World markets
-
ప్రపంచ మార్కెట్లు, గణాంకాల ఎఫెక్ట్
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లలో కనిపించే ట్రెండ్ ప్రధానంగా ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు దిక్సూచి కాగలదని విశ్లేషకులు పేర్కొన్నారు. విజయదశమి సందర్భంగా బుధవారం(5న) మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఆర్థిక గణాంకాలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ జోరు, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ తీరు వంటి అంశాలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు స్టాక్ విశ్లేషకులు వివరించారు. యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను వేగంగా పెంచుతుండటంతో డాలరు ఇండెక్స్ రెండు దశాబ్దాల గరిష్టం 115ను దాటేసింది. మరోపక్క ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ 3.5 శాతాన్ని మించాయి. దీంతో దేశీ కరెన్సీ రూపాయి కొత్త చరిత్ర లిఖిస్తూ 82కు పతనమైంది. ఇది రిజర్వ్ బ్యాంక్ వద్ద గల విదేశీ మారక నిల్వలను సైతం దెబ్బతీస్తోంది. ఇందుకు కరెంట్ ఖాతా లోటు(సీఏడీ) జీడీపీలో 2.8 శాతానికి చేరడం సైతం ప్రభావం చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. వెరసి ఈ వారం మార్కెట్లు మరోసారి ఆటుపోట్లను చవిచూడవచ్చని అత్యధిక శాతం మంది నిపుణులు అంచనా వేశారు. చమురు సెగ తగ్గినా.. ఇటీవల ముడిచమురు ధరలు దిగివస్తున్నాయి. బ్యారల్ 80–85 డాలర్ల వద్ద కదులుతున్నాయి. ఇది సానుకూల అంశమే అయినప్పటికీ డాలరు బలపడుతుండటంతో ఈ ప్రభావం ఆవిరౌతున్నట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో సెంటిమెంటు బలహీనపడుతున్నట్లు తెలియజేశారు. దీనికితోడు మరోపక్క కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికర అమ్మకందారులుగా నిలుస్తుండటం మార్కెట్లను దెబ్బతీస్తున్నట్లు ప్రస్తావించారు. దీంతో వరుసగా ఏడు రోజులపాటు క్షీణపథంలో సాగిన మార్కెట్లు గత వారం చివర్లో కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 672, నిఫ్టీ 233 పాయింట్ల నష్టంతో సరిపెట్టుకున్నాయి. కాగా.. ఈ వారం సెప్టెంబర్ నెలకు యూఎస్, జపాన్ తయారీ రంగ(పీఎంఐ) గణాంకాలు వెలువడనున్నాయి. దేశీయంగా ఆటో విక్రయాలు జోరందుకున్నాయి. దీంతో ఆటో షేర్లు వెలుగులో నిలిచే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మార్కెట్ విలువకు చిల్లు గత వారం మార్కెట్ల పతనంతో టాప్–10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో రూ. 1.16 లక్షల కోట్లు ఆవిరైంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ రూ. 41,706 కోట్లు నీరసించి రూ. 16.08 లక్షల కోట్లకు పరిమితంకాగా.. పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ విలువ రూ. 17,314 కోట్ల నష్టంతో దాదాపు రూ. 4.74 లక్షల కోట్లకు చేరింది. ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 13,806 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 13,424 కోట్లు, హెచ్డీఎఫ్సీ రూ. 10,831 కోట్లు చొప్పున విలువను కోల్పోయాయి. ఇదేవిధంగా మార్కెట్ విలువలో బజాజ్ ఫైనాన్స్‌కు రూ. 10,241 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌కు రూ. 8,732 కోట్లు చొప్పున చిల్లు పడింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ మాత్రం రూ. 20,145 కోట్లమేర ఎగసి రూ. 5.94 లక్షల కోట్లను అధిగమించింది. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ను ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే సంగతి తెలిసిందే. ఎఫ్‌పీఐల యూటర్న్ దేశీ క్యాపిటల్ మార్కెట్లలో గత రెండు నెలలుగా నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు ఇటీవల అమ్మకాల యూటర్న్ తీసుకున్నారు. ఫలితంగా సెప్టెంబర్‌లో రూ. 7,624 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. వీటితో కలిపిచూస్తే 2022లో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 1.68 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే ఆగస్ట్‌లో రూ. 51,200 కోట్లు, జులైలో దాదాపు రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. జులైకు ముందు అంటే 2021 అక్టోబర్ మొదలు ఎఫ్‌పీఐలు వరుసగా తొమ్మిది నెలలపాటు విక్రయాలకే కట్టుబడటం గమనార్హం! ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, రూపాయి పతనం, ట్రెజరీ ఈల్డ్స్, డాలరు జోరు వంటి అంశాల నేపథ్యంలో భవిష్యత్‌లోనూ ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో ఆటుపోట్లు కనిపించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, జర్మనీకి ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లు సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు తెలియజేశారు. ఇటీవల పెరిగిన ఆర్థిక మాంద్య భయాలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు షాకిస్తున్నట్లు వివరించారు. -
మార్కెట్ క్యాప్.. ఆవిరి..
-
రష్యా దాడులు.. యూనైటెడ్ కింగ్‌డమ్‌ని వెనక్కి నెట్టిన ఇండియా
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దాడులు యూరప్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రష్యా వైఖరిని ఖండిస్తూ యూరప్ దేశాలు ఎడాపెడా ఆంక్షలు పెడుతూ పోతున్నా.. ఆశించిన ఫలితం రావడం లేదు సరికదా అక్కడి ఇన్వెస్టర్లు బెంబెలెత్తిపోతున్నారు. మార్కెట్ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ఫలితంగా ఆదేశాలకు సంబంధించిన మార్కెట్ క్యాప్ భారీగా కోతకు గురవుతోంది. బ్లూంబర్గ్ తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం యూరప్ ఆర్థిక శక్తులుగా చెప్పుకునే ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్ మార్కెట్లు కుదేలయ్యాయి. నెల రోజుల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయల సంపద మార్కెట్లో హరించుకుపోయింది. ఒక్క ఇంగ్లండ్ మార్కెట్లనే పరిశీలిస్తే ఫిబ్రవరి 1 నుంచి మార్చి 9 వరకు ఏకంగా 410 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. దీంతో ఆ దేశ మార్కెట్ క్యాప్ తగ్గి 3.11 ట్రిలియన్ డాలర్లకు పరిమితమైంది. మనకు తప్పలేదు ఇక ఇండియా విషయానికి వస్తే ఉక్రెయిన్ - రష్యా యుద్ధంతో మన స్టాక్‌మార్కెట్లు షేక్ అయ్యాయి. దేశీ సూచీలు తిరోగమనం పట్టాయి. విదేశీ ఇన్వెస్టర్లు తమ సొమ్ము వెనక్కి తీసుకున్నారు. ఫలితంగా మన మార్కెట్ క్యాప్‌కి 357 బిలియన్ల సంపద కరిగిపోయింది. దీంతో మన మార్కెట్ క్యాప్ 3.16 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో మార్కెట్ క్యాప్ పట్టికలో యూకేని వెనక్కి నెట్టింది ఇండియా. ఇండియా వెనుక యూకే గత నెల రోజుల్లో వచ్చిన మార్పులతో మార్కెట్ క్యాప్ పరంగా ఇండియా ఇంగ్లండ్‌ను దాటేసింది. ఇంతకాలం ఇండియా కంటే ముందు వరుసలో ఉండే బ్రిటీష్ రాజ్యం మార్కెట్ చరిత్రలో తొలిసారి ఇండియా వెనక నిలవాల్సి వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఇండియా కంటే ఇంగ్లండ్ మార్కెట్‌పై అధిక ప్రభావం చూపడమే ఇందుకు కారణం మెరిసిన సౌదీ మరోవైపు ఏషియా మార్కెట్లలో చైనా, జపాన్, హాంగ్‌కాంగ్, ఇండియాల తర్వాత స్థానంలో ఉండే సౌదీ అరేబియా మార్కెట్లకు ఈ యుద్ధం కలిసి వచ్చింది. యుద్ధ ప్రభావంతో ఆయిల్ ధరలు ఎగిసిపడటంతో.. వివిధ మార్కెట్లలో ఉన్న సొమ్మంతా సౌదీ అరేబియా వైపు పయణించింది. ఫలితంగా రెండు వారాల వ్యవధిలోనే ఈ మార్కెట్‌కి 442 బిలియన్ డాలర్ల సంపద వచ్చి పడింది. ఫలితంగా సౌదీ అరేబియా మార్కెట్ క్యాప్ 3.25 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది నంబర్ వన్ యుద్ధ అనంతర పరిస్థితుల్లో ఉన్న లెక్కలను పరిశీలిస్తే ఇప్పటికీ మార్కెట్ క్యాప్ విషయంలో అమెరికా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆ దేశ మార్కెట్ క్యాప్ విలువ ఏకంగా 46 ట్రిలియన డాలర్లుగా నమోదు అయ్యింది. ఆ తర్వాత స్థానంలో డ్రాగన్ కంట్రీ చైనా నిలిచింది. చైనా మార్కెట్ క్యాప్ 11.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. టాప్ 5 మార్కెట్ క్యాప్ విషయంలో ప్రపంచ దేశాల సరళిని గమనిస్తే తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనాలు ఉండగా ఆ తర్వాత వరుసగా జపాన్ 5.7 ట్రిలియన్ డాలర్లు హాంగ్‌కాంగ్ 5.5 ట్రలియన్ డాలర్లు, సౌదీ అరేబియా 3.25 ట్రిలియన్ డాలర్లు, ఇండియా 3.16 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మన తర్వాత 3.12 ట్రిలియన్ డాలర్లతో కెనడా నిలిచింది. యూరప్ పరిస్థితి యుద్ధం దెబ్బతో యూరప్ స్టాక్‌మార్కెట్లు కంగుతిన్నాయి. ఇక్కడ యూనెటైడ్ కింగ్డమ్ 3.11 ట్రిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ 2.71 ట్రిలియన్ డాలర్లు, జర్మనీ2.18 ట్రిలియన డాలర్లుగా ఉన్నాయి. ఇక ఉక్రెయిన్ తరహాలో ప్రమాదం అంచున ఉన్న తైవాన్ మార్కెట్ క్యాప్ 2.06 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. చదవండి: Russia Ukraine War: రష్యాపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు..! -
మార్కెట్లను బెంబేలెత్తించిన కొత్త రకం కరోనా
ముంబై: రోజుకో కొత్త రికార్డును తిరగరాస్తూ జోరుమీదున్న సూచీలకు సోమవారం అమ్మకాల షాక్ తగిలింది. కొత్త రకం కరోనా వైరస్ భయాలు మార్కెట్‌ను మరోసారి వెంటాడడంతో పాటు జీవితకాల గరిష్టస్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు ఏడు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి వెల్లువెత్తిన అమ్మకాల సునామీతో సెన్సెక్స్ 47,000– 46,000 పాయింట్ల స్థాయిలను ఒకే రోజులో కోల్పోయింది. చివరికి 1,407 పాయింట్లు కుప్పకూలి 45,554 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 432 పాయింట్లు నష్టపోయి 13,328 వద్ద ముగిసింది. దీంతో సూచీల ఆరురోజుల వరుస లాభాలకు బ్రేక్ పడినట్లైంది. మార్కెట్ భారీ పతనంతో అన్ని రంగాల ఇండెక్స్‌లు భారీ నష్టాల మూటగట్టుకున్నాయి. అత్యధికంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల షేర్లలో విక్రయాలు జరిగాయి. ఇంట్రాడేలో ఒక దశలో సెన్సెక్స్ 2038 పాయింట్ల నష్టాన్ని చవిచూసి 44,923 స్థాయిని చేరుకుంది. నిఫ్టీ 629 పాయింట్లు క్షీణించి 13,131 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. రూపాయి విలువ 23 పైసల నష్టాన్ని చవిచూసి 73.79 వద్ద స్థిరపడింది. నిఫ్టీ–50 ఇండెక్స్, సెన్సెక్స్ సూచీల్లో ఏ ఒక్క షేరు లాభపడలేదు. కొత్త రకం కరోనా విజృంభణతో బ్రిటన్, భారత్‌ల మధ్య డిసెంబర్ 31 వరకు విమాన సర్వీసులను నిలిపేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటనతో ఎయిర్‌లైన్స్ షేర్లు 10% నష్టాన్ని చవిచూశాయి. స్టాక్ మార్కెట్లో వొలటాలిటీ(వీఐఎక్స్) ఇండెక్స్ అనూహ్యంగా 25% పెరిగి 23 స్థాయిపైన ముగిసింది. ఈ ఇండెక్స్ ఎంత ర్యాలీ చేస్తే మార్కెట్లో అంత ఒడిదుడుకులు ఉన్నట్లు భావిస్తారు. నిమిషానికి రూ.1,850 కోట్ల నష్టం... సూచీల మూడుశాతం పతనంతో ఇన్వెస్టర్ల సంపద హారతిలా కరిగిపోయింది. ట్రేడింగ్‌లో వారికి ప్రతి నిమిషానికి రూ.1,850 కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లు రూ.6.89 లక్షల కోట్లను కోల్పోయారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) రూ.178 లక్షల కోట్లకు దిగివచ్చింది. నష్టాలు ఎందుకంటే... ►తెరపైకి కొత్త రకం కరోనా భయాలు... ఈ ఏడాది ప్రథమార్ధం చివర్లో మార్కెట్ పతనాన్ని శాసించిన కరోనా భయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కోవిడ్–19 నియంత్రణకు వ్యాక్సిన్ పంపిణికీ సిద్ధమవుతున్న వేళ వైరస్ తాజాగా రూపు మార్చుకుని ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. ఈ కొత్త వైరస్ విజృంభణతో యూరప్‌లో పలు దేశాలు పరిమితితో కూడిన లాక్‌డౌన్‌ను విధించగా, బ్రిటన్ పూర్తిలాక్ స్థాయిలో ఆంక్షలను అమలు చేస్తోంది. బ్రిటన్ నుంచి భారత్ వచ్చే విమాన సర్వీసులను డిసెంబర్ 31 వరకు నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లు అన్ని రంగాలలోనూ అమ్మకాలకు తెరతీశారు. ►గరిష్టస్థాయిల లాభాల స్వీకరణ.... గత కొన్ని రోజులుగా సూచీలు ముగింపులోనూ, ఇంట్రాడేలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తుండడంతో పలు షేర్లు అధిక వ్యాల్యుయేషన్ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దీనికి తోడు క్రిస్మస్, ఏడాది ముగింపు సెలవులు రానున్న నేపథ్యంలో ఇన్వెసర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ►బలహీన అంతర్జాతీయ సంకేతాలు... అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. కొత్తగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ యూరో దేశాల్లో విజృంభించడంతో బ్రిటన్ అంతటా లాక్‌డౌన్‌ను విధించారు. అలాగే బ్రెగ్జిట్‌పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలకు చెందిన సూచీలు 3 శాతం నష్టంతో ముగిశాయి. ఆసియాలో జపాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్ సింగపూర్ దేశాల ఈక్విటీ సూచీలు 1 శాతం నుంచి 5 శాతం వరకు నష్టాలతో ముగిశాయి. -
అన్ని రంగాల్లోనూ ఆత్మనిర్భర్
న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ స్వావలంబ భారత్ దిశగా కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆటబొమ్మల మార్కెట్ సుమారు రూ. 7 లక్షల కోట్లు కాగా.. అందులో భారత్ వాటా చాలా తక్కువగా ఉందని గుర్తు చేశారు. భారత్‌లోని స్టార్టప్స్, యువ పారిశ్రామికవేత్తలు ఈ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచ ఆట బొమ్మల కేంద్రంగా భారత్ రూపుదిద్దుకోగలదని, స్థానిక ఆట బొమ్మలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని ‘మన్ కీ బాత్’లో మోదీ వ్యాఖ్యానించారు. ‘దేశంలో నిపుణులైన బొమ్మల తయారీదారులున్నారు. బొమ్మల తయారీ ద్వారా దేశ ఘన చరిత్రను ప్రచారం చేయవచ్చు. గొప్ప భవిష్యత్తుకు బాటలు వేయవచ్చు’అన్నారు. ప్రత్యేకంగా భారత్‌పైనే, భారత్‌లోనే కంప్యూటర్ గేమ్స్ రూపకల్పన జరగాలని, ఆ దిశగా సమిష్టిగా కృషి చేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కోరారు. భారత దేశ సాంస్కృతిక ఔన్నత్యం, సంప్రదాయాలు కొత్త కొత్త కంప్యూటర్ గేమ్స్ తయారీకి స్ఫూర్తినివ్వగలవన్నారు. ‘మన దేశంలో చాలా విషయాలున్నాయి. మన చరిత్ర ఘనమైనది. దేశ చరిత్రపై ఆధారపడ్డ గేమ్స్‌ను భారత్‌లోనే రూపొందించాలని దేశంలోని నిపుణులైన యువతను కోరుతున్నా’అన్నారు. ప్రతీనెల చివరి ఆదివారం ‘మన్ కీ బాత్’పేరుతో ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారనే విషయం తెలిసిందే. ప్రపంచ ఆట బొమ్మల మార్కెట్లో భారత్ వాటాను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల ప్రధాని మోదీ ఒక అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆటబొమ్మల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా ప్రథమ స్థానంలో ఉంది. ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ► కరోనా మహమ్మారి సమయంలో ఉత్సవాల నిర్వహణలో భారతీయులు గొప్ప సంయమనం, నిరాడంబరతను పాటిస్తున్నారు. ఇది అభినందనీయం. ► ఈ ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇందుకు అన్నదాతలకు అభినందనలు. గత సంవత్సరం కన్నా మొత్తంగా దాదాపు 7% సాగు విస్తీర్ణం పెరిగింది. వరి సాగు 10%, పప్పు ధాన్యాల సాగు 5%, నూనెగింజల సాగు 13%, పత్తి సాగు 3% పెరిగింది. ► 2022 నాటికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలవుతున్న నేపథ్యంలో.. స్థానిక స్వాతంత్య్ర సమరయోధుల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలి. నాడు స్థానికంగా జరిగిన ఘటనలను, కార్యక్రమాలను వారికి విశదీకరించాలి. దానివల్ల మరుగునపడిన చాలామంది స్వాతంత్య్ర యోధుల చరిత్ర ప్రపంచానికి తెలుస్తుంది. ► ఇటీవల జరిగిన ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ పోటీకి వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికం దేశంలోని చిన్న, మధ్యతరహా పట్టణాల నుంచే వచ్చాయి. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా చోటు చేసుకున్న కీలక ముందడుగుగా దీన్ని భావించవచ్చు. ► భారతీయ పండుగలకు, ప్రకృతికి మధ్య గొప్ప సంబంధముంది. ప్రస్తుత గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో చాలా ప్రాంతాల్లో పర్యావరణ హిత వినాయకుడి ప్రతిమలనే ప్రతిష్టించడం ముదావహం. ► సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా పరిగణిస్తున్నాం. ముఖ్యంగా గ్రామాల్లో అందరికీ పోషకాహారం అందించడం ఉద్యమంలా మారాలి. ► భారత వ్యవసాయ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ జిల్లాలో పండించే పంటల వివరాలు, వాటిలోని పోషకాల వివరాలు అందులో అందుబాటులో ఉంచుతాం. ► కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉద్దేశించిన మార్గదర్శకాలను పాటించండి. మాస్క్ ధరించండి. భౌతిక దూరం పాటించండి. వ్యక్తిగత పరిశుభ్రత కొనసాగించండి. సోఫీ.. విదా.. బలరామ్! కుక్క పిల్లలను పెంచుకోవాలనుకునే వారు ఇండియన్ బ్రీడ్ కుక్క పిల్లలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని కోరారు. భారతీయ కుక్కపిల్లలు సామర్థ్యంలో వేటికీ తీసిపోవన్నారు. చవకగా లభిస్తాయని, భారతీయ పరిస్థితులకు తట్టుకోగలవని వివరించారు. ‘ఇండియన్ బ్రీడ్స్లో ముధోల్ హౌండ్, హిమాచలి హౌండ్ శ్రేష్టమైనవి. రాజపాలాయం, కన్నీ, చిప్పిపరాయి, కొంబయి కూడా గొప్పవే. ఇంటర్నెట్లో వెతకండి. వీటి గురించి మరిన్ని ఆశ్చర్యపరిచే వివరాలు తెలుస్తాయి’అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా.. ఆగస్టు 15న ‘చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమండేషన్ కార్డ్’పురస్కారం పొందిన ఆర్మీ డాగ్స్ సోఫీ, విదాలను గుర్తు చేశారు. దేశ భద్రతలో అవి గొప్ప పాత్ర పోషించాయన్నారు. ‘అమర్నాథ్ యాత్రా మార్గంలో దుండగులు పెట్టిన పేలుడు పదార్థాలను బలరామ్ అనే శునకం గుర్తించి, అనేక ప్రాణాలను కాపాడింది’అని వివరించారు. ‘బీడ్ పోలీసులు తమతో పాటు పనిచేసిన రాకీ అనే శునకానికి గొప్పగా ఫేర్వెల్ ఇచ్చిన దృశ్యాలు మీరు టీవీలో చూసే ఉంటారు. 300 కేసులను ఛేదించడంలో పోలీసులకు రాకీ సహకరించింది’అన్నారు. కావాల్సింది పరీక్షలపై చర్చ: రాహుల్ ప్రధాని మోదీ మన్‌కీబాత్‌లో పరీక్షల గురించి మాట్లాడతారని విద్యార్థులు ఎదురు చూస్తుండగా.. ఆయన మాత్రం బొమ్మల గురించి మాట్లాడారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నీట్, జేఈఈ పరీక్షలను కోవిడ్ దృష్ట్యా వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా కోరుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నోట ఏటికొప్పాక మన్‌కీ బాత్ కార్యక్రమంలో బొమ్మల గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఏటికొప్పాక బొమ్మల ప్రస్తావన తెచ్చారు. విశాఖకు చెందిన సి.వి.రాజు అద్భుతమైన నాణ్యతతో ఏటికొప్పాక బొమ్మలను తయారు చేస్తున్నారని కొనియాడారు. ఆయన స్థానిక బొమ్మలకు పూర్వవైభవం తెచ్చారన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిపుణులైన బొమ్మల తయారీదారులు ఉన్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొండపల్లి, కర్ణాటకలోని చెన్నపట్నం, తమిళనాడులోని తంజావూరు, అస్సాంలోని ధుబారీ, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి బొమ్మల తయారీ కేంద్రాలుగా ఎదిగాయన్నారు. -
సెన్సెక్స్ తక్షణ నిరోధం 38,385
పలు దేశాల్లో కోవిడ్ కేసులు ఉధృతంకావడంతోపాటు, అమెరికా–చైనాల వివాదం ముదరడంతో గతవారం ప్రపంచ ప్రధాన మార్కెట్ల ర్యాలీకి బ్రేక్‌పడింది. భారత్ మార్కెట్ మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్‌ల తోడ్పాటుతో క్రితం వారం లాభపడింది. ఒక్క రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ మినహా మిగిలిన ఇండెక్స్ హెవీవెయిట్ల క్యూ1 ఫలితాలు వెలువడ్డాయి. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్బ్యాంక్ల ఫలితాలు మార్కెట్ అంచనాల్ని మించగా, మిగిలిన కంపెనీలు ఇన్వెస్టర్లను నిరుత్సాహపర్చలేదు. బ్యాంకింగ్ షేర్లలో గరిష్టస్థాయి వద్ద కొనసాగుతున్న అమ్మకాల కారణంగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు ముందడుగు వేయలేకపోయాయి. ఇన్ఫోసిస్ మాత్రం మరో కొత్త రికార్డుస్థాయిని అందుకుంది. ఇక 14–15 శాతం వెయిటేజీతో ఇటీవల అతిపెద్ద హెవీవెయిట్గా అవతరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ వారం ద్వితీయార్ధంలో వెల్లడించబోయే ఫలితాలు, అనుబంధ కంపెనీ రిలయన్స్ రిటైల్ ఆకర్షించబోయే పెట్టుబడుల అంచనాలు, ఈ వారం భారత్ మార్కెట్ కదలికలకు కీలకం కావొచ్చు. ఇక స్టాక్ సూచీల సాంకేతిక అంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... బీఎస్ఈ సెన్సెక్స్ కీలకమైన 36,980 పాయింట్ల స్థాయిపైన ర్యాలీ వేగవంతమవుతుందంటూ గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించినరీతిలోనే వేగంగా పెరిగిన సూచి 38,235 పాయింట్ల గరిష్టస్థాయిని అందుకుంది. జులై 24తో ముగిసినవారంలో చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 1,109 పాయింట్ల లాభంతో 38,129 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది మార్చి 5 నాటి బ్రేక్‌డవున్ సందర్భంగా ఏర్పడిన గ్యాప్‌ను పూడ్చాలంటే మరో 150 పాయింట్లు సెన్సెక్స్ ప్రయాణించాల్సివుంది. ఈ వారం...ఆ గ్యాప్ ఏరియా అప్పర్‌బ్యాండ్ అయిన 38,385 పాయింట్ల స్థాయి సెన్సెక్స్‌కు తక్షణ అవరోధం కానుంది. ఈ అవరోధస్థాయిని దాటితే 38,540 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన క్రమేపీ 38,880 పాయింట్ల వరకూ పెరిగే వీలుంటుంది. ఈ వారం తొలి నిరోధాన్ని అధిగమించలేకపోయినా, మార్కెట్ బలహీనంగా ప్రారంభమైనా 37,480 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 37,125 పాయింట్ల వరకూ పడిపోవొచ్చు. ఈ లోపున 36,900 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ తక్షణ అవరోధం 11,245 క్రితం కాలమ్‌లో సూచించిన రీతిలోనే, గతవారం గ్యాప్‌అప్‌తో మొదలైన ఎన్ఎస్ఈ నిఫ్టీ వేగంగా 12,239 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 292 పాయింట్ల లాభంతో 11,194 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 11,245 సమీపంలో ఎదురయ్యే నిరోధం కీలకం. ఈ స్థాయిని దాటితే 11,310 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన క్రమేపీ 11,390 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోయినా, బలహీనంగా మొదలైనా 11,040 పాయింట్ల వద్ద నిఫ్టీకి తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే గత సోమవారంనాటి గ్యాప్‌అప్ స్థాయి అయిన 10,930 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే ప్రస్తుతం 200 డీఎంఏ రేఖ కదులుతున్న 10,860 పాయింట్ల సమీపంలో నిఫ్టీకి గట్టి మద్దతు లభిస్తున్నది. -
మార్కెట్లకు ‘ఔషధం’!
కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగపడే ఔషధాలకు ఆమోదం లభించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీనికి ఆర్థిక రంగ షేర్ల జోరు జత కావడంతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు పతనమైనా, మన సూచీలు ముందుకే దూసుకుపోయాయి. సరిహద్దు ఉద్రిక్తతల నివారణ నిమిత్తం భారత్, చైనాల మధ్య సంప్రదింపులు ప్రారంభం కావడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు పుంజుకొని 76.03కు చేరడం.. సానుకూల ప్రభావం చూపించాయి. 3 రోజుల లాభాలతో సెన్సెక్స్, నిఫ్టీలు 3 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. అయితే చివర్లో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో ఆరంభ లాభాలు తగ్గాయి. ఇంట్రాడేలో 482 పాయింట్ల మేర ఎగసిన సెన్సెక్స్ చివరకు 180 పాయింట్ల లాభంతో 34,911 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 67 పాయింట్లు ఎగసి 10,311 పాయింట్లకు చేరింది. ఐటీ సూచీకే నష్టాలు...: ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, మన మార్కెట్ లాభాల్లోనే ఆరంభమైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 35,000 పాయింట్లపైకి ఎగబాకగా, నిఫ్టీ 10,400 పాయింట్ల సమీపంలోకి వచ్చింది. ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిశాయి. హెచ్ 1–బీ వంటి నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికా నిషేధం విధించే అవకాశాలున్నాయన్న ఆందోళనతో ఐటీ షేర్లు నష్టపోయాయి. ► బజాజ్ ఆటో 7 శాతం లాభంతో రూ.2,860 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వంటి ఇతర బజాజ్ గ్రూప్ షేర్లు 5 శాతం మేర పెరిగాయి. ► కరోనా వైరస్ చికిత్స కోసం యాంటీ వైరల్ డ్రగ్, ఫావిపిరవిర్‌ను ఫాబిఫ్లూ పేరుతో అందుబాటులోకి తేవడంతో గ్లెన్‌మార్క్ ఫార్మా షేర్ 27 శాతం లాభంతో రూ.520 వద్ద ముగిసింది. ఈ షేర్ ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో ఈ షేర్ 40 శాతం లాభంతో రూ.573ను తాకింది. ► కరోనా చికిత్సలో ఉపయోగపడే రెమిడెసివిర్ తయారీకి ఆమోదం లభించడంతో సిప్లా షేర్ 3% లాభంతో రూ.656 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.696ని తాకింది. ► దాదాపు 140 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. బేయర్ క్రాప్ సైన్స్, డిక్సన్ టెక్నాలజీస్, రుచి సోయా, ఆర్తి డ్రగ్స్, అలెంబిక్ ఫార్మా, అదానీ గ్రీన్ ఎనర్జీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► మోర్గాన్ స్టాన్లీ వాటా కొనుగోళ్ల వార్తలతో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ 20 శాతం లాభంతో రూ.242 వద్ద ముగిసింది. ► స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావాలన్న ప్రతిపాదనకు అదానీ పవర్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. షేరు కనీస కొనుగోలు ధర రూ.33.82 కాగా, ఈ ప్రతిపాదన విలువ రూ.3,264 కోట్లు. రిలయన్స్ మార్కెట్ క్యాప్ @ 15,000 కోట్ల డాలర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరు కొనసాగుతోంది. ఆరంభంలోనే 3 శాతం మేర ఎగసి జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,804ను తాకింది. చివరకు 0.7 శాతం నష్టంతో రూ.1,747 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ.11,81,429 కోట్లకు(15,000 కోట్ల డాలర్లకు మించి) పెరిగింది. ఈ స్థాయి మార్కెట్ క్యాప్‌ను సాధించిన తొలి భారత కంపెనీ ఇదే. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీల జాబితాలో రిలయన్స్ 57వ స్థానంలో నిలిచింది. వచ్చే నెల 15న వర్చువల్ ఏజీఎమ్(వార్షిక సాధారణ సమావేశం)ను నిర్వహిస్తామని రిలయన్స్ వెల్లడించింది. -
తగ్గిన లాభాలు
ప్రపంచ మార్కెట్ల జోరుతో మన మార్కెట్ కూడా మంగళవారం లాభాల్లోనే ముగిసింది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు మరింత ముదరడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఉదయం లాభాలను పోగొట్టుకొని 17 పైసల నష్టంతో 76.20కు చేరడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. దీంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. రోజంతా 1,069 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 376 పాయింట్ల లాభంతో 33,605 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 232 పాయింట్లు ఎగసిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 9,914 పాయింట్ల వద్దకు చేరింది. అమెరికా ‘మెయిన్‌స్ట్రీట్ ప్యాకేజీ’.... కరోనా వైరస్ కల్లోలంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునే చర్యల్లో భాగంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ భారీ ఉద్దీపన ప్యాకేజీని మెయిన్ స్ట్రీట్ లెండింగ్ ప్రోగ్రామ్ పేరుతో సోమవారం ప్రకటించింది. అంతే కాకుండా 75,000 కోట్ల డాలర్ల (రూ.57 లక్షల కోట్ల)విలువైన కార్పొరేట్ బాండ్లను కొనుగోలు చేస్తామని అభయం ఇచ్చింది. దీంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఇదే జోష్‌తో మన మార్కెట్ కూడా భారీ లాభాల్లో మొదలైంది. అరగంట ఒడిదుడుకులు... సెన్సెక్స్ 625 పాయింట్లు, నిఫ్టీ 201 పాయింట్ల లాభాలతో మొదలయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 793 పాయింట్లకు, నిఫ్టీ 232 పాయింట్ల లాభాల స్థాయిలకు ఎగబాకాయి. అయితే తూర్పు లదాఖ్‌లోని గాల్వన్ లోయ సమీపంలో మనదేశానికి, చైనాకి మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయన్న వార్తలతో మధ్యాహ్నం తర్వాత ఆకస్మాత్తుగా సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్ 276 పాయింట్లు, నిఫ్టీ 85 పాయింట్ల మేర నష్టపోయాయి. ఒక అరగంట పాటు తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురైనసూచీలు ఆ తర్వాత మళ్లీ లాభాల బాట పట్టాయి. ఆసియా మార్కెట్లు 5 శాతం, యూరప్ మార్కెట్లు 4 శాతం లాభాల్లో ముగిశాయి. ► హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4 శాతం లాభంతో రూ.990 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ మంగళవారం కూడా జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,648ను తాకింది. చివరకు స్వల్ప లాభంతో రూ.1,617 వద్ద ముగిసింది. ► వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. అలెంబిక్ ఫార్మా, బేయర్ క్రాప్‌సైన్స్, రుచి సోయా, పీఐ ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► క్యూ4లో రూ.9,894 కోట్ల మేర నష్టాలు రావడంతో టాటా మోటార్స్ షేర్ 6% నష్టంతో రూ.95 వద్ద ముగిసింది. ► రూపాయి బలహీనపడటంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి. రూపాయి 17 పైసలు పతనం ముంబై: భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల ప్రభావం రూపాయి విలువపై చూపింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం 17 పైసలు క్షీణించి 76.20 వద్ద ముగిసింది. ఇధి ఆరు వారాల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. -
పడగొట్టిన ‘ఫెడ్’!
అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా కాలమే పడుతుందని ఆ దేశ కేంద్ర బ్యాంక్ సంకేతాలివ్వడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గురువారం పతనమైంది. టెలికం కంపెనీలు ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిందేనంటూ సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించడం, ఇటీవల బాగా పెరిగిన బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే వదంతులు, కరోనా కేసులు పెరుగుతుండటం... ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 34,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 709 పాయింట్లు క్షీణించి 33,538 పాయింట్ల వద్ద, నిఫ్టీ 214 పాయింట్లు పతనమై 9,902 పాయింట్ల వద్ద ముగిశాయి. గత మూడు వారాల్లో సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే ప్రథమం. ఇంట్రాడేలో సెన్సెక్స్ 767 పాయింట్లు, నిఫ్టీ 231 పాయింట్ల మేర నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. కాగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలు... ► ఎస్బీఐ షేర్ 6% నష్టంతో రూ.177 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పడిన షేర్ ఇదే. ► 30 సెన్సెక్స్ షేర్లలో ఐదు షేర్లు–ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటొకార్ప్, పవర్ గ్రిడ్, మహీం ద్రా అండ్ మహీంద్రా, నెస్లే ఇండియా మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 25 షేర్లు నష్టపోయాయి. ► మార్కెట్ భారీగా నష్టపోయినా, 80కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. అరబిందో ఫార్మా, ముత్తూట్ ఫైనాన్స్, క్యాడిలా హెల్త్‌కేర్, గ్రాన్యూల్స్ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్లో భారీ క్షీణత చోటు చేసుకున్నా దాదాపు 350కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. పీఎన్బీ హౌసింగ్, ఫ్యూచర్ రిటైల్, లెమన్ ట్రీ హోటల్స్, ఫ్యూచర్ కన్సూమర్, డిష్ టీవీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► ప్రముఖ ట్రేడర్ విజయ్ ఖేడియా 1.1 శాతం వాటా షేర్లను కొనుగోలు చేయడంతో రామ్‌కో సిస్టమ్స్ షేర్ 20 శాతం లాభంతో రూ.110 వద్ద ముగిసింది. ఇక ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో శంకర బిల్డింగ్ షేర్ 16 శాతం ఎగసి రూ.352 వద్ద ముగిసింది. ► ఏజీఆర్ బకాయిల విషయమై ఊరట లభించకపోవడంతో టెలికం షేర్లు నష్టపోయాయి. వొడాఫోన్ ఐడియా, భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్ఎఫ్సీఎల్, తేజాస్ నెట్వర్క్స్, ఐటీఐ, భారతీ ఎయిర్టెల్ షేర్లు 13 శాతం వరకూ నష్టపోయాయి. ► వరుసగా ఐదో రోజూ ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ పెరిగింది. ఒక్క వారంలో ఈ షేర్ 30 శాతం లాభపడింది. నష్టాలు ఎందుకంటే... ► ఫెడ్ కఠిన వ్యాఖ్యలు... వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, అమెరికాలో ఆర్థిక రికవరీకి దీర్ఘకాలమే పడుతుందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ వ్యాఖ్యానించడం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను పడగొట్టింది. వడ్డీరేట్లను మరో రెండేళ్ల పాటు సున్నా స్థాయిల్లోనే కొనసాగిస్తామని, తక్కువ రేట్లను కొనసాగించడానికి బాండ్ల కొనుగోళ్లు కొనసాగిస్తామని ఫెడ్ వెల్లడించింది. కరోనా కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా కాలమే పడుతుందని ఈ వ్యాఖ్యల ద్వారా ఫెడ్ అంగీకరించినట్లయింది. ఫెడ్ వ్యాఖ్యల కారణంగా ఆసియా, యూరప్ మార్కెట్లు 1–4 శాతం మేర నష్టపోయాయి. ► ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిందే... టెలికం కంపెనీలు ఏజీఆర్(సవరించిన స్థూల రాబడి)బకాయిలు చెల్లించాలాంటూ సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పడంతో బ్యాంక్ షేర్లు పడ్డాయి. ► బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ... లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పటి నుంచి ఆర్థిక రికవరీపై సానుకూల అంచనాలతో బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ షేర్లన్నీ బాగా పెరిగిన నేపథ్యంలో ఫెడ్ తాజా నిర్ణయం కారణంగా పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ► రూపాయి పతనం డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు పతనమై 75.79 వద్దకు చేరింది. ► మళ్లీ లాక్డౌన్...? కరోనా కేసులు బాగా పెరుగుతుండటంతో ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధిస్తారన్న వదంతులు చెలరేగాయి. ఈ వార్తలను కేంద్రం ఖండించినప్పటికీ, లాక్డౌన్ వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ► పెరుగుతున్న కరోనా కేసులు... ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్త కరోనా కేసులు 74 లక్షలకు, మరణాలు 4.2 లక్షలకు చేరువయ్యాయి. ఇక భారత్‌లో కరోనా కేసులు 2.9 లక్షలకు పైగా చేరగా, మరణాలు 8 వేలు దాటిపోవడం కూడా మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. ► ఎస్ అండ్ పీ రేటింగ్స్ ఆందోళన గత వారం మన రేటింగ్‌ను మూడీస్ సంస్థ డౌన్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. అయితే స్డాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) గ్లోబల్ రేటింగ్స్ సంస్థ మన సావరిన్ రేటింగ్‌ను కొనసాగించడం ఒకింత ఊరటనిచ్చింది. అయితే ద్రవ్యలోటు, ఆర్థిక రంగ బలహీనతలపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రతికూల ప్రభావం చూపించింది. రూ.2.4 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.2.4 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.2.4 లక్షల కోట్లు తగ్గి రూ.133 లక్షల కోట్లకు పడిపోయింది. భారీ నష్టాల్లో అమెరికా మార్కెట్ కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటం, అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిరాశాపూర్వక వ్యాఖ్యలు చేయడంతో గురువారం అమెరికా స్టాక్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికాలో కరోనా కేసులు 20 లక్షలకు పైగా పెరిగిపోగా, మరణాలు 1.1 లక్షలకు చేరాయి. కరోనా కేసులు మళ్లీ తిరగబెడుతున్నాయని నిపుణులంటున్నారు. రాత్రి గం.11.30ని. సమయానికి డోజోన్స్ సూచీ 1,300 పాయింట్లు, (5 శాతం), నాస్డాక్ సూచీ 328 పాయింట్లు (3 శాతం), ఎస్ అండ్ పీ 500 సూచీ 128 పాయింట్లు(4 శాతం) మేర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక మన ఎన్ఎస్ఈ నిఫ్టీకి ప్రతీక అయిన ఎస్‌జీఎక్స్ నిఫ్టీ సూచీ 278 పాయింట్ల(2%) నష్టంతో 9,575 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావంతో శుక్రవారం మన స్టాక్ సూచీలు భారీ గ్యాపప్‌తో మొదలవుతాయని అంచనా. -
మార్కెట్లకు ప్యాకేజీ నచ్చలే..!
ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆర్థిక ప్యాకేజీ ఉసూరుమనిపించడంతో గురువారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. ప్రపంచ మార్కెట్లు పతనమవడం, ముడి చమురు ధరలు 4% మేర ఎగబాకడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం.....ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 32,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 955 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్ చివరకు 886 పాయింట్ల నష్టంతో 31,123 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 241 పాయింట్లు క్షీణించి 9.143 పాయింట్ల వద్దకు చేరింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 2.77 శాతం, నిఫ్టీ 2.57 శాతం చొప్పున నష్టపోయాయి. రోజంతా నష్టాలు...: ప్రపంచ మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ కూడా భారీ నష్టాల్లో ఆరంభమైంది. రోజంతా స్టాక్ సూచీల క్షీణత కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మరింతగా పెరగడంతో నష్టాలు కూడా మరింతగా పెరిగాయి. క్యాపిటల్ గూడ్స్, మీడియా,హెల్త్‌కేర్, ఎఫ్ఎమ్సీజీ షేర్లు లాభపడ్డాయి. ఐటీ, లోహ, ఆర్థిక, ఇంధన, బ్యాంక్, టెలికం షేర్లు నష్టపోయాయి. మరిన్ని విశేషాలు.... ► టెక్ మహీంద్రా షేర్ 5% నష్టంతో రూ.516 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పడిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినా, దాదాపు 40 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. అలెంబిక్ ఫార్మా, ఆర్తి డ్రగ్స్, రుచి సోయా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► కంపెనీల ఐటీ వ్యయాలు 8 శాతం మేర తగ్గుతాయని గార్ట్నర్ సంస్థ వెల్లడించడంతో ఐటీ షేర్లు 5 శాతం వరకూ నష్టపోయాయి. ► 200కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఎన్బీసీసీ,ఐనాక్స్ విండ్, జుబిలంట్ లైఫ్‌సైన్సెస్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి. మరోవైపు మహీంద్రా సీఐఈ ఆటోమేషన్ ,జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ తదితర 200 షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. రూ.2 లక్షల కోట్లు ఆవిరి... మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ. 2 లక్షల కోట్ల మేర ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.1.99,620 కోట్లు హరించుకుపోయి రూ.122.68 లక్షల కోట్లకు పడిపోయింది. నష్టాలు ఎందుకంటే.... నిరాశపరిచిన ప్యాకేజీ 2.0: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ 2.0 మార్కెట్ వర్గాలను నిరాశ పరిచింది. రూ.6 లక్షల కోట్ల మేర ఆమె ప్రకటించిన ఉద్దీపన చర్యలు సరిపోవని, ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే అవకాశాల్లేవనే ఆందోళన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఉద్దీపన చర్యలు సానుకూలంగానే ఉన్నాయని, కానీ వాటి ఆచరణే కీలకమని పలు బ్రోకరేజ్ సంస్థలు వ్యాఖ్యానించాయి. ప్రపంచ మార్కెట్ల పతనం: స్పానిష్ ఫ్లూ తదితర వైరస్‌ల్లాగా కరోనా వైరస్ కనుమరుగయ్యే అవకాశాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు తీవ్ర అనిశ్చితిలో ఉందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ వ్యాఖ్యానించారు. ఈ రెండు అంశాల కారణంగా ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు 1–2 శాతం, యూరప్ మార్కెట్లు 2–3 శాతం రేంజ్లో నష్టపోయాయి. లాక్డౌన్ 4.0: ఈ నెల 18 నుంచి కొత్త నిబంధనలతో నాలుగో దశ లాక్డౌన్ మొదలు కానున్నది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఇప్పటివరకైతే వెల్లడి కాలేదు. ఇప్పటికే 50 రోజులకు మించిన లాక్‌డౌన్‌తో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై లాక్డౌన్ 4.0 మరింత ప్రతికూల ప్రభావం చూపగలదన్న ఆందోళన నెలకొన్నది. పెరుగుతున్న కరోనా కేసులు: దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా 2.0 కేసులు కూడా పెరుగుతుండటం తీవ్రమైన ప్రభావమే చూపుతోంది. -
మార్కెట్‌కు ప్యాకేజ్ బూస్టర్
కరోనా వైరస్ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునే చర్యల్లో భాగంగా ఆర్బీఐ కొన్ని లిక్విడిటీ పెంచే చర్యలను తీసుకుంది. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. రూపాయి మారకం పుంజుకోవడం, ప్రపంచ మార్కెట్లు లాభాల్లోనే ట్రేడవడం కలసివచ్చాయి. అమెరికాలో కరోనా కేసుల చికిత్సలో గిలీడ్ ఔషధం మంచి ఫలితాలను చూపిస్తోందన్న వార్తలు సానుకూల ప్రభావం చూపించాయి. ఆరంభ లాభాలను కోల్పోయినప్పటికీ, సెన్సెక్స్ 31,500 పాయింట్లు, నిఫ్టీ 9,250 పాయింట్ల ఎగువున ముగిశాయి. సెన్సెక్స్ 986 పాయింట్ల లాభంతో 31,589 పాయింట్ల వద్దకు చేరింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 274 పాయింట్లు పెరిగి 9,267 పాయింట్ల వద్ద ముగిసింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 3.22 శాతం, నిఫ్టీ 3.03 శాతం చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీలు నెల గరిష్టానికి చేరాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 429 పాయింట్లు, నిఫ్టీ 155 పాయింట్లు చొప్పున పెరిగాయి. స్టాక్ సూచీలు వరుసగా రెండో వారమూ లాభపడ్డాయి. అదిరిపోయే ఆరంభం... సెన్సెక్స్, నిఫ్టీలు ఆరంభంలోనే దుమ్మురేపాయి. ఆర్బీఐ గవర్నర్ ఉదయం గం.10లకు కీలక ప్రకటన చేయనున్నారన్న వార్తల కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు భారీ గ్యాపప్‌తో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,054 పాయింట్లు, నిఫ్టీ 330 పాయింట్ల భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. మ«ధ్యాహ్నం లాభాలు తగ్గినా, రోజంతా ఇదే జోరు కొనసాగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,116 పాయింట్లు, నిఫ్టీ 331 పాయింట్ల మేర పెరిగాయి. లాభాలకు కారణాల్లో కొన్ని... ఆర్బీఐ లిక్విడిటీ బూస్ట్: పలు చర్యలకు తోడు అవసరమైతే, మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభయమివ్వడంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. అంచనాల కన్నా చైనా జీడీపీ బెటర్ : ఈ ఏడాది మొదటి త్రైమాసిక కాలంలో చైనా జీడీపీ 6.8 శాతం తగ్గి్గంది. జీడీపీ గణాంకాలు వెల్లడించినప్పటి నుంచి ఇదే తొలి తగ్గుదల అయినప్పటికీ, అంచనాల కంటే (జీడీపీ 8.2 శాతం తగ్గుతుందన్న అంచనాలున్నాయి)తక్కువగానే జీడీపీ తగ్గడం... ఇన్వెస్టర్లకు ఒకింత ఊరటనిచ్చింది. రెమ్డిసివిర్... సత్ఫలితాలు..! అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ గిలీడ్ సైన్సెస్ ఔషధం, రెమ్డిసివిర్....కరోనా చికిత్సలో మంచి ఫలితాలు చూపిస్తోందన్న వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. లాభాల్లో ప్రపంచ మార్కెట్లు చైనా జీడీపీ అంచనాల కంటే తక్కుగానే తగ్గడం, కరోనా చికిత్సలో అమెరికా ఔషధం సత్ఫలితాలనిస్తుండటం, అమెరికాతో సహా పలు యూరప్ దేశాలు లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేయనుండటం.. ఈ కారణాలన్నింటి కారణంగా ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. రూ.3 లక్షల కోట్ల లాభం మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ. 3 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 2.83 లక్షల కోట్ల పెరిగి రూ. 123.50 లక్షల కోట్లకు ఎగసింది. -
భారీ నష్టాలతో బోణి
కొత్త ఆర్థిక సంవత్సరం(2020–21) తొలి రోజు స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. కరోనా మహమ్మారి విలయతాండవానికి అంతర్జాతీయంగా ప్రపంచ మార్కెట్లు కకావికలమవుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ సూచీల్లో భారత వెయిటేజీకి సంబంధించిన మార్పులను ఎమ్ఎస్సీఐ మే నెలకు వాయిదా వేయడంతో బుధవారం మన మార్కెట్ కూడా భారీగా పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,203 పాయింట్లు క్షీణించి 28,265 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 344 పాయింట్లు నష్టపోయి 8,254 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. నేడు (గురువారం) శ్రీరామ నవమి సందర్భంగా సెలవు కావడంతో నిఫ్టీ వీక్లీ ఆప్షన్లు బుధవారమే ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వారం కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఇన్వెస్టర్లు... బహుపరాక్....! సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. పావుగంటకే నష్టాల్లోకి జారిపోయింది. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,395 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్ల మేర నష్టపోయాయి. ఇక ఆసియా మార్కెట్లు 2–4 శాతం రేంజ్లో నష్టపోగా, యూరప్ మార్కెట్లు కూడా అదే స్థాయి నష్టాల్లో ఆరంభమయ్యాయి. ముడిచమురు ధరలు 5 శాతం మేర తగ్గాయి. కాగా స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంక్ షేర్లు బేర్ ప్రస్తుత లాక్డౌన్ కారణంగా వివిధ కంపెనీల వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని, ఫలితంగా బ్యాంక్‌ల మొండిబకాయిలు భారీగా పెరుగుతాయనే భయాందోళనలతో బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 8–2 శాతం రేంజ్లో నష్టపోయాయి. ► టెక్ మహీంద్రా షేర్ 9.2% పడింది. ► 30 సెన్సెక్స్ షేర్లలో 4 షేర్లు–హీరో మోటో, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ మాత్రమే లాభపడగా, మిగిలిన 26 షేర్లు నష్టపోయాయి. తొలి రోజే రూ.3.2 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.3.2 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.20 లక్షల కోట్ల తగ్గుదలతో రూ.110.28 లక్షల కోట్లకు పడిపోయింది. పతనానికి ప్రధాన కారణాలు ► కొనసాగుతున్న కరోనా కల్లోలం...: భారత్‌లో కరోనా కేసులు 1,621కు, మరణాలు 42కు చేరాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 8.6 లక్షలకు, మరణాలు 42,000కు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. ► ఎమ్ఎస్సీఐ ‘వెయిటేజీ’ వాయిదా: ఎమ్ఎస్సీఐ(మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్)... తన గ్లోబల్ సూచీల్లో భారత వెయిటేజీ పెంచే నిర్ణయాన్ని మే నెలకు వాయిదా వేసింది. వాస్తవానికి ఈ మార్పులు బుధవారం (ఏప్రిల్ 1)నుంచే అమల్లోకి రావాలి. దీనివల్ల భారత్‌లోకి 1,000 కోట్ల డాలర్లు(రూ.76,000 కోట్లు) వచ్చే చాన్స్ ఉంది. ► బలహీనంగా ఆసియా తయారీ డేటా: జపాన్, దక్షణి కొరియా దేశాల తయారీ రంగ గణాంకాలు బలహీనంగా ఉండటం ప్రతికూల ప్రభావం చూపించింది. ► తగ్గిన వాహన విక్రయాలు...: మార్చి నెలలో వాహన విక్రయాలు బాగా తగ్గాయి. మారుతీ సుజుకీ మ్మకాలు 47 శాతం, అశోక్ లేలాండ్ విక్రయాలు 90 శాతం, ఐషర్ మోటార్స్ అమ్మకాలు 83 శాతం మేర పడిపోయాయి. వాహన విక్రయాలు ఈ స్థాయిలో క్షీణించడం ఇన్వెస్టర్లను కలవర పెట్టింది. ► ద్రవ్యలోటు లక్ష్యం మిస్... గత ఆర్థిక సంవత్సరం (2019–20) ఫిబ్రవరి నాటికే ద్రవ్యలోటు(వ్యయానికి, ఆదాయానికి మధ్య వ్యత్యాసం) పూర్తి బడ్జెట్ అంచనాల్లో 135 శాతానికి (రూ.10,36,485 కోట్లు) చేరింది. ద్రవ్యలోటు లక్ష్యం పెద్ద మార్జిన్‌తో కట్టు తప్పడం.. ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. నేడు సెలవు శ్రీరామ నవమి సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్‌కు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ట్రేడింగ్ జరగదు. -
4 రోజుల నష్టాలకు బ్రేక్
కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలాన్ని కట్టడి చేయడానికి వివిధ కేంద్ర బ్యాంక్‌లు చర్యలు తీసుకుంటుండటంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా శుక్రవారం లాభపడింది. దీంతో నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. కరోనా ఉత్పాతాన్ని ఎదుర్కొనడానికి ఫైనాన్షియల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉద్దీపన చర్యలు ఉంటాయనే అంచనాలు కూడా సానుకూల ప్రభావం చూపించాయి. గురువారం 75 మార్క్‌ను చేరిన డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు పుంజుకోవడం కలసి వచ్చింది. మరోవైపు ఇది పూర్తిగా టెక్నికల్ ర్యాలీయేనని, షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జోరుగా సాగాయని కొంతమంది నిపుణులంటున్నారు. అయితే ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగింది. ఒక దశలో 355 పాయింట్లు పతనమై, 2,130 పాయింట్లకు ఎగసిన సెన్సెక్స్ చివరకు 1,628 పాయింట్లు పెరిగి 29,916 పాయింట్ల వద్ద ముగిసింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 5.75 శాతం, నిఫ్టీ 5.83 శాతం చొప్పున లాభపడ్డాయి. ఆరు నెలల కాలంలో ఒక్క రోజులో ఈ సూచీలు ఇన్ని పాయింట్లు పెరగడం ఇదే మొదటిసారి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 4,188 పాయింట్లు, నిఫ్టీ 1,210 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, ఈ రెండు సూచీలు చెరో 12 శాతం మేర నష్టపోయాయి. సూచీలు వరుసగా ఐదో వారమూ నష్టపోయాయి. ఇక ప్రపంచ మార్కెట్లన్నీ లాభాల్లోనే ముగిశాయి. షాంఘై, హాంగ్‌కాంగ్, సియోల్ సూచీలు 7% మేర లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు 5% లాభాల్లో ఆరంభమయ్యాయి. లాభాల్లో కోవిడ్ ఔషధ షేర్లు కోవిడ్–19 చికిత్సలో హైడ్రోక్లోరోక్వినైన్ ప్రభావవంతంగా పనిచేస్తోందన్న వార్తల కారణంగా ఈ ఔషధాన్ని తయారు చేసే కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. క్యాడిలా హెల్త్‌కేర్ 16 శాతం లాభఃతో రూ.285కు, ఇప్కా ల్యాబ్స్ 9 శాతం లాభంతో రూ.1,372కు, టొరెంట్ ఫార్మా 4 శాతం లాభంతో రూ.1,846కు పెరిగాయి. ► ఓఎన్జీసీ 19 శాతం లాభంతో రూ.72 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. అల్ట్రాటెక్ సిమెంట్, 13 శాతం, హిందుస్తాన్ యూనిలీవర్ 12 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 11 శాతం, టీసీఎస్ 10 శాతం, టాటా స్టీల్ 10 శాతం, ఏషియన్ పెయింట్స్ 9 శాతం చొప్పున లాభపడ్డాయి. ► సెన్సెక్స్ 30 షేర్లలో రెండు షేర్లు– హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 28 షేర్లు లాభపడ్డాయి. ► నిఫ్టీలోని 50 షేర్లలో నాలుగు షేర్లు–హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్,, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్‌లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 46 షేర్లు లాభాల్లో ముగిశాయి. ► భారతీ ఇన్ఫ్రాటెల్ 23 శాతం లాభంతో రూ.152 వద్ద ముగిసింది. నిఫ్టీ షేర్లలో అత్యధికంగా పెరిగిన షేర్ ఇదే. ► రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 11 శాతం లాభంతో రూ.1,020 వద్ద ముగిసింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.65,358 కోట్లు పెరిగి రూ.6,46,732 కోట్లకు పెరిగింది. రూ. 6.32 లక్షల కోట్లు పెరిగిన సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.6.32 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.6.32 లక్షల కోట్లు ఎగసి రూ.116.1 లక్షల కోట్లకు పెరిగింది. టెక్నికల్ ర్యాలీ.. జాగ్రత్త! కోవిడ్ కల్లోలం తగ్గకపోయినా స్టాక్ మార్కెట్ ర్యాలీ జరపడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ర్యాలీ కొనసాగింపుపై అపనమ్మకం వ్యక్తం చేస్తున్న నిపుణులు అప్రమత్తంగా ఉండాలని ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు. ఫండమెంటల్స్ పరంగా ఎలాంటి మార్పుల్లేకపోయినా, కేవలం టెక్నికల్స్ కారణంగానే ఈ ర్యాలీ చోటు చేసుకుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. మార్కెట్ రికవరీ మొదలైందని భావించి, ఇప్పుడే కొనుగోళ్లకు దిగవద్దనేది నిపుణుల సూచన. రూపాయి.. కొత్త కనిష్టం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా రెండవరోజు శుక్రవారం మరో ‘చరిత్రాత్మక’ కనిష్టానికి పడిపోయింది. గురువారం ముగింపుతో పోల్చితే 8 పైసలు బలహీనపడి 75.20కి పడిపోయింది. ఈ స్థాయిని ఎప్పుడూ రూపాయి చూడలేదు. ఇంట్రాడేలో రూపాయి గురువారం తరహాలో నే 75.30ని తాకింది. రూపాయి క్రితం ముగింపు 75.12. ఆరు నెలల కనిష్టానికి విదేశీ మారకపు నిల్వలు... భారత్‌లో విదేశీ మారకపు నిల్వలు మార్చి 13తో ముగిసిన వారంలో 6 నెలల కనిష్ట స్థాయి 481.89 డాలర్లకు పడిపోయాయి. వారంవారీగా 5.35 బిలియన్ డాలర్లు తగ్గాయి. మార్చి 6తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వలు రికార్డు స్థాయిలో 487.23 బిలియన్ డాలర్లకు చేరాయి. షార్ట్ సెల్లింగ్... ఒకింత కఠినం! న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో చోటు చేసుకుంటున్న తీవ్రమైన ఒడిదుడుకులను నివారించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ నడుం బిగించింది. మ్యూచువల్ ఫండ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు జరిపే షార్ట్ సెల్లింగ్‌పై పరిమితులను విధించడం ద్వారా ఒడిదుడుకులను తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. డెరివేటివ్స్ సెగ్మెంట్లోని షేర్ల మార్కెట్ వైడ్ పొజిషన్ల పరిమితిని సవరించింది. డైనమిక్ ప్రైస్బాండ్లలో సరళీకరణతో సహా మరికొన్ని మార్పులు, చేర్పులు చేసింది. సోమవారం (ఈ నెల 23) నుంచి నెల రోజుల పాటు ఈ మార్పులు, చేర్పులు అమల్లో ఉంటాయని పేర్కొంది. సెబీ తాజా నిర్ణయాల కారణంగా ఇంట్రాడేలో షార్టింగ్ చేసే వారిపై ప్రభావం పడుతుం దని నిపుణులంటున్నారు. ఒడిదుడుకులు ఒకింత తగ్గుతాయని వారంటున్నారు. వివరాలు.... ► డెరివేటివ్స్ సెగ్మెంట్లో లేని షేర్లకు క్యాష్ మార్కెట్లో మార్జిన్‌ను 40 శాతం వరకూ పెంచింది. ► ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) సెగ్మెంట్లోని షేర్ల మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్(ఎమ్‌డబ్ల్యూపీఎల్) ప్రస్తుతమున్న స్థాయి నుంచి 50 శాతం మేర తగ్గించింది. ► ఏదైనా ఒక షేర్ ఎమ్‌డబ్ల్యూపీఎల్ యుటిలైజేషన్ 95 శాతం మేర మించితే, ఈ షేర్‌పై నిషేధం విధిస్తారు. ► డెరివేటివ్స్ సెగ్మెంట్లోని షేర్లలో డైనమిక్ ప్రైస్ బాండ్లలో మార్పులు, చేర్పులు చేసింది. ► మ్యూచువల్ ఫండ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు, ట్రేడింగ్ మెంబర్స్(ప్రోప్రయిటరీ), క్లయింట్లు షార్ట్ పొజిషన్లపై పరిమితులు విధించింది. ► ఇండెక్స్ డెరివేటివ్స్ల్లో ఈ సంస్థల షార్ట్ పొజిషన్లు, వాటి నోషనల్ వేల్యూలో మించకుండా ఉండాలి. ► నగదు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, ఇలాంటి సాధనాల్లో ఈ సంస్థల హోల్డింగ్స్‌ను మించి ఇండెక్స్ డెరివేటివ్స్‌లో ఈ సంస్థల లాంగ్ పొజిషన్లు ఉండకూడదు. షార్ట్ సెల్లింగ్ అంటే.... షార్ట్ సెల్లరు–భవిష్యత్తులో ధర తగ్గుతుందనే అంచనాలతో తమ వద్ద షేర్లు లేకపోయినా, వాటిని ఇతరులకు విక్రయిస్తారు. దీని కోసం కొంత మార్జిన్‌ను స్టాక్ ఎక్సే్చంజ్‌ల వద్ద ఉంచుతారు. వారి అంచనాలకునుగుణంగానే ధర తగ్గగానే ఆ షేర్లను కొనుగోలు దారులకు డెలివరీ చేస్తారు. ధరల తేడా కారణంగా షార్ట్ సెల్లర్లు లాభపడతారు. దీంట్లో రిస్క్ అధికంగా, లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. వారి అంచనాలకనుగుణంగానే ధర తగ్గకుండా, పెరిగిపోతే, ఆ మేరకు వారికి భారీగా నష్టాలు వస్తాయి. -
మహమ్మారి ముంచేసింది!
కోవిడ్–19 (కరోనా) వైరస్‌ను మహమ్మారి వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. ఇక ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా యూరప్ నుంచి ప్రయాణాలను నెల రోజుల పాటు అమెరికా రద్దు చేయడంతో ఆర్థిక మందగమనం భయాలు ఉవ్వెత్తున ఎగిశాయి. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్ బుధవారం బేర్ దశలోకి చేరింది. ఫలితం...గురువారం మన మార్కెట్ కనీవినీ ఎరుగని స్థాయిలో నష్టపోయింది. మన మార్కెట్ కూడా బేర్ దశలోకి జారిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 33,000 పాయింట్లు, నిఫ్టీ 9,600 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 3,204 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరకు 2,919 పాయింట్ల నష్టంతో 32,778 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 868 పాయింట్లు క్షీణించి 9,590 పాయింట్లకు పడిపోయింది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సెన్సెక్స్, నిఫ్టీలు అత్యధిక పాయింట్లు నష్టపోయాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.11 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 82 పైసలు క్షీణించి 74.50కు పడిపోవడం, ముడి చమురు ధరలు 8 శాతం పతనం కావడం కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. వివరాలు... ఏడాది కనిష్టానికి అన్ని సూచీలు.... శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 8.2 శాతం, నిఫ్టీ 8.3 శాతం చొప్పున నష్టపోయాయి. ఈ రెండు సూచీలు రెండున్నర సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో ఇన్నేసి పాయింట్లు పతనం కావడం ఇదే మొదటిసారి. కాగా గత 3 ట్రేడింగ్ సెషన్లలో ఈ సూచీలు అత్యధిక పాయింట్లు నష్టపోవడం ఇది రెండోసారి. ఈ నెల 9(సోమవారం) సెన్సెక్స్, నిఫ్టీలు అత్యధిక పాయింట్లు నష్టపోవడం తెలిసిందే. గురువారం అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంక్‌సూచీ జీవిత కాల కనిష్టానికి, వాహన సూచీ 6 ఏళ్ల కనిష్టానికి, లోహ సూచీ మూడేళ్ల కనిష్టానికి, నిఫ్టీ బ్యాంక్ సూచీ రెండేళ్ల కనిష్టానికి పడ్డాయి. అన్ని రంగాల నిఫ్టీ సూచీలు ఏడాది కనిష్టానికి చేరాయి. నష్టాలు ఎందుకంటే... ► కోవిడ్–19 వైరస్...మహమ్మారి... కోవిడ్–19 వైరస్‌ను మహమ్మారి వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. అసలే ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోవిడ్ –19 వైరస్ కల్లోలంతో మాంద్యంలోకి జారిపోతుందనే ఆందోళనతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇక భారత్‌లో కోవిడ్–19 వైరస్ కేసులు 73కు పెరిగాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, ఈ వైరస్ సోకిన వ్యక్తులు 1.26 లక్షలకు చేరగా, మరణించిన వారి సంఖ్య 4,600కు చేరింది. ► ‘యూరప్’ ప్రయాణాలపై నిషేధం కోవిడ్–19 వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి యూరప్ నుంచి అమెరికాకు అన్ని రకాల ప్రయాణాలపై నెల రోజుల పాటు అమెరికా నిషేధం విధించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పర్యాటకంపై ఆంక్షలు విధించాయి. ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలన్నీ అతలాకుతలమవుతాయని ఆందోళనలు చెలరేగుతున్నాయి. ► బేర్ దశలోకి అమెరికా మార్కెట్.... బుధవారం ఆరంభంలోనే అమెరికా స్టాక్ సూచీలు 7 శాతం నష్టపోతే, ట్రేడింగ్‌ను 15 నిమిషాల పాటు నిలిపేశారు. ఆ తర్వాత ట్రేడింగ్ మొదలైనా ఈ సూచీలు 6–8 శాతం మేర పతనమయ్యాయి. ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి చూస్తే, బుధవారం అమెరికా స్టాక్ సూచీలు 20 శాతం మేర నష్టపోయి బేర్ దశలోకి జారిపోయాయి. ► ప్రపంచ మార్కెట్ల పతనం కోవిడ్–19 వైరస్‌ను మహమ్మారి వ్యాధిగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడం, అమెరికా స్టాక్ మార్కెట్ బేర్ దశలోకి ప్రవేశించడంతో ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. ఆసియా మార్కెట్లు 1.5–4.4% నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 6% నష్టాలతో మొదలై 11–12% నష్టాల్లో ముగిశాయి. ► విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు..... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) గత నెల 24 నుంచి మన మార్కెట్లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. కరోనా కల్లోల భయాలే దీనికి కారణం. 13 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు రూ.36,252 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. పసిడి, క్రూడ్.. క్రాష్ కోవిడ్–19 భయాల నేపథ్యంలో అన్ని ఇన్వెస్ట్మెంట్ సాధనాల నుంచీ డబ్బును వెనక్కుతీసుకుని, క్యాష్‌గానే భద్రపరచుకోడానికి ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఆర్థిక వ్యవస్థల తిరోగమన భయాల నేపథ్యంలో... పసిడి ధర భారీగా పెరగాల్సి ఉంది. అయితే ఇందుకు భిన్నంగా గురువారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1 గ్రా) ధర ఈ వార్త రాసే రాత్రి 10 గంటల సమయానికి 4 శాతం పతనమై (65 డాలర్లు) 1,577 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 1,560 డాలర్ల కనిష్టాన్ని కూడా చూడ్డం గమనార్హం. రెండు వారాల క్రితం పసిడి 1,704 డాలర్ల స్థాయిని నమోదు చేసుకుంది. ఇక లైట్‌స్వీట్ నైమెక్స్ క్రూడ్ బ్యారల్ ధర కూడా 35 డాలర్ల కీలక స్థాయిని అధిగమించలేక గురువారం ఒక దశలో 30 స్థాయికి పడిపోయింది. మరోవైపు ఆరు దేశాల కరెన్సీతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 98 వద్ద ట్రేడవుతుండడం గమనార్హం. ఒడిదుడుకులు తగ్గేదాకా వేచి చూడండి...! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ నుంచి ప్రయాణాలపై నిషేధం విధించడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు భారత మార్కెట్ కూడా బేర్ దశలోకి జారిపోయిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ దీపక్ జసాని పేర్కొన్నారు. మాంద్యం భయాలు ముప్పిరగొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మార్కెట్ మరింతగా పతనమయ్యే అవకాశాలున్నాయని బే కాపిటల్ ఎనలిస్ట్ సిద్ధార్థ మెహతా అంచనా వేస్తున్నారు. రానున్న 5–10 ఏళ్లలో మంచి అవకాశాలు అందిపుచ్చుకోగలిగిన, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు అత్యున్నతంగా ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు. అయితే ఒడిదుడుకులు సద్దుమణిగేదాకా వేచి చూస్తే మేలని ట్రేడింగ్‌బుల్స్ సీఈఓ అమిత్ గుప్తా సూచించారు. 11,00,000 కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.11.27 లక్షల కోట్ల మేర ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.11,27,161 కోట్లు హరించుకుపోయి రూ.1,25,86,398 కోట్లకు పడిపోయింది. సోమవారం రూ.7 లక్షల కోట్ల మేర ఆవిరైన సంపదను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ వారంలో ఇప్పటివరకూ మొత్తం రూ.18 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది. -
ప్రపంచవ్యాప్తంగా స్టాక్, కరెన్సీ మార్కెట్లలో కల్లోలం
ట్రంప్ ట్రేడ్‌వార్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కుదిపేస్తోంది. ఇక కార్చిచ్చులా ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తున్న కరోనా.. ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తోంది. ఈ రెండింటికీ సౌదీ అరేబియా–రష్యా మధ్య మొదలైన చమురు ధరల యుద్ధం ఆజ్యం పోసింది. ఇక చెప్పేదేముంది! మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు మహా పతనాన్ని చవిచూశాయి. చమురు ఊచకోతకు గురైంది. ఒక్క జపాన్ యెన్ మినహా... ప్రపంచ కరెన్సీలన్నీ ఊహించని విధంగా పతనమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే... ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా, ఏ దశలోనూ ఇన్వెస్టర్లకు ఉపశమనం కనిపించలేదు. ♦ ముడిచమురు ఉత్పత్తి తగ్గించుకునే విషయంలో ఒపెక్ కూటమి – రష్యా మధ్య రేగిన విభేదాలతో.. సౌదీ భారీగా రేట్లు తగ్గించేసింది. ఫలితం.. ఒకేరోజు ముడి చమురు ధరలు ఏకంగా 30 శాతానికిపైగా పతనమయ్యాయి. ఒక దశలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 31 డాలర్ల స్థాయికి పడిపోయి, తర్వాత కాస్త కోలుకుంది. 1991 గల్ఫ్ యుద్ధ సమయం తర్వాత ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి. ♦ తాజా పరిణామాలతో రూపాయి ఏకంగా 17 నెలల కనిష్టానికి క్షీణించి డాలర్‌తో పోలిస్తే 74.17 వద్ద క్లోజయ్యింది. జపాన్ యెన్ మినహా అమెరికా డాలర్, ఇతర కరెన్సీలూ రూపాయి దార్లోనే వెళ్లాయి. సోమవారం రాత్రి 11 గంటల సమయానికి అమెరికా మార్కెట్ల ప్రామాణిక సూచీ డోజోన్స్ 1,600 పాయింట్లకు పైగా నష్టంతో (6 శాతం) ట్రేడవుతోంది. జపాన్, జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్ మార్కెట్లు సైతం 5 నుంచి 7 శాతం మధ్యలో భారీగా నష్ట పోయాయి. మంగళవారం హోలీ సందర్భంగా మన మార్కెట్లకు సెలవు కావటంతో.. పతనానికి కూడా తాత్కాలికంగానైనా విరామం దొరికినట్లయింది. ఆయిల్ వార్, కరోనా ఫియర్ స్టాక్ మార్కెట్లను కుదిపేయడంతో ఆసియా నుంచి అమెరికా దాకా సోమవారం బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు భారీ నష్టాలతో ముగిశాయి. అదుపులోకి రాని కరోనా వైరస్ పెట్టుబడిదారులను బెంబేలెత్తించడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 30 శాతం కుప్పకూలింది. మరో ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటామేమోననే భయం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దశాబ్దకాలంలో అతిపెద్ద సింగిల్–డే పతనంతో మార్చి 9వతేదీ ,2020 భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండేగా నిలిచిపోయింది.7లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. క్రూడ్(ముడి చమురు) ధరల పతనానికి బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం 1,942 పాయింట్లు కుప్పకూలింది. చరిత్రలో ఇదే అత్యంత భారీ పతనం. కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలానికి ముడి చమురు ధరల పోరు జత కావడంతో స్టాక్ మార్కెట్ కనీవినీ ఎరుగని రీతిలో క్షీణించింది. సెన్సెక్స్ 36,000 పాయింట్లు, నిఫ్టీ 10,500 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ప్రస్తుతం మందగమనంలో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ... కోవిడ్–19 వైరస్, ముడి చమురు ధరల పోరు కారణంగా మాంద్యంలోకి జారిపోతుందనే భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఇక దేశీయంగా యస్‌బ్యాంక్ సంక్షోభం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 30 పైసలు తగ్గడం వంటి అంశాలు కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. ఇంట్రాడేలో 2,467 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్ చివరకు 1942 పాయింట్లు క్షీణించి 35,635 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 695 పాయింట్లు పతనమైన నిఫ్టీ చివరకు 538 పాయింట్ల నష్టంతో 10,451 పాయింట్ల వద్దకు చేరింది. శాతాలపరంగా చూస్తే, సెన్సెక్స్ 5.1 శాతం, నిఫ్టీ 4.9 శాతం చొప్పున నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, ఈ రెండు సూచీలు గత ఐదేళ్లలో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు ఒక్క రోజులోనే ఇన్నేసి పాయింట్లు నష్టపోవడం (ఇంట్రాడే, ముగింపులో కూడా)ఇదే మొదటిసారి. ఆరంభంలోనే భారీ నష్టాలు.... ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ భారీ నష్టాలతోనే ఆరంభమైంది. సెన్సెక్స్ 627 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సమయం Výæడిచే కొద్దీ నష్టాలు పెరిగాయే కానీ తరగలేదు. అన్ని రంగాల షేర్లు పతనమయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి స్టాక్ మార్కెట్ నష్టాలు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి చూస్తే, సెన్సెక్స్ 5,088 పాయింట్లు (12.4 శాతం), నిఫ్టీ 1,511 పాయింట్లు(12.6 శాతం) చొప్పున క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు ముప్పిరిగొన్నందున సెంటిమెంట్ బలహీనంగా ఉందని, మన మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిఫ్టీ మద్దతు స్థాయిలు 10,295–10,138 పాయింట్లని, ఒక వేళ పుల్ బ్యాక్ ర్యాలీ చోటు చేసుకుంటే నిరోధ స్థాయిలు 10,637–10,744 పాయింట్లని విశ్లేషకులు పేర్కొన్నారు. పతనానికి పంచ కారణాలు... ♦ చమురు ధరల పతనం... చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఉత్పత్తి కోతకు సంబంధించి చర్చలు విఫలమయ్యాయి. ఒపెక్ దేశాలు ప్రతిపాదించిన ఉత్పత్తి కోతను రష్యా వ్యతిరేకించడం.. నచ్చని సౌదీ అరేబియా ప్రతి చర్యలు ప్రకటించింది. తాము ఉత్పత్తి చేసే క్రూడ్ ధరలను తగ్గించడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఇది అంతర్జాతీయంగా వృద్ధి మరింతగా దెబ్బతీస్తుందన్న భయాలు మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని నిపుణులంటున్నారు. కోవిడ్–19 విలయం భారత్‌లో కోవిడ్–19 (వైరస్) బాధితుల సంఖ్య 43కు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య లక్షకు, మరణాల సంఖ్య 3,600కు పెరిగాయి. ఇటలీలో ఒక్క రోజులోనే 130కు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. కోటిన్నరకు పైగా ప్రజలను ఈ దేశం క్వారంటైన్లో ఉంచింది. మరిన్ని దేశాలకు ఈ వైరస్ విస్తరిస్తుండటంతో మరిన్ని కష్టాలు ముందు ముందు ఉంటాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ వైరస్ మరింత విస్తరిస్తే, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణ కొరియా తదితర అభివృద్ధి చెందిన దేశాలు మాంద్యంలోకి జారిపోతాయని మూడీస్ సంస్థ హెచ్చరించడం ఆందోళన రేకెత్తించింది. ప్రపంచ మార్కెట్ల పతనం కోవిడ్–19 వైరస్ విస్తరిస్తుండటం, ముడి చమురు ధరల హఠాత్ పతనం కారణంగా ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా క్షీణించాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి సురక్షిత సాధనాలైన పుత్తడి, అమెరికా డాలర్, బాండ్లలోకి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఫలితంగా సోమవారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. షాంఘై, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియా, జపాన్ సూచీలు 5 శాతం మేర క్షీణించాయి. ఆరంభంలోనే 6% మేర నష్టపోయిన యూరప్ మార్కెట్లు అదే స్థాయిలో ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు... కరోనా కల్లోలానికి సెంటిమెంట్ దెబ్బతినడంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ నికర కొనుగోలుదారులుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు కొనసాగుతున్నాయి. సోమవారాన్ని కూడా కలుపుకుంటే వరుసగా 11వ రోజూ విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగానే నిలిచారు. ఈ 11 ట్రేడింగ్ సెషన్లలో రూ.25,000 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. యస్ బ్యాంక్ సంక్షోభం .. భారత బ్యాంకింగ్ రంగం స్థిరత్వంపై ఆందోళనను, సంశయాలను పెంచింది. పలు ఆర్థిక సంస్థలు యస్ బ్యాంక్ బాండ్లలో ఇన్వెస్ట్ చేశాయి. ఈ బాండ్ల రేటింగ్‌ను పలు రేటింగ్ సంస్థలు డౌన్‌గ్రేడ్ చేశాయి. మరోవైపు బాసెల్ టూ, టైర్–1 బాండ్ల వడ్డీ చెల్లింపుల్లో యస్ బ్యాంక్ విఫలమైంది. మొత్తం మీద యస్ బ్యాంక్ ప్రభావం తీవ్రంగానే ఉండగలదన్న భయాలు నెలకొన్నాయి. నేడు మార్కెట్లకు సెలవు నేడు హోలీ పండుగ సందర్భంగా సెలవు. సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడయ్యింది. ఆరంభంలోనే ఏడు శాతం మేర çపతనమై లోయర్ సర్క్యూట్‌ను తాకింది. దీంతో ట్రేడింగ్‌ను నిలిపేశారు. 15 నిమిషాల అనంతరం ఆరంభమైనప్పటికీ నష్టాలు తగ్గలేదు. కరోనా ప్రభావం పెరుగుతుండటం, ముడి చమురు ధరలు తగ్గడం ప్రభావం చూపాయి. రాత్రి గం.11.30 ని. లకు డోజోన్స్ 1,794 పాయింట్లు, నాస్డాక్ 500 పాయింట్ల నష్టాల్లో ట్రేడయ్యాయి. మంగళవారం సెలవు కావడంతో మేలైందని, లేకుంటే అమెరికా, యూరప్ మార్కెట్ల నష్టాల ప్రభావంతో మన మార్కెట్‌కు భారీ నష్టాలు ఉండేవని విశ్లేషకులంటున్నారు. రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ మహా పతనం కారణంగా రూ. 7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.6, 84, 278 కోట్లు హరించుకుపోయి రూ.1,37,46,947 కోట్లకు పడిపోయింది. షేర్లు కకావికలం... ♦ ఓఎన్జీసీ.. 15 ఏళ్ల కనిష్టానికి ముడి చమురు ధరలు 30 శాతం మేర పతనం కావడంతో చమురు అన్వేషణ, తయారీ ప్రభుత్వ రంగ కంపెనీ ఓఎన్జీసీ భారీగా నష్టపోయింది. 16 శాతం నష్టంతో రూ.74.65 వద్ద ముగిసింది. ఇది దాదాపు 15 ఏళ్ల కనిష్ట స్థాయి. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ♦ రెండో స్థానానికి రిలయన్స్ చమురు ఉత్పత్తి రంగంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ కూడా బాగా పతనమైంది. 12 శాతం నష్టంతో రూ.1,113 వద్దకు చేరింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. లక్ష కోట్లు ఆవిరైంది. ఈ నష్టం కారణంగా అత్యధిక మార్కెట్ క్యాప్‌గల భారత కంపెనీ అనే ఘనతను కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. మొదటి స్థానం టీసీఎస్ షేర్‌కు దక్కింది. ♦ యస్ బ్యాంక్ జోరు... ఎస్బీఐ బేజారు.... సంక్షోభంలో చిక్కుకున్న యస్‌బ్యాంక్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేయనున్న ఎస్బీఐ షేర్ 6 శాతం పతనమై రూ.254కు చేరింది. మరోవైపు యస్ బ్యాంక్ షేర్ 31 శాతం లాభపడి రూ.21 వద్ద ముగిసింది. ♦ చమురు షేర్లు రయ్... ముడి చమురు ధరలు 30 శాతం మేర తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌పీసీఎల్ షేర్ 6 శాతం లాభంతో రూ.213కు, బీపీసీఎల్ షేర్ 5.2 శాతం పెరిగి రూ.424కు పెరిగాయి. ♦ ఏడాది కనిష్టానికి 800 షేర్లు... దాదాపు 800కు పైగా షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. బీఎస్ఈ 500 సూచీలో ప్రతి నాలుగు షేర్లలో ఒక షేర్ ఏడాది కనిష్టానికి పడిపోయింది.∙ప్రపంచ పరిణామాలకు యస్ బ్యాంకు సంక్షోభం తోడవటంతో బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ఒక్కరోజే 1,942 (5.1%) పాయింట్లు కుదేలైంది. చరిత్రలో ఇదే అత్యంత దారుణ పతనం. నిఫ్టీ సైతం 538 పాయింట్లు (4.9%) నష్టపోయింది. శాతాల పరంగా గత ఐదేళ్లలో ఇదే భారీ నష్టం కాగా.. పాయింట్ల పరంగా ఇది రికార్డు. ఓఎన్జీసీ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు సైతం 15 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఫలితంగా ఒక్కరోజే ఏకంగా రూ.7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. -
కోవిడ్ ‘విశ్వ’రూపం... గుబేర్!
చైనా కాకుండా కొత్త దేశాలకు కోవిడ్–19(కరోనా) వైరస్ విస్తరిస్తుండటం, ఆయా దేశాల్లో కొత్త కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన స్టాక్ మార్కెట్ కూడా బుధవారం నష్టపోయింది. ఈ క్యూ2లో 4.5 శాతంగా ఉన్న వృద్ధి రేటు ఈ క్యూ3లో కూడా అదే రేంజ్లో ఉండగలదన్న అంచనాలు ప్రతికూల ప్రభావం చూపాయి. రేపు (శుక్రవారం) ఈ క్యూ3 జీడీపీ గణాంకాలు వెలువడతాయి. సెన్సెక్స్ కీలకమైన 40,000 పాయింట్ల దిగువకు పతనం కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 200 రోజుల చలన సగటు(డీఎమ్ఏ) దిగువకు క్షీణించింది. ఇంట్రాడేలో 521 పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 392 పాయింట్లు పతనమై 39,889 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 119 పాయింట్లు క్షీణించి 11,679 పాయింట్ల వద్దకు చేరింది. టెలికం రంగ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు పుంజుకున్నా (ఇంట్రాడేలో), ముడి చమురు ధరలు 1.7 శాతం మేర పతనమైనా, మన మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. మహమ్మారిగా కోవిడ్–19 వైరస్! చైనాలో కొత్త కేసులు తగ్గినప్పటికీ, కోవిడ్–19 (కరోనా) వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,700కు, వ్యాధి సోకిన వారి సంఖ్య 80,000కు పెరిగాయి. ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఇటలీ, ఆస్ట్రియా, స్పెయిన్ వంటి కొత్త దేశాలకు ఈ వైరస్ వ్యాపిస్తోంది. చైనా తర్వాత దక్షిణ కొరియాలో అధికంగా ఈ వైరస్ బాధితులున్నారు. ఈ దేశంలో కొత్త కేసుల సంఖ్య 169కు, మొత్తం బాధితుల సంఖ్య 1,146కు, మృతుల సంఖ్య 11కు పెరిగింది. కోవిడ్ 19 వైరస్ మహమ్మారిగా మారనున్నదని, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఈ వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉండగలదన్న ఆందోళనతో ప్రపంచ మార్కెట్లు పతనమవుతున్నాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో... యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఈక్విటీ నుంచి పెట్టుబడులు సురక్షిత పెట్టుబడి సాధనాలైన అమెరికా బాండ్లు, డాలర్, పుత్తడిలోకి తరలిపోతున్నాయి. ► సన్ ఫార్మా 3.6% నష్టంతో రూ.375 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► బంధన్ బ్యాంక్ ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. బ్రాంచ్‌ల విస్తరణకు ఆర్బీఐ అనుమతినివ్వడంతో ట్రేడింగ్ మొదట్లో 5% లాభంతో రూ.423ను తాకింది. చివరకు 2.3% నష్టంతో రూ.394 వద్ద ముగిసింది. ► 300కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. హీరో మోటో, జిల్లెట్ ఇండియా, ఎల్ అండ్ టీ, థెర్మాక్స్.... తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్ నష్టపోయినా, ఇండియా సిమెంట్స్ షేర్ 20% అప్పర్ సర్క్యూట్‌తో రూ.105వద్ద ముగిసింది. గత రెండు రోజుల్లో ఈ షేర్ 37% ఎగసింది. ఏస్ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ, ఆయన సోదరుడు గోపీకిషన్ దమానీ ఈ కంపెనీలో వాటాను 11.58%కి పెంచుకున్నారన్న వార్తలు దీనికి కారణం. n ఒక్కో షేర్‌కు రూ.349 డివిడెండ్‌ను ప్రకటించడంతో సనోఫీ ఇండియాఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ. 7,638ను తాకింది. చివరకు 1.6% లాభంతో రూ. 7,114 వద్ద ముగిసింది. గత ఏడాదికి గాను రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.106 డివిడెండ్‌ను, రూ.243 ప్రత్యేక డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. 4 రోజుల్లో 1,434 పాయింట్లు డౌన్ వరుసగా నాలుగో రోజూ స్టాక్ మార్కెట్ పతనమైంది. గత 4 రోజుల్లో సెన్సెక్స్ 1,434 పాయింట్లు, నిఫ్టీ 402 పాయింట్ల మేర నష్టపోయాయి. ఈ నాలుగు రోజుల్లో రూ.5.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. నేడు(గురువారం) ఫిబ్రవరి సిరీ స్ డెరివేటివ్స్ ముగింపు, నిఫ్టీ వీక్లీ ఆప్షన్ల ముగింపు కావడంతో సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఎకానమీకి ముప్పేు.. కోవిడ్ వైరస్, అమెరికా–ఈయూ వాణిజ్య యుద్ధం, గల్ఫ్ ఉద్రిక్తతలను ప్రస్తావించిన ఈఐయూ 2020లో వృద్ధి 2.9 శాతమని అంచనా న్యూఢిల్లీ: కోవిడ్–19 వైరస్, అమెరికా–యూరోపియన్ యూనియన్ వాణిజ్య యుద్ధం, అమెరికా–ఇరాన్ సంఘర్షణల నేపథ్యంలో తలెత్తుతున్న గల్ఫ్ ఉద్రిక్తతలు ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పుగా తయారయ్యాయని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా దిగ్గజం– ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) విశ్లేషించింది. 2020లో ప్రపంచ ఆర్థికవృద్ధి రేటు కేవలం 2.9 శాతంగా అంచనావేసింది. ఇదే జరిగితే ఇది దశాబ్దపు కనిష్టస్థాయి అవుతుంది. ఈ మేరకు విడుదలైన ఒక శ్వేతపత్రంలోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► 2020లో ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. అమెరికా వృద్ధి రేటు అంతంతమాత్రంగానే ఉంటుంది. కోవిడ్ వైరస్ సంక్షోభం చైనాను కుదేలు చేయడమే కాకుండా, ఆసియా వృద్ధి అవకాశాలను దెబ్బతీస్తోంది. ► 2020లో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సామాజిక ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 2020లోనూ ఇదే కొనసాగవచ్చు. ఇది ఇటు విధాన నిర్ణేతలకూ అటు వ్యాపారవేత్తలకూ సమస్యగా ఉంటుంది. ► పలు ఆర్థిక వ్యవస్థలు రుణ భారాలను ఎదుర్కొంటున్నాయి. కరోనా సమస్యలతో వాణిజ్యపరమైన సరఫరాల సమస్య తలెత్తవచ్చు. ‘కోవిడ్’ ప్రభావాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాం ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అనుకున్న సమయానికే బ్యాంకింగ్ విలీనం న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 (కరోనా) వైరస్ ప్రభావాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం ఇక్కడ ప్రకటించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. అనుకున్న సమయంలో ఇది పూర్తవుతుందనీ, ఈ విషయంలో ఎటువంటి అనిశ్చితీ లేదనీ వివరించారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థికమంత్రి ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లను ఉద్ధేశించి ప్రసంగించారు. బ్యాంకర్లు తీసుకున్న వాణిజ్య నిర్ణయాల్లో నిజాయితీ ఉంటే, ఆయా నిర్ణయాల అమల్లో కొన్ని వ్యాపార కారణాల వల్ల తప్పు జరిగినా, బ్యాంకర్లకు వేధింపులు ఉండబోవని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 10 బ్యాంకుల విలీన కీలక నిర్ణయాన్ని గత ఆగస్టులో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ మొత్తం పూర్తయితే, 2017లో 27 ఉన్న మొత్తం ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గుతుంది. 2017 ఏప్రిల్‌లో భారతీయ మహిళా బ్యాంకుసహా అయిదు అనుబంధ బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2019లో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారు. కేంద్రం గతేడాది ప్రకటించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీన ప్రక్రియలో భాగంగా 10 బ్యాంకులను నాలుగింటిగా మార్చనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 2020 ఏప్రిల్ 1 డెడ్‌లైన్‌గా కేంద్రం నిర్దేశించింది. అక్టోబర్–డిసెంబర్ మధ్య వృద్ధి 4.5 శాతమే: ఎస్బీఐ గత ఏడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు దాదాపు 4.5 శాతంగానే ఉంటుందని ఎస్బీఐ ఆర్థికవేత్తల నివేదిక అంచనావేసింది. 28వ తేదీ మూడవ త్రైమాసిక ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఈ నివేదిక వెలువడింది. కోవిడ్–19 ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని పేర్కొంది. చైనా నుంచి భారత్ వివిధ వస్తువులను దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. 2019–20లో భారత్ జీడీపీ దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. 2019–20లో వృద్ధి 4.7 శాతం ఉంటుందని ఎస్బీఐ ఎకనమిస్ట్ నివేదిక పేర్కొంది. -
మెరిసిన బంగారం
ముంబై: పలు దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న కోవిడ్–19 (కరోనా) వైరస్... బంగారం మెరుపులకు కారణమవుతోంది. వ్యాధి రోజురోజుకూ విజృంభిస్తుండడం, ప్రపంచాభివృద్ధిపై అనిశ్చితి వంటి అంశాల నేపథ్యంలో ప్రస్తుతం తమ పెట్టుబడులకు యెల్లో మెటలే సురక్షిత సాధనమని అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఈక్విటీలు, క్రూడ్‌సహా పలు విభాగాల నుంచి వేగంగా పెట్టుబడులు పసిడివైపు మరలుతున్నాయి. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర సోమవారం ఏకంగా దాదాపు 42 డాలర్లు ఎగసింది. ట్రేడింగ్ ఒక దశలో 1,700 డాలర్లకు 10 డాలర్ల దూరంలో 1,691.56ను తాకింది. ఈ వార్తరాసే రాత్రి 9 గంటల సమయంలో 31.35 డాలర్ల లాభంతో 1,680.15 వద్ద ట్రేడవుతోంది. ఈ ధర దాదాపు 8 సంవత్సరాల గరిష్టస్థాయి. దేశీయంగా రూపాయి బలహీనత తోడు... ఇక భారత్‌లో చూస్తే, అంతర్జాతీయ ధోరణితోపాటు, దేశీయంగా రూపాయి బలహీనత పసిడి పరుగుకు కారణమవుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో పసిడి 10 గ్రాములు స్వచ్ఛత ధర ఈ వార్త రాసే 9 గంటల సమయంలో రూ.953 లాభంతో రూ.43,619 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ఒక దశలో రూ.43,788నూ తాకింది. ఢిల్లీ సహా పలు పట్టణాల్లోని స్పాట్ మార్కెట్లలో 10 గ్రాముల స్వచ్ఛత ధర రూ.1,000 వరకూ పెరిగింది. న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్లో 10 గ్రాములు స్వచ్ఛత పసిడి ధర రూ.953 పెరిగి రూ.44,472కు చేరింది. పలు పట్టణాల స్పాట్ మార్కెట్లలోనూ ధర దాదాపు రూ.1,000 వరకూ పెరిగి రూ.44,000 పైనే ధర పలికింది. -
మళ్లీ నష్టాలు
అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం పతనం కావడం, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరిస్తుండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 153 పాయింట్లు పతనమై 41,170 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 12,081 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్ 87 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్లు పతనమయ్యాయి. 266 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనప్పటికీ, ఆ వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల చివరి రోజు కావడంతో చివరి గంట వరకూ లాభ, నష్టాల మధ్య దోబూచులాడింది. చివరి గంటలో నష్టాలు పెరిగాయి. ఒక దశలో 77 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 189 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 266 పాయింట్ల రేంజ్లో కదలాడింది. కోవిడ్–19(కరోనా) వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య ఛైనాలో 2,118కు పెరిగింది. కొత్త కేసులు తగ్గాయి. అయితే దక్షిణ కొరియా ఇతర దేశాల్లో వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య పెరిగింది. అంతే కాకుండా ఈ వైరస్ కారణంగా ఆర్థికంగా సంభవించే నష్టాల ఆందోళనలు తగ్గకపోవడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. ఆగని ఐఆర్సీటీసీ జోరు ఐఆర్సీటీసీ షేరు జీవిత కాల గరిష్ట స్థాయి, రూ. 1,976ని తాకింది. చివరకు 5% లాభంతో రూ.1,928 వద్ద ముగిసింది. ఇక ఎమ్‌ఎస్‌టీసీ, ఓల్టాస్, పీవీఆర్, అదానీ గ్యాస్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐనాక్స్ లీజర్, జేకే సిమెంట్స్, ముత్తూట్ ఫైనాన్స్, ట్రెంట్, ఎస్ఆర్ఎఫ్ షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. ► షేర్ల బైబ్యాక్ వార్తలతో థామస్ కుక్ షేర్ 20 శాతం ఎగసి రూ.49 వద్ద ముగిసింది. ► గ్రూప్ కంపెనీల్లో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని తేలడంతో ఇండియాబుల్స్ గ్రూప్ షేర్లు 11 శాతం మేర ర్యాలీ జరిపాయి. వచ్చే ఏడాది డ్రూమ్ ఐపీఓ అమెరికా స్టాక్ ఎక్సే్చంజ్‌లో లిస్టింగ్! న్యూఢిల్లీ: ఆటోమొబైల్ మార్కెట్ ప్లేస్ డ్రూమ్ ఐపీఓ (ఇనీసియల్ పబ్లిక్ ఆఫర్) వచ్చే ఏడాది రానున్నది. ఐపీఓకు రాకముందే 15 కోట్ల డాలర్ల నిధులను సమీకరిస్తామని డ్రూమ్ వ్యవస్థాపకులు, సీఈఓ కూడా అయిన సందీప్ అగర్వాల్ వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా లాభాల్లోకి వస్తామని పేర్కొన్నారు. తమ ప్లాట్ఫార్మ్పై గత ఏడాది 120 కోట్ల డాలర్ల విలువైన వస్తువుల వ్యాపారం జరిగిందని, 3.2 కోట్ల నికర రాబడిని ఆర్జించామని తెలిపారు. నేడు సెలవు మహాశివరాత్రి సందర్భంగా నేడు (శుక్రవారం) స్టాక్ మార్కెట్‌కు సెలవు. స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో ట్రేడింగ్ జరగదు. -
కొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీ
అమెరికా–చైనాల మధ్య తొలి దశ ఒప్పందంపై సంతకాలు ఈ వారమే జరుగుతాయన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ కూడా సోమవారం లాభపడింది. గత ఏడాది నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 1.8 శాతం వృద్ధి సాధించడం, ఇన్ఫోసిస్ క్యూ3 ఫలితాలు అంచనాలను మించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు పుంజుకొని 70.82కు చేరడం(ఇంట్రాడేలో), సానుకూల ప్రభావం చూపించాయి. టెక్నాలజీ, బ్యాంక్, లోహ, రియల్టీ షేర్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త జీవిత కాల గరిష్ట స్థాయి రికార్డ్లను సృష్టించాయి. ఇంట్రాడేలో 41,900 పాయింట్లకు ఎగబాకిన సెన్సెక్స్ చివరకు 260 పాయింట్ల లాభంతో 41,860 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 12,330 పాయింట్ల వద్దకు చేరింది. ఇంట్రాడేలో 12,338 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. నికర లాభాలు పెరుగుతాయ్....! ఇన్ఫోసిస్ క్యూ3 ఫలితాలు బాగా ఉండటంతో ఇతర కంపెనీల ఫలితాలు కూడా బాగానే ఉంటాయనే అంచనాలు నెలకొన్నాయి. ఆర్థిక మందగమనం పరిస్థితుల కారణంగా కంపెనీల ఆదాయాలు పెద్దగా పెరగకపోయినా, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపుతో నికర లాభాలు మాత్రం పెరిగే అవకాశం ఉందని అంచనా. ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. ► నికర లాభం 24 శాతం పెరగడంతో ఇన్ఫోసిస్ షేర్ 4.7 శాతం లాభంతో రూ.773 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సెన్సెక్స్ మొత్తం 260 పాయింట్ల లాభంలో సగం పాయింట్లు (125 పాయింట్లు) ఇన్ఫోసిస్ షేర్వి కావడం విశేషం. ► ఇన్వెస్టర్ల సంపద ఒక్క సోమవారం రోజే రూ. లక్ష కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 1 లక్ష కోట్లు పెరిగి రూ.158.74 లక్షల కోట్లకు ఎగసింది. ► లిస్టింగ్ నిబంధనలను పాటించనందున వచ్చే నెల 3 నుంచి కాఫీ డే ఎంటర్ప్రైజెస్, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ షేర్ల ట్రేడింగ్ నిలిచిపోనున్నది. దీంతో ఈ రెండు షేర్లు చెరో 5 శాతం మేర నష్టపోయాయి. కాఫీ డే షేర్ రూ.39.65కు, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ షేర్ 4.9 శాతం నష్టంతో రూ.10.80కు చేరాయి. ► జుబిలంట్ ఫుడ్‌వర్క్స్, మెట్రోపొలిస్ హెల్త్‌కేర్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, ఫీనిక్స్ మిల్స్, రిలాక్సో ఫుట్‌వేర్, శ్రీ సిమెంట్, ఎస్ఆర్ఎఫ్, టాటాగ్లోబల్ బేవరేజేస్ తదితర షేర్లు ఆల్‌టైం హైని తాకాయి. ► ఎర్విన్ సింగ్బ్రెయిచ్ పెట్టుబడుల ప్రణాళికను యస్ బ్యాంక్ తిరస్కరించింది. ఈ బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఒకరు రాజీనామా చేశారు. అంతే కాకుండా నిధుల సమీకరణను రూ.10,000 కోట్లకు మాత్రమే పరిమితం చేయాలని డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించింది. దీంతో యస్ బ్యాంక్ షేర్ 6 శాతం నష్టంతో రూ.42 వద్ద ముగిసింది. ► క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో డీఎల్ఎఫ్ షేర్ జోరుగా పెరిగింది. 3.5 శాతం లాభంతో రూ. 253కు చేరింది. -
11,500 పాయింట్ల దిగువకు నిఫ్టీ
రెండు రోజుల రికార్డ్ లాభాల నేపథ్యంలో మంగళవారం ఆరంభమైన లాభాల స్వీకరణ బుధవారం కూడా కొనసాగింది. వృద్ధిని మరింతగా కుంటుపరిచేలా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు చోటు చేసుకోవడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌పై అభిశంసన విచారణ మొదలు కావడంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. వీటికి తోడు మన వృద్ధి అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) కోత కోయడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం కూడా తోడవడంతో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 39,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,500 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ముడి చమురు ధరలు 1.6 శాతం పతనమైనా, మన మార్కెట్ పతనబాటలోనే కొనసాగింది. సెన్సెక్స్ 504 పాయింట్లు నష్టపోయి 38,594 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 148 పాయింట్లు పతనమై 11,440 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నిప్టీ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు చెరో 2% పతనమయ్యాయి. ఒడిదుడుకులు కొనసాగుతాయ్... అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అభిశంసన ప్రతిపాదన కారణంగా అమెరికాలో రాజకీయ దుమారం చెలరేగడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. దీని ప్రభావం స్వల్పకాలికంగానే ఉండనున్నదని ఆయన భావిస్తున్నారు. మొండి బకాయిలకు సంబంధించి తాజా సమస్యలు, సెప్టెంబర్ వాహన అమ్మకాలు బలహీనంగా ఉండే అవకాశాలు, ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రోజులో ముగియనుండటం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని వివరించారు. సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు నేడు(గురువారం) ముగియనుండటంతో ఒడిదుడుకులు కొనసాగుతాయని నిపుణులంటున్నారు. వచ్చే నెల 4న ఆర్బీఐ పాలసీ, క్యూ2 ఫలితాలను బట్టి మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని వారంటున్నారు. రూ.1.84 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.1.84 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,84,484 కోట్లు తగ్గి రూ.1,46,88,764 కోట్లకు పడిపోయింది. పతనానికి ప్రధాన కారణాలు లాభాల స్వీకరణ డొనాల్ట్ ట్రంప్‌పై అభిశంసన ప్రక్రియ ట్రంప్ చైనా వ్యతిరేక వ్యాఖ్యలు పతనమైన ప్రపంచ మార్కెట్లు వృద్ధి అంచనాలను తగ్గించిన ఏడీబీ రూపాయి పతనం మార్కెట్ భారీగా నష్టపోయినా, ఇండియామార్ట్ ఇంటర్మెష్ షేర్ మెరుపులు మెరిపించింది. దేశంలోనే అతి పెద్ద బీ2బీ కంపెనీ అయిన ఇండియామార్ట్ ఇంటర్మెష్ షేర్ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,970ను తాకింది. చివరకు స్వల్ప లాభంతో రూ. 1,874 వద్ద ముగిసింది. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో లిస్టయిన ఈ కంపెనీ ఇష్యూ ధర, రూ.973తో పోల్చితే దాదాపు రెట్టింపైంది. గత నెల కాలంలోనే ఈ కంపెనీ షేర్ 70 శాతానికి పైగా పెరగడం విశేషం. -
మార్కెట్‌కు ‘ఫెడ్’ జోష్!
వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సరళతర విధానం కారణంగా ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. దీనికి మన దగ్గర షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు, వేల్యూ బయింగ్ కూడా జత కావడంతో మన మార్కెట్ కూడా గురువారం భారీగా లాభపడింది. గత మూడు రోజులుగా అంతంత మాత్రం లాభాలతో సరిపెట్టుకున్న సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలు సాధించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం, రానున్న బడ్జెట్లో వ్యాపార వర్గాలకు అనుకూలమైన చర్యలు ఉంటాయనే అంచనాలు సానుకూల ప్రభావం చూపించాయి. ముడిచమురు ధరలు భగ్గుమన్నా, మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 489 పాయింట్లు పెరిగి 39,602 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 140 పాయింట్లు ఎగసి 11,832 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ముడిచమురు ధరలు భగ్గుమన్నా... అమెరికాకు చెందిన డ్రోన్‌ను ఇరాన్ కూల్చేసిందన్న వార్తల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా ప్రజ్వరిల్లుతాయనే ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. ఒక పీపా బ్రెంట్ ముడి చమురు ధర దాదాపు 3% పెరిగి 63.37 డాలర్లకు చేరింది. సాధారణంగా చమురు ధరలు పెరిగితే మన మార్కెట్ పడిపోతుంది. ఈసారి దీనికి భిన్నంగా జరిగింది. ముడిచమురు 3% పెరిగినా, డాలర్‌తో రూపాయి మారకం 23 పైసలు లాభపడటం కలసివచ్చింది. 703 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ నష్టాల్లో ఆరంభమైనప్పటికీ, ఆ తర్వాత పుంజుకుంది. బ్యాంక్, ఫార్మా, వాహన షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయన్న ఆశలూ సానుకూల ప్రభావం చూపించాయి. మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయన్న వార్తలు సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. ఇటీవల నష్టాలతో ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో వేల్యూబయింగ్ చోటు చేసుకుంది. మరో వారం రోజుల్లో జూన్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లూ జరిగాయి. ఒక దశలో 179 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 524 పాయింట్లు పెరిగింది. రోజంతా 703 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. జెట్ ఎయిర్వేస్ షేరు డబుల్... జెట్ ఎయిర్వేస్ భారీ లాభాలను సాధించింది. స్టాక్ మార్కెట్లో ఏ షేరూ ఏ రోజూ పెరగనంత స్థాయిలో జెట్ ఎయిర్వేస్ షేర్ పెరిగింది. ట్రేడింగ్ ఆరంభంలోనే ఈ షేర్ 18 శాతం నష్టంతో జీవిత కాల కనిష్ట స్థాయి, రూ.27కు పడిపోయింది. అయితే షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతోఈ ఈ షేర్ పుంజుకుంది. ఇంట్రాడేలో 134 శాతం లాభంతో రూ.77కు ఎగసిన జెట్ ఎయిర్వేస్ షేర్ చివరకు 93 శాతం లాభంతో రూ.64 వద్ద ముగిసింది. గత 13 సెషన్లలో ఈ షేర్ దాదాపు 78 శాతం పతనమైంది. ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలని ఎన్సీఎల్టీలో ఎస్బీఐ కేసు వేయడం తెలిసిందే. మరిన్ని విశేషాలు.. ► 31 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు–ఐటీసీ, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్‌లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ షేర్ 8% ఎగసింది. ► యస్ బ్యాంక్ 11 శాతం లాభపడి రూ. 115 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఆరంభంలో ఈ షేర్ రెండంకెల స్థాయి, రూ.98.75కి పడిపోయింది. ఈ షేర్ రెండంకెల స్థాయికి పడిపోవడం గత ఐదేళ్లలో ఇదే మొదటిసారి. అయితే షార్ట్ కవరింగ్ కొనుగోళ్ల కారణంగా ఈ నష్టాల నుంచి ఈ షేర్ కోలుకుంది. రూ.1.75 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.75 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.75 లక్షల కోట్లు పెరిగి రూ.1,61,30,671 కోట్లకు పెరిగింది. ఫెడ్... రేట్ల తగ్గింపు సంకేతాలు! అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లను ప్రస్తుతమున్న 2.25–2.50 శాతం రేంజ్‌లోనే కొనసాగించాలని నిర్ణయించింది. రేట్ల విషయమై యథాతథ స్థితిని కొనసాగించినప్పటికీ, అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వృద్ధి తోడ్పాటుకు తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. వివిధ పరిణామాల కారణంగా మందగమనం చోటు చేసుకోవడంతో అవసరమైతే, వచ్చే నెలలోనే రేట్లను అర శాతం మేర తగ్గించగలమని సంకేతాలు ఇచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత ఫెడ్ రేట్లను తగ్గించడానికి సిద్ధమవుతోంది. ఫెడ్ నిర్ణయాన్ని ఇతర దేశాల కేంద్ర బ్యాంక్‌లూ అనుసరించే అవకాశాలుండటంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఫెడ్ రేట్లను తగ్గిస్తే, వృద్ధి చెందుతున్న దేశాలకు ముఖ్యంగా భారత్‌కు విదేశీ నిధులు వెల్లువలా వస్తాయి. అందుకని ఫెడ్ నిర్ణయంతో మన మార్కెట్ భారీగా లాభపడింది. ఐదేళ్ల గరిష్టానికి పసిడి పరుగు న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీ య ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ధర గురువారం పరుగులు పెట్టింది. ఒక దశలో ఔన్స్ (31.1గ్రా) ధర బుధవారం ముగింపుతో పోల్చిచూస్తే, 45 డాలర్ల లాభంతో 1,395 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. పసిడికి ఇది ఐదు సంవత్సరాల్లో గరిష్టస్థాయి. గతంలో పలు సార్లు పసిడి 1,360 డాలర్ల వద్ద తీవ్ర నిరోధాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు ఈ స్థాయి దాటడంతో ఒక్కసారిగా 1,400 డాలర్ల వైపు పరుగుపెట్టింది. ఈ స్థాయి దాటితే మరో 50 డాలర్లకు పసిడి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. పరుగుకు కారణం..: అమెరికాలో వృద్ధి రేటు మందగమనం, దీనితో అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు తగ్గుతుందన్న అంచనాలు (ప్రస్తుతం 2.25–2.50 శాతం) పసిడి పరుగుకు కారణంగా నిలిచాయి. అమెరికా వృద్ధి మందగమనం వార్తలతో డాలర్ ఇండెక్స్ స్పీడ్ తగ్గడం కూడా గమనార్హం. ఇక వాణిజ్యయుద్ధం వంటి అంశాలు ప్రపంచ వృద్ధి తీరును ఆందోళనలోకి నెడుతున్నాయి. ఆయా అంశాలు పసిడికి తక్షణ బలాన్ని ఇస్తున్నాయి. దేశంలో రూ. 1,000 అప్..: ఇక దేశంలోని మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ చూస్తే, ఈ వార్త రాసే సమయానికి బుధవారం ముగింపుతో పోల్చితే 10 గ్రాముల బంగారం ధర రూ.1,000 లాభంతో రూ. 34,058 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం 69.44 వద్ద ఉన్న రూపాయి మరింత బలహీనపడితే, దేశంలో పసిడి పరుగు మరింత వేగంగా ఉండే అవకాశం ఉందని అంచనా. -
ప్రపంచ మార్కెట్ల పతన ప్రభావం
మూడు రోజుల స్టాక్ మార్కెట్ లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు పతనం కావడంతో ఇక్కడి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఆరోగ్య కారణాల రీత్యా తనకు ఎలాంటి పదవీ బాధ్యతలు అప్పగించవద్దని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. మే సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో అధిక స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. ఇంట్రాడేలో 329 పాయింట్ల వరకూ నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 248 పాయింట్లు పతనమై 39,502 పాయింట్ల వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు తగ్గి 11,861 పాయింట్ల వద్ద ముగిశాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజీపీ ఘన విజయం నేపథ్యంలో గత మూడు రోజులుగా సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డ్ స్థాయిల్లో క్లోజవుతున్నాయి. ఈ రికార్డ్ లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారని, బ్యాంక్, లోహ, వాహన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయని నిపుణులంటున్నారు. తగ్గుతున్న బాండ్ల రాబడులు... మూడు నెలల అమెరికా బాండ్ల రాబడులు కన్నా, పదేళ్ల బాండ్ల రాబడులు తగ్గాయి. ఇది మాంద్యానికి సూచన అని విశ్లేషకులంటున్నారు. మరోవైపు అమెరికా–చైనాల మధ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతుండటం కూడా ప్రభావం చూపడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. భారత్‌లో కూడా బాండ్ల రాబడులు తగ్గాయని, ఆర్బీఐ వచ్చేవారంలో కీలక రేట్లను తగ్గించగలదన్న అంచనాలు దీనికి కారణమని శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ సునీల్ శర్మ పేర్కొన్నారు. అమెరికా, భారత్‌ల్లో బాండ్ల రాబడులు తగ్గుతుండటంతో మన దేశం నుంచి విదేశీ పెట్టుబడులు అభివృద్ది చెందిన దేశాలకు తరలిపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 347 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ ఒక దశలో 18 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 329 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 347 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ► ఇటీవలే జీవిత కాల గరిష్ట స్థాయికి చేరిన ఎస్బీఐలో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో ఈ షేర్ 3.2 శాతం నష్టపోయి రూ.348 వద్ద ముగిసింది. త్వరలోనే ఈ బ్యాంక్ క్యూఐపీ విధానంలో రూ.15,000–18,000 కోట్ల మేర నిధులు సమీకరించనున్నదన్న వార్త కూడా ప్రభావం చూపింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఈ ర్యాలీ నెలే! ఈ ఏడాది చివరి కల్లా సెన్సెక్స్ 42,000 పాయింట్లకు చేరగలదన్న గతంలో వెల్లడించిన లక్ష్యాలను ఫ్రాన్స్ బ్రోకరేజ్ సంస్థ, బీఎన్పీ పారిబా కొనసాగించింది. ఎన్నికల ఫలితాల అనంతరం వచ్చిన ర్యాలీ నెల రోజుల్లో సమసిసోతుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. -
36,000 దిగువకు సెన్సెక్స్
కొత్త ఏడాది లాభాల మురిపెం మొదటి రోజుకే పరిమితమైంది. చైనా వృద్ధిపై ఆందోళన కారణంగా ప్రపంచ మార్కెట్లు పతనం కావడంతో మన మార్కెట్ కూడా బుధవారం నష్టపోయింది. బలహీనంగా ఉన్న గత నెల వాహన విక్రయాలకు, అంచనాలను అందుకోలేని జీఎస్టీ వసూళ్లు జత కావడం, డాలర్‌తో రూపాయి మారకం కూడా పతనం కావడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 36,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,800 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఐదు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఇంట్రాడేలో 521 పాయింట్ల వరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 363 పాయింట్లు క్షీణించి 35,892 పాయింట్ల వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు తగ్గి 10,793 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు చెరో 1 శాతం క్షీణించాయి. లోహ, వాహన, బ్యాంక్, ఇంధన షేర్లు నష్టపోయాయి. రూపాయి పతనం కారణంగా ఐటీ షేర్లు పుంజుకున్నాయి. కొత్త ఏడాది తొలి రోజు సెలవు కారణంగా మంగళవారం పనిచేయని ప్రపంచ మార్కెట్లు బుధవారం చైనా ఆర్థిక వృద్ధిపై ఆందోళనతో నష్టాలతో ఆరంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్ నష్టాల్లోనే ఆరంభమైంది. రోజు గడిచేకొద్దీ పతనం పెరిగిందే కానీ తగ్గలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 521 పాయింట్లు, నిఫ్టీ 175 పాయింట్ల వరకూ నష్టపోయాయి. బ్లూ చిప్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. లోహ షేర్లు విలవిల: చైనాలో వృద్ధి మందగించిందన్న గణాంకాలతో లోహ షేర్లు కుదేలయ్యాయి. ప్రపంచంలో లోహా లను అత్యధికంగా వినియోగించే చైనాలో వృద్ధిపై ఆందోళన కారణంగా అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, సీఎల్ఎస్ఏ పలు లోష షేర్ల రేటింగ్‌ను తగ్గించింది. దీంతో లోహ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, వేదాంత, నాల్కో, జిందాల్ స్టీల్ అండ్ పవర్, హిందాల్కో షేర్లు 1–4 శాతం రేంజ్ వరకూ నష్టపోయాయి. కాగా స్టాక్ మార్కెట్ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.39 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.144.81 లక్షల కోట్ల నుంచి రూ.143.42 లక్షల కోట్లకు తగ్గింది. సెన్సెక్స్‌లో ఆరు షేర్లు –సన్ ఫార్మా, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, యస్‌బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మాత్రమే లాభపడగా, మిగిలిన 25 షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 50లో 9 షేర్లు లాభపడగా, 41 షేర్లు నష్టపోయాయి. -
ప్రపంచ మార్కెట్ల పతనం
టర్కీ కరెన్సీ లిరా కోలుకుంటున్నప్పటికీ, అమెరికా వస్తువులపై టర్కీ సుంకాల పెంపు, ఇతర దేశాలతో అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు 1% వరకూ నష్టపోగా, యూరప్ మార్కెట్లు 1.6–2% రేంజ్లో క్షీణించాయి. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ దాదాపు 100 పాయింట్లు నష్టపోగా, అమెరికా సూచీలు 1.5–2% నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చమురు, పుత్తడి ధరలు నేల చూపులు చూస్తుండగా, డాలర్ దుసుకుపోతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన మార్కెట్‌కు సెలవు కావడంతో భారీ నష్టాలు తప్పాయని నిపుణులంటున్నారు. అయితే నేడు(గురువారం) భారీ గ్యాప్‌డౌన్‌తో మన స్టాక్ మార్కెట్ ఆరంభమవుతుందని వారు అంచనా వేస్తున్నారు. టర్కీ ‘ప్రతి’ సుంకాలు... టర్కీ కరెన్సీ లిరా పతనం ఒకింత తగ్గినప్పటికీ, టర్కీ ఆర్థిక సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే అవకాశాల్లేవని నిపుణులంటున్నారు. దీంతో మార్కెట్ సెంటిమెంట్‌పై టర్కీ ప్రభావం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అమెరికా విధించిన ఆంక్షలకు ప్రతిగా తాము కూడా అమెరికా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను బహిష్కరిస్తున్నామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటించారు. అంతేగాకుండా అమెరికా నుంచి దిగుమతయ్యే ఆల్కహాల్, కార్లు, పొగాకు ఉత్పత్తులపై సుంకాలను రెట్టింపు చేస్తున్నామని ప్రకటించారు. మరోవైపు అమెరికా సుంకాలు, సబ్సిడీ విధానాలను సవాల్ చేస్తూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు చైనా ఫిర్యాదు చేసింది. ఇవన్నీ ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఈ వార్త రాసే సమయానికి(బుధవారం రాత్రి 10 గంటలకు)నాస్డాక్ సూచీ 116 పాయింట్లు, డోజోన్స్ 245 పాయింట్లు మేర పతనమయ్యాయి. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 65 పాయింట్లు క్షీణించి 11,369 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 100 పాయింట్లకు పైగా నష్టపోయింది. 13 నెలల గరిష్టానికి డాలర్.. అమెరికా డాలర్ 13 నెలల గరిష్ట స్థాయిలో, 96.82 వద్ద ట్రేడవుతోంది. డాలర్ బలపడుతుండటంతో ముడి చమురు ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. అంచనాలకు భిన్నంగా అమెరికాలో చమురు నిల్వలు భారీగా ఉన్నాయని గణాంకాలు వెల్లడికావడంతో చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 1.8% క్షీణించి 70.66 వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్ 2.1% పతనమై 64.85 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్ బలపడటంతో పుత్తడి, వెండి లోహాల ధరలు పతనమవుతున్నాయి. ఔన్స్ బంగారం ధర 18 నెలల కనిష్ట స్థాయి.. 1,184 డాలర్లకు పడిపోయింది. -
చైనా ప్యాకేజీపై ఆశలతో ప్రపంచ మార్కెట్లు కళకళ
291 పాయింట్లు లాభంతో 24,480 పాయింట్లకు సెన్సెక్స్ ముంబై: ప్రపంచ మార్కెట్ల దన్నుతో స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల్లో ముగిసింది. చైనా జీడీపీ గణాంకాలు మార్కెట్ ఆశించిన స్థాయిలోనే ఉండటంతో 20 నెలల కనిష్ట స్థాయి నుంచి బీఎస్ఈ సెన్సెక్స్ కోలుకుంది. ఆ దేశం ఆర్థికాభివృద్ధి ప్యాకేజీ అంచనాలు సానుకూలమయ్యాయి. నిఫ్టీ మళ్లీ కీలకమైన 7,400 పాయింట్లపైకి ఎగసింది. బ్యాంక్ షేర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ షేర్ల తోడ్పాటుతోనూ, షార్ట్ కవరింగ్ కారణంగానూ సెన్సెక్స్ 291 పాయింట్లు లాభపడి 24,480 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 7,435 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది ఒక్క రోజులో సెన్సెక్స్ ఇన్ని పాయింట్లు లాభపడడం ఇదే మొదటిసారి. చైనా ప్యాకేజీ? వృద్ధి పెంపు కోసం చైనా ప్రభుత్వం ప్యాకేజీ ఇస్తుందన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లు పెరిగాయి. కన్సాలిడేటెడ్ నికర లాభం 38 శాతం పెరగడంతో రిలయన్స్ పవర్ షేర్ 3.8 శాతం పెరిగింది. 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు లాభాల్లో ముగిశాయి.