సెన్సెక్స్ అధికంగా క్షీణించిన పది సందర్భాల్లో ఏడు సార్లు సోమవారమే జరగడం విశేషం. టాప్ టెన్ పతనాల్లో ఏడుసార్లు సోమవారం రోజున, రెండు సార్లు గురువారం రోజున, ఒకసారి మంగళవారం రోజున సంభవించాయి. ఇక ఇంట్రాడే టాప్‌టెన్ పతనాల్లో ఆరు సార్లు సోమవారం రోజున, రెండు శుక్రవారం రోజున, మంగళవారం రోజున ఒకటి, బుధవారం రోజున ఒకటి చొప్పున సంభవించాయి.
ప్రపంచ మార్కెట్లు నిట్టనిలువునా పతనమవుతున్నాయి. కరెన్సీలు నేల చూపులు చూస్తున్నాయి. షేర్ల ధరలు పాతాళానికి పడిపోతున్నాయి. కమోడిటీ ధరలు కుంగిపోతున్నాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. దీంతో దలాల్ స్ట్రీట్‌లో (భారత స్టాక్ మార్కెట్) అమ్మకాల విధ్వంసాన్ని సృష్టించింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 26 వేల పాయింట్ల దిగువకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8 వేల పాయింట్ల దిగువకు పడిపోయాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్ల భారీ క్షీణతకు, సోమవారం చైనా షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ భారీ పతనం కూడా తోడవడంతో మన స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో మునిగిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం తాజా రెండేళ్ల కనిష్ట స్థాయికి(82 పైసలు క్షీణించి 66.65కు చేరడం) పడిపోవడమూ
ప్రభావం చూపింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,625 పాయింట్లు (5.94 %) నష్టపోయి 25,742 పాయింట్ల వద్ద, నిఫ్టీ 491 పాయింట్లు (5.92 శాతం)నష్టపోయి 7,809 పాయింట్లవద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది ఏడాది కనిస్ట స్థాయి కాగా, నిఫ్టీకి 10 నెలల కనిష్ట స్థాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 9%, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 8% చొప్పున పడిపోయాయి.
ఆర్థిక మంత్రి అభయం ఇచ్చినా..
ఒక్క రోజు సెన్సెక్స్ పాయింట్ల రీత్యా ఇంతలా పతనం కావడం ఇదే మొదటిసారి. అన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి. బ్యాంక్, ఎనర్జీ, వాహన, ఐటీ, ఇన్‌ఫ్రా, రియల్టీ... ఆ రంగం.. ఈ రంగం అని లేదు అన్ని రంగాల షేర్లను ఇన్వెస్టర్లు తెగనమ్మారు. రియల్టీ, ఆయిల్, గ్యాస్ షేర్లు బాగా క్షీణించాయి. భారత మార్కెట్ల పునాదులు పటిష్టంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభయమిచ్చినా, ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వద్దని మొత్తుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదు. శాతాల పరంగాచూస్తే సెన్సెక్స్‌కు ఆరున్నరేళ్ల తర్వాత అతి పెద్ద పతనం ఇదే. 2009 జనవరి 7న సెన్సెక్స్ 7 శాతం పతనమైంది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 1,741 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడే క్షీణత విషయంలో ఇది మూడో అత్యంత పెద్ద క్షీణత.
ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ
లాభాల స్వీకరణ కారణంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి ఐటీ షేర్లు 3-5 శాతం రేంజ్‌లో, ఎల్ అండ్ టీ, భెల్ వంటి షేర్లు 6-8 శాతం రేంజ్‌లో పతనమయ్యాయి. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ,బజాజ్ ఆటో, హీరో మోటొకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ షేర్లు 6-9 శాతం రేంజ్‌లో క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,275 కోట్ల నికర అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.4,098 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
7 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. ఒక్క రోజులో ఈ స్థాయి సంపద హరించుకుపోవడం ఇదే తొలిసారి. దీంతో బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.100 లక్షల కోట్లకు దిగువకు పడిపోయింది. గత శుక్రవారం రూ.102.33 లక్షల కోట్లుగా ఉన్న ఈ మార్కెట్ క్యాప్ సోమవారం ట్రేడింగ్ ముగిసేనాటికి రూ.95,28,536 కోట్లకు తగ్గిపోయింది. ఈ సంపద ఆవిరిలో ప్రమోటర్ల వాటా రూ.4 లక్షల కోట్లు, విదేశీ ఇన్వెస్టర్ల వాటా రూ.1.5 లక్షల కోట్లు, రిటైలర్ల వాటా రూ.75,000 కోట్లుగా, దేశీయ ఇన్వెస్టర్ల వాటా రూ.లక్ష కోట్లుగా అంచనా.
ప్రపంచ మార్కెట్ల పతనం
సోమవారం చైనా షాంఘై సూచీ 9.2% పత నమైంది. ఎనిమిదేళ్లలో ఇదే అత్యంత భారీ క్షీణత. ఇక హాంగ్‌సెంగ్ 5.4%, నికాయ్ 4.8%, తైవాన్ 5% చొప్పున నష్టపోయాయి. జర్మనీ డ్యాక్స్ 4.9%, ఫ్రాన్స్ సీఏసీ 40 సూచీ 4.9%, లండన్ ఎఫ్‌టీసీఈ 100 ఇండెక్స్ 4.9%చొప్పున పడిపోయాయి. చైనా కరెన్సీ డీవేల్యూ చేసినప్పటి(ఈ నెల 11) నుంచి అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైందని అంచనా. అతి భారీ నష్టాలతో ప్రారంభమైన అమెరికా డోజోన్స్, నాస్‌డాక్ సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఒకానొక దశలో డోజోన్స్ 1,000 పాయింట్లు కుప్పకూలింది.
బీఎస్‌ఈ సెన్సెక్స్ పాయింట్ల రీత్యా ఒక్క రోజులో ఇంత భారీగా (1,625 పాయింట్లు) పతనం కావడం చరిత్రలో ఇదే మొదటిసారి. సెన్సెక్స్ అధికంగా క్షీణించిన పది సందర్భాలను పరిగణనలోకి తీసుకుంటే, వీటిల్లో ఎనిమిది 2008 సంవత్సరంలోనే సంభవించడం విశేషం. ఈ ఏడాది నుంచే అమెరికాలో ఆర్థిక సంక్షోభం మొదలై, అది ప్రపంచానికంతటికీ పాకింది. ఇక ఇంట్రాడే పతనం విషయంలో ఇదే అతిపెద్ద మూడో ఇంట్రాడే క్షీణత. ఇంట్రాడే పతనం విషయంలోనూ 2008లోనూ ఎనిమిదిసార్లు అతి పెద్ద ఇంట్రాడే పతనాలు సంభవించాయి.
సోమవారం ‘ఏడు’పే...!
Published Tue, Aug 25 2015 1:53 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM
Advertisement
Advertisement