కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగపడే ఔషధాలకు ఆమోదం లభించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీనికి ఆర్థిక రంగ షేర్ల జోరు జత కావడంతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు పతనమైనా, మన సూచీలు ముందుకే దూసుకుపోయాయి. సరిహద్దు ఉద్రిక్తతల నివారణ నిమిత్తం భారత్, చైనాల మధ్య సంప్రదింపులు ప్రారంభం కావడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు పుంజుకొని 76.03కు చేరడం.. సానుకూల ప్రభావం చూపించాయి. 3 రోజుల లాభాలతో సెన్సెక్స్, నిఫ్టీలు 3 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. అయితే చివర్లో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో ఆరంభ లాభాలు తగ్గాయి. ఇంట్రాడేలో 482 పాయింట్ల మేర ఎగసిన సెన్సెక్స్ చివరకు 180 పాయింట్ల లాభంతో 34,911 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 67 పాయింట్లు ఎగసి 10,311 పాయింట్లకు చేరింది.
ఐటీ సూచీకే నష్టాలు...: ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, మన మార్కెట్ లాభాల్లోనే ఆరంభమైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 35,000 పాయింట్లపైకి ఎగబాకగా, నిఫ్టీ 10,400 పాయింట్ల సమీపంలోకి వచ్చింది. ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిశాయి. హెచ్ 1–బీ వంటి నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికా నిషేధం విధించే అవకాశాలున్నాయన్న ఆందోళనతో ఐటీ షేర్లు నష్టపోయాయి.
► బజాజ్ ఆటో 7 శాతం లాభంతో రూ.2,860 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి ఇతర బజాజ్ గ్రూప్ షేర్లు 5 శాతం మేర పెరిగాయి.
► కరోనా వైరస్ చికిత్స కోసం యాంటీ వైరల్ డ్రగ్, ఫావిపిరవిర్‌ను ఫాబిఫ్లూ పేరుతో అందుబాటులోకి తేవడంతో గ్లెన్‌మార్క్ ఫార్మా షేర్ 27 శాతం లాభంతో రూ.520 వద్ద ముగిసింది. ఈ షేర్ ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో ఈ షేర్ 40 శాతం లాభంతో రూ.573ను తాకింది.
► కరోనా చికిత్సలో ఉపయోగపడే రెమిడెసివిర్ తయారీకి ఆమోదం లభించడంతో సిప్లా షేర్ 3% లాభంతో రూ.656 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.696ని తాకింది.
► దాదాపు 140 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. బేయర్ క్రాప్ సైన్స్, డిక్సన్ టెక్నాలజీస్, రుచి సోయా, ఆర్తి డ్రగ్స్, అలెంబిక్ ఫార్మా, అదానీ గ్రీన్ ఎనర్జీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► మోర్గాన్ స్టాన్లీ వాటా కొనుగోళ్ల వార్తలతో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ 20 శాతం లాభంతో రూ.242 వద్ద ముగిసింది.
► స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావాలన్న ప్రతిపాదనకు అదానీ పవర్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. షేరు కనీస కొనుగోలు ధర రూ.33.82 కాగా, ఈ ప్రతిపాదన విలువ రూ.3,264 కోట్లు.
రిలయన్స్ మార్కెట్ క్యాప్ @ 15,000 కోట్ల డాలర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరు కొనసాగుతోంది. ఆరంభంలోనే 3 శాతం మేర ఎగసి జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,804ను తాకింది. చివరకు 0.7 శాతం నష్టంతో రూ.1,747 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ.11,81,429 కోట్లకు(15,000 కోట్ల డాలర్లకు మించి) పెరిగింది. ఈ స్థాయి మార్కెట్ క్యాప్‌ను సాధించిన తొలి భారత కంపెనీ ఇదే. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీల జాబితాలో రిలయన్స్ 57వ స్థానంలో నిలిచింది. వచ్చే నెల 15న వర్చువల్ ఏజీఎమ్(వార్షిక సాధారణ సమావేశం)ను నిర్వహిస్తామని రిలయన్స్ వెల్లడించింది.
మార్కెట్లకు ‘ఔషధం’!
Published Tue, Jun 23 2020 4:23 AM | Last Updated on Tue, Jun 23 2020 4:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment