ప్రపంచవ్యాప్తంగా స్టాక్, కరెన్సీ మార్కెట్లలో కల్లోలం | Stocks Fall More Than 7PERSANT in Dows Worst Day Since 2008 | Sakshi
Sakshi News home page

ప్రపంచవ్యాప్తంగా స్టాక్, కరెన్సీ మార్కెట్లలో కల్లోలం

Published Tue, Mar 10 2020 4:04 AM | Last Updated on Tue, Mar 10 2020 4:58 AM

Stocks Fall More Than 7PERSANT in Dows Worst Day Since 2008 - Sakshi

ట్రంప్‌ ట్రేడ్‌వార్‌ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కుదిపేస్తోంది. ఇక కార్చిచ్చులా ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తున్న కరోనా.. ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తోంది. ఈ రెండింటికీ సౌదీ అరేబియా–రష్యా మధ్య మొదలైన చమురు ధరల యుద్ధం ఆజ్యం పోసింది. ఇక చెప్పేదేముంది! మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు మహా పతనాన్ని చవిచూశాయి. చమురు ఊచకోతకు గురైంది. ఒక్క జపాన్‌ యెన్‌ మినహా... ప్రపంచ కరెన్సీలన్నీ ఊహించని విధంగా పతనమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే... ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా, ఏ దశలోనూ ఇన్వెస్టర్లకు ఉపశమనం కనిపించలేదు.

♦ ముడిచమురు ఉత్పత్తి తగ్గించుకునే విషయంలో ఒపెక్‌ కూటమి – రష్యా మధ్య రేగిన విభేదాలతో.. సౌదీ భారీగా రేట్లు తగ్గించేసింది. ఫలితం.. ఒకేరోజు ముడి చమురు ధరలు ఏకంగా 30 శాతానికిపైగా పతనమయ్యాయి. ఒక దశలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 31 డాలర్ల స్థాయికి పడిపోయి, తర్వాత కాస్త కోలుకుంది. 1991 గల్ఫ్‌ యుద్ధ సమయం తర్వాత ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి.

♦ తాజా పరిణామాలతో రూపాయి ఏకంగా 17 నెలల కనిష్టానికి క్షీణించి డాలర్‌తో పోలిస్తే 74.17 వద్ద క్లోజయ్యింది. జపాన్‌ యెన్‌ మినహా అమెరికా డాలర్, ఇతర కరెన్సీలూ రూపాయి దార్లోనే వెళ్లాయి. సోమవారం రాత్రి 11 గంటల సమయానికి అమెరికా మార్కెట్ల ప్రామాణిక సూచీ డోజోన్స్‌ 1,600 పాయింట్లకు పైగా నష్టంతో (6 శాతం) ట్రేడవుతోంది. జపాన్, జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ మార్కెట్లు సైతం 5 నుంచి 7 శాతం మధ్యలో భారీగా నష్ట పోయాయి. మంగళవారం హోలీ సందర్భంగా మన మార్కెట్లకు సెలవు కావటంతో.. పతనానికి కూడా తాత్కాలికంగానైనా విరామం దొరికినట్లయింది.

ఆయిల్‌ వార్, కరోనా ఫియర్‌ స్టాక్‌ మార్కెట్లను కుదిపేయడంతో ఆసియా నుంచి అమెరికా దాకా సోమవారం బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌లు భారీ నష్టాలతో  ముగిశాయి. అదుపులోకి రాని కరోనా వైరస్‌ పెట్టుబడిదారులను బెంబేలెత్తించడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి.  మరోవైపు ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 30 శాతం కుప్పకూలింది. మరో ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటామేమోననే భయం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దశాబ్దకాలంలో అతిపెద్ద సింగిల్‌–డే పతనంతో మార్చి 9వతేదీ ,2020 భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో మరో బ్లాక్‌ మండేగా నిలిచిపోయింది.7లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.

క్రూడ్‌(ముడి చమురు) ధరల పతనానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సోమవారం 1,942 పాయింట్లు కుప్పకూలింది. చరిత్రలో ఇదే అత్యంత భారీ పతనం. కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ కల్లోలానికి ముడి చమురు ధరల పోరు జత కావడంతో స్టాక్‌ మార్కెట్‌ కనీవినీ ఎరుగని రీతిలో క్షీణించింది. సెన్సెక్స్‌ 36,000 పాయింట్లు, నిఫ్టీ 10,500 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి.  ప్రస్తుతం మందగమనంలో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ... కోవిడ్‌–19 వైరస్, ముడి చమురు ధరల పోరు కారణంగా మాంద్యంలోకి జారిపోతుందనే భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఇక దేశీయంగా యస్‌బ్యాంక్‌ సంక్షోభం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 30 పైసలు తగ్గడం వంటి అంశాలు కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. ఇంట్రాడేలో 2,467 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్‌ చివరకు 1942 పాయింట్లు క్షీణించి 35,635 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 695 పాయింట్లు పతనమైన  నిఫ్టీ చివరకు 538 పాయింట్ల నష్టంతో 10,451 పాయింట్ల వద్దకు చేరింది. శాతాలపరంగా చూస్తే, సెన్సెక్స్‌ 5.1 శాతం, నిఫ్టీ 4.9 శాతం చొప్పున నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, ఈ రెండు సూచీలు గత ఐదేళ్లలో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీలు ఒక్క రోజులోనే ఇన్నేసి పాయింట్లు నష్టపోవడం (ఇంట్రాడే, ముగింపులో కూడా)ఇదే మొదటిసారి.  

ఆరంభంలోనే భారీ నష్టాలు....
ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్‌ భారీ నష్టాలతోనే ఆరంభమైంది. సెన్సెక్స్‌ 627 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సమయం Výæడిచే కొద్దీ నష్టాలు పెరిగాయే కానీ తరగలేదు. అన్ని రంగాల షేర్లు పతనమయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి స్టాక్‌ మార్కెట్‌ నష్టాలు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి చూస్తే, సెన్సెక్స్‌ 5,088 పాయింట్లు (12.4 శాతం), నిఫ్టీ 1,511 పాయింట్లు(12.6 శాతం) చొప్పున క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు ముప్పిరిగొన్నందున సెంటిమెంట్‌ బలహీనంగా ఉందని, మన మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిఫ్టీ మద్దతు స్థాయిలు 10,295–10,138 పాయింట్లని, ఒక వేళ పుల్‌ బ్యాక్‌ ర్యాలీ చోటు చేసుకుంటే నిరోధ స్థాయిలు 10,637–10,744 పాయింట్లని విశ్లేషకులు పేర్కొన్నారు.  

పతనానికి పంచ కారణాలు...
♦ చమురు ధరల పతనం...
చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఉత్పత్తి కోతకు సంబంధించి చర్చలు విఫలమయ్యాయి. ఒపెక్‌ దేశాలు ప్రతిపాదించిన ఉత్పత్తి కోతను రష్యా వ్యతిరేకించడం.. నచ్చని  సౌదీ అరేబియా ప్రతి చర్యలు ప్రకటించింది. తాము ఉత్పత్తి చేసే క్రూడ్‌ ధరలను తగ్గించడంతో అంతర్జాతీయంగా   ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి.  ఇది అంతర్జాతీయంగా వృద్ధి మరింతగా దెబ్బతీస్తుందన్న భయాలు మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని నిపుణులంటున్నారు.  
 

 కోవిడ్‌–19 విలయం  
భారత్‌లో కోవిడ్‌–19 (వైరస్‌) బాధితుల సంఖ్య 43కు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ బాధితుల సంఖ్య లక్షకు, మరణాల సంఖ్య 3,600కు పెరిగాయి. ఇటలీలో ఒక్క రోజులోనే 130కు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. కోటిన్నరకు పైగా ప్రజలను ఈ దేశం క్వారంటైన్‌లో ఉంచింది. మరిన్ని దేశాలకు ఈ వైరస్‌ విస్తరిస్తుండటంతో మరిన్ని కష్టాలు ముందు ముందు ఉంటాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ వైరస్‌ మరింత విస్తరిస్తే, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణ కొరియా తదితర అభివృద్ధి చెందిన దేశాలు మాంద్యంలోకి జారిపోతాయని మూడీస్‌ సంస్థ హెచ్చరించడం ఆందోళన రేకెత్తించింది.  

ప్రపంచ మార్కెట్ల పతనం  
కోవిడ్‌–19 వైరస్‌ విస్తరిస్తుండటం, ముడి చమురు ధరల హఠాత్‌ పతనం కారణంగా ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా క్షీణించాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి సురక్షిత సాధనాలైన పుత్తడి, అమెరికా డాలర్, బాండ్లలోకి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఫలితంగా సోమవారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. షాంఘై, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియా, జపాన్‌ సూచీలు 5 శాతం మేర క్షీణించాయి. ఆరంభంలోనే 6% మేర నష్టపోయిన యూరప్‌ మార్కెట్లు అదే స్థాయిలో ముగిశాయి.  

 విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు...
కరోనా కల్లోలానికి సెంటిమెంట్‌ దెబ్బతినడంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు.   గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ నికర కొనుగోలుదారులుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు కొనసాగుతున్నాయి. సోమవారాన్ని కూడా కలుపుకుంటే వరుసగా 11వ రోజూ విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగానే నిలిచారు. ఈ 11 ట్రేడింగ్‌ సెషన్లలో రూ.25,000 కోట్ల మేర అమ్మకాలు జరిపారు.  

