fiscal year
-
జీడీపీ.. ప్చ్!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ3లోనూ (2024 అక్టోబర్–డిసెంబర్) బలహీన ధోరణి ప్రదర్శించింది. జీడీపీ వృద్ధి రేటు 6.2 శాతంగా నమోదైంది. జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో నమోదైన ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి 5.6 శాతం (తాజా సవరణకు ముందు 5.4 శాతం) నుంచి, డిసెంబర్ క్వార్టర్లో 6.2 శాతానికి పుంజుకున్నప్పటికీ.. క్రితం ఆర్థిక సంవత్సరం(2023–24)క్యూ3లో నమోదైన 9.5 శాతం రేటుతో పోల్చితే గణనీయంగా తగ్గినట్టు స్పష్టమవుతోంది. అంతేకాదు, ఆర్బీఐ అంచనా 6.8 శాతం కంటే కూడా తక్కువగానే నమోదైంది. తయారీ, మైనింగ్ రంగాల పనితీరు బలహీనపడడం వృద్ధి రేటును తక్కువ స్థాయికి పరిమితం చేసింది. పట్టణ వినియోగం కూడా బలహీనంగానే కొనసాగింది. అదే సమయంలో వ్యవసాయ రంగం పటిష్ట పనితీరుకుతోడు ప్రభుత్వం మూలధన వ్యయాలను పెంచడం.. మెరుగైన వర్షాలకుతోడు పండుగల సీజన్లో గ్రామీణ వినియోగం పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలి చాయి. డిసెంబర్ త్రైమాసికం జీడీపీ గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) శుక్రవారం విడుదల చేసింది. నాలుగేళ్ల కనిష్టం.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 6.5% వృద్ధిని (స్థిర కరెన్సీలో రూ.188 లక్షల కోట్లు) సాధిస్తుందని ఎన్ఎస్వో తన ద్వితీయ ముందస్తు అంచనాల్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో వేసిన తొలి ముందస్తు అంచనాల్లో ఇది 6.4 శాతంగా ఉండడం గమనార్హం. అయినప్పటికీ ఇది నాలుగేళ్ల కనిష్ట వృద్ధి కానుంది. క్రితం ఆర్థిక సంవత్సరం 9.2 శాతం కంటే కూడా తక్కువ. ఎన్ఎస్వో తాజా అంచనాల మేరకు జీడీపీ 6.5 శాతానికి పుంజుకోవాలంటే చివరి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగైన పనితీరు చూపించాల్సి ఉంటుంది. రంగాల వారీ పనితీరు.. → స్థూల విలువ జోడింపు (జీవీఏ/ఆర్థిక కార్యకలాపాల తీరు) డిసెంబర్ త్రైమాసికంలో 6.2 శాతంగా నమోదైంది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 5.6 శాతంగా ఉంది. → వ్యవసాయ రంగం ఆరు త్రైమాసికాల గరిష్ట స్థాయికి పుంజుకున్నది. డిసెంబర్ త్రైమాసికంలో ఐదు రెట్లు బలపడి 5.6 శాతం వృద్ధిని చూపించింది. అంతకుముందు త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) ఇది 4.1 శాతంగా ఉంటే, క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు 1.5 శాతమే కావడం గమనించొచ్చు. → తయారీ రంగంలో వృద్ధి సెపె్టంబర్ క్వార్టర్లో ఉన్న 2.1 శాతం నుంచి డిసెంబర్ త్రైమాసికంలో 3.5 శాతానికి చేరింది. అయినప్పటికీ క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ3లో 14 శాతం వృద్ధి రేటుతో పోల్చి చూస్తే చాలా తక్కువే. → మైనింగ్‌లో వృద్ధి 1.4%కి పడిపోయింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఇది 4.7%. → సేవల రంగం వృద్ధి రేటు క్యూ3లో 7.4 శాతానికి మెరుగుపడింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఇది 8.3 శాతం కావడం గమనార్హం. క్యూ4లో బలమైన పనితీరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన పనితీరు చూపించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు మూలధన వ్యయాలు పుంజుకోవడంతోపాటు, ఎగుమతులు వృద్ధికి మద్దతుగా నిలుస్తాయి. – అనంత నాగేశ్వరన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు -
స్థిరమైన డిమాండ్ ఉండే పరిశ్రమ
ముంబై: లగేజీ ఉత్పత్తుల పరిశ్రమలో (సంఘటిత రంగం) డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో స్థిరంగా కొనసాగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. పర్యాటకం, కార్పొరేట్ ప్రయాణాలకు డిమాండ్ కొనసాగుతుండడం ఇందుకు సానుకూలంగా పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంఘటిత లగేజీ పరిశ్రమ ఆదాయం 8–10 శాతం క్షీణించొచ్చని అంచనా వేసింది. 2021–22 నుంచి 2023–24 మధ్య పరిశ్రమ పరిమాణం రెట్టింపు కావడం, అధిక బేస్ ఇందుకు కారణాలుగా పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2023–24) పరిశ్రమ 18 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ‘‘తయారీ దారుల మధ్య పోటీ పెరిగింది. కొత్త సంస్థలు ప్రవేశించాయి. నిల్వలు మోస్తరుగా పెరగడం వంటి అంశాలతో కంపెనీలు విక్రయ ధరలను పోటాపోటీగా మార్చేశాయి. దీంతో నికరంగా విక్రయ ధరలు, ముఖ్యంగా ఎకానమీ (బడ్జెట్) విభాగంలో తగ్గాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. 2023–24లో నిర్వహణ మార్జిన్లు 1.5 శాతం మేర తగ్గాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 0.50 శాతం వరకు క్షీణించి 13.5–14 శాతం వద్ద స్థిరపడొచ్చని అంచనా వేసింది. దేశ లగేజీ పరిశ్రమలో కేవలం కొన్ని పెద్ద సంస్థల ఆధిపత్యమే కొసాగుతున్నట్టు వివరించింది. ఇవి గత కొన్ని సంవత్సరాల్లో స్థానికంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు తెలిపింది. మరోవైపు అసంఘటిత లగేజీ పరిశ్రమ ప్రధానంగా చైనా నుంచి దిగుమతులపైనే ఆధారపడినట్టు వివరించింది. స్థానిక తయారీ.. హార్డ్ లగేజీ ఉత్పత్తుల తయారీని స్థానికంగానే చేపడుతుండడం గత ఐదేళ్లలో వీటి దిగుమతులు తగ్గుతూ వస్తున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ‘‘హార్డ్ లగేజీకి ప్రాధాన్యం పెరుగుతుండడం, , పోటీ ధరలకే నాణ్యమైన ఉత్పత్తుల లభ్యత అన్నవి సంఘటిత రంగంలోని కంపెనీలకు అనుకూలం. ఫలితంగా దేశ లగేజీ పరిశ్రమలో సంఘటిత రంగ కంపెనీల వాటా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు 45 శాతానికి చేరుకుంటుంది. అదే సమయంలో రిస్‌్కలు సైతం పెరుగుతున్నాయి. వరుసగా మూడేళ్ల పాటు డబుల్ డిజిట్ వృద్ధిని పరిశ్రమ చూసింది. అది ఇప్పుడు క్షీణిస్తోంది. కొత్త సంస్థల ప్రవేశంతో పోటీ పెరిగింది. ఇది ప్రచారంపై వ్యయాలను పెంచింది. దీంతో మార్జిన్లు మోస్తరు స్థాయికి చేరుకున్నాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ హిమాంక్ శర్మ వివరించారు. డిమాండ్ మోస్తరు స్థాయికి దిగి రావడంతో 2024లో లగేజీ నిల్వలు 114రోజులకు (విక్రయాలకు సరిపడా) చేరాయని, ఆర్థిక సంవత్సరం చివరికి 100–105 రోజులకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. కంపెనీల బ్యాలన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం, పూర్తి సామర్థ్య వినియోగం నేపథ్యంలో సంఘటిత రంగ సంస్థలు హార్డ్ లగేజీ తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించొచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ‘‘సామర్థ్యం 25 శాతం మేర పెరగొచ్చు. ఇందుకు రూ.500–550 కోట్ల వరకు వ్యయం చేయాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని అంతర్గత వనరుల నుంచే కంపెనీలు సమకూర్చుకోవచ్చు. రుణ భారాన్ని పరిగణనలోకి తీసుకుని చూసినా వడ్డీ కవరేజీ రేషియో, నెట్‌వర్త్ పరంగా కంపెనీలు సౌకర్యంగానే ఉన్నాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ రుషబ్ బోర్కార్ తెలిపారు. -
ఎస్బీఐ లాభం ప్లస్
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 19,325 కోట్లను తాకింది. అధిక ప్రొవిజన్లు, వడ్డీ ఆదాయం మందగించడం లాభాలపై ప్రభావం చూపింది. ఇక స్టాండెలోన్ నికర లాభం మరింత నెమ్మదించి 1 శాతం వృద్ధితో రూ. 17,035 కోట్లకు చేరింది. తొలి త్రైమాసికంలో సాధారణంగా బలహీన ఫలితాలు వెలువడుతుంటాయని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. ఇకపై వృద్ధి పుంజుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వెరసి ఈ ఏడాదిలో రూ. లక్ష కోట్ల నికర లాభం అందుకోగలమని ధీమాగా చెప్పారు. వడ్డీ ఆదాయం ఓకే ప్రస్తుత సమీక్షా కాలంలో ఎస్బీఐ నికర వడ్డీ ఆదాయం 6 శాతం మెరుగుపడి రూ. 41,125 కోట్లకు చేరింది. ఇందుకు 15 శాతం రుణ విడుదల దోహదపడగా.. నికర వడ్డీ మార్జిన్లు 0.12 శాతం నీరసించి 3.35 శాతాన్ని తాకాయి. ఇతర ఆదాయం రూ. 12,063 కోట్ల నుంచి రూ. 11,162 కోట్లకు తగ్గింది. ఇన్వెస్ట్మెంట్ బుక్‌ను నిబంధనలకు అనుగుణంగా సవరించడం ఇందుకు కారణమైనట్లు ఖారా తెలియజేశారు. డిపాజిట్లలో 8 శాతం వృద్ధి నమోదైంది. తాజా స్లిప్పేజీలు రూ. 7,900 కోట్లను తాకాయి. వీటిలో రూ. 3,000 కోట్లు గృహ, వ్యక్తిగత రుణాల నుంచి నమోదైంది. స్థూల మొండిబకాయిలు 2.24 శాతం నుంచి 2.21 శాతానికి స్వల్పంగా తగ్గాయి. రుణ నష్టాల ప్రొవిజన్లు 70 శాతం పెరిగి రూ. 4,580 కోట్లయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి 13.86 శాతంగా నమోదైంది.షేరు ప్రతిఫలించడంలేదుగత నాలుగేళ్లలో ఎస్బీఐ ఆర్జించిన లాభాలు అంతక్రితం 64 ఏళ్లలో సాధించిన లాభాలకంటే అధికమైనప్పటికీ షేరు ధరలో ఇది ప్రతిఫలించడంలేదని దినేష్ ఖారా అభిప్రాయపడ్డారు. 22,000కుపైగా బ్రాంచీలు, భారీ రిజర్వులు, విభిన్న ప్రొడక్టులు కలిగిన బ్యాంక్‌కు సరైన విలువ లభించడంలేదని వ్యాఖ్యానించారు. గత 4ఏళ్లలో రూ. 1.63 లక్షల కోట్ల నికర లాభం ఆర్జించగా.. అంతక్రితం 64 ఏళ్లలో రూ. 1.45 లక్షల కోట్లు మాత్రమే ఆర్జించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నెలాఖరున ఖారా పదవీకాలం ముగియనుంది. బాధ్యతలు స్వీకరించేటప్పటికి బ్యాంక్ వార్షిక లాభం రూ. 14,000 కోట్లుకాగా.. ప్రస్తుతం ఒక త్రైమాసికంలోనే రూ. 17,000 కోట్లు ఆర్జిస్తున్నట్లు తెలియజేశారు. ఉద్యోగుల సంఖ్య సైతం ఆరు రెట్లు ఎగసి 30 లక్షలకు చేరినట్లు వెల్లడించారు. ఈ అంశాలేవీ ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంలేదంటూ ఖారా విచారం వ్యక్తం చేశారు. ప్రొవిజన్ల విషయంగా కొత్త చైర్మన్‌కు కుదుపులు ఉండవని, ఎండీలంతా కలసి బ్యాలన్స్ïÙట్ను రూపొందించారని వివరించారు. కాగా.. గత ఐదేళ్లలో ఎస్బీఐ మార్కెట్ క్యాప్(విలువ) రూ. 0.84 లక్షల కోట్ల నుంచి రూ. 1.92 లక్షల కోట్లకు ఎగసింది. అయినప్పటికీ ఇది తగిన విలువకాదంటూ ఖారా పేర్కొన్నారు. ఎఫ్‌అండ్‌వోపై రిటైల్ ఇన్వెస్టర్లను నిరుత్సాహపరుస్తూ సెబీ తీసుకుంటున్న నియంత్రణలతో బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధులు మళ్లే వీలున్నట్లు ఖారా అభిప్రాయపడ్డారు. -
Arvind Virmani: 2024–25లో 7 శాతం వృద్ధి సాధిస్తాం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి అంచనా వ్యక్తం చేశారు. ఈ రేటు 0.5 శాతం అటూ, ఇటూగా ఉండొచ్చన్నారు. అంతేకాదు, రానున్న కొన్నేళ్లపాటు ఇదే తరహా వృద్ధి రేటు నమోదవుతుందన్నారు. దేశం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందంటూ.. వాటిని పరిష్కరించాల్సి ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–25) జీడీపీ 7.2 శాతం వరకు వృద్ధిని నమోదు చేయవచ్చని ఆర్బీఐ సైతం ఇటీవలే అంచనా వేయడం గమనార్హం. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు వినియోగం వ్యయాలు క్షీణించడంపై ఎదురైన ప్రశ్నకు విర్మాణి స్పందిస్తూ.. కరోనా విపత్తు ప్రభావంతో గృహ పొదుపు తగ్గిపోయిందని.. అంతకుముందు ఆర్థిక సంక్షోభాలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉందన్నారు. రెట్టింపు కరువు పరిస్థితిగా దీన్ని అభివర్ణించారు. గతేడాది ఎల్‌నినో పరిస్థితిని చూసినట్టు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పొదుపులను మళ్లీ పోగు చేసుకోవాల్సి ఉన్నందున, అది వినియోగంపై ప్రభావం చూపించినట్టు వివరించారు. ‘‘బ్రాండెడ్ ఉత్పత్తులు కొనుగోలు చేసే వారు, చిన్న బ్రాండ్లు లేదా సాధారణ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. తద్వారా కొంత మొత్తాన్ని ఆదా చేసుకుంటున్నారు’’అని వివరించారు. చారిత్రకంగా చూస్తే ప్రాంతీయ భాగస్వామి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రైవేటీకరణ నిదానించినట్టుగా తెలుస్తోందని.. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటీకరణ చేపట్టకపోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదన్నారు. వడ్డీ రేట్ల కోతతో పెట్టుబడుల ప్రవాహం..వర్ధమాన దేశాలతో పోలిస్తే రిస్క్ లేని రాడులు యూఎస్‌లో, అభివృద్ధి చెందిన మార్కెట్లో వస్తుండడమే, మన దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తక్కువగా ఉండడానికి కారణంగా విర్మాణి చెప్పారు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం మొదలైన తర్వాత మన దగ్గరకు పెట్టుబడుల ప్రవాహం మొదలవుతుందని అంచనా వేశారు. -
భారత్ వృద్ధి 6.8 శాతం
న్యూఢిల్లీ: భారత్ ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.8 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి సాధిస్తుందన్న తన అంచనాలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ స్పష్టం చేసింది. అధిక వడ్డీరేట్లు, ద్రవ్యలోటు సవాళ్లు డిమాండ్‌ను తగ్గిస్తాయని తన తాజా ఆసియా పసిఫిక్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో పేర్కొంది. 2023–24లో భారత్ 8.2 శాతం వృద్ధి రేటు సాధనను సైతం ఈ సందర్భంగా ఎస్అండ్పీ ప్రశంసించింది. 2024–25కు సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ తాజా రేటింగ్స్ ఉద్ఘాటన.. ఆర్బీఐ అంచనా 7.2శాతంకన్నా తక్కువగా ఉండడం గమనార్హం. గ్లోబల్ రేటింగ్ దిగ్గజం తాజా అవుట్‌లుక్‌లో ము ఖ్యాంశాలు చూస్తే.. 2025–26, 2026– 27లో భారత్ వృద్ధి రేట్లు వరుసగా 6.9 శాతం, 7 శాతాలుగా ఉంటాయి. 2024లో చైనా వృద్ధి అంచనా 4.6 శాతం నుంచి 4.8 శాతానికి పెంపు. రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) చైనా ఎకానమీ మందగమనాన్ని చూస్తుంది. ఒకవైపు తగ్గిన వినియోగం, తయారీ పెట్టుబడుల పెరుగుదల వంటి కీలక అంశాలు లాభాల మార్జిన్లపై ప్రభావం చూపుతాయి. -
భళా.. భారత్
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ అన్ని వర్గాల అంచనాలకు మించి మంచి ఫలితాన్ని సాధించింది. మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదయ్యింది. మార్చి త్రైమాసికంలో ఈ పురోగతి 7.8 శాతంగా రికార్డు అయ్యింది. నాలుగో త్రైమాసికంలో 6.1–6.7 శాతం పరిధిలో వృద్ధి చెందుతుందని పలువురు ఆర్థికవేత్తలు అంచనావేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.6–7.8 శాతం శ్రేణిలో ఉంటుందన్నది వారి అభిప్రాయం. ఆర్బీఐ వృద్ధి అంచనాసైతం 7 శాతంగా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ఫిబ్రవరినాటి తన రెండవ అడ్వాన్స్ అంచనాల్లో 2023–24 వృద్ధి రేటును 7.7 శాతంగా పేర్కొంది. ఈ అంచనాలు, విశ్లేషణలు అన్నింటికీ మించి తాజా ఫలితం వెలువడ్డం గమనార్హం. క్యూ4లో అంచనాలకు మించి (7.8 శాతం) భారీ ఫలితం రావడం మొత్తం ఎకానమీ వృద్ధి (8.2 శాతం) పురోగతికి కారణం. ఎన్ఎస్ఓ శుక్రవారం ఈ మేరకు తాజా గణాంకాలను వెలువరించింది. 5 ట్రిలియన్ డాలర్ల దిశగా అడుగులుభారత ఆర్థిక వ్యవస్థ 2023–24 జూన్ త్రైమాసికంలో 8.2 శాతం, సెపె్టంబర్ త్రైమాసికంలో 8.1 శాతం, డిసెంబర్ త్రైమాసికంలో 8.6 శాతం పురోగతి సాధించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతంకాగా, అదే ఆర్థిక సంవత్సరం క్యూ4లో వృద్ధి రేటు 6.2 శాతం. చైనా ఎకానమీ 2024 మొదటి మూడు నెలల్లో 5.3 శాతం పురోగమించడం గమనార్హం. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఎకానమీ ముందుందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనితోపాటు భారత్ ఎకానమీ 3.5 ట్రిలియన్ డాలర్ల జోన్లో స్థిరపడగా, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనకు ముందడుగు పడింది. మార్చిలో మౌలిక రంగం 6.2 శాతం వృద్ధి ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమ మార్చిలో 6.2 శాతం పురోగమించింది. సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, విద్యుత్ రంగాల చక్కటి పనితీరు ఇందుకు దోహదపడింది. బొగ్గు, క్రూడ్ ఆయిల్, ఎరువులు, స్టీల్, సిమెంట్ రంగాలు కూడా కలిగిన ఈ గ్రూప్ 2024 మార్చితో 6 శాతం పురోగమించగా, 2023 ఏప్రిల్‌లో 4.6 శాతంగా నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో (ఐఐపీ) ఈ గ్రూప్ వెయిటేజ్ 40.27 శాతం. 2024లో వృద్ధి 6.8%: మూడీస్ భారత్ 2024లో 6.8 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని రేటింగ్ దిగ్గజం మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2025లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. 2022లో ఎకానమీ 6.5 శాతం పురోగమిస్తే,,, 2023లో 7.7 శాతానికి ఎగసిందని తెలిపింది.ద్రవ్యలోటు కట్టడిఆర్థిక వ్యవస్థ గణాంకాలు అంచనాలకు మించి పురోగమించిన నేపథ్యంలో ఎకానమీకి మరో సానుకూల అంశం... ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు పరిస్థితి మెరుగుపడ్డం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతంగా (జీడీపీ విలువలతో పోల్చి) ద్రవ్యలోటు ఉండాలని కేంద్ర బడ్జెట్ నిర్దేశిస్తుండగా, ఈ అంకెలు మరింత మెరుగ్గా 5.63 శాతంగా నమోదయ్యాయి. విలువల్లో రూ.17.34 లక్షల కోట్లుగా ఫిబ్రవరి 1 బడ్జెట్ అంచనావేస్తే, మరింత మెరుగ్గా రూ.16.53 లక్షల కోట్లుగా ఇది నమోదయినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ తాజా గణాంకాలు వెల్లడించాయి.8.2% వృద్ధి ఎలా... 2011–12ను బేస్ ఇయర్‌గా తీసుకుంటూ.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకు ని స్థిర ధరల వద్ద 2022–23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ రూ.160.71 లక్షల కోట్లు. 2023–24లో ఈ విలువ 173.82 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఇక్కడ వృద్ధి రేటు 8.2 శాతం. ఇక ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా స్థిర ధరల వద్ద వృద్ధి రేటును చూస్తే... ఇది 9.6 శాతం పురోగమించి రూ.269.50 లక్షల కోట్ల నుంచి రూ.295.36 లక్షల కోట్లకు చేరింది. 7.8% పరుగు ఇలా.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని క్యూ4లో (2023 క్యూ4తో పోల్చి) ఎకానమీ విలువ రూ.43.84 లక్షల కోట్ల నుంచి రూ.47.24 లక్షల కోట్లకు ఎగసింది. అంటే వృద్ధి 7.8 శాతమన్నమాట. స్థిర ధరల వద్ద ఈ రేటు 9.9 శాతం పెరిగి రూ.71.23 లక్షల కోట్ల నుంచి రూ.78.28 లక్షల కోట్లకు ఎగసింది. మోదీ ప్రభుత్వం 3.0లోనూ వృద్ధి వేగం కొనసాగుతుంది ప్రపంచంలోని దిగ్గజ ఎకానమీలో భారత్ జీడీపీ వృద్ధి తీరు విశేషమైనది. మోదీ ప్రభుత్వం 3.0లోనూ ఇదే వృద్ధి వేగం కొనగుతుంది. 2023–24లో తయారీ రంగం 9.9 శాతం పురోగమించడం ప్రత్యేకమైన అంశం. 2014కి పూర్వం యూపీఏ ప్రభుత్వం హయాంలో అవినీతితో మొండి బకాయిల కుప్పగా మారిన బ్యాంకింగ్ రంగాన్ని వివిధ సంస్కరణలతో మోదీ ప్రభుత్వం టర్నెరౌండ్ చేసి, వృద్ధి బాటలో పరుగులు తీయిస్తోంది. 2014–23 మధ్య బ్యాంకులు రూ. 10 లక్షల కోట్ల మేర మొండిబాకీల రికవరీ జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 1,105 బ్యాంక్ ఫ్రాడ్ కేసులను దర్యాప్తు చేసి రూ. 64,920 కోట్ల మొత్తాన్ని అటాచ్ చేసింది. – మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో నిర్మలా సీతారామన్ -
జువెలర్ల ఆదాయమూ ‘బంగారమే’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారు ఆభరణాల రంగంలో ఉన్న వ్యవస్థీకృత రిటైలర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17–10 శాతం ఆదాయ వృద్ధి సాధించే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. పుత్తడి ధర పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఆభరణాల అమ్మకాల పరిమాణం 2023–24 మాదిరిగానే స్థిరంగా ఉంటుందని అంచనా. బంగారం ధరలు గణనీయంగా పెరగడం, నూతన ఔట్లెట్స్ జోడింపులు.. వెరశి అధిక సరుకు నిల్వల స్థాయిల కారణంగా రిటైలర్ల మూలధన అవసరాలు పెరగవచ్చు. సురక్షిత పెట్టుబడి.. ఆభరణాల మార్కెట్లో వ్యవస్థీకృత రంగం వాటా మూడింట ఒక వంతు కంటే కొంచెం ఎక్కువగా ఉంది. మిగిలిన వాటా అవ్యవస్థీకృత రంగం కైవసం చేసుకుంది. దేశీయంగా బంగారం ధర 2023–24లో 15 శాతం పెరిగి 2024 మార్చి చివరి నాటికి 10 గ్రాములకు రూ.67,000కి చేరుకుంది. ఏప్రిల్‌లో ధర రూ.73,000 స్థాయికి వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సెంట్రల్ బ్యాంకులు, అలాగే భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య వినియోగదారులు చూసే సురక్షిత పెట్టుబడి ఎంపికలలో బంగారం ఒకటిగా నిలవడమే ధర పెరుగుదలకు కారణం. అధిక తగ్గింపులు.. బ్రాండింగ్, మార్కెటింగ్ వ్యయాన్ని పెంచడమే కాకుండా, అధిక బంగారం ధరల మధ్య వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నంలో ఉత్పత్తి డిజైన్స్, ఆఫర్లను విస్తరించడం కొనసాగించినప్పటికీ, రిటైలర్లు కొనుగోలుదారులకు అధిక తగ్గింపులను అందించే అవకాశం ఉంది. అమ్మకాలు దూసుకెళ్లేందుకు గోల్డ్ ఎక్సే్ఛంజ్ ఆఫర్లను ప్రమోట్ చేయవచ్చు. ఫలితంగా మూడింట ఒకవంతు ఉన్న గోల్డ్ ఎక్సే్చంజ్ పథకాల వాటా గణనీయంగా పెరగనుంది. కస్టమర్ల ప్రాధాన్యతల్లో మార్పు రావడం, విక్రయ సంస్థలు ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంతో వ్యవస్థీకృత రంగం వాటా వృద్ధి చెందనుంది. కాగా, పసిడి ధర దూసుకెళ్లిన నేపథ్యంలో తక్కువ క్యారట్ కలిగిన ఆభరణాలకు కస్టమర్లు మళ్లే అవకాశం ఉందని హీరావాలా జెమ్స్, జువెల్లర్స్ ఎండీ గౌతమ్ చవాన్ తెలిపారు.స్థిరంగా క్రెడిట్ ప్రొఫైల్స్..ఆరోగ్యకర బ్యాలెన్స్ షీట్స్ మద్దతుతో స్టోర్ విస్తరణలు మహమ్మారి తర్వాత బలమైన రెండంకెల వృద్ధిని సాధించాయి. స్థిర పరిమాణం కారణంగా 2024–25లో స్టోర్ల జోడింపు వేగం 10–12 శాతానికి తగ్గవచ్చు. పెరిగిన బంగారం ధరల ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ధరతో బంగారం నిల్వలు భర్తీ అవుతాయి. వర్కింగ్ క్యాపిటల్ రుణాలలో ఆశించిన పెరుగుదల ఉన్నప్పటికీ.. ఆరోగ్యకర రాబడి పెరుగుదల, తగిన లాభదాయకత కారణంగా బలంగా నగదు రాకతో వ్యవస్థీకృత బంగారు ఆభరణాల రిటైలర్ల క్రెడిట్ ప్రొఫైల్స్‌ను స్థిరంగా ఉంచుతున్నట్టు క్రిసిల్ వెల్లడించింది. -
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.8 శాతం
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2023–24 ఆర్థిక సంవత్సరంలో (2022–23తో పోల్చి) 5.8 శాతం పురోగమించింది. మార్చిలో 4.9 శాతంగా నమోదైంది. 2023 ఫిబ్రవరి (5.6 శాతం) కన్నా మార్చితో స్పీడ్ తగ్గినప్పటికీ, 2023 మార్చి కన్నా (1.9 శాతం) పురోగమించడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే వృద్ధి స్వల్పంగా 5.2 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగింది. భారత్ ఎకానమీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 18.4 శాతం. పారిశ్రామిక రంగం వాటా 28.3 శాతం. సేవల రంగం వాటా 53.3 శాతం. పారిశ్రామిక రంగంలో ఒక్క తయారీ రంగం వాటా దాదాపు 70 శాతం. రంగాల వారీగా..(శాతాల్లో) విభాగం 2024 2023 మార్చి మార్చి తయారీ 5.2 1.5 మైనింగ్ 1.2 6.8 విద్యుత్ ఉత్పత్తి 8.6 – 1.6 క్యాపిటల్ గూడ్స్ 6.1 10 కన్జూమర్ డ్యూరబుల్స్ 9.5 – 8.0 కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ 4.9 –1.9 ఇన్ఫ్రా/నిర్మాణం 6.9 7.2 ప్రైమరీ గూడ్స్ 2.5 3.3 ఇంటరీ్మడియట్ గూడ్స్ 5.1 1.8 -
భారత్ వృద్ధి అంచనా పెంచిన ఏడీబీ
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధి అంచనాలను ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 30 బేసిస్ పాయింట్లు పెంచింది. తొలి అంచనాలు (2023 డిసెంబర్ అంచనాలు) 6.7 శాతంకాగా, దీనిని 7 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడుల పెరుగుదల, వినియోగ డిమాండ్ పటిష్టత తాజా అంచనాలకు కారణమని ఏప్రిల్ ఎడిషన్ అవుట్‌లుక్‌లో ఏడీబీ పేర్కొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ప్రధాన ‘‘గ్రోత్ ఇంజిన్’’గా భారత్ ఉంటుందని అవుట్‌లుక్‌లో విశ్లేíÙంచింది. ఇక 2025–26లో వృద్ధి 7.2 శాతంగా ఉంటుందన్నది ఏడీబీ తాజా అంచనా. అయితే ప్రస్తుత ఆర్థిక సవాళ్ల పట్ల అప్రమత్తత అవసరమని హెచ్చరించింది. 2024–25 విషయానికి వస్తే, ఆర్బీఐ కూడా దేశాభివృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని పేర్కొనడం గమనార్హం. -
ఇప్పుడు 7.2 శాతం.. వచ్చేది 7 శాతం!
దావోస్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం, ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదుచేసుకోగలదన్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వ్యస్తం చేశారు. ఆర్బీఐ పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న భరోసాను ఇచ్చారు. గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) 2023–24 జీడీపీ అంచనాలు 7 శాతంకన్నా... వ్యక్తిగతంగా దాస్ అంచనా 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికంగా గమనార్హం. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఐఐ వార్షిక సమావేశంలో ‘అధిక వృద్ధి తీరు–తక్కువ స్థాయిలో ఇబ్బందులు: ది ఇండియా స్టోరీ’ అనే అంశంపై దాస్ మాట్లాడుతూ, వృద్ధి స్పీడ్ తక్కువగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలకు సంబంధించి ద్రవ్యోల్బణం ప్రమాదం ఇటీవల తగ్గుముఖం పట్టిందని అన్నారు. ఇది భవిష్యత్ వృద్ధి పటిష్టతకు సంకేతమని పేర్కొన్నారు. సమావేశంలో ఇంకా ఆయన ఏమన్నారంటే... ► ఇటీవలి సంవత్సరాలలో భారత్ ప్రభుత్వం చేపట్టిన పటిష్ట నిర్మాణాత్మక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మధ్య, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పెంచాయి. ► సవాలుతో కూడిన ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనూ భారత్... పటిష్ట వృద్ధి, స్థిరత్వ బాటన పయనిస్తోంది. ► ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు, మార్కెట్ల సానుకూల వాతావారణం ఉన్నప్పటికీ, భౌగోళిక ఇబ్బందులు, వాతావరణ మార్పులు ఆందోళనకు కారణమవుతున్నాయి. ► బలమైన దేశీయ డిమాండ్‌తో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఇటీవలి ప్రపంచ అనిశ్చితి పరిణామాల నుంచి భారత్ మరింత బలంగా బయటపడింది. ► అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనగలిగిన స్థాయిలో భారత్ చెల్లింపుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశానికి తగిన స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. ► 2022 మే నుంచి ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుతూ వచి్చంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం, ద్రవ్య లభ్యత నిర్వహణా పరిస్థితులు ఇందుకు దోహదపడ్డాయి. (2022 మే నుంచి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో రేటు 2.5 శాతం పెరిగి 6.5 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.) సరఫరాల వైపు సమస్యలు కూడా తొలిగిపోతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కీలకపాత్ర పోషిస్తోంది. ► వచ్చే ఏడాది సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని భావిస్తున్నా. ప్రభుత్వ నిర్దేశాలకు అనుగుణంగా ఆర్బీఐ 4 శాతం లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలదనే విశ్వాసంతో ఉంది. -
అంచనాలకు మించి భారత్ పురోగతి
ముంబై: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2023–24) స్థూల దేశీయోత్పత్తి– జీడీపీ అంచనాలను దేశీయ రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా క్రితం 6.2 శాతం నుంచి 30 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. కమోడిటీల ద్రవ్యోల్బణం ‘మైనస్’లో ఉండడం, ఏప్రిల్–సెపె్టంబర్ ఆరు నెలల జీడీపీ గణాంకాల్లో చక్కటి పురోగతి, అక్టోబర్–డిసెంబర్ మధ్య కూడా సానుకూల వృద్ధి గణాంకాలు వెలువడే అవకాశాలు తమ అంచనాల తాజా పెంపునకు కారణమని ఇక్రా పేర్కొంది. ‘‘2023 అక్టోబర్–నవంబర్ ఇక్రా బిజినెస్ యాక్టివిటీ మానిటర్ 11.3 శాతం పెరిగింది. జూలై, ఆగస్టు, సెపె్టంబర్ (క్యూ2)లో నమోదయిన 9.5 శాతం కన్నా ఇది అధికం. పండుగల నేపథ్యంలో అధిక ఫ్రీక్వెన్సీ నాన్–అగ్రి ఇండికేటర్లలో నమోదయిన ఈ పెరుగుదల పూర్తి సానుకూలమైంది. ఈ నేపథ్యంలో క్యూ3తో కూడా మంచి ఫలితం వస్తుందని భావిస్తున్నాం’’ అని ఇక్రా విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. సానుకూల పరిస్థితులు... చైనాకు సంబంధించి డిమాండ్ తగ్గే అవకాశాలు, ముడి చమురు వంటి కీలక కమోడిటీల తగినంత సరఫరాలు, సాధారణ సరఫరా చైన్ పరిస్థితులు ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉండడానికి దోహదపడే అంశంగా ఇక్రా పేర్కొంది. భారత్ ఎకానమీకి సంబంధించి అక్టోబర్, నవంబర్లలో అధిక క్రియాశీలత కనిపించినప్పటికీ, డిసెంబరులో ప్రారంభంలో మిశ్రమ పోకడలు కనిపించాయని ఇక్రా పేర్కొంది. విద్యుత్ డిమాండ్ పెరుగుదల నెమ్మదించిందని, డీజిల్ డిమాండ్ క్షీణతలోకి జారిందని పేర్కొన్న ఇక్రా, రోజువారీ వాహనాల రిజి్రస్టేషన్లు మ్రాతం పెరిగినట్లు తెలిపింది. 2023–24లో జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తొలుత అంచనావేసింది. క్యూ1లో 8 శాతం వృద్ధి అంచనాకు భిన్నంగా 7.8 శాతం ఫలితం వెలువడింది. క్యూ2లో 6.5 శాతం అంచనాలు వేయగా ఇందుకు 1.1 శాతం అధికంగా ఫలితం వెలువడింది. దీనితో ఆర్బీఐ కూడా ఇటీవలి పాలసీ సమీక్షలో తన జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతానికి పెంచింది. క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే... రియల్ జీడీపీ విలువ రూ.76.22 లక్షల కోట్ల నుంచి రూ. 82.11 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఆరు నెలల్లో వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. క్యాలెండర్ ఇయర్ మూడు త్రైమాసికాల్లో వృద్ధి 7.1 శాతంగా ఉంది. -
ఆఫీస్ స్పేస్ డిమాండ్ అంతంతే
ముంబై: వాణిజ్య కార్యాలయ స్థలాల లీజు (ఆఫీస్ స్పేస్) మార్కెట్లో డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్తబ్దుగా ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. 32–34 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజు నమోదు కావచ్చని పేర్కొంది. అదే సమయంలో, దేశీయంగా వాణిజ్య రియల్టీ మార్కెట్లో ఉన్న సహజ బలాలు, ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి వచ్చి పని చేస్తుండడం అన్నవి మధ్య కాలానికి భారత్‌లో ఆఫీస్ స్పేస్ లీజు డిమాండ్‌ను పెంచుతాయని తెలిపింది. దేశీ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు 42–45 శాతం వాటాతో అగ్రగామిగా ఉన్న విషయాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది. బహుళజాతి సంస్థలకు చెందిన అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు (జీసీసీ) సైతం గడిచిన కొన్ని సంవత్సరాల్లో కిరాయిదారులకు కీలక విభాగంగా మారినట్టు తెలిపింది. మొత్తం ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్లో జీసీసీల వాటా మూడింట ఒక వంతుగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఆఫీస్ స్పేస్ నికర లీజు పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు అంశాల వల్ల ప్రభావితమవుతుంది. ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో నికర ఉద్యోగుల నియామకాలు నిలిచాయి. ఆదాయం తగ్గి, లాభదాయకతపై ఒత్తిళ్ల నెలకొన్నాయి. ఈ రంగం వ్యయ నియంత్రణలపై దృష్టి సారించొచ్చు. యూఎస్, యూరప్‌లో స్థూల ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో జీసీసీలు దేశీయంగా పెద్ద స్థాయి లీజింగ్ ప్రణాళికలను వాయిదా వేయవచ్చు’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ గౌతమ్ షాహి వివరించారు. దేశీయంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్సూరెన్స్, కల్సలి్టంగ్, ఇంజనీరింగ్, ఫార్మా, ఈ కామర్స్ విభాగాలు ఆఫీస్ స్పేస్ మార్కెట్లో మిగిలిన వాటా ఆక్రయమిస్తాయని చెబుతూ.. వీటి నుంచి డిమాండ్ కారణంగా 2023–24లో 32–34 మిలియన్ చదరపు అడుగుల లీజ్ నమోదు కావచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. ఉద్యోగుల రాక అనుకూలం.. కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చి పని చేయాలని కోరుతుండడం ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్‌కు ప్రేరణగా క్రిసిల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ఇప్పటి వరకు ఇంటి నుంచే పనికి వీలు కల్పించిన కంపెనీలు, ఇప్పుడు వారంలో ఎక్కువ రోజులు కార్యాలయాలకు రావాలని కోరుతుండడాన్ని ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు కార్యాలయాలకు రాక 40 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 65–70 శాతానికి చేరుతుందని వివరించింది. సమీప కాలంలో సమస్యలు నెలకొన్నప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్ 10–12 శాతం వృద్ధితో 36–38 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డేరెక్టర్ సైనా కత్వాల తెలిపారు. మధ్య కాలానికి వృద్ధి ఇదే స్థాయిలో ఉంటుందన్నారు. తక్కువ వ్యయాల పరంగా ఉన్న అనుకూలత, నైపుణ్య మానవ వనరుల లభ్యత నేపథ్యంలో జీసీసీలు ఆఫీస్ స్పేస్ లీజు మార్క్‌ను ముందుండి నడిపిస్తాయని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై ఎంఎంఆర్‌లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ 2023 మార్చి నాటికి 705 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నట్టు తెలిపింది. ఆసియాలోని ప్రముఖ పట్టణాలతో పోలిస్తే భారత్‌లోని పట్టణాల్లోనే సగటు ఆఫీస్ స్పేస్ లీజు ధర తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. -
ఇండియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 62 శాతం జంప్‌చేసి రూ. 1,988 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,225 కోట్లు మాత్రమే ఆర్జించింది. వడ్డీ ఆదాయం సైతం రూ. 10,710 కోట్ల నుంచి రూ. 13,743 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 7.3 శాతం నుంచి రూ. 4.97 శాతానికి దిగివచ్చాయి. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 2 శాతం బలహీనపడి రూ. 400 వద్ద ముగిసింది. -
క్యూ2లో పీవీఆర్ ఐనాక్స్ జోరు
న్యూఢిల్లీ: మలీ్టప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెపె్టంబర్(క్యూ2)లో నష్టాలను వీడి రూ. 166 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 71 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 686 కోట్ల నుంచి రూ. 2,000 కోట్లకు దూసుకెళ్లింది. 2023 ఫిబ్రవరి 6నుంచి పీవీఆర్, ఐనాక్స్ విలీనం అమలులోకి రావడంతో ఫలితాలను పోల్చి చూడతగదని కంపెనీ పేర్కొంది. కాగా.. మొత్తం వ్యయాలు రూ. 1,802 కోట్లుగా నమోదయ్యాయి. విలీనం తదుపరి పీవీఆర్ ఐనాక్స్ చరిత్రలోనే అత్యధికంగా ఒక త్రైమాసికంలో 4.84 కోట్ల మంది సినిమా హాళ్లను సందర్శించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక సగటు టికెట్ ధర అత్యధికంగా రూ. 276కు చేరగా.. ఆహారం, పానీయాల సగటు వ్యయం సైతం రికార్డ్ నెలకొల్పుతూ రూ. 136ను తాకింది. ఈ కాలంలో 37 తెరలను కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో శ్రీలంకసహా 115 పట్టణాలలో మొత్తం స్క్రీన్ల సంఖ్య 1,702కు చేరింది. అయితే ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో సరైన ఆదరణలేని మొత్తం 33 స్క్రీన్లను తొలగించింది. మరోవైపు పూర్తి ఏడాదిలో 150–160 కొత్త స్క్రీన్ల ఏర్పాటు బాటలో సాగుతున్నట్లు వెల్లడించింది. ఈ కాలంలో ప్రధానంగా హిందీ సినిమాలు అత్యధిక వసూళ్లను సాధించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 1,742 వద్ద ముగిసింది. -
ఇండస్ఇండ్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంక్ ఇండస్ఇండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 22 శాతం ఎగసి రూ. 2,202 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,805 కోట్లు ఆర్జించింది. మొండిబకాయిలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,719 కోట్ల నుంచి రూ. 13,530 కోట్లకు జంప్ చేసింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 5,077 కోట్లయ్యింది. నికర వడ్డీ మార్జిన్లు 4.24 శాతం నుంచి 4.29 శాతానికి స్వల్పంగా మెరుగుపడ్డాయి. ఇతర ఆదాయం రూ. 2,011 కోట్ల నుంచి రూ. 2,282 కోట్లకు బలపడింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.11 శాతం నుంచి 1.93 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 0.61 శాతం నుంచి 0.57 శాతానికి నీరసించాయి. ప్రొవిజన్లు రూ. 1,141 కోట్ల నుంచి రూ. 974 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.21 శాతంగా నమోదైంది. ఈ కాలంలో 3,500 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు 1% నష్టంతో రూ. 1,421 వద్ద ముగిసింది. -
జీఎస్టీ వసూళ్లు @ రూ. 1.62 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు నాలుగోసారి రూ.1.60 లక్షల కోట్లు దాటాయి. సెపె్టంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో 10 శాతం పెరిగి రూ. 1.47 లక్షల కోట్ల నుంచి రూ. 1.62 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. గత నెల స్థూల జీఎస్టీ ఆదాయం రూ. 1,62,712 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ. 29,818 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ. 37,657 కోట్లు, సమీకృత జీఎస్టీ రూ. 83,623 కోట్లు, సెస్సు రూ. 11,613 కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెపె్టంబర్) స్థూల జీఎస్టీ వసూళ్లు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 11 శాతం పెరిగి రూ. 9,92,508 కోట్లకు చేరాయి. సగటున ప్రతి నెలా రూ. 1.65 లక్షల కోట్ల మేర నమోదయ్యాయి. రూ. 1.60 లక్షల కోట్ల వసూళ్లు ఇకపై సర్వసాధారణమైన విషయంగా మారవచ్చని కేపీఎంజీ పరోక్ష పన్నుల విభాగం హెడ్ అభిõÙక్ జైన్ తెలిపారు. రాబోయే పండుగ సీజన్లో వసూళ్లు మరింత పెరగవచ్చని పేర్కొన్నారు. ఎకానమీ స్థిరంగా వృద్ధి బాటన కొనసాగుతుండటాన్ని ఇది సూచిస్తుందని ఈవై ట్యాక్స్ పార్ట్నర్ సౌరభ్ అగర్వాల్ తెలిపారు. జమ్మూ .. కశీ్మర్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్లలో వసూళ్లు స్థిరంగా వృద్ధి చెందుతుండటమనేది ఆయా ప్రాంతాల్లో వినియోగం పెరుగుతోందనడానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. -
వచ్చే ఆరు నెలల్లో రూ.6.55 లక్షల కోట్ల రుణాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023–24 ద్వితీయార్థంలో (2023 అక్టోబర్– మార్చి 2024) డేటెడ్ సెక్యూరిటీల ద్వారా రూ. 6.55 లక్షల కోట్లు రుణం తీసుకోనున్నట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఇందులో సావరిన్ గ్రీన్ బాండ్ల (ఎస్‌జీఆర్‌బీ) జారీ ద్వారా సమీకరణల మొత్తం రూ. 20,000 కోట్లు. మార్కెట్ రుణ సమీకరణల ద్వారానే ప్రభుత్వం తన ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం)ను పూడ్చుకునే సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరంలో రూ.15.43 లక్షల కోట్ల స్థూల మార్కెట్ రుణ సమీకరణలను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ద్వితీయార్థం వాటా (రూ.6.55 లక్షల కోట్లు) రూ.42.45 శాతం. దీర్ఘకాలిక సెక్యూరిటీల కోసం మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో మొదటిసారి 50 సంవత్సరాల సెక్యూరిటీ (బాండ్) కూడా ఈ దఫా జారీ చేస్తుండడం గమనార్హం. 20 వారాల పాటు జరిగే వేలం ద్వారా రూ.6.55 లక్షల కోట్ల స్థూల మార్కెట్ రుణ సమీకరణలు పూర్తవుతాయి. మార్కెట్ రుణం 3, 5, 7, 10, 14, 30, 40, 50 సంవత్సరాల సెక్యూరిటీలలో ఉంటుంది. -
బంగారాన్ని కొనడమే మానేశారు.. అందుకు ఇదే కారణం!
న్యూఢిల్లీ: భారత్ పసిడి డిమాండ్‌పై ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రికార్డు స్థాయి ధరల ప్రతికూల ప్రభావం పడింది. సమీక్షా కాలంలో దేశ పసిడి డిమాండ్ 7 శాతంపైగా పతనమై(2022 ఇదే కాలంతో పోల్చి) 158.1 టన్నులకు తగ్గినట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. పసిడికి సంబంధించి భారత్ రెండవ అతిపెద్ద వినియోగ దేశంగా ఉన్న సంగతి తెలిసిందే. డిమాండ్ తగ్గినప్పటికీ, దిగుమతులు మాత్రం 16 శాతం పెరిగి 209 టన్నులుగా నమోదయినట్లు మండలి పేర్కొంది. 2023 మొదటి ఆరు నెలలూ చూస్తే, భారత్ పసిడి డిమాండ్ 271 టన్నులు. క్యాలెండర్ ఇయర్లో 650 టన్నుల నుంచి 750 టన్నుల వరకూ ఉంటుందని అంచనా. మండలి భారత్ ప్రాంతీయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సోమసుందరం పీఆర్ వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే.. ► సమీక్షాకాలంలో 10 గ్రాముల పసిడి ధర భారీగా రూ.64,000కు చేరింది. పన్నుల ప్రభావం కూడా దీనికి తోడయ్యింది. వెరసి డిమాండ్ భారీగా పడిపోయింది. ► డిమాండ్ 7 శాతం పతనం ఎలా అంటే... 2022 ఏప్రిల్–జూన్ మధ్య దేశ పసిడి డిమాండ్ 170.7 టన్నులు. 2023 ఇదే కాలంలో ఈ పరిమాణం 158.1 టన్నులకు పడిపోయింది. ► ధరల పెరుగుదల వల్ల విలువల్లో చూస్తే మాత్రం క్యూ2లో పసిడి డిమాండ్ పెరిగింది. గత ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య పసిడి దిగుమతుల విలువ రూ.79,270 కోట్లయితే, 2023 ఇదే కాలంలో ఈ విలువ రూ.82,530 కోట్లకు చేరింది. ► ఒక్క ఆభరణాల విషయానికి వస్తే, పసిడి డిమాండ్ 8 శాతం పడిపోయి 140.3 టన్నుల నుంచి 128.6 టన్నులకు తగ్గింది. ► 18 క్యారెట్ల పసిడి ఆభరణాలకు మాత్రం డిమాండ్ పెరగడం గమనార్హం. ధరలు కొంత అందుబాటులో ఉండడం దీనికి కారణం. ► కడ్డీలు, నాణేల డిమాండ్ 3 శాతం పడిపోయి 30.4 టన్నుల నుంచి 29.5 టన్నులకు తగ్గింది. ► పసిడి డిమాండ్‌లో రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రభావం కూడా కొంత కనబడింది. ► పసిడి డిమాండ్ భారీగా పెరగడంతో రీసైక్లింగ్ డిమాండ్ ఏకంగా 61 శాతం పెరిగి 37.6 టన్నులకు ఎగసింది. ► పసిడి ధర భారీ పెరుగుదల నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించి చరిత్రాత్మక ధర వద్ద ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆశావహ ధోరణి! ఓవర్–ది–కౌంటర్ లావాదేవీలు (ఓటీసీ– ఎక్సే్చంజీల్లో లిస్టెడ్కు సంబంధించిన కొనుగోళ్లు కాకుండా) మినహా గ్లోబల్ గోల్డ్ డిమాండ్ జూన్ త్రైమాసికంలో 2 శాతం పడిపోయి 921 టన్నులకు చేరింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో సగటు కొనుగోళ్లతో పోలిస్తే సెంట్రల్ బ్యాంక్‌ల కొనుగోళ్లు సైతం తగ్గినట్లు మండలి పేర్కొంది. ఓటీసీ, స్టాక్ ఫ్లోలతో సహా, క్యూ2లో మొత్తం గ్లోబల్ డిమాండ్ మాత్రం 7 శాతం బలపడి 1,255 టన్నులకు చేరుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పటిష్టమైన బంగారం మార్కెట్‌ను సూచిస్తోందని మండలి వివరించింది. సెంట్రల్ బ్యాంకుల డిమాండ్ 103 టన్నులు తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి. టర్కీలో కొన్ని కీలక ఆర్థిక, రాజకీయ పరిమాణల నేపథ్యంలో జరిగిన అమ్మకాలు దీనికి ప్రధాన కారణం. అయితే మొదటి ఆరు నెలల కాలాన్నీ చూస్తే మాత్రం సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో 387 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయి. దీర్ఘకాల సానుకూల ధోరణిని ఇది సూచిస్తోందని మండలి సీనియర్ మార్కెట్స్ విశ్లేషకులు లూయీస్ స్ట్రీట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా, టక్కీలుసహా కీలక మార్కెట్లలో వృద్ధి కారణంగా కడ్డీలు, నాణేల డిమాండ్ క్యూ2లో 6 శాతం పెరిగి 277 టన్నులుగా ఉంటే, మొదటి ఆరు నెలలోల 582 టన్నులుగా ఉంది. గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) అవుట్‌ఫ్లోస్ క్యూ2లో 21 టన్నులయితే, మొదటి ఆరు నెలల్లో 50 టన్నులు. ఆభరణాల వినియోగ డిమాండ్ క్యూ2లో 3 శాతం పెరిగింది. ఆరు నెలల్లో ఈ పరిమాణం 951 టన్నులు. పసిడి సరఫరా క్యూ2లో 7 శాతం పెరిగి 1,255 టన్నులుగా ఉంది. గోల్డ్ మైన్స్ ఉత్పత్తి మొదటి ఆరు నెలల్లో 1,781 టన్నుల రికార్డు స్థాయికి చేరింది. అటు–ఇటు అంచనాలు... పెరిగిన స్థానిక ధరలు, విచక్షణతో కూడిన వ్యయంలో మందగమనం కారణంగా బంగారం అనిశి్చతిని ఎదుర్కొంటున్నందున, మేము బంగారం 2023 డిమాండ్ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. ప్రస్తుతం పరిస్థితి కొంత నిరాశగా ఉన్నప్పటికీ తగిన వర్షపాతంతో పంటలు, గ్రామీణ డిమాండ్ పటిష్టంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. దీపావళి సీజన్లో సెంటిమెంట్ మెరుగుపడుతుందని, సానుకూల ఆశ్చర్య ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నాం. ప్రస్తుత స్థాయిలోనే ధరలు కొనసాగితే 2023లో భారత్‌లో మొత్తం బంగారం డిమాండ్ 650–750 టన్నుల శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. – సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ సీఈఓ -
జూన్ త్రైమాసికంలో వృద్ధి 6.3 శాతంలోపే..: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 6 నుంచి 6.3 శాతం మధ్య ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ అంచనావేసింది. ప్రభుత్వానికి అంచనాలకన్నా తక్కువ ఆదాయాలు నమోదయ్యే అవకాశాలు దీనికి కారణంగా పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత వారం ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వేసిన 8 శాతం అంచనాలకన్నా తాజా మూడీస్ అంచనా ఎంతో దిగువన ఉండడం గమనార్హం. 2022–23 చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో నమోదయిన 6.1 శాతానికి దాదాపు సరిసమానంగా ఉండడం మరో విశేషం. వ్యవస్థలో అధిక వడ్డీరేట్లు పెట్టుబడులపై ప్రభావం చూపుతాయని కూడా మూడీస్ అభిప్రాయపడింది. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేట్లు వరుసగా 6.1 శాతం, 6.3 శాతాలుగా నమదవుతాయని మూడీస్ అంచనా. మూడీస్ భారత్‌కు ప్రస్తుతం ‘బీఏఏ3’ రేటింగ్ ఇస్తోంది. ఇది అత్యంత దిగువ ఇన్వెస్ట్మెంట్ స్థాయి. చెత్త రేటింగ్కన్నా ఒక అంచె ఎక్కువ. మరో రెండు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజాలు ఫిచ్, ఎస్అండ్పీ కూడా భారత్‌కు ఇదే తరహా రేటింగ్ ఇస్తున్నాయి. -
భారత్ క్రూడ్ స్టీల్ ఉత్పత్తిలో 4 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ క్రూడ్ స్టీల్ (ద్రవ ఉక్కు ఘనీభవనం స్థితి. కడ్డీలు, ఫినిష్డ్, సెమీ ఫినిష్ట్ స్టీల్ ప్రొడక్టŠస్ పరిగణనలోకి తీసుకుంటారు) ఉత్పత్తి 2022–23 ఆర్థిక సంవత్సరంలో 4 శాతం పెరిగి, 125.32 మెట్రిక్ టన్నులకు ఎగసింది. 2021– 22లో ఈ ఉత్పత్తి పరిమాణం 120.29 ఎంటీలు. వార్షిక ప్రాతిపదికన విభాగాల వారీగా చూస్తే.. ► ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తి 6.77 శాతం పెరిగి 121.29 మెట్రిక్ టన్నులకు చేరింది. ► ఇందుల్లో ఒక్క దేశీయ వినియోగ స్టీల్ ఉత్ప త్తి 12.69 శాతం పెరిగి 105.75 ఎంటీల నుంచి 119.17 మెట్రిక్ టన్నులకు ఎగసింది. ఈ విభాగంలో భారీ ఉత్పత్తి పెరుగుదలకు మౌ లిక రంగం క్రియాశీలత మెరుగుదల కారణ. ► స్టీల్ ఎగుమతులు 50 శాతం పడిపోయి 13.49 మెట్రిక్ టన్నుల నుంచి 6.72 మెట్రిక్ టన్నులకు చేరాయి. దిగుమతులు 29 శాతం పెరిగి 4.67 మెట్రిక్ టన్నుల నుంచి 6.02 మెట్రిక్ టన్నులకు ఎగశాయి. పిగ్ ఐరన్ ( దుక్క ఇనుము) ఉత్పత్తి 6.53 శాతం తగ్గి 6.26 మెట్రిక్ టన్నుల నుంచి 5.85 మెట్రిక్ టన్నులకు క్షీణించింది. -
భారత్ వృద్ధి రేటు.. 6 శాతం!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వృద్ధి ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6 శాతంగా ఉంటుందన్న తన అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తాజా నివేదికలో పేర్కొంది. 2024–25లో ఈ రేటు తిరిగి 6.9 శాతానికి చేరుతుందని అంచనా వేసిన రేటింగ్ దిగ్గజ సంస్థ– మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఎకానమీ వేగాన్ని 7 శాతంగా ఉద్ఘాటించింది. కాగా, ద్రవ్యోల్బణం కట్టడే ధ్యేయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను (ప్రస్తుతం 6.5 శాతం) మరింత పెంచే అవకాశం ఉందని కూడా రేటింగ్ దిగ్గజం అంచనా వేసింది. (ఇదీ చదవండి: జాక్ మా రిటర్న్స్: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్) ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఎస్అండ్పీ త్రైమాసిక ఎకనమిక్ అప్డేట్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతంకాగా, 2023–24లో ఈ రేటు 5 శాతానికి తగ్గనుంది. ► 2024–2026 మధ్య భారత్ ఎకానమీ వృద్ధి తీరు సగటున 7 శాతం. ► 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరంలలో భారత్ జీడీపీ వృద్ధి తీరు 6.9 శాతంగా ఉండనుంది. 2026–27లో 7.1%కి పెరుగుతుందని అంచనా. ► భారత్ ఎకానమీకి సాంప్రదాయకంగా ‘దేశీయ డిమాండ్’ చోదక శక్తిగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ప్రతికూల ప్రభావం కొంత ఎకానమీపై కనబడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 13.5 శాతం, 6.3 శాతాలుగా నమోదయ్యాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఈ రేటు 4.4%కి నెమ్మదించడం గమనార్హం. ► ఆర్బీఐ రేటు పెంపునకు ప్రాతిపదిక అయిన వినియోగ ద్రవ్యోల్బణం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 5 శాతానికి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, వాతావరణ సవాళ్లుసహా పలు అడ్డంకులూ ఉన్నాయి. (రూ. 40లక్షల లోపు ఇల్లు కావాలా? అనరాక్ రిపోర్ట్ ఎలా ఉందంటే..!) అంతర్జాతీయంగా చూస్తే.. ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఎస్అండ్పీ ఆశావాద దృక్పథాన్నే వెలువరించింది. ఈ సంవత్సరం చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉందని తెలిపింది. 2023 చైనా వృద్ధికి సంబంధించి నవంబర్‌లో వేసిన 4.8 శాతం అంచనాలను 5.5 శాతానికి పెంచింది. మార్చిలో జరిగిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రకటించిన 5 శాతం అంచనాలకన్నా ఇది అధికం కావడం గమనార్హం. వినియోగం, సేవల రంగాలు ఎకానమీ పురోగతికి దోహదపడతాయని అభిప్రాయపడింది. అమెరికా, యూరోజోన్‌లో ఎకానమీలో 2023లో భారీగా మందగించవచ్చని రేటింగ్ దిగ్గజం పేర్కొంది. ఈ ఏడాది అమెరికా 0.7 శాతం, యూరోజోన్ 0.3 శాతం వృద్ధి సాధిస్తాయన్నది తమ అంచనాగా తెలిపింది. చైనా కోలుకోవడం ఆసియా–పసిఫిక్ ప్రాంతంపై అమెరికా, యూరప్‌లోని మందగమన ప్రభావాన్ని పూర్తిగా భర్తీ చేయబోదని పేర్కొన్న ఎస్అండ్పీ, ఇది కొంత ఉపశమనాన్ని మాత్రం కలిగిస్తుందని అంచనావేసింది. -
పన్ను వసూళ్లు రూ.13..73 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.13.73 లక్షల కోట్లకు చేరాయి. ఇది పూర్తి ఆర్థిక సంవత్సరానికి సవరించిన లక్ష్యంలో 83.19 శాతానికి సమానమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) శనివారం వెల్లడించింది. అలాగే అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16.78 శాతం అధికంగా నమోదు కావడం విశేషం. సీబీడీటీ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 10 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 22.58 శాతం అధికమై రూ.16.68 లక్షల కోట్లకు ఎగశాయి. ఇందులో రిఫండ్స్ వాటా రూ.2.95 లక్షల కోట్లుగా ఉంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రిఫండ్స్ 59.44 శాతం ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వసూలైన నికర ప్రత్యక్ష పన్నులు మొత్తం బడ్జెట్ అంచనాల్లో 96.67 శాతానికి సమానం. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లే వృద్ధిని నడిపించాయని సీబీడీటీ తెలిపింది. రిఫండ్స్ పోను నికరంగా కార్పొరేట్ ఇన్‌కం ట్యాక్స్ వసూళ్లు 13.62%, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌తో కలిపి పర్సనల్ ఇన్‌కం ట్యాక్స్ వసూళ్లు 20.06% వృద్ధి చెందాయి. -
భారత్ భారీ రుణ సేకరణ..! రాయిటర్స్ పోల్‌లో కీలక అంశాలు!
ఢిల్లీ: ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. అంతేకాదు.. ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో.. సెంట్రల్ బడ్జెట్ ఎలా ఉండబోతోంది అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో.. దేశ ఆర్థిక వృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పన, ఆర్థిక క్రమశిక్షణపై దృష్టిసారించిన మోదీ ప్రభుత్వం.. ఈ బడ్జెట్ లో వీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. కరోనా సమయంలో మందగించిన ఆర్థిక వృద్ధిని గాడిలో పెట్టడంతో పాటు.. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలను నియంత్రించడం, పేదల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాబోయే ఆర్థిక సంవత్సరంలో 198 బిలియన్ డాలర్ల రుణాలు సేకరించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు రాయిటర్స్ ఆర్థికవేత్తల పోల్ సర్వే వెల్లడిస్తోంది. పన్ను రాబడిలో పతనం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థికవృద్ధి మందగించడం వల్ల సమీప కాలంలో రుణ సామర్థ్యాన్ని పరిమితం చేయాలన్న యోచనలో కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 14.2 ట్రిలియన్ రూపాయులుగా ఉన్న స్థూల రుణ పరిమితి ఈసారి 16 ట్రిలియన్ రూపాయలకు చేరనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేశారు. కాగా.. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 2014లో దేశ స్థూల రుణం 5.92 ట్రిలియన్ రూపాయలుగా ఉంది. మరోవైపు.. 2023-24 ఆర్థిక సంవత్సర జీడీపీలో బడ్జెట్ లోటును 6 శాతానికి తగ్గించగలదని రాయిటర్స్ కు చెందిన మరో ఆర్థికవేత్తల పోలింగ్ నివేదిక వెల్లడించింది. ఇది ఇప్పటికీ 1970ల నుంచి చూసిన సగటు 4% నుండి 5% కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 2025-26 నాటికి 4.5 శాతానికి చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వ పెట్టుబడి వ్యయం రికార్డు స్థాయిలో 8.85 ట్రిలియన్ రూపాయలకు చేరుతుందని, ఇది జీడీపీలో 2.95 శాతమని రాయిటర్స్ పోల్ నివేదిక చెబుతోంది. అయితే.. ప్రపంచ తయారీ రంగంలో చైనాను అధిగమించి భారత్ అగ్రగామిగా నిలవాలంటే.. మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించాలని సూచించింది. -
కేంద్ర రుణ భారం రూ.147 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మొత్తం రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికం చివరి నాటికి రూ.147.19 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్థికశాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. జూన్ త్రైమాసికం ముగిసేనాటికి ఈ పరిమాణం 145.72 లక్షల కోట్లు. అంటే మొదటి త్రైమాసికం నుంచి రెండవ త్రైమాసికానికి ప్రభుత్వ రుణ భారం ఒక శాతం పెరిగిందన్నమాట. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ►మొత్తం రుణ భారంలో సెప్టెంబర్ ముగిసే నాటికి పబ్లిక్ డెట్ (క్లుప్తంగా ప్రభుత్వం తన లోటును తీర్చడానికి అంతర్గత, బాహ్య వనరుల నుండి తీసుకున్న రుణ మొత్తం) వాటా 89.1 శాతం. జూన్ 30 నాటికి ఈ విలువ 88.3 శాతం. దీని పరిధిలోకి వచ్చే డేటెడ్ సెక్యూరిటీల్లో (బాండ్లు) 29.6 శాతం మేర ఐదు సంవత్సరాలకన్నా తక్కువ కాలపరిమితిలో మెచ్యూర్ అవడానికి సంబంధించినది. ►డేటెడ్ సెక్యూరిటీల ద్వారా ప్రభుత్వం రెండవ త్రైమాసికంలో సమీకరించాల్సిన నోటిఫై మొత్తం రూ.4,22,000కోట్లుకాగా, సమీకరించింది రూ.4,06,000 కోట్లు. రీపేమెంట్లు రూ.92,371.15 కోట్లు. ► కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో కమర్షియల్ బ్యాంకుల వెయిటేజ్ సెప్టెంబర్ 38.3 శాతం ఉంటే, జూన్ త్రైమాసికానికి ఈ రేటు 38.04 శాతంగా ఉంది. ► గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకుల్లో ప్రభుత్వం చేసిన మొత్తం రీక్యాపిటలైజేషన్ (మూలధన కేటాయింపుల) పరిమాణం మొత్తం రూ.2,90,600 కోట్లు. ప్రైవేట్ రంగ బ్యాంకుగా వర్గీకరణ జరిగిన (2019 జనవరి 21న) ఐడీబీఐ బ్యాంక్‌కు రీక్యాపిటలైజేషన్ విలువ రూ. 4,557 కోట్లు. ►2021 సెప్టెబర్ 24 నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వల పరిమాణం 638.64 బిలియన్ డాలర్లు అయితే, 2022 సెప్టెంబర్ 30 నాటికి ఈ విలువ 532.66 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► 2022 జూలై 1 నుంచి 2022 సప్టెంబర్ 30 మధ్య డాలర్ మారకంలో రూపాయి విలువ 3.11 శాతం క్షీణించింది. జూలై 1న రూపాయి విలువ 79.09 ఉంటే, సెప్టెంబర్ 30 నాటికి 81.55కు పడింది. -
ఈ ఏడాది పీవీఆర్, ఐనాక్స్ విలీనం
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజాలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ విలీనం ఈ ఏడాదిలో పూర్తికావచ్చని అజయ్ బిజిలీ తాజాగా అంచనా వేశారు. విలీనం అనంతరం సంయుక్త సంస్థ ఐదేళ్ల కాలంలో 3,000–4,000 తెరలకు చేరనున్నట్లు పీవీఆర్ చైర్మన్ అజయ్ తెలియజేశారు. గత తొమ్మిది నెలల్లో మూవీలకు తరలివచ్చే ప్రేక్షకులు పెరగడం, ఫిల్మ్ పరిశ్రమ నుంచి సినిమాల నిర్మాణం ఊపందుకోవడం వంటి అంశాలు కంపెనీకి జోష్‌నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 27న విలీనానికి పీవీఆర్, ఐనాక్స్ లీజర్ తెరతీశాయి. ఇందుకు వాటాదారులు, రుణదాతలు, స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అనుమతించాయి. జనవరి 12న సమావేశంకానున్న ఎన్సీఎల్టీసహా నియంత్రణ సంస్థల నుంచి విలీనానికి త్వరలోనే ఆమోదముద్ర లభిస్తుందని అభిప్రాయపడ్డారు. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
ఈసారి భారత్ వృద్ధి రేటు 7%
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ 7 శాతం వృద్ధి రేటు సాధిస్తుందంటూ సెప్టెంబర్‌లో వేసిన అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తాజా అప్డేట్లో యథాతథంగా కొనసాగించింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ దేశీయంగా వినియోగదారుల ధీమా, విద్యుత్ సరఫరా, పర్చేజింగ్ మేనేజర్స్ సూచీలు మొదలైనవి ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉండటం ఇందుకు తోడ్పడగలదని పేర్కొంది. అయితే, ఎగుమతులు .. ముఖ్యంగా టెక్స్టైల్స్, ముడి ఇనుము మొదలైనవి అంత సానుకూలంగా కనిపించడం లేదని ఏడీబీ ఒక నివేదికలో తెలిపింది. 2022–23లో ద్రవ్యోల్బణం 6.7 శాతానికి చేరి, తర్వాత 5.8 శాతానికి దిగి రావచ్చని వివరించింది. 2023–24కి సంబంధించిన అంచనాలను 7.2 శాతం స్థాయిలో యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఏడీబీ తెలిపింది. 2021–22లో భారత వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది. మరోవైపు, ఆసియా వృద్ధి అంచనాలను ఏడీబీ కుదించింది. ఈ ఏడాది వృద్ధి రేటు 4.2 శాతంగాను, వచ్చే ఏడాది (2023) 4.6 శాతంగాను ఉండొచ్చని పేర్కొంది. గతంలో ఇది వరుసగా 4.3 శాతం, 4.9%గా ఉండొచ్చని అంచనా వేసింది. -
సెయిల్‌కు రూ. 329 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఉక్కు తయారీ సంస్థ సెయిల్ సెప్టెంబర్ క్వార్టర్‌కు భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఏకంగా రూ.329 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం రూ.26,642 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సెయిల్ రూ.4,339 కోట్ల లాభాన్ని ప్రకటించడం గమనార్హం. ఆదాయం కూడా అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.27,007 కోట్లు గా ఉంది. ప్రధానంగా వ్యయాలు రూ. 21,289 కోట్ల నుంచి రూ.27,201 కోట్లకు పెరిగాయి. 4.30 మిలియన్ టన్నుల స్టీల్‌ను కంపెనీ తయారు చేసింది. క్రితం ఏడాది క్యూ2లో 4.28 మిలియన్ టన్నుల స్టీల్ విక్రయించగా, తాజాగా ముగిసిన త్రైమాసికంలో 4.21 మిలియన్ టన్నులుగా ఉంది. -
సవాళ్లు ఉన్నా... ప్రపంచంలో మనమే ఫస్ట్
ముంబై: భౌగోళిక రాజకీయ సంక్షోభం ఉన్నప్పటికీ భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో మొదట ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష సందర్భంగా దాస్ ఈ విశ్లేషణ చేశారు. అప్పటి మూడురోజుల సమావేశ మినిట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచడానికి ఈ సమావేశంలో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కమిటీలో సభ్యురాలు అషీమా గోయల్ మాత్రం 35 బేసిస్ పాయింట్ల మేర మాత్ర మే పెంపునకు తన అంగీకారం తెలిపారు. ఎకానమీ క్రమంగా పురోగతి చెందుతోందని, ఈ విషయంలో తగిన సానుకూల సంకేతాలు అందుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మే తర్వాత 1.9 శాతం అప్ సెప్టెంబర్ తాజా సమీక్ష పెంపు నిర్ణయంతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా ముప్పావుశాతం అధికం కావడం గమనార్హం. వృద్ధి మందగమనాన్ని నిరోధించడానికి 2019 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ 2020 మే 22 వరకూ మొత్తం 250 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించింది. ఇందులో మహమ్మారి ప్రారంభమైన తర్వాత (2020 మార్చి నుంచి 2020 మే మధ్య) తగ్గింపే 115 బేసిస్ పాయింట్లు. అంటే మహమ్మారికి ముందు వరకూ రెపో రేటు 5.15 శాతంగా ఉంది. 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు (వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ నిర్ణయం) కొనసాగింది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్బీఐ కొనసాగిస్తూ వచ్చింది. నాలుగేళ్ల తర్వాత (2018 ఆగస్టు అనంతరం) మొదటిసారి సారి ఆర్బీఐ మే 4వ తేదీన ఆకస్మికంగా రెపో రేటును 0.40 శాతం పెంచింది. జూన్ 8వ తేదీ, ఆగస్టు 5వ తేదీన 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నిర్ణయంతో రెపో మే తర్వాత 1.9 శాతం పెరిగినట్లయ్యింది. దీనితో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపును షురూ చేశాయి. పెంపు దిశగా తప్పని అడుగులు 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం గాడిన పడుతూ, అప్పట్లో వ్యవస్థలోకి విడుదలైన అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకోడానికి చర్యలు ప్రారంభించే తరుణంలోనే పలు దేశాల వాణిజ్య యుద్ధం ప్రతికూలతను తీసుకువచ్చింది. ఈ సమస్య పరిష్కారంలోపే ప్రపంచంపై కోవిడ్–19 విరుచుకుపడింది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికాసహా పలు దేశాలు మరింత సరళతర వడ్డీరేట్లకు మళ్లాయి. వ్యవస్థలో ఈజీ మనీ ప్రపంచ దేశాల ముందుకు తీవ్ర ద్రవ్యోల్బణం సవాలును తెచ్చింది. దీనికితోడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. దీనితో ధరల కట్టడే లక్ష్యంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్‌సహా ప్రపంచ దేశాలు కీలక రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఇక ఇదే సమయంలో భారత్‌లో ఒకవైపు ద్రవ్యోల్బణం సవాళ్లు, మరోవైపు అమెరికా వడ్డీరేట్ల పెంపుతో ఈక్విటీల్లోంచి వెనక్కు వెళుతున్న విదేశీ నిధులు వంటి ప్రతికూలతలు ఎదురవడం ప్రారంభమైంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2–6 శాతం మధ్య కట్టడి చేయాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తుండగా, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆగస్టు వరకూ వరుసగా ఎనిమిది నెలలు (జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం, ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతం, మేలో 7.04 శాతం, జూన్‌లో 7.01 శాతం, జూలైలో 6.71 శాతం, ఆగస్టులో 7 శాతం) ఈ రేటు అప్పర్ బ్యాండ్ దాటిపోవడం ప్రారంభమైంది. దీనితో భారత్ కూడా కఠిన ఆర్థిక విధానంవైపు అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రెపో రేటు 6.5 శాతం వరకూ వెళ్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కీలక నిర్ణయాల్లో కొన్ని... ► 2022–23లో ఆర్థిక వృద్ధి అంచనా 7 శాతంకాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో ఈ రేటు 4.6 శాతం చొప్పున ఉంటుందని అంచనావేసింది. జూన్ త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. ► రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనా వేసింది. -
విప్రో లాభం 9% డౌన్
న్యూఢిల్లీ: సిబ్బంది ఖర్చులు పెరగడం, అమెరికాయేతర మార్కెట్ల నుంచి ఆదాయాలు తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ సేవల సంస్థ విప్రో నికర లాభం 9.3% క్షీణించింది. రూ. 2,659 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ. 2,930 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం సుమారు 15% పెరిగి రూ. 19,667 కోట్ల నుంచి రూ. 22,540 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా లాభం సుమారు 4%, ఆదాయం 5% వృద్ధి చెందాయి. ‘ఆర్డర్లు, భారీ డీల్స్, ఆదాయాల్లో పటిష్టమైన వృద్ధి సాధించడం.. మార్కెట్లో మా పోటీతత్వం మెరుగుపడటాన్ని సూచిస్తోంది‘ అని కంపెనీ సీఈవో థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. వివాదాస్పదమైన మూన్‌లైటింగ్‌పై (రెండు సంస్థల్లో ఉద్యోగాలు చేయడం) స్పందిస్తూ ఇది న్యాయపరమైన అంశం కంటే నైతిక విలువలకు సంబంధించిందని డెలాపోర్ట్ పేర్కొన్నారు. ఉద్యోగులు చిన్నా చితకా ఇతరత్రా పనులు చేసుకోవడం ఫర్వాలేదని కానీ ఏకంగా పోటీ కంపెనీకి పని చేయడం మాత్రం నైతికత కాదని ఆయన స్పష్టం చేశారు. మూన్‌లైటింగ్ చేస్తున్న 300 మంది ఉద్యోగులను తొలగించామని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో డెలాపోర్ట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇతర విశేషాలు.. ► ఆర్డరు బుకింగ్‌లు 23.8 శాతం, భారీ డీల్స్ 42 శాతం పెరిగాయి. క్యూ2లో 725 మిలియన్ డాలర్ల విలువ చేసే 11 భారీ డీల్స్ కుదిరాయి. ► సమీక్షాకాలంలో విప్రో 10,000 మంది ఉద్యోగులను ప్రమోట్ చేసింది. అట్రిషన్ రేటు వరుసగా మూడో త్రైమాసికంలోనూ తగ్గింది. క్యూ1లో 23.3 శాతంగా ఉన్న ఈ రేటు స్వల్పంగా 23 శాతానికి దిగి వచ్చింది. ► సెప్టెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య నికరంగా కేవలం 605 పెరిగి 2,59,179కి చేరింది. తాజాగా 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంది. బుధవారం బీఎస్ఈలో విప్రో షేరు సుమారు 1% లాభంతో రూ. 407.75 వద్ద క్లోజయ్యింది. -
7.2 శాతం వృద్ధికే ఇక్రా ఓటు
ముంబై: ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) జీడీపీ వృద్ధి అంచనాను 7.2 శాతంగానే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు మూలధన వ్యయాలు, కాంటాక్ట్ సేవలు పుంజుకోవడం సానుకూలతలుగా పేర్కొంది. నిలిచిన డిమాండ్ కూడా తోడు కావడంతో వృద్ధి కరోనా ముందు నాటికి స్థాయికి పుంజుకుంటుందని అంచనా వేసింది. ఏప్రిల్–జూన్ (క్యూ1) త్రైమాసికంలో దేశ జీడీపీ 13.5 శాతం వృద్ధిని చూడగా, సెప్టెంబర్ త్రైమాసికంలో దీనికంటే తగ్గుతుందని, తదుపరి రెండు త్రైమాసికాల్లోనూ ఇంకాస్త తక్కువ వృద్ధిని చూస్తుందని తెలిపింది. ఎక్కువ రేటింగ్ ఏజెన్సీలు జీడీపీ వృద్ధి అంచనాలను 7 శాతం, అంతకంటే దిగువకు ప్రకటించడం గమనార్హం. ఈ రకంగా చూస్తే ఇక్రా వృద్ధి అంచనాలు కొంచెం మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఆగస్ట్ నెలలో రోజువారీ రికార్డు స్థాయి జీఎస్టీ ఈవే బిల్లుల జారీ, పండుగలకు ముందస్తు భారీగా ఉత్పత్తుల నిల్వలను పెంచుకోవడం, కమోడిటీ ధరలు క్షీణించడం రానున్న పండుగల సీజన్‌కు ఎంతో సానుకూలమని.. అయితే, ఖరీఫ్‌లో కీలకమైన వరి దిగుబడి తగ్గనుండడం, వెలుపలి డిమాండ్ బలహీనపడడం వృద్ధికి ఉన్న సవాళ్లు అని, వీటిని పరిశీలించాల్సి ఉంటుందని ఇక్రా అభిప్రాయాలు వ్యక్తం చేసింది. త్రైమాసికం వారీగా.. ‘‘సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.5–7 శాతానికి పరిమితం కావచ్చు. డిసెంబర్ త్రైమాసికం (క్యూ3), 2023 జనవరి–మార్చి త్రైమాసికంలో (క్యూ4)లో 5–5.5 శాతంగా ఉండొచ్చు. బేస్ ప్రభావం వల్లే ఇలా ఉంటుంది’’అని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. 2022 చివరికి ప్రైవేటు రంగంలో పూర్తి స్థాయిలో మూలధన వ్యయాలు పుంజుకుంటాయని, కంపెనీల తయారీ సామర్థ్య వినియోగం పెరుగుతుందని ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీవీఏ 7 శాతంగా, రిటైల్ ద్రవ్యోల్బణం 6.5 శాతంగా, టోకు ద్రవ్యోల్బణం 10.1 శాతంగా, కరెంటు ఖాతా లోటు జీడీపీలో 3.5 శాతం (మూడు రెట్లు పెరిగి 120 బిలియన్ డాలర్లు) ఉంటుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్ బలంగా ఉండడంతో, దిగుమతులు పెరిగి కరెంటు ఖాతా లోటు విస్తరిస్తుందని అభిప్రాయపడింది. రూపాయి మరీ దారుణ పరిస్థితుల్లో డిసెంబర్ నాటికి డాలర్‌తో 83కు పడిపోవచ్చని, పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్ 7.3–7.8 శాతం స్థాయిలో ఉంటాయని అంచనా వేసింది. స్థూల ద్రవ్యలోటు 15.87 లక్షల కోట్లు (జీడీపీలో 6.7 శాతం) ఉంటుందని పేర్కొంది. -
సరికొత్త రికార్డు.. కంపెనీ ప్రారంభమయ్యాక ఇదే ఫస్ట్‌టైం!
భువనేశ్వర్: ప్రభుత్వ రంగ మెటల్ కంపెనీ నేషనల్ అల్యూమినియం(నాల్కో) గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో రికార్డ్ లాభాలు ఆర్జించింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 2,952 కోట్ల లాభం ప్రకటించింది. ఈ కాలంలో మొత్తం అమ్మకాలు సైతం కొత్త గరిష్టాన్ని సాధిస్తూ రూ. 14,181 కోట్లకు చేరాయి. ఈ బాటలో కంపెనీ అల్యూమినియం క్యాస్ట్ మెటల్ ఉత్పత్తి 4,60,000 టన్నులను తాకింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. కంపెనీ ప్రారంభమయ్యాక తొలిసారి 100 శాతం ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంది. నాల్కో ప్రస్థానంలో గతేడాది చరిత్రాత్మకమని వార్షిక వాటాదారుల సమావేశంలో కంపెనీ సీఎండీ శ్రీధర్ పాత్ర పేర్కొన్నారు. అత్యుత్తమ ఫలితాలు కంపెనీ పటిష్ట పనితీరుకు దృష్టాంతమని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి సవాళ్లలోనూ ఉద్యోగులంతా కీలకపాత్ర పోషించినట్లు ప్రశంసించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ముడివ్యయాలు, బొగ్గు సంక్షోభం, ఎల్ఎంఈ ధరల్లో అనిశ్చితి తదితరాల మధ్య కూడా ప్రపంచంలోనే బాక్సైట్, అల్యూమినా చౌక తయారీదారుగా కంపెనీ నిలిచినట్లు ప్రస్తావించారు. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
7.2 శాతం నుంచి 7 శాతానికి డౌన్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 20 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత పెట్టింది. క్రితం 7.2 శాతం అంచనాలను 7 శాతానికి తగ్గింది. తీవ్ర ద్రవ్యోల్బణం, ద్రవ్య పరపతి విధానం కఠినతరం వంటి అంశాలు వృద్ధి అంచనాల తగ్గింపునకు కారణమని ఏడీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 13.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యిన నేపథ్యలో ఏడీబీ తాజా ‘‘ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ 2022’’ విడుదలైంది. ‘‘ధరల ఒత్తిళ్లు దేశీయ వినియోగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని అంచనా. మందగించిన గ్లోబల్ డిమాండ్, పెరిగిన చమురు ధరలు నికర ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి’’ అని అవుట్‌లుక్ రిపోర్ట్ పేర్కొంది. కోత రెండవసారి.. ఏడీబీ ఆసియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ ప్రతి ఏడాదీ ఏప్రిల్‌లో విడుదలవుతుంది. 2022 ఏప్రిల్‌లో 2022–23లో 7.5 శాతం, 2023–24లో 8 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని ఏడీబీ అవుట్‌లుక్ పేర్కొంది. అయితే ఈ రేట్లను జూలైలో వరుసగా 7.2 శాతం, 7.8 శాతాలకు తగ్గించింది. తాజాగా 2022–23 వృద్ధి రేటును మరింతగా 7 శాతానికి తగ్గించింది. నివేదికలో మరికొన్ని అంశాలు... ► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కమోడిటీ ధరలను తీవ్రతరం చేసింది. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపింది. ► 2022–23 ఏప్రిల్–జూన్ మధ్య సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 7.3 శాతంగా ఉంది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతంకన్నా ఇది ఎంతో అధికం. ఆహార ఉత్పత్తుల ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణం. వినియోగ బాస్కెట్లో ఆహార ఉత్పత్తుల వెయిటేజ్ దాదాపు 45 శాతం. కూరగాయల ధరలు భారీగా 35 శాతం వరకూ పెరిగాయి. ► చైనా 2022 వృద్ధి అంచనాలు 5 శాతం నుంచి 3.3 శాతానికి కోత. జీరో–కోవిడ్ వ్యూహంలో భాగంగా లాక్డౌన్లు దీనికి ప్రధాన కారణం. రియల్టీ రంగంలో ప్రతికూలతలు, అంతర్జాతీయ డిమాండ్ తగ్గుదల వంటి అంశాలు చైనా ఎకానమీపై ప్రభావం చూపుతున్నాయి. ► సెంట్రల్ బ్యాంకుల రేట్ల పెంపు నేపథ్యంలో ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి రేటు తొలి 5.2 శాతం అంచనాలు 4.3 శాతానికి కోత. ఈ ప్రాంతం వృద్ధికన్నా చైనా వృద్ధి రేటు తగ్గుదల మూడు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. 2023 ఆసియా, పసిఫిక్ వృద్ధి రేటు అంచనా కూడా 5.3 శాతం నుంచి 4.9 శాతానికి కుదింపు. ► భారత్‌తో కూడిన దక్షిణ ఆసియా 2022 వృద్ధి రేటు అంచనా 7 శాతం నుంచి 6.5 శాతానికి కోత. 2023 విషయంలో ఈ రేటు అంచనా 7.4 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గింపు. -
సవాళ్లు ఎదురయ్యాయ్.. అయితేనేం అందులో ఒకటిగా నిలిచాం కదా!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) అటు కార్పొరేట్, ఇటు బిజినెస్‌ల విషయంలో సవాళ్లు ఎదుర్కొన్నట్లు డిష్ టీవీ గ్రూప్ సీఈవో అనిల్ కుమార్ దువా కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. అయితే సమస్యలు ఎదురైనప్పటికీ సామర్థ్యాలపై నమ్మకంతో ఆశావహంగా ముందుకు సాగినట్లు తెలియజేశారు. వెరసి దేశీయంగా కంటెంట్ డెలివరీ విభాగంలోని ప్రధాన సంస్థలలో ఒకటిగా నిలిచినట్లు వివరించారు. అతిపెద్ద వాటాదారు సంస్థ యస్ బ్యాంక్, కంపెనీ చైర్మన్ జవహర్ లాల్ గోయెల్ మధ్య న్యాయపరమైన వివాదం తలెత్తిన విషయం విదితమే. డిష్ టీవీ బోర్డులో ప్రతినిధుల అంశంపై వివాదం ఏర్పడింది. కంపెనీలో యస్ బ్యాంకుకు 24 శాతం వాటా ఉంది. గోయెల్‌తోపాటు కొంతమంది ఇతర సభ్యులను తప్పించడం ద్వారా బోర్డును పునర్వ్యవస్థీకరించమంటూ యస్ బ్యాంక్ డిమాండ్ చేస్తోంది. చదవండి: Cyrus Mistry: మిస్త్రీ కారు నడిపిన లేడీ డాక్టర్..‘నా కళ్లెదురుగా ప్రమాదం ఎలా జరిగిందంటే!..’ -
మెరిసిన రత్నాలు, ఆభరణాల ఎగుమతులు
ముంబై: భారత్ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) భారీగా 56 శాతం పురోగమించాయి. విలువలో ఈ పరిమాణం 39 బిలియన్ డాలర్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 25.40 బిలియన్ డాలర్లు. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2021–22 మార్చిలో స్థూలంగా రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 3,393.29 మిలియన్ డాల ర్లు. 2020–21 ఇదే నెల్లో ఈ విలువ 3,409.07 మిలియన్ డాలర్లు. అంటే స్వల్పంగా 0.46 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. ► గడచిన ఆర్థిక సంవత్సరం దేశం మొత్తం ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చురుకోగా ఇందులో 10వ వంతు సహకారం, రత్నాలు, ఆభరణాల రంగానికి కావడం హర్షణీయం. ► మొత్తం రత్నాలు, ఆభరణాల ఎగుమతులలో కట్ అండ్ పాలిష్ చేసిన డైమండ్స్ సెగ్మెంట్ భారీగా 62 శాతం వాటాను పొందింది. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), బెల్జియం, ఇజ్రాయెల్ నుండి బలమైన డిమాండ్‌ను ఇది ప్రతిబింబిస్తుంది. ► యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఆస్ట్రేలియాలతో ఇటీవల వాణిజ్య ఒప్పందాలపై భారత్ సంతకం చేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. దీనివల్ల ఈ కీలకమైన వృద్ధి మార్కెట్ల మంచి అవకాశాలను పొందడానికి ఈ రంగం సిద్ధమవుతుంది. ఆయా దేశాల్లో డిమాండ్‌లో తగిన ప్రాధాన్యతను పొందేందుకు సిద్ధంగా ఉంది. ► 2021–22లో అన్ని రకాల స్టడెడ్ బంగారు ఆభరణాల షిప్మెంట్లు అంతకుముందు సంవత్సరంలో 2,768.97 మిలియన్ డాలర్లతో పోలిస్తే 95 శాతం వృద్ధిని సాధించి 5,352.52 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ► 2021–22లో వెండి ఆభరణాల స్థూల ఎగుమతులు 2,721.87 మిలియన్ డాలర్లు. 2020–21లో ఈ విలువ 2336.82 మిలియన్ డాలర్లు. ► రత్నాల స్థూల ఎగుమతుల 2021–22లో 66.82 శాతం వృద్ధితో 311.41 మిలియన్ డాలర్లకు చేరాయి. 2020–21లో ఈ విలువ 188.66 మిలియన్ డాలర్లు. లక్ష్యంలో భాగస్వామ్యం గ్లోబల్ మార్కెట్లకు భారతదేశం ఎగుమతులు 56 శాతం పుంజుకున్నాయి. ఇది ఈ రంగానికి శుభ పరిణామం. కో విడ్ లాక్డౌన్ సడలింపులు, మంచి డిమాండ్, అనిశ్చిత వ్యాపార వాతావరణ పరిస్థితి ఉపశమనానికి ప్రభుత్వ చర్యలు ఈ రంగం ఎగుమతులు పురోగమించడానికి కారణం. ప్రభుత్వ 400 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని నెరవేర్చడంలో మా పరిశ్రమ పెద్ద ఎత్తున దోహదపడింది. కొన్ని అదనపు అవసరమైన విధాన మద్దతు చర్యలు పరిశ్రమ నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తాయి. – కోలిన్ షా, జీజేఈపీసీ చైర్మన్ -
‘ఉపాధి’ కూలి పెంపు
సాక్షి, అమరావతి: ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఉపాధి కూలీలకు గరిష్టంగా చెలిస్తున్న రోజు వారీ కూలి రూ. 245 నుంచి రూ.257కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ప్రస్తుతమిస్తున్న కూలి కంటే రూ.12 అదనంగా పెరిగింది. కేంద్రం ప్రతి ఏటా రాష్ట్రాల వారీగా ఉపాధి హామీ పథకం కూలీలకు చెల్లించే రోజు వారీ కూలిరేటు వివరాలు ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు మార్చి నెల చివరి వారంలో ప్రకటించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ పథకం ఏర్పాటు నుంచి రాష్ట్రానికొకరకమైన రేటును కేంద్రం అందజేస్తుంది. ఇందుకనుగుణంగా ఏప్రిల్ ఒకటినుంచి ప్రారంభమయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వారీగా ఉపాధి కూలీలకు చెల్లించే కొత్త రోజువారీ వేతనాల రేటు వివరాలతో కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మన రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ కూలీలకు ఏప్రిల్ నుంచి గరిష్టంగా రోజు వారీ కూలి రూ. 257లకు పెంచగా.. తమిళనాడులో రూ. 281, కర్ణాటకలో రూ. 309 చొప్పున కేంద్రం నిర్ణయించింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో రూ.213, పశ్చిమ బెంగాల్లో రూ. 223, మధ్యప్రదేశ్‌లో రూ. 204, మహారాష్ట్రలో రూ. 256కు రోజు వారీ వేతనాన్ని పెంచింది. -
విమానాశ్రయాలకు మంచి రోజులు!
ముంబై: మహమ్మారి వల్ల గత రెండు సంవత్సరాల్లో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విమానాశ్రయాలకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23) మంచి రోజులు రానున్నాయని రేటింగ్ దిగ్గజం ఇక్రా ఒక నివేదికలో పేర్కొంది. సాధారణ అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ, దేశీయంగా విమానయాన చార్జీల పెంపు దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. మహమ్మారి కారణంగా రెండేళ్ల నిషేధం తర్వాత ఆదివారం నుండి అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలను పునఃప్రారంభమయిన నేపథ్యంలో విడుదలైన నివేదికలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► విమాన ప్రయాణీకుల రద్దీ సంవత్సరం వారీగా 68 నుంచి 70 శాతం మేర వృద్ధి చెంది 2022– 2023 ఆర్థిక సంవత్సరంలో 31.7 కోట్ల నుంచి 32 కోట్ల శ్రేణికి చేరే వీలుంది. ► ఈ అంశాల కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో విమానాశ్రయాల నిర్వహణ ఆదా యం 49–51 శాతం శ్రేణిలో పెరిగి రూ. 14,400–14,600 కోట్లకు చేరుకుంటుంది. ఆపరేటర్లకు 29–30 శాతం ఆపరేటింగ్ మార్జిన్ లభించే అవకాశం ఉంది. 2021–22లో ఈ రేటు 18 నుంచి 19 శాతం ఉంది. అయితే కరోనా ముందస్తు ఏడాది అంటే 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆదాయాల వృద్ధి రేటు (అప్పట్లో 40 శాతం) ఇంకా వెనకబడి ఉండడం గమనార్హం. అయితే ఈ స్థాయి వృద్ధి రేటు తిరిగి 2023–24 ఆర్థిక సంవత్సరంలో నమోదయ్యే వీలుంది. ► అంతర్జాతీయ ట్రాఫిక్ 100–105 శాతం పటిష్ట వృద్ధిని సాధిస్తుంది. అయితే ఈ స్థాయిలో మంచి గణాంకాల సాధనకు నాల్గవవేవ్ సవాళ్లు తలెత్తకూడదు. ఒకవేళ ఈ సవాళ్లు వచ్చినా దాని ప్రభావం అతి తక్కువగా ఉండాల్సి ఉంటుంది. ► ఇక మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వస్తే, పాసింజర్ ట్రాఫిక్ 62 నుంచి 64 శాతం పెరిగి 18.7 కోట్ల నుంచి 18.9 కోట్ల శ్రేణిలో నమోదుకావచ్చు. ఒమిక్రాన్ సవాళ్లు ఎదురయినప్పటికీ, ఈ స్థాయి వృద్ధి రేటు నమోదుకు పటిష్ట వ్యాక్సినేషన్ కారణం. ► అంతర్జాతీయ విమానాల పునఃప్రారంభం కారణంగా ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, ఐరోపా దేశాల నుంచి ట్రాఫిక్ గణనీయంగా మెరుగుపడుతుంది. పెట్టుబడులు ఇలా.. ఇదిలాఉండగా ఇక్రా నివేదిక ప్రకారం, విమానయాన రంగం వచ్చే ఐదేళ్లలో రూ.90,000 కోట్ల కొత్త పెట్టుబడులను పొందే వీలుంది. ఇందులో ప్రధాన ప్రైవేట్ విమానాశ్రయాల్లో కొనసాగుతున్న సామర్థ్య విస్తరణ, ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహించే విమానాశ్రయాల్లో ఆ సంస్థ రూ. 25,000 కోట్ల పెట్టుబడులు, 21 కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు రూ. 30,000 –34000 కోట్లు, ఏఏఐ నుంచి స్వాధీనం చేసుకున్న ఆరు విమానాశ్రయాలను అప్‌గ్రేడ్ చేయడానికి అదానీ గ్రూప్ పెడుతున్న దాదాపు రూ. 17,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. -
2020-21లో పసిడికి తగ్గిన డిమాండ్..!
న్యూఢిల్లీ: బంగారం అంటే భారతీయులకు.. ప్రత్యేకించి ఆడపడుచులకు చాలా ఇష్టం.. వీలైతే బంగారం ఆభరణాల కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతుంటారు. భారత్‌లో పెండ్లిండ్లలో నవ వధువుకు బంగారం ఆభరణాలు తప్పనిసరి. పండుగల సమయంలో గిఫ్ట్‌లుగానూ ఆభరణాలు బహుకరిస్తుంటారు. అయితే, అలాంటి బంగారాన్ని దేశీయంగా ఉత్పత్తి చేసేది కేవలం ఒకశాతమే మాత్రమే. మిగతా అంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. భారత్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 651 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2019-20) పసిడి దిగుమతులు 720 టన్నులుగా ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో రాతపూర్వక సమాధానంలో చెప్పారు. ఇక 2018-19లో 983 టన్నుల బంగారం దిగుమతి అయినట్టు ప్రకటించారు. పుత్తడి దిగుమతిలో పొరుగు దేశం చైనా తర్వాతీ స్థానం మనదే. కానీ గత ఆర్థిక సంవత్సరం పుత్తడి దిగుమతులు తగ్గాయి. (చదవండి: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! వచ్చే 6 రోజుల్లో 4 రోజులు బంద్..!) -
ఎగుమతులు... కొత్త చరిత్ర!
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్లు (సుమారు రూ.30 లక్షల కోట్లు) విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఆత్మనిర్భర భారత్ మైలురాయిని అందుకోవడంలో ఇది కీలకమని చెప్పారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 9 రోజులు మిగిలి ఉండగానే ఎగుమతుల లక్ష్యాన్ని సాధించినట్టు తెలిపారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి 22 వరకు ఎగుమతులు 37 శాతం పెరిగి 400 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. భారతదేశ చరిత్రలో ఎగుమతులు 400 బిలియన్ డాలర్లను చేరుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ‘‘భారత్ 400 బిలియన్ డాలర్ల విలువైన వస్తు ఎగుమతులు చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని మొదటిసారి అధిగమించింది. మన రైతులు, చేనేతకారులు, ఎంఎస్ఎంఈలు, తయారీదారులు, ఎగుమతిదారులు అందరినీ ఈ విజయాన్ని సాధించినందుకు అభినందిస్తున్నాను. మన ఆత్మనిర్భర భారత్ ప్రయాణానికి ఇది కీలకం‘‘అంటూ మోదీ ట్వీట్ చేశారు. స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌కు వెళుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాల సహకారంతో.. ట్విట్టర్లోనే ప్రధాని కొన్ని గ్రాఫిక్స్‌ను కూడా పోస్ట్ చేశారు. రాష్ట్రాల భాగస్వామ్యం, జిల్లా అధికారులు, ఎగుమతిదారులతో సంప్రదింపులు, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం, వివిధ ఎగుమతుల మండళ్లు, పరిశ్రమల మండళ్లు, భాస్వాములతో చురుగ్గా సంప్రదింపులు చేయడం వల్లే ఈ మైలురాయిని చేరుకోవడం సాధ్యపడినట్టు గ్రాఫిక్స్‌ను పరిశీలిస్తే తెలుస్తోంది. ప్రతి నెలా సగటున 33 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధ్యమయ్యాయి. పెట్రోలియం ఉత్పత్తులు..: ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరగడానికి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ గూడ్స్, తోలు, కాఫీ, ప్లా స్టిక్, రెడీమేడ్ వస్త్రాలు, మాంసం, డెయిరీ, సము ద్ర ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులు మద్దతుగా నిలిచాయి. 400 బిలియన్ డాలర్ల ఎగుమతు లు నిజం గా గొప్ప మైలురాయిగా భారత ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అన్నారు. రవాణా పరంగా ఎన్నో సవాళ్లు ఉన్నాకానీ, అదనంగా 100 బిలియన్ డాలర్ల ఎగుమతులు పెంచుకోగలిగినట్టు చెప్పారు. స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలకుతోడు, పీఎల్ఐ పథకాలు ఎగుమతుల వృద్ధికి సాయపడినట్టు తెలిపారు. 37 శాతం అధికం.. దేశ చరిత్రలో మొదటిసారి ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించాయి. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర వాణిజ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 37 శాతం పెరిగి 400.8 బిలియన్ డాలర్లుగా మార్చి 21 నాటికి నమోదైనట్టు తెలిపింది. 2020–21లో 292 బిలియన్ డాలర్లు, 2018–19లో 330 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు గణాంకాలు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 21 నాటికి దిగుమతులు 589 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే 189 బిలియన్ డాలర్ల మేర వాణిజ్యలోటు ఏర్పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మరికొన్ని రోజుల్లో 10–12 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు నమోదు కావచ్చని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. -
ఏపీలో పెరిగిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
సాక్షి, అమరావతి: ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా వచ్చే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గతం కంటే ఈ ఏడాది 30 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయానికి రూ.4,210 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు రూ.5,495 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు నెలల ఆదాయం ఇంకా పెరిగే అవకాశముంది. డిసెంబర్లో అత్యధికంగా రూ.685 కోట్ల ఆదాయం వచ్చింది. జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లలో రూ.600 కోట్లు కంటే ఎక్కువ ఆదాయం లభించింది. కరోనా కారణంగా మేలో రూ.211 కోట్ల ఆదాయం వచ్చింది. విశాఖలో అత్యధికం.. శ్రీకాకుళంలో అత్యల్పం ► విశాఖ జిల్లా నుంచి అత్యధికంగా రూ.825 కోట్ల ఆదాయం వచ్చింది. ► ఆ తర్వాత కృష్ణా జిల్లాలో రూ.687.66 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.687.65 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.602 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. ► అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో రూ.139 కోట్ల ఆదాయం వచ్చింది. ► విజయనగరం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రూ.227 కోట్లు, రూ.480 కోట్లు, రూ.289 కోట్లు, రూ.314 కోట్ల ఆదాయం లభించింది. ► రాయలసీమలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో రూ.367.56 కోట్ల ఆదాయం రాగా, చిత్తూరులో రూ.333 కోట్లు, వైఎస్సార్ కడపలో రూ.236 కోట్లు, అనంతపురం జిల్లాలో రూ.296.99 కోట్ల ఆదాయం వచ్చింది. డాక్యుమెంట్ల సంఖ్యలో గుంటూరు టాప్ ఇక గతేడాది 17,20,402 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 17,46,682 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. రాబోయే రెండు నెలల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1.95 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. కృష్ణాలో 1.71 లక్షలు, తూర్పు గోదావరిలో 1.80 లక్షలు, కర్నూలులో 1.59 లక్షలు, పశ్చిమ గోదావరిలో 1.51 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. అతి తక్కువగా విజయనగరంలో 64 వేలు, శ్రీకాకుళం జిల్లాలో 67 వేల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. గతం కంటే మెరుగైన ఆదాయం లభించింది. ఆదాయానికి గండిపడుతున్న కొన్ని అంశాల్లో కొద్దిపాటి మార్పులు చేయడంద్వారా ఫలితాలు సాధించామని.. వినియోగదారులకు నాణ్యమైన సేవలు సత్వరం అందించేలా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ తెలిపారు. -
వృద్ధి వేగంలో భారత్ టాప్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మూడవ త్రైమాసికంలో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) 5.4 శాతం పురోగమించింది. వృద్ధి ఈ స్థాయిలో ఉన్నప్పటికీ, డిసెంబర్ త్రైమాసికంలో ఈ స్థాయి ఎకానమీ పురోగతి ఏ దేశం సాధించలేదు. దీనితో ప్రపంచంలో వేగంగా పురోగమిస్తున్న దేశాల్లో మొదటి స్థానంలో ఆసియా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిలిచింది. భారత్ తర్వాత చైనా మూడవ త్రైమాసికంలో 4 శాతం ఎకానమీ వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ఇక ఆర్థిక వ్యవస్థలో కీలకమైన తయారీ, వ్యవసాయం, నిర్మాణ, ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవా రంగాల వేగం తాజా గణాంకాల ప్రకారం ఇంకా తక్కువగానే ఉండడం గమనార్హం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ఈ మేరకు తాజా గణాంకాలను ఆవిష్కరించింది. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. మూడు త్రైమాసికాలు ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి రేటు 20.3 శాతంగా నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) 8.5 శాతంగా ఉంది. ప్రస్తుత సమీక్ష క్వార్టర్లో 5.4 శాతం పురోగతి ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికాల్లో ఎకానమీ పరిస్థితి చూస్తే, కరోనా సవాళ్ల నేపథ్యంలో వృద్ధిలేకపోగా ఏప్రిల్–జూన్, జూలై–సెప్టెంబర్ త్రైమాసికాల్లో వరుసగా 23.8%, 6.6% క్షీణతలు నమోదయ్యాయి. అయితే అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో స్వల్పంగా 0.7% పురోగతి చోటుచేసుకుంది. వృద్ధి అంచనాలకు ‘మూడవ వేవ్’ కోత! ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 9.2 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని జనవరిలో వేసిన తొలి అంచనాలను ఎన్ఎస్ఓ తాజాగా (సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్‌లో) 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. 2021–22 ఎకానమీ వృద్ధి అంచనాలను 8.9 శాతానికి కుదించింది. భారత్‌లో మూడవవేవ్ సవాళ్లు దీనికి ప్రధాన కారణం. తాజా అంచనాల ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ విలువ రూ.135.58 లక్షల కోట్ల నుంచి రూ.147.72 లక్షల కోట్లకు పెరుగుతుంది. 2020–21లో క్షీణత 6.6 శాతమే! ఇక కరోనా సవాళ్లతో 2020–21 ఆర్థిక సంవత్సరం ఎకానమీ 7.3 శాతం క్షీణించిందని తొలి అంచనా గణాంకాలు పేర్కొనగా, ఈ క్షీణ రేటను 6.6 శాతానికి తగ్గిస్తూ తాజా లెక్కలను ఎన్ఎస్ఓ విడుదల చేసింది. అయితే 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ ‘6.6 శాతం క్షీణ బాట’ నుంచి ‘8.9 శాతం వృద్ధి’ బాటకు మారుతుందన్నమాట. 5.4 శాతం వృద్ధి ఎలా? 2011–12 ధరలను బేస్‌గా తీసుకుంటూ, ద్రవ్యోల్బణం ప్రాతిపదికన పరిశీలిస్తే, 2020–21 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఎకానమీ విలువ రూ.36,22,220 కోట్లు. 2021–22 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో (అక్టోబర్–డిసెంబర్) ఈ విలువ రూ. 38,22,159 కోట్లకు పెరిగింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మూడవ క్వార్టర్లో 5.4 శాతమన్నమాట. వివిధ రంగాల తీరిది.. ► తయారీ: గణాంకాల ప్రకారం, ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలించే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) విలువల వృద్ధి రేటు తయారీ రంగానికి సంబంధించి మూడవ త్రైమాసికంలో కేవలం 0.2 శాతంగా ఉంది. 2020–21 ఇదే కాలంలో ఈ వృద్ధి 8.4 శాతం. ► వ్యవసాయం: వ్యవసాయ రంగం వృద్ధి రేటు కూడా 4.1 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గింది. ► నిర్మాణం: ఈ రంగంలో 6.6 శాతం వృద్ధి బాట నుంచి 2.8 శాతం క్షీణతకు మారింది. ► మైనింగ్: ఈ రంగం చక్కటి పురోగతి సాధించింది. 5.3 శాతం క్షీణ రేటు 8.8 శాతం వృద్ధికి మారింది. ► ఎలక్ట్రిసిటీ, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: 1.5 శాతం క్షీణత 3.7 శాతం వృద్ధి బాటకు మారింది. ► ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు, బ్రాడ్‌కాస్టింగ్ సంబంధిత సేవలు: 10.1 శాతం క్షీణ రేటు 6.1 శాతం వృద్ధికి మెరుగుపడింది. ► ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలు: 10.3 శాతం వృద్ధి రేటు 4.6 శాతానికి తగ్గింది. ► పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవలు: 2.9 శాతం క్షీణ రేటు భారీగా మెరుగుపడి 16.8 శాతం వృద్ధి బాటకు పురోగమించింది. -
నాల్కో హైజంప్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం నేషనల్ అల్యూమినియం కంపెనీ(నాల్కో) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం మూడు రెట్లుపైగా ఎగసి రూ. 831 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 240 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,415 కోట్ల నుంచి రూ. 3,845 కోట్లకు జంప్ చేసింది. తాజాగా వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఇప్పటికే రూ. 2.50 డివిడెండును చెల్లించిన సంగతి తెలిసిందే. ఫలితాల నేపథ్యంలో నాల్కో షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 119 వద్ద ముగిసింది. -
యూనియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ దిగ్గజం యూనియన్ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 49 శాతం జంప్‌చేసి రూ. 1,085 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 727 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 20,103 కోట్ల నుంచి రూ. 19,454 కోట్లకు క్షీణించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 13.49 శాతం నుంచి 11.62 శాతానికి వెనకడుగు వేశాయి. అయితే నికర ఎన్పీఏలు 3.27 శాతం నుంచి 4.09 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 5,210 కోట్ల నుంచి సగానికి తగ్గి రూ. 2,549 కోట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో యూనియన్ బ్యాంక్ షేరు 1 శాతం నీరసించి రూ. 48 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ లాభం అప్
ముంబై: ప్రైవేట్ రంగ మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 13 శాతం పుంజుకుని రూ. 5,837 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 39,268 కోట్ల నుంచి రూ. 31,308 కోట్లకు క్షీణించింది. ఇక స్టాండెలోన్ నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 3,261 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,926 కోట్లు ఆర్జించింది. కాగా.. నికర వడ్డీ ఆదాయం రూ. 4,005 కోట్ల నుంచి రూ. 4,284 కోట్లకు బలపడింది. ఏయూఎం ప్లస్: గృహ రుణాల్లో విలువరీత్యా 13 శాతం వరకూ ఆర్థికంగా వెనుకబడినవారు, తక్కువ ఆదాయం గలవారికి మంజూరు చేసినట్లు హెచ్డీఎఫ్సీ వైస్‌చైర్మన్, సీఈవో కేకి ఎం. మిస్త్రీ పేర్కొన్నారు. ఈ విభాగంలో సగటు రుణ పరిమాణం రూ. 11.1–19.5 లక్షలుగా వెల్లడించారు. గృహ రుణ కస్టమర్లలో 2.7 లక్షల మంది రుణ ఆధారిత సబ్సిడీలను అందుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ పథకంకింద రూ. 45,914 కోట్ల రుణాలు విడుదల చేయగా.. సబ్సిడీ మొత్తం రూ. 6,264 కోట్లని తెలియజేశారు. క్యూ3లో నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 5,52,167 కోట్ల నుంచి రూ. 6,18,917 కోట్లకు బలపడినట్లు హెచ్డీఎఫ్సీ తెలియజేసింది. వీటిలో వ్యక్తిగత రుణాల వాటా 79 శాతంకాగా.. అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు రూ. 7,468 కోట్ల రుణాలను అసైన్ చేసినట్లు వెల్లడించింది. అందుబాటు ధరల గృహాలతోపాటు.. అధిక విలువలుగల ప్రాపర్టీల రుణాలకు సైతం భారీ డిమాండ్ కనిపిస్తున్నట్లు మిస్త్రీ పేర్కొన్నారు. కంపెనీ కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 22.4 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ షేరు 2 శాతం లాభపడి రూ. 2,617 వద్ద ముగిసింది. -
వృద్ధికి ఒమిక్రాన్ ముప్పు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ, ఎకానమీ స్థిరంగా ముందుకు సాగుతున్నప్పటికీ వృద్ధి సాధనకు ఒమిక్రాన్ వేరియంట్పరంగా ముప్పు ఇంకా పొంచే ఉంది. దీనికి ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్లు కూడా తోడయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండో ఆర్థిక స్థిరత్వ నివేదిక ముందుమాటలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్–మే మధ్యలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ పెను విధ్వంసం సృష్టించిన తర్వాత వృద్ధి అంచనాలు క్రమంగా మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ పెట్టుబడులు, ప్రైవేట్ వినియోగం గణనీయంగా పెరగడంపై నిలకడైన, పటిష్టమైన రికవరీ ఆధారపడి ఉంటుందని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు ఈ రెండూ ఇంకా మహమ్మారి పూర్వ స్థాయులకన్నా దిగువనే ఉన్నాయని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ అంశం ఆందోళనకరంగానే ఉందని అంగీకరించిన దాస్.. ఆహార, ఇంధన ధరల కట్టడి చేసే దిశగా సరఫరావ్యవస్థను పటిష్టం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీటుగా నిల్చిన ఆర్థిక సంస్థలు.. మహమ్మారి విజృంభించిన వేళలోనూ ఆర్థిక సంస్థలు గట్టిగానే నిలబడ్డాయని దాస్ తెలిపారు. ఇటు విధానపరంగా అటు నియంత్రణ సంస్థపరంగాను తగినంత తోడ్పాటు ఉండటంతో ఆర్థిక మార్కెట్లలో స్థిరత్వం నెలకొందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకుల దగ్గర పుష్కలంగా మూలధనం, నిధులు ఉండటంతో భవిష్యత్‌లోనూ ఎలాంటి సవాళ్లు వచ్చినా తట్టుకుని నిలబడగలవని దాస్ చెప్పారు. స్థూల ఆర్థిక.. ఆర్థిక స్థిరత్వంతో పటిష్టమైన, నిలకడైన సమ్మిళిత వృద్ధిని సాధించేందుకు తోడ్పడేలా ఆర్థిక వ్యవస్థను బలంగా తీర్చిదిద్దేందుకు ఆర్బీఐ కట్టుబడి ఉందని ఆయన వివరించారు. రిటైల్ రుణాల విధానాలపై ఆందోళన.. రిటైల్ రుణాల క్వాలిటీ అంతకంతకూ క్షీణిస్తుండటంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం .. ఏప్రిల్ నుంచి డిసెంబర్ తొలి వారం మధ్యలో రుణ వితరణ 7.1 శాతం (అంతక్రితం ఇదే వ్యవధిలో 5.4 శాతం) వృద్ధి చెందింది. ఇటీవలి కాలంలో హోల్‌సేల్ రుణాలు వెనక్కి తగ్గగా.. వృద్ధి వేగం ఇంకా మహమ్మారి పూర్వ స్థాయి కన్న తక్కువగానే ఉన్నప్పటికీ .. రిటైల్ రుణాలు మాత్రం రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతున్నాయని నివేదిక పేర్కొంది. గత రెండేళ్లలో నమోదైన రుణ వృద్ధిలో హౌసింగ్, ఇతర వ్యక్తిగత రుణాల వాటా 64 శాతం మేర ఉంది. రిటైల్ ఆధారిత రుణ వృద్ధి విధానం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోందని నివేదిక తెలిపింది. కన్జూమర్ ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోలో ఎగవేతలు పెరిగినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో పెరిగిన రుణ వితరణలో రిటైల్ / వ్యక్తిగత రుణాల వాటా 64.4%గా (అంతక్రితం ఇదే వ్యవధిలో 64.1%) ఉంది. ఇందులో హౌసింగ్ రుణాల వాటా 31.2 శాతంగా (అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 30%) నమోదైంది. ఎన్నారైలు స్థిరాస్తులు కొనేందుకు.. ముందస్తు అనుమతులు అక్కర్లేదు.. కొన్ని సందర్భాల్లో మినహా ఎన్నారైలు (ప్రవాస భారతీయులు), ఓసీఐలు (ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా) భారత్‌లో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి లేదా బదిలీ చేయించుకోవడానికి ముందస్తుగా ఎటువంటి అనుమతులు అవసరం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. వ్యవసాయ భూమి, ఫార్మ్ హౌస్, ప్లాంటేషన్ ప్రాపర్టీలకు మాత్రం ఇది వర్తించదని తెలిపింది. ఓఐసీలు భారత్‌లో స్థిరాస్తులను కొనుగోలు చేసే నిబంధనలకు సంబంధించి వివిధ వర్గాల నుంచి సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆర్బీఐ ఈ మేరకు వివరణనిచ్చింది. మొండిబాకీలు పెరుగుతాయ్.. ఆర్థిక వ్యవస్థపై ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న పక్షంలో బ్యాంకుల స్థూల మొండిబాకీలు (జీఎన్‌పీఏ) వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఏకంగా 8.1–9.5 శాతానికి ఎగియవచ్చని ఆర్థిక స్థిరత్వ నివేదిక హెచ్చరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇవి 6.9 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జీఎన్‌పీఏలు 8.8 శాతంగా ఉండగా 2022 సెప్టెంబర్ నాటికి ఇవి 10.5 శాతానికి ఎగియవచ్చని అంచనా. అలాగే ప్రైవేట్ బ్యాంకుల్లో 4.6 శాతం నుంచి 5.2 శాతానికి, విదేశీ బ్యాంకుల్లో 3.2 శాతం నుంచి 3.9 శాతానికి పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. విభాగాలవారీగా చూస్తే వ్యక్తిగత, హౌసింగ్, వాహన రుణాల్లో జీఎన్‌పీఏ పెరిగింది. మరోవైపు, ఫుడ్ ప్రాసెసింగ్, రసాయనాలు వంటి కొన్ని ఉప–విభాగాలు మినహాయిస్తే పారిశ్రామిక రంగంలో జీఎన్‌పీఏల నిష్పత్తి తగ్గుతోంది. -
కరోనా లేదు, ఒమిక్రాన్ లేదు..2 లక్షలకు పైగా ఉద్యోగాలు రెడీగా ఉన్నాయ్
వచ్చే ఏడాది ప్రారంభం నుంచి మనదేశానికి చెందిన పలు టెక్ దిగ్గజాలు భారీ సంఖ్యలో ఉద్యోగుల నియామకం చేపట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. అయితే ఈ నేపథ్యంలోప్రపంచ దేశాల్ని ఒమిక్రాన్ ఉక్కిరిబిక్కిరి చేయడంతో రిక్రూట్మెంట్ ఆగిపోతుందేమోనన్న అనుమానాలు తలెత్తాయి. ఆ అనుమానాలకు చెక్ పెడుతూ ఎకనామిక్స్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. వచ్చే ఏడాది ఉద్యోగుల రిక్రూట్మెంట్ ఆగిపోదని ఆ కథనం సారాశం. అంతేకాదు కరోనా, ఒమిక్రాన్‌లు ఐటీ సెంటిమెంట్‌ను దెబ్బతీయలేవని రిమోట్ వర్క్ మోడల్ ప్రాచుర్యం పొందడమే కాదు. డిజిటల్, డేటా వంటి రంగాల్లో ఉద్యోగుల అవసరం పెరిగిపోనున్నట్లు కథనంలో పేర్కొంది. 2022లో టెక్ విభాగంలో డిమాండ్ పెరిగిపోతుందని, తద్వారా ఉద్యోగుల నియామకం మరింత జోరందుకోనున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మైండ్‌ట్రీ తో సహా టాప్ 10 భారతీయ ఐటి కంపెనీలు మార్చిలో ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 2లక్షల మంది ఉద్యోగుల్ని ఎంపిక చేసుకోనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఈ కంపెనీలు మొత్తం 2022 మార్చి చివరి నాటికి అట్రిషన్ రేటు కారణంగా దాదాపు 50లక్షల మందిని నియమించుకోనున్నాయి. గతేడాది దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఐటీ రంగంలో డిమాండ్ దాదాపూ రెండింతలు పెరిగినట్లు ఎక్స్‌ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్ కారంత్ తెలిపారు. ముఖ్యంగా 2021 ద్వితీయార్ధంలో నెలవారీ యాక్టివ్ ఓపెనింగ్ ఉద్యోగాల సంఖ్య లక్షా పదివేల కంటే ఎక్కువగా ఉన్నాయని, ఇది వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: ఒమిక్రాన్ ఎఫెక్ట్, వర్క్ ఫ్రమ్ హోంపై దిగ్గజ కంపెనీల సంచలన నిర్ణయం..?! -
8.9% కాదు... 9.5%
ముంబై: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను స్విస్ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ సెక్యూరిటీస్ 9.5 శాతానికి పెంచింది. ఇప్పటి వరకూ ఈ అంచనా 8.9 శాతం. ఆర్థిక రికవరీ ఊహించినదానికన్నా వేగంగా రికవరీ అవుతుండడం, పెరిగిన వినియోగ విశ్వాసం, వ్యయాల పెరుగుదల వంటి అంశాలు తమ అంచనాల పెంపునకు కారణమని వివరించింది. 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేటు వరుసగా 7.7 శాతం, 6 శాతంగా నమోదవుతుందన్నది అంచనాగా తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2021–22 జీడీపీ వృద్ధి రేటుకు సమానంగా తాజాగా యూబీఎస్ సెక్యూరిటీస్ తన అంచనాలను పెంచడం గమనార్హం. ప్రభుత్వం 10 శాతం అంచనావేస్తోంది. వివిధ రేటింగ్, విశ్లేషణా సంస్థల అంచనా శ్రేణి 8.5 శాతం నుంచి 10 శాతం వరకూ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి రేటు 20.1 శాతం. వడ్డీరేట్లు పెరిగే అవకాశం! రానున్న 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తక్కువ వడ్డీరేటు ప్రయోజనాలకు ముగింపు పలికే అవకాశం ఉందని అభిప్రాయపడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల కాలంలో ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)ను అరశాతం పెంచే అవకాశం ఉందని కూడా యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనావేసింది. 2021–22లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉంటుందన్న ఇంతక్రితం అంచనాలను 4.8 శాతానికి తగ్గిస్తున్నట్లు బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. ఇక ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021–22లో 10.1 శాతంగా, 2022–23లో 8.8 శాతంగా నమోదవుతుందని తమ అంచనా అని యూబీఎస్ సెక్యూరిటీస్ తెలిపింది. ఇదిలాఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 10 శాతం నమోదవుతుందన్న విశ్వాసాన్ని ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేవ్రాయ్ వ్యక్తం చేశారు. ఎస్బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. -
2021–22లో 10 శాతం వృద్ధి: నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో 10 శాతం ఉంటుందని విశ్వసిస్తున్నట్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏడు సంవత్సరాల మోదీ ప్రభుత్వం దేశంలో పటిష్ట ఆర్థిక వృద్ధికి పునాదులు వేసిందన్నారు. కోవిడ్–19 వల్ల ఎదురయిన సవాళ్లను దేశం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని వివరించారు. వచ్చే ఐదేళ్లూ భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నివేదికను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచ పెట్టుబడిదారులను భారత్ ఆర్థిక వ్యవస్థ ఆకర్షించగలుగుతోందన్నారు. అయితే దేశంలో ఉపాధి కల్పన అనుకున్నంత వేగంగా లేదని ఆయన అంగీకరించారు. మోదీ ప్రభుత్వం ఏడేళ్లలో 485 ప్రభుత్వ పథకాలను ప్రత్యక్ష ప్రయోజన బదలాయింపు (డీబీటీ) పరిధిలోకి తీసుకుని వచ్చిందన్నారు. డీబీటీ ద్వారా రూ.5.72 లక్షల కోట్లు బదిలీ అయినట్లు కూడా కుమార్ తెలిపారు. -
వేదాంతా లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెప్టెంబర్)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 4,615 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 838 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 21,758 కోట్ల నుంచి రూ. 31,074 కోట్లకు జంప్ చేసింది. అధిక కమోడిటీ ధరలు, బలపడిన మార్జిన్లు, వివిధ విభాగాల అమ్మకాల్లో వృద్ధి కంపెనీ పటిష్ట పనితీరుకు దోహదం చేశాయి. క్యూ2లో రూ. 7,232 కోట్లమేర నికర రుణభారాన్ని తగ్గించుకున్నట్లు వేదాంతా సీఈవో సునీల్ దుగ్గల్ వెల్లడించారు. వాటాదారులకు షేరుకి రూ. 18.5 చొప్పున బోర్డు మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 304 వద్ద ముగిసింది. -
జూబిలెంట్ ఫుడ్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో క్విక్ సరీ్వస్ రెస్టారెంట్ల(క్యూఎస్ఆర్) దిగ్గజం జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 58 శాతంపైగా జంప్‌చేసింది. రూ. 120 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) క్యూ2లో రూ. 76 కోట్లు మాత్రమే ఆర్జించింది. డెలివరీ, టేక్ఎవే చానల్స్ పుంజుకోవడం ప్రభావం చూపినట్లు జూబిలెంట్ ఫుడ్ పేర్కొంది. కంపెనీ డోమినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ తదితర సుప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ చైన్ స్టోర్లను నిర్వహించే సంగతి తెలిసిందే. కాగా.. క్యూ2లో మొ త్తం ఆదాయం సైతం రూ. 816 కోట్ల నుంచి రూ. 1,116 కోట్లకు ఎగసింది. ఇది 37% వృద్ధికి సమానం. అయితే మొత్తం వ్యయాలు రూ. 747 కోట్ల నుంచి రూ. 963 కోట్లకు పెరిగాయి. ప్రోత్సాహకర ఫలితాల నేపథ్యంలోనూ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. దీంతో బీఎస్ఈలో ఈ షేరు 8.5 శాతం పతనమైంది. రూ. 3,965 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భేష్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సర(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెపె్టంబర్)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 9,096 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 7,703 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 38,438 కోట్ల నుంచి రూ. 41,436 కోట్లకు పుంజుకుంది. రుణాల విడుదల(అడ్వాన్స్‌లు) 14.7 శాతం పెరిగి రూ. 12,49,331 కోట్లకు చేరింది. స్టాండెలోన్ పద్ధతిలో నికర లాభం 17.6 శాతం మెరుగై రూ. 8,834 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం 12 శాతంపైగా బలపడి రూ. 17,684 కోట్లయ్యింది. కేటాయింపులు ఇలా క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.08 శాతం నుంచి 1.35 శాతానికి పెరిగాయి. ఇక నికర ఎన్పీఏలు సైతం 0.17 శాతం నుంచి 0.40 శాతానికి పెరిగాయి. మొండిరుణాలు, కంటింజెన్సీలకు రూ. 200 కోట్లు అధికంగా రూ. 3,925 కోట్లను కేటాయించింది. కరోనా మహమ్మారి భయాలకుతోడు.. సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు దేశ, విదేశీ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు బ్యాంక్ పేర్కొంది. కాగా.. క్యూ2లో కనీస మూలధన నిష్పత్తి 19.1 శాతం నుంచి 20 శాతానికి మెరుగుపడింది. ఈ కాలంలో బాసెల్–3 ప్రమాణ అదనపు టైర్–1 బాండ్ల జారీ ద్వారా బిలియన్ డాలర్లు(రూ. 7,424 కోట్లు) సమీకరించినట్లు బ్యాంక్ వెల్లడించింది. టర్న్అరౌండ్.. డిపాజిట్లు స్వీకరించని అనుబంధ ఎన్బీఎఫ్సీ.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ లిమిటెడ్ క్యూ2లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది. గత క్యూ2లో రూ. 85 కోట్ల నికర నష్టం ప్రకటించగా.. తాజా సమీక్షా కాలంలో దాదాపు రూ. 192 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు వెల్లడించింది. బ్రోకింగ్ అనుబంధ కంపెనీ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సైతం 44 శాతం వృద్ధితో రూ. 240 కోట్ల నికర లాభం ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 17% ఎగసి రూ. 16,564 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 70,523 కోట్ల నుంచి రూ. 75,526 కోట్లకు పురోగమించింది. -
వైఎస్సార్సీపీకి రూ.96.25 కోట్ల ఆదాయం
సాక్షి, న్యూఢిల్లీ: 2020–21 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్సీపీకి రూ.96,25,25,000 ఆదాయం వచ్చినట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ మేరకు పార్టీ అందించిన వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది. చందాల ద్వారా రూ.25 వేలు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.96.25 కోట్లు వచ్చినట్టుగా ఆ పార్టీ వివరాలు అందించినట్టు ఈసీ పేర్కొంది. పార్టీల ఆదాయ వివరాలు అందించేందుకు అక్టోబర్ 30 వరకూ గడువుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ వైఎస్సార్సీపీ మాత్రమే ఆదాయ వివరాలను అందజేసింది. -
భారత్ ఎకానమీ వృద్ధి 10 శాతమే!
న్యూఢిల్లీ: భారత్ 2021–22 ఆర్థిక సంవత్సరం ఎకానమీ వృద్ధి అంచనాలకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) కోత పెట్టింది. ఏప్రిల్‌నాటి 11 శాతం వృద్ధి పరుగు అంచనాను తాజాగా 10 శాతానికి కుదించింది. కోవిడ్–10 మహమ్మారి ప్రేరిత సవాళ్లు ఆర్థిక క్రియాశీలతకు విఘాతం కలిగిస్తుండడమే తాజా అంచనాలకు కారణమని తన ఆసియా డెవలప్మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ)లో పేర్కొంది. 46 సభ్య దేశాలతో కూడిన ఏడీబీ అవుట్‌లుక్‌లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2022–23లో భారత్ వృద్ధి 7.5 శాతానికి పరిమితం అవుతుంది. ► కరోనా సెకండ్‌వేవ్ భారత్ సేవలు, దేశీయ వినియోగం, పట్టణ అసంఘటిత రంగం ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపింది. ► 2020–21తో పోలి్చతే 2021–22లో వినియోగం క్రమంగా మెరుగుపడుతుంది. ప్రభుత్వ వ్యయాలు, ఎగుమతులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థకు కలిసి వచ్చే అంశాలివి. ► మూడవ వేవ్ సవాళ్లు లేకపోతే 2021–22 చివరి మూడు త్రైమాసికాల్లో (2021జూలై–మార్చి 2022 )ఎకానమీ రికవరీ పటిష్టంగా ఉంటుంది. వ్యాక్సినేషన్ వేగవంతం కావడం, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన చర్యలు, మౌలిక రంగం పురోగతి, ఆరోగ్య సంబంధ సేవల పటిష్టత వంటి అంశాలు వృద్ధి రికరవీ వేగవంతానికి దోహదపడతాయి. ► 2021లో ఆసియా ప్రాంత వృద్ధి రేటు 7.3 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించింది. ► చైనా విషయంలో 2021 వృద్ధి రేటు అంచనా 8.1 శాతంగా ఉంది. గృహ డిమాండ్ పటిష్టత దీనికి కారణం.అయితే 2022లో 5.5 శాతానికి తగ్గుతుంది. హైబేస్ దీనికి కారణం. కాగా ఉపాధి కల్పనా మార్కెట్, వినియోగ విశ్వాసం పటిష్టంగా ఉన్నాయి. ► దక్షిణాసియాలోని ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో ఎకానమీల వృద్ధి తీరు వివిధ తీరులుగా ఉంటుంది. ఇంతకుముందు అంచనాలకన్నా వృద్ధి వేగం ఆయా దేశాల్లో మందగిస్తుంది. అయితే 2022లో వృద్ధి వేగం పెరిగే వీలుంది. ► వేగవంతమైన వ్యాక్సినేషన్ వల్ల ఎకానమీల్లో కేసులు, మరణాల తీవ్రత తగ్గుతోంది. ► కాగా అమెరికా, యూరో ప్రాంతం, జపాన్లలో 2022 వృద్ధి సగటును 3.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. ► ఆసియా ఎకానమీల్లో ద్రవ్యోల్బణం పెరగవచ్చు. ఇంధన, ఆహార ధరలు పెరుగుదలతోపాటు, కరెన్సీ విలువలు తగ్గడం కూడా దీనికి కారణం కావచ్చు. అయితే సెంట్రల్ బ్యాంకులకు నిర్దేశిత స్థాయిలకన్నా భారీగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం లేదు. ► ప్రభుత్వాల ద్రవ్య, పరపతి విధానాలు సరళతరంగా కొనసాగుతాయని భావిస్తున్నాం. భారీ వృద్ధి అంచనాకు సెకండ్‌వేవ్ దెబ్బ కరోనా ప్రేరిత సవాళ్లతో గడచిన ఆర్థిక సంవత్సరంలో 7.3 క్షీణతను నమోదుచేసుకున్న ఆర్థిక వ్యవస్థ, 2021–22 మొదటి జూన్ త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధిని సొంతం చేసుకుంది. నిజానికి లోబేస్‌కుతోడు ఎకానమీ ఊపందుకుని 2021–22లో వృద్ధి రేటు 17 శాతం వరకూ నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (2021 ఏప్రిల్, మే) సెకండ్‌వేవ్ సవాళ్లు ప్రారంభమయ్యాయి. దీనితో పలు ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు 2021–22పై తమ వృద్ధి అంచనాలను రెండంకెల లోపునకు కుదించేశాయి. 7.5 శాతం నుంచి 9.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను తాజాగా వెలువరిస్తున్నాయి. ఆర్బీఐ, ఐఎంఎఫ్, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 9.5 శాతం అంచనావేస్తుండగా, మూడీస్ అంచనా 9.3 శాతంగా ఉంది. అయితే ప్రపంచబ్యాంక్ వృద్ధి రేటు అంచనా 8.3 శాతంగా ఉంది. ఫిచ్ రేటింగ్స్ మాత్రం 10 శాతం వృద్దిని అంచనావేస్తోంది. ఇక రెపోను వరుసగా ఏడు ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ పరపతి విధాన కమిటీ యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్బీఐ, తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తోంది. కోవిడ్–19 నేపథ్యంలో ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థల పురోగతికి సరళతర విధానాలే అవలంభించాల్సిన అవసరం, ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి మేలో 6.3 శాతంకాగా, జూన్‌లో స్వల్పంగా 6.26 శాతానికి తగ్గింది. అయితే జూలైలో 5.59 శాతం దిగువకు చేరింది. ఆగస్టులో 5.3 శాతానికి దిగివచి్చంది. 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.7 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23లో ద్రవ్యోల్బణం 5.1 శాతం ఉంటుందని ఆర్బీఐ ప్రస్తుతం భావిస్తోంది. -
పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ వసూళ్లు 48 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 48 శాతం ఎగిసింది. ఏప్రిల్–జులై మధ్య కాలంలో ఎక్సైజ్ డ్యూటీ రూపంలో రూ. 1 లక్ష కోట్లు పైగా వసూలయ్యాయి. గత ఆరి్థక సంవత్సరం ఇదే వ్యవధిలో వసూలైనది రూ. 67,895 కోట్లు. తొలి నాలుగు నెలల్లో అదనంగా వచి్చన రూ. 32,492 కోట్లు .. పూర్తి ఆరి్థక సంవత్సరంలో చమురు బాండ్లకు ప్రభుత్వం కట్టాల్సిన రూ. 10,000 కోట్ల కన్నా మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. సింహ భాగం వసూళ్లు పెట్రోల్, డీజిల్‌పై సుంకాల ద్వారానే నమోదయ్యాయి. ఎకానమీ కోలుకునే కొద్దీ అమ్మకాలు మరింత పెరిగితే గత ఆరి్థక సంవత్సరంతో పోలిస్తే ఈసారి వసూళ్లు అదనంగా రూ. 1 లక్ష కోట్ల పైగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సబ్సిడీ ధరపై వంటగ్యాస్, కిరోసిన్, డీజిల్ మొదలైనవి విక్రయించడం వల్ల ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు వచి్చన నష్టాలను భర్తీ చేసేందుకు గత యూపీఏ ప్రభుత్వం వాటికి రూ. 1.34 లక్షల కోట్ల విలువ చేసే బాండ్లను జారీ చేసింది. ఆరి్థక శాఖ వర్గాల ప్రకారం వీటికి సంబంధించి ఈ ఆరి్థక సంవత్సరం రూ. 10,000 కోట్లు కట్టాల్సి ఉంది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, సహజ వాయువుపై మాత్రమే ఎక్సైజ్ సుంకం విధిస్తున్న సంగతి తెలిసిందే. -
ఐడీబీఐ బ్యాంక్ టర్న్అరౌండ్
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. రూ. 1,359 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) రూ. 12,887 కోట్ల నికర నష్టం నమోదైంది. వెరసి ఐదేళ్ల తరువాత టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. ఇక గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో నికర లాభం 4 రెట్లు ఎగసి రూ.512 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 135 కోట్లు మాత్రమే ఆర్జించింది. 2017 మేలో ఆర్బీఐ విధించిన దిద్దుబాటు చర్యల(పీసీఏ) నుంచి సైతం మార్చిలో బయటపడినట్లు ఎల్ఐసీ నియంత్రణ లోని ఐడీబీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్ అనుసరించిన టర్న్అరౌండ్ వ్యూహాలు ట్రాన్స్‌ఫార్మేషన్‌కు బాటను ఏర్పరచినట్లు బ్యాంక్ తెలియజేసింది. కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 38 శాతం ఎగసి రూ. 3,240 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 1.34 శాతం బలపడి 5.14 శాతానికి చేరాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 166 కోట్ల నుంచి రూ. 548 కోట్లకు జంప్ చేసింది. ఈ మార్చి త్రైమాసికంతో కలిపి వరుసగా ఐదు క్వార్టర్లపాటు బ్యాంకు లాభాలు ఆర్జించినట్లు ఐడీబీఐ ఎండీ, సీఈవో రాకేష్ శర్మ వివరించారు. ఎన్పీఏలు తగ్గాయ్: మార్చికల్లా ఐడీబీఐ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 27.53% నుంచి 22.37%కి బలహీనపడ్డాయి. ఇదే విధంగా నికర ఎన్పీఏలు 4.19% నుంచి 1.97%కి భారీగా తగ్గాయి. అయితే మొండి ప్రొవిజన్లు రూ. 1,738 కోట్ల నుంచి రూ. 2,367 కోట్లకు పెరిగాయి. కోవిడ్ సెకండ్ వేవ్కుగాను రూ. 500 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టినట్లు బ్యాంకు తెలియజేసింది. టైర్–1 పెట్టుబడులు 13.06%కి, సీఆర్ఏఆర్ 15.59 శాతానికి మెరుగుపడినట్లు బ్యాంక్ పేర్కొంది. క్యూ4లో తాజా మొండిబాకీలు రూ. 2,281 కోట్లకు చేరగా.. రికవరీలు రూ. 1,233 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 36.25 వద్ద ముగిసింది. -
ఎక్స్‘పోర్ట్స్’ ఆదాయం అదరహో
సాక్షి, అమరావతి: గడచిన ఆర్థిక సంవత్సరంలో పోర్టుల ద్వారా రాష్ట్ర ఖజానాకు రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 5 మైనర్ పోర్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.285.60 కోట్ల ఆదాయం లభించింది. కరోనా కాలంలోనూ ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆదాయాన్ని పొందగలిగింది. విశాఖ పోర్టు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండగా.. కాకినాడ యాంకరేజ్ పోర్టు, రవ్వ పోర్టు, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు నుంచి ఏపీ మారిటైమ్ బోర్డుకు ఈ ఆదాయం వచ్చింది. అంతకుముందు ఏడాది (2019–20)లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.226.82 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది గంగవరం పోర్టు డివిడెండ్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.37.61 కోట్లు ఇవ్వడం కూడా ఆదాయం పెరగడానికి కారణంగా అధికారులు చెబుతున్నారు. 2020–21లో ఈ ఐదు పోర్టులు 89.238 మిలియన్ టన్నుల సరకు రవాణా నిర్వహించడం ద్వారా రూ.3,556.62 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. అంతకుముందు సంవత్సరం 99.44 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా 5 పోర్టులు రూ.3,639.81 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. కాకినాడ నుంచే 63 శాతం ఆదాయం రాష్ట్రంలోని 5 మైనర్ పోర్టుల ద్వారా ప్రభుత్వానికి రూ.285.60 కోట్ల ఆదాయం రాగా.. అందులో ఒక్క కాకినాడ పోర్టు నుంచే రూ.179.73 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే ఒక్క కాకినాడ నుంచే 62.93 శాతం ఆదాయం వస్తోంది. కొత్తగా కాకినాడ గేట్‌వే పోర్టు అందుబాటులోకి వస్తే ఈ ఆదాయం మరింత పెరిగే అవకశాం ఉందని మారిటైమ్ అధికారులు పేర్కొంటున్నారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో కాకినాడ డీప్ వాటర్ పోర్టు 14.77 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.575 కోట్ల ఆదాయం ఆర్జిస్తే అందులో ప్రభుత్వానికి రూ.126.50 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే పూర్తిగా 100 శాతం వాటా కలిగిన యాంకరేజ్ పోర్టు ద్వారా రూ.49.88 కోట్లు, రవ్వ క్యాపిటివ్ పోర్టు ద్వారా రూ.3.55 కోట్ల ఆదాయం ఖజానాకు వచ్చింది. ఇదే సమయంలో గంగవరం పోర్టు 32.83 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా రూ.1,056.46 కోట్ల ఆదాయం ఆర్జించగా.. ప్రభుత్వ వాటాగా రూ.59.8 కోట్లు (డివిడెండ్‌తో కలిపి) వచ్చింది. అలాగే కృష్ణపట్నం పోర్టు 38.18 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా రూ.1,871.93 కోట్ల ఆదాయం సమకూర్చుకోగా.. రాష్ట్ర ఖజానాకు రూ.46.07 కోట్లు వచ్చాయి. -
ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికన్నా బెటర్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని అంచనావేసినప్పటికీ, అంతకుమించి మంచి ఫలితాన్ని అందించే బాటలో పయనిస్తోందని ఆర్థికశాఖ తన తాజా నివేదికలో పేర్కొంది. వ్యాక్సినేషన్ విస్తృతితో ఆర్థిక పురోగతి మరింత ఊపందుకుంటుందన్న విశ్వాసాన్ని నివేదిక వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితిలో దేశం ఆరోగ్య రంగంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. కరోనా వైరెస్ సెకండ్ వేవ్‌ను భారత్ పటిష్టంగా అరికట్టగలిగిందని ఆర్థికశాఖ పేర్కొంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా వంటి కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరిగినప్పటికీ, మ్తొతంగా పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపింది. మహమ్మారి సమస్య కొనసాగుతున్నప్పటికీ, మూడవ త్రైమాసికంలో 0.4 శాతం జీడీపీ వృద్ధి నమోదుకావడం సానుకూల అంశమని పేర్కొంది. మూడవ త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఇండస్ట్రియల్ అవుట్‌లుక్ సర్వే ఆశావాద దృక్పదాన్ని వెలువరించిన అంశాన్ని నివేదిక ప్రస్తావించింది. ఉత్పిత్తి, ఆర్డర్ బుక్, ఉపాధి అవకాశాలు మూడవ త్రైమాసికంలో పెరిగిన అంశాన్ని సర్వే స్పష్టం చేసిందని వివరించింది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో 24.4 శాతం క్షీణించగా, రెండవ త్రైమాసికంలో క్షీణ రేటు 7.3 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అదుర్స్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 14 శాతం ఎగసి రూ. 8,760 కోట్లను తాకింది. స్టాండెలోన్ ప్రాతిపదికన సైతం నికర లాభం 18 శాతం పెరిగి రూ. 8,758 కోట్లను అధిగమించింది. ఇందుకు నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 15 శాతం వృద్ధితో రూ. 16,317 కోట్లకు చేరింది. డిపాజిట్లు 19 శాతం పురోగమించగా.. కాసా డిపాజిట్లు 43 శాతం ఎగశాయి. తొలి బ్యాంకు ఈ ఏడాది క్యూ3 ఫలితాలు ప్రకటించిన తొలి ఫైనాన్షియల్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకుకాగా.. కొత్త సీఈవో, ఎండీ శశిధర్ జగదీశన్ అధ్యక్షతన తొలిసారి త్రైమాసిక పనితీరును వెల్లడించింది. బ్యాంకుకు 25 ఏళ్ల పాటు అత్యుత్తమ సేవలందించడం ద్వారా ప్రయివేట్ రంగంలో టాప్ ర్యాంకులో నిలిపిన ఆదిత్య పురీ ఇటీవల పదవీ విరమణ చేసిన విషయం విదితమే. కాగా.. క్యూ3లో రుణ వృద్ధి 15.6 శాతం పుంజుకోగా.. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 4.2 శాతంగా నమోదయ్యాయి. వడ్డీయేతర ఆదాయం 11 శాతం బలపడి రూ. 7,443 కోట్లకు చేరింది. ఇందుకు పెట్టుబడుల విలువ 67 శాతం ఎగసి రూ. 1,109 కోట్లను తాకడం దోహదపడింది. రుణ నాణ్యత క్యూ3లో బ్యాంకు స్థూల మొండి బకాయిలు(జీఎన్‌పీఏ) 1.42 శాతం నుంచి 0.81 శాతానికి వెనకడుగు వేశాయి. త్రైమాసిక ప్రాతిపదికన చూసినా 1.08 శాతం నుంచి 0.81 శాతానికి తగ్గాయి. అయితే మారటోరియం సమయంలో నమోదైన రుణ ఒత్తిడులను మొండిబకాయిలుగా పరిగణించవద్దంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలు ప్రభావం చూపాయి. వీటిని పరిగణించినప్పటికీ జీఎన్‌పీఏలు 1.38 శాతంగా నమోదయ్యే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. రిటైల్ వాటా.. కోవిడ్–19 నేపథ్యంలోనూ రికవరీ చాటుతూ ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 3,043 కోట్ల నుంచి రూ. 3,414 కోట్లకు మాత్రమే పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.9 శాతంగా నమోదైంది. వీటిలో టైర్–1 క్యాపిటల్ 17.1 శాతానికి చేరింది. రుణాలలో 48 శాతం రిటైల్ వాటాకాగా.. కార్పొరేట్ విభాగం 52 శాతం ఆక్రమిస్తోంది. కాగా.. కంపెనీ వారాంతాన ఫలితాలను ప్రకటించడంతో సోమవారం హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరుపై ఈ ప్రభావం కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. శుక్రవారం ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు నామమాత్ర నష్టంతో రూ. 1,467 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1,472–1,445 మధ్య ఊగిసలాడింది. -
15 నెలల్లో కోవిడ్ ముందు స్థాయికి ఎకానమీ!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) చివరినాటికి కోవిడ్–19 ముందస్తు స్థాయికి మెరుగుపడుతుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆదివారం పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణత 8%లోపే ఉంటుందన్నది కూడా తమ అంచనా అని ఒక వార్తా సంస్థతో పేర్కొన్నారు. భారత్ రికవరీ ఊహించినదానికన్నా వేగంగా ఉందన్నారు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ నిరంతర ప్రక్రియ పెట్టుబడుల ఉపసంహరణ నిరంతర ప్రక్రియని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేకంగా దృష్టి సారించిందనీ, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు సమీకరించాలన్నది కేంద్రం లక్ష్యం. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్ఈ)తన వాటా అమ్మకం ద్వారా రూ.1.20 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం భావిస్తోంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో వాటాల విక్రయం ద్వారా రూ.90,000 కోట్ల సమీకరణ లక్ష్యం. బ్యాంకింగ్ సేవల విస్తరణ జరగాలి బ్యాంకింగ్ సేవల విస్తరణ మరింతగా జరగాలని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. జీడీపీలో ప్రైవేటు రుణ నిష్పత్తి ప్రస్తుతం 50 శాతంగానే ఉన్నదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ నిష్పత్తి 100 శాతానికిపైగా ఉందని అన్నారు. వ్యవసాయ రంగం గురించి ఆయన మాట్లాడుతూ, రసాయనాల రహిత సహజ సాగు కార్యక్రమాల పురోగతిపై నీతి ఆయోగ్ దృష్టి సారిస్తోందన్నారు. ఈ దిశలో ముందడుగు వేయడానికి తన వంతు కృషి చేస్తుందన్నారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయాలు భారీగా తగ్గుతాయని అన్నారు. అలాగే పర్యావరణంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని వివరించారు. వ్యవసాయ రంగంలో పోటీతత్వం, అలాగే రైతుల ఆదాయాల పెరుగుదల వంటి అంశాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయని వివరించారు. ఫ్యాంటసీ స్పోర్ట్స్ కోసం స్వీయ నియంత్రణ సంస్థ నీతి ఆయోగ్ సిఫార్సు ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ రంగానికి సంబంధించి ఒక స్వీయ–నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. దీని పర్యవేక్షణ బాధ్యతలను స్వతంత్ర బోర్డుకు అప్పగించాలని సూచించింది. 18 ఏళ్లు దాటిన వారు మాత్రమే ఆన్లైన్ ఫ్యాంటసీ గేమ్స్ ఆడేలా, మైనర్లను దూరంగా ఉంచేలా ఆంక్షలు ఉండాలని ఒక ముసాయిదా నివేదికలో పేర్కొంది. గవర్నెన్స్, చట్టాలు, పాలన తదితర రంగాల్లో పేరొందిన వ్యక్తులను స్వతంత్ర పర్యవేక్షణ బోర్డులో నియమించాలని అందులో సూచించింది. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఇటీవలి నివేదిక ప్రకారం ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ యూజర్ల సంఖ్య 2016 జూన్‌తో పోల్చితే, 2019 డిసెంబర్ నాటికి 212 శాతం వృద్ధి చెంది 9 కోట్ల మందికి పెరిగింది. 2023 నాటికి దీని ద్వారా 150 కోట్ల మేర ఆన్లైన్ లావాదేవీలు జరగొచ్చని అంచనా. -
6 నెలల్లో రూ. 2.22 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ, సాక్షి: పలు దేశాలను కరోనా వైరస్ పీడిస్తున్న నేపథ్యంలోనూ భారత్ విదేశీ పెట్టుబడులను భారీగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి ఆరు నెలల కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) 15 శాతం వృద్ధి చూపాయి. ఈ విషయాలను పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలోకి 30 బిలియన్ డాలర్ల(రూ. 2.22 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు ప్రవహించినట్లు తెలియజేశాయి. 2019-20 తొలి ఆరు నెలల్లో ఇవి 26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ ఎఫ్‌డీఐలలో సింహభాగం అంటే 29 శాతం మారిషస్ నుంచి లభించగా.. 21 శాతం వాటాతో సింగపూర్ తదుపరి స్థానంలో నిలిచింది. యూఎస్, నెదర్లాండ్స్, జపాన్ సైతం 7 శాతం చొప్పున వాటాతో ఈ జాబితాలో చోటు చేసుకున్నాయి. రంగాలవారీగా.. డీపీఐఐటీ గణాంకాల ప్రకారం ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో సర్వీసుల రంగం అత్యధికంగా 17 శాతం విదేశీ పెట్టుబడులను ఆకట్టుకుంది. సర్వీసుల రంగంలో ఫైనాన్షియల్, బ్యాంకింగ్, బీమా, ఔట్సోర్సింగ్ సైతం కలసి ఉన్నట్లు డీఐఐఐటీ గణాంకాలు పేర్కొన్నాయి. ఈ రంగాలలో కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డవేర్ విభాగానికి 12 శాతం ఎఫ్‌డీఐలు లభించాయి. టెలికం రంగానికి 7 శాతం వాటా దక్కింది. మొత్తం ఎఫ్‌డీఐలలో రాష్ట్రాలవారీగా గుజరాత్ 35 శాతం వాటాతో అగ్రస్థానాన్ని పొందింది. ఇదేవిధంగా మహారాష్ట్ర 20 శాతం, కర్ణాటక 15 శాతం, ఢిల్లీ 12 శాతం చొప్పున ఎఫ్‌డీఐలను ఆకట్టుకున్నాయి. కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కొనే బాటలో పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు సహాయక ప్యాకేజీల ద్వారా లిక్విడిటీని పెంచిన నేపథ్యంలో భారత్‌కు విదేశీ పెట్టుబడులు పెరుగుతూ వచ్చినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలోకి విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునే బాటలో పలు సంస్కరణలు తీసుకురావడం కూడా ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్, కోల్ మైనింగ్ తదితర రంగాలు భవిష్యత్‌లో మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. -
జీడీపీ మైనస్ 11.5 శాతానికి..
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మైనస్ 11.5 శాతం క్షీణిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ శుక్రవారం పేర్కొంది. ఈ మేరకు క్రితం అంచనా మైనస్ 4 అంచనాలకు మరింత పెంచుతున్నట్లు ప్రకటించింది. వృద్ధి బలహీనత, అధిక రుణ భారం, బలహీన ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల నేపథ్యంలో భారత్ క్రెడిట్ ప్రొఫైల్ (రుణ సమీకరణ సామర్థ్యం) ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉందని మూడీస్ పేర్కొంది. కరోనా ప్రతికూలతలు ఈ పరిస్థితులను మరింత దిగజార్చాయని వివరించింది. దేశ ద్రవ్య పటిష్టతకు దీర్ఘకాలంలో తీవ్ర ఇబ్బందులు తప్పకపోవచ్చని విశ్లేషించింది. కాగా తక్కువ బేస్ ఎఫెక్ట్ (2020–21లో భారీ క్షీణత కారణంగా) ప్రధాన కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) భారత్ 10.6 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకునే అవకాశం ఉందని తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 90 శాతానికి భారత్ రుణ భారం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం జీడీపీలో భారత్ రుణ భారం 72 శాతం. ► ఇక ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 7.5 శాతానికి చేరే అవకాశం ఉంది. రాష్ట్రాలకు ద్రవ్యలోటు జీడీపీలో 4.5 శాతం ఉంటుందని భావిస్తున్నాం. 2020 (ఏప్రిల్)–2021 (మార్చి) ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.7.96 లక్షల కోట్ల ద్రవ్యలోటు ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. 2020–21 అంచనాలో 3.5% దాటకూడదన్నది ఈ లక్ష్యం ఉద్దేశం. అయితే ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలూ గడిచే సరికే– అంటే ఏప్రిల్ నుంచి జూలై మధ్య నాటికే ద్రవ్యలోటు రూ.8,21,349 కోట్లకు చేరింది. అంటే వార్షిక లక్ష్యంలో 103.1 శాతానికి చేరిందన్నమాట.గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 4.6 శాతం. ► జీ–20 దేశాలతో పోల్చిచూస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లుగా మరే ఇతర ఆర్థిక వ్యవస్థ నష్టపోలేదు. ► ఆర్థిక వ్యవస్థ పురోగతికి ప్రభుత్వ పరంగా ద్రవ్య పరమైన మద్దతు చర్యలు తీసుకోడానికి పల్లు క్లిష్ట పరిస్థితులు, పరిమితులు ఉన్నాయి. ► బలహీన మౌలిక వ్యవస్థ, కార్మిక, భూ, ప్రొడక్ట్ మార్కెట్లలో క్లిష్ట పరిస్థితులు వృద్ధికి అవరోధాలు కలిగిస్తున్న అంశాలు. ► ఇక బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల మొండిబకాయిల సమస్యలు మరింత తీవ్రం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ► సమీప భవిష్యత్తులో రేటింగ్‌ను పెంచే అవకాశాలు లేవు. ప్రభుత్వం తీసుకుంటున్న విధాన చర్యలు వృద్ధి బాటలో పురోగతికి సహకరిస్తున్నాయని గణాంకాలు వెల్లడించేవరకూ రేటింగ్ పెంపు ఉండబోదు. భారత్ సావరిన్ రేటింగ్‌ను జూన్‌లో మూడీస్– నెగెటివ్ అవుట్‌లుక్‌తో ‘బీఏఏ3’కి కుదించింది. ఇది చెత్త స్టేటస్‌కు ఒక అంచ ఎక్కువ. ► పర్యవేక్షణలో పటిష్టత, ఫైనాన్షియల్ రంగంలో స్థిరత్వం వంటి లక్ష్యాల సాధనకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తే, వృద్ధి రికవరీ వేగవంతం అయ్యే వీలుంది. కేర్ రేటింగ్స్ అంచనా మైనస్ 8.2 శాతం కాగా దేశీయ రేటింగ్ సంస్థ కేర్ రేటింగ్స్ శుక్రవారం మరో నివేదికను విడుదల చేస్తూ, 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు మైనస్ 8% నుంచి 8.2% వరకూ ఉంటుందని అంచనావేసింది. ఇంతక్రితం ఈ క్షీణ అంచనా మైనస్ 6.4% కావడం గమనార్హం. ప్రభుత్వం నుంచి తగిన ద్రవ్యపరమైన మద్దతు ఆర్థిక వ్యవస్థకు అందకపోవడమే తమ అంచనాల పెంపునకు కారణమని కేర్ రేటింగ్స్ తెలిపింది. అందరి అంచనాలూ క్షీణతే.. మొదటి త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో భారత్ ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం క్షీణ రేటును నమోదు చేసుకున్న నేపథ్యంలో... ఇప్పటికే పలు ఆర్థిక, రేటింగ్ సంస్థలు 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు 10శాతం నుంచి 15 శాతం వరకూ ఉంటాయని అంచనా వేశాయి. ఆయా అంచనాలను పరిశీలిస్తే (అంచనాలు శాతాల్లో) సంస్థ తాజా క్రితం అంచనా అంచనా గోల్డ్‌మన్ శాక్స్ 14.8 11.8 ఫిచ్ 10.5 5.0 ఇండియా రేటింగ్స్ – రిసెర్చ్ 11.8 5.3 ఎస్బీఐ ఎకోర్యాప్ 10.9 6.8 -
ఎస్బీఐ రికార్డ్ లాభం
న్యూఢిల్లీ/ముంబై: ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రికార్డ్ స్థాయి నికర లాభం(స్డాండ్‌అలోన్) సాధించింది. 2018–19 క్యూ4లో రూ.838 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నాలుగు రెట్లు(327%) పెరిగి రూ.3,581 కోట్లకు చేరిందని ఎస్బీఐ తెలిపింది. అనుబంధ సంస్థ, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్‌లో వాటా విక్రయంతో నిధులు లభించడం, మొండి బకాయిలు తగ్గడం తదితర కారణాల వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర లాభం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.5,583 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం రూ.75,671 కోట్ల నుంచి రూ.76,028 కోట్లకు పెరిగింది. మరిన్ని వివరాలు..., ⇔ పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2019–20లో రూ.862 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.14,488 కోట్లకు ఎగసింది. బ్యాంక్ చరిత్రలో ఇదే అత్యధిక వార్షిక లాభం. ⇔ ఎస్బీఐ కార్డ్స్ వాటా విక్రయం వల్ల రూ.2,731 కోట్లు, ఎస్బీఐ లైఫ్ వాటా విక్రయం వల్ల రూ.3,484 కోట్ల నిధులు లభించాయి. ⇔ 2018–19లో రూ.2.78 లక్షల కోట్లుగా ఉన్న ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.96 లక్షల కోట్లకు ఎగసింది. ⇔ 2019 మార్చి నాటికి 7.53 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 6.15 శాతానికి, నికర మొండి బకాయిలు 3 శాతం నుంచి 2.23 శాతానికి తగ్గాయి. ⇔ 2018–19 క్యూ4లో రూ.16,502 కోట్లుగా ఉన్న ఎన్పీఏ కేటాయింపులు గత క్యూ4లో రూ.13,495 కోట్లకు తగ్గాయి. ⇔ యస్‌బ్యాంక్‌లో రూ.6,050 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ⇔ ఈఎమ్ఐల మారటోరియమ్ ప్రయోజనాన్ని 21 శాతం మంది రిటైల్ ఖాతాదారులే వినియోగించుకున్నారు. ⇔ బీఎస్ఈలో ఎస్బీఐ షేర్ 8% లాభంతో రూ.188 వద్ద ముగిసింది. ప్రతి క్వార్టర్లోనూ రుణ నాణ్యతలో మెరుగుదల సాధిస్తూ వస్తున్నాం. ప్రొవిజన్ కవరేజ్ రేషియోలో కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నాం. రికవరీలు జూన్ క్వార్టర్లో దెబ్బతిన్నా, సెప్టెంబర్ క్వార్టర్ నుంచి పుంజుకోగలవన్న ధీమా ఉంది. –రజ్నీశ్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ -
ఇండిగో నష్టం రూ. 871 కోట్లు
న్యూఢిల్లీ: ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్(ఇండిగో) కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ. 871 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దవడంతో వ్యయాలు భారీగా పెరిగిన కారణంగా ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయని ఇండిగో తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2018–19) ఇదే క్వార్టర్లో రూ.596 కోట్ల నికర లాభం ఆర్జించామని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.8,260 కోట్ల నుంచి రూ.8,635 కోట్లకు పెరిగింది. ఇంధన వ్యయాలు 3%, ఇతర వ్యయాలు 46% చొప్పున పెరిగాయి. మొత్తం మీద వ్యయాలు 30 శాతం పెరిగి రూ.9,924 కోట్లకు చేరాయి. లోడ్ ఫ్యాక్టర్(సీట్ ఆక్యుపెన్సీ)86 శాతం నుంచి 83 శాతానికి తగ్గింది. పూర్తి ఏడాదిపరంగా చూస్తే, 2018–19లో రూ.157 కోట్ల నికర లాభం రాగా, 201920 లో రూ.234 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇండిగో షేర్ 1% నష్టంతో రూ.946 వద్ద ముగిసింది. -
11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన జీడీపీ
న్యూఢిల్లీ: అందరి అంచనాలకు అనుగుణంగానే భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2019 ఏప్రిల్ –2020 మార్చి ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా నెమ్మదించింది. ఈ కాలంలో కేవలం 4.2 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి ఏడు రోజులూ (2020 మార్చి చివరి వారం) కరోనా భయాలతో దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. ఈ కాలంలో (మార్చి 25 నుంచి 31వ తేదీ వరకూ) ఆర్థిక వ్యవస్థకు రూ.1.4 లక్షల కోట్ల నష్టం జరిగిందన్నది ఒక అంచనా. ఇక ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో వృద్ధి రేటు కేవలం 3.1 శాతం. భారత్ జీడీపీ 2019–2020 మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) ఏడేళ్ల కనిష్టం 4.1 శాతానికి (4.7 శాతం నుంచి దిగువవైపు సవరణ) పడిపోయింది. తాజాగా మరింత కిందకు జారింది. మొదటి త్రైమాసికం, రెండవ త్రైమాసికాల్లో వరుసగా 5.2 శాతం, 4.4 శాతం వృద్ధి రేట్లు (5.6 శాతం, 5.1 శాతం నుంచి తగ్గింపు) నమోదయ్యాయి. 2018–19లో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను క్లుప్తంగా విశ్లేషిస్తే... ► 2008–09లో కేవలం 3.1 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. అటు తర్వాత ఆర్థిక వృద్ధి ఇంత తక్కువ స్థాయి (4.2 శాతం) ఇదే తొలిసారి. ఆర్బీఐ 5 శాతం అంచనాకన్నా తక్కువకు ఇది పడిపోవడం గమనార్హం. ► నాల్గవ త్రైమాసికంలో వచ్చిన 3.1 శాతం గడచిన 44 త్రైమాసికాల్లో ఎన్నడూ రాలేదు. అంటే ఈ స్థాయి వృద్ధిరేటు 11 సంవత్సరాల కనిష్టమన్నమాట. 2018–19 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.7 శాతం. ఇక భారత్ పోల్చుకునే చైనా ఆర్థిక వ్యవస్థ జనవరి–మార్చి 2020 త్రైమాసికంలో –6.8 శాతం క్షీణతలో ఉంది. కోవిడ్–19 దీనికి నేపథ్యం. ► నిపుణుల అంచనాల ప్రకారం కరోనా నేపథ్యంలో భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) 41 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మాంద్యం పరిస్థితిలోకి జారి‡పోనుంది. 1958, 1966, 1980 ఆర్థిక సంవత్సరాల్లో మూడుసార్లు దేశం మాంద్యాన్ని ఎదుర్కొంది. ఈ మూడు సందర్భాల్లోనూ వర్షపాతం సరిగా లేక, అప్పట్లో ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయం దెబ్బతినడమే కారణం. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థలో అసలు వృద్ధిలేకపోగా, మైనస్ (క్షీణత) గనుక నమోదయితే దానిని మాంద్యంగా పరిగణిస్తారు. క్యూ4లో రంగాల వారీ ‘జీవీఏ’ వృద్ధి... జనవరి–మార్చి మధ్య కాలంలో గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) ఆధారిత వృద్ధి రేటు కేవలం 3 శాతంగా ఉండడం గమనించదగిన మరో అంశం. అక్టోబర్–డిసెంబర్ మధ్య ఈ రేటు 3.5 శాతం ఉంటే, 2018–19లో నాల్గవ త్రైమాసికంలో ఈ విభాగంలో వృద్ధి రేటు 5.6 శాతంగా ఉంది. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాల 4వ త్రైమాసికాలను చూస్తే... తయారీ రంగం జీవీఏ 2.1 శాతం వృద్ధి నుంచి – 1.4 శాతం క్షీణతలోకి పడిపోయింది. కాగా మొత్తం ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 5.7 శాతం నుంచి 0.03 శాతానికి తగ్గింది. నిర్మాణ రంగం జీవీఏ 6 శాతం వృద్ధి నుంచి –2.2 శాతం క్షీణతలోకి జారింది. అయితే జీడీపీలో 14 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగంలో వృద్ధి మాత్రం 1.6 శాతం నుంచి 5.9 శాతానికి పెరిగింది. ఈ రంగంలో ప్రభుత్వ వ్యయాలు దీనికి ఒక కారణం. మైనింగ్ రంగం కూడా –4.8 శాతం క్షీణత నుంచి 5.2 శాతం వృద్ధికి మారింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల విభాగంలో వృద్ధిరేటు 5.5 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గింది. ట్రేడ్, హోటల్, రవాణా, కమ్యూనికేషన్లు అలాగే బ్రాడ్‌కాస్టింగ్ సేవల్లో 6.9 శాతం వృద్ధిరేటు 2.6 శాతానికి పడిపోయింది. ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సర్వీసుల వృద్ధి రేటు 8.7 శాతం నుంచి 2.4 శాతానికి దిగింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ ఇతర సేవల వృద్ధిరేటు కూడా 11.6% నుంచి 10.1 శాతానికి తగ్గింది. విలువలు ఇలా... 2011–12 ధరల స్థితి ప్రకారం... ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ (రియల్ జీడీపీ) వేసిన లెక్కల ప్రకారం... 2018–19 ఆర్థిక సంవత్సరం క్యూ4 జీడీపీ విలువ రూ.36.90 లక్షల కోట్లు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ రూ.38.04 లక్షల కోట్లకు పెరిగింది. అంటే క్యూ4లో జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతంమన్నమాట. ఇక ఇదే విధంగా 2018–19 ఆర్థిక సంవత్సరం జీడీపీ విలువ రూ.139.81 లక్షల కోట్లయితే, ఈ విలువ 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.145.66 లక్షల కోట్లకు చేరింది. అంటే ఇక్కడ వృద్ధిరేటు 4.2 శాతం అని అర్థం. తలసరి ఆదాయంలో 6.1 శాతం వృద్ధి జీడీపీ లెక్కప్రకారం, తలసరి ఆదాయం 2018–19లో రూ.1,26,521 అయితే, ఇది 2019–20లో రూ.1,34,226కు చేరింది. వృద్ధి 6.1 శాతం. కట్టు తప్పిన ద్రవ్యలోటు... తాజా జీడీపీ గణాంకాల నేపథ్యంలో మొత్తం జీడీపీలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) 4.6 శాతంగా నమోదయ్యింది. నిజానికి ఆర్థిక సంవత్సరం మొత్తం జీడీపీలో ద్రవ్యలోటు 3.8 శాతం దాటకూడదని సవరిత అంచనాలు నిర్దేశిస్తున్నాయి. సవరించకముందు ఇది ఇంకా తక్కువగా 3.3 శాతంగానే ఉంది. రెవెన్యూ అంచనాల మేర లేకపోవడం మొత్తం ద్రవ్యలోటుపై చివరకు తీవ్ర ప్రభావమే చూపిందని చెప్పవచ్చు. రెవెన్యూలోటు కేవలం 2.4 శాతమే (జీడీపీ విలువలో) ఉండాలని భావిస్తే, ఇది తాజా లెక్కల ప్రకారం 3.27 శాతానికి చేరింది. జీడీపీ... జీవీఏ అంటే... గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ): ఉత్పత్తిదారులు లేదా సరఫరాల వైపు నుంచి ఒక ఆర్థిక సంవత్సరం, లేదా త్రైమాసికంలో ఆర్థిక క్రియాశీలత ఎలా ఉందన్న అంశాన్ని తెలియజేస్తుంది. ప్రత్యేకించి పరిశ్రమ లేదా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం వృద్ధి తీరు ఎలా ఉందన్న విషయాన్ని నిర్దిష్టంగా పరిశీలించడానికి ఈ విధానం దోహదపడుతుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ): వినియోగదారులు లేదా డిమాండ్ వైపు నుంచి ఆర్థిక వ్యవస్థ పనితీరును చూపిస్తుంది. దేశంలో వార్షికంగా లేదా త్రైమాసిక పరంగా జరిగే (పూర్తి స్థాయిలో) మొత్తం వస్తువులు, సేవల ఉత్పత్తి విలువ ఇది. జీడీపీని ఫ్యాకర్ కాస్ట్లో అలాగే మార్కెట్ ప్రైస్‌లో చూస్తారు. జీడీపీ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే జీవీఏ ఫ్యాక్టర్ కాస్ట్ అన్నమాటే. మార్కెట్ ప్రైస్ అంటే ఇక్కడ ప్రభుత్వ పన్నులు, సబ్సిడీలు కూడా గమనంలోకి వస్తాయి. జీడీపీలో కూడా నామినల్ – రియల్ అని 2 రకాలు. ద్రవ్యోల్బణం లెక్కలతో పనిలేకుండా, ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకుని లెక్కిం చే ది నామినల్ జీడీపీ. అయితే, ఒక బేస్ సంవత్సరం గా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కించేదే రియల్ జీడీపీ. మనం అనుసరించేది దీన్నే. -
జూన్ క్వార్టర్లో జీడీపీ 20% క్షీణత: ఇక్రా
ముంబై: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) అసలు వృద్ధినే నమోదుచేసుకోకపోగా, 16 నుంచి 20 శాతం క్షీణత (మైనస్)లోకి జారిపోయే అవకాశం ఉందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా అంచనావేసింది. ఇక ఆర్థిక సంవత్సరం మొత్తంలో (2020 ఏప్రిల్–2021 మార్చి) మధ్య కూడా 2 శాతం వరకూ క్షీణరేటే నమోదయ్యే వీలుందని ఇక్రా పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా ఒకశాతంగానే ఉండడం గమనార్హం. వరుసగా మూడవ విడత లాక్‌డౌన్‌ను మే 17 వరకూ పొడిగించడం, తిరిగి ఆర్థిక క్రియాశీలతకు కొంతమేర సడలింపుల ప్రకటన నేపథ్యంలో ఇక్రా తాజా ప్రకటన చేసింది. ఆంక్షల సడలింపు ఆర్థిక వృద్ధి విషయంలో కొంత సానుకూలమైనదే అయినప్పటికీ, కార్మిక లభ్యతలో అసమతౌల్యతల వల్ల తయారీ, నిర్మాణం, వాణిజ్యం, హోటెల్స్, రవాణా రంగాలపై ప్రతికూలత కొనసాగే అవకాశం ఉందని ఇక్రా అభిప్రాయపడింది. -
భారీ నష్టాలతో బోణి
కొత్త ఆర్థిక సంవత్సరం(2020–21) తొలి రోజు స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. కరోనా మహమ్మారి విలయతాండవానికి అంతర్జాతీయంగా ప్రపంచ మార్కెట్లు కకావికలమవుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ సూచీల్లో భారత వెయిటేజీకి సంబంధించిన మార్పులను ఎమ్ఎస్సీఐ మే నెలకు వాయిదా వేయడంతో బుధవారం మన మార్కెట్ కూడా భారీగా పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,203 పాయింట్లు క్షీణించి 28,265 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 344 పాయింట్లు నష్టపోయి 8,254 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. నేడు (గురువారం) శ్రీరామ నవమి సందర్భంగా సెలవు కావడంతో నిఫ్టీ వీక్లీ ఆప్షన్లు బుధవారమే ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వారం కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఇన్వెస్టర్లు... బహుపరాక్....! సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. పావుగంటకే నష్టాల్లోకి జారిపోయింది. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,395 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్ల మేర నష్టపోయాయి. ఇక ఆసియా మార్కెట్లు 2–4 శాతం రేంజ్లో నష్టపోగా, యూరప్ మార్కెట్లు కూడా అదే స్థాయి నష్టాల్లో ఆరంభమయ్యాయి. ముడిచమురు ధరలు 5 శాతం మేర తగ్గాయి. కాగా స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంక్ షేర్లు బేర్ ప్రస్తుత లాక్డౌన్ కారణంగా వివిధ కంపెనీల వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని, ఫలితంగా బ్యాంక్‌ల మొండిబకాయిలు భారీగా పెరుగుతాయనే భయాందోళనలతో బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 8–2 శాతం రేంజ్లో నష్టపోయాయి. ► టెక్ మహీంద్రా షేర్ 9.2% పడింది. ► 30 సెన్సెక్స్ షేర్లలో 4 షేర్లు–హీరో మోటో, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ మాత్రమే లాభపడగా, మిగిలిన 26 షేర్లు నష్టపోయాయి. తొలి రోజే రూ.3.2 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.3.2 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.20 లక్షల కోట్ల తగ్గుదలతో రూ.110.28 లక్షల కోట్లకు పడిపోయింది. పతనానికి ప్రధాన కారణాలు ► కొనసాగుతున్న కరోనా కల్లోలం...: భారత్‌లో కరోనా కేసులు 1,621కు, మరణాలు 42కు చేరాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 8.6 లక్షలకు, మరణాలు 42,000కు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. ► ఎమ్ఎస్సీఐ ‘వెయిటేజీ’ వాయిదా: ఎమ్ఎస్సీఐ(మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్)... తన గ్లోబల్ సూచీల్లో భారత వెయిటేజీ పెంచే నిర్ణయాన్ని మే నెలకు వాయిదా వేసింది. వాస్తవానికి ఈ మార్పులు బుధవారం (ఏప్రిల్ 1)నుంచే అమల్లోకి రావాలి. దీనివల్ల భారత్‌లోకి 1,000 కోట్ల డాలర్లు(రూ.76,000 కోట్లు) వచ్చే చాన్స్ ఉంది. ► బలహీనంగా ఆసియా తయారీ డేటా: జపాన్, దక్షణి కొరియా దేశాల తయారీ రంగ గణాంకాలు బలహీనంగా ఉండటం ప్రతికూల ప్రభావం చూపించింది. ► తగ్గిన వాహన విక్రయాలు...: మార్చి నెలలో వాహన విక్రయాలు బాగా తగ్గాయి. మారుతీ సుజుకీ మ్మకాలు 47 శాతం, అశోక్ లేలాండ్ విక్రయాలు 90 శాతం, ఐషర్ మోటార్స్ అమ్మకాలు 83 శాతం మేర పడిపోయాయి. వాహన విక్రయాలు ఈ స్థాయిలో క్షీణించడం ఇన్వెస్టర్లను కలవర పెట్టింది. ► ద్రవ్యలోటు లక్ష్యం మిస్... గత ఆర్థిక సంవత్సరం (2019–20) ఫిబ్రవరి నాటికే ద్రవ్యలోటు(వ్యయానికి, ఆదాయానికి మధ్య వ్యత్యాసం) పూర్తి బడ్జెట్ అంచనాల్లో 135 శాతానికి (రూ.10,36,485 కోట్లు) చేరింది. ద్రవ్యలోటు లక్ష్యం పెద్ద మార్జిన్‌తో కట్టు తప్పడం.. ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. నేడు సెలవు శ్రీరామ నవమి సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్‌కు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ట్రేడింగ్ జరగదు. -
జూన్ వరకూ ఆర్థిక సంవత్సరం పొడిగింపు
న్యూఢిల్లీ: కరోనాతో అతలాకుతలం అవుతున్న ఆర్థిక వ్యవస్థల నేపథ్యంలో కేంద్రం భారత్ ఆర్థిక సంవత్సరాన్ని 3 నెలలు పెంచింది. దీనితో ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరం జూన్ వరకూ కొనసాగనుంది. సాంప్రదాయకంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమై ఆ తదుపరి ఏడాది మార్చి 31తో పూర్తవుతుంది. అంటే 12 నెలల పాటు ఆర్థిక సంవత్సరం కొనసాగుతుంది. కేంద్రం తాజా నిర్ణయం నేపథ్యంలో 15 నెలలపాటు ఈ ఆర్థిక సంవత్సరం కొనసాగనుంది. ‘‘2020–21 ఆర్థిక సంవత్సరం 2020 ఏప్రిల్ నుంచీ కాకుండా 2020 జూలై 1వ తేదీ నుంచీ ప్రారంభమవుతుంది’’ అని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ప్రభుత్వ గణాంకాల నుంచి పారిశ్రామిక గణాంకాల వరకూ అన్ని విభాగాలపై కరోనా ప్రభావం నిర్దిష్ట కాల వ్యవధిలో ఏ మేరకు ఉందన్న అంశాన్ని కొంతమేర ఒక అంచనాకు రావడానికి తాజా నిర్ణయం దోహపడుతుందన్నది నిపుణుల విశ్లేషణ. ఆర్థిక సంవత్సరాన్ని మూడు నెలల పాటు కొనసాగించాలని పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వాన్ని గత కొన్ని రోజులుగా కోరుతున్నాయి. కరోనా వైరస్ కల్లోలంతో కనీసం ఆరు నెలల పాటు ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని ఈ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. గత ఏడాది 2019 నుంచి ఈ ఏడాది మార్చి వరకూ ఉండే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీల వార్షిక నివేదికలు పూర్తి బిజినెస్ సైకిల్‌ను ప్రతిబింబించలేవని వివరించారు. -
ఓయో నష్టాలు 335 మిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ కన్సాలిడేటెడ్ నష్టాలు మరింత అధికమయ్యాయి. 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ 335 మిలియన్ డాలర్ల (రూ.2,390 కోట్లు) నష్టాలను ప్రకటించింది. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నష్టాలు రూ.52 మిలియన్ డాలర్లుగానే (రూ.370 కోట్లు) ఉండడం గమనార్హం. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న 211 మిలియన్ డాలర్ల నుంచి 951 మిలియన్ డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయంగా కార్యకలాపాల విస్తరణ నష్టాలు పెరగడానికి కారణమైంది. దేశీయ కార్యకలాపాలపై నష్టాలను మొత్తం ఆదాయంలో 24 శాతం నుంచి 12 శాతానికి సంస్థ తగ్గించుకుంది. -
ఆరవ నెలా ఎగుమతులు డౌన్ !
న్యూఢిల్లీ: దేశం నుంచి జరుగుతున్న ఎగుమతులపై ఆందోళన కొనసాగుతోంది. ఆరు నెలల నుంచీ వృద్ధిలేకపోగా జారుడు బల్లపై (క్షీణ బాటన) ఎగుమతులు కొనసాగుతుండడం దీనికి కారణం. తాజా సమీక్షా నెల– 2020 జనవరిని చూస్తే, 2019 ఇదే నెలతో పోల్చి ఎగుమతులు 1.66 శాతం క్షీణించాయి. విలువలో ఎగుమతుల విలువ 25.97 బిలియన్ డాలర్లు. ఇక దేశంలో ఆర్థిక మందగమనాన్ని సూచిస్తూ, దిగుమతులూ వరుసగా ఎనిమిదవ నెల క్షీణ బాటన నిలిచాయి. 0.75 శాతం క్షీణతతో 41.14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల విలువల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 15.17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ♦ పెట్రోలియం ప్రొడక్ట్స్ (–7.42 శాతం), ప్లాస్టిక్ – 10.62 శాతం), కార్పెట్ (–5.19 శాతం), రత్నాలు (–6.89 శాతం), ఆభరణాలు (–7.5 శాతం) , తోలు ఉత్పత్తుల (–7.4 శాతం) ఎగుమతులు క్షీణతను నమోదుచేసుకున్నాయి. ♦ ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో దాదాపు 18 ప్రతికూల ఫలితాలనే నమోదుచేసుకున్నాయి. ♦ పసిడి దిగుమతులు దాదాపు 9 శాతం పడిపోయి 1.58 బిలియన్ డాలర్లకు చేరాయి. ♦ చమురు దిగుమతుల విలువ 15.27 శాతం పెరిగి 12.97 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. చమురేతర దిగుమతుల విలువ 6.72 శాతం పడిపోయి 28.17 బిలయన్ డాలర్లకు చేరింది. 10 నెలల్లోనూ క్షీణతే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019 ఏప్రిల్ నుంచి 2020 జనవరి వరకూ చూస్తే, ఎగుమతులు 1.93 శాతం పడిపోయి 265.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులూ క్షీణబాటలోనే పయనించి 8.12 శాతం పతనంతో 398.53 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 133.27 బిలియన్ డాలర్లుగా ఉంది. డిసెంబర్లో సేవల ఎగుమతులవిలువ 20 బిలియన్ డాలర్లు... మరోవైపు డిసెంబర్ దేశ సేవల ఎగుమతుల గణాంకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసింది. జనవరిలో సేవల ఎగుమతుల విలువ 20 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇదే నెల్లో సేవల దిగుమతుల విలువ 12.56 బిలియన్ డాలర్లు. -
రెండు రెట్లకు మించిన ఇండిగో లాభం
ముంబై: ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్ క్వార్టర్లో రెండు రెట్లకు మించి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.185 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.496 కోట్లకు పెరిగిందని ఇండిగో సీఈఓ రనోజాయ్ దత్తా తెలిపారు. మొత్తం ఆదాయం రూ.8,229 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో రూ.10,330 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నెట్వర్క్ విస్తరణ..: టికెట్ల ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.8,770 కోట్లకు, అనుబంధ ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.1,037 కోట్లకు పెరిగాయని దత్తా తెలిపారు. గత క్యూ3లో కిమీకు. రూ.3.83గా ఉన్న సగటు టికెట్ ధర ఈ క్యూ3లో రూ.3.88కు పెరిగిందని వివరించారు. ఇంధన వ్యయాలు రూ.341 కోట్ల నుంచి 2 శాతం క్షీణించి రూ.334 కోట్లకు తగ్గాయని పేర్కొన్నారు. షిర్డి, షిల్లాంగ్ వంటి చిన్న నగరాలకు, హనోయ్, గాంగ్జూ వంటి విదేశీ నగరాలకు విమాన సర్వీసులను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. -
డాక్టర్ రెడ్డీస్ నష్టం రూ.570 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఆర్థిక ఫలితాల విషయంలో అనలిస్టుల అంచనాలు తారుమారయ్యాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో భారీ నష్టం చవిచూసింది. ఈ కాలంలో కంపెనీ రూ.569.7 కోట్ల నష్టం ప్రకటించింది. 2018–19 క్యూ3లో రూ.485 కోట్ల నికరలాభం ఆర్జించింది. డిసెంబరు త్రైమాసికంలో ఆదాయం రూ.4,384 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 14 శాతం పెరుగుదల. ఇక ఎబిటా క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 24 శాతం అధికమై రూ.1,074 కోట్లుగా ఉంది. డిసెంబరు త్రైమాసికంలో అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచామని డాక్టర్ రెడ్డీస్ కో–చైర్మన్ జి.వి.ప్రసాద్ తెలిపారు. బలమైన ఎబిటా మార్జిన్స్ నమోదు చేశామని చెప్పారు. జి–నువారింగ్తోపాటు కొన్ని ఉత్పత్తుల బ్రాండ్ విలువ పడిపోవడం, ఆ మేరకు కేటాయింపులు చేయడం వల్ల నష్టం చవిచూడాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించింది. ఈ కేటాయింపులు రూ.1,320 కోట్లుగా ఉన్నాయని డాక్టర్ రెడ్డీస్ సీఎఫ్ఓ సౌమెన్ చక్రవర్తి, సీఈవో ఎరెజ్ ఇజ్రాయెలి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. కలిసొచ్చిన గ్లోబల్ జనరిక్స్.. కంపెనీకి గ్లోబల్ జనరిక్స్ కలిసొచ్చాయి. ఈ విభాగం నుంచి ఆదాయం రూ.3,593 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం పెరుగుదల. యూరప్, కొత్తగా ఉద్భవిస్తున్న మార్కెట్లు, భారత్ ఈ ఆదాయ వృద్ధికి దోహదం చేశాయి. ఉత్తర అమెరికా నుంచి 8 శాతం వృద్ధితో రూ.1,600 కోట్ల ఆదాయం సమకూరింది. యూఎస్ మార్కెట్లో ఈ త్రైమాసికంలో కంపెనీ అయిదు కొత్త ఉత్పత్తులు విడుదల చేసింది. ఎమర్జింగ్ మార్కెట్ల నుంచి రూ.920 కోట్లు, భారత్ నుంచి రూ.763 కోట్ల రెవెన్యూ నమోదైంది. యూరప్ నుంచి 52 శాతం వృద్ధితో రూ.310 కోట్ల రెవెన్యూ సాధించింది. -
పడిపోతున్న ఆదాయంతో సవాలే..
ముంబై: పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం ద్రవ్య గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. పన్ను, పన్నేతర ఆదాయం లక్ష్యాలకు దూరంగా ఉండడంతోపాటు, ప్రైవేటు పెట్టుబడులు, వినియోగం బలహీనపడడం సవాలుగా పేర్కొంది. శుక్రవారం ముంబైలో విడుదల చేసిన 25వ ‘ఆర్థిక స్థిరత్వ నివేదిక’లో ఈ అంశాలను ప్రస్తావించింది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని అభిప్రాయపడింది. బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు తమ బ్యాలన్స్ షీట్ల ప్రక్షాళనకు తీసుకున్న చర్యల వల్ల బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడుతున్నట్టు తెలిపింది. నవంబర్ నాటికే ద్రవ్యలోటు నిర్ణీత లక్ష్యంలో 107 శాతానికి చేరిపోవడంతో.. జీడీపీలో ద్రవ్యలోటును 3.3 శాతానికి పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంపై సందేహాలు వ్యక్తమవుతుండడం ఆర్బీఐ వ్యాఖ్యల్లోనూ కనిపించింది. అలాగే, జీఎస్టీ వసూళ్లు కూడా ఆశించిన మేర లేవు. మరోవైపు కార్పొరేట్ పన్ను కోత కారణంగా ప్రభుత్వానికి రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోనుంది. ‘‘ద్రవ్యలోటు గణాంకాలు గత కొన్నేళ్లలో మెరుగుపడ్డాయి. కానీ, ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు బలహీన పడడం కారణంగా తగ్గిపోతున్న ఆదాయంతో ద్రవ్యలోటు సవాలు కాగలదు’’ అని ఆర్బీఐ స్థిరత్వ నివేదిక పేర్కొంది. స్థూల ఎన్పీఏలు పెరగొచ్చు స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పు కారణంగా బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2020 సెప్టెంబర్ నాటికి 9.9 శాతానికి పెరగొచ్చని ఈ నివేదిక పేర్కొంది. 2019 సెప్టెంబర్ నాటికి ఇవి 9.3 శాతంగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న 9.3 శాతం స్థాయిలోనే స్థిరంగా ఉండడం గమనార్హం. ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 12.7 శాతం నుంచి 13.2 శాతానికి, ప్రైవేటు బ్యాంకుల్లో ఇది 3.9 శాతం నుంచి 4.2 శాతానికి.. అదే విధంగా దేశంలో పనిచేసే విదేశీ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2.9% నుంచి 3.1 శాతానికి పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. ఎన్‌బీఎఫ్‌సీల్లోనూ ఇదే పరిస్థితి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఆస్తుల నాణ్యత ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ఎన్బీఎఫ్సీ రంగంలో స్థూల ఎన్పీఏలు 6.1 శాతం నుంచి 6.3 శాతానికి పెరిగాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో నికర ఎన్పీఏలు మాత్రం స్థిరంగా 3.4 శాతం వద్దే ఉన్నాయని తెలిపింది. క్యాపిటల్ టు రిస్క్ అసెట్స్ రేషియో (సీఆర్ఏఆర్) నిర్దేశిత 20% కంటే తక్కువగా 19.5 శాతం వద్ద ఉంది. రూ.5 కోట్లు దాటితే చెప్పాలి.. రూ.5 కోట్లు, అంతకుమించి రుణాల సమాచారాన్ని.. భారీ రుణాల కేంద్ర సమాచార కేంద్రానికి (సీఆర్‌ఐఎల్‌సీ) తెలియజేయాలని పెద్దసైజు కోపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. రూ.500 కోట్లు, అంతకుమించి ఆస్తులున్న అన్ని అర్బన్ కోపరేటివ్ బ్యాంకులను సీఆర్‌ఐఎల్‌సీ పరిధిలోకి తీసుకొస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పాలనను మెరుగుపరిచి వృద్ధికి తోడ్పడాలి: దాస్ కంపెనీలు, బ్యాంకులు పాలనా ప్రమాణాలను మెరుగుపరుచుకుని, దేశ ఆర్థిక వ్యవస్థ తన పూర్తి సామర్థ్యాల మేరకు రాణించేందుకు తోడ్పడాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కోరారు. దేశ ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5%కి సెప్టెంబర్ త్రైమాసికంలో పడిపోయిన విషయం విదితమే. అలాగే, చాలా కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. వినియోగం, పెట్టుబడులను పునరుద్ధరించడం అన్నవి ప్రధాన సవాళ్లుగా దాస్ పేర్కొన్నారు. బోర్డుల్లో మంచి కార్పొరేట్ పరిపాలన అన్నది మన దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేందుకు ముఖ్యమైన అంశమనేది తన అభిప్రాయంగా చెప్పారు. ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక విడుదల సందర్భంగా దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
పీఎన్బీ మొండిబాకీ లెక్కల్లో వ్యత్యాసాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) దాదాపు రూ. 2,617 కోట్ల మేర మొండిబాకీలు తక్కువగా చూపినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆడిట్లో వెల్లడైంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ లెక్కల ప్రకారం పీఎన్బీ స్థూల మొండిబాకీలు (ఎన్పీఏ) రూ. 81,089.70 కోట్లుగా ఉన్నాయి. కానీ పీఎన్బీ రూ. 78,472 కోట్లు మాత్రమే ఎన్పీఏలుగా చూపించింది. దీంతో ఆర్బీఐ, పీఎన్బీ లెక్కల మధ్య రూ. 2,617 కోట్ల వ్యత్యాసం (డైవర్జెన్స్) వచ్చింది. ఇక నికర ఎన్పీఏలు రూ. 30,038 కోట్లుగా ఉన్నట్లు పీఎన్బీ చూపగా, ఆర్బీఐ ఆడిట్ ప్రకారం రూ. 32,655 కోట్లుగా ఉన్నాయి. దీంతో నికర ఎన్పీఏలకు సంబంధించి కూడా డైవర్జెన్స్ రూ. 2,617 కోట్లుగా ఉన్నట్లు పీఎన్బీ వెల్లడించింది. మరోవైపు మొండిబాకీలకు కేటాయింపుల విషయంలో కూడా రూ. 2,091 కోట్ల మేర వ్యత్యాసం నమోదైంది. రూ. 50,242 కోట్ల మేర ప్రొవిజనింగ్ చేయాల్సి ఉండగా.. రూ. 48,151 కోట్లు మాత్రమే పీఎన్బీ కేటాయించింది. 2018–19 ఆర్థిక ఫలితాల్లో పీఎన్బీ రూ. 9,975 కోట్ల నష్టాన్ని ప్రకటించగా.. ఆర్బీఐ లెక్కించిన విధంగా ప్రొవిజనింగ్ చేసి ఉంటే నష్టాలు రూ. 11,336 కోట్లుగా ఉండేవి. దాదాపు రూ. 14,000 కోట్ల నీరవ్ మోదీ స్కామ్ నుంచి బైటపడేందుకు నానా తంటాలు పడుతున్న పీఎన్బీకి ఇతరత్రా మొండిబాకీలు భారంగా మారుతున్నాయి. -
ఎయిర్‌లైన్స్ కంపెనీలకు రూ.4,260 కోట్ల నష్టాలు
విమానయాన సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 600 మిలియన్ డాలర్లకు (రూ.4,260 కోట్లు) పైగా నష్టాలను నమోదుచేయవచ్చని కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ అంచనా వేసింది. 500–700 మిలియన్ డాలర్ల వరకు లాభాలకు అవకాశం ఉంటుందని ఈ ఏడాది జూన్‌లో వేసిన అంచనాలను సవరించింది. జెట్ ఎయిర్వేస్ మూసివేత, సానుకూలంగా ఉన్న చమురు ధరల నుంచి ప్రయోజనం పొందడంలో ఎయిర్‌లైన్స్ కంపెనీలు విఫలమైనట్టు సీఏపీఏ తన తాజా నివేదికలో పేర్కొంది. -
స్థూల ఆదాయంలో ఎయిర్టెల్ టాప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) రెండో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో టెలికం కంపెనీల స్థూల ఆదాయం రూ. 54,218 కోట్లుగా ఉంది. టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం.. భారతీ ఎయిర్టెల్ ఆదాయం రూ. 19,061 కోట్లుగా నమోదైంది. అంటే, మొత్తం ఈ రంగం సాధించిన స్థూల ఆదాయంలో సంస్థ వాటా 35 శాతంగా ఉంది. ప్రభుత్వానికి రూ. 1,160.63 కోట్లు (లైసెన్స్ ఫీజు రూ. 851.3 కోట్లు, స్పెక్ట్రం ఫీజు రూ. 309.33 కోట్లు)ను చెల్లించింది. అయితే, సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్)లో మాత్రం వెనకపడిపోయింది. ఇది 55.83 శాతంతో రూ. 10,641.33 కోట్లకు పరిమితమైంది. -
ఆర్బీఐ పాలసీ సమీక్ష, అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేవలం 4.5 శాతం వృద్ధి రేటుకే పరిమితమైంది. గడచిన ఆరేళ్లలో వృద్ధి వేగం ఇంతటి తక్కువ స్థాయిని నమోదుచేయడం ఇదే తొలిసారి కాగా, శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత వెల్లడైన జీడీపీ గణాంకాలు.. సోమవారం ట్రేడింగ్‌పై ప్రభావం చూపనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వారం మొదటి రోజు ట్రేడింగ్‌పైనే తాజా డేటా ప్రభావం ఉండనుండగా.. మీడియం టెర్మ్‌లో మార్కెట్ పథంలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ వీపీ రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు. ఇక వృద్ధి రేటు కనిష్ట స్థాయిలకు పడిపోయిన నేపథ్యంలో లిక్విడిటీ పెంపు చర్యల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించ వచ్చనే అంచనాలు సూచీలను నిలబెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీíసీ) సమావేశం 3న (మంగళవారం) ప్రారంభమై, 5న (గురువారం) ముగియనుంది. ఈ సమావేశంలో కీలకమైన రెపో రేటుపై ఎంపీసీ నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రేటు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ రీసెర్చ్ విశ్లేషకులు రాహుల్ గుప్తా అంచనావేశారు. వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గిన కారణంగా తయారీ, పారిశ్రామిక రంగాలు మందగమనంలో ఉన్నందున మళ్లీ వృద్ధి రేటును గాడిలో పెట్టడం కోసం వడ్డీ రేట్లను తగ్గించవచ్చని విశ్లేషించారు. ఇక్రా ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ అదితి నాయర్, ప్రభుదాస్ లిల్లాధర్ కూడా పావు శాతం తగ్గింపును అంచనావేస్తున్నట్లు చెప్పారు. ఆటో సేల్స్, ఆర్థికాంశాల ప్రభావం.. ఈ వారంలో ఆటో, టెలికం రంగాల షేర్లు మార్కెట్ దృష్టిని ఆకర్షించనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. దేశీ ఆటో రంగ నవంబర్ నెల అమ్మకాలు ఆదివారం వెల్లడికాగా.. మారుతీ సుజుకీ విక్రయాలు 1.9%, టాటా మోటార్స్ అమ్మకాలు 25% క్షీణతకే పరిమితం అయ్యాయి. అంతక్రితం నెలల్లో వరుసగా భారీ తగ్గుదలను నమోదుచేసిన ఆటో రంగ కంపెనీలు.. ఇక నుంచి గాడిన పడవచ్చనే సంకేతాలను ఇస్తున్నాయి. మరోవైపు, ట్యారిఫ్లను పెంచుతూ టెలికం రంగాలు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రంగాల్లో కొనుగోళ్లకు అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ... భారత్ కాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. వరుసగా 3వ నెల్లోనూ వీరు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. నవంబర్ నెల్లో రూ. 22,872 కోట్లు వెచ్చించారు. ఈక్విటీ మార్కెట్లో రూ.25,230 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. డెట్ మార్కె ట్ నుంచి రూ. 2,358 కోట్లు వెనక్కితీసుకున్నారు. -
యూనియన్ బ్యాంక్ నష్టం రూ.1,194 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో భారీగా నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.139 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ2లో రూ.1,194 కోట్ల నికర నష్టాలు వచ్చాయని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ.9,438 కోట్ల నుంచి రూ.10,557 కోట్లకు పెరిగిందని పేర్కొంది. తగ్గిన మొండి బకాయిలు...: బ్యాంక్ రుణ నాణ్యత అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది. మొండి బకాయిలు తగ్గినా, కేటాయింపులు మాత్రం పెరిగాయి. గత క్యూ2లో 15.74 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 15.24 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 8.42 శాతం నుంచి 6.98 శాతానికి చేరాయి. మొండి బకాయిలు తగ్గినా కేటాయింపులు మాత్రం దాదాపు రెట్టింపయ్యాయి. గత క్యూ2లో రూ.1,710 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ2లో రూ.3,328 కోట్లకు పెరిగాయి. మొండి బకాయిలు, ఇతరాలకు కలిపి మొత్తం మీద కేటాయింపులు రూ.1,716 కోట్ల నుంచి రూ.3,859 కోట్లకు పెరిగాయి. బీఎస్ఈలో షేర్ 0.7 శాతం లాభంతో రూ.52.30 వద్ద ముగిసింది. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు@ రూ. 6 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.6 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్నులు వసూలైనట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ పీసీ మోదీ వెల్లడిం చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ.13.35 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యంలో ఇది సగానికన్నా తక్కువ. అయినప్పటికీ బడ్జెట్లో నిర్దేశిత లక్ష్యాలను సాధించగలమని మోదీ ధీమా వ్యక్తం చేశారు. సత్వరం రీఫండ్స్ చేస్తున్నామని, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి రీఫండ్స్ 20% పెరిగాయని ఆయన చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలపైనా దృష్టి పెట్టామని తెలిపారు. -
స్పైస్‌జెట్ నష్టాలు రూ.463 కోట్లు
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, స్పైస్‌జెట్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో రూ.463 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల సర్వీసులు నిలిపివేయడం వల్ల వ్యయా లు పెరిగాయని, అంతే కాకుండా సాధారణంగా సెప్టెంబర్ క్వార్టర్ బలహీనంగా ఉంటుందని, అకౌంటింగ్ నిబంధనల్లో మార్పుల వల్ల రూ.180 కోట్ల నష్టాలొచ్చాయని.... ఈ మూడు అంశాల కారణంగా ఈ క్యూ2లో ఈ స్థాయిలో నష్టాలొచ్చాయని స్పైస్‌జెట్ వివరించింది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో రూ.389 కోట్ల నికర నష్టాలు వచ్చాయని తెలిపింది. 118 విమానాలతో సర్వీసులు... గత క్యూ2లో రూ.1,875 కోట్లుగా ఉన్న నిర్వహణ ఆదాయం ఈ క్యూ2లో రూ.2,845 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ మొత్తం 118 విమానాలతో రోజుకు సగటున 630 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో స్పైస్‌జెట్ షేర్ 1 శాతం నష్టంతో రూ.114 వద్ద ముగిసింది. -
టాటా స్టీల్ లాభం 3,302 కోట్లు
న్యూఢిల్లీ: టాటా స్టీల్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో(క్యూ2) రూ.3,302 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం రూ.3,116 కోట్లతో పోల్చితే 6 శాతం వృద్ధి సాధించామని టాటా స్టీల్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.41,258 కోట్ల నుంచి రూ.34,763 కోట్లకు తగ్గిందని పేర్కొంది. భారత్‌లోనూ, విదేశాల్లోనూ వ్యాపార వాతావరణం చాలా సమస్యాత్మకంగా ఉందని, ఉక్కు ధరలపై తీవ్ర ప్రభావం పడిందని కంపెనీ సీఈఓ, ఎమ్డీ టీవీ నరేంద్రన్ వ్యాఖ్యానించారు. వర్షాలు ముగియడం, పండుగల డిమాండ్ కారణంగా వినియోగం ఊపందుకొని, ఉక్కుకు డిమాండ్ పెరగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.., 100 డాలర్ల మేర తగ్గిన ఉక్కు ధరలు... కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీకి రూ.4,233 కోట్ల పన్ను వ్యయాలు(దేశీ, విదేశీ అనుబంధ కంపెనీలను కలుపుకొని) తగ్గాయి. వ్యాపార పరిస్థితులు గడ్డుగా ఉండటంతో ఉక్కు ధరలు ప్రపంచవ్యాప్తంగా టన్నుకు వంద డాలర్లు తగ్గాయి. కంపెనీ కన్సాలిడేటెడ్ నిర్వహణ లాభం రూ.4,018 కోట్లుగా ఉంది. భారత కార్యకలాపాల విషయానికొస్తే, నిర్వహణ లాభం 57 శాతం పతనమై రూ.3,817 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్ 18.9 శాతంగా నమోదైంది. పెరిగిన రుణ భారం... వర్కింగ్ క్యాపిటల్ పెరగడంతో కంపెనీ స్థూల రుణభారం మరింతగా పెరిగింది. ఈ క్యూ2లో విదేశాల్లో 52.5 కోట్ల డాలర్ల రుణాలను సమీకరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ. 4,596 కోట్ల నగదు నిల్వలు, రూ.7,262 కోట్ల బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి. టాటా స్టీల్ బీఎస్ఎల్(గతంలో భూషణ్ స్టీల్) విలీన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా ఈ విలీనం పూర్తి కానున్నది. మందగమనం ఉన్నప్పటికీ, బ్రాండెడ్ ఉత్పత్తులు, రిటైల్ సెగ్మెంట్, పారిశ్రామిక, ప్రాజెక్ట్ సెగ్మెంట్లలో మంచి అమ్మకాలనే సాధించామని కంపెనీ సంతృప్తి వ్యక్తం చేసింది. వాహన రంగం మందగమనం ప్రభావాన్ని ఎగుమతులు పెరగడం సర్దుబాటు చేయగలిగిందని కంపెనీ పేర్కొంది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో టాటా స్టీల్ షేర్ స్వల్ప లాభంతో రూ.404 వద్ద ముగిసింది. -
సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ
వాషింగ్టన్: సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గత ఆర్థిక సంవత్సరంలో 42.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 305 కోట్లు) ప్యాకేజీ అందుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 66 శాతం అధికం. నాదెళ్ల మూలవేతనం సుమారు 2.3 మిలియన్ డాలర్లే అయినప్పటికీ, ప్యాకేజీలో అత్యధిక భాగం (సుమారు 29.6 మిలియన్ డాలర్లు) స్టాక్ ఆప్షన్స్ కింద లభించింది. 2017–18లో సత్య నాదెళ్ల 25.8 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. ‘గత ఆర్థిక సంవత్సరం కంపెనీ అత్యంత మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించింది. దీనికి సత్య నాదెళ్ల సారథ్యం, కస్టమర్ల విశ్వాసం చూరగొనడానికి ఆయన చేసిన కృషి, కంపెనీలో ప్రవేశపెట్టిన కొత్త మార్పులు, కొంగొత్త టెక్నాలజీలు.. మార్కెట్లలోకి కార్యకలాపాలను విస్తరించడం వంటి అంశాలు తోడ్పడ్డాయి‘ అని మైక్రోసాఫ్ట్ తెలిపింది. హైదరాబాదీ అయిన సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
ఆల్‌టైమ్ హై రికార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు ముగియక ముందే రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.3 వేల కోట్లు దాటిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి ఆరు నెలల్లో రూ.2 వేల కోట్ల లోపు ఆదాయానికే పరిమితమైన రిజి్రస్టేషన్ల ఆదాయం ఈ ఏడాది ఆల్‌టైమ్ హై రికార్డుతో రూ.3,118 కోట్లకు చేరింది. ఆరు నెలలు ముగిసేందుకు మరో వారం రోజుల గడువు మిగిలి ఉండగానే ఈ రికార్డు సాధించడం గమనార్హం. ముఖ్యంగా సెపె్టంబర్ మాసం దుమ్మురేపుతోంది. ఈ నెలలో ఇప్పటివరకు ఆదాయం రూ.398 కోట్లు దాటిపోయింది. ఈ నెల 13కి రాష్ట్ర మొత్తం ఆదాయం రూ.2,951 కోట్ల పైచిలుకు ఉండగా, 25కి అది రూ.3,118 కోట్లకు చేరింది. మొత్తం 12 రోజుల్లో (రెండు ఆదివారాలు, వినా యక నిమజ్జనం) సెలవులు పోను 9 రోజుల్లోనే రూ.167 కోట్ల ఆదాయం వచి్చంది. సగటున రోజుకు రూ.20 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా, 5 వేలకు పైగా డాక్యుమెంట్లు రిజి్రస్టేషన్లు జరుగుతున్నాయని స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రిజి్రస్టేషన్ జిల్లాల వారీగా పరిశీలిస్తే రాష్ట్రం మొత్తం ఆదాయంలో సగం రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచే వస్తోంది. యాదాద్రి జిల్లాలోనూ ఈ ఏడాది ఇప్పటివరకు రూ.70 కోట్లకు పైగా ఆదాయం వచి్చంది. రిజిస్ట్రేషన్ల ఆదాయం తక్కువ ఉన్న జిల్లాల్లో కొమురం భీం, జయశంకర్, భద్రాద్రి జిల్లాలున్నాయి. -
భెల్ నష్టాలు రూ.219 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ భెల్ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.219 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. గత క్యూ1లో రూ.40 కోట్ల నికర లాభం ఆర్జించామని భెల్ తెలిపింది. ఆదాయం తక్కువగా ఉండటంతో ఈ క్యూ1లో నష్టాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.6,116 కోట్ల నుంచి రూ.4,673 కోట్లకు తగ్గిందని పేర్కొంది. విద్యుత్తు విభాగం ఆదాయం రూ.4,636 కోట్ల నుంచి రూ.3,492 కోట్లకు, ఇండస్ట్రీ సెగ్మెంట్ ఆదాయం రూ.1,161 కోట్ల నుంచి రూ.920 కోట్లకు తగ్గాయని భెల్ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో భెల్ షేర్ 2 శాతం నష్టంతో రూ.57 వద్ద ముగిసింది. -
10 శాతం పెరిగిన టైటాన్ లాభం
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో 10 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.328 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.364 కోట్లకు పెరిగిందని టైటాన్ తెలిపింది. నికర అమ్మకాలు రూ.4,407 కోట్ల నుంచి 16 శాతం వృద్ధితో రూ.5,095 కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.4,020 కోట్ల నుంచి 17 శాతం పెరిగి రూ.4,687 కోట్లకు చేరాయని కంపెనీ వివరించింది. ఆభరణాల ఆదాయం రూ.4,164 కోట్లు.... వాచ్‌ల విభాగం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.716 కోట్లకు, జ్యూయలరీ విభాగం ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.4,164 కోట్లకు, కళ్లజోళ్ల విభాగం ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.1,32 కోట్లకు పెరిగాయని టైటాన్ తెలిపింది. నిర్వహణ లాభం 14 శాతం వృద్ధితో రూ.565 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇన నిర్వహణ లాభ మార్జిన్లో పెద్దగా పురోగతి లేకుండా 11.4 శాతంగానే ఉంది. ఇతర ఆదాయం రూ.56 కోట్లుగా ఉండగా, వడ్డీ వ్యయాలు రూ.68 కోట్లని తెలిపింది. ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండటం, వినియోగం మందగమనంగా ఉండటంతో కొన్ని విభాగాలపై ప్రభావం పడిందిన కంపెనీ ఎమ్డీ భాస్కర్ భట్ వ్యాఖ్యానించారు. పెళ్లిళ్లు, ప్రత్యేక ఆభరణాల కలెక్షన్ల కారణంగా ఆభరణాల విభాగం మంచి వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టైటాన్ కంపెనీ షేర్ 0.2 శాతం లాభంతో రూ.1,038 వద్ద ముగిసింది. -
ఇండియన్ బ్యాంక్ 75% వృద్ధి
చెన్నై: ప్రభుత్వరంగ ఇండియన్‌బ్యాంకు జూన్ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. బ్యాంకు లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.209 కోట్లతో పోలిస్తే 75 శాతం పెరిగి రూ.366 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం కూడా రూ.5,132 కోట్ల నుంచి రూ.5,832 కోట్లకు వృద్ధి చెందింది. జూన్ త్రైమాసికంలో తాజాగా రూ.1,035 కోట్లు మొండి బకాయిలుగా మారాయి. అన్ని విభాగాల్లోనూ మెరుగైన వృద్ధి నమోదు చేసినట్టు ఇండియన్ బ్యాంకు ఎండీ, సీఈవో పద్మజ చుండూరు పేర్కొన్నారు. ‘‘తాజా ఎన్పీఏలకు కళ్లెం వేయడం వల్ల నికర లాభంలో 74.5 శాతం వృద్ధి నమోదైంది. తిరిగి గాడిలో పడ్డాం. ఒత్తిడిలోని రుణాలు ఎన్పీఏలుగా మారకుండా చర్యలు తీసుకుంటున్నాం’’ అని పద్మజ తెలిపారు. రానున్న త్రైమాసికాల్లో తాజా ఎన్పీఏలను రూ.800–900 కోట్లకు కట్టడి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్టు ఆమె తెలిపారు. ‘‘రిటైల్, వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యత తరహా విభాగాల్లో (ఎంఎస్ఎంఈ) వృద్ధి నెలకొంది. రిటైల్‌లో 25 శాతం, వ్యవసాయంలో 25 శాతం, ఎంఎస్ఎంఈ విభాగంలో 10 శాతం వృద్ధి సాధించాం. మొత్తం మీద క్యాపిటల్ అడెక్వసీ రేషియో 13.62 శాతంగా ఉంది. ఇది మాకు మరింత సౌకర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తోంది’’ అని పద్మజ వివరించారు. మొబైల్ బ్యాంకింగ్‌లో లావాదేవీల్లో 300 శాతం వృద్ధి నమోదైనట్టు ఆమె చెప్పారు. -
ఎయిర్టెల్ నష్టాలు 2,856 కోట్లు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.2,866 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. దాదాపు 14 సంవత్సరాల తర్వాత తమకు వచ్చిన తొలి నష్టం ఇదని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. గత క్యూ1లో రూ.97 కోట్ల నికర లాభం, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.107 కోట్లు చొప్పున నికర లాభాలు వచ్చాయని పేర్కొంది. రిలయన్స్ జియోతో తీవ్రమైన పోటీ, 3జీ నెట్వర్క్ తరుగుదల వ్యయాలు, భారీగా పన్ను వంటి అసాధారణ అంశాలతో ఈ క్యూ1లో ఈ స్థాయి లో నష్టాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.19,799 కోట్ల నుంచి 5% వృద్ధితో రూ.20,738 కోట్లకు పెరిగిందని పేర్కొంది. భారత్‌లో ఆదాయం 3%, ఆఫ్రికాలో ఆదాయం 10% చొప్పున పెరిగాయని వివరించింది. 94 శాతం పెరిగిన డేటా ట్రాఫిక్.. మొబైల్ కంపెనీల కీలక పనితీరు అంశాల్లో ఒకటైన ఒక్కో వినియోగదారుడిపై లభించే సగటు ఆదాయం(ఏఆర్పీయూ–యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) స్వల్పంగా పెరిగింది. గత క్యూ1లో రూ.123 గా ఉన్న ఏఆర్పీయూ ఈ క్యూ1లో రూ.129కు పెరిగిందని ఎయిర్టెల్ పేర్కొంది. మొబైల్ డేటా ట్రాఫిక్ 94 శాతం పెరిగిందని తెలిపింది. రూ. 8,493 కోట్ల నిర్వహణ లాభం సాధించామని, నిర్వహణ మార్జిన్ 6 శాతం పెరిగి 41 శాతానికి చేరిందని పేర్కొంది. ఈ క్యూ1 ఫలితాలు ఆరోగ్యకరంగా ఉన్నాయని కంపెనీ ఎమ్డీ, సీఈఓ(ఇండియా అండ్ సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ చెప్పారు. అన్ని వ్యాపారాల్లో సమ వృద్ధి సాధించామని తెలిపారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో ఎయిర్టెల్ షేర్ 4 శాతం నష్టంతో రూ.324 వద్ద ముగిసింది. -
ఐఓసీ లాభం 47 శాతం డౌన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 47 శాతం క్షీణించింది. గత క్యూ1లో రూ.7,092 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.3,738 కోట్లకు తగ్గిందని ఐఓసీ చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ఒక్కో షేర్ పరంగా చూస్తే, నికర లాభం రూ.7.48 నుంచి రూ.4.07కు తగ్గిందని పేర్కొన్నారు. రిఫైనరీ మార్జిన్లు, ఇన్వెంటరీ లాభాలు తగ్గడం వల్ల నికర లాభం కూడా తగ్గిందని వివరించారు. గత క్యూ1లో రూ.7,065 కోట్లుగా ఉన్న ఇన్వెంటరీ లాభాలు ఈ క్యూ1లో రూ.2,362 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఆదాయంలో పెద్దగా మార్పు లేదని, రూ.1.53 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. సగానికి పైగా తగ్గిన జీఆర్ఎమ్..... ఒక్కో బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చినందువల్ల వచ్చే స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎమ్) 4.69 డాలర్లకు తగ్గిందని, గత క్యూ1లో ఈ జీఆర్ఎమ్ 10.21 డాలర్లని సంజీవ్ సింగ్ పేర్కొన్నారు. కాగా గత క్యూ1లో రూ.1,805 కోట్ల విదేశీ మారక ద్రవ్య నష్టాలు రాగా ఈ క్యూ1లో రూ.92 కోట్ల విదేశీ మారక ద్రవ్య లాభాలు వచ్చాయని చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐఓసీ షేర్ 4.3% లాభంతో రూ. 139 వద్ద ముగిసింది. -
ఐషర్ మోటార్స్ లాభం 22% డౌన్
న్యూఢిల్లీ: ఐషర్ మోటార్స్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.452 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో ఆర్జించిన నికర లాభం రూ.576 కోట్లతో పోల్చితే 22 శాతం క్షీణించిందని ఐషర్ మోటార్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,548 కోట్ల నుంచి 7% తగ్గి రూ.2,382 కోట్లకు చేరిందని కంపెనీ ఎమ్డీ సిద్ధార్థ లాల్ తెలిపారు. గత క్యూ1లో 2.25 లక్షలు అమ్ముడైన రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు ఈ క్యూ1లో 19 శాతం క్షీణించి 1.81 లక్షలకు తగ్గాయని పేర్కొన్నారు. బీఎస్ సిక్స్ నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుండటంతో ముందస్తు కొనుగోళ్లు జరిగే అవకాశాలుండటం, పండుగల సీజన్ కానుండటంతో ఈ సెప్టెంబర్ నుంచి అమ్మకాలు పుంజుకోగలవన్న ఆశాభావాన్నివ్యక్తం చేశారు. -
నెమ్మదించిన ఎనిమిది కీలక రంగాలు
న్యూఢిల్లీ: మౌలిక విభాగంగా పేర్కొనే ఎనిమిది కీలక పారిశ్రామిక రంగాల గ్రూప్ పనితీరు జూన్‌లో పేలవంగా ఉంది. వృద్ధి రేటు (2018 జూన్ ఉత్పత్తితో పోల్చి) కేవలం 0.2 శాతంగా నమోదయ్యింది. చమురు, సిమెంట్ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలోకి జారడం దీనికి ప్రధాన కారణం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 40.27 శాతం. మే గణాంకాలను సైతం దిగువముఖంగా సవరించడం గమనార్హం. మే నెల వృద్ధి శాతాన్ని 5.1 శాతం నుంచి 4.3 శాతానికి కుదించడం జరిగింది. బుధవారం వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం జూన్‌లో ఎనిమిది రంగాల పనితీరునూ చూస్తే... క్షీణతలో 4... ♦ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో వృద్ధిలేకపోగా 6.8 శాతం క్షీణత (మైనస్) నమోదయ్యింది. ♦ రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తి రేటు –9.3 శాతం క్షీణించింది. ♦ సిమెంట్ రంగం కూడా 1.5 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. ♦ సహజ వాయువుల విభాగంలో కూడా –2.1 శాతం క్షీణత నమోదయ్యింది. వృద్ధిలో 4 ♦ స్టీల్ పరిశ్రమ 6.9 శాతం వృద్ధిని సాధించింది. ♦ విద్యుత్ ఉత్పత్తిలో వృద్ధి రేటు 7.3 శాతం. ♦ ఎరువుల రంగంలో కేవలం 1.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ఏప్రిల్, మే నెలల్లో ఈ రంగాల్లో ప్రతికూల వృద్ధి నమోదయిన సంగతి తెలిసిందే. ♦ బొగ్గు ఉత్పత్తిలో 3.2 శాతం వృద్ధి నమోదయ్యింది. -
ఐసీఐసీఐ లాభం 1,908 కోట్లు
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ జూన్ త్రైమాసికంలో స్టాండెలోన్ ప్రాతిపదికన రూ.1,908 కోట్ల నికర లాభాన్ని శనివారం ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 120 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. ఈ బ్యాంక్ లాభాలు రూ.1,350 కోట్లు–రూ.2,150 కోట్ల మధ్య ఉంటుందని విశ్లేషకులు అంచనా వేసిన విషయం తెలిసిందే. బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 18,574 కోట్ల నుంచి రూ. 21,405 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ ఐఐ) 27 శాతం (ఏడాది నుంచి ఏడాదికి) పెరిగి రూ.7,737 కోట్లుగా నమోదయ్యింది. ఈ ఎన్ ఐఐలో ఆదాయపు పన్ను వాపసుపై వచ్చిన వడ్డీ రూ.184 కోట్లు కూడా ఉన్నాయి. ఎన్ఐఐ ఆదాయం బ్రోకరేజీ సంస్థల అంచనాల కంటే బాగుండడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంకు నికరలాభం రూ. 5 కోట్ల నుంచి రూ. 2,514 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం రూ. 27,174 కోట్ల నుంచి రూ. 33,869 కోట్లకు పెరిగింది. ♦ వడ్డీయేతర ఆదాయం (ట్రెజరీ ఆదాయాన్ని మినహాయించి) రూ .3,247 కోట్లకు పెరిగిందని, ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,085 కోట్ల కంటే ఎక్కువని బ్యాంక్ పేర్కొంది. ఈ బ్యాంక్ కేటాయింపులు గత ఏడాది జూన్ త్రైమాసికంలో రూ.5,971 కోట్లుండగా ఇప్పుడు రూ.3,496 కోట్లకు తగ్గాయి. ఈ త్రైమాసికంలో స్థూలంగా రూ.2,779 కోట్లు ఎన్పీఏలు జతయ్యాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఎన్పీఏలు రూ.4,036 కోట్లకు పెరగ్గా, ఇప్పుడు తగ్గడం గమనార్హం. నిరర్ధక రుణా ల రికవరీలు రూ.931 కోట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికంలో 6.70 శాతంగా ఉన్న స్థూల ఎన్ పీఏలు ఈ త్రైమాసికం నాటికి 6.49 శాతానికి తగ్గాయి. గత ఏడాది జూన్ క్వార్టర్లో స్థూల ఎన్పీఏలు 8.81 శాతంగా ఉండడం తెలిసిందే. నికర ఎన్పీఏలు కూడా మార్చి త్రైమాసికంలో 2.06 శాతం ఉండగా, ఈ త్రైమాసికంలో 1.77 శాతానికి తగ్గాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నికర ఎన్పీఏలు 4.19 శాతంగా ఉన్నాయి. కాగా, ఈ జూన్ త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.19 శాతం నుంచి 3.61 శాతానికి పెరిగింది. -
తగ్గిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నష్టాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా తగ్గాయి. గత క్యూ1లో రూ.919 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.342 కోట్లకు తగ్గాయని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) తెలిపింది. రుణాల రికవరీ బావుండటం, కేటాయింపులు తగ్గడంతో నష్టాలు కూడా తగ్గాయని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.5,327 కోట్ల నుంచి 6 శాతం తగ్గి రూ.5,006 కోట్లకు చేరిందని తెలిపింది. వడ్డీ ఆదాయం 2 శాతం వృద్ధితో రూ.4,336 కోట్లకు పెరగ్గా, ఇతర ఆదాయం మాత్రం 38 శాతం తగ్గి రూ.670 కోట్లకు పరిమితమైందని పేర్కొంది. తగ్గినా, అధికంగానే మొండి బకాయిలు.... మొండి బకాయిలు గణనీయంగానే తగ్గినా, అధిక స్థాయిల్లోనే ఉన్నాయి. గత క్యూ1లో 25.64 శాతం(రూ.38,146 కోట్లు)గా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 22.53 శాతాని(రూ.33,262 కోట్ల)కి తగ్గాయని ఐఓబీ తెలిపింది. నికర మొండి బకాయిలు 15.10 శాతం(రూ.19,642 కోట్లు)నుంచి 11.04 శాతాని(రూ.14,174 కోట్లు)కి తగ్గాయని పేర్కొంది. మొండి బకాయిలు తగ్గడంతో మొండి బకాయిలకు కేటాయింపులు రూ.2,051 కోట్ల నుంచి రూ.1,170 కోట్లకు తగ్గాయని వివరించింది. రుణ రికవరీలు రూ.3,389 కోట్ల నుంచి రూ.2,238 కోట్లకు తగ్గాయని తెలిపింది. ఇక తాజా మొండి బకాయిలు రూ.2,050 కోట్లకు పరిమితమయ్యాయని వివరించింది. తాజా మొండి బకాయిలు కన్నా రికవరీలు అధికంగా ఉన్నాయని తెలిపింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి మొత్తం డిపాజిట్లు రూ.2.21 లక్షల కోట్లకు, రుణాలు రూ.1.47 లక్షల కోట్లకు, మొత్తం వ్యాపారం రూ.3.69 లక్షల కోట్లకు చేరాయని ఐఓబీ తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 0.7 శాతం లాభంతో రూ.11.80 వద్ద ముగిసింది. -
హెచ్‌యూఎల్ లాభం రూ.1,795 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.1,795 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం, రూ.1,569 కోట్లతో పోల్చితే 14 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్ తెలిపింది. అమ్మకాలు పెరగడం, మార్జిన్ల మెరుగుదల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని హెచ్‌యూఎల్ సీఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. నికర అమ్మకాలు రూ.9,616 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.10,197 కోట్లకు పెరిగాయని పేర్కొంది.విభాగాల వారీగా చూస్తే, హోమ్ కేర్ సెగ్మెంట్ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.3,464 కోట్లకు, బ్యూటీ, పర్సనల్ కేర్ విభాగం ఆదాయం 4 శాతం వృద్ధివతో రూ.4,626 కోట్లకు, ఫుడ్స్ అండ్ రిఫ్రెష్మెంట్ విభాగం 9 శాతం లాభంతో రూ.1,950 కోట్లకు పెరిగాయని రామన్ వివరించారు. మెరుగుపడిన మార్జిన్లు.... కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామని, పటిష్టమైన నియంత్రణ పద్ధతుల కారణంగా మార్జిన్లు పెరిగాయని హెచ్‌యూఎల్ సీఎండీ సంజీవ్ మెహతా పేర్కొన్నారు. జీఎస్కే కన్సూమర్స్ హెల్త్‌కేర్‌ను హెచ్‌యూఎల్‌లో విలీనం చేయడానికి వాటాదారులు ఆమోదం తెలిపారని, ఈ ఏడాది చివరికల్లా ఈ విలీనం పూర్తవ్వగలదని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హిందుస్తాన్ యూనిలివర్ షేర్ 0.8 శాతం లాభంతో రూ.1,693 వద్ద ముగిసింది. -
ఎల్ అండ్ టీ లాభం రూ.1,473 కోట్లు
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ దిగ్గజం, ఎల్ అండ్ టీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,473 కోట్ల నికర లాభం(కన్సాలిటేడెట్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం, రూ.1,215 కోట్లతో పోల్చితే 21% వృద్ధి సాధించామని ఎల్ అండ్ టీ తెలిపింది. నికర అమ్మకాలు 27,005 కోట్ల నుంచి కోట్ల నుంచి 10% వృద్ధితో రూ.29,636 కోట్లకు పెరిగాయని ఎల్అండ్టీ సీఈఓ ఆర్.శంకర్ రామన్ చెప్పారు. వ్యయాలు రూ.25,216 కోట్ల నుంచి రూ.27,365 కోట్లకు పెరిగాయని తెలిపారు. నిర్వహణ లాభం 20 శాతం అప్... మొత్తం ఆదాయంలో దాదాపు సగం ఉండే మౌలిక రంగ సెగ్మెంట్ ఆదాయం 14% ఎగసి రూ.14,038 కోట్లకు పెరిగిందని రామన్ తెలిపారు. నిర్వహణ లాభం 20 శాతం వృద్ధితో రూ.3,319 కోట్లకు పెరిగిందని, నిర్వహణ లాభ మార్జిన్ 1% పెరిగి 11.2 శాతానికి చేరిందని పేర్కొన్నారు. 11 శాతం పెరిగిన ఆర్డర్లు.... ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో తమ గ్రూప్ కంపెనీలన్నీ కలసి రూ.38,700 కోట్ల ఆర్డర్లు సాధించాయని రామన్ వెల్లడించారు. ఆర్డర్లు 11 శాతం వృద్ది చెందాయని పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది జూన్ 30 నాటికి మొత్తం ఆర్డర్లు రూ.2,94,014 కోట్లకు చేరాయని, వీటిల్లో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 21 శాతమని పేర్కొన్నారు. క్యూ2 నుంచి మైండ్‌ట్రీ..... ఈ ఏడాది జూన్ నాటికి మైండ్‌ట్రీ కంపెనీలో తమకు 28.86 శాతం వాటా ఉందని, ఈ క్వార్టర్ పూర్తయిన తర్వాత ఆ కంపెనీలో తమ వాటా 60.59 శాతానికి చేరిందని రామన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ నుంచి తమ అనుబంధ సంస్థగా మైండ్‌ట్రీ కొనసాగుతుందని వివరించారు.మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు బాగానే ఉంటాయనే అంచనాలతో బీఎస్ఈలో ఎల్ అండ్ టీ షేర్0.4% లాభంతో రూ.1,410 వద్ద ముగిసింది. -
2018–2019కు ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2019–2020 అసెస్మెంట్ ఇయర్) వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు గడవును కేంద్రం నెలపాటు పొడిగించింది. నిజానికి అకౌంట్ల ఆడిటింగ్ అవసరంలేని వేతన జీవులు, సంస్థలుసహా వ్యక్తిగత ఐటీఆర్ దాఖలుకు గడువు 2019 జూలై 31తో పూర్తి కావాల్సి ఉంది. అయితే ఆయా వర్గాలకు కొంత వెసులుబాటు లక్ష్యంగా సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్) రిటర్న్ దాఖలు గడువును ఆగస్టు 31 వరకూ పొడిగించినట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఈసారి ద్రవ్యోల్బణం 4.1 శాతం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో ద్రవ్యోల్బణం అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తగ్గించింది. ముందుగా అంచనా వేసిన దానికన్నా 0.2 శాతం తక్కువగా 4.1 శాతం స్థాయికి పరిమితం కావొచ్చని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 4.4 శాతంగా ఉండగలదని వివరించింది. రూపాయి బలపడటం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)అంచనాలు తగ్గడం తదితర అంశాలు ద్రవ్యోల్బణ తగ్గుదలకు కారణాలు కాగలవని ఏడీబీ తెలిపింది. దక్షిణాసియా ప్రాంతంలో తక్కువ ద్రవ్యోల్బణం నమోదవడంలో భారత్ ప్రధాన చోదకంగా నిలుస్తుందని ఏషియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ (ఏడీవో) 2019 అనుబంధ నివేదికలో ఏడీబీ తెలిపింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి ముందుగా భావించిన దానికన్నా 0.2 పర్సంటేజీ పాయింట్లు తక్కువగా 7 శాతానికి పరిమితం కాగలదని ఇందులో పేర్కొంది. 2019లో దక్షిణాసియా ద్రవ్యోల్బణం ముందుగా అంచనా వేసిన 4.7 శాతం కన్నా తక్కువగా 4.5 శాతం మేర నమోదు కాగలదని తెలిపింది. వివిధ అంశాల కారణంగా సరఫరా, డిమాండ్‌పై ప్రభావం చూపుతూ బ్రెంట్ క్రూడాయిల్ రేట్ల హెచ్చుతగ్గులకు లోను కావడం కొనసాగుతుందని వివరించింది. వీటితో పాటు ఇతరత్రా దేశీయ అంశాల కారణంగా 2019, 2020లో వర్ధమాన ఆసియా దేశాల్లో ద్రవ్యోల్బణం ముందుగా అంచనా వేసినట్లు 2.5 శాతం కాకుండా 2.6 శాతంగా నమోదు కావొచ్చని ఏడీబీ తెలిపింది. -
ఫార్మా వృద్ధి 11–13%
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ పరిశ్రమ 11–13 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని ఇక్రా వెల్లడించింది. దేశీయ మార్కెట్లో ఆర్యోగకర డిమాం డ్ ఇందుకు కారణమని వివరించింది. అలాగే యూఎస్ మార్కెట్లో ధరల ఒత్తిడి తగ్గడం, నూతన ఉత్పత్తుల విడుదల, ఇప్పటికే విక్రయిస్తున్న మందుల విషయంలో కంపెనీల వాటా పెరగడం వంటి అంశాలు పరిశ్రమను నడిపిస్తాయని తెలిపింది. ధరల నియంత్రణ, జనరిక్స్ తప్పనిసరి చేయడం, తయారీ కేంద్రాలపై యూఎస్ఎఫ్డీఏ తనిఖీల వంటి రెగ్యులేటరీ పరమైన జోక్యం వృద్ధి ని పరిమితం చేస్తాయని అభిప్రాయపడింది. 21 కంపెనీల ఆధారంగా ఇక్రా ఈ నివేదికను రూపొం దించింది. 2018–19లో భారత ఫార్మా ఇండస్ట్రీ వృద్ధి 12 శాతంగా ఉంది. 2018–19లో డాలరుతో పోలిస్తే రూపాయి 8.4 శాతం పతనం కంపెనీల యూఎస్ మార్కెట్ వాటా వృద్ధికి తోడ్పడింది. యూఎస్ మార్కెట్లో ఇలా.. ఇక్రా ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ధరల ఒత్తిడి స్థిరంగా ఉండడం, ప్రత్యేక ఉత్పత్తులు, తక్కువ పోటీ ఉన్న ఔషధాల విడుదల, కొనుగోలు చేసిన వ్యాపారాల కన్సాలిడేషన్ వంటివి భారతీయ కంపెనీల యూఎస్ మార్కెట్ వాటా వృద్ధికి దోహదం చేసే అంశాలు. యూఎస్‌లో ఏఎన్‌డీఏ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేసిన అరబిందో, డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌మార్క్ తదితర కంపెనీలు రానున్న రోజుల్లో వృద్ధికి కారణం కానున్నాయి. 2019 జనవరి–మార్చిలో యూరప్, యూఎస్ విపణి మద్దతుతో భారత ఫార్మా ఇండస్ట్రీ ఆదాయం వృద్ధి 11.8%గా నమోదైంది. యూఎస్ విషయంలో ఇది 21.2 శాతంగా ఉందని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ జైన్ తెలిపారు. కొన్ని సంస్థల ఆదాయం తగ్గినప్పటికీ యూరప్ వృద్ధి 18.8 శాతంగా ఉంది. గత దశాబ్దంతో పోలిస్తే భారత కంపెనీలు ఔషధాల అభివృద్ధి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకున్నాయి. దీంతో అభివృద్ధి చెందిన మార్కెట్లలో కొత్త అవకాశాలను అందుకునేలా చేస్తోంది. ప్రత్యేక ఔషధాలపై ఫోకస్.. గతంతో పోలిస్తే పలు భారతీయ కంపెనీలు ఆర్అండ్డీలో పెట్టుబడులను పెంచాయి. 2010–11లో ఆర్అండ్డీ వ్యయం అమ్మకాల్లో 5.9% ఉంటే, 2016–17 వచ్చేసరికి ఇది 9%కి వచ్చి చేరింది. 2017–18లో 8.8%, గత ఆర్థిక సంవత్సరంలో 7.8%గా ఉన్నట్టు ఇక్రా వివరించింది. నియంత్రిత మార్కెట్లు, ఇంజెక్టేబుల్స్, ఇన్హేలర్స్, డెర్మటాలజీ, బయో సిమిలర్లపై కంపెనీల ఫోకస్‌తో ఆర్అండ్డీ వ్యయాలు 7.5–8% ఉంటాయని అంచనా వేసింది. ఇక ప్రత్యేక ఔషధాలు, మాలిక్యూల్స్, క్లిష్ట చికిత్సలకు అవసరమయ్యే మందుల తయారీపై భారత కంపెనీలు దృష్టిపెట్టాయి. ధరల ఒత్తిడి, ఏఎన్‌డీఏ అనుమతులు వేగంగా రావడంతో నెలకొన్న పోటీ, ఊహించినదాని కంటే తక్కువ ఆదాయ వృద్ధి వంటి యూఎస్ మార్కెట్లో ఉన్న పరిస్థితులనుబట్టే భారత కంపెనీలు తమ దృక్పథాన్ని మార్చుకున్నాయి. సులువుగా తయారు చేయగలిగే ఉత్పత్తులు, ఎక్కువ కంపెనీలు పోటీ పడుతు న్న సాధారణ జనరిక్స్ అభివృధ్ది నుంచి వైదొలగడంతోపాటు క్లిష్ట జనరిక్స్, ప్రత్యేక ప్రొడక్టులపై భారత ఫార్మా సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. -
వచ్చే మూడేళ్లూ 7.5 శాతమే
వాషింగ్టన్: భారత వృద్ధి రేటు విషయంలో తన అంచనాలకు కట్టుబడి ఉన్నట్లు ప్రపంచబ్యాంకు స్పష్టంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) సహా వచ్చే మూడేళ్లూ భారత జీడీపీ వృద్ధి 7.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. దీంతో 2019–20 సంవత్సరానికి భారత వృద్ధి రేటు 7.5 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను కొనసాగించినట్టయింది. ఇదే రేటును తదుపరి మూడేళ్లూ కొనసాగించవచ్చని తెలియజేసింది. పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం బలంగా ఉండడం వృద్ధి రేటుకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి మన దేశ జీడీపీ రేటు 6.8 శాతంగా ఉంటుందన్న అంచనాను కేంద్ర గణాంక శాఖ ఇటీవల పేర్కొనగా, ప్రపంచ బ్యాంకు మాత్రం 7.2 శాతంగా ఉంటుందని తెలిపింది. పొరుగు దేశం చైనా 2018లో 6.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయగా, 2019లో 6.2 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఇక 2020లో 6.1 శాతం, 2021లో 6 శాతంగా ఉంటాయని పేర్కొంది. దీంతో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపును కొనసాగించనుంది. 2021 నాటికి భారత వృద్ధి రేటు చైనా 6 శాతం కంటే ఒకటిన్నర శాతం ఎక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. మానిటరీ పాలసీ అనుకూలం... ‘‘ఆర్బీఐ లక్ష్యానికి దిగువనే ద్రవ్యోల్బణం ఉండడంతో మరింత సర్దుబాటుతో కూడిన మానిటరీ పాలసీ మధ్య... ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు అన్నవి రుణాల వృద్ధి బలపడడం వల్ల ప్రయోజనం పొందుతాయి’’ అని ప్రపంచ బ్యాంకు తన తాజా నివేదికలో వివరించింది. పట్టణ ప్రాంత వినియోగానికి రుణాల్లో వృద్ధి పుంజుకోవడం మద్దతుగా ఉంటుందని పేర్కొంది. గ్రామీణ ప్రాంత వినియోగానికి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండటం ఆటంకంగా విశ్లేషించింది. తయారీ రంగంలో అంతటా బలమైన వృద్ధి ఉన్నట్టు తెలిపింది. సేవల రంగం చల్లబడడానికి ప్రధానంగా వాణిజ్యం, హోటల్, రవాణా, కమ్యూనికేషన్ రంగాల కార్యకలాపాలు నిదానించడమేనని పేర్కొంది. జీఎస్టీ ఇంకా పూర్తి స్థాయిలో సర్దుకోవాల్సి ఉందని నివేదిక అభిప్రాయపడింది. -
జేకే లక్ష్మీ సిమెంట్ లాభం రూ.43 కోట్లు
న్యూఢిల్లీ: జేకే లక్ష్మీ సిమెంట్ నికర లాభం మార్చి క్వార్టర్లో 28 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.34 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.43 కోట్లకు పెరిగిందని జేకే లక్ష్మీ సిమెంట్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.923 కోట్ల నుంచి 29 శాతం వృద్ధితో రూ.1,189 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు 75 పైసలు డివిడెండ్‌గా ఇవ్వనున్నామని తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరం ç 2017–18లో రూ.84 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం తగ్గి రూ.80 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.3,583 కోట్ల నుంచి 10% పెరిగి రూ.3,939 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేర్ 1.6 శాతం లాభంతో రూ.372 వద్ద ముగిసింది. -
నాలుగు రెట్లు పెరిగిన బజాజ్ ఎలక్ట్రికల్స్ లాభం
న్యూఢిల్లీ: బజాజ్ ఎలక్ట్రికల్స్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19)మార్చి క్వార్టర్లో నాలుగు రెట్లు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.7 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.29 కోట్లకు పెరిగిందని బజాజ్ ఎలక్ట్రికల్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,606 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.1,773 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ శేఖర్ బజాజ్ చెప్పారు. మొత్తం వ్యయాలు రూ.1,496 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.1,755 కోట్లకు పెరిగాయని వివరించారు. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.3.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. స్థూల లాభంలో ఎలాంటి వృద్ధి లేదని నిర్వహణ లాభం రూ.38 కోట్ల నుంచి 22 శాతం వృద్ధితో రూ.46 కోట్లకు పెరిగిందని వివరించారు. రెట్టింపైన ఏడాది లాభం.... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.84 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రెండు రెట్లు పెరిగి రూ.167 కోట్లకు పెరిగిందని శేఖర్ బజాజ్ చెప్పారు. మొత్తం అమ్మకాలు రూ.4,716 కోట్ల నుంచి 41 శాతం పెరిగి రూ.6,673 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. రాజీవ్ బజాజ్‌ను అదనపు డైరెక్టర్‌గా నియమించామని, ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బజాజ్ ఎలక్ట్రికల్స్ షేర్ 2 శాతం నష్టంతో రూ.550 వద్ద ముగిసింది. -
డీఎల్ఎఫ్ లాభం 76% అప్
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో క్వార్టర్లో 76 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.248 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.437 కోట్లకు పెరిగిందని డీఎల్ఎఫ్ తెలిపింది. అమ్మకాల బుకింగ్స్ దాదాపు రెట్టింపై రూ.2,435 కోట్లకు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.1,846 కోట్ల నుంచి రూ.2,661 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఏడాది లాభం.. రూ.1,319 కోట్లు.... పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.4,464 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,319 కోట్లకు తగ్గిందని డీఎల్ఎఫ్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రెంటల్ ఆదాయాన్ని విక్రయించడం వల్ల అప్పుడు విశేషమైన లాభాలు వచ్చాయని, దీంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.7,664 కోట్ల నుంచి రూ.9,029 కోట్లకు పెరిగిందని తెలిపింది. నికర అమ్మకాలు రూ.1,000 కోట్ల నుంచి రూ.2,435 కోట్లకు పెరిగాయని పేర్కొంది. రెసిడెన్షియల్ సెగ్మెంట్లో అమ్మకాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయని వివరించింది. ప్రీమియమ్, లగ్జరీ సెగ్మెంట్లలో నివసించడానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లను విక్రయించడం ఆరంభించామని పేర్కొంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ) ద్వారా రూ.3,173 కోట్ల నిధులను విజయవంతంగా సమీకరించామని కంపెనీ తెలిపింది. ప్రమోటర్లు రూ.11,250 కోట్ల మేర పెట్టుబడులు అందించారని వివరించింది. మెరుగైన ఫలితాలతో బీఎస్ఈలో డీఎల్ఎఫ్ షేర్ 1.5% లాభంతో రూ.173 వద్ద ముగిసింది. -
62 శాతం తగ్గిన ఇండస్ఇండ్ లాభం
న్యూఢిల్లీ: ఇండస్ ఇండ్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో 62 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.953 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.360 కోట్లకు తగ్గిందని ఇండస్ఇండ్ బ్యాంక్ తెలిపింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాలకు కేటాయింపులు పెంచడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని ఈ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ రమేశ్ సోబ్తి చెప్పారు. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీలకు రూ.3,004 కోట్ల రుణాలిచ్చామన్నారు. ఈ మొత్తం రుణాలను గత క్యూ4లో మొండి బకాయిలుగా గుర్తించామని, వీటికి గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1,800 కోట్ల మేర కేటాయింపులు జరిపామని తెలియజేశారు. కేటాయింపులను కూడా పరిగణనలోకి తీసుకుంటే, నికర లాభం 25 శాతం ఎగసి ఉండేదని అంచనా. ఇక మొత్తం ఆదాయం మాత్రం రూ.5,859 కోట్ల నుంచి రూ.7,550 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,008 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.2,232 కోట్లకు, ఫీజు ఆదాయం 27 శాతం పెరుగుదలతో రూ.1,419 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం రూ.1,769 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.2,068 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 3.97 శాతం నుంచి 3.59 శాతానికి తగ్గిందని తెలిపారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.7.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు సోబ్తి తెలిపారు. 8 శాతం తగ్గిన ఏడాది లాభం... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.3,606 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 8% తగ్గి రూ.3,301 కోట్లకు పరిమితమయింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.22,031 కోట్ల నుంచి రూ.27,908 కోట్లకు ఎగసింది. గత ఏడాది మార్చి నాటికి 1.17%గా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 2.10%కి, అలాగే నికర మొండి బకాయిలు 0.51% నుంచి 1.21%కి పెరిగాయి. విలువ పరంగా చూస్తే, గత ఏడాది మార్చి నాటికి రూ.1,705 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి రూ.3,947 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.746 కోట్ల నుంచి రూ.2,248 కోట్లకు పెరిగాయి. రుణాలు 29% వృద్ధితో రూ.1,86,394 కోట్లకు, డిపాజిట్లు 29% వృద్ధితో రూ.1,94,868 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 25%గా ఉండొచ్చని సోబ్తి చెప్పారు. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాలకు మూడో వంతుకుపైగా కేటాయింపులు జరపడం, షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు కూడా జత కావడం షేరుపై సానుకూల ప్రభావాన్ని చూపించింది. బీఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 5% లాభంతో రూ.1,517 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే కావడం గమనార్హం. -
తగ్గిన బ్యాంక్ ఆఫ్ బరోడా నష్టాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం, బ్యాంక్ ఆఫ్ బరోడా నికర నష్టాలు(స్టాండ్అలోన్) గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో తగ్గాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) క్యూ4లో రూ.3,102 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.991 కోట్లకు తగ్గాయని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. కేటాయింపులు అధికంగా ఉండటం వల్ల నష్టాలు ఈ స్థాయిలో వచ్చాయని వివరించింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే మాత్రం, బ్యాంక్ నిరాశపరిచింది. గత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో ఈ బ్యాంక్‌కు రూ.471 కోట్ల నికర లాభం వచ్చింది. ఇక మొత్తం ఆదాయం రూ. 12,735 కోట్ల నుంచి రూ.15,285 కోట్లకు పెరిగింది. 11 శాతం పెరిగిన ఏడాది ఆదాయం.... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.2,432 కోట్ల నికర నష్టాలు(స్టాండ్ అలోన్)రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.433 కోట్ల నికర లాభం వచ్చింది. కన్సాలిడేటెడ్ పరంగా చూస్తే, అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.1,887 కోట్ల నికర నష్టాలు రాగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,100 కోట్ల నికర లాభం వచ్చింది. మొత్తం ఆదాయం(స్టాండ్అలోన్) 11% వృద్ధితో రూ.56,065 కోట్లకు, కన్సాలిడేటెడ్ పరంగా అయితే 13% వృద్ధితో రూ.60.793 కోట్లకు పెరిగింది. మెరుగుపడిన రుణ నాణ్యత... బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత ఏడాది మార్చి నాటికి 12.26 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 9.61 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 5.49 శాతం నుంచి 3.33 శాతానికి తగ్గాయి. విలువ పరంగా చూస్తే, నికర మొండి బకాయిలు రూ.15,609 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ.3,521 కోట్లకు చేరాయి. ఇది ఎనిమిది క్వార్టర్ల కనిష్ట స్థాయి. కేటాయింపులు రూ.7,053 కోట్ల నుంచి రూ.5,550 కోట్లకు తగ్గాయి. మొత్తం వ్యాపారం రూ.10,18,747 కోట్ల నుంచి 9 శాతం ఎగసి రూ.11,07,509 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ 0.6 శాతం లాభంతో రూ.126 వద్ద ముగిసింది. -
నిరాశపరిచిన టెక్ మహీంద్రా
న్యూఢిల్లీ: ఐటీ రంగ కంపెనీ టెక్ మహీంద్రా మార్చి త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. కంపెనీ నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతానికి పైగా క్షీణించి రూ.1,126 కోట్లకు పరిమితం అయింది. ఆదాయం మాత్రం 10 శాతం పెరిగి రూ.8,892 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.1,230 కోట్ల లాభాన్ని, రూ.8,054 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ.4,288 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 13% పెరిగి రూ.34,742 కోట్లుగా నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది. పనితీరుపై సంతృప్తి ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరం మాకు సంతృప్తిని ఇచ్చింది. మార్జిన్లు మెరుగుపడ్డాయి. డిజిటల్ పోర్ట్‌ఫోలియో వృద్ధి చెందడం, చెప్పుకోతగ్గ కాంట్రాక్టులను సొంతం చేసుకోవడం మేలు చేశాయి. కమ్యూనికేషన్ వ్యాపారం పుంజుకోవడం మాకు ఉత్సాహాన్నిచ్చింది’’ అని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య మార్చి నాటికి 1,21,082కు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో నికరంగా 8,275 మంది ఉద్యోగులు పెరిగారు. కంపెనీ యాక్టివ్ క్లయింట్ల సంఖ్య మార్చి త్రైమాసికంలో 938గా ఉంది. ‘‘ఎన్నో విభాగాల్లో నిర్వహణ పనితీరు మెరగుపడిన సంవత్సరం ఇది(2018–19). దీనివల్ల ఎబిట్డా మార్జిన్ గణనీయంగా విస్తరించింది. తగినన్ని నగదు నిల్వలు ఉండడంతో వాటాదారులకు మెరుగైన విలువను తిరిగి అందించేందుకు షేర్ల బైబ్యాక్ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం’’ అని టెక్ మహీంద్రా సీఎఫ్‌వో మనోజ్భట్ పేర్కొన్నారు. ఒక్కో షేరుపై 2019 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.14 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు టెక్‌మహీంద్రా బోర్డు నిర్ణయం తీసుకుంది. -
హెచ్‌పీసీఎల్‌కు 2,970 కోట్ల లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హెచ్‌పీసీఎల్ మార్చి త్రైమాసికానికి సంబంధించి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఇన్వెంటరీ లాభాలు, రూపాయి పెరుగుదల కలిసొచ్చాయి. వీటి ప్రభావంతో రిఫైనరీ మార్జిన్ల క్షీణత ప్రభావాన్ని కంపెనీ అధిగమించి మరీ మంచి లాభాలను నమోదు చేసింది. రూ.72,840 కోట్ల ఆదాయంపై రూ.2,970 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.66,351 కోట్ల ఆదాయంపై రూ.1,748 కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. అమ్మకాలు పెరగడం, ఇన్వెంటరీ లాభాలు, రూపాయి బలోపేతం కావడం లాభాల వృద్ధికి దోహదపడినట్టు హెచ్‌పీసీఎల్ చైర్మన్, ఎండీ ఎంకే సురానా తెలిపారు. ఇన్వెంటరీ రూపంలో రూ.916 కోట్ల లాభం గడించింది. ముడి చమురు కొనుగోలు ధర నుంచి, విక్రయించే నాటికి ధర పరంగా పెరుగుదలే ఇన్వెంటరీ లాభం. కరెన్సీ మార్పిడి రూపంలోనూ రూ.248 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ప్రతీ బ్యారెల్ చమురుపై స్థూల మార్జిన్ 7 డాలర్ల మేర ఉంది. శుద్ధి చేసి ఇంధనంగా మార్చడంపై 4.51 డాలర్ల మార్జిన్ లభించింది. పెట్రోల్ విక్రయాలు 8.5 శాతం, డీజిల్ విక్రయాలు 3 శాతం, ఎల్పీజీ విక్రయాలు 12.9 శాతం, ఏటీఎఫ్ విక్రయాలు 17 శాతం చొప్పున పెరిగాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి... ఇక 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం రూ.6,029 కోట్లకు పరిమితం అయింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.6,357 కోట్లుగా ఉండడం గమనార్హం. స్థూల రిఫైనరీ మార్జిన్ ఒక్కో బ్యారెల్‌పై అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న 7.4 డాలర్ల నుంచి 5 డాలర్లకు పరిమితమైంది. అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకుతోడు రూపాయి మారకంలో తేడాలు మార్జిన్లు తగ్గడానికి కారణంగా కంపెనీ పేర్కొంది. ఇన్వెంటరీ లాభాలు 2018–19 సంవత్సరానికి రూ.1,366 కోట్లుగా ఉన్నాయి. కరెన్సీ మారకం రూపంలో రూ.579 కోట్ల నష్టాలు వచ్చాయి. కంపెనీ రుణ భారం రూ.27,240 కోట్లకు పెరిగింది. ప్రభుత్వం నుంచి రూ.8,000 కోట్ల ఇంధన సబ్సిడీ రావాల్సి ఉంది. ఒక్కో షేరుపై రూ.9.40 చొప్పున తుది డివిడెండ్ చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. -
టాటా మోటార్స్ లాభం 49% డౌన్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కన్సాలిడేటెడ్ లాభం మార్చి త్రైమాసికంలో 49 శాతం తగ్గి రూ.1,109 కోట్లకు పరిమితం అయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,175 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే రూ.91,643 కోట్ల నుంచి రూ.87,285 కోట్లకు తగ్గింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్‌గా రూ.28,724 కోట్ల నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. ఆదాయం రూ.3,04,903 కోట్లుగా ఉంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభం రూ.9,091 కోట్లు, ఆదాయం రూ.2,96,298 కోట్లుగా ఉండడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లలో జేఎల్ఆర్ రూపంలో టాటా మోటార్స్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. టాటా మోటార్స్ స్టాండలోన్‌గా (దేశీయ వ్యాపారం) చూసుకుంటే మార్చి త్రైమాసికంలో రూ.106 కోట్ల లాభం వచ్చింది. ఆదాయం రూ.18,561 కోట్లుగా ఉంది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరంలో స్టాండలోన్‌గా రూ.2,398 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.946 కోట్ల నష్టాన్ని చవిచూడడం గమనార్హం. స్టాండలోన్ ఆదా యం రూ.58,689 కోట్ల నుంచి రూ.69,202 కోట్లకు పెరిగింది. బీఎస్ఈలో టాటా మోటార్స్ షేరు 7 శాతానికి పైగా లాభపడి రూ.190 వద్ద క్లోజయింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 44% అప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2018–19, క్యూ4)లో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం 44 శాతం ఎగిసింది. రూ. 434.4 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2017–18) ఇదే కాలంలో లాభం రూ.302.2 కోట్లు. మరోవైపు, తాజాగా నాలుగో త్రైమాసికంలో ఆదాయం 14% వృద్ధి చెందింది. రూ.3,535 కోట్ల నుంచి రూ.4,017 కోట్లకు పెరిగింది. పూర్తి ఏడాదికి గాను రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.20 తుది డివిడెండు ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా డీఆర్ఎల్ సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి ఈ విషయాలు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 20 ఔషధాలు మార్కెట్లోకి ప్రవేశపెట్టామని, ఈసారి కూడా సుమారు అదే స్థాయిలో కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమెరికాలో మూడు డెర్మటాలజీ బ్రాండ్స్ విక్రయాలకు సంబంధించి నాలుగో త్రైమాసికంలో ఎన్కోర్ డెర్మటాలజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పనితీరును గణనీయంగా మెరుగుపర్చుకోగలిగినట్లు సంస్థ సీఈవో జీవీ ప్రసాద్ తెలిపారు. నాణ్యతా ప్రమాణాలను మెరుగుపర్చుకోవడంలోనూ పురోగతి సాధించినట్లు వివరించారు. ‘రాబోయే రోజుల్లో లాభదాయక వృద్ధిని సాధించడంతో పాటు కార్యకలాపాల నిర్వహణను మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని నిర్దేశించుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా పేషంట్లకు అధిక ప్రయోజనం చేకూర్చే నూతన ఆవిష్కరణలపైనా దృష్టి పెడతాం‘ అని ప్రసాద్ చెప్పారు. సుబాక్సోన్ జనరిక్ ఔషధ విక్రయాలను నిలిపివేయాలంటూ అమెరికా కోర్టులో కేసు వేసిన ఇండీవియర్ సంస్థ.. ఒకవేళ కేసు వీగిపోయిన పక్షంలో పరిహారంగా చెల్లించేందుకు 72 మిలియన్ డాలర్ల బాండు సమర్పించినట్లు పేర్కొన్నారు. తుది తీర్పు తమకు అనుకూలంగా వచ్చిన పక్షంలో అంతకుమించి పరిహారం కోరనున్నట్లు తెలిపారు. జనరిక్స్‌కు వర్ధమాన మార్కెట్ల ఊతం.. యూరప్, వర్ధమాన మార్కెట్ల ఊతంతో గ్లోబల్ జనరిక్స్ విభాగం నాలుగో త్రైమాసికంలో మెరుగైన పనితీరు కనపర్చింది. వార్షికంగా తొమ్మిది శాతం వృద్ధితో ఆదాయం రూ. 3,038 కోట్లకు పెరిగింది. అటు కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్ కేవలం మూడు శాతం వృద్ధికి పరిమితమైంది. ఈ మార్కెట్ నుంచి క్యూ4లో ఆదాయం రూ. 1,449 కోట్ల నుంచి రూ. 1,496 కోట్లకు పెరిగింది. నాలుగో త్రైమాసికంలో కొత్తగా 5 ఉత్పత్తులను ఉత్తర అమెరికా మార్కెట్లో కంపెనీ ప్రవేశపెట్టింది. వీటిలో యాడ్సిర్కా, సయాలిస్ ప్రధానమైనవని సంస్థ తెలిపింది. భారత మార్కెట్ నుంచి క్యూ4లో ఆదాయాలు 6 శాతం పెరిగి రూ. 650 కోట్లకు, వార్షికంగా 12 శాతం వృద్ధితో రూ. 2,620 కోట్లకు పెరిగాయి వార్షికంగా రూ. 1,880 కోట్ల లాభం.. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను డీఆర్ఎల్ ఆదాయం రూ. 15,385 కోట్లు కాగా.. లాభం రూ. 1,880 కోట్లుగా నమోదైంది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, ప్రస్తుతమున్న ఉత్పత్తుల మార్కెట్ వాటా పెరగడంతో పాటు సానుకూల విదేశీ మారక రేటు తదితర అంశాలు ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి ఆదాయాలు మెరుగుపడటానికి దోహదపడినట్లు చక్రవర్తి తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలపై రూ. 1,560 కోట్లు వెచ్చించినట్లు వివరించారు. -
కార్పొరేషన్ బ్యాంకు భారీ నష్టాలు
ముంబై: ప్రభుత్వ రంగంలోని కార్పొరేషన్ బ్యాంకు మార్చి త్రైమాసికం ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. మొండి బకాయిలకు పెద్ద మొత్తంలో చేసిన కేటాయింపులతో నష్టాలు భారీగా రూ.6,581 కోట్లకు పెరిగిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలం లో వచ్చిన రూ.1,838 కోట్ల నష్టాలతో పోలిస్తే మూడున్నర రెట్లు పెరిగాయి. ఆదాయం సైతం ముందటేడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.4,642 కోట్ల నుంచి రూ.4,187 కోట్లకు తగ్గిపోయింది. స్థూల ఎన్పీఏలు మాత్రం 17.35% నుంచి 15.35%కి తగ్గాయి. ఎన్పీఏలకు మార్చి త్రైమాసికం లో బ్యాంకు రూ.8,505 కోట్లను కేటాయించింది. ఇక 2018–19 ఆర్థిక సంవత్సరానికి కార్పొరేషన్ బ్యాంకు రూ.6,325 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.4,049 కోట్ల నష్టంతో పోలిస్తే పెరిగింది. బీఎస్ఈలో షేరు ధర ఫ్లాట్‌గా రూ.25.50 వద్ద క్లోజయింది. -
ఐఓసీ నికర లాభం రూ.6,099 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.6,099 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం రూ.5,218 కోట్లతో పోలిస్తే 17 శాతం వృద్ధి సాధించామని ఐఓసీ తెలిపింది. షేర్ వారీ ఆర్జనను చూస్తే నికర లాభం రూ.5.51 నుంచి రూ.6.46కు పెరిగిందని ఐఓసీ చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. రిఫైనరీ మార్జిన్లు తక్కువగా ఉన్నా, ఇన్వెంటరీ లాభాలు, కరెన్సీ మారకంలో లాభాలు కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించారు. స్థూల రిఫైనరీ మార్జిన్ (జీఆర్ఎమ్–బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడం వల్ల వచ్చే మార్జిన్) 9.12 డాలర్ల నుంచి 4.09 డాలర్లకు తగ్గిందని తెలిపారు. టర్నోవర్ రూ.1.36 లక్షల కోట్ల నుంచి రూ.1.44 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఇన్వెంటరీ లాభాలు రూ.4,172 కోట్లు.. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.676 కోట్ల కరెన్సీ మారకం నష్టాలు రాగా, గత క్యూ4లో రూ.837 కోట్ల కరెన్సీ మారకం లాభాలు వచ్చాయని సంజీవ్ సింగ్ తెలిపారు. అయితే ఇన్వెంటరీ లాభాలు మాత్రం రూ.4,172 కోట్ల నుంచి రూ.2,655 కోట్లకు తగ్గాయని వివరించారు. ముడి చమురును ఈ కంపెనీ కొనుగోలు చేసిన ధర కంటే, ఈ చమురును ప్రాసెస్ చేసి ఇంధనంగా రిఫైనరీలకు సరఫరా చేసే సమయానికి ధర అధికంగా ఉంటే, వచ్చే లాభాలను ఇన్వెంటరీ లాభాలుగా పరిగణిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ, కిరోసిన్ సబ్సిడీలు చెల్లించడంలో జాప్యం జరుగుతుండటంతో రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని, కంపెనీ రుణభారం రూ.86,359 కోట్లకు పెరిగిందని కంపెనీ డైరెక్టర్ (ఫైనాన్స్) ఏ.కె. శర్మ తెలిపారు. కేంద్రం నుంచి వంట ఇంధనం సబ్సిడీలు రూ.19,000 కోట్లు రావలసి ఉన్నాయని వివరించారు. ఏడాది లాభం 21 శాతం డౌన్.... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.21,346 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 21 శాతం తగ్గి రూ.16,894 కోట్లకు తగ్గిందని సింగ్ తెలిపారు. టర్నోవర్ మాత్రం రూ.5.06 లక్షల కోట్ల నుంచి రూ.6.05 లక్షల కోట్లకు ఎగసిందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐఓసీ షేర్0.7 శాతం నష్టంతో రూ.150 వద్ద ముగిసింది. -
అరవింద్ లాభం రూ.67 కోట్లు
న్యూఢిల్లీ: టెక్స్టైల్స్ దిగ్గజం అరవింద్ గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.67 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.115 కోట్ల నికర లాభం వచ్చిందని అరవింద్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,863 కోట్ల నుంచి రూ.1,879 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అరవింద్ కంపెనీ నుంచి బ్రాండెడ్ దుస్తుల వ్యాపార విభాగాన్ని అరవింద్ ఫ్యాషన్స్ లిమిటెడ్ పేరుతో గత ఏడాది నవంబర్‌లో విడదీశామని (డీమెర్జ్), అందుకని అప్పటి, ఇప్పటి ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని కంపెనీ వివరించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 7–8 శాతం వృద్ధిచెందగలదన్న అంచనాలున్నాయని కంపెనీ పేర్కొంది. కంపెనీ డైరెక్టర్, గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా జయేశ్ కె. షాను నియమించామని, ఆయన ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని తెలిపింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఎన్సీడీ)ల జారీ ద్వారా రూ.300 కోట్లు సమీకరించడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అర్వింద్ షేర్ 2.6 శాతం లాభంతో రూ.74 వద్ద ముగిసింది. -
బ్యాంకుల ఫలితాలు భేష్!!
ప్రభుత్వ రంగంలోని ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ (ఓబీసీ) మార్చి క్వార్టర్‌కు రూ.201 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,650 కోట్ల నష్టాన్ని చవిచూసింది. బ్యాంకు ఆదాయం రూ.4,689 కోట్ల నుంచి రూ.5,711 కోట్లకు పెరగ్గా ఆస్తుల నాణ్యత సైతం మెరుగుపడింది. బ్యాంకు స్థూల ఎన్పీఏలు మొత్తం రుణాల్లో క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 17.63% నుంచి 12.66%కి.. నికర ఎన్పీఏలు సైతం 10.48% నుంచి 5.93%కి తగ్గాయి. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.55 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఆదాయం రూ.20,181 కోట్ల నుంచి రూ.20,537 కోట్లకు చేరింది. 2017–18లో రూ.5,872 కోట్లు, 2016–17లో రూ.1,094 కోట్ల మేర బ్యాంకు నష్టాలను చవిచూసింది. టర్న్ అరౌండ్ అయింది... ‘‘గత మూడు త్రైమాసికాలుగా లాభాలను నమోదు చేస్తున్నాం. రానున్న కాలంలోనూ లాభాలను కొనసాగిస్తాం. ముందు సంవత్సరం రూ.12,000 కోట్ల మేర ఎన్పీఏలుగా మారగా, వీటిని 7,000 కోట్లకు కట్టడి చేశాం. రూ.3,161 కోట్లకు వసూళ్లు, రుణాల అప్‌గ్రేడేషన్ రూ.6,597 కోట్లకు చేరాయి. ఇవన్నీ టర్న్ అరౌండ్‌కు కారణమయ్యాయి’’ అని ఓబీసీ ఎండీ, సీఈవో ముకేశ్‌కుమార్ జైన్ తెలిపారు. బ్యాంకు 10– 12 శాతం రుణ వృద్ధి లక్ష్యాన్ని విధించుకుంది. క్యూఐపీ లేదా ఎఫ్‌పీవో తదితర మార్గాల ద్వారా రూ.3,000 కోట్ల నిధుల సమీకరణకు నిర్ణయం తీసుకుంది. మళ్లీ లాభాల్లోకి యునైటెడ్ బ్యాంకు ప్రభుత్వ రంగ యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సైతం ఏడు త్రైమాసికాల నష్టాల తర్వాత మార్చి క్వార్టర్లో తిరిగి లాభాలు నమోదుచేసింది. రూ.95 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.260 కోట్ల నష్టాన్ని చవిచూడడం గమనార్హం. ఆదాయం రూ.2,635 కోట్ల నుంచి రూ.2,948 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం రూ.540 కోట్లుగా, నికర వడ్డీ మార్జిన్ 2.43 శాతంగా ఉన్నా యి. నికర వడ్డీ ఆదాయం కిందటేడాది ఇదే కాలం లో రూ.1,493 కోట్లుగా ఉండగా, అది రూ.1,975 కోట్లకు పెరిగింది. బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 24 శాతం నుంచి 16.48 శాతానికి, నికర ఎన్పీఏలు 16.49 శాతం నుంచి 8.67 శాతానికి తగ్గాయి. మార్చి నాటికి రూ.2 లక్షల కోట్ల వ్యాపార మైలురాయిని అధిగమించినట్టు యునైటెడ్ బ్యాంకు తెలిపింది. క్యూఐపీ ద్వారా రూ.1,500 కోట్ల నిధుల సమీకరణకు నిర్ణయం తీసుకుంది. ఆరు రెట్లు పెరిగిన కర్ణాటక బ్యాంకు లాభం మార్చి త్రైమాసికంలో రూ.61 కోట్లు కర్ణాటక బ్యాంకు లాభం మార్చి త్రైమాసికంలో ఆరు రెట్లు పెరిగి రూ.61.73 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.11 కోట్లుగా ఉంది. అయితే, డిసెంబర్ త్రైమాసికంలో లాభం రూ.140 కోట్లతో పోలిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గింది. బ్యాంకు ఆదాయం 5% వృద్ధితో రూ.1,737 కోట్ల నుంచి రూ.1,821 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 11 శాతానికి పైగా క్షీణించి రూ.480 కోట్లకు పరిమితం అయింది. నికర వడ్డీ మార్జిన్ 3.54 శాతం నుంచి 2.87 శాతానికి తగ్గింది. స్థూల ఎన్పీఏలు 4.92% నుంచి 4.41%కి, నికర ఎన్పీఏలు 2.96 శాతం నుంచి 2.95 శాతానికి తగ్గినట్టు బ్యాంకు తెలిపింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం 46% వృద్ధితో రూ.477 కోట్లకు చేరింది. బ్యాంకు చరిత్రలో ఓ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభం ఇదే. ఒక్కో షేరుకు రూ.3.50 డివిడెండ్‌ను బోర్డు సిఫారు చేసింది. -
వొడాఫోన్ ఐడియా నష్టం 4,882 కోట్లు
న్యూఢిల్లీ: దేశీ టెలికం మార్కెట్లో టారిఫ్‌ల పరంగా తీవ్రమైన పోటీ నేపథ్యంలో టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారీ నష్టాలు నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.4,882 కోట్ల నష్టం ప్రకటించింది. సీక్వెన్షియల్‌గా చూస్తే మూడో క్వార్టర్లో నమోదైన రూ.5,005 కోట్లతో పోలిస్తే మాత్రం కొంత తగ్గింది. వొడాఫోన్, ఐడియా సంస్థలు గతేడాది ఆగస్టులో విలీనం కావడంతో అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో ఫలితాలను పోల్చి చూడటానికి లేదు. 2018–19 మూడో త్రైమాసికంలో ఆదాయం రూ. 11,765 కోట్లు కాగా, నాలుగో త్రైమాసికంలో దాదాపు అదే స్థాయిలో రూ.11,775 కోట్లుగా నమోదైంది. విలీనానంతరం అమలు చేస్తున్న నిర్ణయాలు క్రమంగా సానుకూల ఫలితాలిస్తున్నాయని, రెండేళ్లలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలమని వొడాఫోన్ ఐడియా సీఈవో బాలేష్ శర్మ చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 37,092 కోట్లు కాగా, నష్టం రూ. 14,604 కోట్లు. ఒక్కో యూజరుపై సగటు ఆదాయం సీక్వెన్షియల్‌గా చూస్తే 16.3 శాతం పెరిగి రూ.104కి చేరింది. క్యూ3లో ఇది రూ.89గా ఉంది. సంస్థ ఆర్థిక ఫలితాలు మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడయ్యాయి. సోమవారం బీఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేరు 3% పెరిగి రూ.14.45 వద్ద క్లోజయ్యింది. -
ఐటీసీ లాభం 19 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ కంపెనీ ఐటీసీ మార్చి త్రైమాసికానికి రూ.3,482 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో లాభం రూ.2,932 కోట్లతో పోలిస్తే 19 శాతం పెరిగింది. ఇక ఆదాయం రూ.11,329 కోట్ల నుంచి 14 శాతం పెరిగి రూ.12,933 కోట్లకు చేరింది. పేపర్ బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్, హోటల్స్, ఎఫ్ఎంసీజీ వ్యాపారాల పనితీరు బలంగా ఉండటమే మెరుగైన ఫలితాలకు కారణం. అధిక పన్నుల కారణంగా సిగరెట్ల విభాగంపై ఒత్తిళ్లు కొనసాగినట్టు కంపెనీ తెలిపింది. సిగరెట్ల విభాగం వారీగా రూ.2,932 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆయిల్ సీడ్స్, గోధుమ, కాఫీ, అగ్రి వ్యాపారాల్లో స్థూల ఆదాయం అధికంగా నమోదైనట్టు కంపెనీ తెలిపింది. పేపర్ బోర్డ్స్ విభాగంలో అధిక అమ్మకాల ఆదాయం, హోటల్స్ వ్యాపారంలో రూమ్ వారీగా ఆదాయంలోనూ మెరుగుదల ఉందని పేర్కొంది. రాణించిన అన్ని విభాగాలు సిగరెట్లు సహా మొత్తం ఎఫ్ఎంసీజీ ఆదాయం మార్చి త్రైమాసికంలో రూ.8,759 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.7,988 కోట్లు కావడం గమనార్హం. సిగరెట్ల విభాగం ద్వారా ఆదాయం రూ.4,936 కోట్ల నుంచి రూ.5,486 కోట్లకు వృద్ధి చెందింది. ఎఫ్ఎంసీజీలో ఇతర విభాగాల ఆదాయం రూ.3,051 కోట్ల నుంచి రూ.3,274 కోట్లకు పెరిగింది. ఎఫ్ఎంసీజీ కాకుండా ఇతర విభాగాల ద్వారా (పేపర్, హోటళ్లు తదితర) ఆదాయం రూ.3,517 కోట్ల నుంచి 4,148 కోట్లకు వృద్ధి చెందింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఐటీసీ రూ.52,035 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.12,824 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.11,485 కోట్లు, ఆదాయం రూ.49,520 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.5.75 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. ఐటీసీ చైర్మన్‌గా సంజీవ్ పూరి న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ‘ఐటీసీ’కి నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా సంజీవ్ పూరి నియమితులయ్యారు. సోమవారం జరిగిన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈయన్ను సీఎండీగా నియమించినట్లు.. కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు సంస్థ సమాచారమిచ్చింది. యోగేష్ చందర్ దేవేశ్వర్ (వైసీ దేవేశ్వర్) హఠాన్మరణంతో సంజీవ్ పూరిని చైర్మన్‌గా నియమిస్తున్నట్లు వివరణ ఇచ్చింది. సీఎండీ స్థానంలో తొలిసారిగా మాట్లాడిన సంజీవ్ పూరి.. ‘ఈ నూతన పదవిని నాకు దక్కిన ప్రత్యేక అధికారం, గౌరవంగా భావిస్తున్నా. భారత కార్పొరేట్ సామ్రాజ్యంలో బలమైన సంస్థగా ఎదిగిన ఐటీసీని మరింత బలపరచడం నా బాధ్యత’ అని వ్యాఖ్యానించారు. 2015లో బోర్డు సభ్యునిగా నియమితులైన సంజీవ్.. ఆ తర్వాత 2017లో సీఈఓగా మారారు. ఐఐటీ కాన్పూర్, వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తిచేశారు. -
హెచ్డీఎఫ్సీ లాభం 2,862 కోట్లు
న్యూఢిల్లీ: గృహరుణాల దిగ్గజం హెచ్డీఎఫ్సీ... మార్చి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. స్టాండలోన్ ప్రాతిపదికన లాభం 27 శాతం పెరిగి రూ.2,862 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం రూ.11,586 కోట్లకు వృద్ధి చెందింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.2,257 కోట్లు, ఆదాయం రూ.9,322 కోట్లుగా ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయం 2,650 కోట్ల నుంచి 3,161 కోట్లకు పెరిగింది. ఒక్కో షేరుకు రూ.17.50 చొప్పున తుది డివిడెండ్ పంపిణీకి హెచ్డీఎఫ్సీ బోర్డు నిర్ణయం తీసుకుంది. రూ.3.50 మధ్యంతర డివిడెండ్‌తో కలిపి చూస్తే 2018–19 ఆర్థిక సంవత్సరానికి షేరు వారీ డివిడెండ్ రూ.21 అవుతుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.20 డివిడెండ్ ఇవ్వడం గమనార్హం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిరాశ 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ స్టాండలోన్ లాభం మాత్రం 12 శాతం తగ్గి రూ.9,632 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.10,959 కోట్లు. కన్సాలిడేటెడ్‌గా చూస్తే మాత్రం లాభం గణనీయంగా మెరుగుపడింది. 2017–18లో రూ.13,111 కోట్ల కన్సాలిడేట్ లాభం రాగా, 35 శాతం వృద్ధితో 2018–19లో 17,580 కోట్లకు చేరింది. అయితే, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఐపీవో ద్వారా వచ్చిన మొత్తం ఇందులో చేరడం గమనార్హం. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఐపీవో ద్వారా వాటాలు విక్రయించినందుకు క్రితం ఆర్థిక సంవత్సరం ఫలితాలతో పోల్చడం సరికాదని కంపెనీ అభిప్రాయపడింది. కన్సాలిడేటెడ్ ఆదాయం సైతం రూ.79,819 కోట్ల నుంచి రూ.96,195 కోట్లకు వృద్ధి చెందింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధి చెంది రూ.9,635 కోట్ల నుంచి రూ.11,403 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 3.3 శాతంగా నమోదైంది. స్థూల ఎన్పీఏలు మొత్తం రుణాల్లో 1.18 శాతం మేర రూ.4,777 కోట్లు కాగా నికర ఎన్పీఏలు ఇండివిడ్యువల్ (వ్యక్తులు) పోర్ట్‌ఫోలియోలో 0.7 శాతం, నాన్ ఇండివిడ్యువల్ (సంస్థలు) పోర్ట్‌ఫోలియోలో 2.34 శాతం మేర ఉన్నట్టు కంపెనీ తెలిపింది. నిధుల సమీకరణ రిడీమబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు లేదా ఇతర హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్లను ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేయడం ద్వారా రూ.1.25 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని హెచ్డీఎఫ్సీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అలాగే, నాసర్ ముంజీ, జేజే ఇరానీలను ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా జూలై 21 నుంచి మరో రెండేళ్ల కాలానికి పునర్నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. -
ఎస్బీఐ లాభం 838 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.838 కోట్ల నికర లాభం(స్టాండ్అలోన్) సాధించింది. మొండి బకాయిలు తగ్గడం, వడ్డీ వ్యయాలు కూడా ఒక శాతం తగ్గడంతో ఈ స్థాయిలో నికర లాభం వచ్చిందని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ పేర్కొన్నారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) ఇదే క్వార్టర్లో రూ.7,719 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వివరించారు. మొత్తం ఆదాయం రూ.68,436 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.75,671 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ 2.95 శాతంగా నమోదైందని వివరించారు. రానున్నదంతా మంచి కాలమేనన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. లాభాల్లో నడుస్తున్న తమ అనుబంధ కంపెనీలు, ఎస్బీఐ కార్డ్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లను త్వరలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తామని చెప్పారు. ఏడాది లాభం రూ.6,547 కోట్లు... ఇక పూర్తి ఏడాది పరంగా చూస్తే, 2017–18లో రూ.6,547 కోట్ల నికర నష్టాలు రాగా(స్టాండ్అలోన్), గత ఆర్థిక సంవత్సరంలో రూ.862 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) వచ్చిందని రజనీశ్ చెప్పారు. కీలకమైన కొన్ని ఒత్తిడి ఖాతాలకు వంద శాతం కేటాయింపుల కారణంగా నికర లాభం తగ్గిందని వివరించారు. కన్సాలిడేటెడ్ పరంగా చూస్తే, 2017–18లో రూ.4,187 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,069 కోట్ల నికర లాభం వచ్చిందని చెప్పారు. ఆదాయం రూ.3.01 లక్షల కోట్ల నుంచి రూ.3.30 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా రుణాల వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్నా, దేశీయ రుణాలు 14 శాతం పెరగడంతో మొత్తం రుణ వృద్ధి 12 శాతంగా నమోదైందని తెలిపారు. మెరుగుపడిన రుణ నాణ్యత ఎస్బీఐ రుణ నాణ్యత మెరుగుపడింది. గత ఏడాది మార్చి నాటికి 10.91 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చినాటికి 7.53 శాతానికి తగ్గాయని రజనీశ్ కుమార్ తెలిపారు. అలాగే నికర మొండి బకాయిలు 5.73 శాతం నుంచి 3.01 శాతానికి పడిపోయాయని పేర్కొన్నారు. విలువ పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.2,23,427 కోట్ల నుంచి రూ.1,72,750 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.1,10,855 కోట్ల నుంచి రూ.65,895 కోట్లకు తగ్గాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.37,000 కోట్ల రికవరీ జరిగిందని, బ్యాంక్ చరిత్రలో ఇదే అత్యధికమని చెప్పారు. తాజా మొండి బకాయిలు గత క్యూ4లో రూ.7,505 కోట్లకు, గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.32,738 కోట్లకు చేరాయని తెలిపారు. తాజా మొండి బకాయిలు తక్కువగా ఉండటం, రికవరీలు పెరగడం, కేటాయింపులు పెరగడం వల్ల స్థూల, నికర మొండి బకాయిలు తగ్గాయని వివరించారు. 79 శాతానికి పీసీఆర్.. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 12.6 శాతం పెరిగి 79 శాతానికి చేరింది. సీక్వెన్షియల్‌గా చూస్తే 4.1 శాతం మెరుగుపడింది. ఎస్సార్ స్టీల్, భూషణ్ పవర్ అండ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్ కంపెనీల దివాలా ప్రక్రియ తుది దశలో ఉందని, వీటికి సంబంధించిన రూ.16,000 కోట్ల బకాయిలు వసూలు కాగలవని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు రూ.3,487 కోట్ల రుణాలిచ్చామని, వీటిల్లో 1,125 కోట్ల రుణాలు మొండి పద్దులుగా మారాయని వివరించారు. కాగా మార్చి చివరి నాటికి బ్యాంక్ టైర్ వన్ మూలధనం 9.62 శాతంగానే ఉంది. దీంతో క్యూఐపీ విధానంలో ఈ బ్యాంక్ నిధులు సమీకరించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. ఆర్థిక ఫలితాలు బావుండటంతో బీఎస్ఈలో ఎస్బీఐ షేర్ 3 శాతం ఎగసి రూ.308 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. స్వల్పంగా తగ్గిన ఎస్బీఐ రుణ రేటు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణ రేటు (ఎంసీఎల్ఆర్) స్వల్పంగా తగ్గింది. ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన అన్ని కాలపరిమితుల రుణాలపై ఐదు బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) రుణ రేటు తగ్గినట్లు ఎస్బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. తక్షణం తాజా రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ముఖ్యాంశాలు చూస్తే... ►ఏడాది ఎంసీఎల్ఆర్ 8.5 శాతం నుంచి8.45 శాతానికి తగ్గింది. ► గడచిన నెల రోజుల్లో ఎస్బీఐ రుణ రేటును తగ్గించడం ఇది రెండవసారి. ఆర్బీఐ పాలసీ రేటు ఏప్రిల్‌లో తగ్గించిన తరువాత, వెంటనే ఈ బ్యాంకింగ్ దిగ్గజం ఐదు బేసిస్ పాయింట్ల రుణ రేటును తగ్గించింది. ►ఏప్రిల్ 10 నుంచి గృహ రుణ రేట్లు 15 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు బ్యాంక్ ప్రకటన పేర్కొంది. ఆర్బీఐ పాలసీ రేట్ల ప్రయోజనాన్ని మరింతగా కస్టమర్లకు అందించడంలో భాగంగా మే 1వ తేదీ నుంచి లక్షపైన క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్ వడ్డీరేట్లను రెపోరేటుకు అనుసంధానించడం జరిగిందని ఎస్బీఐ పేర్కొంది. అంతా శుభమే అన్ని అంశాల్లో మంచి పనితీరు కనబరిచాం. టర్న్ అరౌండ్ సాధించాం. రుణ నాణ్యత మెరుగుపడింది. స్థూల, నికర మొండి బకాయిలు తగ్గాయి. భవిష్యత్తులో ఎలాంటి భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అంతా శుభమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10–12 శాతం రుణ వృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ -
పెరిగిన టాటా కమ్యూనికేషన్స్ నష్టాలు
న్యూఢిల్లీ: డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలందించే టాటా కమ్యూనికేషన్స్ కంపెనీ నష్టాలు గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో మరింతగా పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) క్యూ4లో రూ.121 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.199 కోట్లకు పెరిగాయని టాటా కమ్యూనికేషన్స్ తెలిపింది. ఆదాయం 5 శాతం వృద్ధి తో రూ.4,244 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్డీ, సీఈఓ వినోద్ కుమార్ పేర్కొన్నారు ఎస్టీటీ తై సెంగ్ కంపెనీలో గుడ్‌విల్ ఇంపెయిర్మెంట్ నష్టాలు రూ.173 కోట్ల మేర రావడంతో గత క్యూ4లో నష్టాలు పెరిగాయని వివరించారు. ఆదాయం 2 శాతం డౌన్.. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.329 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.82 కోట్లకు తగ్గాయని కుమార్ తెలిపారు. ఆదాయం 2 శాతం క్షీణించి రూ.16,525 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. కంపెనీ డేటా వ్యాపారం మంచి వృద్ధిని సాధిం చిందని, భవిష్యత్తు వృద్ధికి ఈ డేటా వ్యాపారం చోదక శక్తి కాగలదని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టాటా కమ్యూనికేషన్స్ షేర్ 1.1 శాతం నష్టంతో రూ.559 వద్ద ముగిసింది. -
టైటాన్ లాభం రూ.348 కోట్లు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 14 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.304 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2018–19) క్యూ4లో రూ.348 కోట్లకు పెరిగిందని టైటాన్ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,126 కోట్ల నుంచి రూ.4,945 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్డీ భాస్కర్ భట్ తెలిపారు. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారాయన. నికర అమ్మకాలు రూ.3,917 కోట్ల నుంచి 19 శాతం ఎగసి రూ.4,672 కోట్లకు పెరిగాయి. నిర్వహణ లాభం రూ.475 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.511 కోట్లకు పెరిగింది. 9.8 శాతం మార్జిన్ సాధించామని భట్ పేర్కొన్నారు. రూ.19,961 కోట్లకు మొత్తం ఆదాయం... పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.1,102 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,389 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.16,245 కోట్ల నుంచి రూ.19,961 కోట్లకు చేరుకుంది. గత కొన్నేళ్లుగా ఉన్నట్లే వృద్ధి జోరు గత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగిందని భాస్కర్ భట్ వివరించారు. కీలకమైన వ్యాపార విభాగాల్లో ఆదాయం, లాభం అంశాల్లో పటిష్టమైన వృద్ధిని సాధించామన్నారు. అత్తరు బ్రాండ్ స్కిన్, భారత దుస్తులకు సంబంధించిన బ్రాండ్ తనైరాలను భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న సంవత్సరాల్లో మంచి వృద్ధి సాధించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టైటాన్ కంపెనీ షేర్ 0.2 శాతం లాభంతో రూ.1,088 వద్ద ముగిసింది. ఫలితాలు మార్కెట్ ముగిశాక వెలువడ్డాయి. -
బీఎస్ఈ లాభం తగ్గింది
న్యూఢిల్లీ: బాంబే స్టాక్ ఎక్సే్ఛంజ్(బీఎస్ఈ) గత ఆర్థిక సంవత్సరం (2018–19) మార్చి క్వార్టర్లో రూ.52 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం రూ.62 కోట్లతో పోలిస్తే 16 శాతం క్షీణించిందని బీఎస్ఈ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.195 కోట్ల నుంచి రూ.182 కోట్లకు తగ్గిందని తెలిపింది. స్టాండ్ అలోన్ పరంగా చూస్తే, నికర లాభం రూ.61 కోట్ల నుంచి రూ.44 కోట్లకు తగ్గింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.25 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని కంపెనీ తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో స్టాండ్అలోన్ నికర లాభం రూ.201 కోట్లు, కన్సాలిడేటెట్ నికర లాభం రూ.199 కోట్లుగా ఉన్నాయని బీఎస్ఈ తెలియజేసింది. రూ.460 కోట్ల షేర్ల బైబ్యాక్ ఒక్కో షేర్‌ను రూ.680 ధరకు (మంగళవారం ముగింపు ధర, రూ.637తో పోల్చితే 7% అధికం) టెండర్ ఆఫర్ మార్గంలో బైబ్యాక్ చేయనున్నామని బీఎస్ఈ తెలిపింది. మొత్తం రూ.460 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్నామని పేర్కొంది. -
వేదాంత లాభం 34% డౌన్
న్యూఢిల్లీ: లోహ, మైనింగ్ దిగ్గజం వేదాంత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో 34 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) క్యూ4లో రూ.3,956 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,615 కోట్లకు తగ్గిందని వేదాంత తెలిపింది. ఆదాయం తక్కువగా రావడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వేదాంత లిమిటెడ్ చైర్మన్ నవీన్ అగర్వాల్ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.28,547 కోట్ల నుంచి 12 శాతం క్షీణించి రూ.25,096 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. మొత్తం వ్యయాలు కూడా రూ. 22,824 కోట్ల నుంచి రూ.20,992 కోట్లకు తగ్గాయని వివరించారు. ఎబిటా 20 శాతం తగ్గి రూ.6,135 కోట్లకు, ఎబిటా మార్జిన్ 1.7 శాతం తగ్గి 26.1 శాతానికి చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి పునర్వ్యవ స్థీకరణ జోరుగా జరిగిందని, ఆర్థిక అంశాలు పటిష్టంగా ఉన్నాయని, వాటాదారులకు పరిశ్రమలోనే ఏ కంపెనీ ఇవ్వనంతటి రాబడులు ఇచ్చామని అగర్వాల్ పేర్కొన్నారు. తాము కొనుగోలు చేసిన ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కంపెనీని విజయవంతంగా లాభాల బాట పట్టించామని తెలిపారు. విభిన్నమైన సహజ వనరుల వ్యాపారాలకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా అవతరించామని కంపెనీ సీఈఓ శ్రీనివాసన్ వెంకటకృష్ణన్ చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ స్థూల రుణ భారం రూ.8,066 కోట్లు పెరిగి రూ.66,225 కోట్లకు ఎగసిందని శ్రీనివాసన్ వివరించారు. నికర రుణ భారం రూ.5,000 కోట్లు పెరిగి రూ.26,956 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. మార్కెట్ ముగిసిన తర్వాత వేదాంత కంపెనీ ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. బీఎస్ఈలో వేదాంత షేర్ 2 శాతం నష్టంతో రూ.163 వద్ద ముగిసింది. -
వైద్య సేవల రంగంలో విలీనాల జోరు!
ముంబై: హాస్పిటల్ రంగంలో నియంత్రణల కారణంగా కంపెనీల పనితీరుపై ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, ఈ రంగంలో కొనుగోళ్లు, విలీనాలు (ఎంఅండ్ఏ) మాత్రం జోరుగానే సాగుతున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో ఎంఅండ్ఏ డీల్స్ 155 శాతం పెరిగి రూ.7615 కోట్ల విలువ మేర నమోదయ్యాయి. ఐదేళ్ల కాలంలో ఈ రంగంలో ఎఅండ్‌ఏ లావాదేవీలు ఈ స్థాయిలో నమోదుకావటం ఇదే ప్రథమం. 2017–18 ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీల విలువ రూ.2,991 కోట్లుగా ఉంది. రెండు పెద్ద డీల్స్ ఫోర్టిస్ హెల్త్‌కేర్‌ను రూ.4,000 కోట్లకు, మ్యాక్స్ హెల్త్‌కేర్‌ను రూ.2,351 కోట్లకు కొనుగోలు చేసే డీల్స్ 2018–19లో చోటు చేసుకున్నాయి. ఈ రెండింటిలోనూ మార్కెట్ ధర కంటే ప్రీమియానికే ఒప్పందాలు జరిగాయి. ఫోర్టిస్ హెల్త్‌కేర్ ఒక్కో షేరును నాటి మార్కెట్ ధర రూ.144 కంటే అధికంగా రూ.170 ధరకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం జరిగింది. మ్యాక్స్ హెల్త్‌కేర్ మార్కెట్ విలువ రూ.2,170 కోట్లుగా ఉంటే, రూ.4,298 కోట్ల ఈక్విటీ విలువ లెక్క కట్టారు. దీని కింద మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం కూడా ఉంది. ఈ రంగం పనితీరు ఇటీవలి కాలంలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ నాణ్యమైన హెల్త్‌కేర్ ఆస్తులు కావడంతో ప్రీమియం ధరను చెల్లించేందుకు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ముందుకు వచ్చినట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో వివరించింది. దేశ వైద్య సేవల రంగంలో 70 శాతం వాటా ప్రైవేటు రంగం చేతుల్లోనే ఉంది. రియల్ ఎస్టేట్‌పై ఖర్చు, ఎక్విప్మెంట్ వ్యయాలు తదితర రూపంలో ఎక్కువ పెట్టుబడులు అవసరం అవుతాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరంతోపాటు వాటిపై రాబడులకు చాలా సమయం తీసుకునే ఈ రంగంలో స్థిరీకరణ అన్నది సంస్థలకు మెరుగైన ఆప్షన్ అవుతుందని ఇక్రా పేర్కొంది. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం 1,170 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో క్వార్టర్లో రూ.1,170 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం (రూ.1,141 కోట్లు) తో పోల్చితే 2 శాతం వృద్ధి సాధించామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. దీంట్లో ట్యాక్స్ రిఫండ్ ప్రయోజనాల కారణంగా రూ.440 కోట్లు, అనుబంధ కంపెనీల లాభం రూ.489 కోట్ల మేర ఉండటం విశేషం. అయితే స్టాండ్అలోన్ పరంగా చూస్తే, నికర లాభం తగ్గిందని బ్యాంక్ వెల్లడించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.1 డివిడెండ్‌ను కంపెనీ ఇవ్వనున్నది. తగ్గిన స్టాండ్అలోన్ లాభం... అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,020 కోట్లుగా ఉన్న నికర లాభం(స్టాండ్అలోన్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 5 శాతం తగ్గి రూ.969 కోట్లకు చేరిందని బ్యాంక్ ఈడీ సందీప్ బాత్రా పేర్కొన్నారు. స్టాండ్అలోన్ పరంగా నికర లాభం తగ్గినా, అనుబంధ కంపెనీల తోడ్పాటుతో ఈ బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా పెరిగిందని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.33,760 కోట్ల నుంచి రూ.36,784 కోట్లకు పెరిగిందని వివరించారు. నికర వడ్డీ ఆదాయం రూ.6,022 కోట్ల నుంచి 27 శాతం ఎగసి రూ.7,620 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్ 3.40 శాతం నుంచి 3.72 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. ఫీజు ఆదాయం 15 శాతం పెరగ్గా, రుణాలు 17 శాతం, డిపాజిట్లు 16 శాతం చొప్పున వృద్ధి చెందాయని వివరించారు. గత క్యూ4లో రూ.7,300 కోట్ల బకాయిలను రద్దు చేశామని, ప్రొవిజన్ కవరేజ్ రేషియో 60 శాతం నుంచి 80 శాతానికి ఎగసిందని తెలిపారు. స్థూల మొండి బకాయిలు 7.75 శాతం నుంచి 7.38 శాతానికి తగ్గాయి. ఇతర ఆదాయం రూ.5,679 కోట్ల నుంచి 36 శాతం క్షీణించి రూ.3,621 కోట్లకు చేరింది. సగం తగ్గిన తాజా మొండి బకాయిలు.. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం భారీగా తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 40 శాతం తగ్గి రూ.3,363 కోట్లకు చేరింది. తాజా మొండి బకాయిలు దాదాపు సగం తగ్గాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.28,730 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు గత ఆర్థి క సంవత్సరంలో రూ.11,039 కోట్లకు తగ్గాయి. మెరుగుపడిన రుణ నాణ్యత... బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత ఏడాది మార్చి 31 నాటికి 8.84 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి 31 నాటికి 6.70 శాతానికి తగ్గాయని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. అలాగే నికర మొండి బకాయిలు 4.77 శాతం నుంచి 2.06 శాతానికి తగ్గాయని వివరించింది. ఇది 13 క్వార్టర్ల కనిష్ట స్థాయి అని పేర్కొంది. గత క్యూ4లో తాజా మొండి బకాయిలు రూ.3,547 కోట్లుగా నమోదయ్యాయి. కేటాయింపులు వార్షికంగా తగ్గగా, సీక్వెన్షియల్‌గా మాత్రం పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.6,626 కోట్లుగా ఉన్న కేటాయింపులు గత క్యూ4లో రూ.5,451 కోట్లకు తగ్గాయి. గత క్యూ3లో కేటాయింపులు రూ.4,244 కోట్లుగా ఉన్నాయి. మార్కెట్ ముగిసిన తర్వా:త ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్0.11 శాతం నష్టంతో రూ.401 వద్ద ముగిసింది. అధ్వాన కాలం ముగిసింది మొండి బకాయిలు భారీగా పెరగడం, అవినీతి ఆరోపణలపై సీఈఓ చందా కొచర్ వైదొలగడం వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న ఈ బ్యాంక్.... అధ్వాన కాలం ముగిసినట్లేనని పేర్కొంది. రుణ నాణ్యతకు సంబంధించిన సైకిల్లో చివరి దశలో ఉన్నామని బ్యాంక్ ఈడీ సందీప్ బాత్రా పేర్కొన్నారు. రానున్న కాలంలో మొండి బకాయిలు పేరుకుపోవడం తగ్గగలదన్న అంచనాలున్నాయన్నారు. వడ్డీ వ్యయాలు 1–1.2 శాతం రేంజ్లో ఉండేవని, కానీ మొండి బకాయిలకు కేటాయింపుల కారణంగా ఈ వ్యయాలు 3.5 శాతానికి ఎగిశాయని పేర్కొన్నారు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ వ్యయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడి సాధారణ స్థాయికి వస్తాయని వివరించారు. -
ఎయిర్టెల్ లాభం 29 శాతం అప్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19) జనవరి–మార్చి క్వార్టర్లో 29 శాతం ఎగసి రూ.107 కోట్లకు చేరింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో ఈ కంపెనీకి రూ.83 కోట్ల నికర లాభం వచ్చింది. నష్టాలను ప్రకటించగలదన్న విశ్లేషకుల అంచనాలను తల్లకిందులు చేస్తూ ఈ కంపెనీ లాభాన్ని ప్రకటించడం విశేషం. భారత మొబైల్ సర్వీసుల వ్యాపారంలో నష్టాలు వచ్చినా, ఆఫ్రికా వ్యాపారం పుంజుకోవడం, అసాధారణ ఆదాయ లాభాల కారణంగా ఈ స్థాయి నికర లాభాన్ని ఈ కంపెనీ సాధించింది. చాలా క్వార్టర్ల తర్వాత నికర లాభంలో పెరుగుదల నమోదు కావడం ఇదే మొదటిసారి. సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర లాభం 24 శాతం ఎగసింది. ఇక ఆదాయం 6 శాతం ఎగసి రూ.20,602 కోట్లకు పెరిగింది. గత క్యూ4లో రూ.2,022 కోట్ల మేర అసాధారణ ఆదాయ లాభాలు (నెట్వర్క్ రీ–ఫార్మింగ్, అప్‌గ్రెడేషన్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన చార్జీలు, లెవీల పున:మదింపుకు సంబంధించిన మొత్తం) వచ్చాయని కంపెనీ పేర్కొంది. రూ.25,000 కోట్ల రైట్స్ ఇష్యూ ప్రస్తుతం నడుస్తోంది. ఈ నెల 17న ఈ రైట్స్ ఇష్యూ ముగియనున్నది. రెట్టింపైన ‘భారత’ నష్టాలు... ఈ కంపెనీ భారత వ్యాపారంలో అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ.482 కోట్ల నష్టాలు వచ్చాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఈ నష్టాలు దాదాపు రెట్టింపై రూ.1,378 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో ఆఫ్రికా మొబైల్ సర్వీసుల్లో లాభం రూ.1,129 కోట్ల నుంచి 1,317 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.1,099 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు సగం తగ్గి రూ.410 కోట్లకు పడిపోయింది. ఆదాయం కూడా రూ.82,639 కోట్ల నుంచి 2 శాతం తగ్గి రూ.80,780 కోట్లకు తగ్గింది. ముకేష్ అంబానీ రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీ తట్టుకోవడానికి టెలికం కంపెనీలు టారిఫ్‌లను భారీగా తగ్గించాయి. ఫలితంగా ఆ కంపెనీల లాభదాయకతపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. వాయిస్, డేటా వినియోగం రికార్డ్ స్థాయిల్లో ఉన్నా, టెలికం కంపెనీలకు పెద్దగా లాభాలు రావడం లేదని మరోసారి ఎయిర్టెల్ ఫలితాలు రుజువు చేశాయని నిపుణులంటున్నారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఎయిర్టెల్ ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేర్ 0.6 శాతం లాభంతో రూ.333 వద్ద ముగిసింది. -
రెరాతో ఇన్వెంటరీ తగ్గింది
సాక్షి, హైదరాబాద్: దేశంలో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ)లకు రెక్కలొస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అమల్లోకి వచ్చాక డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌ల లాచింగ్స్ కంటే ఇన్వెంటరీ అమ్మకాల మీదే ఎక్కువ దృష్టిసారిస్తున్నారు. ఎందుకంటే? ప్రాజెక్ట్ ప్రారంభిస్తే చాలు రెరాలో నమోదు, నాణ్యత, నిర్మాణ గడువు, నిర్వహణ ప్రతి అంశంలోనూ కఠినమైన నిబంధనలుండటంతో డెవలపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో 2017–18 ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికం (క్యూ4)లో 8,90,719 గృహాల ఇన్వెంటరీ ఉంటే 2018–19 క్యూ4 నాటికి 8,00,438 గృహాలకు చేరాయి. అంటే ఏడాదిలో 10 శాతం తగ్గాయని ప్రాప్‌టైగర్.కామ్ ‘‘రియల్ ఎస్టేట్: 2018–19 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం (క్యూ4)’’ నివేదిక తెలిపింది. అహ్మదాబాద్, చెన్నై మినహా.. అహ్మదాబాద్, చెన్నై మినహా అన్ని నగరాల్లో ఇన్వెంటరీ తగ్గింది. అహ్మదాబాద్‌లో 2018 క్యూ4లో 61,683 గృహాలుండగా.. 2019 క్యూ4 నాటికి 63,114 యూనిట్లకు, చెన్నైలో 37,728 నుంచి 38,226 యూనిట్లకు పెరిగాయి. బెంగళూరులో 87,110 నుంచి 77,835 యూనిట్లకు, గుర్గావ్లో 47,793 నుంచి 44,046 గృహాలకు, కోల్‌కతాలో 48,629 నుంచి 44,689లకు, ముంబైలో 3,32,719 నుంచి 2,88,679లకు, నోయిడాలో 79,605 నుంచి 65,006లకు, పుణేలో 1,53,182 నుంచి 1,41,695లకు తగ్గాయి. హైదరాబాద్ రియల్టీ టాప్‌గేర్ హైదరాబాద్ రియల్టీ రంగం టాప్‌గేర్‌లో పడింది. బెంగళూరు, చెన్నై, నోయిడా వంటి ఇతర మెట్రో నగరాల్లోని గృహాల అమ్మకాల్లో కనిపించని వృద్ధి భాగ్యనగరంలోనే జరిగింది. 2018–19 ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికం (క్యూ4)లో నగరంలో 7,059 గృహాలు అమ్ముడయ్యాయి. 2017–18 క్యూ4తో పోలిస్తే 26 శాతం వృద్ధి. 2018 క్యూ4లో 5,618 గృహాలు విక్రయమయ్యాయి. ఇక, కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్లను గమనిస్తే.. నగరంలో 2018 క్యూ4లో 6,285 యూనిట్లు ప్రారంభం కాగా.. 2019 క్యూ4లో 3 శాతం క్షీణించి 6,066లకు తగ్గాయి. ఇన్వెంటరీలను గమనిస్తే.. నగరంలో 2018 క్యూ4లో 42,270 గృహాల ఇన్వెంటరీ ఉండగా.. 2019 క్యూ4 నాటికి 35,148 యూనిట్లకు తగ్గాయి. అంటే ఏడాదిలో 17 శాతం తగ్గిందన్నమాట. అద్దెల విషయంలోనూ అంతే! హైదరాబాద్‌లో మినహా అన్ని నగరాల్లో ఏడాదిలో అద్దెలు 14 శాతం పెరిగాయి. -
బంధన్ బ్యాంక్ లాభం 68 శాతం అప్
కోల్‌కత: ప్రైవేట్ రంగ బంధన్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 68% ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) జనవరి–మార్చి త్రైమాసిక కాలంలో రూ.651కోట్ల నికర లాభం సాధించామని బంధన్ బ్యాంక్ తెలిపింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో ఇది రూ.388 కోట్లని బ్యాంక్ ఎమ్డీ సీఎస్ ఘోష్ తెలిపారు. ఇతర ఆదాయం దాదాపు రెట్టింపు కావడం, ఫీజు ఆదాయం పెరగడంతో గత క్యూ4లో నికర లాభంలో భారీ వృద్ధి సాధించామని తెలిపారు. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.3 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొన్నారు. 10.69 శాతానికి నికర వడ్డీ మార్జిన్.. నికర వడ్డీ మార్జిన్ 9.32 శాతం నుంచి 10.69 శాతానికి పెరిగిందని ఘోష్ తెలిపారు. నికర వడ్డీ ఆదాయం రూ.864 కోట్ల నుంచి 46 శాతం వృద్ధితో రూ.1,258 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రుణాలు రూ.32,339 కోట్ల నుంచి 38 శాతం వృద్ధితో రూ.44,776 కోట్లకు పెరిగాయని, డిపాజిట్లు రూ.33,869 కోట్ల నుంచి 28 శాతం పెరిగి రూ.43,232 కోట్లకు చేరాయని వివరించారు. మెరుగుపడిన రుణ నాణ్యత... సీక్వెన్షియల్‌గా చూస్తే, బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో 2.41 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో 2.04 శాతానికి తగ్గాయని ఘోష్ తెలిపారు. నికర మొండి బకాయిలు 0.70 శాతం నుంచి 0.58 శాతానికి తగ్గాయని తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలకు రుణాలివ్వడం వల్ల మొండి బకాయిలు పెరిగాయని పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.1,346 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 45 శాతం వృద్ధితో రూ.1,952 కోట్లకు పెరిగిందని బంధన్ బ్యాంక్ తెలిపింది. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో బీఎస్ఈలో బంధన్ బ్యాంక్ షేర్ 4.3 శాతం లాభంతో రూ.624 వద్ద ముగిసింది. -
రికార్డు స్థాయికి జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి నెల... ఏప్రిల్‌లో రూ.1,13,865 కోట్ల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలియజేసింది. 2017 జూలై 1న జీఎస్టీ అమల్లోకివచ్చాక ఇది ఆల్‌టైమ్ రికార్డు స్థాయి. 2018 ఏప్రిల్ నెలలో ఉన్న రూ.1,03,459 కోట్లతో పోలిస్తే పన్నుల ఆదాయం 10 శాతం అధికంగా వసూలైంది. పన్నుల ఎగవేత నిరోధానికి అధికారులు తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చినట్టు ఈ గణాంకాల ద్వారా తెలుస్తోంది. మార్చి నెలకు సంబంధించి మొత్తం సమ్మరీ సేల్స్ రిటర్న్‌లు ‘జీఎస్టీఆర్ 3బి’ ఏప్రిల్ 30 వరకు 72.13 లక్షలు దాఖలయ్యాయి. జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లకు మించి వసూలు కావడం వరుసగా రెండో నెల. మార్చి నెలలో రూ.1.06 లక్షల కోట్ల పన్ను ఆదాయం వచ్చింది. ‘‘2019 ఏప్రిల్‌లో రెగ్యులర్, ప్రొవిజనల్ సెటిల్మెంట్ అనంతరం సెంట్రల్ జీఎస్టీకి (సీజీఎస్టీ) రూ.47,533 కోట్లు, స్టేట్ జీఎస్టీ(ఎస్జీఎస్టీ)కి రూ.50,776 కోట్లు వచ్చినట్టు ఆర్థిక శాఖ ప్రకటన పేర్కొంది. రూ.12,000 కోట్ల ఐజీఎస్టీ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమానంగా పంచినట్టు తెలిపిం ది. గత నెలకు సంబంధించిన పన్నుల వసూళ్ల గణాంకాలను మరుసటి నెల మొదటి రోజున కేంద్రం విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. పన్నులు పెరిగేందుకు పలు కారణాలు జీఎస్టీ వసూళ్లు పెరగడానికి ఎన్నో కారణాలను ట్యాక్స్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈవే బిల్లుల యంత్రాంగం ద్వారా పన్ను నిబంధనలను పాటించేలా కఠినతరం చేయడం, రియల్ ఎస్టేట్ రంగానికి పన్నులను మార్చడం వల్ల పలు కంపెనీలు అర్హత లేకపోవడంతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను తిరిగి వెనక్కి ఇచ్చేయడం, సాధారణ ఎన్నికల ముందు ప్రభుత్వం ఎక్కువగా నిధులు ఖర్చు చేయడాన్ని కారణాలుగా ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ పార్ట్నర్ రజత్ మోహన్ పేర్కొన్నారు. -
బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభం రూ.294 కోట్లు
న్యూఢిల్లీ: బ్రిటానియా ఇండస్ట్రీస్ నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 12 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.263 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.294 కోట్లకు పెరిగిందని బ్రిటానియా ఇండస్ట్రీస్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,582 కోట్ల నుంచి రూ.2,861 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్డీ, వరుణ్ బెర్రి చెప్పారు. తమ ప్రధాన వ్యాపారం జోరు కొనసాగుతోందని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరణ, కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం, వ్యయ నియంత్రణ పద్ధతులు దీనికి ప్రధాన కారణాలని వివరించారు. పూర్తి ఆహార కంపెనీగా అవతరించడం తమ ప్రధాన లక్ష్యమని, ఈ లక్ష్య సాధన కోసం కొత్త కేటగిరీల్లో ఉత్పత్తులను అందిస్తున్నామని వివరించారు. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.15 డివిడెండ్(1500%)ను ఇవ్వనున్నామని తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.1,004 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 15% వృద్ధితో రూ.1,155 కోట్లకు పెరిగిందని వరుణ్ వెల్లడించారు. ఆదాయం రూ.10,156 కోట్ల నుంచి రూ.11,261 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. -
దిగ్గజాల రివర్స్‌గేర్!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలో వాహన రంగానికి కలిసిరాలేదు. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోగా.. హోండా మాత్రం 23 శాతం వృద్ధిని నమోదుచేసింది. ద్విచక్ర వాహనాల్లో.. రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ 17 శాతం క్షీణించగా.. సుజుకీ మోటార్‌సైకిల్ అమ్మకాలు 12.57 శాతం పెరిగాయి. ట్రాక్టర్ల విభాగంలో ఎస్కార్ట్స్ 15 శాతం తగ్గుదలను నమోదుచేసింది. మారుతీ వేగం తగ్గింది... ప్యాసింజర్ వాహనాల (పీవీ) విభాగంలో 50 శాతానికి మించి మార్కెట్ వాటాను కలిగి మారుతీ సుజుకీ ఇండియా ఏకంగా 18.7 శాతం తగ్గుదలను నమోదుచేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి నెల్లో ఈ సంస్థ విక్రయాలు 1,43,245 యూనిట్లు కాగా, అంతకుముందు ఏడాది ఏప్రిల్‌లో 1,72,986 యూనిట్లను విక్రయించింది. ఈ సంస్థకు చెందిన మినీ కార్ ఆల్టో అమ్మకాలు 39.8 శాతం తగ్గి 22,766 యూనిట్లుగా ఉన్నాయి. కాంపాక్ట్ విభాగం 13.9 శాతం తగ్గింది. యుటిలిటీ వాహనాల విక్రయాలు మాత్రం 5.9 శాతం వృద్ధి చెందాయి. ఎగుమతులు 14.6 శాతం పెరిగి 9,177 యూనిట్లుగా వెల్లడయ్యాయి. ఇంధన ధరలు పెరగడం, బీఎస్ సిక్స్ ఉద్గార నిబంధనల అమలు వంటి ప్రతికూల అంశాల కారణంగా ఈ ఏడాది అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండనున్నాయని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ ఈ అంశంపై వివరణ ఇచ్చారు. మరోవైపు హ్యుందాయ్ అమ్మకాలు 23 శాతం తగ్గి 42,005 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెల్లో ఈ సంస్థ 46,735 యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. స్పీడుమీదున్న హోండా హోండా కార్స్ దేశీ అమ్మకాలు 23 శాతం వృద్ధితో 9,143 యూనిట్ల నుంచి 11,272 యూనిట్లకు చేరాయి. అమ్మకాలు పెరగడానికి లోయర్ బేస్ ఎఫెక్ట్, అమేజ్ బలమైన విక్రయాలు కారణమని సంస్థ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, డైరెక్టర్ (సేల్ అండ్ మార్కెటింగ్) రాజేశ్ గోయెల్ వెల్లడించారు. రాయల్ ఎన్ఫీల్డ్కు స్పీడు బ్రేకులు లగ్జరీ బైక్‌ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఏప్రిల్ దేశీ అమ్మకాలు 21% తగ్గి 59,137 యూనిట్లుగా వెల్లడయ్యాయి. ఎగుమతులు 140% పెరిగిన కారణంగా మొత్తం అమ్మకాలు 17% క్షీణితను నమోదుచేశాయి. ఇక సుజుకీ మోటార్‌సైకిల్ విక్రయాలు 12.57% పెరిగి 65,942 యూనిట్లుగా నమోదుకాగా, ట్రాక్టర్ల విభాగంలో ఎస్కార్ట్స్ విక్రయాలు 15% తగ్గి 5,264 యూనిట్లుగా నమోదయ్యాయి. హీరో మోటొకార్ప్ నుంచి మూడు ప్రీమియం బైక్‌లు ప్రారంభ ధర రూ.94,000 న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ ‘హీరో మోటొకార్ప్’.. తాజాగా మరో మూడు ‘ఎక్స్’ రేంజ్ ప్రీమియం బైక్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఎక్స్ పల్స్ 200 టీ, ఎక్స్ పల్స్ 200, ఎక్స్ట్రీమ్ 200ఎస్ ధరలు వరుసగా రూ.94,000, రూ.97,000, రూ.1.05 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. గతేడాది పండుగ సీజన్లో ఎక్స్ట్రీమ్ 200ఆర్ పేరిట తన తొలి ఎక్స్ సిరీస్ ప్రీమియం బైక్‌లను అందుబాటులోకి తెచ్చిన ఈ సంస్థ.. మరో మూడు బైక్‌లను ఈ శ్రేణిలో విడుదల చేయడం ద్వారా సిరీస్ సంఖ్యను నాలుగుకు పెంచింది. ఈ సందర్భంగా సంస్థ సేల్స్ హెడ్ సంజయ్ భన్ మాట్లాడుతూ.. ‘యువత లక్ష్యంగా నెమ్మదిగా ప్రీమియం మోటార్ సైకిల్ విభాగంలో మా ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నాం. వచ్చే 3–4 ఏళ్లలో మరింత విస్తరించనున్నాం’ అని వివరించారు. ‘ఒకినావా’కు ఫేమ్–2 రాయితీ న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఒకినావా స్కూటర్స్ తన పోర్ట్‌ఫోలియోలోని రెండు మోడళ్లకు ఫేమ్–2 రాయితీ వెసులుబాటు దక్కిందని బుధవారం ప్రకటించింది. కిలోవాట్ అవర్ (కేడబ్ల్యూహెచ్)ఆధారంగా ఒకినావా రిడ్జ్ ప్లస్, ఐ–ప్రెయిజ్ స్కూటర్లకు రూ.17,000 నుంచి రూ.26,000 వరకు సబ్సిడీ వర్తిస్తుందని సంస్థ ఎండీ జితేందర్ శర్మ చెప్పారు. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ) నుంచి ఈమేరకు అర్హత ధ్రువీకరణ పత్రాన్ని పొందినట్లు వెల్లడించారు. సబ్సిడీలు ఇవ్వడం ద్వారా విద్యుత్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రెండో విడత ఫేమ్ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈ స్కీంలో భాగంగా 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రాయితీ ఇవ్వనుంది. -
టీవీఎస్ మోటార్ లాభం 19 శాతం డౌన్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం (స్టాండ్అలోన్) గత ఆర్థిక సంవత్సరం (2018–19) జనవరి–మార్చి క్వార్టర్లో 19 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.166 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.134 కోట్లకు తగ్గిందని టీవీఎస్ మోటార్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,007 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.4,384 కోట్లకు పెరిగింది. మొత్తం టూ వీలర్, త్రీ వీలర్ అమ్మకాలు 8.89 లక్షల నుంచి 9.07 లక్షలకు పెరిగాయి. ఎబిటా రూ.295 కోట్ల నుంచి 4.4 శాతం వృద్ధితో రూ.308 కోట్లకు పెరిగింది. ఎబిటా మార్జిన్ 7 శాతంగా నమోదైంది. ఏడాది అమ్మకాలు 37.57 లక్షలు ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.663 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 1 శాతం పెరిగి రూ.670 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది.ఆదాయం రూ.15,519 కోట్ల నుంచి రూ.18,210 కోట్లకు ఎగసిందని వివరించింది. మొత్తం టూ వీలర్ అమ్మకాలు 33.67 లక్షల నుంచి 37.57 లక్షలకు చేరాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టీవీఎస్ మోటార్ కంపెనీ 4 శాతం నష్టంతో రూ.486 వద్ద ముగిసింది. -
కోటక్ బ్యాంక్ లాభం 2,038 కోట్లు
న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.2,038 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం( 2017–18) ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.1,789 కోట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధి సాధించామని కోటక్ బ్యాంక్ తెలిపింది. ఇతర ఆదాయం పెరగడం, తక్కువ కేటాయింపుల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.10,874 కోట్ల నుంచి రూ.13,823 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో ఈక్విటీ షేర్‌కు 80 పైసలు డివిడెండ్‌ను ఇవ్వనున్నామని కోటక్ తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ 4.48 శాతం స్డాండ్ఎలోన్ పరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నికర లాభం రూ.1,408 కోట్లకు ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో నికర లాభం రూ.1,124 కోట్లు. నికర వడ్డీ ఆదాయం రూ.2,580 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.3,048 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 2.07 శాతం నుంచి 2.14 శాతానికి, నికర మొండి బకాయిలు 0.71 శాతం నుంచి 0.75 శాతానికి పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో స్థూల మొండి బకాయిలు రూ.4,468 కోట్లుగా, నికర మొండి బకాయిలు రూ.1,544 కోట్లుగా ఉన్నాయి. నికర వడ్డీ మార్జిన్ 4.48 శాతంగా నమోదైంది. కేటాయింపులు రూ.171 కోట్లుగా ఉన్నాయి. నిర్వహణ లాభం రూ.2,018 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.2,282 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.1,270 కోట్లకు పెరిగింది. కేటాయింపులు దాదాపు సగానికి తగ్గాయి. రూ.307 కోట్లుగా ఉన్న కేటాయింపులు రూ.171 కోట్లకు తగ్గాయి. 21 శాతం రుణ వృద్ధి ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.6,201 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,204 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.38,724 కోట్ల నుంచి రూ.45,903 కోట్లకు పెరిగింది. గత ఏడాది మార్చి నాటికి 1.95 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 1.94%కి, నికర మొండి బకాయిలు 0.86% నుంచి 0.70%కి తగ్గాయి. గత ఏడాది మార్చి నాటికి రూ.1,69,718 కోట్లుగా ఉన్న రుణాలు ఈ ఏడాది మార్చి నాటికి 21 శాతం వృద్ధితో రూ.2,05,695 కోట్లకు పెరిగాయి. తొలిసారిగా బ్యాలన్స్ షీట్ సైజు రూ.3,00,000 కోట్లకు చేరింది. ఆ కంపెనీలకు రుణాలివ్వలేదు... లిక్విడిటీ సమస్యల కారణంగా రుణ మార్కెట్లో సవాళ్లున్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి మించి రుణ వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కోటక్ పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ 4.2–4.5 శాతం రేంజ్లో కొనసాగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా దివాలా తీసిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌నకు గానీ, సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్కు గానీ, అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు గానీ ఎలాంటి రుణాలివ్వలేదని కోటక్ స్పష్టం చేశారు. ప్రమోటర్ షేర్ హోల్డింగ్‌కు సంబంధించిన కేసు తొమ్మిది నెలల తర్వాత విచారణకు రానున్నదని పేర్కొన్నారు. ఈ విషయంలో అన్నీ నిబంధనల ప్రకారమే ఉన్నాయని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 0.65 శాతం లాభంతో రూ.1,379 వద్ద ముగిసింది. ఏడాది కాలంలో ఈ షేర్ 16 శాతం లాభపడింది. -
హెచ్డీఎఫ్సీ లైఫ్ లాభం రూ.364 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ బీమా కంపెనీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో 5 శాతం పెరిగింది. గత క్యూ4లో రూ.364 కోట్ల నికర లాభం సాధించామని హెచ్డీఎఫ్సీ లైఫ్ తెలిపింది. పరిశ్రమని మించిన వృద్ధిని సాధిస్తున్నామని, లాభదాయకతలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నామని కంపెనీ ఎమ్డీ, సీఈఓ విభా పడాల్కర్ తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.1,109 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధితో రూ.1,277 కోట్లకు పెరిగిందని విభా పేర్కొన్నారు. మార్కెట్ వాటా పరంగా కొత్త వ్యాపార ప్రీమియమ్ 19.1 శాతం నుంచి 20.7 శాతానికి పెరిగిందని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్ స్వల్పంగా నష్టపోయి రూ. 399.35 వద్ద ముగిసింది. -
‘హీరో’ లాభం 25 శాతం డౌన్
న్యూఢిల్లీ: టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 25 శాతం తగ్గి రూ.730 కోట్లకు చేరింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యు4లో రూ.967 కోట్ల నికర లాభం వచ్చిందని హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ పేర్కొన్నారు. గత క్యూ4లో అమ్మకాలు తగ్గడంతో నికర లాభం కూడా తగ్గిందని, ఆదాయం రూ.8,564 కోట్ల నుంచి 8 శాతం పతనమై రూ.7,885 కోట్లకు తగ్గిందని తెలిపారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం క్యూ4లో 20 లక్షల వాహనాలు విక్రయించగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 17.8 లక్షల వాహనాలు విక్రయించామని, అమ్మకాలు 11 శాతం తగ్గాయని తెలిపారు. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.32 డివిడెండ్‌ను ప్రకటించారు. కాగా ఈ ఏడాది జనవరి 31న ఒక్కో షేర్‌కు రూ.55 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. 78 లక్షల వాహన విక్రయాలు.. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,697 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 8 శాతం తగ్గి రూ.3,385 కోట్లకు చేరింది. ఆదాయం మాత్రం రూ.32,872 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.33,651 కోట్లకు పెరిగింది. వాహన విక్రయాలు రూ.75.87 లక్షల నుంచి 78.20 లక్షలకు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, రికార్డు విక్రయాలు సాధించామని ముంజల్ వ్యాఖ్యానించారు. మార్కెట్లో ఇబ్బందులున్నా, అగ్రస్థానాన్ని కొనసాగించామన్నారు. కష్టాలు కొనసాగుతాయ్..... దేశీయ మార్కెట్లో సమీప భవిష్యత్తులో కష్టాలు కొనసాగుతాయని ముంజల్ పేర్కొన్నారు. పండుగల సీజన్లో అమ్మకాలు పుంజుకుంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ప్రమాణాలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని, ఈ నిబంధనలు పాటించే బైక్‌లను, స్కూటర్లను అంతకంటే ముందే మార్కెట్లోకి తెస్తామని తెలిపారు. అయితే బీఎస్ సిక్స్ నిబంధనలు కఠినంగా ఉన్నాయని, ఈ నిబంధనల కారణంగా వాహన పరిశ్రమకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా సమస్యాత్మకమేనని పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటాయన్న అంచనాలతో కంపెనీ షేరు బీఎస్ఈలో 0.5 శాతం నష్టంతో రూ.2,604 వద్ద ముగిసింది. -
ఇండియాబుల్స్ హౌసింగ్ లాభం రూ.1,006 కోట్లు
ముంబై: దేశంలో రెండో అతిపెద్ద హౌసింగ్ రుణాల సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లాభం మార్చి త్రైమాసికంలో 2 శాతం తగ్గింది. రూ.1,006 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.3,658 కోట్ల నుంచి రూ.4,091 కోట్లకు పెరిగింది. 2017–18లో మొత్తం ఆదాయం రూ.14,959 కోట్లుగా ఉంటే, 2018–19లో రూ.17,027 కోట్లకు వృద్ధి చెందాయి. తిరిగి వృద్ధి పథంలోకి ప్రవేశించామని, రుణ వితరణ సాధారణంగానే కొనసాగుతోందని కంపెనీ వైస్ చైర్మన్, ఎండీ గగన్‌బంగా తెలిపారు. 2019–20లో రుణాల్లో 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. రుణ పుస్తక వృద్ధి నిదానంగానే ఉండాలని తాము తీసుకున్న నిర్ణయం వల్లే రుణాల వితరణ తక్కువగా ఉండడానికి కారణమని గగన్‌బంగా తెలిపారు. రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుకు రూ.10ను మధ్యంతర డివిడెండ్‌గా ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఇక ఈ ఫలితాలను 2017–18 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూడరాదని కంపెనీ కోరింది. 2017 నవంబర్‌లో ఓక్నార్త్ బ్యాంకులో వాటాను జీఐసీ సింగపూర్‌కు విక్రయించడం వల్ల రూ.524 కోట్లు గడించినట్టు తెలిపింది. -
భారతీ ఇన్ఫ్రాటెల్కు విలీనం సెగ
న్యూఢిల్లీ: మొబైల్ టవర్ల కంపెనీ భారతీ ఇన్ఫ్రాటెల్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక కాలంలో రూ.608 కోట్ల నికర లాభాన్ని(కన్సాలిడేటెడ్) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.606 కోట్ల నికర లాభం ఆర్జించామని భారతీ ఇన్ఫ్రాటెల్ తెలిపింది. ఆదాయం రూ.3,662 కోట్ల నుంచి 2 శాతం తగ్గి రూ.3,600 కోట్లకు చేరిందని భారతీ ఇన్ఫ్రాటెల్ చైర్మన్ అఖిల్ గుప్తా తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం ఫ్లాట్‌గా రూ.2,494 కోట్లుగా నమోదైందని వివరించారు. ఆదా యం మాత్రం రూ. 14,490 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.14,582 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.7.50 రెండో మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. విలీన ప్రభావం.... టెలికం రంగంలో ఏకీకరణ కారణంగా మొబైల్ టవర్ల అద్దెలు తగ్గడంతో నికర లాభంలో ఎలాంటి వృద్ధి లేదని అఖిల్ గుప్తా తెలిపారు. వొడాఫోన్–ఐడియా కంపెనీల విలీనం కారణంగా మొత్తం మీద 75,000 కో–లొకేషన్లను కోల్పోయామని పేర్కొన్నారు. అందుకని గత ఆర్థిక సంవత్సరం క్యూ4ల్లో ఆర్థికంగా కంపెనీ పనితీరు అంతంతమాత్రంగానే ఉందని వివరించారు. భవిష్యత్తు బాగు.... డేటాకు డిమాండ్ జోరుగా పెరుగుతోందని, భారీ స్థాయిలో నెట్వర్క్ విస్తరణ జరుగుతోందని, ఫలితంగా తమ కంపెనీకి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండనున్నదని అఖిల్ గుప్తా అంచనా వేస్తున్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇండస్ టవర్స్‌తో తమ కంపెనీ విలీన ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే సాగుతోందని, మరికొన్ని నెలల్లో విలీనం పూర్తవ్వగలదని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్ 3 శాతం లాభంతో రూ.302 వద్ద ముగిసింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ లాభం రూ.1,014 కోట్లు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లాగ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం (2018–19) నాలుగో క్వార్టర్లో రూ.1,014 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో రూ.446 కోట్ల నికర లాభం వచ్చిందని అల్ట్రాటెక్ సిమెంట్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,401 కోట్ల నుంచి రూ.11,031 కోట్లకు పెరిగిందని పేర్కొంది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.11.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మొత్తం వ్యయాలు రూ.9,554 కోట్లని తెలిపింది. ఇతర ఆదాయం 27 శాతం పెరిగి రూ.140 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం రూ.2,213 కోట్లుగా, ఎబిటా మార్జిన్ 21 శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం, గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలను అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఫలితాలతో పోల్చడానికి లేదని కంపెనీ తెలిపింది. బినానీ సిమెంట్స్ కంపెనీని విలీనం చేసుకున్నామని, అందుకే ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.2,224 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,432 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.32,461 కోట్ల నుంచి రూ.37,817 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో ఈ షేర్ జోరుగా పెరిగింది. బీఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్ షేర్ 5.5 శాతం లాభంతో రూ. 4,435 వద్ద ముగిసింది. -
హైదరాబాద్‌లో క్లెన్స్టా ప్లాంట్!
హైదరాబాద్, సాక్షి బిజినెస్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో తమ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేస్తామని పర్సనల్ హెల్త్‌కేర్ సంస్థ క్లెన్స్టా వ్యవస్థాపకుడు పునీత్ గుప్తా చెప్పారు. దాదాపు రూ.35 కోట్లతో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తామని, దీని ఉత్పత్తి సామర్ధ్యం రోజుకు రెండు లక్షల బాటిళ్లని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వంతో ప్రాథమిక చర్చలు పూర్తి చేశామన్నారు. కంపెనీ తాజాగా మార్కెట్లోకి వాటర్‌లెస్ బాడీ బాత్, వాటర్‌లెస్ షాంపూలను తెచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలరహిత వైయుక్తిక శుభ్రత ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోందని చెప్పారు. రక్షణ, హాస్పిటల్స్, లాంగ్టూర్స్ చేసేవాళ్లు, అంతరిక్ష ప్రయాణాల్లో వాటర్‌లెస్ హెల్త్‌కేర్ ఉత్పత్తుల అవసరం చాలా ఉందన్నారు. త్వరలో వాటర్‌లెస్ టూత్‌పేస్ట్, మస్కుటో రిపెల్లెంట్‌ను సైతం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నామన్నారు. తమ 100 ఎంఎల్ బాటిల్‌తో దాదాపు 350 లీటర్ల నీరు ఆదా అవుతుందన్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమ విలువ 11వేల కోట్ల రూపాయలని, ఇందులో మెజార్టీ వాటా సంపాదించేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. నీటి ఆదాకు ప్రాధాన్యం రాబోయే రోజుల్లో 70 కోట్ల రూపాయల రెవెన్యూ లకి‡్ష్యస్తున్నట్లు తెలిపారు. త్వరలో 30– 70 కోట్ల రూపాయల నిధుల సమీకరణ చేయబోతున్నట్లు తెలిపారు. దేశంలోని ఎయిమ్స్, ఎస్కేఎం, యశోదా లాంటి పెద్ద హాస్పిటల్స్‌తో ఒప్పందాలున్నాయని చెప్పారు. ఇటీవలే తమ ఉత్పత్తులను ఇకామ్ సైట్లలో విక్రయించేందుకు ఉంచామని, వీటికి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. రన్‌వేల్లో పేరుకుపోయే రబ్బర్‌ను నీటి వినియోగం లేకుండా తొలగించే ద్రావకాన్ని తయారు చేయబోతున్నామని, ఈ విధంగా కేవలం వైయుక్తిక పరిశుభ్రతా ఉత్పత్తుల రంగంలోనే కాకుండా జలసంరక్షణకు వీలున్న అన్ని రంగాల్లో తమ ఉత్పత్తులు తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. -
ఏడాదిలో ఐపీఓకి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో పబ్లిక్ ఆఫర్‌కు వస్తామని సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ, సీఈఓ ఆర్.భాస్కర్ బాబు చెప్పారు. ఐపీఓ ద్వారా 450– 500 కోట్ల రూపాయలను సమీకరించాలని లకి‡్ష్యస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే ఇన్వెస్టర్ల నుంచి రూ.248 కోట్లు సమీకరించామని, ప్రస్తుతం బ్యాంకులో హెచ్డీఎఫ్సీ, హెచ్‌డీఎఫ్‌సీలైఫ్, ఐడీఎఫ్సీ, ఐఎఫ్‌సీ, గజా క్యాప్, లోక్ క్యాప్ తదితర సంస్థలకు వాటాలున్నాయని తెలియజేశారు. మూలధన అవసరాలను బట్టి రానున్న రోజుల్లో మరిన్ని నిధులు సమీకరిస్తామని, ఇప్పుటికైతే ఆర్థిక వనరులకు కొరత లేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి శాఖను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన సందర్భంగా మంగళవారమిక్కడ విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో బ్రాంచ్‌ను ఆరంభిస్తామని, క్రమంగా రెండు తెలుగురాష్ట్రాల్లో 25కు పైగా శాఖల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తమకు అన్ని బ్యాంకు శాఖల్లో 4వేల మంది ఉద్యోగులున్నారని, త్వరలో మరిన్ని రిక్రూట్మెంట్స్ చేపడతామని తెలిపారు. పెద్ద బ్యాంకులతో పోటీ లేదు ఆర్బీఐ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు అనుమతులివ్వడంలో ప్రధానోద్ధేశం చిన్న రుణాలను విస్తృతీకరించడమేనని భాస్కర్ చెప్పారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా అవతరించి రెండేళ్లయిందని, బడా బ్యాంకులతో తమకు పోలిక, పోటీ లేవని చెప్పారు. ‘‘సమర్ధవంతమైన వ్యయనియంత్రణ కారణంగా పెద్ద బ్యాంకులతో పోలిస్తే డిపాజిట్లపై దాదాపు 1 శాతం వరకు మేం ఎక్కువ వడ్డీ ఇవ్వగలుగుతున్నాం. మేమిచ్చే రుణాల్లో అన్సెక్యూర్డ్ రుణాలు ఎక్కువ శాతం ఉన్నా, అవన్నీ చిన్న మొత్తాలు కావడ వల్ల వసూలు పరంగా ఇబ్బందులు రావడం లేదు. లోన్‌బుక్‌లో చిరు వ్యాపారులకు 1– 5 లక్షల రూపాయల వరకు రుణాలు, వాహన రుణాలు, ఎస్ఎంఈ రుణాలు, చిన్నగృహరుణాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద పెద్ద రుణాలు మా పోర్టు ఫోలియోలో ఉండవు కాబట్టి ఎన్పీఏల సమస్య చాలా తక్కువ’’ అని వివరించారు. క్యు3లో స్థూల ఎన్పీఏలు 2.94 శాతం, నికర ఎన్పీఏలు 0.94 శాతంగా ఉన్నాయని చెప్పారాయన. -
ఫార్మా ఎగుమతులు 11% అప్
న్యూఢిల్లీ: ఉత్తర అమెరికా, యూరప్ దేశాల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారత ఫార్మా రంగ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం 11 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి. 2018–19లో 19.2 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ 17.3 బిలియన్ డాలర్లు కాగా, 2016–17లో 16.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత ఫార్మా ఎగుమతుల్లో ఉత్తర అమెరికా మార్కెట్ వాటా 30 శాతంగా ఉండగా, ఆఫ్రికా వాటా 19 శాతం, యూరోపియన్ యూని యన్ వాటా 16 శాతంగాను ఉంది. కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. చైనా మార్కెట్ కూడా క్రమంగా అందుబాటులోకి వస్తోందని, వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా చైనాకు ఫార్మా ఎగుమతులపై మరింతగా దృష్టి సారిస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇతరత్రా కీలకమైన దక్షిణాఫ్రికా, రష్యా, నైజీరియా, బ్రెజిల్, జర్మనీలకు కూడా ఎగుమతులు వృద్ధి చెందాయి. టాప్ 5లో ఒకటి..: ఎగుమతులకు సంబంధించిన టాప్ 5 రంగాల్లో ఫార్మా కూడా ఒకటి. 2018–19లో మొత్తం 331 బిలియన్ డాలర్ల ఎగుమతుల్లో ఫార్మా వాటా 6 శాతంగా నమోదైంది. దేశీ ఫార్మా రంగంలో జనరిక్స్ ఔషధాల వాటానే ఎక్కువగా ఉంటోంది. -
మహింద్రా లైఫ్‌స్పేస్ లాభం 35 శాతం డౌన్
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ సంస్థ మహింద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ కన్సాలిడేటెడ్ లాభం మార్చి త్రైమాసికంలో 35 శాతం తగ్గిపోయింది. రూ.31.27 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అమ్మకాల ఆదాయం రూ.247 కోట్లుగా నమోదైంది. కిందటేడాది ఇదే కాలంలో నికర లాభం రూ.47.75 కోట్లుగా ఉంటే, ఆదాయం రూ.180 కోట్లు కావడం గమనార్హం. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.1,023 కోట్ల సేల్స్ బుకింగ్స్ జరిగినట్టు కంపెనీ ప్రకటించింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.101 కోట్ల నుంచి రూ.120 కోట్లకు వృద్ధి చెందింది. ఆదాయం సైతం రూ.644 కోట్ల నుంచి రూ.654 కోట్లకు పెరిగింది. ‘‘నివాసిత గృహాల విక్రయాల్లో తొలిసారి రూ.1,000 కోట్ల మార్క్‌ను అధిగమించాం. గత గరిష్ట రికార్డు రూ.800 కోట్లు’’ అని కంపెనీ ఎండీ, సీఈవో సంగీతా ప్రసాద్ తెలిపారు. ఒక్కో షేరుకు రూ.6 చొప్పున 2018–19 సంవత్సరానికి డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. -
ఆర్థికంగా వెలిగిపోదాం!
నూతన ఆర్థిక సంవత్సరం 2019–20లోకి ప్రవేశించి మూడు వారాలు గడిచిపోయింది. ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ, వ్యయాలకు తోడు పన్ను బాధ్యతలు ఎదురవుతుంటాయి. ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఓ ప్రణాళిక రూపొందించుకుని దానిని ఆచరణలో పెడితే ఒడిదుడుకులు లేకుండా సాఫీగా జీవనం కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను ఏడాదికి ఒకసారి అయినా తప్పకుండా సమీక్షించాలని, అందుకు ఏప్రిల్ మాసం సరైనదిగా నిపుణుల అభిప్రాయం. ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి తమ పెట్టుబడులకు సంబంధించి అనుసరించ తగిన మార్గాలపై నిపుణుల సూచనలు ఇలా ఉన్నాయి. ఈఎల్ఎస్ఎస్లో సిప్ ఏప్రిల్ నుంచే పన్ను ఆదాకు ఉపయోగపడే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ప్రతీ నెలా పెట్టుబడుల ప్రణాళికను ఆరంభించాలి. దీంతో ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా పెట్టుబడుల గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి రాదని తమన్నావర్మ అనే ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచించారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండే రిస్క్‌లే ఈఎల్ఎస్ఎస్కు వర్తిస్తాయి. కనుక ప్రతీ నెలా క్రమం తప్పకుండా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆటుపోట్లను అధిగమించి మెరుగైన రాబడులను అందుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ స్వల్పకాలిక పనితీరు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఒక్కసారి ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్లు లాకిన్ అయినట్టే. అయితే, ఇది మెరుగైన రాబడులకు వీలు కల్పిస్తుంది. వాలంటరీ పీఎఫ్ (వీపీఎఫ్) ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) పథకం పరిధిలో ఉన్న వారికి అందు బాటులో ఉన్న చక్కని సాధనం వీపీఎఫ్. ఈపీఎఫ్‌కు అనుబంధంగా సభ్యులు చేసే స్వచ్ఛంద కంట్రిబ్యూషన్. ఈపీఎఫ్‌కు వర్తించే పన్ను మినహాయింపులు వీపీఎఫ్‌కూ వర్తిస్తాయి. సెక్షన్ 80సీ కింద 1.5 లక్షల వరకు పెట్టబడులకు వీపీఎఫ్ చందాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. అలాగే, రాబడులు, ఉపసంహరణలపైనా పన్ను ఉండదు. కనుక మూడు రకాల పన్ను ఆదా ప్రయోజనాలు వీపీఎఫ్‌తో పొందొచ్చు. ఈపీఎఫ్ చందాలకు అమలయ్యే వడ్డీ రేటే వీపీఎఫ్‌కూ చెల్లుబాటు అవుతుంది. పీపీఎఫ్‌లోనూ ఇదే మాదిరి పన్ను ఆదా ప్రయోజనాలున్నప్పటికీ ఈపీఎఫ్‌తో పోలిస్తే వడ్డీ రేటు తక్కువ. డెట్‌లో పెట్టుబడులకు వీపీఎఫ్ మెరుగైన మార్గం. వేతనం బ్యాంకు ఖాతాలో జమ కావడానికి ముందే వీపీఎఫ్ చందాను ఉద్యోగ సంస్థ మినహాయించడం చెల్లింపుల కోణంలో సానుకూలం. ఇంక్రిమెంట్ కూడా... ఏటా ఏప్రిల్‌లో ఇంక్రిమెంట్లు పడుతుంటాయి. అంటే ఆదాయం పెరిగినట్టే. పెరిగిన వేతనానికి తగ్గట్టే పెట్టుబడుల మొత్తాన్ని పెంచుకోవాలని నిపుణుల సూచన. చాలా మంది ఎప్పటి మాదిరే మ్యూచువల్ ఫండ్స్ సిప్ కొనసాగిస్తుంటారని, పెరిగిన వేతనం మేరకు పెట్టుబడులను పెంచుకునే వారు తక్కువేనంటున్నారు. కనుక ఈ విధమైన పొరపాట్లకు తావివ్వకుండా ఏప్రిల్ నుంచే సిప్ మొత్తాలను పెంచుకోవాలని సూచిస్తున్నారు. పెరిగిన ఇంక్రిమెంట్లో కనీసం 20 శాతాన్ని అయినా పెట్టుబడుల వైపు మళ్లించాలన్నది సూచన. రిటైర్మెంట్ కోసం ఎన్పీఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. దేశంలో ఎవరైనా సరే ఈ పథకంలో చేరి 60 ఏళ్ల వరకు చందాలు చెల్లిస్తూ వెళ్లొచ్చు. విశ్రాంత జీవన అవసరాల కోసం ఉద్దేశించినది ఈ పథకం. గడువు తీరిన తర్వాత 60% మొత్తాన్ని పన్ను లేకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. మిగిలిన 40%తో పెన్షన్ యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మొత్తంపై అప్పటి రేటు ప్రకారం పెన్షన్ అందుతుంది. ఈ పథకంలో గరిష్టంగా ఈక్విటీలకు 75% కేటాయింపులు చేసు కోవచ్చు. ఇప్పటికీ ఎన్పీఎస్ ఖాతా తెరవని వారు, ప్రారం భించేందుకు ఏప్రిల్ అనువైనది. నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉండి, కేవైసీ నిబంధనలను ఇప్పటికే పూర్తి చేసిన వారు ఆన్లైన్లోనే ఎన్పీఎస్ ఖాతాను తెరవొచ్చు. ఎన్పీఎస్ పోర్టల్‌కు వెళ్లి అక్కడి సూచనలను అనుసరించండి. పెట్టుబడులకూ ఓ లెక్క... ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక మొత్తాన్ని ఏప్రిల్ నెలలోనే అమలు చేసేయాలని, లేదా మార్చిలో చేయాలనుకోవడం కూడా సరికాదు. ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది కనుక, ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ రానుంది. అందులో ఏవైనా మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆ మార్పులకు అనుగుణంగా ప్రణాళికను కూడా మార్చుకోవాల్సి రావచ్చు. కనుక ఒకేసారి పెట్టుబడులకు దూరంగా ఉండాలి. క్రమానుగత పెట్టుబడులే ఉత్తమం. ఏడాది పొడవునా పెట్టుబడులను కొనసాగించడం వల్ల మార్పు, చేర్పులకు అవకాశం ఉంటుందని పీక్ ఆల్ఫా ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రియా సుందర్ పేర్కొన్నారు. దీనివల్ల మరింత ప్రయోజనం ఉండే పన్ను ఆదా పథకాలను ఎంచుకునేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. టీడీఎస్... బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఏడాదిలో రూ.10,000 మించితే టీడీఎస్‌ను గతంలో అమలు చేసే వారు. దీన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి రూ.40,000కు పెంచారు. అదే 60 ఏళ్లు దాటిన వారికి 50,000 వడ్డీ ఆదాయంపై టీడీఎస్ ఉండదు. ఒకవేళ వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో 40,000–50,000 మించినట్టయితే, అదే సమయంలో పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ.2.5 లక్షలు మించని వారు టీడీఎస్ లేకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం ఫామ్ 15హెచ్/15జీ ఇవ్వాలి. పన్నుల్లో మార్పులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) సంబంధించిన మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పన్ను పరంగా కొన్ని మార్పులు చేసింది. నూతన ఆర్థిక సంవత్సరం మొదలైంది కనుక మరోసారి వీటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అవసరం. రూ.5 లక్షలకు పన్ను లేదు రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కనీస మినహాయింపు రూ.2.5 లక్షల ఆదాయానికి ఆదాయపన్ను లేదన్న విషయం తెలిసినదే. దీనికి అదనంగా మరో రూ.2.5 లక్షల ఆదాయం ఉన్న వారు 5 శాతం పన్ను రేటు ప్రకారం రూ.12,500ను చెల్లించాల్సి ఉండేది. అయితే, సెక్షన్ 87 కింద 12,500 వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. కనుక రూ.2.5 లక్షలపైన ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించేంత ఆదాయం లేకపోయినప్పటికీ రిటర్నులు సమర్పించడం తప్పనిసరి. ప్రామాణిక మినహాయింపు ప్రామాణిక మినహాయింపు (స్టాండర్డ్ డిడక్షన్) రూ.40,000 నుంచి రూ.50,000కు పెరిగింది. 2018లో ఈ స్టాండర్డ్ డిడక్షన్‌ను కేంద్రం తిరిగి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అదే సమయంలో ట్రాన్స్పోర్ట్, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌పై మినహాయింపులను ఎత్తివేసింది. నోషనల్ రెంట్‌పై అద్దెలేదు పన్ను చెల్లింపుదారుల పేరిట రెండో ఇల్లు ఉండి, దానిపై అద్దె ఆదాయం ఏదీ లేకపోయినా నోషనల్ రెంట్ (ఊహాజనిత) పేరుతో పన్ను వేసే వారు. అయితే, 2019–20 నుంచి ఈ తరహా నోషనల్ ఆదాయంపై పన్ను లేదు. టీడీఎస్ పరిమితి పెంపు వడ్డీ ఆదాయం ఏటా రూ.10,000 దాటితే మూలం వద్దే పన్ను కోత (టీడీఎస్)ను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పోస్టాఫీసు అమలు చేసేవి. కాకపోతే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రూ.40,000 వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ అమలు చేయరు. అంతకుమించితేనే అమలు చేస్తారు. 60 ఏళ్లు దాటిన వారికి ఇది రూ.50,000గా అమలవుతుంది. ఇంటిపై క్యాపిటల్ గెయిన్స్ ఇల్లు అమ్మగా వచ్చిన మూలధన లాభంపై పన్ను చెల్లించడానికి బదులు ఆ మొత్తంతో మరో ఇల్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఇకపై ఒక ఇంటి విక్రయంపై వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభంతో (ఎల్టీసీజీ) రెండు ఇళ్లు కొనుగోలు చేసినా గానీ పన్ను చెల్లించక్కర్లేదు. గతంలో ఇది ఒక్క ఇంటికే పరిమితమైంది. కాకపోతే ఎల్టీసీజీ రూ.2 కోట్లకు మించకుండా ఉంటేనే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. అత్యవసర నిధి ప్రతీ కుటుంబానికీ అత్యవసర నిధి ఎంతో అవసరం. కనీసం 4–6 నెలల కుటుంబ అవసరాలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధి కింద సమకూర్చి పెట్టుకోవాలని నిపుణుల సూచన. ఒకవేళ అత్యవసర నిధి ఇప్పటికీ సమకూర్చుకోని వారు ఆలస్యం చేయకుండా వెంటనే లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడులను ఆరంభించుకోవాలి. -
మైండ్ ట్రీ 200% స్పెషల్ డివిడెండ్
న్యూఢిల్లీ: మిడ్– సైజ్ ఐటీ కంపెనీ మైండ్ ట్రీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 9 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.182 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.198 కోట్లకు పెరిగిందని మైండ్‌ట్రీ తెలిపింది. ఆదాయం రూ.1,464 కోట్ల నుంచి 26% వృద్ధితో రూ.1,839 కోట్లకు పెరిగిందని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 32% వృద్ధితో రూ.754కు, మొత్తం ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.7,021 కోట్లకు పెరిగాయని మైండ్‌ట్రీ సీఈఓ, ఎమ్డీ రోస్టో రావణన్ తెలిపారు. వంద కోట్ల డాలర్లు దాటిన వార్షికాదాయం.... ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని రావణన్ తెలిపారు. ఈ మధ్యంతర డివిడెండ్‌ను వచ్చే నెల 10లోగా చెల్లిస్తామని, అలాగే ఒక్కో షేర్‌కు రూ.4 తుది డివిడెండ్‌ను కూడా చెల్లించనున్నామని వివరించారు. అంతే కాకుండా రూ.20 (200%) స్పెషల్ డివిడెండ్‌ను కూడా ఇవ్వనున్నామని పేర్కొన్నారు. వార్షికాదాయం వంద కోట్ల డాలర్లు దాటిందని, కంపెనీ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోందని, దీని కారణంగా ఈ స్పెషల్ డివిడెండ్‌ను ఇస్తున్నామని వివరించారు. రూ.368 కోట్ల డివిడెండ్ చెల్లింపులు... మొత్తం 16 కోట్ల ఈక్విటీ షేర్లున్నాయని, స్పెషల్ డివిడెండ్ కింద ప్రమోటర్లకు, వాటాదారులకు రూ.320 కోట్ల మేర చెల్లించనున్నామని ఈ సందర్భంగా రావణన్ తెలిపారు. మధ్యంతర డివిడెండ్‌ను కూడా కలుపుకుంటే మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.368 కోట్లకు పెరుగుతాయని వివరించారు. ఈ స్పెషల్ డివిడెండ్ ప్రతిపాదనకు జూన్/జూలైల్లో జరిగే వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొన్నారు. (అప్పటికల్లా ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్ ముగుస్తుంది) గత ఆర్థిక సంవత్సరంలోనూ, గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లోనూ చెప్పుకోదగ్గ స్థాయి పనితీరు సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కంపెనీని ఎల్అండ్టీ బలవంతంగా టేకోవర్ చేస్తోన్న విషయం తెలిసిందే. -
లాభం 38 శాతం జంప్...
న్యూఢిల్లీ: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో... గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2018–19, క్యూ4)లో కంపెనీ రూ.2,494 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ1,801 కోట్లతో పోలిస్తే 38.4 శాతం ఎగబాకింది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం 8.9 శాతం వృద్ధితో రూ.13,769 కోట్ల నుంచి రూ.15,006 కోట్లకు చేరింది. కాగా, డిసెంబర్ క్వార్టర్ (క్యూ3)లో నికర లాభం రూ.2,544 కోట్లతో పోలిస్తే సీక్వెన్షి యల్ ప్రాతిపదికన క్యూ4లో లాభం 1.9 శాతం తగ్గింది. పూర్తి ఏడాదికి చూస్తే... 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి విప్రో నికర లాభం రూ.9,018 కోట్లుగా నమోదైంది. 2017–18లో నికర లాభం రూ.8,003 కోట్లతో పోలిస్తే 12.6 శాతం ఎగబాకింది. ఇక మొత్తం ఆదాయం కూడా 7.5 శాతం వృద్ధితో రూ.54,487 కోట్ల నుంచి రూ.58,585 కోట్లకు పెరిగింది. ఐటీ సేవలు ఇలా... విప్రో కీలక వ్యాపారమైన ఐటీ సేవల విభాగం ఆదాయం డాలర్ల రూపంలో క్యూ4లో 2,075 మిలియన్ డాలర్లుగా నమోదైంది. క్యూ3తో పోలిస్తే 1.4 శాతం తగ్గింది. మార్కెట్ విశ్లేషకులు 2,082 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేశారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(2019–20, క్యూ1)లో ఐటీ సేవల వ్యాపార విభాగం ఆదాయం 2,046–2,087 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది. సీక్వెన్షియల్‌గా చూస్తే వృద్ధి మైనస్ 1 నుంచి 1 శాతంగా లెక్కతేలుతోంది. కాగా, మార్కెట్ విశ్లేషకుల వృద్ధి అంచనా 0–3 శాతంతో పోలిస్తే కంపెనీ అంచనా తక్కువగా ఉండటం గమనార్హం. ఉద్యోగుల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు విప్రో ప్రకటించడం, గైడెన్స్ బలహీనంగా ఉండటంతో మంగళవారం కంపెనీ షేరు బీఎస్ఈలో 2.5 శాతం క్షీణించి రూ.281 వద్ద ముగిసింది. ‘పటిష్టమైన ఆర్డర్ల ఆసరాతో పాటు డిజిటల్ సైబర్ సెక్యూరిటీ, ఇంజనీరింగ్ సేవలు, క్లౌడ్ వంటి కీలక విభాగాల్లో మేం చేస్తున్న పెట్టుబడులు మంచి ఫలితాలను అందిస్తున్నాయి. ప్రతి త్రైమాసికంలో నిలకడగా ఆదాయాలు, లాభాలు పుంజుకోవడమే దీనికి నిదర్శనం.’ – అబిదాలి నీముచ్వాలా, విప్రో సీఈఓ–ఎండీ -
టీవీ18 బ్రాడ్కాస్ట్ ఆదాయం రూ.1,197 కోట్లు
న్యూఢిల్లీ: మీడియా కంపెనీ, టీవీ–18 బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.5 కోట్ల నికర లాభం వచ్చిందని టీవీ18 బ్రాడ్కాస్ట్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.765 కోట్ల నుంచి రూ.1,197 కోట్లకు పెరిగింది. వయాకామ్ 18 మీడియా, ఇండియాకాస్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లు గత ఏడాది మార్చి 1 నుంచి తమకు పూర్తి అనుబంధ సంస్థలుగా మారాయని కంపెనీ తెలియజేసింది. అందుకే ఈ క్యూ4 ఫలితాలను, గతేడాది ఫలితాలతో పోల్చడం సరికాదని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభం 30 శాతం వృద్ధితో రూ.314 కోట్లకు పెరిగింది. నికర లాభం రూ.167 కోట్లుగా, నిర్వహణ ఆదాయం రూ.4,993 కోట్లుగా నమోదయింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టీవీ18 బ్రాడ్కాస్ట్ షేరు 5 శాతం నష్టంతో రూ.36.70 వద్ద ముగిసింది. -
ఎన్‌బీఎఫ్‌సీలకు సెక్యూరిటైజేషన్ దన్ను
న్యూఢిల్లీ: నిధుల లభ్యత కష్టంగా మారినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ), సూక్ష్మ రుణాల సంస్థలు (ఎంఎఫ్ఐ) రుణాల పోర్ట్‌ఫోలియోను విక్రయించడం ద్వారా (సెక్యూరిటైజేషన్) దాదాపు రూ. 26,200 కోట్లు సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ మార్గంలో సమీకరించిన నిధులతో పోలిస్తే ఇది 170 శాతం అధికం. 2017–18లో సెక్యూరిటైజేషన్ ద్వారా ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్ఐలు రూ. 9,700 కోట్లు సమీకరించాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) పలు రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అయిన దరిమిలా గత ఆర్థిక సంవత్సరం ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణాల సంస్థలకు నిధులు లభ్యత కష్టసాధ్యంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో అవి ఫండ్స్ సమీకరణ లక్ష్యాల సాధన కోసం ప్రధానంగా సెక్యూరిటైజేషన్‌పై ఆధారపడినట్లు ఇక్రా పేర్కొంది. ‘2018 ఆర్థిక సంవత్సరంలో, 2019 ప్రథమార్ధంలో మొత్తం నిధుల సమీకరణలో సెక్యూరిటైజేషన్ వాటా 18–20 శాతమే ఉంది. కానీ మూడో త్రైమాసికంలో ఇది 37 శాతానికి, నాలుగో త్రైమాసికంలో 50 శాతానికి పెరిగింది‘ అని ఇక్రా గ్రూప్ హెడ్ (స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ రేటింగ్స్ విభాగం) విభోర్ మిట్టల్ తెలిపారు. 2017–18లో సెక్యూరిటైజేషన్ ద్వారా నిధులు సమీకరించిన సంస్థల సంఖ్య 24గా ఉండగా.. 2018–19లో 43కి చేరిందని ఆయన పేర్కొన్నారు. -
మార్చిలో ఎగుమతుల మెరుపు!
న్యూఢిల్లీ: ఎగుమతులు మార్చిలో భారీగా నమోదయ్యాయి. 11 శాతం వృద్ధి నమోదయ్యింది. ఔషధాలు, రసాయనాలు, ఇంజనీరింగ్ రంగాల నుంచి ఎగుమతులు భారీగా పెరగడం దీనికి కారణం. కాగా మార్చితో ముగిసిన 12 నెలల కాలంలో (2018–2019) ఎగుమతులు 9 శాతం పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... ►మార్చిలో ఎగుమతుల విలువ 32.55 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.29.32 బిలియన్ డాలర్లు. అంటే వృద్ధి 11 శాతం అన్నమాట. శాతాల్లో ఇంత స్థాయిలో వృద్ధి నమోదుకావడం 2018 అక్టోబర్ (17.86 శాతం) తరువాత ఇదే తొలిసారి. ►ఇక ఇదే నెలలో దిగుమతులు కేవలం 1.44 శాతమే పెరిగాయి. విలువ రూపంలో 43.44 బిలియన్ డాలర్లు. ► దీని ప్రకారం ఎగుమతులు–దిగుమతులకు మధ్య నికర వ్యత్యాసం(వాణిజ్యలోటు) 10.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2018 ఏడాది మార్చి నెలలో వాణిజ్య లోటు 13.61 బిలియన్ డాలర్లుగా ఉంది. 2018–19 వాణిజ్యలోటు 176.42 బిలియన్ డాలర్లు కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే, ఎగుమతులు 9 శాతం పెరిగి 331 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులూ 9 శాతం వృద్ధి చెందాయి. విలువ రూపంలో ఇది 507.44 బిలియన్ డాలర్లు. వెరసి వాణిజ్యలోటు 176.42 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వాణిజ్యలోటు 162 బిలియన్లు మాత్రమే. ఈ ఏడాది కాలంలో పెట్రోలియం (28 శాతం), ప్లాస్టిక్ (25.6 శాతం), రసాయనాలు (22 శాతం) ఫార్మా (11 శాతం), ఇంజనీరింగ్ (6.36 శాతం) రంగాలు మంచి పనితనం ప్రదర్శించాయి. ఈ కాలంలో చమురు దిగుమతులు 29.27 శాతం పెరిగి 140.47 బిలియన్ డాలర్లుగా నమోదయితే, చమురుయేతర దిగుమతులు 2.82 శాతం పెరిగి 366.97 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో సేవలు పేలవం 2019 ఏడాది ఫిబ్రవరిలో సేవల రంగం గణాంకాలు నిరాశపరిచాయి. తాజా గణాంకాల ప్రకారం... సేవలరంగం ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 6.54 శాతం (2018 ఫిబ్రవరితో పోల్చితే) తగ్గాయి. విలువ రూపంలో 16.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఇదే కాలంలో సేవల దిగుమతులూ 11 శాతం తగ్గి 9.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కష్టనష్టాల్లోనూ మంచి ఫలితం గడచిన మూడు సంవత్సరాలుగా అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ 2018–19లో 331.02 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిపాం. 2013–14లో సాధించిన 314.4 బిలియన్ డాలర్లకన్నా ఇది అధికం. సవాళ్లతో కూడిన అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లోనూ సాధించిన విజయమిది’’ – కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ మరిన్ని రంగాలపై దృష్టి అవసరం అంతర్జాతీయ వాణిజ్య ప్రతికూలతల్లోనూ ఎగుమతుల విషయంలో మంచి ఫలితాలు సాధించడం హర్షణీయం. అయితే ఫుడ్ కమోడిటీ వంటి కొత్త ఉత్పత్తుల ఎగుమతులపైనా దృష్టి సారించాలి. ఎగుమతుల వృద్ధికి ఇలాంటి నిర్ణయాలు మరింత దోహదపడతాయి. దీర్ఘకాలంలో అంతర్జాతీయ ఒడిదుడుకులను తట్టుకుని ఎగుమతులు వృద్ధి చెందుతాయి. – మోహిత్ సింగ్లా, టీపీసీఐ చైర్మన్ డిమాండ్లు నెరవేర్చాలి రక్షణాత్మక వాదం, అంతర్జాతీయ, దేశీయ కఠిన పరిస్థితుల్లోనూ ఎగుమతులు పెరగడం హర్షణీయం. అయితే ఎగుమతుల వృద్ధి మున్ముందూ కొనసాగడానికి కొన్ని చర్యలు అవసరమని డిమాండ్ చేస్తున్నాం. అందులో తగిన సమయంలో తగిన రుణ సదుపాయం ఒకటి. పరిశోధనా, అభివృద్ధి విభాగాల విషయంలో పన్ను రాయితీలు ఉండాలి. జీఎస్టీ నుంచి మినహాయింపులు అవసరం. – గణేశ్ కుమార్ గుప్తా, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ -
ఈ ఏడాది ఐటీఆర్ ఫామ్స్ నోటిఫై...
న్యూఢిల్లీ: అసెస్మెంట్ ఇయర్ 2019–20కి సంబంధించి వ్యక్తులు, కంపెనీలకు ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్ ఫామ్స్‌ను ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసింది. వేతన వర్గం ఫైల్ చేసే ఐటీఆర్–1 లేదా సహజ్‌ల్లో ఎటువంటి మార్పులూ లేవు. అయితే ఐటీఆర్ 2,3,5,6,7ల్లో కొన్ని సెక్షన్లను హేతుబద్ధీకరించడం జరిగింది. 2018–19లో సంపాదించిన ఆదాయానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, కంపెనీలు రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు తుది గడువు జూలై 31. తమ అకౌంట్లకు ఆడిట్లు అవసరం లేని వారికి ఈ గడువు వర్తిస్తుంది. -
వాహన విక్రయాలకు డిమాండ్ దెబ్బ
న్యూఢిల్లీ: దాదాపు తొమ్మిది నెలల పాటు డిమాండ్ తగ్గుదలతో గడిచిన ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి ఆటోమొబైల్ దిగ్గజ సంస్థల అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. మారుతీ సుజుకీ 2018–19లో రికార్డు స్థాయిలో మొత్తం 18,62,449 యూనిట్లు విక్రయించినప్పటికీ.. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 4.7 శాతం మాత్రమే వృద్ధి సాధించింది. 2017–18లో మారుతీ 17,79,574 వాహనాలు విక్రయించింది. దీంతో సవరించుకున్న అంచనాలను కూడా సాధించలేకపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల స్థాయిలో అమ్మకాల వృద్ధి ఉంటుందని అంచనా వేసినప్పటికీ గతేడాది డిసెంబర్లో మారుతీ సుజుకీ దీన్ని 8%కి కుదించింది. దేశీయంగా విక్రయాలు చూస్తే.. 6.1% వృద్ధితో 16,53,500 యూనిట్స్ నుంచి 17,53,700 యూనిట్స్‌కు పెరిగాయి. మరోవైపు హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం అమ్మకాలు 2.5 శాతం వృద్ధితో 6,90,184 వాహనాల నుంచి 7,07,348 వాహనాలకు పెరిగాయి. అయితే, దేశీయంగా మాత్రం అమ్మకాలు కేవలం 1.7 శాతం వృద్ధికి పరిమితమయ్యాయి. 5,36,241 నుంచి 5,45,243 వాహనాలకు పెరిగాయి. ‘గత ఆర్థిక సంవత్సరం 1.7 శాతం వృద్ధితో సానుకూలంగా ముగిసింది. దేశీయంగా అమ్మకాలు అత్యధిక స్థాయిలో నమోదయ్యాయి‘ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా నేషనల్ సేల్స్ హెడ్ వికాస్ జైన్ తెలిపారు. అటు మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు 2 శాతం వృద్ధితో 2,49,505 యూనిట్స్ నుంచి 2,54,701 యూనిట్స్‌కు పెరిగాయి. దేశీయంగా ఆటోమొబైల్ రంగం పలు సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ.. అన్ని విభాగాలు కలిపి చూస్తే దేశీ విక్రయాల్లో 11 శాతం వృద్ధి సాధించగలిగామని ఎంఅండ్ఎం ప్రెసిడెంట్ రాజన్ వధేరా చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన మూడు ఉత్పత్తులు ఇందుకు తోడ్పడ్డాయని ఆయన వివరించారు. టాటా మోటార్స్ 16 శాతం.. టాటా మోటార్స్ విక్రయాలు గత ఆర్థిక సంవత్సరం 16 శాతం వృద్ధితో 5,86,507 యూనిట్స్ నుంచి 6,78,486కి చేరాయి. గత నెల మార్చిలో మాత్రం 1 శాతం క్షీణించి 69,409 యూనిట్స్ నుంచి 68,709 యూనిట్స్‌కు తగ్గాయి. ఇక హోండా కార్స్ ఇండియా అమ్మకాలు 8 శాతం పెరిగి 1,70,026 యూనిట్స్ నుంచి 1,83,787 యూనిట్స్‌కు చేరాయి. మార్కెట్లో కఠిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ ఫలితాలు సాధించడం సానుకూలాంశమని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయల్ చెప్పారు. టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) అమ్మకాలు 7 శాతం వృద్ధితో 1,40,645 వాహనాల నుంచి 1,50,525 యూనిట్స్‌కు చేరింది. హీరో అమ్మకాలు 78 లక్షలు.. ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ 78,20,745 వాహనాలు విక్రయించింది. 2017–18లో అమ్మకాలు 75,87,130గా నమోదయ్యాయి. అటు సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా విక్రయాలు సుమారు 30 శాతం వృద్ధితో 5,74,711 యూనిట్స్ నుంచి 7,47,506కి చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు 12 శాతం వృద్ధితో 37.57 లక్షలకు పెరిగాయి. పెరిగిన మారుతీ సుజుకీ కార్ల ధరలు న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ.. ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని మోడళ్ల కార్ల ధరలను స్వల్పంగా పెంచినట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ‘హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్’ (హెచ్ఎస్ఆర్పీ)ను వాహనాలకు తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ ప్లేట్స్ వ్యయాన్ని కస్టమర్లపై మోపుతున్నట్లు వివరించింది. తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అధిక భద్రతా ప్లేట్ ధర రూ.689 వరకు ఉన్నందున ఈ మొత్తానికి ధరలు పెరిగినట్లు వెల్లడించింది. ఆల్టో 800 నుంచి ఎస్‌క్లాస్ వరకు అనేక కార్లను సంస్థ విక్రయిస్తుండగా.. వీటి ధరల శ్రేణి రూ.2.67 లక్షలు–11.48 లక్షల వరకు ఉన్నాయి. -
ధనాధన్ సెన్సెక్స్!
కొత్త ఆర్థిక సంవత్సరానికి స్టాక్ మార్కెట్ రికార్డు లాభాలతో స్వాగతం పలికింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజే సెన్సెక్స్ కొత్త జీవిత కాల గరిష్ట స్థాయి (ఇంట్రాడే) రికార్డ్‌ను సాధించింది. అయితే ఆ తర్వాత గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో ఇంట్రాడే లాభాలు దాదాపు సగం మేర ఆవిరయ్యాయి. చైనా తయారీ రంగ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటం, వాణిజ్య యుద్ధం నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య చర్చల్లో పురోగతి కనిపిస్తుండటంతో అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా మారి ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగుతుండటం, వడ్డీరేట్ల తగ్గింపు దిశగా ఆర్బీఐ పాలసీ ఉండనున్నదన్న అంచనాలు బలం పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపించాయి. మార్చిలో జీఎస్టీ వసూళ్లు మెరుగుపడటం కూడా కలసివచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 199 పాయింట్ల లాభంతో 38,872 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 45 పాయింట్లు పెరిగి 11,669 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయి, 39,116 పాయింట్లను తాకింది. లోహ, వాహన, ఇంధన, మౌలిక రంగ షేర్లు లాభపడ్డాయి. రియల్టీ, కన్సూమర్ డ్యూరబుల్ షేర్లు నష్టపోయాయి. మొత్తం 19 రంగాల సూచీల్లో 12 లాభాల్లో, 7 నష్టాల్లో ముగిశాయి. పావు శాతం తగ్గింపు... కొత్త ఆర్థిక సంవత్సరం తొలి పాలసీని ఆర్బీఐ ఈ గురువారం వెల్లడిస్తుంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ(ఎమ్‌పీసీ) సమావేశం నేడు మొదలై గురువారం ముగుస్తుంది. కీలకమైన రెపో రేటును ఆర్బీఐ పావు శాతం మేర తగ్గిస్తుందనే అంచనాలున్నాయి. అమెరికాలో పదేళ్ల బాండ్ల రాబడులు పెరగడంతో అంతర్జాతీయ వృద్ధి అంచనాలపై అనిశ్చితి తొలగిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చింది. ఇంట్రాడేలో కొత్త రికార్డ్ సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలతో ఆరంభమయ్యాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో ఈ లాభాలు మరింతగా ఎగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 443 పాయింట్ల లాభంతో 39,116 పాయింట్ల వద్ద, నిఫ్టీ 114 పాయింట్లు ఎగసి 11,738 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిలను తాకాయి. ఇంట్రాడేలో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్‌టైమ్ హై, 30,646 పాయింట్లను తాకింది. ట్రేడింగ్ చివర్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఈ లాభాలు తగ్గాయి. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 244 పాయింట్లు, నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయినట్లయింది. ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. గత ఆర్థిక సంవత్సరం వార్షిక ముగింపు కారణంగా సోమవారం నాడు ఫారెక్స్, బాండ్ల మార్కెట్ పనిచేయలేదు. ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మరిన్ని విశేషాలు.. ►స్టాక్ మార్కెట్ లాభాల కారణంగా సోమవారం ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.1.11 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే స్టాక్ మార్కెట్లో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,52,19,554 కోట్లకు ఎగసింది. ►దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమై, ఆ రెండు బ్యాంక్‌ల వాటాదారులకు బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు జారీ కావడంతో బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ 3 శాతం లాభపడి రూ.133 వద్ద ముగిసింది. ►మార్చి క్వార్టర్లో మంచి ఫలితాలు సాధించగలమని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేయడంతో టాటా మోటార్స్ షేర్ 7.3 శాతం ఎగసి రూ.187 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అధికంగా లాభపడిన షేర్ ఇదే. ►ధరల పెంపు వార్తల కారణంగా సిమెంట్ షేర్లు లాభపడ్డాయి. జేకే లక్ష్మీ సిమెంట్, ఓరియంట్ సిమెంట్, ఇండియా సిమెంట్స్, హెడెల్‌బర్గ్ సిమెంట్ ఇండియా,, ఏసీసీ, అంబుజా సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, రామ్‌కో సిమెంట్స్, శ్రీ సిమెంట్, జేకే సిమెంట్స్ తదితర షేర్లు 1–5 శాతం రేంజ్లో పెరిగాయి. రూపాయికి మరింత బలం! ముంబై: ఆర్బీఐ... వ్యవస్థలోకి 5 బిలియన్ డాలర్లను (రూ.35,000 కోట్లు) పంప్ చేయనుంది. డాలర్–రూపాయి స్వాప్ ఆక్షన్ ద్వారా 23వ తేదీన ఈ లిక్విడిటీని బ్యాంకింగ్ వ్యవస్థలోకి పంప్ చేయనున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ ఈ తరహా చర్యలు చేపట్టడం వారంలో ఇది రెండవసారి. మార్చి 26న కూడా ఇదే విధమైన చర్యలను (మూడేళ్ల కాలానికి డాలర్/రూపాయి కొనుగోలు/అమ్మకం వేలం) ఆర్బీఐ తీసుకుంది. ఈ చర్య రూపాయి మరింత బలోపేతానికి దారితీసే అంశం. రూ. 9 లక్షల కోట్లకు చేరువలో రిలయన్స్... ఇంట్రాడేలో సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయిని తాకినట్లుగానే పలు షేర్లు కూడా ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఇంట్రాడేలో 3.8 శాతం లాభంతో రూ.1,407(ఆల్‌టైమ్ హై)ను తాకింది. చివరకు 2 శాతం లాభంతో రూ.1,392 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.18,084 కోట్లు పెరిగి రూ.8,82,061 కోట్లకు ఎగసింది. రూ.9 లక్షల మార్కెట్క్యాప్ విలువకు కేవలం రూ.17,939 కోట్లు మాత్రమే తక్కువ. మార్కెట్ క్యాప్ పరంగా చూస్తే, భారత్‌లో అత్యంత విలువైన కంపెనీ ఇదే. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ కంపెనీ, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, సిటీ యూనియన్ బ్యాంక్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్, హావెల్స్ ఇండియా, ఐసీఐసీఐ లాంబార్డ్, ఐనాక్స్ లీజర్, ఎస్కేఎఫ్ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. రికార్డ్.. రికార్డ్ సూచీ ఇంట్రాడే ఆల్‌టైమ్ హై సెన్సెక్స్ 39,116 బ్యాంక్ నిఫ్టీ 30,648 -
పావు శాతం రేట్ల కోతకు అవకాశం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగానికి ఉత్తేజాన్నిచ్చేందుకు గాను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నూతన ఆర్థిక సంవత్సరం (2019–20) తొలి ద్వైమాసిక పరపతి సమీక్షలో పావు శాతం రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం దేశ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆర్బీఐ ఎంపీసీ చివరి సమీక్ష ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగ్గా, రెపో రేటు, రివర్స్ రెపో రేట్లను పావు శాతం చొప్పున తగ్గిస్తూ నాటి సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ ఈ నెల 2 నుంచి సమీక్షపై కసరత్తు చేయనుంది. 4వ తేదీన పాలసీపై ప్రకటన చేస్తుంది. గతంలో మాదిరే ఈ విడత కూడా కీలక సమీక్షకు ముందుగానే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పరిశ్రమ వర్గాలు, డిపాజిట్ల అసోసియేషన్, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) ప్రతినిధులు, బ్యాంకర్లతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రిత స్థాయి 4 శాతం లోపే ఉండడంతో ఆర్థిక రంగానికి ఊతమిచ్చేందుకు మరో విడత రేట్ల కోత అవసరమని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. మార్కెట్లకు సానుకూలం ‘‘పావు శాతం రేట్ల కోతను మార్కెట్లు ఇప్పటికే అంచనా వేశాయి. తటస్థ విధానం నుంచి సర్దుబాటు ధోరణికి ఆర్బీఐ తన విధానాన్ని మార్చుకోవడంతోపాటు, లిక్విడిటీ మెరుగుపడడం, రేట్ల కోత నిర్ణయాలు మార్కెట్లకు మంచి సానుకూలం’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పీసీజీ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాటజీ హెడ్ వీకే శర్మ తెలిపారు. అంతర్జాతీయ, స్థానిక అంశాలు భవిష్యత్తు పాలసీ చర్యలను నిర్ణయిస్తాయని కోటక్ మహింద్రా బ్యాంకు ప్రెసిడెంట్ శాంతి ఏకాంబరం పేర్కొన్నారు. ‘‘వినియోగం కొంత తగ్గింది. పెట్టుబడుల వాతావరణం కూడా ఇప్పటికీ కనిష్ట స్థాయిలోనే ఉంది. కనుక ఈ ఏడాది చివర్లో మరో విడత పావు శాతం రేట్ల కోత ఉండొచ్చు. అయితే అది ద్రవ్యోల్బణం డేటాపై ఆధారపడి ఉంటుంది. అలాగే, ఎన్నికల తర్వాత బడ్జెట్, రుతుపవనాలు, చమురు ధరలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకోవచ్చు’’ అని ఏకాంబరం వివరించారు. 2018–19లో ఆర్థిక వృద్ధి నిదానించడంతో రెపో రేటును కనీసం పావు శాతం అయినా తదుపరి సమావేశంలో తగ్గించాలని, మృదువైన విధానాన్ని కొనసాగించాలని కోరినట్టు సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. రేట్ల కోతను బ్యాంకులు బదిలీ చేసేందుకు గాను నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ను తగ్గించాలని సూచించినట్టు చెప్పారు. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.57 శాతంగా ఉన్న విషయం గమనార్హం. -
మరింత ముందుకు సూచీలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగింపు పలికాయి. అంతర్జాతీయ సంకేతాలు కలసి రావడంతో సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 38,673 వద్ద క్లోజయింది. నిప్టీ–50 54 పాయింట్లు పెరిగి 11,630 వద్ద స్థిరపడింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ నికరంగా 5,704 పాయింట్లు (17.30 శాతం) పెరగ్గా, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ 1,510 పాయింట్లు (15 శాతం) వరకు లాభపడింది. విదేశీ పెట్టుబడుల రాక బలంగా ఉండడానికి తోడు అమెరికా–చైనా మధ్య వాణిజ్య చర్చలు ఫలప్రదం అవుతాయన్న అంచనాలు, బలమైన రూపాయి కారణంగా ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్ మార్కెట్ లాభాలకు కారణంగా విశ్లేషకుల అభిప్రాయం. సెన్సెక్స్ 38,675 పాయింట్ల వద్ద సానుకూలంగా ఆరంభం కాగా, ఇంట్రాడేలో 38,748 పాయింట్ల వరకు పెరిగింది. చివరికి 127 పాయింట్ల లాభంతో 38,673 వద్ద ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్ 508 పాయింట్లు (1.33 శాతం) నికరంగా పెరగ్గా, నిఫ్టీ 167 పాయింట్లు (1.45%) లాభపడింది. కాగాసెన్సెక్స్లో వేదాంత అత్యధికంగా 3.20 శాతం ర్యాలీ చేసింది. నష్టాలు మిగిల్చిన స్మాల్‌క్యాప్ కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరం స్మాల్ క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీలు ఇన్వెస్టర్లకు చేదు ఫలితాలను మిగిల్చాయి. ప్రధాన సూచీ బీఎస్ఈ సెన్సెక్స్ ఆర్థిక సంవత్సరం 17 శాతం (5,704 పాయింట్లు) లాభపడగా, స్మాల్‌క్యాప్ సూచీ 11.57 శాతం (1,967 పాయింట్లు), మిడ్‌క్యాప్ సూచీ 3 శాతం మేర (483 పాయింట్లు) నష్టపోయాయి. మరో ప్రధాన సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ వార్షికంగా చూస్తే 2018–19లో 15 శాతం లాభాలను ఇచ్చిందని... బ్యాంకులు, ఎనర్జీ, ఐటీ మంచి లాభాలను ఇవ్వగా, ఆ తర్వాత ఎఫ్ఎంసీజీ, ఫార్మా ఈ వరుసలో ఉన్నట్టు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం ఆందోళనలు, చమురు ధరల పెరుగుదల, వాణిజ్య యుద్ధం వంటి అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపించినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు. -
సోమవారం బ్యాంకులకు సెలవు!
ముంబై: బ్యాంకులు ఏప్రిల్ 1వ తేదీ సోమవారం పనిచేయవు. మార్చి 31వ తేదీతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి (2018–19) సంబంధించి ఖాతాల ముగింపును (యాన్యువల్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్) పురస్కరించుకుని వాణిజ్య, సహకార బ్యాంకులు పనిచేయవని ఆర్బీఐ పేర్కొంది. ప్రభుత్వ లావాదేవీలకు ఆదివారం సేవలు కాగా ఆర్థిక సంవత్సరం చివరిరోజుకావడంతో (మార్చి 31) ప్రభుత్వానికి రావాల్సిన వసూళ్లకు అలాగే చెల్లింపుల లావాదేవీల నిర్వహణకు సంబంధిత ప్రత్యేక బ్యాంక్ బ్రాంచీలు పనిచేస్తాయి. ‘‘పే అండ్ అకౌంట్ బ్యాంక్ బ్రాంచీలు అన్నీ మార్చి 31న పనిచేయలని కేంద్రం సూచించింది’’ అని ఆర్బీఐ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. ఆర్టీజీఎస్, నిఫ్ట్ వంటి అన్ని ఎలక్ట్రానిక్ లావాదేవీ సమయాలు ఇందుకు అనుగుణంగా పొడిగించడం జరిగింది. -
క్యూ3లో క్యాడ్ 2.5 శాతం
ముంబై: దేశ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) అక్టోబర్–డిసెంబర్ కాలంలో (ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చిచూస్తే, 2.5%గా నమోదయ్యింది. విలువలో క్యాడ్ పరిమాణం 16.9 బిలియన్ డాలర్లు. 2017– 2018 ఇదే త్రైమాసికంలో ఈ విలువ 13.7 బిలియన్ డాలర్లు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ మధ్య ఈ విలువ 19.1 బిలియన్ డాలర్లు (జీడీపీలో 2.9 శాతం). రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. కాగా 2018 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ మొత్తం కాలాన్ని తీసుకుంటే, క్యాడ్ జీడీపీలో 2.6 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే కాలంలో ఈ రేటు 1.8%. ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం (ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా) మధ్య నికర వ్యత్యాసమే కరెంట్ అకౌంట్ లోటు. -
ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కేంద్రం రుణాలు రూ.4.42 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రథమార్ధం (2019–2020, ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య)లో కేంద్రం రూ.4.42 లక్షల కోట్ల రుణాలను సమీకరించనుంది. ఆర్థిక శాఖ శుక్రవారం విడుదల చేసిన సమాచారం ప్రకారం– 2019–20లో స్థూలంగా రూ.7.1 లక్షల కోట్ల రుణాలు సమీకరించాలన్నది కేంద్ర బడ్జెట్ ప్రణాళిక. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–2019) అంచనాల కన్నా (రూ.5.71 లక్షల కోట్లు) ఇది అధికం. వచ్చే ఆర్థిక సంవత్సరం కేంద్ర రుణ ప్రణాళికలను ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ వివరిస్తూ, వచ్చే ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య స్థూల రుణాలు రూ.4.42 లక్షల కోట్లయితే, నికర రుణాలు రూ.3.4 లక్షల కోట్లని తెలిపారు. స్థూల రుణాల్లో గత రుణాల రీపేమెంట్లూ కలిసి ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును 3.4 శాతం వద్ద కట్టడి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా గార్గ్ పేర్కొన్నారు. ద్రవ్యలోటు కట్టడికి డేటెడ్ సెక్యూరిటీస్ అండ్ ట్రెజరీ బిల్లుల ద్వారా మార్కెట్ నుంచి కేంద్రం నిధులు సమీకరిస్తుందని తెలిపారు.