కోవిడ్‌ ‘విశ్వ’రూపం... గుబేర్‌! | Global Market Loss on Covid-19 Effect | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ ‘విశ్వ’రూపం... గుబేర్‌!

Published Thu, Feb 27 2020 4:27 AM | Last Updated on Thu, Feb 27 2020 8:11 AM

Global Market Loss on Covid-19 Effect - Sakshi

చైనా కాకుండా కొత్త దేశాలకు కోవిడ్‌–19(కరోనా) వైరస్‌ విస్తరిస్తుండటం, ఆయా దేశాల్లో కొత్త కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన స్టాక్‌ మార్కెట్‌ కూడా బుధవారం నష్టపోయింది. ఈ క్యూ2లో 4.5 శాతంగా ఉన్న వృద్ధి రేటు ఈ క్యూ3లో కూడా అదే రేంజ్‌లో ఉండగలదన్న అంచనాలు ప్రతికూల ప్రభావం చూపాయి. రేపు (శుక్రవారం) ఈ క్యూ3 జీడీపీ గణాంకాలు వెలువడతాయి. సెన్సెక్స్‌ కీలకమైన 40,000 పాయింట్ల దిగువకు పతనం కాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 200 రోజుల చలన సగటు(డీఎమ్‌ఏ) దిగువకు క్షీణించింది. ఇంట్రాడేలో 521 పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్‌ చివరకు 392 పాయింట్లు పతనమై 39,889 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 119 పాయింట్లు క్షీణించి 11,679 పాయింట్ల వద్దకు చేరింది.   టెలికం రంగ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు పుంజుకున్నా (ఇంట్రాడేలో), ముడి చమురు ధరలు 1.7 శాతం మేర పతనమైనా, మన మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు.  

మహమ్మారిగా కోవిడ్‌–19 వైరస్‌!  
చైనాలో కొత్త కేసులు తగ్గినప్పటికీ, కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,700కు, వ్యాధి సోకిన వారి సంఖ్య 80,000కు పెరిగాయి. ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఇటలీ, ఆస్ట్రియా, స్పెయిన్‌  వంటి కొత్త దేశాలకు ఈ వైరస్‌ వ్యాపిస్తోంది. చైనా తర్వాత దక్షిణ కొరియాలో అధికంగా ఈ వైరస్‌ బాధితులున్నారు. ఈ దేశంలో కొత్త కేసుల సంఖ్య 169కు, మొత్తం బాధితుల సంఖ్య 1,146కు, మృతుల సంఖ్య 11కు పెరిగింది. కోవిడ్‌ 19 వైరస్‌ మహమ్మారిగా మారనున్నదని, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఈ వైరస్‌ ప్రభావం తీవ్రంగానే ఉండగలదన్న ఆందోళనతో ప్రపంచ మార్కెట్లు పతనమవుతున్నాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో... యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఈక్విటీ నుంచి  పెట్టుబడులు సురక్షిత పెట్టుబడి సాధనాలైన అమెరికా బాండ్లు,  డాలర్, పుత్తడిలోకి  తరలిపోతున్నాయి.  

► సన్‌ ఫార్మా 3.6% నష్టంతో రూ.375 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  
► బంధన్‌ బ్యాంక్‌ ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. బ్రాంచ్‌ల విస్తరణకు ఆర్‌బీఐ అనుమతినివ్వడంతో  ట్రేడింగ్‌ మొదట్లో 5% లాభంతో రూ.423ను తాకింది.  చివరకు 2.3% నష్టంతో రూ.394 వద్ద ముగిసింది.  
► 300కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. హీరో మోటో, జిల్లెట్‌ ఇండియా, ఎల్‌ అండ్‌ టీ, థెర్మాక్స్‌.... తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి.  
► స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయినా, ఇండియా సిమెంట్స్‌ షేర్‌ 20% అప్పర్‌ సర్క్యూట్‌తో రూ.105వద్ద ముగిసింది.

గత రెండు రోజుల్లో ఈ షేర్‌ 37% ఎగసింది. ఏస్‌ ఇన్వెస్టర్‌ రాధాకిషన్‌ దమానీ, ఆయన సోదరుడు గోపీకిషన్‌ దమానీ ఈ కంపెనీలో వాటాను 11.58%కి పెంచుకున్నారన్న వార్తలు దీనికి కారణం.  
n ఒక్కో షేర్‌కు రూ.349 డివిడెండ్‌ను ప్రకటించడంతో సనోఫీ ఇండియాఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై, రూ. 7,638ను తాకింది. చివరకు 1.6% లాభంతో రూ. 7,114 వద్ద ముగిసింది. గత ఏడాదికి గాను రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.106 డివిడెండ్‌ను, రూ.243 ప్రత్యేక డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.

4 రోజుల్లో 1,434 పాయింట్లు డౌన్‌
వరుసగా నాలుగో రోజూ స్టాక్‌ మార్కెట్‌ పతనమైంది. గత 4 రోజుల్లో సెన్సెక్స్‌ 1,434 పాయింట్లు, నిఫ్టీ 402 పాయింట్ల మేర నష్టపోయాయి. ఈ నాలుగు రోజుల్లో రూ.5.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. నేడు(గురువారం) ఫిబ్రవరి సిరీ స్‌ డెరివేటివ్స్‌ ముగింపు, నిఫ్టీ వీక్లీ ఆప్షన్ల ముగింపు కావడంతో సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

ప్రపంచ ఎకానమీకి ముప్పేు..
     కోవిడ్‌ వైరస్,  అమెరికా–ఈయూ వాణిజ్య యుద్ధం, గల్ఫ్‌ ఉద్రిక్తతలను ప్రస్తావించిన ఈఐయూ
     2020లో వృద్ధి 2.9 శాతమని అంచనా  


న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వైరస్, అమెరికా–యూరోపియన్‌ యూనియన్‌ వాణిజ్య యుద్ధం, అమెరికా–ఇరాన్‌ సంఘర్షణల నేపథ్యంలో తలెత్తుతున్న గల్ఫ్‌ ఉద్రిక్తతలు ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పుగా తయారయ్యాయని  అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా దిగ్గజం– ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) విశ్లేషించింది. 2020లో ప్రపంచ ఆర్థికవృద్ధి రేటు కేవలం 2.9 శాతంగా అంచనావేసింది. ఇదే జరిగితే ఇది దశాబ్దపు కనిష్టస్థాయి అవుతుంది.  ఈ మేరకు విడుదలైన ఒక శ్వేతపత్రంలోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...

► 2020లో ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. అమెరికా వృద్ధి రేటు అంతంతమాత్రంగానే ఉంటుంది. కోవిడ్‌ వైరస్‌ సంక్షోభం చైనాను కుదేలు చేయడమే కాకుండా, ఆసియా వృద్ధి అవకాశాలను దెబ్బతీస్తోంది.  
► 2020లో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సామాజిక ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 2020లోనూ ఇదే కొనసాగవచ్చు. ఇది ఇటు విధాన నిర్ణేతలకూ అటు వ్యాపారవేత్తలకూ సమస్యగా ఉంటుంది.  
► పలు ఆర్థిక వ్యవస్థలు రుణ భారాలను ఎదుర్కొంటున్నాయి.  కరోనా సమస్యలతో వాణిజ్యపరమైన సరఫరాల సమస్య తలెత్తవచ్చు.



‘కోవిడ్‌’ ప్రభావాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాం
ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌

అనుకున్న సమయానికే బ్యాంకింగ్‌ విలీనం

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ ప్రభావాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బుధవారం ఇక్కడ ప్రకటించారు.  ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. అనుకున్న సమయంలో ఇది పూర్తవుతుందనీ,  ఈ విషయంలో ఎటువంటి అనిశ్చితీ లేదనీ వివరించారు. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థికమంత్రి ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లను ఉద్ధేశించి ప్రసంగించారు.  బ్యాంకర్లు తీసుకున్న వాణిజ్య నిర్ణయాల్లో నిజాయితీ ఉంటే, ఆయా నిర్ణయాల అమల్లో  కొన్ని వ్యాపార కారణాల వల్ల తప్పు జరిగినా, బ్యాంకర్లకు వేధింపులు ఉండబోవని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

10 బ్యాంకుల విలీన కీలక నిర్ణయాన్ని గత ఆగస్టులో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ మొత్తం పూర్తయితే, 2017లో 27 ఉన్న మొత్తం ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గుతుంది.  2017 ఏప్రిల్‌లో భారతీయ మహిళా బ్యాంకుసహా అయిదు అనుబంధ బ్యాంకులను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2019లో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం చేశారు.  కేంద్రం గతేడాది ప్రకటించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల మెగా విలీన ప్రక్రియలో భాగంగా 10 బ్యాంకులను నాలుగింటిగా మార్చనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 2020 ఏప్రిల్‌ 1 డెడ్‌లైన్‌గా కేంద్రం నిర్దేశించింది.

అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య వృద్ధి 4.5 శాతమే: ఎస్‌బీఐ
గత ఏడాది అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు దాదాపు 4.5 శాతంగానే ఉంటుందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తల నివేదిక అంచనావేసింది. 28వ తేదీ మూడవ త్రైమాసిక ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఈ నివేదిక వెలువడింది. కోవిడ్‌–19 ప్రభావం భారత్‌ ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని పేర్కొంది. చైనా నుంచి భారత్‌ వివిధ వస్తువులను దిగుమతి చేసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. 2019–20లో భారత్‌ జీడీపీ దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. 2019–20లో వృద్ధి 4.7 శాతం ఉంటుందని ఎస్‌బీఐ ఎకనమిస్ట్‌ నివేదిక పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement