిపింది. వ్యవసాయం, ఎగుమతులు, నిర్మాణ రంగాల్లో మెరుగుదల అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నివేదిక తెలిపింది. ఇటీవల వారంలో చాలా చర్చనీయాంశంగా మారిన పట్టణ వినియోగంలో కూడా డిసెంబర్ త్రైమాసికంలో కొంత మెరుగుదల కనిపించిందని నివేదిక పేర్కొంది.అయితే, వినియోగ విద్యుత్ సేవలు, ప్రైవేటు పెట్టుబడుల సూచికలు ఇంకా బలహీనంగానే ఉన్నాయని తెలిపింది. జూన్ త్రైమాసికంలో 75 శాతం సూచికలు సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితి అంత బాగోలేదని నివేదిక వెల్లడించింది. 2024–25లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.9 శాతంగా ఉంటుందని, 2025–26లో ఇది 4.4 శాతానికి నివేదిక పేర్కొంది. నవంబరులో 5.5 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం డిసెంబరులో 5.3 శాతానికి, జనవరిలో 5 శాతం కంటే తక్కువకు పడిపోతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. అరశాతం రెపో రేటు కోత అంచనా... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధానం ఫిబ్రవరి, ఏప్రిల్ విధాన సమీక్షలలో 0.25 శాతం చొప్పున రెండు రేట్ల కోత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. వృద్ధే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ ప్రస్తుత 6.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గే అవకాశం ఉంది. 2025–26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయడానికి వ్యయ నియంత్రణ అవసరమని పేర్కొన్న నివేదిక, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుండడమే దీనికి కారణంగా వివరించింది. -
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..?
ముంబై: భారత్ 2026 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని, దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ అప్పటికి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, 2027లో 5.5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా విశ్లేషించారు. ‘ఇండియా ఎట్ 125: రీక్లెయిమింగ్ ది లాస్ట్ గ్లోరీ అండ్ రిటరి్నంగ్ ది గ్లోబల్ ఎకానమీ టు ది ఓల్డ్ నార్మల్’ అనే శీర్షికతో 18వ సీడీ దేశ్‌ముఖ్ మెమోరియల్ లెక్చర్‌లో ఆయన ఈ మేరకు మాట్లాడుతూ, ప్రస్తుత డాలర్ పరంగా జర్మనీ లేదా జపాన్ జీడీపీ వచ్చే మూడేళ్లలో 5 ట్రిలియన్ డాలర్లను దాటే అవకాశం లేదని అన్నారు. జపాన్ తన 2022 స్థాయి 4.2 ట్రిలియన్ డాలర్ల నుండి 2027లో 5.03 ట్రిలియన్ డాలర్లను చేరుకోవడానికి ప్రస్తుత డాలర్ పరంగా 3.5 శాతం వృద్ధి రేటును కొనసాగించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇది సాధ్యం కాకపోవచ్చని వివరించారు. 4 శాతం వార్షిక వృద్ధితో జర్మనీ జీడీపీ 2023లో 4.4 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని, 2025 నాటికి 4.9 ట్రిలియన్ డాలర్ల స్థాయికి ఎదుగుతుందని, 2027 నాటికి 5.1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవిస్తుందని అన్నారు. ఈ అంచనాలను బట్టి చూస్తే, భారత జీడీపీ ఈ రెండు దేశాల జీడీపీలను ఎంత త్వరగా దాటగలదన్నది ప్రశ్నని అన్నారు. భారత్ 2026 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందన్న పూర్తి విశ్వాసం తనకు ఉందని వివరించారు. చింతామన్ ద్వారకానాథ్ దేశ్‌ముఖ్ (డీసీ దేశ్‌ముఖ్) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పనిచేసిన మొదటి భారతీయుడు. 1943 నుండి 1949 వరకు ఆయన పదవీకాలంలో, 1949 బ్యాంకింగ్ కంపెనీల చట్టం అమల్లోకి వచ్చింది తరువాత దీనిని బ్యాంకింగ్ నియంత్రణ చట్టంగా పేరు మార్చడం జరిగింది. గణాంకాల ప్రకారం, 1980–81లో భారత్ ఎకానమీ పరిమాణం 189 బిలియన్ డాలర్లు. దశాబ్దకాలం గడిచే సరికి ఈ విలువ 326 బిలియన్ డాలర్లకు చేరింది. 2000–01 నాటికి 476 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2010–11 నాటికి ఈ విలువ 1.71 ట్రిలియన్ డాలర్లకు చేరగా, 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2.67 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారింది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ విలువ 3.75 ట్రిలియన్ డాలర్లు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98,374) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. -
India GDP: వృద్ధి జోరులో మనమే టాప్..!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రెండవ త్రైమాసికంలో అంచనాలకు మించి 8.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. తద్వారా ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్ నిలబెట్టుకుంది. మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 20.1 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. వెరసి రెండు త్రైమాసికాల్లో (ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో) వృద్ధి రేటు 13.7 శాతమని మంగళవారం వెలువడిన గణాంకాలు వెల్లడించాయి. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) సెకండ్‌వేవ్ ప్రభావం లేకపోతే ఎకానమీ మరింత పురోగమించేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్యూ2లో 7.9 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా అధికంగా తాజా గణాంకాలు వెలువడ్డం గమనార్హం. వివిధ సంస్థలు, రేటింగ్ సంస్థల అంచనాలు సైతం 7.8 శాతం నుంచి 8.3 శాతం శ్రేణిలోనే ఉన్నాయి. మరోవైపు రెండవ త్రైమాసికంలో ఈ స్థాయి గణాంకాల నమోదుకు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లో బేస్ ప్రధాన (బేస్ ఎఫెక్ట్) కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా సవాళ్లతో అప్పట్లో ఎకానమీ వృద్ధిలేకపోగా 7.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. విలువల్లో ఇలా... తాజా సమీక్షా త్రైమాసికం జూలై–సెప్టెంబర్ మధ్య ఎకానమీ విలువ రూ.35.73 లక్షల కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.32.96 లక్షల కోట్లు. వెరసి ఎకానమీ వృద్ధి రేటు 8.4 శాతంగా నమోదయ్యింది. కోవిడ్–19 సవాళ్లు దేశంలో ప్రారంభంకాని 2019–20 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఎకానమీ విలువతో పోల్చి చూస్తే, ఎకానమీ విలువ స్వల్పంగా 0.33 శాతం అధికంగా నమోదయ్యింది. కాగా, ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఎకానమీ విలువలు రూ.59.92 లక్షల కోట్ల నుంచి (2020–21 తొలి ఆరునెలల్లో) రూ.68.11 లక్షల కోట్లకు (13.7 శాతం వృద్ధి) పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో అసలు వృద్ధి లేకపోగా 15.9 శాతం క్షీణత నమోదయ్యింది. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ♦తాజా సమీక్షా నెల్లో ప్రభుత్వ వ్యయాల్లో 8.7% వృద్ధి నమోదవడం, తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ, పెరిగిన వినియోగం ఎకానమీ లో సానుకూలతను సృష్టించాయి. ♦తగిన వర్షపాతంలో జీడీపీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం మంచి ఫలితాన్ని ఇచ్చింది. 4.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ♦దేశీయ డిమాండ్, ఎగుమతులు పెరగడంతో తయారీ రంగంలో 5.5 శాతం పురోగతి నమోదయ్యింది. మొత్తం జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా దాదాపు 15 శాతం అయితే, అందులో తయారీ రంగం వాటానే దాదాపు 78 శాతం. ♦నిర్మాణం, ట్రేడ్, హోటల్స్ రవాణా, ఫైనాన్షియల్ సేవల రంగాల్లో 7 నుంచి 8 శాతం వృద్ధి రేట్లు నమోదయ్యాయి. ♦ప్రభుత్వ సేవలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ రంగాల్లో 17.4 శాతం వృద్ధి నమోదుకావడం సానుకూల పరిణామం. ♦ఇక ఉత్పత్తి స్థాయి వరకూ లెక్కించే జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)లో వృద్ధి రేటు జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 8.5 శాతంగా నమోదయ్యింది. ♦కాగా, జూలై–సెప్టెంబర్ మధ్య చైనా వృద్ధి రేటు 4.9 శాతం. 2021–22పై అంచనాలు ఇలా... గడచిన ఆర్థిక సంవత్సరం (2020–21) కరోనా సవాళ్లతో ఎకానమీ 7.3 శాతం క్షీణతను నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2021–22లో వృద్ధి రేటు 11 శాతంగా ఉంటుందని ఈ ఏడాది జనవరిలో విడుదలైన ఎకనమిక్ సర్వే పేర్కొంది. అయితే అటు తర్వాత ఏప్రిల్, మే నెలల్లో సెకండ్‌వేవ్ దేశాన్ని కుదిపివేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 9.3 శాతం–9.6% శ్రేణిలో ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. క్యూ3లో 6.8%, క్యూ4లో 6.1% వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ ఇటీవలి పాలసీ సమీక్ష పేర్కొంది. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) మంగళవారం ఒక నివేదికను విడుదల చేస్తూ, 2021–22లో భారత్ ఎకానమీ 9.5 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని అంచనా వేసింది. 2022–23 ఏడాదిలో ఈ రేటు 7.8% ఉంటుందని విశ్లేషించింది. రెండంకెల వృద్ధి దిశగా... భారత్ 2021–22 ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి దిశగా పయనిస్తోంది. డిమాండ్‌లో గణనీయ వృద్ధి, బ్యాంకింగ్ రంగం పురోగతి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. క్రితం త్రైమాసికాల్లో దాదాపు 6 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, సెప్టెంబర్ వరకూ గడచిన త్రైమాసికాల్లో వృద్ధి రేటు 13.7 శాతం నమోదుకావడం హర్షణీయ పరిణామం. 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేట్లు వరుసగా 7 శాతం వరకూ ఉంటుందని భావిస్తున్నాం. కేంద్రం చేపడుతున్న రెండవ తరం ఆర్థిక సంస్కరణలు ఇందుకు దోహపడతాయని భావిస్తున్నాం. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, రుణ భారాల కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. మూలధన వ్యయాల పెంపునకు కృషి జరుగుతుంది. – కేవీ సుబ్రమణియన్, ప్రధాన ఆర్థిక సలహాదారు -
ఆర్థిక వృద్ధికి ఊతం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాత్మక సారథ్యానికి ప్రజలు మరోసారి రికార్డు మెజారిటీతో పట్టం కట్టారని భారతీయ పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుతో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, విదేశీ పెట్టుబడుల రాకకు ఊతం లభించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశాయి. ఎకానమీని అధిక వృద్ధి బాట పట్టించేందుకు ఎన్డీయే 2.0 మరిన్ని సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టాలని ఆనంద్ మహీంద్రా, ఆది గోద్రెజ్, అనిల్ అగర్వాల్, సునీల్ మిట్టల్ తదితర దిగ్గజాలు అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి దోహదపడే చర్యలు తీసుకోగలదని ఆశిస్తున్నట్లు గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్ చెప్పారు. ఈ దిశగా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘ప్రపంచంలోనే అత్యధిక కార్పొరేట్ ట్యాక్స్ భారత్‌లోనే ఉంది. దీన్ని తగ్గించాల్సి ఉంది. దీన్ని 25 శాతానికి తగ్గిస్తామని ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. చిన్న కంపెనీలకు తగ్గించినా .. పెద్ద కంపెనీలకు ఇంకా తగ్గించలేదు. దీంతో పాటు వృద్ధికి ఊతమిచ్చేలా మరిన్ని చర్యలు ఉంటాయని ఆశిస్తున్నా‘ అని ఆయన తెలిపారు. వృద్ధి, ఉద్యోగ కల్పనకి ఊతమిచ్చే చర్యలతో పాటు అంతర్జాతీయంగా వాణిజ్యంలో భారత్ స్థానాన్ని మరింత పటిష్టం చేయడం, పన్ను చట్టాలను సరళతరం చేయడం తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ చెప్పారు. ప్రధాని మోదీ నిర్ణయాత్మక సారథ్యం, దార్శనికతపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలు నిదర్శనమని భారతీ ఎయిర్టెల్ వ్యవస్థాపక చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. ఆర్థిక వృద్ధి ఫలాలు పేదలకు కూడా చేరవేసే ఆర్థిక ఎజెండాను అమలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఇవి మరింతగా ఊతమివ్వగలవని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే శక్తిమంతమైన నేతగా మోదీ ప్రజాస్వామికంగా ఎన్నికైన అత్యంత శక్తిమంతమైన నేతగా మోదీ నిలవనున్నారని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చెప్పారు. ‘దేశ పరిమాణం (జనాభా+స్థలం) గీ ఎకానమీ పరిమాణం గీ ఎన్నికల ఫలితాల పరిమాణం = నాయకుడి శక్తికి కొలమానం. ఈ ఫార్ములా ప్రకారం చూస్తే నరేంద్ర మోదీ నేడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, ప్రజాస్వామికంగా ఎన్నికైన నాయకుడిగా నిలుస్తారు‘ అని మహీంద్రా ట్వీట్ చేశారు. మరోవైపు, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. ‘సాహసోపేతమైన సంస్కరణలు తీసుకోవడానికి, దేశానికి కొత్త రూపునిచ్చేందుకు ఇదే సరైన సమయం. వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అదే సమయంలో అధిక ఉత్పాదకత ఉండే ఉద్యోగాల కల్పన బాధ్యతను వ్యాపారవేత్తలు తీసుకోవాలి‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేశారు. ‘వచ్చే అయిదేళ్లలో ఎన్డీయే 2.0 ఆర్థిక వృద్ధి ఫలాలు అందరికీ అందేలా సాహసోపేతమైన విధానాలు ప్రవేశపెట్టాలి‘ అని బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్–షా చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని విదేశీ పెట్టుబడులు భారత్‌లోకి రాగలవని స్టాక్ ఎక్సే్చంజీ బీఎస్ఈ సభ్యుడు రమేష్ దమాని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే రియల్ ఎస్టేట్ రంగ వృద్ధికి మరింత తోడ్పడగలదని హౌస్ ఆఫ్ హీరనందానీ వ్యవస్థాపకుడు సురేంద్ర హీరనందానీ తెలిపారు. పటిష్ట వృద్ధి కొనసాగింపునకు సంకేతాలు.. పటిష్టమైన వృద్ధికి ఊతమిచ్చేలా వచ్చే అయిదేళ్ల పాటు స్థూల ఆర్థిక విధానాలు యథాప్రకారం కొనసాగుతాయనడానికి ఎన్నికల ఫలితాలు నిదర్శనమని ఆర్థికవేత్తలు, బ్రోకరేజీలు అభిప్రాయపడ్డాయి. అయితే, ఆర్థిక సంస్కరణలను కొనసాగించడం పెద్ద సవాలుగా మారవచ్చని పేర్కొన్నాయి. రాజ్యసభలో ఇంకా పూర్తి మెజారిటీ లేనందున.. బీజేపీ సంస్కరణల చట్టాల అమలు ఎజెండాకు అడ్డంకులు ఎదురవొచ్చని అంచనా. -
క్యూ3లో క్యాడ్ 2.5 శాతం
ముంబై: దేశ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) అక్టోబర్–డిసెంబర్ కాలంలో (ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చిచూస్తే, 2.5%గా నమోదయ్యింది. విలువలో క్యాడ్ పరిమాణం 16.9 బిలియన్ డాలర్లు. 2017– 2018 ఇదే త్రైమాసికంలో ఈ విలువ 13.7 బిలియన్ డాలర్లు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ మధ్య ఈ విలువ 19.1 బిలియన్ డాలర్లు (జీడీపీలో 2.9 శాతం). రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. కాగా 2018 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ మొత్తం కాలాన్ని తీసుకుంటే, క్యాడ్ జీడీపీలో 2.6 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే కాలంలో ఈ రేటు 1.8%. ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం (ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా) మధ్య నికర వ్యత్యాసమే కరెంట్ అకౌంట్ లోటు. -
ప్రైవేట్ పెట్టుబడులకు తోడ్పాటునివ్వాలి
ముంబై: వృద్ధి రేటును మరింత మెరుగుపర్చుకోవాలనుకుంటే ప్రైవేట్ పెట్టుబడులకు ఊతమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం విధానపరమైన చర్యలు లేదా పన్నుపరమైన ప్రయోజనాలను పరిశీలించవచ్చని ఆయన చెప్పారు. తద్వారా 7 శాతం వృద్ధి దగ్గరే చిక్కుబడిపోకుండా మరింత మెరుగ్గా రాణించేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్యకాలంలో వృద్ధి అంచనాలను రిజర్వ్ బ్యాంక్ 7.2–7.4 శాతానికి పరిమితం చేసిన నేపథ్యంలో కోటక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 7.1 శాతం మాతమ్రే నమోదైంది. మరోవైపు, వ్యవస్థలో ద్రవ్యకొరత కారణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగ కార్యకలాపాలు దాదాపు స్తంభించిపోయిన నేపథ్యంలో ద్రవ్య లభ్యత మెరుగుపర్చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని ఉదయ్ కోటక్ చెప్పారు. ఇన్ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం కారణంగా ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారాయని.. అయితే ఈ సమస్య వ్యవస్థాగతమైనది కాదని, ఇన్వెస్టర్లు తీవ్ర భయాందోళనలకు గురికావడమే దీనికి కారణమని విశ్లేషించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సమస్య పరిష్కారానికి ఉదయ్ కోటక్ సారథ్యంలో ప్రభుత్వం కొత్త బోర్డును నియమించింది. -
భారత్ వృద్ధి తీరు భేష్!
వాషింగ్టన్/ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థపై సానుకూల అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3 శాతంగా ఉంటుందని తన తాజా నివేదికలో ప్రపంచబ్యాంక్ పేర్కొంది. ఇక వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఒక నివేదిక విడుదల చేస్తూ, భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద వినిమయ మార్కెట్‌గా అవతరించబోతోందని పేర్కొంది. మరోవైపు పీడబ్ల్యూసీ– ఫిక్కీ సర్వే వచ్చే 12 నెలల్లో భారత్ వృద్ధి రేటు 7%పైనే ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ చర్యలు వృద్ధికి దోహదపడతాయని భారత్ కార్పొరేట్ భావిస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది. ఆయా సంస్థల నివేదికల్లోని ముఖ్యాంశాలపై దృష్టి సారిస్తే... వినియోగం, పెట్టుబడుల దన్ను: ప్రపంచబ్యాంక్ భారత్ 2018–19 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి సాధిస్తుందని ప్రపంచబ్యాంక్ తన తాజా ‘‘2019 గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్’’ నివేదికలో పేర్కొంది. అటు తర్వాత వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో 7.5 శాతం చొప్పున వృద్ధి నమోదవుతుందని అంచనావేసింది. దేశంలో పటిష్ట వినియోగం, పెట్టుబడుల ధోరణి ఈ స్థాయి వృద్ధి రేటుకు దోహదపడే అంశాలుగా వివరించింది. ఈ స్థాయి వృద్ధితో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలుస్తుందని పేర్కొంది. ఇక చైనా వృద్ధి రేటు 2018లో 6.5% అయితే 2019, 2020ల్లో 6.2%కి పడిపోతుందని విశ్లేషించింది. 2021లో మరింతగా 6%కి పడిపోతుందని పేర్కొం ది. భారత్ వృద్ధి ధోరణి ప్రోత్సాహకరమైన రీతిలో కొనసాగుతోందని, ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే పరిస్థితి సానుకూలంగా ఉందని వరల్డ్ బ్యాంక్ ప్రాస్పెక్టŠస్ గ్రూప్ డైరెక్టర్ ఐహాన్ కోష్ పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల అవకాశాలను తట్టుకోవడానికి తగిన వ్యూహాలతో అభివృద్ధి చెందుతున్న దేశాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచబ్యాంక్ సూచించడం గమనార్హం. ప్రభుత్వ చర్యల సత్ఫలితాలు: సర్వే కేంద్రం తీసుకుంటున్న పలు విధానపరమైన చర్యలు ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయని పీడబ్ల్యూసీ–ఫిక్కీ సర్వే ఒకటి పేర్కొంది. వచ్చే 12 నెలల కాలంలో దేశం 7 శాతానికి పైగా వృద్ధి సాధిస్తుందని భారత్ కార్పొరేట్ రంగం భావిస్తున్నట్లు వివరించింది. దేశీయంగా పటిష్ట డిమాండ్ ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించింది. ఎగుమతుల మార్కెట్‌పై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందనీ, వృద్ధిలో ఈ విభాగం కూడా కీలక పాత్ర పోషించనుందని పేర్కొంది. 2018 జూలై–అక్టోబర్ మధ్య చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఫైనాన్షియల్ అధికారులు, భారత తయారీ రంగం వ్యూహాత్మక విభాగాల చీఫ్‌లతో ఇంటర్వ్యూల ద్వారా తాజా సర్వే రూపకల్పన జరిగింది. మౌలిక రంగం అభివృద్ధితో ప్రభుత్వ రంగం పటిష్టంగా ఉందని, వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డాయని, నియంత్రణా వ్యవస్థల పనితీరు సమర్థవంతంగా ఉందని పేర్కొన్న సర్వే, దీనితోపాటు పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) మార్గాలను సరళీకరణ వృద్ధికి దోహదపడే అంశాలని విశ్లేషించింది. మౌలిక రంగంలో పెట్టుబడులు మరిన్ని పెరగాలని సూచించింది. 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్లకు వినియోగం: డబ్ల్యూఈఎఫ్ అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడవ అతిపెద్ద వినిమయ దేశంగా అవతరించనుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం భారత్ వినియోగం 1.5 ట్రిలియన్ డాలర్లు. 2030 నాటికి ఈ విలువ 6 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతున్న అంచనాలను వెలువరించింది. ప్రస్తుతం భారత్ వ్యయాలకు సంబంధించి ప్రపంచంలో ఆరవ దేశంగా కొనసాగుతోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో దేశీయ ప్రైవేట్ వినియోగం 60 శాతంగా ఉంది. నైపుణ్యం మెరుగుదల, భవిష్యత్తులో ఉపాధి కల్పన, గ్రామీణ భారతంలో సామాజిక–ఆర్థిక పురోగతి, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై భారత్ తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా డబ్ల్యూఈఎఫ్ తన తాజా నివేదికలో వివరించింది. భారత్‌లోని 30 పట్టణాలు, నగరాల్లోని 5,100 కుటుంబాల అభిప్రాయాల ఆధారంగా తాజా సర్వే రూపొందింది. అలాగే దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో దాదాపు 40 ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఆర్థిక సంవత్సరంసహా వచ్చే రెండేళ్లలో భారత్ వృద్ధి రేటు 7% పైన ఉంటుందనేది ఫోరమ్ అంచనా. -
ఫెడ్ వడ్డీ రేటు పావు శాతం పెంపు..
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 2–2.25 శాతానికి చేరింది. ఉద్యోగాల కల్పన మెరుగ్గా ఉండటం, వ్యాపారాలపై పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు రోజుల ద్రవ్యపరపతి సమీక్ష అనంతరం ఫెడ్ వెల్లడించింది. దీంతో 2015 నుంచి ఇప్పటిదాకా ఎనిమిది సార్లు వడ్డీ రేట్లు పెంచినట్లయింది. ఈ ఏడాది మరోమారు వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చని ఫెడ్ సూచనప్రాయంగా తెలిపింది. స్థూల దేశీయోత్పత్తి రెండో త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 4 శాతం మేర వృద్ధి నమోదు చేయడం, నిరుద్యోగిత చరిత్రాత్మక కనిష్ట స్థాయి 4 శాతం దరిదాపుల్లో ఉండటంతో పాటు ద్రవ్యోల్బణం కూడా అంచనాలకు తగ్గట్లు రెండు శాతానికి చేరడం తదితర అంశాలు వడ్డీ రేట్ల పెంపునకు కారణమైనట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, త్వరితగతిన వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ మళ్లీ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం కూడా అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ద్రవ్య లోటు కట్టడికి.. రుణభారం అడ్డంకి: మూడీస్
న్యూఢిల్లీ: నిరంతరం కొనసాగుతున్న విధాన సంస్కరణలతో రుణభారం తగ్గుతుందన్న సానుకూల అంచనాల కారణంగానే భారత్‌కి పాజిటివ్ అవుట్‌లుక్ ఇచ్చినట్లు రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. అయితే, భారీస్థాయిలో పెరిగిపోయిన ప్రభుత్వ రుణభారం కారణంగా ద్రవ్యలోటును తక్షణం తగ్గించుకోవడానికి అవకాశం లేదని పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే స్థూలదేశీయోత్పత్తి, ప్రభుత్వ రుణ భార నిష్పత్తి చాలా అధికంగా 68.6 శాతం స్థాయిలో ఉందని మూడీస్ పేర్కొంది. దీనికి తోడు మొత్తం వ్యయాల్లో జీతభత్యాల వాటా 50% మేర ఉండటం, ఇటీవలి వేతన సవరణ సిఫార్సుల అమలు తదితర అంశాల నేపథ్యంలో ద్రవ్య విధానాలపై ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని మూడీస్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 3.9 శాతంగా ఉన్న ద్రవ్య లోటును ఈసారి 3.5 శాతానికి తగ్గించుకోవాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. -
జీడీపీపై కచ్చిత అంచనాల్ని వెల్లడించడం సాధ్యం కాదు
మాజీ చీఫ్ స్టాటిస్టీసియన్ ప్రణబ్ సేన్ న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016–17 ఏప్రిల్, మార్చి) సంబంధించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను ముందస్తుగా సమగ్రంగా అంచనావేయడం సాధ్యంకాదని మాజీ చీఫ్ స్టాటిస్టీసియన్ ప్రణబ్ సేన్అభిప్రాయపడ్డారు. 2016–17 జీడీపీ అంచనాలను వచ్చేనెల 6న కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రణబ్ సేన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతియేడాది ఫిబ్రవరి 28న బడ్జెట్ సమర్పిస్తుండగా, ఈ ఏడాది ఇందుకు భిన్నంగా ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్‌ను కేంద్రం సమర్పించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మామూలు షెడ్యూల్ సమయానికన్నా దాదాపు నెలరోజుల ముందే కీలక అంచనాల వెల్లడికి గణాంకాల మంత్రిత్వశాఖ కూడా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రణబ్ సేన్ చేసిన వ్యాఖ్యలు ... ► రబీ పంటకు సంబంధించి తగిన గణాంకాలు అందుబాటులో ఉండవు. అలాగే పెద్ద నోట్ల నిషేధం ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎంతస్థాయిలో ఉందన్న విషయమూ అప్పుడే చెప్పలేం. ► డిసెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు కూడా జనవరి 6 నాటికి వెలువడవు. ► ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. ఏ అంచనా అయినా ఊహాజనితమే తప్ప, వాస్తవ ప్రాతిపదికలు ఏమీ ఉండవు. ► డీమోనిటైజేషన్ నేపథ్యంలో– జీడీపీ 2 శాతం వరకూ పడిపోవచ్చన్న పలువురి ఆర్థికవేత్తల అంచనాల నేపథ్యంలో ప్రణబ్‌సేన్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. -
రేట్ల కోత కష్టమే..!
ముంబై: వడ్డీరేట్లు తగ్గించాలంటూ ఎవరెన్నిరకాలుగా డిమాండ్లు, విజ్ఞప్తులు చేసినా... ఈ సారి కూడా నిరాశే ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రానున్న పాలసీ సమీక్షలోనూ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రేట్లను తగ్గించకపోవచ్చని.. యథాతథంగా కొనసాగించేందుకే మొగ్గుచూపొచ్చని విశ్లేషకులు, రేటింగ్ ఏజెన్సీలు, బ్రోకరేజి సంస్థలు పేర్కొంటున్నాయి. డిసెంబర్ 2న ఆర్బీఐ ఐదో ద్వైమాసిక పరపతి విధాన సమీక్షను నిర్వహించనుంది. రేట్ల తగ్గింపు అనేది ఇక వచ్చే ఏడాదే ఉంటుందనేది మెజారిటీ నిపుణుల అభిప్రాయం. ఈ పాలసీ సమీక్షలో కీలక రేట్లు తగ్గే అవకాశాలు అంతంతమాత్రమేనని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది. అయితే ద్రవ్యోల్బణం లక్ష్యం విషయంలో ఆర్బీఐ ఎలాంటి వ్యాఖ్యలు, సంకేతాలు ఇస్తుందనేది చాలా కీలకమైన అంశమని వెల్లడించింది. తొలి రేట్ల కోత ఫిబ్రవరిలోనే...! ‘ద్రవ్యోల్బణం దిగొస్తున్నా... ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పాలసీ రేట్ల విషయంలో ఎలాంటి మార్పులూ చేయకపోచ్చు. అయితే, వడ్డీరేట్ల తగ్గింపువల్ల సెంటిమెంటు మెరుగయ్యేందుకు దోహదం చేస్తుంది’ అని కేర్ రేటింగ్స్ తెలిపింది. వరుసగా ఐదు నెలుగా ద్రవ్యోల్బణం తగ్గుదలను చూస్తే రేట్ల కోత డిమాండ్ తగినదేనని.. కానీ, ధరలు దిగిరావడంలో బేస్ ఎఫెక్ట్ కూడా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటోంది. ‘ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ దిగుబడులు తగ్గొచ్చన్న అంచనాలు రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీయొచ్చు. దీంతోపాటు డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణత అంశాన్ని కూడా ఆర్బీఐ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది’ అని కేర్ రేటింగ్స్ తెలిపింది. కాగా, సుదీర్ఘ విరామం తర్వాత తొలి వడ్డీరేట్ల(రెపో) కోత వచ్చే ఏడాది ఫిబ్రవరి సమీక్షలో ఉండొచ్చని లేదంటే కనీసం ఏప్రిల్‌లోనైనా నిర్ణయం వెలువడొచ్చని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. వచ్చే ఏడాది మొత్తంలో అర శాతం తగ్గింపును అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం రేట్లు ఇలా... గతేడాది సెప్టెంబర్‌లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన రాజన్.. 15 నెలల కాలంలో మూడు సార్లు కీలక పాలసీ రేట్లను పెంచారు. ఇందుకు ధరల కట్టడే ప్రధాన లక్ష్యమని కూడా స్పష్టం చేశారు. గడచిన నాలుగు పాలసీ సమీక్షల్లో(దాదాపు 10 నెలలుగా) పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే, రెండుసార్లు మాత్రం చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)ని తగ్గించి వ్యవస్థలోకి ద్రవ్య సరఫరా(లిక్విడిటీ) పెంచే చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం రెపో రేటు 8 శాతం, రివర్స్ రెపో 7 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతం, ఎస్ఎల్ఆర్ 22 శాతం వద్ద కొనసాగుతున్నాయి. భారీగా తగ్గిన ద్రవ్యోల్బణం... ఆర్బీఐ ఇటీవల కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని(సీపీఐ) తన పాలసీ సమీక్షకు ప్రధాన కొలమానంగా తీసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. 2015 జనవరినాటికి ఆర్బీఐ సీపీఐ లక్ష్యం 8 శాతంకాగా, 2016 జనవరికి 6 శాతంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే, ఈ ఏడాది అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా 5.52 శాతానికి దిగొచ్చింది. మరోపక్క, టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం కూడా అక్టోబర్‌లో ఐదేళ్ల కనిష్టానికి(1.77%) తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కచ్చితంగా వడ్డీరేట్లను తగ్గించి మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేయూతనివ్వాలని పారిశ్రామిక రంగం గగ్గోలు పెడుతోంది. ఆర్థిక మంత్రి జైట్లీ కూడా దీనికి మద్దతుగానే గొంతు కలిపారు. 1న జైట్లీతో రాజన్ భేటీ పాలసీ సమీక్ష నేపథ్యంలో వచ్చే నెల 1న ఆర్బీఐ గవర్నర్ రాజన్... ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వడ్డీరేట్ల తగ్గింపు అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ద్రవ్యోల్బణం తగ్గుముఖం, రెండో త్రైమాసికం(క్యూ2)లో వృద్ధి రేటు తగ్గొచ్చన్న అంచనాల నేపథ్యంలో రేట్ల కోత ఆవశ్యకతను జైట్లీ వివరించవచ్చని భావిస్తున్నారు. -
ఆర్థిక మానవతావాది!
నవంబర్ 3న ఆమర్త్య సేన్ జన్మదినం సత్వం: ఆర్థికశాస్త్రవేత్త పేదరికం గురించి మాట్లాడాల్సిన పనేమిటని ఆయన్ని విమర్శించేవాళ్లున్నారు... అయితే పాలను లీటర్లలో కొలిచినట్టుగా కవిత్వావేశం గణనకు లొంగదు, అంతమాత్రాన దాని ప్రభావం విస్మరించలేం కదా అని ఆయన అంటారు. సాధారణంగా అంకెలు అంకెల్లానే వ్యవహరిస్తాయి. వాటికి ఆత్మాభిమానం, అణచివేత, క్షోభ, సామాజిక వ్యత్యాసం లాంటివేమీ తెలియదు. వృద్ధిరేటు ఎంత శాతం ఉంది? స్థూల జాతీయోత్పత్తి ఏ మేరకు పెరిగింది? ఇవి అవసరమే. కానీ వీటిని మాత్రమే ఆమర్త్య సేన్ లెక్కలోకి తీసుకోరు. ఆ అంకెలు ఉపరితలం నుంచి వచ్చినవా? అట్టడుగు వర్గాలను కూడా కలుపుకొన్నవా? అందుకే ఆయన మాటతీరు ఆర్థిక శాస్త్రవేత్తకన్నా మానవ హక్కుల న్యాయవాదిని తలపిస్తుంది. ‘ఆర్థికశాస్త్రానికి నైతిక కొలతను పునఃస్థాపించినవాడిగా’ ఆయనకు 1998లో నోబెల్ పురస్కారం దక్కింది ఈ కారణంగానే! 1933లో శాంతినికేతన్లో రవీంద్రనాథ్ టాగూర్ చేత నామకరణం చేయించుకున్న ఆమర్త్య కుమార్ సేన్... గాంధీజీ ‘విశ్వాసపు బాట’కన్నా, రవీంద్రుడి ‘హేతువు తోవ’కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చరఖా కన్నా పలక మిన్న అన్న గురుదేవుడి స్ఫూర్తిని జీర్ణించుకున్న ఆయన... పాకిస్తాన్ ఆర్థికవేత్త మహబూబ్ ఉల్ హక్‌తో కలిసి ‘మానవాభివృద్ధి సూచిక’ను రూపొందించారు. ఆయా దేశాల్లోని జీవన ప్రమాణాలను ఐక్యరాజ్యసమితి ఈ సూచిక ఆధారంగానే లెక్కిస్తోంది. దీనిప్రకారం భారత్‌ది 135వ స్థానం. ప్రస్తుతం బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయానికి చాన్స్‌లర్‌గానూ, అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక, తత్వశాస్త్రాల బోధకుడిగానూ పనిచేస్తున్న ఆమర్త్య సేన్... తలసరి ఆదాయం మాత్రమే దేశాభివృద్ధికి సూచిక కాదంటారు. ‘మానవ సామర్థ్య’ పెరుగుదల మరింత ప్రాధాన్యమైన అంశం అంటారు. నిరక్షరాస్యత, కనీస ఆరోగ్య సౌకర్యాల లేమి, లైంగిక అసమానత్వం గురించి నొక్కి చెబుతారు. భిన్నవర్గాలకు గొంతుక ఇవ్వడంలో ఏ మేరకు సఫలీకృతమైందన్న దాన్ని బట్టే ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయాలంటారు. అయితే, ప్రజాస్వామ్యం దేనికీ గ్యారంటీ ఇవ్వదు. హక్కుల కోసం పోరాడాల్సివుంటుంది. కానీ ప్రాథమిక విద్యలాంటిదాన్ని ఉద్యమరూపంలోకి మలచడం అంత సులభం కాదని ఆయనకు తెలుసు. నిరంతర సంవాదం ద్వారా మౌలికావసరాల్ని సామూహిక స్పృహలోకి తేవాల్సి ఉందంటారు. రెండు రకాల ఆర్థిక విధానాల గురించిన చర్చ ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే వాళ్లే స్థూలజాతీయోత్పత్తిని పెంచుతారు, దానిలో భాగంగా పేదవాళ్లు కూడా దాని ఫలాలు అందుకుని పైకి ఎగబాకుతారనే ‘జీడీపీ వృద్ధి’ విధానం ఒకటీ; విద్య, ఆరోగ్యం లాంటివాటికి తొలి ప్రాధాన్యమిచ్చే ‘మానవ సామర్థ్య వృద్ధి’ విధానం మరొకటీ. చిత్రంగా మొదటిదానికే మన ప్రభుత్వాలు మరింత ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. దీన్ని ఆమర్త్యసేన్ వ్యతిరేకిస్తారు. ఏ దేశమూ కూడా మానవ సామర్థ్యాన్ని పెంపొందించకుండా అద్భుతమైన పెరుగుదలను సాధించలేదంటారు. జపాన్, చైనా, కొరియా, హాంగ్‌కాంగ్, తైవాన్, థాయ్‌లాండ్, యూరప్, అమెరికా, బ్రెజిల్... ఇవేవీ ట్రాక్ 1లో అభివృద్ధి చెందలేదంటారు. ‘సామ్యవాద ఆర్థికవ్యవస్థల్ని అణచివేత సహా ఎన్నో రాజకీయ, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టివున్నాయి. యాభై ఏళ్లక్రితం ఏ లక్ష్యాలైతే జనాన్ని సామ్యవాదంవైపు ఆకర్షించాయో, ఆ లక్ష్యాలు ఇప్పటికీ ప్రాధాన్యం కలిగినవే!’ మహిళలు ఎదుర్కొనే అణచివేత గురించి ఆయన 1960ల్లోనే రాశారు. విద్య, పోషణ విషయంలో ఒక కుటుంబంలో ఉండే పంపకాల్లోని అసమానతల గురించి చర్చించారు. ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా ఇవన్నీ మాట్లాడాల్సిన పనేమిటని ఆయన్ని విమర్శించేవాళ్లున్నారు. ‘పేదరికం నాకు ఆసక్తి. బాలికల నిష్పత్తి నాకు ఆసక్తి. బాలల సంక్షేమం నాకు ఆసక్తి. శిశు మరణాలు నాకు ఆసక్తి’... ‘పాలను లీటర్లలో కొలిచినట్టుగా కవిత్వావేశం గణనకు లొంగదు, అంతమాత్రాన దాని ప్రభావం విస్మరించలేం కదా!’ అంటారు. భిన్న సంస్కృతులు స్నేహపూర్వకంగా మనగలిగే సమాజాన్ని ఆయన కాంక్షిస్తారు. ప్రజాస్వామ్యం కేవలం అత్యధికుల పాలనావిధానం కాదనీ, అది సహనానికి సంబంధించినదనీ, అల్పసంఖ్యాకుల అభిప్రాయాల్నీ, విమర్శలనీ సహించడంలోనే ప్రజాస్వామ్య స్ఫూర్తి దాగుందనీ చెబుతారు. కొందరి ప్రయోజనాలకు భంగం కలిగినా, కొందరు మార్కెట్ వెలుపలే ఉండిపోయినా కూడా కొందరైనా వ్యక్తిగతంగా లాభపడేలా చేస్తుంది కాబట్టి, మార్కెట్ ఎకానమీయే విజయం సాధిస్తుందంటారు. అయితే, నీకు చదువు లేకుండా, వ్యక్తిగత రుణం పొందే అవకాశం లేకుండా అందులో ఎప్పటికి పాల్గొనాలి? పెట్టుబడీదారి విధానం సూత్రప్రాయంగా బలమైన వ్యక్తివాదాన్ని ప్రోత్సహించేదే అయినప్పటికీ, ఆచరణలో సమైక్యతకే దారితీసిందనీ, మన జీవితాల్ని మరింత పరస్పరాధారితంగా మార్చిందనీ చెబుతారు. ప్రపంచీకరణను ప్రతికూల దృష్టితో చూడనవసరం లేదంటారు. ‘అది ప్రపంచాన్ని సాంస్కృతికంగా, శాస్త్రీయంగా బలోపేతం చేసింది. ఎంతోమంది ఆర్థికంగా కూడా బలపడ్డారు’. ప్రతిదీ అందరికీ అందే దృష్టిలో దాన్ని స్వాగతిస్తారు. అలాగే దాన్ని మరింత మానవీయమైనదిగా మార్చుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ, అలా చేయడం కోసం జరిగే పోరాటాల్నీ సమర్థిస్తారు. -
జూలు విదిల్చిన సంస్కరణలు!
దశాబ్దాలుగా కదలిక లేకుండా పడివున్న ‘కార్మిక సంస్కరణలు’ సార్వత్రిక ఎన్నికలు పూర్తికాగానే జవసత్వాలు తెచ్చుకున్నాయి. పార్లమెంటు తొలి సమావేశాల్లోనే ఎన్డీయే సర్కారు ఫ్యాక్టరీల చట్టానికి, అప్రెంటిస్ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లులు ప్రవేశపెట్టింది. ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు పూర్తికాగానే ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంస్కరణలపై పూర్తిగా దృష్టిసారించి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శ్రమేవ జయతే కార్యక్రమంకింద పలు కార్మిక సంస్కరణల పథకాలకు గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సంస్కరణల విషయంలో ప్రధాన రాజకీయపక్షాలమధ్య దాదాపు ఏకాభిప్రాయం వచ్చినందువల్లనే ఇవి చకచకా ముందుకు కదులుతున్నాయి. రాజస్థాన్‌లో వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఫ్యాక్టరీల చట్టానికి, అప్రెంటిస్ చట్టానికి, కాంట్రాక్టు లేబర్ (క్రమబద్ధీకరణ, రద్దు) చట్టానికి, పారిశ్రామిక వివాదాల చట్టానికి సవరణలు తీసుకొచ్చి ఆ విషయంలో అందరికీ మార్గదర్శిగా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం కూడా ఆ బాటలోనే వెళ్లదల్చుకున్నట్టు ప్రకటించింది. హర్యానాలోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కార్మిక సంస్కరణలవైపు ఉత్సాహంగా అడుగులేసింది. అసెంబ్లీ ఎన్నికలు లేనట్టయితే ఈపాటికే అవి పూర్తయివుండేవి. దేశంలో కార్మిక రంగ సంస్కరణల కోసం అటు పరిశ్రమల వర్గాలు, ఇటు కార్మిక సంఘాలు ఎన్నాళ్లనుంచో డిమాండు చేస్తున్నాయి. అంతేకాదు... ప్రపంచబ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా భారత్‌లోని కార్మిక చట్టాలు పారిశ్రామికాభివృద్ధికీ, ఉపాధి కల్పనకూ అవరోధంగా పరిణమించాయని హెచ్చరిస్తూ వచ్చాయి. ఇతర దేశాలతో పోలిస్తే తయారీ రంగం విషయంలో భారత్‌ది ఎప్పుడూ వెనక బెంచీయేనని ఆ సంస్థలు చెబుతున్నాయి. నిజమే... స్థూల దేశీయోత్పత్తిలో మన తయారీ రంగం వాటా 15 శాతం మించదు. మన పొరుగునున్న చైనాలో అది 34 శాతం! యూపీఏ సర్కారుకు ఈ సంస్కరణల విషయంలో ఎంత ఉత్సాహం ఉన్నా రెండో దఫా పాలనలో దాన్ని ఆవరించిన నిస్సత్తువ కారణంగా ముందుకు అడుగేయలేకపోయింది. మన చట్టాల పుణ్యమా అని ఇక్కడ కర్మాగారాలు ప్రారంభించాలన్నా, వాటిని కొనసాగించాలన్నా ఎంతో కష్టమవుతున్నదని పారిశ్రామికవేత్తలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. కార్మిక వ్యవహారాలు ఉమ్మడి జాబితాలోనివి కనుక వీటికి సంబంధించి కేంద్ర చట్టాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలు కూడా ఉంటాయి. ఇవన్నీ తడిసిమోపెడయి ఇబ్బందికరంగా పరిణమించాయని వ్యాపార వేత్తలంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పారిశ్రామికవేత్తయినా దాదాపు 60 కేంద్ర చట్టాలకూ, రాష్ట్ర స్థాయిలో ఉండే 150కిపైగా చట్టాలకూ అనుగుణంగా ఎన్నెన్నో పత్రాలను సమర్పించాల్సివుంటుంది. అసలు ‘కార్మికుడు’ అనే పదాన్ని నిర్వచించడంలోనే అయోమయం ఉన్నది. ఈ పదానికి వేర్వేరు చట్టాల్లో 27 రకాల నిర్వచనాలున్నాయి. ఈ చట్టాల కీకారణ్యంలో దారితోచక గందరగోళపడుతున్నా మని... వాటిల్లోని జటిలమైన నిబంధనలు అడుగడుగునా ప్రతిబంధకంగా మారా యని వ్యాపారవేత్తలు గగ్గోలుపెడుతున్నారు. నిబంధనల ఉల్లంఘనలకింద పెట్టే కేసులు సంవత్సరాల తరబడి నడుస్తున్నాయన్నది వారి ఫిర్యాదు. వ్యాపారవృద్ధిపై దృష్టిపెట్టడానికి బదులు ఈ కేసుల పైనే సమయం వెచ్చించవలసి వస్తున్నదని వారి ఆరోపణ. వాహనాల తయారీనుంచి వ్యవసాయం వరకూ...ఉపగ్రహాలనుంచి జలాంతర్గాములవరకూ సమస్తం ఇక్కడే ఉత్పత్తి కావాలని ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్నిచ్చిన మోదీ...దాన్ని విజయవంతం చేయాలంటే ఈ చట్టాల మరమ్మతు తప్పనిసరని సంకల్పించారు. కనుకనే ఆ నినాదం ఇవ్వడానికన్నా ముందు ఆ చట్టాలపై దృష్టిసారించారు. కార్మికసంఘాలు కూడా ఈ చట్టాలను సంస్కరించాలని కోరుతున్నాయిగానీ వాటి దృష్టి కోణం వేరు. ఆ చట్టాలు ఏర్పడిననాటికి ఊహకైనా రాని ఎన్నో రకాలు పరిశ్రమల్లో వచ్చిచేరాయని, వాటిల్లో నిర్దిష్టమైన పనిగంటలు, ఇతర నిబంధనలు ఉండటంలేదని అవి ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత సంస్కరణల్లో వ్యాపారవేత్తలకు ఇబ్బంది కలిగిస్తున్న ‘ఇన్స్పెక్టర్ రాజ్’ను పూర్తిగా తొలగించడం ఒకటి. తనిఖీల పేరుతో వచ్చి కేసులు పెట్టే ప్రస్తుత విధానం స్థానంలో కంప్యూటర్ ఆధారిత డ్రా విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఏ ఫ్యాక్టరీని తనిఖీ చేయాలో అదే నిర్దేశిస్తుంది. తనిఖీ అనంతరం ఇన్స్పెక్టర్ తన నివేదికను 72 గంటల్లో ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వ్యాపారం ప్రారంభించదల్చుకునేవారు ఇప్పుడున్న 16 రకాల దరఖాస్తుల స్థానంలో ఒకే ఒక దరఖాస్తును...అదికూడా ఆన్లైన్లోనే పంపేవీలుకలుగుతుంది. అయితే, ఇప్పటికీ వ్యాపారవేత్తలు 44 కేంద్ర చట్టాలనూ, దాదాపు 150 రాష్ట్ర స్థాయి చట్టాలనూ అనుసరించాల్సిన స్థితే ఉన్నది. ఈ చట్టాలన్నిటినీ కనిష్ట సంఖ్యకు కుదించడమన్నది ఎప్పుడో ప్రభుత్వం ఇంకా చెప్పలేదు. ఇక పీఎఫ్ ఖాతాల నిర్వహణ, వాటి బదిలీవంటివి సులభతరం చేయడంద్వారా ఉద్యోగులకు మేలు కలగజేయడానికి సర్కారు ప్రయత్నించింది. అయితే, పీఎఫ్‌కు సంబంధించి ఉద్యోగులకుండే ప్రత్యామ్నాయాల విషయంలో మరింత సరళత అవసరమని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక కార్మికులను పనిలోకి తీసుకోవ డానికి, తొలగించడానికి సంబంధించిన నిబంధనలు నిక్షిప్తమై ఉండే పారిశ్రామిక వివాదాల చట్టం జోలికి కేంద్ర ప్రభుత్వం వెళ్లదల్చుకున్నట్టు లేదు. ఆ బాధ్యతను రాష్ట్రాలకే వదిలేసింది. ఈ చట్టం విషయంలో కేంద్రమే చొరవ తీసుకుని దేశమంతా వర్తించే విధంగా సమగ్ర చట్టాన్ని రూపొందించాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా కోరుతున్నాయి. మొత్తానికి అటు పారిశ్రామికవేత్తలకూ, ఇటు కార్మిక వర్గానికీ ప్రయోజనం చేకూర్చేలా సంస్కరణలు తీసుకురావడం కత్తి మీది సామే. దాన్ని ఎన్డీయే సర్కారు ఎంత చాకచక్యంగా పూర్తి చేయగలుగుతుందో చూడాలి. -
అర్హులకే సబ్సిడీ ప్రయోజనం: జైట్లీ
సబ్సిడీలను హేతుబద్ధం చేసేందుకు త్వరలో కమిషన్ ఏర్పాటు న్యూఢిల్లీ: సబ్సిడీలను హేతుబద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని, అర్హులైన లబ్ధిదారులకే సబ్సిడీ ప్రయోజనాలు లభ్యమయ్యేలా చర్యలు తీసుకొనబోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రైతులకు సబ్సిడీ అంశంపై శుక్రవారం లోక్‌సభలో ఒక అనుబంధ ప్రశ్నకు జైట్లీ సమాధానమిస్తూ, స్థూల దేశీయ ఉత్పత్తిలో 4.1 శాతానికి ద్రవ్యలోటును నియత్రించడం చాలా కష్టసాధ్యమని, అందుకోసం సబ్సిడీల ఖర్చను తగ్గించుకోవాలన్నారు. సబ్సిడీలను హేతుబద్ధం చేసేందు కు మరికొన్ని రోజుల్లో వ్యయ నిర్వహణా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, సబ్సిడీల భారం పెరగకుండా చూడడమే వ్యయ నిర్వహణా కమిషన్ ప్రధాన బాధ్యతల్లో ఒకటని ఆయన చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి కమిషన్ తన నివేదిక సమర్పించే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. భారతీయ ఉత్పత్తులు మార్కెట్లో పోటీ పడాలంటే పన్నుల విధానాన్ని హేతుబద్ధం చేయాలన్నారు. ఖనిజవాయువు ధర పెరిగిన తర్వాత పెరగబోయే యూరియా ధర భారా న్ని వినియోగదారులకు బదిలీ చేయబోతున్నారా? అన్న ప్రశ్న ఊహాజనితమని అన్నా రు. విద్యుత్ రాష్ట్రాలకు సంబంధించిన అంశంకాబట్టి, తగిన స్థోమత ఉన్న రాష్ట్రాలు వ్యవసా యానికి సబ్సిడీ ఇవ్వవచ్చన్నారు. మరోవైపు ఆహార భద్రత కోసం సంవత్సరానికి రూ.1,31,086కోట్లు ఖర్చు అవుతోందని ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. మరోపక్క వ్యవసాయ రంగానికి సంబంధించి స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను త్వరితగతిన అమలు చేయాలని లోక్‌సభలో ఎంపీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. పంటలకు కనీస మద్దతుధర నిర్ధారణ ప్రక్రియను సమీక్షించి, మార్పులు చేయాలని ఎంపీలు కోరారు. -
సాగుతోనే సమగ్రాభివృద్ధి
వ్యవసాయానికి ప్రోత్సాహాన్నిచ్చి లాభసాటిగా చేయగల విధానాలను పాలకులు అనుసరిస్తేనే పారిశ్రామిక వస్తువులకు దేశీయ డిమాండు పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వృద్ధి పుంజుకుంటుంది. ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ 2011 నుంచి క్రమంగా దిగజారిపోతోంది. ఆ ఏడాదిలోనూ, గత ఏడాదిలోనూ రూపాయి విలువ తీవ్రంగా పతనమైంది. గ్రామీణ ఉత్పత్తి సూచీలు కూడా అధోముఖంగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం తీవ్ర సమస్యగా ఉంది. నిన్నమొన్నటి వరకూ విదేశీ వాణిజ్యలోటు ఆందోళన కలిగించింది. అన్నిటికంటే ముఖ్యంగా స్థూల జాతీయోత్పత్తి అతి వేగంగా దిగజారి 4.7 శాతం వద్ద కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో సహజంగానే నిరుద్యోగ సమస్య మరింత తీవ్రతరమైంది. స్థూలంగా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ స్టాగ్‌ఫ్లేషన్‌లోకి (ధరలు పెరిగిపోతుండగా ఉత్పత్తి స్తం భించి ఉండే పరిస్థితి)దిగజారింది. ఇందుకు కారణమేమిటి? మూలాలు ఎక్కడున్నాయి? గత కొన్ని దశాబ్దాల కాలంలో నేటి ఆర్థిక రంగ దుస్థితికి పునాదులు పడ్డాయి. ఏ దేశ ఆర్థిక రంగంలోనైనా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం మూడూ కీలకమైనవి. ఈ మూడు రంగాల నడుమ సమతూకం లోపించడమే నేటి మన ఆర్థిక దుస్థితికి ప్రధాన కారణం. సమతూకం లోపించడమే సమస్య సాధారణంగా ఏ దేశమైనా తన అభివృద్ధి క్రమంలో తొలుత పారిశ్రామిక, వ్యవసాయ రంగాల ఎదుగుదలపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. మన కళ్ల ముందే చైనా, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఆ విధంగానే వృద్ధి చెందాయి. చైనా పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో అద్భుత ప్రగతిని సైతం సాధించగలిగింది. కానీ మన దేశం ఆర్థిక రంగం ‘ఎదుగుదల’ అందుకు భిన్నంగా సాగింది. వ్యవసాయ ఆధార దేశంగా ఉన్న స్థితి నుంచి ఒకే గంతులో మనం సేవా రంగంపై ఆధారపడే స్థితికి చేరలేం. అందుకోసం ప్రయత్నించడమే గాక పారిశ్రామిక వస్తు ఉత్పత్తి రంగాన్ని నిర్లక్ష్యం చేశాం. నేడు మన స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో పారిశ్రామిక రంగం వాటా 14 నుంచి 15 శాతం మాత్రమే. సేవా రంగం వాటా 55 శాతం పైగానే ఉంది. వ్యవసాయ రంగంపై పాలకుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా జీడీపీలో ఆ రంగం వాటా 14 శాతంగానే ఉంది. కాగా 55 నుంచి 60 శాతం ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. ఆర్థిక వ్యవస్థలోని ఈ అసమతూకమే అన్ని సమస్యలకు మూలం. 2008 సెప్టెంబర్‌లో బద్దలైన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ఈ సంక్షోభంతో సంపన్న దేశాల ప్రజల కొనుగోలు శక్తి దిగజారింది. దీంతో విదేశీ ఎగుమతులు, కాంట్రాక్టులపై ఎక్కువగా ఆధారపడ్డ మన సేవా రంగం స్థితిగతులు దిగజారాయి. ఫలితంగా గత పది నెలలుగా సేవారంగ ఉత్పత్తి కుంచించుకుపోతోంది. ఆ రంగంలోని కార్యకలాపాల సూచీ 2014లో 48.5కు పడిపోయింది. ప్రధాన రంగంగా మారిన సేవారంగ పతనానికి అది సంకేతం. సేవా రంగంలోని కీలకమైనదైన ఐటీ రంగం 2012-13 కాలంలో సుమారు 66,000 మందికి ఉపాధిని కల్పించింది. అది 2013-14లో 33,000కు పడిపోయింది. ఈ రంగంలో సాంకేతిక పురోభివృద్ధి మందగించిపోవడంతో విదేశీ కాంట్రాక్టులు తగ్గాయి. పైగా ఈ రంగంలో ఆటోమేషన్ పెరిగి గతంలో ముగ్గురు ఉద్యోగులు చేయగల పనిని ఒక్కరే చేయగలుగుతున్నారు. పారిశ్రామిక క్షీణత పారిశ్రామిక, వస్తు ఉత్పత్తి రంగం గత రెండు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైంది. అంతర్జాతీయ పోటీ తీవ్రంగా ఉన్న ఈ రంగంలో గత ఏడాది 0.9 శాతంగా ఉంది. నేడు 0.2 శాతానికి దిగజారింది. మొత్తం దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో దిగుమతుల వాటా 15 శాతం మాత్రమే. మన సరుకులను దిగుమతి చేసుకునే ధనిక దేశాలలోని క్షీణ ఆర్థిక స్థితి వల్ల కూడా మన ఎగుమతులకు అవకాశాలు సన్నగిల్లాయి. పైగా పాలకుల విధానాలవల్ల మన ప్రజల కొనుగోలు శక్తి విపరీతంగా పడిపోయింది. దీంతో పారిశ్రామిక వస్తువులకు దేశంలో సైతం గిరాకీ చాలా వరకు తగ్గిపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పడు పారిశ్రామిక రంగ పురోగతికి పెద్ద పీట వేస్తామంటున్నారు. అందులో భాగంగా ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ వంటి ప్రయత్నాలు మొదలెట్టారు. చైనాలో వేతనాలు పెరగడం వల్ల సంపన్న దేశాల పరిశ్రమలు అక్కడి నుంచి మన దేశానికి తరలి వస్తాయని ఆశ. వేతనాల పెరుగుదల వల్ల చైనాలో ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతాయని మనవాళ్ల అంచనా. మన దేశంలో వేతనాలు చైనా కంటే బాగా తక్కువగా ఉండటమే మన ఆశలకు పునాది. అయితే చైనా నుంచి ధనిక దేశాలకు దిగుమతులు తగ్గుముఖం పట్టడానికి పెరిగిన ఉత్పత్తి వ్యయాలు మాత్రమే కారణం కాదు. ధనిక దేశాల ప్రజల కొనుగోలు స్థితి దిగజారి ఉండటమే అందుకు ప్రధాన కారణం. అలాగే చైనా కోల్పోయే మార్కెట్ మనకే దక్కుతుందనుకోవ డం పొరపాటు. వియత్నాం, బంగ్లాదేశ్, మెక్సికో వంటి పలు అల్ప వేతన దేశాల నుంచి మనకు గట్టి పోటీ తప్పదు. దశాబ్దాల నిర్లక్ష్యాన్ని మరచి హఠాత్తుగా మన దేశం పెద్ద పారిశ్రామిక దేశంగా ఎదుగుతుందనుకోవడం భ్రమ. సగానికి పైగా దేశ జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం నేడు దయనీయంగా ఉంది. వ్యవసాయం చేయడం ఇక తమ వల్ల కాదనే స్థితికి చేరిన రైతాంగం సంఖ్య 42 శాతానికి పైగా ఉండగా నేడది 75 శాతానికి పెరిగింది. గత రెండు దశాబ్దాల కాలంలో అప్పులపాలై, దివాలా తీసి లక్షల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా 2018-19 నాటికి మన దేశ జీడీపీలో చెప్పుకోదగిన వృద్ధిని సాధించలేమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా. ఎంత భారీగా ఆర్థిక సంస్కరణలను అమలు జరిపినా మన వృద్ధి రేటు 7-8 శాతం స్థాయిని ఇప్పట్లో మించలేదని అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ‘మూడీస్’ అంచనా. కాబట్టి సంస్కరణలను ప్రవేశపెట్టడం వల్ల మన ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు లేవనేది స్పష్టం. పాలకులు మారడమే కాదు, విధానాలలో కూడా సహేతుకమైన మార్పులు రావడం తప్పనిసరి. ప్రధానంగా విదేశీ డిమాండుపై ఆధారపడిన సేవా రంగం గానీ, దేశీయ డిమాండుపై ఆధారపడిన పారిశ్రామిక రంగంగానీ ఆదుకోలేవు. అత్యధిక ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, దేశీయ డిమాండును పెంచగల వ్యవసాయ రంగంలో మాత్రమే మన ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ అది తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. 1985 నాటికి మన జీడీపీలో సుమారు 1.4 శాతాన్ని మాత్రమే మన ప్రభుత్వాలు వ్యవసాయ రంగంపై ఖర్చు పెడుతున్నాయి. 2010 నాటికి ఈ వ్యయం 0.60 శాతానికి తగ్గిపోయింది. వ్యవసాయ రంగంపై చైనా నేడు ఏటా జీడీపీలో 5 శాతం మేరకు ఖర్చు చేస్తోంది. ఈ ఒక్క గణాంకమే మన వ్యవసాయ రంగాన్ని ఆవహించిన దుస్థితిని సూచించగలదు. వ్యవసాయంపై కేంద్రీకరణే పరిష్కారం అందుచేత వ్యవసాయానికి ప్రోత్సాహాన్నిచ్చి లాభసాటిగా చేయగల విధానాలను పాలకులు అనుసరిస్తేనే దేశీయ డిమాండు పెరుగుతుంది. వ్యవసాయదారుల ఆదాయాలు పెరిగి, వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. దేశంలోని సగానికి పైగా ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయాధార పారిశ్రామిక ఉత్పత్తులకు మంచి గిరాకీ ఏర్పడుతుంది. ఇది పట్టణాల్లో కూడా ఆర్థిక పునరుజ్జీవనాన్ని పెంపొందింపజేస్తుంది. నిరుద్యోగ సమస్య గణనీయంగా తగ్గుతుంది. దేశీయంగా డిమాండు కుంచించుకుపోయిన పరిస్థితికి పరిష్కారం లభిస్తుంది. మన ఆర్థిక సమస్యలకు ఇదే ఏకైక పరిష్కారం. అందుకోసం వ్యవసాయరంగంపై వెచ్చిస్తున్న మొత్తాలు పెరగాలి. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటి ఉత్పదకాలపై సబ్సిడీలను అందించాలి. సాగుకు అవసరమైన నీటి పారుదల సదుపాయాలను భారీగా విస్తరించాలి. వ్యవసాయ రంగానికి నిరంతరం ఉచితంగా లేదా చౌకగా విద్యుత్తును అందించాలి. విధానపరమైన ఈ మౌలిక మార్పు మాత్రమే సమస్యల విషవలయంలో చిక్కుకున్న ఆర్థిక రంగాన్ని గట్టెక్కించగలదు. అలాంటి విధాన ప్రత్యమ్నాయాన్ని అనుసరించని ఏ ప్రభుత్వమైనా దేశ ప్రజల సమస్యలను పరిష్కరించలేదనడం నిస్సందేహం. (వ్యాసకర్త ఆర్థిక విశ్లేషకులు) డి. పాపారావు -
గట్టెక్కినట్టే..!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2013 ఏప్రిల్ నుంచి 2014 మార్చి వరకూ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 4.9 శాతంగా ప్రభుత్వం అంచనా వేసింది. జీడీపీ వృద్ధి ముందస్తు అంచనాలను కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాలు గత ఆర్థిక సంవత్సరం (2012-13)కన్నా కొంత మెరుగ్గా ఉన్నాయి. గత ఏడాది ఈ రేటు 4.5 శాతం మాత్రమే. వ్యవసాయం, అనుబంధ రంగాలు 2013-2014 ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు పెరగడానికి ప్రధానంగా చేయూతనిస్తాయని గణాంకాలు పేర్కొన్నాయి. తలసరి ఆదాయం రూ. 39,961: 2004-05 ధరల ఆధారంగా వాస్తవ ప్రాతిపదికన తలసరి ఆదాయం 2013-14లో రూ.39,961 ఉండవచ్చని అంచనా. 2012-13లో ఈ మొత్తం రూ. 38,856. అంటే 2.8 శాతం పెరిగింది. ఈ రేటు 2012-13లో 2.1 శాతం. ఇక ద్రవ్యోల్బణం, తత్సంబంధ అంశాలను పరిగణలోకి తీసుకోకుంటే (ప్రస్తుత ధరల ప్రాతిపదికన) ఈ రెండేళ్లలో తలసరి ఆదాయం 10.4 శాతం వృద్ధితో రూ.67,839 నుంచి రూ. 74,920కి చేరవచ్చు. దీని ప్రకారం భారత్ మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిమాణం 1.7 ట్రిలియన్ డాలర్లు. రూపాయల్లో అక్షరాలా రూ.105.39 లక్షల కోట్లు. మొత్తం జాతీయ ఆదాయాన్ని దేశ ప్రజలతో భాగిస్తే- వచ్చేదే తలసరి ఆదాయం. ప్రస్తుత ధరల ప్రాతిపదికన చూస్తే- మొత్తం జీడీపీ 12.26 శాతం వృద్ధితోరూ.99.88 లక్షల కోట్ల నుంచి రూ. 105.39 లక్షల కోట్లకు చేరవచ్చు. దేశ మొత్తం జనాభా 2013 మార్చిలో 121.7 కోట్లు ఉండగా, 2014 మార్చి నాటికి రూ. 123 కోట్లకు పెరుగుతుందని అంచనా. పెట్టుబడుల పరిస్థితి పెట్టుబడులకు సూచిక అయిన స్థూల స్థిర పెట్టుబడుల కూర్పు (జీఎఫ్‌సీఎఫ్) ప్రస్తుత ధరల ప్రాతిపదికన రూ.30.7 లక్షల కోట్ల నుంచి రూ. 32.2 లక్షల కోట్లకు పెరగవచ్చు. అయితే ద్రవ్యోల్బణం తత్సంబంధ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ- 2004-05 ధరల ప్రకారం ఈ విలువ రూ. 20 లక్షల కోట్ల నుంచి రూ. 20.1 లక్షల కోట్లకు మాత్రమే పెరుగుతుందని అంచనా. అసలు ఈ అంచనాలు ఎందుకు? సహజంగా ఫిబ్రవరిలో ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతుంది. ఈ బడ్జెట్‌కు ముందే వివిధ రంగాల పనితీరు, వృద్ధి సంబంధిత అంచనాలపై ప్రభుత్వానికి ఒక అవగాహన అవసరం. ఈ అవగాహన ప్రధాన లక్ష్యంగానే సీఎస్ఓ జీడీపీ ముందస్తు అంచనాలను ఆవిష్కరిస్తుంది. ప్రభుత్వంలోని ఆర్థిక నిర్ణేతలు ఈ ‘అంచనా’ గణాంకాలకు కట్టుబడాల్సిన పనిలేదు. మరిన్ని చర్యలు అవసరం: పరిశ్రమలు తాజా గణాంకాల పట్ల పారిశ్రామిక వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. మౌలిక రంగంపై ప్రత్యేక దృష్టి అవసరమని పేర్కొన్నాయి. బలహీన వినియోగం, పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయాల నేపథ్యంలో డిమాండ్ పుంజుకున్నట్లు సంకేతాలు కనిపించడం లేదని పేర్కొన్నాయి. ముఖ్యంగా తయారీ, మైనింగ్ రంగాల పురోగతి కీలకమని వ్యాఖ్యానించాయి. సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ, నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఊపును ఇవ్వడానికి ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సమీప భవిష్యత్తులో వృద్ధి పునరుత్తేజమవుతుందన్న ఆశలు ఆవిరవుతున్నట్లు అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 5.5 శాతానికి మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ శరద్ జైపూరియా వ్యక్తం చేశారు. ముఖ్య రంగాలు ఇలా... వ్యవసాయం, అనుబంధ రంగాలు: మొత్తం జీడీపీలో దాదాపు 14 శాతం వరకూ వాటా ఉన్న ఈ రంగం వృద్ధి రేటు 4.6 శాతంగా ఉండవచ్చు. ఈ రేటు 2012-13లో 1.4 శాతం మాత్రమే. తయారీ: జీడీపీలో దాదాపు 15 శాతం ఉన్న ఈ రంగంలో అసలు వృద్ధి లేదు. గత ఏడాదితో పోల్చితే -0.2 క్షీణించవచ్చు. 2012-13లో ఈ రంగం 1.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. సేవల రంగం (ఫైనాన్స్, బీమా, రియల్టీ, బిజినెస్ సేవలుసహా): జీడీపీలో దాదాపు 55% వాటా కలిగిన ఈ విభాగం వృద్ధి 11.2%గా నమోదుకావచ్చు. 2012-13లో ఈ రంగం వృద్ధి రేటు 10.9%. మైనింగ్ అండ్ క్వారీ: క్షీణతలోనే కొనసాగుతుంది. అయితే క్షీణత -2.2 శాతం నుంచి -1.9 శాతానికి తగ్గొచ్చు. నిర్మాణం: ఈ రంగంలో కూడా వృద్ధి 1.1 శాతం నుంచి 1.7 శాతానికి మెరుగుపడనుంది. విద్యుత్, గ్యాస్, నీటి పారుదల రంగం: వృద్ధి రేటు 2.3 శాతం నుంచి 6 శాతానికి పెరిగే అవకాశం వాణిజ్యం, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు: వృద్ధి రేటు 5.1 శాతం నుంచి 3.5 శాతానికి పడిపోయే అవకాశం. కమ్యూనిటీ సామాజిక, వ్యక్తిగత సేవలు: ఈ రంగంలో వృద్ధి రేటు 5.3 శాతం నుంచి 7.4 శాతానికి ఎగియనుంది. -
వడ్డీరేట్లు అక్కడే..?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మంగళవారం(28న) చేపట్టనున్న పాలసీ సమీక్షపై ఉత్కంఠ నెలకొంది. ఒకపక్క వృద్ధి మందగమనం, మరోపక్క ద్రవ్యోల్బణం దిగొస్తున్న సంకేతాల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, బ్యాంకర్లు మాత్రం ఈసారి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగించవచ్చని అంటున్నారు. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్లో ఐదు నెలల కనిష్టమైన 6.16 శాతానికి దొగొచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆహారోత్పత్తుల ధరల తగ్గుముఖం పట్టడం దీనికి దోహదం చేసింది. అదేవిధంగా రిటైల్ ద్రవ్యోల్బణం సైతం డిసెంబర్లో 9.87 శాతానికి(మూడు నెలల కనిష్టం) తగ్గింది. ఇదిలాఉండగా... పారిశ్రామిక రంగం మరింత తిరోగమనంలోకి జారిపోవడం కార్పొరేట్ రంగాన్ని కలవరపరుస్తోంది. నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పాదకత ఘోరంగా మైనస్ 2.1 శాతానికి(అక్టోబర్‌లో మైనస్ 1.6%) పడిపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గించాలన్న డిమాండ్ కార్పొరేట్ల నుంచి మరోసారి బలంగా వినిపిస్తోంది. మరోపక్క, ఈ ఏడాది(2013-14)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 5 శాతానికే పరిమితం కావచ్చనే అంచనాలు ఉన్నాయి. గతేడాది వృద్ధి రేటు దశాబ్దపు కనిష్టస్థాయి(5%)కి పడిపోవడం గమనార్హం. డిసెంబర్ సమీక్షలో రాజన్ కీలకరేట్లను యథాతథంగా వదిలేయడం విదితమే. అంతక్రితం సెప్టెంబర్, నవంబర్ సమీక్షల్లో రెపో రేటును వరుసగా పావు శాతం చొప్పున పెంచారు. సెప్టెంబర్‌లో ఆర్బీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రాజన్.. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయడమే ప్రధాన లక్ష్యమని చెబుతూవస్తున్నారు. ద్రవ్యోల్బణం ఒక వినాశకర వ్యాధి అంటూ తాజాగా మరోసారి తన ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పారు. దీన్ని కట్టడి చేయడం దేశ ఆర్థికాభివృద్ధికి ఆవశ్యకమన్నారు. కాగా, సెంట్రల్ బ్యాంకులకు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం ఒక్కటే లక్ష్యం కాదని, ఇతర అంశాల(వృద్ధి రేటు ఇతరత్రా)పైనా దృష్టిసారించాలని ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఇటీవలే వ్యాఖ్యానించడం విశేషం. బ్యాంకర్లు ఏమంటున్నారు... ఆర్బీఐ రేపు చేపట్టనున్న పాలసీ సమీక్షలో వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ చేయకపోవచ్చని భావిస్తున్నా’ అని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) సీఎండీ ఎస్ఎల్ బన్సల్ వ్యాఖ్యానించారు. హెచ్ఎస్బీసీ ఇండియా కంట్రీ హెడ్ నైనాలాల్ కిద్వాయ్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘వడ్డీరేట్లను తగ్గించడం సాధ్యం కాకపోతే.. కనీసం యథాతథంగా కొనసాగించడం ఒక్కటే ఆర్బీఐకి ఉన్న మార్గం. ఆర్బీఐ బహుశా ఈ సమీక్షలో పారిశ్రామిక రంగానికి ఇచ్చే సందేశం ఇదే కావచ్చు’ అని ఆమె పేర్కొన్నారు. ఆర్బీఐ పాలసీ సమీక్షలో ఎక్కడిరేట్లను అక్కడే ఉంచే అవకాశం ఉందని ఎస్బీఐ తాజా నివేదికలో అంచనా వేసింది. ‘ద్రవ్యోల్బణం విషయంలో ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణానికి సంబంధించి మరింత సమాచారం కోసం ఆర్బీఐ వేచిచూసే అవకాశం ఉంది. తదుపరి పాలసీ నిర్ణయం దీనిపైనే ఆధారపడి ఉంటుంది. డిసెంబర్లో ద్రవ్యోల్బణం దిగొచ్చినప్పటికీ... తయారీ రంగ ద్రవ్యోల్బణం మాత్రం దాదాపు అదేస్థాయిలో ఉండటమే దీనికి కారణం’. అని పేర్కొంది. ప్రస్తుతం రేట్ల పరిస్థితి ఇదీ... రెపో రేటు: 7.75 శాతం. ఆర్బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీరేటు ఇది.. రివర్స్ రెపో రేటు: 6.75%. ఆర్బీఐ వద్ద ఉంచే నిధులపై బ్యాంకులకు లభించే వడ్డీరేటు. సీఆర్ఆర్: 4 శాతం. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్ నిధుల్లో ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన శాతమిది. దీనిపై బ్యాంకులకు ఎలాంటి వడ్డీ లభించదు. -
జీడీపీలో 15%కు బాండ్ల మార్కెట్
ముంబై: వివేకవంతమైన నియంత్రణ విధానాలు, సంస్కరణలు అమలు చేస్తే దేశ కార్పొరేట్ బాండ్ల మార్కెట్ భారీగా విస్తరిస్తుందని సీఐఐ నిర్వహించిన సర్వే పేర్కొంది. తద్వారా ప్రస్తుత పంచవర్ష ప్రణాళికా కాలం(2012-17)లో కార్పొరేట్ బాండ్ల మార్కెట్‌ను జీడీపీలో 15%కు చేర్చవచ్చునని తెలిపింది. ప్రస్తుతం జీడీపీలో కార్పొరేట్ బాండ్ల మార్కెట్ వాటా 5%కు దిగువనే ఉంది. సరైన సంస్కరణలు, విధానాల ద్వారా ఐదేళ్ల కాలంలో జీడీపీలో 15% వాటాను ఆక్రమించేందుకు అవకాశమున్నదని తెలిపింది. కార్పొరేట్ బాండ్ల మార్కెట్ సంస్కరణల(సీబీఎం)కు సంబంధించిన ఈ సర్వేను బాండ్ల జారీదారులు, ఇన్వెస్టర్లు, మార్కెట్ మేకర్లు, క్రెడిట్ రేటింగ్ ఏజన్సీలు, సాంకేతిక నిపుణులతో నిర్వహించింది. కార్పొరేట్ బాండ్ల మార్కెట్ వృద్ధి చెందితే భారత్ వంటి వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నిధుల సమీకరణకు వీలు చిక్కుతుందని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ఇందుకు తగిన రీతిలో నియంత్రణ విధానాలు, సంస్కరణలను తీసుకురావలసి ఉన్నదని చెప్పారు. 12వ ప్రణాళిక కాలంలో మౌలిక సదుపాయాల రంగ పెట్టుబడులకు సంబంధించి 47% వాటా లక్ష్యాన్ని ప్రైవేట్ రంగం సాధించాల్సి ఉన్నదని, ఇందుకు సీబీఎం వృద్ధి కీలకమని వివ రించారు.