కోవిడ్–19 (కరోనా) వైరస్‌ను మహమ్మారి వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. ఇక ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా యూరప్ నుంచి ప్రయాణాలను నెల రోజుల పాటు అమెరికా రద్దు చేయడంతో ఆర్థిక మందగమనం భయాలు ఉవ్వెత్తున ఎగిశాయి. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్ బుధవారం బేర్ దశలోకి చేరింది. ఫలితం...గురువారం మన మార్కెట్ కనీవినీ ఎరుగని స్థాయిలో నష్టపోయింది. మన మార్కెట్ కూడా బేర్ దశలోకి జారిపోయింది.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 33,000 పాయింట్లు, నిఫ్టీ 9,600 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 3,204 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరకు 2,919 పాయింట్ల నష్టంతో 32,778 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 868 పాయింట్లు క్షీణించి 9,590 పాయింట్లకు పడిపోయింది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే సెన్సెక్స్, నిఫ్టీలు అత్యధిక పాయింట్లు నష్టపోయాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.11 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 82 పైసలు క్షీణించి 74.50కు పడిపోవడం, ముడి చమురు ధరలు 8 శాతం పతనం కావడం కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. వివరాలు...
ఏడాది కనిష్టానికి అన్ని సూచీలు....
శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 8.2 శాతం, నిఫ్టీ 8.3 శాతం చొప్పున నష్టపోయాయి. ఈ రెండు సూచీలు రెండున్నర సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో ఇన్నేసి పాయింట్లు పతనం కావడం ఇదే మొదటిసారి. కాగా గత 3 ట్రేడింగ్ సెషన్లలో ఈ సూచీలు అత్యధిక పాయింట్లు నష్టపోవడం ఇది రెండోసారి. ఈ నెల 9(సోమవారం) సెన్సెక్స్, నిఫ్టీలు అత్యధిక పాయింట్లు నష్టపోవడం తెలిసిందే. గురువారం అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంక్‌సూచీ జీవిత కాల కనిష్టానికి, వాహన సూచీ 6 ఏళ్ల కనిష్టానికి, లోహ సూచీ మూడేళ్ల కనిష్టానికి, నిఫ్టీ బ్యాంక్ సూచీ రెండేళ్ల కనిష్టానికి పడ్డాయి. అన్ని రంగాల నిఫ్టీ సూచీలు ఏడాది కనిష్టానికి చేరాయి.
నష్టాలు ఎందుకంటే...
► కోవిడ్–19 వైరస్...మహమ్మారి...
కోవిడ్–19 వైరస్‌ను మహమ్మారి వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. అసలే ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోవిడ్ –19 వైరస్ కల్లోలంతో మాంద్యంలోకి జారిపోతుందనే ఆందోళనతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇక భారత్‌లో కోవిడ్–19 వైరస్ కేసులు 73కు పెరిగాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, ఈ వైరస్ సోకిన వ్యక్తులు 1.26 లక్షలకు చేరగా, మరణించిన వారి సంఖ్య 4,600కు చేరింది.
► ‘యూరప్’ ప్రయాణాలపై నిషేధం
కోవిడ్–19 వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి యూరప్ నుంచి అమెరికాకు అన్ని రకాల ప్రయాణాలపై నెల రోజుల పాటు అమెరికా నిషేధం విధించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పర్యాటకంపై ఆంక్షలు విధించాయి. ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలన్నీ అతలాకుతలమవుతాయని ఆందోళనలు చెలరేగుతున్నాయి.
► బేర్ దశలోకి అమెరికా మార్కెట్....
బుధవారం ఆరంభంలోనే అమెరికా స్టాక్ సూచీలు 7 శాతం నష్టపోతే, ట్రేడింగ్‌ను 15 నిమిషాల పాటు నిలిపేశారు. ఆ తర్వాత ట్రేడింగ్ మొదలైనా ఈ సూచీలు 6–8 శాతం మేర పతనమయ్యాయి. ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి చూస్తే, బుధవారం అమెరికా స్టాక్ సూచీలు 20 శాతం మేర నష్టపోయి బేర్ దశలోకి జారిపోయాయి.
► ప్రపంచ మార్కెట్ల పతనం
కోవిడ్–19 వైరస్‌ను మహమ్మారి వ్యాధిగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించడం, అమెరికా స్టాక్ మార్కెట్ బేర్ దశలోకి ప్రవేశించడంతో ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. ఆసియా మార్కెట్లు 1.5–4.4% నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 6% నష్టాలతో మొదలై 11–12% నష్టాల్లో ముగిశాయి.
► విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు.....
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) గత నెల 24 నుంచి మన మార్కెట్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. కరోనా కల్లోల భయాలే దీనికి కారణం. 13 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు రూ.36,252 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
పసిడి, క్రూడ్.. క్రాష్
కోవిడ్–19 భయాల నేపథ్యంలో అన్ని ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల నుంచీ డబ్బును వెనక్కుతీసుకుని, క్యాష్‌గానే భద్రపరచుకోడానికి ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఆర్థిక వ్యవస్థల తిరోగమన భయాల నేపథ్యంలో... పసిడి ధర భారీగా పెరగాల్సి ఉంది. అయితే ఇందుకు భిన్నంగా గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.1 గ్రా) ధర ఈ వార్త రాసే రాత్రి 10 గంటల సమయానికి 4 శాతం పతనమై (65 డాలర్లు) 1,577 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 1,560 డాలర్ల కనిష్టాన్ని కూడా చూడ్డం గమనార్హం. రెండు వారాల క్రితం పసిడి 1,704 డాలర్ల స్థాయిని నమోదు చేసుకుంది. ఇక లైట్‌స్వీట్ నైమెక్స్ క్రూడ్ బ్యారల్ ధర కూడా 35 డాలర్ల కీలక స్థాయిని అధిగమించలేక గురువారం ఒక దశలో 30 స్థాయికి పడిపోయింది. మరోవైపు ఆరు దేశాల కరెన్సీతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 98 వద్ద ట్రేడవుతుండడం గమనార్హం.
ఒడిదుడుకులు తగ్గేదాకా వేచి చూడండి...!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ నుంచి ప్రయాణాలపై నిషేధం విధించడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు భారత మార్కెట్ కూడా బేర్ దశలోకి జారిపోయిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ దీపక్ జసాని పేర్కొన్నారు. మాంద్యం భయాలు ముప్పిరగొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మార్కెట్ మరింతగా పతనమయ్యే అవకాశాలున్నాయని బే కాపిటల్ ఎనలిస్ట్ సిద్ధార్థ మెహతా అంచనా వేస్తున్నారు. రానున్న 5–10 ఏళ్లలో మంచి అవకాశాలు అందిపుచ్చుకోగలిగిన, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు అత్యున్నతంగా ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు. అయితే ఒడిదుడుకులు సద్దుమణిగేదాకా వేచి చూస్తే మేలని ట్రేడింగ్‌బుల్స్ సీఈఓ అమిత్ గుప్తా సూచించారు.
11,00,000 కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.11.27 లక్షల కోట్ల మేర ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.11,27,161 కోట్లు హరించుకుపోయి రూ.1,25,86,398 కోట్లకు పడిపోయింది. సోమవారం రూ.7 లక్షల కోట్ల మేర ఆవిరైన సంపదను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ వారంలో ఇప్పటివరకూ మొత్తం
రూ.18 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది.
Comments
Please login to add a commentAdd a comment