 యస్‌ బ్యాంక్‌ సంక్షోభం .. భారత బ్యాంకింగ్‌ రంగం స్థిరత్వంపై ఆందోళనను, సంశయాలను పెంచింది. పలు ఆర్థిక సంస్థలు యస్‌ బ్యాంక్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేశాయి. ఈ బాండ్ల రేటింగ్‌ను పలు రేటింగ్‌ సంస్థలు డౌన్‌గ్రేడ్‌ చేశాయి. మరోవైపు బాసెల్‌ టూ, టైర్‌–1 బాండ్ల వడ్డీ చెల్లింపుల్లో యస్‌ బ్యాంక్‌ విఫలమైంది. మొత్తం మీద యస్‌ బ్యాంక్‌ ప్రభావం తీవ్రంగానే ఉండగలదన్న భయాలు నెలకొన్నాయి.

నేడు మార్కెట్లకు సెలవు
నేడు హోలీ పండుగ సందర్భంగా సెలవు. సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల్లో ట్రేడయ్యింది. ఆరంభంలోనే ఏడు శాతం మేర çపతనమై లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది.  దీంతో ట్రేడింగ్‌ను నిలిపేశారు. 15 నిమిషాల అనంతరం ఆరంభమైనప్పటికీ నష్టాలు తగ్గలేదు. కరోనా ప్రభావం పెరుగుతుండటం, ముడి చమురు ధరలు తగ్గడం ప్రభావం చూపాయి. రాత్రి గం.11.30 ని. లకు డోజోన్స్‌ 1,794 పాయింట్లు, నాస్‌డాక్‌ 500 పాయింట్ల  నష్టాల్లో ట్రేడయ్యాయి.  మంగళవారం సెలవు కావడంతో మేలైందని, లేకుంటే అమెరికా, యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రభావంతో మన మార్కెట్‌కు భారీ నష్టాలు ఉండేవని విశ్లేషకులంటున్నారు.  

రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్‌ మార్కెట్‌ మహా పతనం కారణంగా రూ. 7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.6, 84, 278 కోట్లు హరించుకుపోయి రూ.1,37,46,947 కోట్లకు పడిపోయింది.  
షేర్లు కకావికలం...

♦ ఓఎన్‌జీసీ.. 15 ఏళ్ల కనిష్టానికి  
ముడి చమురు ధరలు 30 శాతం మేర పతనం కావడంతో చమురు అన్వేషణ, తయారీ ప్రభుత్వ రంగ కంపెనీ ఓఎన్‌జీసీ భారీగా నష్టపోయింది. 16 శాతం నష్టంతో రూ.74.65 వద్ద ముగిసింది. ఇది దాదాపు 15 ఏళ్ల కనిష్ట స్థాయి. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  

♦ రెండో స్థానానికి రిలయన్స్‌  
చమురు ఉత్పత్తి రంగంలో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ కూడా బాగా పతనమైంది. 12 శాతం నష్టంతో రూ.1,113 వద్దకు చేరింది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ. లక్ష కోట్లు ఆవిరైంది. ఈ నష్టం కారణంగా అత్యధిక మార్కెట్‌ క్యాప్‌గల భారత కంపెనీ అనే ఘనతను  కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. మొదటి స్థానం టీసీఎస్‌ షేర్‌కు దక్కింది.
 
♦ యస్‌ బ్యాంక్‌ జోరు...  ఎస్‌బీఐ బేజారు....
సంక్షోభంలో చిక్కుకున్న యస్‌బ్యాంక్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేయనున్న ఎస్‌బీఐ షేర్‌ 6 శాతం పతనమై రూ.254కు చేరింది. మరోవైపు యస్‌ బ్యాంక్‌ షేర్‌ 31 శాతం లాభపడి రూ.21 వద్ద ముగిసింది.
 
♦ చమురు షేర్లు రయ్‌...
ముడి చమురు ధరలు 30 శాతం మేర తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌పీసీఎల్‌ షేర్‌ 6 శాతం లాభంతో రూ.213కు, బీపీసీఎల్‌ షేర్‌ 5.2 శాతం పెరిగి రూ.424కు పెరిగాయి.   

♦ ఏడాది కనిష్టానికి 800 షేర్లు...  
దాదాపు 800కు పైగా షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి.  బీఎస్‌ఈ 500 సూచీలో ప్రతి నాలుగు షేర్లలో ఒక షేర్‌ ఏడాది కనిష్టానికి పడిపోయింది.∙ప్రపంచ పరిణామాలకు యస్‌ బ్యాంకు సంక్షోభం తోడవటంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సోమవారం ఒక్కరోజే 1,942 (5.1%) పాయింట్లు కుదేలైంది. చరిత్రలో ఇదే అత్యంత దారుణ పతనం. నిఫ్టీ సైతం 538 పాయింట్లు (4.9%) నష్టపోయింది. శాతాల పరంగా గత ఐదేళ్లలో ఇదే భారీ నష్టం కాగా.. పాయింట్ల పరంగా ఇది రికార్డు. ఓఎన్‌జీసీ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు సైతం 15 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఫలితంగా ఒక్కరోజే ఏకంగా రూ.7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement