లగేజీ పరిశ్రమ ఆదాయం 2024–25లో క్షీణించొచ్చు
పోటీ పెరగడంతో తగ్గిన ధరలు
ఫలితంగా మార్జిన్లపై ప్రభావం పడొచ్చు
క్రిసిల్ రేటింగ్స్ అంచనా
ముంబై: లగేజీ ఉత్పత్తుల పరిశ్రమలో (సంఘటిత రంగం) డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో స్థిరంగా కొనసాగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. పర్యాటకం, కార్పొరేట్ ప్రయాణాలకు డిమాండ్ కొనసాగుతుండడం ఇందుకు సానుకూలంగా పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంఘటిత లగేజీ పరిశ్రమ ఆదాయం 8–10 శాతం క్షీణించొచ్చని అంచనా వేసింది.
2021–22 నుంచి 2023–24 మధ్య పరిశ్రమ పరిమాణం రెట్టింపు కావడం, అధిక బేస్ ఇందుకు కారణాలుగా పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2023–24) పరిశ్రమ 18 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ‘‘తయారీ దారుల మధ్య పోటీ పెరిగింది. కొత్త సంస్థలు ప్రవేశించాయి. నిల్వలు మోస్తరుగా పెరగడం వంటి అంశాలతో కంపెనీలు విక్రయ ధరలను పోటాపోటీగా మార్చేశాయి.
దీంతో నికరంగా విక్రయ ధరలు, ముఖ్యంగా ఎకానమీ (బడ్జెట్) విభాగంలో తగ్గాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. 2023–24లో నిర్వహణ మార్జిన్లు 1.5 శాతం మేర తగ్గాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 0.50 శాతం వరకు క్షీణించి 13.5–14 శాతం వద్ద స్థిరపడొచ్చని అంచనా వేసింది. దేశ లగేజీ పరిశ్రమలో కేవలం కొన్ని పెద్ద సంస్థల ఆధిపత్యమే కొసాగుతున్నట్టు వివరించింది. ఇవి గత కొన్ని సంవత్సరాల్లో స్థానికంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు తెలిపింది. మరోవైపు అసంఘటిత లగేజీ పరిశ్రమ ప్రధానంగా చైనా నుంచి దిగుమతులపైనే ఆధారపడినట్టు వివరించింది.
స్థానిక తయారీ..
హార్డ్ లగేజీ ఉత్పత్తుల తయారీని స్థానికంగానే చేపడుతుండడం గత ఐదేళ్లలో వీటి దిగుమతులు తగ్గుతూ వస్తున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ‘‘హార్డ్ లగేజీకి ప్రాధాన్యం పెరుగుతుండడం, , పోటీ ధరలకే నాణ్యమైన ఉత్పత్తుల లభ్యత అన్నవి సంఘటిత రంగంలోని కంపెనీలకు అనుకూలం. ఫలితంగా దేశ లగేజీ పరిశ్రమలో సంఘటిత రంగ కంపెనీల వాటా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు 45 శాతానికి చేరుకుంటుంది.
అదే సమయంలో రిస్‌్కలు సైతం పెరుగుతున్నాయి. వరుసగా మూడేళ్ల పాటు డబుల్ డిజిట్ వృద్ధిని పరిశ్రమ చూసింది. అది ఇప్పుడు క్షీణిస్తోంది. కొత్త సంస్థల ప్రవేశంతో పోటీ పెరిగింది. ఇది ప్రచారంపై వ్యయాలను పెంచింది. దీంతో మార్జిన్లు మోస్తరు స్థాయికి చేరుకున్నాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ హిమాంక్ శర్మ వివరించారు. డిమాండ్ మోస్తరు స్థాయికి దిగి రావడంతో 2024లో లగేజీ నిల్వలు 114రోజులకు (విక్రయాలకు సరిపడా) చేరాయని, ఆర్థిక సంవత్సరం చివరికి 100–105 రోజులకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది.
కంపెనీల బ్యాలన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం, పూర్తి సామర్థ్య వినియోగం నేపథ్యంలో సంఘటిత రంగ సంస్థలు హార్డ్ లగేజీ తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించొచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ‘‘సామర్థ్యం 25 శాతం మేర పెరగొచ్చు. ఇందుకు రూ.500–550 కోట్ల వరకు వ్యయం చేయాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని అంతర్గత వనరుల నుంచే కంపెనీలు సమకూర్చుకోవచ్చు. రుణ భారాన్ని పరిగణనలోకి తీసుకుని చూసినా వడ్డీ కవరేజీ రేషియో, నెట్‌వర్త్ పరంగా కంపెనీలు సౌకర్యంగానే ఉన్నాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ రుషబ్ బోర్కార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment