వాషింగ్టన్/ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థపై సానుకూల అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3 శాతంగా ఉంటుందని తన తాజా నివేదికలో ప్రపంచబ్యాంక్ పేర్కొంది. ఇక వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఒక నివేదిక విడుదల చేస్తూ, భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద వినిమయ మార్కెట్‌గా అవతరించబోతోందని పేర్కొంది. మరోవైపు పీడబ్ల్యూసీ– ఫిక్కీ సర్వే వచ్చే 12 నెలల్లో భారత్ వృద్ధి రేటు 7%పైనే ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ చర్యలు వృద్ధికి దోహదపడతాయని భారత్ కార్పొరేట్ భావిస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది. ఆయా సంస్థల నివేదికల్లోని ముఖ్యాంశాలపై దృష్టి సారిస్తే...
వినియోగం, పెట్టుబడుల దన్ను: ప్రపంచబ్యాంక్
భారత్ 2018–19 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి సాధిస్తుందని ప్రపంచబ్యాంక్ తన తాజా ‘‘2019 గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్’’ నివేదికలో పేర్కొంది. అటు తర్వాత వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో 7.5 శాతం చొప్పున వృద్ధి నమోదవుతుందని అంచనావేసింది. దేశంలో పటిష్ట వినియోగం, పెట్టుబడుల ధోరణి ఈ స్థాయి వృద్ధి రేటుకు దోహదపడే అంశాలుగా వివరించింది. ఈ స్థాయి వృద్ధితో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలుస్తుందని పేర్కొంది. ఇక చైనా వృద్ధి రేటు 2018లో 6.5% అయితే 2019, 2020ల్లో 6.2%కి పడిపోతుందని విశ్లేషించింది. 2021లో మరింతగా 6%కి పడిపోతుందని పేర్కొం ది. భారత్ వృద్ధి ధోరణి ప్రోత్సాహకరమైన రీతిలో కొనసాగుతోందని, ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే పరిస్థితి సానుకూలంగా ఉందని వరల్డ్ బ్యాంక్ ప్రాస్పెక్టŠస్ గ్రూప్ డైరెక్టర్ ఐహాన్ కోష్ పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల అవకాశాలను తట్టుకోవడానికి తగిన వ్యూహాలతో అభివృద్ధి చెందుతున్న దేశాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచబ్యాంక్ సూచించడం గమనార్హం.
ప్రభుత్వ చర్యల సత్ఫలితాలు: సర్వే
కేంద్రం తీసుకుంటున్న పలు విధానపరమైన చర్యలు ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయని పీడబ్ల్యూసీ–ఫిక్కీ సర్వే ఒకటి పేర్కొంది. వచ్చే 12 నెలల కాలంలో దేశం 7 శాతానికి పైగా వృద్ధి సాధిస్తుందని భారత్ కార్పొరేట్ రంగం భావిస్తున్నట్లు వివరించింది. దేశీయంగా పటిష్ట డిమాండ్ ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించింది. ఎగుమతుల మార్కెట్‌పై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందనీ, వృద్ధిలో ఈ విభాగం కూడా కీలక పాత్ర పోషించనుందని పేర్కొంది. 2018 జూలై–అక్టోబర్ మధ్య చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఫైనాన్షియల్ అధికారులు, భారత తయారీ రంగం వ్యూహాత్మక విభాగాల చీఫ్‌లతో ఇంటర్వ్యూల ద్వారా తాజా సర్వే రూపకల్పన జరిగింది. మౌలిక రంగం అభివృద్ధితో ప్రభుత్వ రంగం పటిష్టంగా ఉందని, వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డాయని, నియంత్రణా వ్యవస్థల పనితీరు సమర్థవంతంగా ఉందని పేర్కొన్న సర్వే, దీనితోపాటు పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) మార్గాలను సరళీకరణ వృద్ధికి దోహదపడే అంశాలని విశ్లేషించింది. మౌలిక రంగంలో పెట్టుబడులు మరిన్ని పెరగాలని సూచించింది.
2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్లకు వినియోగం: డబ్ల్యూఈఎఫ్
అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడవ అతిపెద్ద వినిమయ దేశంగా అవతరించనుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం భారత్ వినియోగం 1.5 ట్రిలియన్ డాలర్లు. 2030 నాటికి ఈ విలువ 6 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతున్న అంచనాలను వెలువరించింది. ప్రస్తుతం భారత్ వ్యయాలకు సంబంధించి ప్రపంచంలో ఆరవ దేశంగా కొనసాగుతోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో దేశీయ ప్రైవేట్ వినియోగం 60 శాతంగా ఉంది. నైపుణ్యం మెరుగుదల, భవిష్యత్తులో ఉపాధి కల్పన, గ్రామీణ భారతంలో సామాజిక–ఆర్థిక పురోగతి, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై భారత్ తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా డబ్ల్యూఈఎఫ్ తన తాజా నివేదికలో వివరించింది. భారత్‌లోని 30 పట్టణాలు, నగరాల్లోని 5,100 కుటుంబాల అభిప్రాయాల ఆధారంగా తాజా సర్వే రూపొందింది. అలాగే దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో దాదాపు 40 ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఆర్థిక సంవత్సరంసహా వచ్చే రెండేళ్లలో భారత్ వృద్ధి రేటు 7% పైన ఉంటుందనేది ఫోరమ్ అంచనా.
Comments
Please login to add a commentAdd a comment