కొత్త ఆర్థిక సంవత్సరం(2020–21) తొలి రోజు స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. కరోనా మహమ్మారి విలయతాండవానికి అంతర్జాతీయంగా ప్రపంచ మార్కెట్లు కకావికలమవుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ సూచీల్లో భారత వెయిటేజీకి సంబంధించిన మార్పులను ఎమ్‌ఎస్‌సీఐ మే నెలకు వాయిదా వేయడంతో బుధవారం మన మార్కెట్ కూడా భారీగా పతనమైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,203 పాయింట్లు క్షీణించి 28,265 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 344 పాయింట్లు నష్టపోయి 8,254 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. నేడు (గురువారం) శ్రీరామ నవమి సందర్భంగా సెలవు కావడంతో నిఫ్టీ వీక్లీ ఆప్షన్లు బుధవారమే ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వారం కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.
ఇన్వెస్టర్లు... బహుపరాక్....!
సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. పావుగంటకే నష్టాల్లోకి జారిపోయింది. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,395 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్ల మేర నష్టపోయాయి. ఇక ఆసియా మార్కెట్లు 2–4 శాతం రేంజ్‌లో నష్టపోగా, యూరప్ మార్కెట్లు కూడా అదే స్థాయి నష్టాల్లో ఆరంభమయ్యాయి. ముడిచమురు ధరలు 5 శాతం మేర తగ్గాయి. కాగా స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
బ్యాంక్ షేర్లు బేర్
ప్రస్తుత లాక్‌డౌన్ కారణంగా వివిధ కంపెనీల వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని, ఫలితంగా బ్యాంక్‌ల మొండిబకాయిలు భారీగా పెరుగుతాయనే భయాందోళనలతో బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు 8–2 శాతం రేంజ్‌లో నష్టపోయాయి.
► టెక్ మహీంద్రా షేర్ 9.2% పడింది.
► 30 సెన్సెక్స్ షేర్లలో 4 షేర్లు–హీరో మోటో, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ మాత్రమే లాభపడగా, మిగిలిన 26 షేర్లు నష్టపోయాయి.
తొలి రోజే రూ.3.2 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.3.2 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.20 లక్షల కోట్ల తగ్గుదలతో రూ.110.28 లక్షల కోట్లకు
పడిపోయింది.
పతనానికి ప్రధాన కారణాలు
► కొనసాగుతున్న కరోనా కల్లోలం...: భారత్‌లో కరోనా కేసులు 1,621కు, మరణాలు 42కు చేరాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 8.6 లక్షలకు, మరణాలు 42,000కు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో మాంద్యం భయాలు పెరుగుతున్నాయి.
► ఎమ్‌ఎస్‌సీఐ ‘వెయిటేజీ’ వాయిదా: ఎమ్‌ఎస్‌సీఐ(మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్)... తన గ్లోబల్ సూచీల్లో భారత వెయిటేజీ పెంచే నిర్ణయాన్ని మే నెలకు వాయిదా వేసింది. వాస్తవానికి ఈ మార్పులు బుధవారం (ఏప్రిల్ 1)నుంచే అమల్లోకి రావాలి. దీనివల్ల భారత్‌లోకి 1,000 కోట్ల డాలర్లు(రూ.76,000 కోట్లు) వచ్చే చాన్స్ ఉంది.
► బలహీనంగా ఆసియా తయారీ డేటా: జపాన్, దక్షణి కొరియా దేశాల తయారీ రంగ గణాంకాలు బలహీనంగా ఉండటం ప్రతికూల ప్రభావం చూపించింది.
► తగ్గిన వాహన విక్రయాలు...: మార్చి నెలలో వాహన విక్రయాలు బాగా తగ్గాయి. మారుతీ సుజుకీ మ్మకాలు 47 శాతం, అశోక్ లేలాండ్ విక్రయాలు 90 శాతం, ఐషర్ మోటార్స్ అమ్మకాలు 83 శాతం మేర పడిపోయాయి. వాహన విక్రయాలు ఈ స్థాయిలో క్షీణించడం ఇన్వెస్టర్లను కలవర పెట్టింది.
► ద్రవ్యలోటు లక్ష్యం మిస్...
గత ఆర్థిక సంవత్సరం (2019–20) ఫిబ్రవరి నాటికే ద్రవ్యలోటు(వ్యయానికి, ఆదాయానికి మధ్య వ్యత్యాసం) పూర్తి బడ్జెట్ అంచనాల్లో 135 శాతానికి (రూ.10,36,485 కోట్లు) చేరింది. ద్రవ్యలోటు లక్ష్యం పెద్ద మార్జిన్‌తో కట్టు తప్పడం.. ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది.
నేడు సెలవు
శ్రీరామ నవమి సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్‌కు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో ట్రేడింగ్ జరగదు.
భారీ నష్టాలతో బోణి
Published Thu, Apr 2 2020 1:32 AM | Last Updated on Thu, Apr 2 2020 5:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment